శ్రీరమణ గారు/నేనూ @ మిథునం

3
9

[ప్రముఖ రచయిత, సంపాదకులు శ్రీరమణ గారికి ఈ రచన ద్వారా నివాళి అర్పిస్తున్నారు బ్నిం]

[dropcap]శ్రీ[/dropcap]రమణ గారి కథ ‘మిథునం’కీ నాకు ఒక గొప్ప అనుబంధం ఉంది. అది అనేక రకాలు. మలుపుల్లో.. రూపాల్లో ఆది నుంచి.. అంటే ఆ కథ రాసిన.. కాదు రాస్తున్న దగ్గర్నుంచి అనేక మెట్లు దాటి భరణి చేతిలో సినిమాగా మారి.. దాని తర్వాత కూడా ఆవిడెవరో నాగమణి గారు మిథునం మూవీ మీద రీసెర్చ్ చేసి, దానిని ప్రత్యేక సంచిక వేస్తానని భరణిని అడిగినప్పుడు – ఆ సంచిక డిజైనింగ్‌లో.. సంపాదకత్వంలో ఎన్నో బంధాలు ఉన్నాయి – హాస్యానందం పత్రిక వారు మిథునం ప్రత్యేక సంచిక వేసినప్పుడు కూడా నాకు కొన్ని బాధ్యతలు.. అనుబంధాలు, బంధాలు పెనవేసుకుని ఉన్నాయి..

బాపు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, శ్రీరమణ గారు, ఎన్.సి.ఎల్. రాజు గారు, బ్నిం

***

అథ  ప్రథమోధ్యాయః

శ్రీరమణ గారు ఒక సంచలనాత్మకమైన కథ రాస్తున్నట్లు పసిగట్టి వారింటికి వెళ్లి కొంచెం కొంచెం కథ విని, రెండు మూడు ట్రిప్పులు అయ్యాక కథ ఆసాంతం మళ్ళీ విని అదిరిపోయాను.. ఆ రకంగా మిథునం కథ వారి కుటుంబం వారు కాకుండా.. మొదటి శ్రోతని నేనే అయి ఉంటాను..

అప్పట్లో నేను ఆంధ్రభూమి లో పనిచేస్తూ ఉండేవాడిని..

ఆకెళ్ళ రామచంద్ర రావు గారు ఆంధ్రభూమి వీక్లీకి ఎడిటర్‍గా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజులు. అంతకుముందు సబ్ ఎడిటర్‌గా ఆయన చేస్తున్న తప్పులు.. తడకలు.. అంటే తడకల మాటుకు చేరి తప్పించుకోవడాలు.. అన్ని చూస్తూనే ఉన్నాం.

వీక్లీ నుంచి సిక రాజుగారు.. వెళ్లబడ్డాక.. ఆ సింహాసనం అధిష్టించిన కొత్త రాజు – రామచంద్ర రావు గారు. ఆయన కామెడీ యాక్టర్‌లా తప్పులు చేస్తుంటారు. అయినా ఫ్రెండు. అంత పెద్ద సింహాసనం అనుకోకుండా అధిష్టించాడు. ఆయన సత్తా జనం గుర్తించాలంటే.. శ్రీరమణగారి మిథునం కథ ఆయన సంపాదకత్వంలో ఆయన హయాంలో అచ్చవాలి.

ఆ కథ ఖండాంతర ఖ్యాతి పొందుతుందని నాకు ముందే తెలుసు గనుక ఈ క్రెడిట్ అంతా ఆంధ్రభూమికి, తద్వారా ఆయనకి, ఆయన ద్వారా నాకు, అలా పైపైకి ఎగబాకి పోతుందని దాని వల్ల నాకు కూడా ప్రయోజనం ఉంటుందని స్వార్థం.. లేకపోలేదు..

సరే ఎలాగో అలాగా శ్రీ రమణ గారిని బతిమాలి.. బుజ్జగించి.. కథ తీసుకున్నాను.

