శ్రీరామ గానామృతం

1
9

[శ్రీరామనవమి సందర్భంగా ‘శ్రీరామ గానామృతం’ అనే వ్యాసాన్ని అందిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

[dropcap]రా[/dropcap]మ చరితము రసభరితము. రామనామ స్మరణం ఎంత చేసినా తనివితీరని ఒక మాధుర్య సాగరం. విశ్వసాహిత్యంలోనే రామాయణం ఒక అజరామర కావ్యం. రామాయణంలో లాగా లోక వ్యవహారాలన్నింటిని ఇంత లోతుగా బోధించే కావ్యం మరొకటి లేదు. రామకథ, రామ నామం రెండు రమణీయమే.. రామం సర్వజన ప్రియం. ఆదికవి వాల్మీకి కాలం నుండి నేటి వరకు పలు భాషలలో, పలురీతులలో, పలు రకాల కళా రూపాలు ధరించి ముందుకు సాగుతూనే ఉంది ఈ కావ్యం.

ఇదివరకే అనేకులచే వర్ణింపబడిన రామ కావ్యము వదలకూడదా ఇకనైనా, అంటే.. వదలకూడదు. ఎందుకంటే, ఇంతటి అపూర్వమైన, కళ్యాణ గుణములు కలిగిన వారు మరి ఎవరు ఉన్నారు? అట్టి శ్రీరామచంద్రుని వర్ణంపనివారు ఎట్లు కృతార్థులు కాగలరు?

అందుకే కాలానికి అతీతమైన జ్ఞాన వృక్షంలాగా రామాయణం కొత్త చిగుళ్లు వేస్తూనే ఉంది. భారతావనికి ఆవల చాలా ఆసియా దేశాలలో రామాయణ కావ్యం వివిధ నామాలతో మనకు కనిపిస్తుంది. బర్మా, కంబోడియా, లావోస్, ఫిలిప్పైన్స్, చైనాలలో కూడా ఈ కావ్యం సుపరిచితమే. ఇవన్నీ వాల్మీకి కావ్యానికి అనుసరణలే. ఈ క్రమంలో ఆయా దేశాల సంస్కృతి, రచనా శైలులు,స్థానీయత- ఆ కావ్యంలోకి చొరబడి కొంత కొత్త రూపు ఇచ్చాయని అనిపిస్తుంది. ఈ అజరామర కావ్యం జన్మించిన మనదేశంలోనే, ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క కథనంతో రామాయణం దర్శనమిస్తుంది.

ఈ విధంగా ధర్మ భూమి, కర్మభూమి అయిన భారతావనిలోనే కాకుండా, భారతీయ సంస్కృతి ప్రసరించిన అన్ని దేశాలలోనూ, అన్ని కాలాలలోనూ, ‘రామ చరితం’ అనే సురగంగ పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తూనే ఉంది. ఇటీవల అయోధ్యలో పునః ప్రతిష్టమైన రామయ్య వైభవం, వర్ణించడానికి భాష చాలదు. ప్రపంచవ్యాప్తంగా బాల రాముని ప్రతిష్ఠను దర్శించి, పులకించిన కోట్ల మంది రామభక్తులే దానికి సాక్ష్యం. ఎంత కాదనుకున్నా, రాముణ్ణి భారతీయత నుండి ఎవరూ విడదీయలేరు. ఇక్కడ సర్వమూ రామమయమే. త్రేతాయుగం నుండి కలియుగం దాకానే కాదు.. ఇంకా రాబోయే యుగాల్లో కూడా, ఇది సత్యం.. ఇదే సత్యం.. ఇది తథ్యం.!

ప్రపంచంలోని సర్వ నాగరిక భాషల్లోనూ రామ నామం ఉంది. ఇతర దేశాల్లో రామకథా గానం ఉంది. ప్రతి భాష రామ కథతో పునీతమైంది. రాముడే ఆనందం, ఆనందమే బ్రహ్మం. “రామాయన బ్రహ్మమునకు పేరు,”అని త్యాగరాజుని మాట.

ప్రతి పాటలో రామకథే:

మన జీవితమంతా రాముడి పాటలే! ‘రాం రాం సీతారాం, జై జై రామ్ జానకిరామ్’, నెలల ప్రాయంలోని మనందరి తొలి భజన పాట. పిల్లలకు లాలలు పోస్తూ.. అమ్మ ఇచ్చే రక్ష ‘శ్రీరామరక్ష, నూరేళ్ళ ఆయుష్షు’. మనల్ని ఉయ్యాల్లో వేస్తే పాడే పాట..’ రామ లాలి మేఘశ్యామలాలి, తామరస నయన దశరథ తనయాలాలి..’ ఇంకా చిన్న పిల్లలు పాడుకునే..’ ఏనుగమ్మ ఏనుగు, ఏ ఊరొచ్చిందేనుగు, మా ఊరొచ్చిందేనుగు, మంచినీళ్ళు తాగిందేనుగు, ఏనుగు మీద రాముడు, ఎంతో చక్కని దేవుడు.. ఇలా, మన ఆట, పాట, మాట- అన్నింటిలో రాముడు నిండిపోయి ఉన్నాడు. తల్లి కడుపులో ఉన్నప్పటి నుండి, శరీరాన్ని వదిలి వెళ్లే చివరి మజిలీ దాకా, రామ చరితం అడుగడుగునా మన వెంట ఉంటుంది. ఒక పార్థివ శరీరం చివరి యాత్రకు బయలుదేరుతూ ఉంటే, మనకు వినిపించే పాట.. “రఘుపతి రాఘవ రాజారాం, పతీత పావన సీతారాం, సుందర విగ్రహం మేఘశ్యామ్, గంగా తులసి సాలగ్రాం..”

