శ్రీపర్వతం – పరిచయం

0
13

[box type=’note’ fontsize=’16’] 19 జనవరి 2020 నుండి సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలకి ఇది పరిచయం. [/box]

***

[dropcap]తె[/dropcap]లుగు కథ, నవల, సాహిత్య రంగంలో ఒక తరం రచయితలకు గురుతుల్యులు, నవతరం రచయితలకు మార్గదర్శకులు అనదగ్గ అత్యద్భుతమైన కథా, నవలా రచయిత కీ.శే.ఘండికోట బ్రహ్మాజీరావు గారు. “శ్రీ బ్రహ్మాజీరావు గారు మా తరం విశాఖ రచయితలకు ఓ గురువు! 1960-75 మధ్య కలం పట్టి రచనలు చేయడం ఆరంభించిన అప్పటి మా విశాఖ సాహితి సభ్యులు అందరికీ ఆయనో మార్గదర్శి. మేం ఏం రాసినా దాన్ని ఓపిగ్గా చదివి, అందులోని మంచిని చూపించి మమ్మల్ని అభినందిస్తూ, చెడును కూడా సున్నితంగా సూచించి, అలా ఎందుకు రాయకూడదో విప్పి చెబుతూ మాకందరికీ ఓ ‘దీపధారి’గా నిలిచేవారాయన” అంటారు ప్రఖ్యాత రచయిత ద్విభాష్యం రాజేశ్వరరావు గారు ఘండికోట బ్రహ్మాజీరావు గారి గురించి. అంటే, స్వయంగా కథలు, నవలలు రాయడమే కాకుండా ఆయన భవిష్యత్తు తరం రచయితల తయారీకి కూడా శ్రమించారన్నమాట. కాని ఉత్తరాంధ్రలో ప్రకాశమానమైన రచయితల్ని గురించి మాట్లాడేటప్పుడు – ఘండికోట వారి కృషినీ, ఉత్తమ కథా రచయితగా వారి స్థానాన్నీ ప్రస్తావించే విమర్శకులు, సమీక్షకులూ, వ్యాసకర్తలూ లేరు. ఇది విచారకరమైన వాస్తవం. అయితే ‘ఉత్తమాభిరుచిగల పాఠకులకు వారెప్పుడూ గుర్తుంటార’ని ప్రఖ్యాత రచయిత విమర్శకుడు విహారి ఘండికోట బ్రహ్మాజీరావు గారి గురించి వ్యాఖ్యానించటం తెలుగు సాహిత్య ప్రపంచానికి ఆయన చేసిన యోగదానం, దాన్ని భావితరాల వారు విస్మరించటం స్పష్టమవుతుంది.

   

కథలపై ప్రత్యేక కృషి చేసిన ఘండికోట బ్రహ్మాజీరావు గారు నవలా రచనలోనూ అందెవేసిన చెయ్యి. ‘శ్రామిక శకటం’, ‘ప్రతిమ’, ‘విజయవాడ జంక్షన్’, ‘ఒక దీపం వెలిగింది’ (బాపు, రమణల ‘గోరంత దీపం’ సినిమాకి ప్రేరణ)తో సహా దాదాపు ఇరవై నవలలు రాశారు (వారి నవలలు ‘ఘండికోట బ్రహ్మాజీరావు గారి సమగ్ర నవలా సాహిత్యం’ అనే పుస్తక రూపంలో వచ్చాయి). సాహిత్య అకాడమీ ‘అరేబియన్ నైట్స్’‌ను ‘వెయ్యిన్నొక రాత్రులు’గా ఆయనతో అనువదింపజేసి ప్రచురించింది. ‘శ్రీమత్ సుందరకాండ-సౌందర్య దర్శనం’ ఆరు భాగాలలో రచించారు. కథా రచయితల కోసం ప్రపంచంలోని పలు ప్రఖ్యాత రచనలను అనువదించి, విశ్లేషించి అందించారు. అయితే వారు సృజించిన రచనలన్నిటికీ భిన్నమైనదీ, అత్యంత పరిశోధన  జరిపి సృజించిన రచన ‘శ్రీపర్వతం’. ఈ రచన ఆయన అధ్యయన విస్తృతిని, బౌద్ధ నాగరికత పట్ల వారికున్న లోతైన అవగాహనను ప్రదర్శిస్తుంది. అయితే ఆయన ఈ నవలను అసంపూర్తిగా వదిలారు. తెలుగులో ఇలాంటి రచన మరొకటి లేదు.