లక్ష్మణ మూర్ఛ నాడు సంజీవని కొని తెచ్చిన ఆంజనేయులు కొచ్చినంత ఖ్యాతిని.. ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఆ కథని తీసుకెళ్లి “ఇదిగో మా ఫ్రెండు శ్రీ రమణ గారు, అంటే ఎవరు.. బాపు గారు రమణ గారు మెచ్చిన శ్రీ రమణ గారు. ఆంధ్రజ్యోతిలో ‘బంగారు మురుగు’ రాసి – ఆహా ఓహో అని ఆంధ్ర జనమంతా విస్తుపోయేలా చేసిన మహా రచయిత. ఆయన రాసిన కథ మన పత్రిక కోసం రిక్వెస్ట్ చేసి తెచ్చాను” అని చేతికిచ్చాను.

ఆయన ఎగిరి గంతేస్తారు అనుకున్నాను. ఆయన పేజీలు ఇలా తిప్పి “చాలా పెద్దది అవుతుంది.. ఎడిట్ చేయాలేమో..” అన్నాడు..

సగం గాలి తీసేసాడు..

“అక్షరం మారితే నా ఆబోరు దక్కదండి – నా గౌరవం కోసం కాదు..

మీరు ఒకసారి చదవండి. ఎడిట్ చేయాలనిపిస్తే. నాకు చెప్పండి.. ఆయనతోనే చేయిస్తాను.” ఆయన అహానికి నా అహంకారానికి అంతర్యుద్ధం ప్రారంభమవుతోంది.

లక్కీగా ఆయన “కాసేపాగి చదువుతా” అని అన్నాడు..

నావరకు నాకు నమ్మకం ఉంది. అది నిఖార్సైన బంగారం అని. ‘ఈయన ఎవడు గీటురాయి పెట్టి చూస్తాను అనడానికి..’ అనుకుంటూ.. ఆయన వేరే ఫైలు చూస్తుంటే..

“ఓకే చదివి చెప్పండి” అని వచ్చి నా సీట్‌లో కూర్చున్నాను.. ఓ గంట పోయాక నన్ను పిలిచాడు.

“కథ బాగుంది. ఏమి ఎడిట్ చేయక్కర్లేదు. నాలుగు వారాలు వేద్దాం.” అన్నాడు. నాకు సంతోషం వేసింది.

“ఫస్ట్ టైం మన మ్యాగజైన్‌లో నాలుగు వారాలు ఒక కథ వేయడం.”

“నిజమే ఆ కథకి ఆ పాటి గౌరవం ఇవ్వాలి లెండి. అయినా ఈ కథ వేస్తే మన పత్రికకి కూడా గౌరవం పెరుగుతుంది లెండి” అన్నాను నేను.

ఆయనే శ్రీరమణ గారితో మాట్లాడుతా అని అన్నారు. ఏతావాతా నాలుగు వారాల ఆ కథ వేశారు. మూడవ వారం జరుగుతుండగా, కథలో ఒక పేజీ ఎగిరిపోయింది..

శ్రీరమణ గారు కోప్పడ్డారు.

నేను గమనించలేదు.

రామచంద్ర రావు గారితో చెప్పి “వచ్చే వారంలో కరెక్షన్ వేద్దామా అండీ” అన్నాను.

“ఎవరు నోటీస్ కూడా చేయలేదు. గమనించరు” అని క్యాజువల్‌గా తీసుకున్నారు.

శ్రీరమణ గారు నన్ను చాలా సార్లు ఈ విషయం మీద వ్యంగ్యంగా సహజ చతురంగా దెప్పి పొడిచారు. ఆ తర్వాత నెల తిరగకుండానే, వేరే ఓ పత్రికలో మరోసారి మిథునం కథ వచ్చింది. ఆంధ్రభూమిలో ప్రచురించిన దానికన్నా చాలా వేల మంది పాఠకులు చదివారు.

బాపు గారు, శ్రీరమణ గారు, ఎన్.సి.ఎల్. రాజు గారు, బ్నిం

మా ఎడిటర్ గారు ఆ కథ మళ్లీ మరో పత్రికలో ఎలా వేస్తారు? అని గింజుకున్నారు..

మన పత్రికలో పూర్తి పాఠం వేయలేదు కదా.. వారి పత్రికలో పూర్తిపాఠం వేశారు అని..

‘ఎవరు నోటీస్ చేయలేదు మన పత్రికలో వచ్చింద’ని అన్నాను..