తెలుగింట జరిగే ప్రతి పెళ్లీ సీతారామ కళ్యాణమే. సీతా కల్యాణం అంటే లోక కల్యాణం. హిందూ వివాహ వ్యవస్థలో కళ్యాణం జరుగుతూ ఉన్నప్పుడు, పెళ్లి కుమారుడు,పెళ్లి కుమార్తె నలుగు పెట్టే పాటల నుండి రామకథా ఘట్టాలు మనకు నిత్యం వినిపిస్తుంటాయి. ముత్తయిదువలంతా కలిసి,”రామా కల్యాణ వైభోగమే.. సీతాకల్యాణం వైభోగమే.., “అంటూ పాడుతూ వధూవరులను సీతారాముల్లా వుండాలని దీవిస్తూ ఉంటారు. పెళ్లి విందులు, అప్పగింతలు హారతులు వంటి అన్ని పెళ్లి తంతులలో మనకు సీతారాముల దర్శనమిస్తూనే ఉంటారు.. సీమంతం దీవెన పాటల్లో, ‘జానకి దేవి వేవిళ్ళు’ ‘సీతమ్మ సీమంతం’, మన కళ్ళకు కట్టినట్టు వినబడుతూ ఉంటాయి.

కీర్తనలలో శ్రీరామతత్వం:

నాదరూపుడిగా, వేద మూర్తిగా శ్రీరాముని దర్శించిన ఎందరో సంగీత కళానిధులు, వాగ్గేయకారులు, తమ కీర్తనల ద్వారా నాదోపాసన చేసి పర(రా)మపథాన్ని చేరుకున్నారు. రామకథా రసధారలను ఈ భూమిపై శాశ్వతంగా ప్రవహింప చేశారు.

ఈ సృష్టి ఆవిర్భావము నాదం ఏవిధంగా కారణమైనదో ఆ శబ్దములో నుండి, సాహిత్యములోని.. అకారాది అక్షరములు సంగీతములోని.. సప్త స్వరములు ఏ విధముగా ఆవిర్భవించినాయో, ఈ విషయమును నాదానికి ఆధారమైన సంగీతాన్ని ఉపాసించి పరబ్రహ్మములో ఐక్యం కావడానికి, సంగీత ఉపాసన ఎంత ప్రభావవంతమైనదో అయినదిగా త్యాగరాజాది మహానుభావులు మనకు వారి కీర్తనల ద్వారా తెలియచెప్పారు.

కాకర్ల త్యాగరాజు:

96 కోట్ల రామనామం జపించి, కలలోనైనా, మెలకువనైనా రామ కీర్తనలలోనే, రామ కీర్తనలతోనే, జీవించిన త్యాగయ్య ఒక గొప్ప నాదోపాసకుడు. నాదరూపుడిగా రాముడిని దర్శించిన త్యాగరాజుకు ‘రామ’మే(నాదమే) జీవన మార్గమైంది, ముక్తికి సోపానమైంది. రామాయణంలోని ప్రతి వ్యక్తీ త్యాగయ్యకు ఆత్మబంధువే. రామాయణంలోని ప్రతిఘట్టంలోనూ త్యాగయ్య తనను తాను చూసుకున్నాడు. ‘త్యాగరాజనుత’, అన్న నామముద్రతో 24 వేల కీర్తనలు వ్రాసుకున్నాడు.

వీటిలో పంచరత్న కీర్తనలుగా, ఐదు కీర్తనలు అత్యంత ప్రసిద్ధి చెందినా.. రామ తత్వాన్ని, రామనామ మాధుర్యాన్ని, రామ చరితాన్ని, నింపుకున్న ఆయన ప్రతి కీర్తన ఒక వెలకట్టలేని సంపదే!

‘తవ దాసోహం, తవ దాసోహం, తవదాసోహం దాశరథే’.. అంటూ తన దాసత్వాన్ని మనసారా ప్రకటించుకున్నాడు.

‘సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి’.. అని ఉత్తర వాత్సల్యాన్ని ప్రకటిస్తూ, పుత్రుడిలా సేవించుకున్నాడు.

‘దొరకునా ఇటువంటి సేవ’ అని మురిసిపోయాడు.