రచనపై పట్టు లేకుండా కేవలం కాస్త సమాచారం సేకరించి వాటినొక రూపంలో ప్రకటించడమే తెలుగులో చారిత్రక నవలలను ఉద్ధరించడంగా భావించి, తమ ముందు, తమ తరువాత చారిత్రక నవలలు తెలుగులో లేనే లేవని ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్న తరుణంలో ఘండికోట బ్రహ్మాజీరావుగారి ‘కల’, సృజనాత్మక ప్రతిభకు, పరిశోధనా పాటవానికి సగర్వంగా నిలిచే ‘శ్రీపర్వతం’ నవలను పాఠకులకు అందిస్తున్నందుకు సంచిక గర్విస్తోంది. పురావస్తు శాఖ తవ్వకాలు, వారి పరిశోధనా పద్ధతులు, తవ్వకాల సమయంలో వారి జీవన విధానం, వారి ఉద్విగ్నతలు, ఆనందాల గురించి ఇంతగా పరిశోధించి సృజించిన నవల మరొకటి తెలుగులో లేదు. తెలుగులో పురావస్తు తవ్వకాలు కేంద్రంగా, చారిత్రక పరిశోధన ప్రాధాన్యంగా సృజించిన తొలి నవల, ఏకైక నవల ‘శ్రీపర్వతం’. ఎవరికి వారే తమ భజనపరులను ఏర్పాటు చేసుకొని, తామే తెలుగు సాహిత్యాన్ని మలుపులు తిప్పేస్తున్నామని, ఉద్ధరించేస్తున్నామని నిర్ణయించేసుకుని ప్రామాణికత సాధించాలని అర్రులు చాస్తున్న తరుణంలో, గుర్తింపు కోసం ఏనాడూ ప్రాకులాడని; నిబద్ధతతో, జీవితాంతం నిత్యవిద్యార్థిగా బ్రతికి తెలుగు కథ, నవల ప్రపంచంలో ఋషిలా వెలుగొందిన ఘండికోట బ్రహ్మాజీరావు గారిని మరోసారి తెలుగు పాఠకులకు పరిచయం చేస్తున్నందుకు సంచిక గర్విస్తోంది. అత్యంత వినమ్రతతో ‘శ్రీపర్వతం’ నవలను తెలుగు పాఠక లోకానికి అందిస్తోంది.

అసలైన రచయిత వజ్రం లాంటి వాడు. ఎలాగయితే ప్రపంచం వజ్రాన్ని వెతుకుతూ పోతుందో, అలా అవార్డులు రివార్డులు ఘండికోట బ్రహ్మాజీరావు గారిని వెతుక్కుంటూ వచ్చాయి. వజ్రం ఎలా తన గొప్ప తాను చెప్పుకోదో… అలా ఆయన తన ప్రతిభను రచనల్లో ప్రదర్శించటం తప్ప ఏనాడూ దాన్ని ఏ రూపంలోనూ ప్రస్తావించలేదు. సాహిత్య ప్రపంచంలోని రచయితలకు, భావి తరాల రచయితలకు మార్గదర్శకంగా నిలిచే ఘండికోట బ్రహ్మాజీరావు గారు సృజించిన చివరి నవల ‘శ్రీపర్వతం’ ధారావాహికను వారం వారం చదవండి.  మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా సంచికకు తెలపండి. ఉత్తమాభిరుచిని, ఉత్తమ సాహిత్యాన్ని ప్రోత్సహించండి.

సంచిక టీమ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here