ఆయన అన్నమాటే. ‘నోటీస్ చేయడం’.

ఇక్కడితో ప్రధమాధ్యాయం కంప్లీట్ అయింది..

***

రెండో అధ్యాయానికి వెళ్లే ముందు లీడ్:

అలా వివిధ పత్రికల్లో.. ప్రత్యేక సంచికలలో.. ఆ కథ ఒకటి అచ్చు వేసుకుని షష్టిపూర్తి లకు శుభకార్యాలకి రిటర్న్ గిఫ్ట్‌గా అందించడం. పెద్ద పెద్ద వాళ్ళు అభినందించడం. శ్రీరమణ గారిని అంబరం ఎత్తున నిలబెట్టింది ఆ కథ..

బాపు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, శ్రీరమణ గారు, ఎన్.సి.ఎల్. రాజు గారు, బ్నిం

అన్నిటికన్నా గొప్ప విషయం. అందులో ప్రతి అక్షరాన్ని ప్రేమించి గౌరవంగా ప్రేమగా.. మహా ఇష్టంగా బాపుగారు స్వదస్తూరితో రాసి ఎందరో మిత్రులకి జిరాక్స్ కాపీలు అందించడం ఒక అద్భుతం.. బాపు గారి దస్తూరితో రచన పత్రిక వారు తమ కథా సంకలనంలో రచన పత్రిక లోను ప్రచురించడమే కాదు తర్వాత తర్వాత బాపు గారి దస్తూరి తిలకంతో గిఫ్ట్ ప్యాక్‌గా వేలాది పుస్తకాలు.. అందంగా అందించారు. ఒక 10 కాపీలు కొని.. ఇంట్లో దాచుకొని ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చుకుని, ఎంతోమంది ఇవాళ పులకించిపోతున్నారు!

***

ఇక మిథునంతో నా రెండో అధ్యాయం.

ఇది విజయవాడ నవోదయ పబ్లిషర్స్ రామ్మోహన్ రావు గారి ‘మిథునం’ కథా సంకలనం రూపకల్పనలో నా పాత్ర!

అమరావతి కథలు తర్వాత.. ఎంతో ప్రతిష్ఠాత్మక ప్రచురణగా భావించే – నవోదయ వారి ‘మిథునం’ కథా సంకలనం ఫస్ట్ ఎడిషన్ రూపకల్పన నా ద్వారా జరిగింది.

అప్పటివరకు విజయవాడలోనే పుస్తకాలు ప్రచురించే నవోదయ సంస్థ.. ఈ సంకలన ప్రచురణ బాధ్యత నాకు అప్పగించి హైదరాబాదులో నిర్వహించేలా చేసింది. నేను ప్రెస్టేజియస్‌గా.. ఈ జాబ్ ఒప్పుకుని చేయాలనుకున్నాను..

బాపు గారు.. పుస్తకాల గదిలో

పైగా రామ్మోహన్ రావు గారు నా మీద నమ్మకంతో ఈ పని నాకు అప్పగించారు.

ఆంధ్రభూమిలో కథ వేసినప్పుడు జరిగిన పొరపాటు సరిదిద్దుకుని శ్రీరమణ గారి సెటైర్లకు ఫుల్‌స్టాప్ పెట్టడానికి అవకాశంగా దీన్ని తీసుకోవచ్చు అని నాకు అనిపించింది.

అయితే అక్కడ ఓ తిరకాసు పడింది..

శ్రీరమణ గారి కథలు.. ఆరో.. ఏడో ఒక సంకలనంగా వేస్తే దాన్ని నేను స్పాన్సర్ చేస్తాను అని వచ్చిన రామ్మోహన్ రావు గారి బంధువు చిన్న అబ్జెక్షన్ లేవదీశారు. అంతకు ఎప్పుడో ముందే.. అలా అంత పేరు వచ్చేసిన.. మిథునం కథని.. శ్రీరమణ గారి కొత్త సంకలనంలో చేర్చాలా వద్దా.. అనే మీమాంస బయలుదేరింది.. వద్దని ప్రొడ్యూసర్ గారి ఆజ్ఞ!