‘తత్వమెరగతరమా?’ అని ఆవేదన చెందాడు.

‘అన్యాయము చేయకురా రామయ్య, నన్నన్యునిగా చూడకురా..’.. అని అలకబూనాడు.

‘ఏ రాముని నమ్మితినో.. నేనేపూల పూజ చేసితినో..’

అని మురిసిపోయాడు, మైమరిచిపోయాడు.

‘ఉండేది రాముడొకడు ఊరక చెడిపోకు మనసా’, అని హితవు పలికాడు.

“రామ కళ్యాణ వైభోగమే.. సీతా కళ్యాణ”.. వైభోగమే..అని పాడుకుంటూ..సీతారాముల కళ్యాణం చేసి ముచ్చట తీర్చుకున్నాడు మహాభక్త త్యాగరాజు.

రాముని చుట్టూ ఉన్న వారంతా, ఆయన సాంగత్య సౌభాగ్యాన్ని అనుభవించిన వారంతా..’ తపమేమి చేసిరో..తెలియ..అని అసూయపడ్డాడు.

‘కరుణాసముద్రా.. నను కావవే శ్రీరామచంద్ర’.. అని దీనంగా బ్రతిమాలాడు.

‘ఎందుకు దయరాదురా.. శ్రీరామచంద్ర..’ అని తీవ్రంగా దుఃఖించాడు.

‘సంగీత జ్ఞానము.. భక్తి వినా.. సన్మార్గము గలదే మనసా’.. అని రామయ్య సేవలో తరించిన, రామయ్యతో కలిసి నడచిన మహానుభావులందరికీ వందనాలు అర్పించాడు. నిరంతరం రామ కీర్తనలోనే గడుపుతూ, రామయ్య లోనే ఐక్యమైన, రామాంకిత నాదం త్యాగరాజు.

భద్రాచల రామదాసు (కంచెర్ల గోపన్న):

భద్రాచల రామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న, భద్రాచల శ్రీరాముని కొలిచి, కీర్తించి, తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నాడు. శ్రీరాముని ప్రస్తుతిస్తూ, ఈ రామదాసు 17వ శతాబ్దంలో.. ‘ దాశరథీ.. కరుణాపయోనిధీ’ అనే మకుటంతో, దాశరథి శతకాన్ని రచించడమే కాక 400కు పైగా కీర్తనలు వ్రాసాడు. భద్రాచల రామదాసుగా, గోపరాజు కట్టించిన గుళ్ళు, గోపురాల కంటే రామదాసు కీర్తనలే విలువైనవి. వాటివల్ల భద్రాచలానికి ఎనలేని కీర్తి లభించింది. తెలుగు వాగ్గేయకారులలో ఇతడు ఆద్యుడు. రామదాసు నవరత్న కీర్తనలుగా ప్రఖ్యాతమైన గీతాలు ఇవి.,

//ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ముదముతో సీతా ముదిత లక్ష్మణుడు, కలసికొలువుగా రఘుపతి యుండెడి// పలుకే బంగారమాయెనా కోదండపాణి.. పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి// రామ జోగి మందు కొనరే ఓ జనులారా.. కోటి ధనములిత్తునని కొన్నను దొరకని మందు.. సాటిలేని భాగవతులు స్మరణ చేసి తలచు మందు// శ్రీరాముల దివ్య నామ స్మరణ చేయుచున్న చాలు// శ్రీరామ నామమే జిహ్వకు స్థిరమై ఉన్నది// హరి హరి రామ నాన్నరమర చూడకు, నీ నామస్మరణ ఏమరను// కంటి నేడు మా రాములు, కనుగొంటి నేడు మా రాములు//

రామ భక్తిపారవశ్యంలో మునిగిపోయిన గోపన్న..

“అంతా రామమయం, జగమంతా రామమయం”, అని పాడుకుంటూ పరవశించాడు.

“ఓ రామ నీ నామ మెంతో రుచిరా.. పాలు,మీగడల కన్నా, “పంచదార చిలకలకన్నా..”అంటూ రామ నామ మాధుర్యాన్ని వేనోళ్ళ కొనియాడాడు.

ప్రభుత్వ ఖజానాకు చెల్లించాల్సిన సొమ్ముతో రామాలయాన్ని నిర్మించి, సీతారామలక్ష్మణులకు నగలు చేయించిన నేరానికి చెరసాలలో బంధింపబడి ఎంతో వేదన చెందాడు.

“సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము.. రామచంద్రా..అని ఫిర్యాదు చేస్తూ..ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా..”అని శ్రీరాముడితో నిష్టురాలాడాడు గోపన్న.

“తక్కువేమీ మనకు, రాముండొక్కడుండువరకు..”అని గానం చేసుకుంటూ ఊరట చెందాడు.

“నన్ను బ్రోవమని చెప్పవే.. సీతమ్మ తల్లి..”అని సీతమ్మ ద్వారా రామయ్యకు సిఫారసు చేయించుకున్నాడు.

