(‘రామకథాసుధ’ పుస్తకంలోని శ్రీమతి సంధ్య యల్లాప్రగడ గారి ‘శ్రీరాముని చింతన’ అనే కథని విశ్లేషిస్తున్నారు శ్రీమతి కలవల గిరిజారాణి)
[dropcap]సం[/dropcap]చిక వెబ్ మేగజైన్ వారు ప్రచురించిన ‘శ్రీరామ కథా సుధ’ లోని కథలన్నీ ఆణిముత్యాలే!!
అందులోని మొదటి కథ శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ గారు వ్రాసిన కథ ‘శ్రీరాముని చింతన’ అను పేరు కల కథని నేను చదివాను.
అదే సమయంలో నేను రచయిత్రిని కలుసుకోవడం కూడా జరిగింది. ఈ కథ చదివాక, నాకు కలిగిన సందేహాలు, సంశయాలు మొత్తం ఆమె ద్వారానే తీరిపోయాయి.
రాముడు దేవుడు కదా? సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అవతారం కదా? మరి ఆయనకి కూడా చింతనలు, విచారాలు వుంటాయా? అని అనిపించింది.
కథా సారాంశం పూర్తిగా ఆకళింపు చేసుకున్నాక తెలిసింది. రాముడు మానవ రూపంలో, మామూలు మనిషి లాగా వచ్చి, తన జీవన విధానం ద్వారా మానవులు ఎలా వుండాలీ? ఎలా వుండకూడదూ? అని తెలియచేసిన పుణ్యమూర్తి. జన్మనిచ్చిన వారితో, తోడబుట్టిన వారితో, ధర్మపత్నితో, హితులతో, సన్నిహితులతో, శత్రువులతో, తనని నమ్మిన వారితో ధర్మానికి అనుగుణంగానే మసలుకున్న ధర్మమూర్తి ఈ రామచంద్ర మూర్తి.
‘రామో విగ్రహవాన్ ధర్మః’
ధర్మాన్ని అనుసరించి, ధర్మాచరణ కావిస్తూ, ధర్మనిరతితో సమస్త భారతావనికీ మార్గదర్శకపు త్రోవ చూపించాడు. అయితే అటువంటి రామునికి కూడా ఒకానొక దశలో.. నిరంతర ఆలోచనలు చుట్టుముట్టాయి. తిండితిప్పలు మాని, ఇహ ప్రపంచాన్ని పట్టించుకోకుండా, చిక్కి శల్యమయాడు.
పుత్రుని తీరు, దశరథుని తీవ్రంగా బాధించింది. దీనికి కారణమేమిటని వశిష్ఠులవారిని అడుగగా, తగు సమయాన, రామునిలో తప్పక మార్పు వస్తుందని ఊరట నివ్వడం జరుగుతుంది.
అదే సమయంలో విశ్వామిత్రుడు, తన యాగ సంరక్షణ నిమిత్తం రామలక్ష్మణులను తనతో పంపమని అడగడం.. పుత్ర వ్యామోహంతో దశరథుడు కాదనడం, దానికి విశ్వామిత్రుని ఆగ్రహం, ఆ తర్వాత వశిష్ఠుని జోక్యంతో అంగీకరించడం జరుగుతుంది.
‘శ్రీరాముని చింతన’ తీర్చు సమయం ఇదేనని తలచిన వశిష్ఠుల వారు, రాముని వైఖరికి కారణం అడగగా, ‘అసలు సుఖమనేది ఎక్కడ వుంది? పుట్టడం చావడం కోసమే తప్ప సుఖం లేదు. మానవ జన్మను సార్థకం చేసుకోవడం ఎలా?’ ఇత్యాది ప్రశ్నలలో చిక్కుపడిపోయివున్న రాముని అంతరంగమును, వశిష్ఠుల వారు, ధర్మాన్ని వీడక నడువవలసిన రీతులని, స్ధిర చిత్తముతో స్ధితప్రజ్జునిగా మసలుకొనురీతిని, రామునితో పాటుగా సభలోని వారందరికీ కూలంకషంగా తెలియచేసారు.
వశిష్ఠుల వారి ద్వారా శ్రీరామునికి తెలియచేయబడిన ఈ 32 వేల శ్లోకాలు వున్న ‘యోగవాశిష్ఠం’ అను గ్రంథమును, మూల రామాయణంతో కలిపితే నిడివి పెరుగుతుందని, ఆరు ప్రకరణాలతో మరొక గ్రంథం రూపంలో వాల్మీకి మహర్షి వ్రాసారు.
అందులోని సారాంశముతో రచయిత్రి ఈ ‘శ్రీరాముని చింతన’ వ్రాయడం జరిగింది.
సుఖాలు వచ్చినపుడు పొంగిపోవడం, దుఃఖం కలిగినపుడు కుంగిపోవడం సామాన్య మానవరీతి.
కానీ.. రాముడు ఈ వశిష్ఠ బోధలని జీర్ణించుకున్నాడు కనుకనే, మరునాడు అయోధ్య రాజ్యాన్ని పరిపాలించే మహారాజు కావలిసినవాడు, తెల్లవారగానే పితృవాక్యపరిపాలకుడై అడవులదారి పట్టాడు. పట్టు పరుపుల మీద పవళించే సున్నితుడు కటిక నేల మీద పరున్నాడు.
ఎటువంటి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని వీడని మహనీయుడయాడు. పైకి కనపడే భావ ప్రకటన తప్ప, అంతరంగం లోని నిశ్చలత్వం ఎవరి బుద్ధికీ అందదు. అతి సామాన్యుడిలా మానవ శారీరక పరిమితులకి లోబడి సుఖదుఃఖాలు అనుభవించాడు. అంతరంగంలో మాత్రం సుఖదుఃఖాలకు అతీతమైన ఆనందాబుధిలో నిశ్చల తరంగాలపై స్ధిరంగా నిలిచాడు. ఆత్మ విశ్వాసంతో నడుచుకున్నాడు.
మనసుతో ఆచరించేది నిజమైన కర్మ. ఆ మనసుని నిగ్రహించుకోవడమెలా తెలియచేసే కథ ‘శ్రీరాముని చింతన’ దానికి మూలాధారమైన, వాల్మీకి విరచిత యోగవాశిష్ఠం. దీనికే మరో పేరు వశిష్ఠగీత.
తప్పక చదివి, జీవనరీతిని తెలుసుకుని, ధర్మాన్ని వీడక మానవాళి నడువవలసిన రీతిని తెలియచేయు కథ ఇది.
ప్రస్తుతం సమాజంలో పరమ పవిత్రమైన రామాయణానికి వికృతరూపాలు అద్దుతున్న సమయంలో, మనందరికీ సరైన దశ దిశలని నిర్దేశించు ఇటువంటి కథలు మనకి మార్గదర్శకాలు అవుతాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
రచయిత్రికి, ప్రచురణ కర్తలకీ అభినందనలు.
జై శ్రీరాం.🙏
***
రామకథాసుధ (కథా సంకలనం)
సంపాదకులు: కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్లి మురళీ మోహన్, కొల్లూరి సోమ శంకర్
సంచిక – సాహితి ప్రచురణ
పేజీలు: 215
వెల: 175/-
ప్రతులకు:
సాహితి ప్రచురణలు, #33-22-2,
చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్,
చుట్టుగుంట, విజయవాడ – 520 004. ఫోన్: 0866-2436643. 9849992890
ఆన్‍లైన్‍లో ఆర్డర్ చేసేందుకు
https://www.sahithibooks.com/ProductDetails.aspx?ProductId=1284&BrandId=82&Name=ramakathasudha