శ్రీరమణ గారి దస్తూరీలో మిథునం కథ

రామ్మోహన రావు గారికి కూడా ఇష్టమైన ఆ కథని ఆపేయక తప్పని పరిస్థితి..?!

శ్రీరమణ గారు కూడా “ఓకే స్పాన్సర్ చెప్పినట్టే వినండి..” అనేసారు.?!

ఈ అడ్జస్ట్‌మెంట్ నాకు నచ్చక..

బాపు గారితో ఫోన్ చేసి చెప్పాను.. ఇది పరిస్థితి అని!

“మిథునం కథ లేకపోతే ఏం బాగోదండి” అన్నారు బాపు గారు..

ఈ మాట పుస్తకం అచ్చేద్దామనుకుంటున్న స్పాన్సర్‌కి చేరవేశా. బాపుగారి ఓటు ఎటుపడితే అటుగా.. ఎవరూ జవదాట లేరుగా..

మొత్తానికి కథ సుఖాంతం అయింది. పని మొదలైంది.

మిథునం కథకి బాపుగారి ఇల్లస్ట్రేషన్

లోపల కథలు అన్నింటికీ బొమ్మలు వచ్చాయి. బాపూ గారు అంతకుముందు వేయని కథలకి కొత్త బొమ్మలు వేసి పంపారు. నవోదయ రామ్మోహన్ రావు గారి దగ్గర నుంచి లేఅవుట్ డిజైనింగ్ చేయించుకోవడానికి రామ్మోహన్ రావు గారి ఆంతరంగిక మేనల్లుడు లాంటి లక్ష్మీనారాయణ గారు అనే నా విజయవాడ మిత్రుడు – హైదరాబాదులో మా ఇంట్లో విడిది చేసి కటింగ్ పేస్టింగ్ వర్క్‌లో సాయబడుతుండగా ఫస్ట్ ఎడిషన్ నా చేతుల మీదుగా పూర్తయింది.

కవర్ పేజీ బాపు గారు వేసినది నాకు చేరింది.

నేను షాక్..

బాపు గారికి ఫోన్ చేశా..

“సార్.. మిథునం టైటిల్ గురించి మాట్లాడాలండి..” అన్నాను.

“పంపించేసాను అండి నిన్ననే” అన్నారు బాపు గారు!

“అందిందండి.. కానీ అస్సలు బాగా లేదండి..

మీరు అంతగా ప్రేమించి..

అంతమందికి మీ హ్యాండ్ రైటింగ్‌తో కాపీలు పంచి..

మీకుగా మీరు ఒక గొప్ప స్థాయిని ఏర్పాటు చేసిన మంచి కథా సంకలనానికి..

అట్టమీద బొమ్మ ఎంతో బాగుండాలి.. కదా సార్..

ఇంకో బొమ్మ వేసి పంపరా ప్లీజ్..

చాలా రిహార్సెల్స్ వేసుకుని ఈ మాటలు మాట్లాడుతున్నాను సార్. ..ఏమీ అనుకోవద్దు”

కళ్ళు మూసుకుని అనేసి ఫోన్ పెట్టేసాను.. జవాబు కోసం ఆగకుండా.

ఆ మర్నాడు.. కొరియర్‌లో వచ్చిన బొమ్మని చూసి.. నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఎంత గొప్పగా ఉందో ఆ బొమ్మ!!

ఆ బొమ్మను వేయించినందుకు.. నేను జీవితాంతం కాలర్ ఎత్తుకు తిరుగుతాను.. చుట్టూతా గ్రీనరీలో అర్ధనారీశ్వరుడంటి వృద్ధ దంపతులు.. ఆకుపచ్చ చెట్లన్నీ ఆయన కత్తిరించి.. అతికి.. కలర్‌తో కవర్ చేసిన అద్భుతం..

మిథునం పుస్తకం కవర్ పేజీ

ఇప్పటికి లక్ష సార్లు ఆ బొమ్మ అచ్చయి ఉంటుంది.

బాపు గారికి కూడా ఆ బొమ్మ చూసినప్పుడల్లా..

ఎన్నిసార్లు నేను గుర్తొచ్చి ఉంటానో..