“ఇక్ష్వాకు కుల తిలక.. ఇకనైన పలుకవా..? నువు రక్షించకున్నను.. రక్షకులు ఎవరయ్య రామచంద్ర,”అంటూ విలవిలలాడాడు..

రామ, లక్ష్మణులు తానీషా ప్రభువుకు కప్పం చెల్లించి, చెరసాల నుండి విడిపించిన తరువాత, శ్రీరాముని సేవలో, సంకీర్తనా గానాలతో రామదాసు తన శేష జీవితాన్ని గడిపి.. చివరకు రాముడిలోనే ఐక్యమయ్యాడు.

ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు:

వేదవ్యాసుడు బ్రహ్మాండపురాణంలో, 61 వ అధ్యాయంలో, పార్వతీ- పరమేశ్వరుల సంవాదంగా రచించిన ఆధ్యాత్మ రామాయణమే శ్రీ మునిపల్లె సుబ్రహ్మణ్య కవి ఆధ్యాత్మ రామాయణ కీర్తనలకు, తులసీదాస్ రచించిన రామ చరిత మానస్ కు మూలాధారం. దీనిలో తత్వ వివేచనే ప్రధానము.

// వినుము ధరాధరవరతనయా, సరస గుణాభినయా// కళ్యాణము వినవే నేడు కళ్యాణము వినవే//రాముని, సకల గుణాభిరాముని నిఖిల రాక్షస విరాముని వర్ణింప వశమా//నరవర వినుమిది పరమ రహస్యము నరుడా శ్రీ రఘురాముడు, ఘోరధురితాంధకార విరాముడు// రాముని చరితమును.. కోమలి వినవే// వందనము శ్రీరఘునందనా అనిరిందు వదనా// లాంటి కీర్తనలలో ఆయన శ్రీరాముని సకల శుభ లక్షణాలను, మన చరిత్రను ఎంతో శ్లాఘించాడు.

అన్నమయ్య పదాలలో అలరించిన శ్రీరాముడు:

తిరుమల శ్రీ వేంకటేశుని పద సంకీర్తనలతో అలరించి పరమపథాన్నందిన భక్తాగ్రేసరుడు, వాగ్గేయకారుడు అన్నమాచార్యుడు. అన్నమయ్య పదాలలోని పలు సంకీర్తనలలో మనకు రామతత్వం కనిపిస్తుంది. నిజానికి ఈ భక్తులందరికీ వారు కొలిచే దైవం అన్ని రూపులలోనూ, అన్ని రూపాల్లో వారి దైవమే ప్రస్ఫుటమవుతుంది. అందుకే, వారు ఎన్నో రూపాల్లో ఉన్న తమ ఇష్ట దైవాన్ని మనసారా కీర్తిస్తారు, భజిస్తారు. అన్నమయ్య కృతులైన కొన్ని రామ సంకీర్తనలు;

“రసికుడ తిరుపతి రఘువీరా..”

“రామ రామచంద్ర రాఘవ, రాజీవ లోచన రాఘవ..

సౌమిత్రి భరత శత్రాజ్ఞుల తోడ జయమందు దశరథ తనయా”

“రామా రామభద్ర రవీవంశ రాఘవ..”

“రామచంద్రుడితడు రఘువీరుడు..”

“ఇదియే పరబ్రహ్మ మిదియే రామ కథ శతకోటి విస్తరము సర్వ పుణ్య ఫలము..”

“రాముడు,రాఘవుడు, రవికులుడితడు..”

“రాజీవ నేత్రాయ, రాఘవాయ నమో..”

“జయ జయ రామా, సమర విజయరామ..”

భళి, భళి రామా, పంతపురామా, నీ బలిమికెవరు ఎదురులేరు భయహర రామ..”

ఇటువంటి అద్భుత రామకీర్తనలు అన్నమయ్య పదాల్లో మిక్కిలిగా చోటుచేసుకున్నాయి.

పురందరదాసు:

తెలుగులో వేలకొలది సంకీర్తనములు రచించి సంకీర్తన పితామహుడని పేరుపొందిన అన్నమాచార్యుల కాలంలో యువకుడై, తరువాత తానుకూడా, కన్నడంలో లక్ష వరకూ సంకీర్తనములు (దాసర పదిగళు) రచించి, కర్ణాటక దేశంలోనే కాక ఆంధ్ర, ద్రావిడ మహారాష్ట్ర దేశాలలో ఆరాధ్యుడైన వాగ్గేయకారుడూ, పరమభక్తాగ్రేసరుడూ పురందరదాసు సంకీర్తన యుగంలో 15, 16 శతాబ్దములలో ఉండిన ఈయన రచనలలో సంకీర్తనలుగానే ఎక్కువ రచించారు. మధ్వ తత్త్వ ప్రబోధకములై భక్తి రసాత్మకములైన యీతని పదగళు మధ్యాచార్య పీఠములలో నేటికీ వేదముగా పరిగణిస్తారు పురందరదాసుకు వ్యాసరాయలే ఉపదేశ గురువు. తమ గురువుల కన్నడ పదాలకు తోడు మహారాష్ట్రంలో విజ్ఞాన దేవాదుల సంకీర్తనముల ప్రభావం కూడా యితని రచనలపై కనిపిస్తుంది.