మొదట వేసిన బొమ్మ ఎవరికీ చూపలేదు.. రామ్మోహన్ రావు గారికి.. శ్రీరమణ గారికి కూడా.

ఎప్పుడైనా శ్రీరమణ గారికి చెప్పి ఆంధ్రభూమితో నేను చేసిన తప్పు ఈ రీతిగా పరిష్కరించబడింది అని ఫోజు కొట్టాలని ఉంది.

(మూడేళ్ల క్రితం ఎప్పుడో.. మళ్లీ శ్రీరమణ గారు పాత సంగతి గుర్తొచ్చి సెటైరెయ్యబోతుంటే ఆయనకు బాపుగారు మొదట వేసిన బొమ్మ ‘మెయిల్’ చేసి మీకు ఎంత మేలు చేశానో చూడండి అన్నాను)

అంత అందమైన కలరు బొమ్మ ప్రింటింగ్ హైదరాబాదు లోనే చేయించమని నవోదయ రామ్మోహన్ రావు గారి ఆదేశం అందింది. హిమాయత్ నగర్.. నవ్య ప్రింటర్స్‌లో వేయించాను. బాగానే వచ్చింది..

ఆ రకంగా.. బాపు గారితో, నవోదయ రామ్మోహన్ రావు గారితో, శ్రీరమణ గారితో నేను.. అందమైన ప్రయాణం చేశా.

దీంతో ద్వితీయాధ్యాయం పూర్తయింది.

పుస్తకాల అలమారా

***

మిథునం.. కథతో నాకు మరో మెలిక పడింది. అది మిత్రుడు తనికెళ్ల భరణి సినిమాగా తీసిన ఘట్టం.

సినేరియా చేస్తున్నప్పుడు, సంభాషణలు రాస్తున్నప్పుడు భరణి చాలాసార్లు ఇంటికి పిలిపించుకుని.. ఫోన్ లోనూ.. తన కథనాలు చెప్పేవాడు.. బంగారాన్ని.. వంకీ చేయించుకున్నా వడ్డాణం చేయించుకున్నా అందమే కదా. మంచి పనివాడి చేతిలో పడింది ఆ బంగారం లాంటి కథ.

అంతకు ముందు గొప్ప మలయాళీ డైరెక్టర్ ఇంగ్లీష్‍లో విని మలయాళంలో ఆలోచించి ఓ సినిమా చేశారు.. వాళ్ల నేటివిటిలో!?

కానీ మన భరణి తెలుగువాడు.. అచ్చ తెలుగువాడు.. తెలుగులోనే కథ చదివి ‘తేనెలో ముంచి మరింత రుచి అనుభవించి’ వండి వడ్డించాడు. అప్పదాసుని అద్భుతంగా ‘బాలు’ ఆవిష్కరించారు. ప్రతి తెలుగువాడు గర్వించాడు మిథునం కథని. అంతా సినిమా చూసి ఆనందించారు.

ఆ కథతో ఋణానుబంధం మూలాన్ని..

మరో కొన్ని పనులు చేయాల్సి వచ్చింది.

హాస్యానందం స్పెషల్ ఇష్యూ వేసింది మిథునం సినిమా గురించి.

దాన్ని ఎక్కువ కాలమ్స్ నేనే నింపాను అందరిని ఇంటర్వ్యూ చేసి.

ఇంకాస్త తర్వాత.. మిథునం సినిమా విశ్లేషించి మంగళ గౌరీ గారు అనే పెద్ద ఆవిడ ఒక రచన చేస్తే దాన్ని సంస్కరిస్తూ సంపాదకత్వం వహించాను..

అదండీ.. శ్రీరమణ గారు/నేనూ @ మిథునం

చుట్టరికం!

ఇంకొక్క ఫినిషింగ్ టచ్ ఉంది.

బాపు గారు మిథునం సినిమా చూసి భరణి గారికి మెచ్చుకుంటూ రాసిన చిన్న లెటర్ నా చేతుల మీదుగా బట్వాడా అయింది.

బాపూ గారి ఉత్తరం

(ఇది.. త్వరలో రానున్న ‘బాపు గారితో నేను’ పుస్తకంలో కొన్ని పేజీల నుంచి)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here