“రామ మంత్రవ జపిసో..హే మనుజా
ఆ మంత్ర, ఈ మంత్ర నెచ్చినీ కడబేడ
సోమశేఖర తన్న సతిగె పెళిదె మంత్ర..”

“రామ రామ రామా..సీతారామా యన్నిరో
అమర పతియ దివ్య నామ..”

“సీతా మనోహర శ్రీరామచందిరా
దీనరక్షక రఘువంశోద్ధారక
సకల జీవరాశి గళిగె ప్రాణస్వరూపియే
సకల సాధుసంతరిగె గురురామ నీనే..”

శ్రీరాముని లీలలు వర్ణిస్తూ, రామ- రావణ యుద్ధ సమయంలో రావణ సైన్యానికి ఒకరికొకరు రాముడిలాగా అనిపిస్తూ, రావణ సైన్యం ఒకరినొకరు చంపుకొన్నారని.. ఒక కీర్తనలో ఈ విధంగా వ్రాస్తాడు.

“అల్లి నోడలు రామ, ఇల్లి నోడలు రామ ఎల్లెల్లి నోడిదరు అల్లి శ్రీరామ.. అవనిగె ఇవరామ,ఇవనిగె అవరామ..”( అక్కడ చూసినా రాముడే, ఇక్కడ చూసినా రాముడే, ఎక్కడ చూసినా ఆ శ్రీరాముడే.. వాడికి వీడు రాముడు, వీడికి వాడు రాముడు..)

“రామనామ పాయసక్కే కృష్ణ నామ సెక్కెరే…… విఠల నామ తుప్పవ కళిసి … బాయి చప్పరిసిరో.. (రామ నామమనే పాయసంలో, కృష్ణ నామమనే చక్కెర కలిపి, విఠల నామమనే నెయ్యి వేసి, మనసా జపించవే.. అని భక్తికి మాధుర్యాన్ని జోడించాడు..

తులసీదాసు:

వాల్మీకిస్తులసీదాసః కలౌ దేవి భవిష్యతి | రామచంద్రకథామేతాం భాషాబద్ధం కరిష్యతి | (భవిష్యోత్తర పురాణం, ప్రతిసర్గ పర్వ, 4.20)

గోస్వామి తులసీదాసును వాల్మీకి అవతారంగా ప్రసిద్ధి. భక్తిభావం, కావ్య రచన, తాదాత్మ్యత, భాష వీటిని చూస్తే ఆయన అపర వాల్మీకి అనటానికి ఏ సందేహమూ లేదు. ఈయన పరమ రామ భక్తుడైన, రామ చరిత మానస్, రచయిత, తత్వవేత్త, సంఘసంస్కర్త.‌ తులసీదాసు తన జీవిత కాలంలో సంస్కృతంతో పాటుగా హిందీలో 22 రచనలు చేశాడు. తులసీదాసు ఇతర రచనల్లో దోహావళి, కవితావళి, గీతావళి, హనుమాన్ చాలీసా వంటివి ఉన్నాయి. రామ చరిత మానస్ లో తులసీదాస్ రామ తత్వాన్ని ఇలా వివరిస్తాడు.

శంకర సువన భవాని నందన.. అనే కీర్తనలు తులసీదాసు ఇలా రాస్తాడు..

బసహ్ రామ్ సియా మానస్ మోరే
మాంగత్ తులసీదాస్ కర్ జోడే

సగుణ్ రామ్ విష్ణు జగ్ ఆయా
దశరథ్ కీ పుత్ర కహాయ

సాకార్ రామ్ దశరథ్ ఘర్ ఢోలే
నిరాకారి ఘట్ ఘట్ మే బోలే

ఏసి ఘట్ ఘట్ రామ్ హై
దునియా ఖోజితే నాహీ

ఘట్ ఘట్ రామ్ బసత్ హై భాయీ
బినా జ్ఞాన నహి దేత్ దిఖాయీ..

ఆతమ్ జ్ఞాన్ జాయి ఘట్ హోయి
ఆతమ్ రామ్ కో ఛీన్హైసోయీ

సంత్ కబీర్ దాస్:

అత్యంత ప్రభావవంతమైన సాధువులలో ఈయన ఒకరు. ఇతడు 15వ శతాబ్దపు భారతీయ ఆధ్యాత్మ కవి. కబీర్ యొక్క దివ్యమైన రచనలు, దోహాలు పరమాత్మ గొప్పదనాన్ని ఏకత్వాన్ని వివరిస్తాయి.

భక్త కబీరు, తన దోహాలలో శ్రీరాముని ఈ విధంగా స్తుతించాడు.

కెహెతె కబీర్ రామ్ నామ్ తుమ్ బోధిత్ గావే, ఓ సుఖాంతం పావే.. భజన్ కరే హరి..

దను చలో రాము రఘు రాయి, అనుసంగ్ జాణకీమాయి, లచ్ మన్ జైసే భాయి..

భజో మధురా, హరినామ్ నిరంతర్, సరళ భావస్తే హరీ భజోసే..అనేది కబీర్ కీర్తనలలో ఒకటి.

వావికొలను సుబ్బారావు:

‘ఆంధ్ర వాల్మీకిగా’, పేరుపొందిన వావికొలను సుబ్బారావు శ్రీరాముని పరమభక్తుడు. ఇతడు కడప జిల్లా ఒంటిమిట్ట( ఏకశిలా నగరం) లోని కోదండ రాముని సేవించి, చేతిలో టెంకాయ వచ్చి పోతూ భిక్షాటనం చేసి, ఆ ధనంతో ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని జీర్ణోద్ధరణ చేసి (టెంకాయ చిప్పపై శతకం రచించి) మంధరం పేరుతో వాల్మీకి రామాయణాన్ని ఆంధ్రీకరించి, స్వామి వారిపై ఎన్నో కీర్తనలు రచించిన ధన్యజీవి. వాటిలో మచ్చుకు కొన్ని;

“రావయ్య రామదేవర, నన్ను కన్న తండ్రి రావయ్య రామ భూవరా..”

“ఆనందమానందమాయనే మన జానకి పెళ్లికూతురాయనే..”

“మేలుకో రఘురామ, మేలుకో గుణధామ, మేలుకో శుభ నామ మేలుకో..’

“ఒంటిమిట్ట నివాస రాఘవ, యొంటి వాడనురా..

బంటుబంటగు వాసుదాసుని పాలి వేల్పువురా..”అంటూ శ్రీరాముని భక్తి మీర స్తుతించాడు.

“రామచంద్ర- సుగుణసాంద్ర- రమ్య శీలా నాదు మ్రోల..”

“రామచంద్ర మహారాజుకి జై జై భూమి తనయా పతికిని జై జై..వాసుదాస వరదునకును జై జై..”

“మంగళము రామభద్ర, మహిత గుణదయాసముద్ర

కదనమునను వృత్రుల్ జంప గదలు హరికి నెట్టి మంగళం..”

“లాలి రామన్న లాలి, ననుగన్న బాలగోపాల లాలి,

పాలి తామర వరాళి..”

“న్యాయమా రామ, న్యాయమా నను వీడ న్యాయమా రామా న్యాయమా..!’ .. అని రాముల వారితో పంతాలాడి, స్తుతించి, కీర్తించి, లాలిపాడి, పున్నమి వెన్నెల వేళ కళ్యాణాలు చేయించి.. రామచంద్రుడు అన్న నామాన్ని సార్థకం చేశారు.

తమిళ్ సాహిత్యంలో అరుణాచల కవిరాయర్, సీతను కాంచిన హనుమంతుడు రాముడితో చెప్పి సందర్భాన్ని పాటగా రాశారు.

“కండేన్ కండేన్ సీతయై ఓ రాఘవ..”

రాముడి రాక గురించి, సీత తలపులను మరో పాటలో పొందుపరిచారు.

“యారో ఇవరారో, ఎన్న పేరో అరియనే..

కారులావుం, శీరులావుం, మిథిలయిల్ ..

కన్నిమాదం తన్నిల్ మున్నె నిన్రవర్..”

సదాశివ బ్రహ్మేంద్రుల వారి సంస్కృత కీర్తనలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. వాటిలో శ్రీరామునిపై రచించిన కొన్ని కీర్తనలు;

“భజరే రఘువీరం మానస- భజరే రఘువీరం..”

“పిబరే రామరసం.. రసనే.. పిబరే రామరసం..”

“చేతః శ్రీరామ చింతయ- జీమూత శ్యామ్..”

నామ రామాయణం:

“శుద్ధబ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ.శేషతల్ప సుఖనిద్రిత రామ, బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ.. “వంటి నామ రామాయణాలు.. భక్తులు నిత్యం పాడుకుంటూ ఉన్నారు.

పాటలో మనోరంజనం, నాట్యంలో ఆనందం, భజనలో తన్మయత్వం, పూజలో పుణ్యం, హారతిలో అనందం ! స్మరణలో సౌఖ్యం.. ఆయా రకాల ఆరాధనలోని ఆయా సౌక్యాలు మనకు దక్కుతాయి. భజన సాంప్రదాయంలో, మనల్ని మనం మరచిపోయే, తాళము ..లయ.. మనల్ని తన్మయత్వంలో ముంచేస్తాయి. మచ్చుకు ఒక భజన పాట..

రాముడొస్తున్నాడు- రామం భజే

కృష్ణుడొస్తున్నాడు- కృష్ణం భజే..

శ్రీరామ నామము రామ నామము రమ్యమైనది శ్రీరామ నామము రామ నామము రామ నామము రామ నామము రామ నామము

శ్రీమదఖిల రహస్య మంత్ర విశేష ధామము శ్రీరామ నామము ||రా||

దారిన ఒంటిగా నడచువారికి తోడు నీడే శ్రీరామ నామము ||రా||

నారదాది మహా మునీంద్రులు నమ్మినది శ్రీరామ నామము ||రా||

కోరి కొలిచిన వారికెల్లరికి కొంగు బంగరు శ్రీరామ నామము ||రా||..

రెండు మూడు వందల చరణాలతో, గంటలకొద్దీ పాడుకోగలిగిన ప్రఖ్యాత రామభజనలో మరొకటి ఇది!

రామునిపై కీర్తనలు, తత్వాలు, భజనలు రచించిన వాగ్గేయకారులు/ భక్తులు/ సంత్ లలో తుకారాం, రాందేవ్, నామ్ దేవ్, కనకదాసు , కబీర్ దాసు, సూరదాస్ వంటి వారు ముఖ్యులు. జయదేవుని అష్టపదుల్లోనూ, మైసూర్ వాసుదేవాచారి కీర్తనల్లోనూ, తరిగొండ వెంగమాంబ సాహిత్యంలోనూ, ఆళ్వారుల సాహిత్యంలోనూ, రామాగానామృతాలు మనకు కనిపిస్తాయి.

తెలుగువాడైన కైవారం తాతయ్యగా పిలువబడే, ఆదినారేయణ, ఇటు తెలుగులోనూ, కన్నడలోనూ, సంస్కృతంలోనూ వేల సంఖ్యలో కీర్తనలు రచించారు.

“రామ రామ ముకుంద మాధవ, రామ సద్గురు కేశవ, రామ దశరథ తనయ దేవా, రామ శ్రీ నారేయణ..”

అన్నది, వీరు రాసిన ఒకానొక కీర్తన. మలయాళంలో స్వాతి తిరునాళ్ కీర్తనల్లో కూడా మనకు రామ తత్వం విరివిగా కనిపిస్తుంది.‌ “సారసాక్ష పరిపాలయ మామయి, సంతతం కరుణయా జగదీశా, నీరజాస్త్ర

జనకదిక మేచక, నీరదాభ కరినాయక భయహర..” అనేది వీరి సంస్కృత కీర్తనల్లో ఒకటి.

ఇంకా మనకు గీతాల్లో, స్వరాల్లో, తరంగాలలో, జావళీలలో, అష్టపదుల్లో, తిల్లానాలలో, విరివిగా రామ గానామృతం లభ్యమవుతుంది.

తెలుగులోని ఇటు ఆకాశవాణిలోనూ, అటు ఎన్నో టీవీ మాధ్యమాల్లోనూ, మధురమైన రామకీర్తనలు లెక్కకు మిక్కిలిగా మనకు లభిస్తాయి. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు మృదు మధురంగా ఆలపించిన’, శ్రీరామ శుభనామం చెవులారా వినరే, దివ్య మంగళ రూపం కనులారకనరే..’ శ్రోతలందరికీ సుపరిచితమే. ఎమ్మెస్ రామారావు గారి ‘సుందరకాండ’/ రామాయణం కూడా ఒక దృశ్య కావ్యంలా, అజరామరంగా రామకీర్తనలుగా ముద్ర వేసుకున్నాయి.

ఇక సినీ సాహిత్య విషయానికి వస్తే, రామాయణం కథాంశంగా నిర్మించిన గొప్ప చిత్రాలన్నిటిలో అత్యద్భుతమైన రాముని పాటలు తెలుగు వాళ్ళ గుండెల్లో మారం రోగుతూనే ఉన్నాయి. లవకుశ, సంపూర్ణ రామాయణం, రామాంజనేయ యుద్ధం, సీతారామ కళ్యాణం, శ్రీరామరాజ్యం, రామదాసు, వంటి చిత్రాలలో ప్రతి పాట మనోహరంగా రచింపబడి, స్వర బద్దం చేయబడింది.ఇటీవల రామకథా నేపథ్యంగా చిత్రీకరింపబడిన ఆది పురుష్ చిత్రంలోని “రామ్ సియా రామ్.. జై జై రామ్ సీతా రామ్”, అసంఖ్యాకమైన యువతకు కూడా రింగ్ టోన్ గా చలామణి అవుతోంది అంటే, దాని ప్రభావాన్ని మీరు ఊహించగలరు. ఆపాత మధురమైన గోల్డెన్ హిట్ సినిమా పాటల తరువాత.. చెప్పుకోదగ్గ సినిమా పాటల్ని కొన్నిటిని చూద్దాం!

శ్రీ రామాంజనేయ యుధ్ధం  చిత్రంలో రచించిన, ‘శ్రీకరమౌ శ్రీరామ నామం భవతారక మంత్రం..’

మీనా చిత్రం కోసం ఆరుద్ర రచించిన, శ్రీరామ నామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహు తీపి..’

మా ఊరి దేవుడు చిత్రం కోసం వేటూరి రచించిన.. మనసెరిగిన వాడు మా దేవుడు.. శ్రీరాముడు..

ఆదియు అంతము రాముని లోనే

మా అనుబంధము రాముని తోనే

ఆప్తుడు, బంధము అన్నియు తానే

అలకలు పలుకులు ఆతనితోనే.. (ఆదిపురుష్)

శ్రీరామరాజ్యం చిత్రంలో జొన్నవిత్తుల రచించిన ‘జగదానందకారకా, జయ జానకి ప్రాణ నాయక..’

స్వాతిముత్యం చిత్రంలో, డాక్టర్ సి నారాయణ రెడ్డి రచించిన ‘రామా కనవేమిరా, శ్రీ రఘురామ కనవేమిరా..’

శ్రీ ఆంజనేయంలో, సిరివెన్నెల రచించిన .. ‘తికమక మక తిక’

శ్రీమంతుడు చిత్రంలో‌ రామజోగయ్య శాస్త్రి రచించిన ‘రామ రామ రామ రామ రామ రామ రామ రామ..’

మా ఆవిడ కలెక్టర్ చిత్రంలో సిరివెన్నెల రచించిన ‘రామనామమెంతో తీయన..’

ఎవరే అతగాడు చిత్రం కోసం వేటూరి రచించిన ‘సీతారామ కళ్యాణం..’

~

జానపదాల్లో కూడా రామాయణంలోని ప్రతి ఘట్టానికి పాటలు వున్నాయి . కోలాటం, సంవాదం, దంపుళ్ళు, నాట్లు, కోతలు, గొబ్బిళ్ళు, పెళ్లి, పండరిభజన, చెక్కభజన, గుజ్జర్లు, తోలుబొమ్మలాట, వీధినాటకాలు, యక్షగానం, పగటివేషాలు, బుర్రకథ, తత్వాలు, వీరగాధలు వంటి జానపద కళారూపాలలో కూడా కూడా రామ కథలు, ఉన్నాయి.

జానపద బాణీలో ఒక పాట:

శ్రీరాముడు హనుమంతుడి ద్వారా పంపిన ఉంగరాన్ని చూసుకొని, లంకలో ఉన్న సీతమ్మ జానపదుల బాణీలో ఇలా పాడుకొందట.

ఉంగూరమా ముద్దుటుంగూరమా,
రంగైనా రాములేలుంగూరమా,
అయ్యోద్ది పట్టాన ఉంగూరమా,
శ్రీరామచంద్రుడే ఉంగూరమా,
శ్రీరామచంద్రుడే ఉంగూరమా,
నాపాలి దైవమే ఉంగూరమా.
నా పాలి దైవమే ఉంగూరమా
బాగా సేమానా ఉండాడా ఉంగూరమా..

ఇలా సాగుతుంది ఆ పాట.

ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ జాబితాకు అంతమే ఉండదు. ఈ విధంగా వేలాదిగా ఉన్న రామ కీర్తనలను వ్రాయడానికి, ఏకంగా ఒక గ్రంథమే కావాలి. కాబట్టి, రామచంద్రుడు ఉదయించిన ఈ పుణ్యోత్సవం రోజున, శ్రీరామ గీతామృతాన్ని నాకు చేతనైనంత వరకు, ఒక చోటికి చేర్చి, ఈ వ్యాసాన్ని మీకు అందించగలిగినందుకు, అవకాశాన్ని నాకు కల్పించినందుకు, ఆ రామచంద్రుడికి మనసారా ప్రణతులు అర్పిస్తున్నాను. Burn all the libraries and let there be only Ramayana, అని ఒక విదేశీయుడు వచించాడంటే.. రాముని చరితను,రామాయణ ఘనతను వర్ణించడానికి ఇంతకంటే ఏమి ఋజువులు కావాలి? రామావతారం ఒక పరిపూర్ణ అవతారం కనుకనే రామ నామం, రూపం, రామతత్వం ఎన్ని యుగాలైనా ఆదర్శ ప్రాయంగా ఈ భూమిపై నిలిచే ఉన్నాయి. జైశ్రీరామ్!

(ఈ పరిశోధనలో నాకు సహకారం అందించిన వారు, డాక్టర్ ఆర్.ఎన్. శర్మ( మా శ్రీవారు), డాక్టర్. శ్రీవాణి అర్జున్, ( స్నేహితురాలు, ఎం.ఏ. పి.హెచ్ మ.డి., మ్యూజిక్), సాయి శ్రీకాంత్( సోదరుడు, సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్), డాక్టర్ నీహాల్( ప్లే బ్యాక్ సింగర్& మ్యూజిషియన్), శ్రీమతి బి. జయలక్ష్మీకృష్ణ ( అక్కయ్య), ఆలూరి యశ్వంత్( అక్కయ్య గారి అబ్బాయి, లిరిక్ రైటర్)… వీరి సహకారానికి పత్రికాముఖంగా వీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here