శ్రీరాముని చింతన

0
5

రామకథాసుధ’ సంకలనం ప్రచురణకు పరిశీలనకు అందిన కథ.

***

[dropcap]శ్రీ[/dropcap] రామచంద్రుడు శాంతంగా నవ్వాడు.

***

“దివి భూమౌ తథాఽఽకాశే బహిరంతశ్చ మే విభుః।
యో విభాత్యవభాసాత్మా, తస్మై సర్వాత్మనే నమః॥”

స్వస్వరూపభూతుడు, ప్రకాశరూపుడు అయిన ఏ పరమాత్మ స్వర్గంలోను, భూలోకంలో, ఆకాశంలో, బయటా, లోపలా నానా విధరూపములలో ఏకస్థుడై ప్రకాశిస్తున్నాడో అట్టి స్వస్వరూపుడగు పరబ్రహ్మకు నమస్కారములు.

***

అయోధ్యా నగరంలో దశరథుని మందిరం. చల్లటి వెన్నెల నెమ్మదిగా కురుస్తోంది. మందిరంలోకి ప్రసరిస్తున్న శశికిరణాల వెలుతురు మందిరపు ముత్యపు నేల పై పడి మెరుస్తోంది.

ఆ మందిరంలోని హంసతూలికా తల్పం ప్రక్కన ఉన్న ఆసనంలో దశరథ మహారాజు కూర్చొని ఉన్నాడు. మహారాజు కొంత ఆలోచనగా, కొంత విచారంగా ఉన్నాడు. ఆయనకు సేవకులు చెప్పిన విషయం ఏ మాత్రం మనస్సుకు పట్టలేదు. విచిత్రంగా కూడా ఉంది.

కారణం ఆయన ప్రియకుమారుడు, పెద్దవాడు అయిన రాముని గురించినదే ఆ విషయం.

రామచంద్రుడు అప్పటికే విద్యాభ్యాసం ముగించుకు వచ్చాడు. లోకజ్ఞానం కోసం, ప్రజల గురించి తెలుసుకోవటానికి సోదరులు నలుగురూ ఒక ఏడాది తీర్థయాత్రలు కూడా చేసి వచ్చారు.

తీర్థయాత్రల నుంచి వచ్చినది మొదలుగా రాముని ప్రవర్తన వింతగా మారింది. అతను మిగిలిన వారితో కలవటం లేదు. లేచి చురుకుగా తిరగటం, ఆటలాడటం, వేట ఇత్యాది విషయాలను పట్టించుకోవటం లేదదు. మంచి బట్టలు కట్టడం, యుక్త వయస్సు వారి కుండే ఉల్లాసం కనపర్చటం లేదు.

ఒక్కడే ఎప్పుడూ తన మందిరంలో ఉండిపోతున్నాడు. సేవకులు బలవంతంగా లేపితే లేచి కాలకృత్యాలు తీర్చుకుంటున్నాడు.

ఆహరం తినటం దాదాపు మానివేశాడు. ఎండాకాలపు నదిలా చిక్కిపోతున్నాడని సేవకులు వచ్చి ఆందోళనగా చెప్పారు.

సదా పద్మాసనం వేసుకు ఒక మూల కూర్చుంటున్నాడని సేవకులు కంగారుగా మహారాజుకు ఈ విషయం విన్నవించారు.

మొదట ఆయన పట్టించుకోలేదు. కాని తిరిగి మళ్ళీ అదే విషయం విన్నప్పుడు రాముడు ఆందోళన చెందాడు. ఇక ఉపేక్షిస్తే లాభంలేదని అనుకున్నాడు.

మానవుల మనస్సులలో పలు విభిన్నమయిన చింతనలు ఎలరేగుతాయి. వాటి స్వరూపాలు గ్రహించి, సరయిన దారి చూపకపొతే! ‘యుక్త వయస్సుకొచ్చినప్పుడు అట్టి ప్రవర్తన  సహజమేగా!’ అనుకున్నాడాయన.

సేవకులతో  రాముడి దినచర్యను గమనించి తనకు చెప్పమని ఆజ్ఞ ఇచ్చాడు.

సేవకులు మరునాడు తీసుకు వచ్చిన వార్త ఆయనను ఆలోచనలో పడేసింది.

రాముడు ఎలాంటి  ఉద్విగ్నతను  ప్రదర్శించటం  లేదు. ఎలాంటి ఆందోళనలోలేడు. ఎలాంటి వికారం లేదు. నిర్మోహంగా, నిర్వికారంగా ఆలోచనల్లో ఉండి ఈ ప్రపంచాన్ని పట్టించుకోవటం లేదు. ఎవరితో మాట్లాడటంలేదు. ఎవరయినా పలకరించినా చిరునవ్వు తప్ప మరో సమాధానంలేదు.  ఈ విషయం వింతగా తోచింది. ప్రియ కుమారుడు, జ్యేష్ఠుడైన రామునికి కలిగిన కష్టమేమిటా అని అనుకున్నాడాయన. ఆ విషయమై ఆలోచనలతో ఆ రాత్రి కరిగిపోయింది దశరథునికి.

మహారాజు మరుసటిరోజు కులగురువులైన వశిష్ఠుల వారిని పిలిచారు.

వశిష్ఠుల వారు రాజుగారిని కలువటానికి శిష్యులతో కూడి వచ్చారు.

వచ్చిన కులగురువులకు ఆర్ఘ్య పాద్యాలు ఇచ్చి ఆసనం పై కూర్చోబెట్టాడు. సంభాషణ ప్రారంభిస్తూ

“గురుదేవా! మీరు మా కుల గురువులు. మా మంచిని సదా కోరుతూ మాకు మార్గ నిర్దేశం చేసే పూజ్యులు. ఈ రోజు ఒక సమస్య మమ్ములను కష్టపెడుతోంది..” అన్నాడు నెమ్మదిగా.

“మహారాజా! మీ వంశం ఆచంద్రతారార్కం తేజరిల్లాలి. మీ పెద్దలు మీకు సదా దీవెనలు ఇవ్వాలి. ప్రజల్లెల్ల సుఖంగా ఉన్నారు కదా. మీకొచ్చిన కష్టమేమి?” అంటూ మృదువుగా అడిగాడు మహర్షి.

దశరథుడు తనకు సేవకులు రాముని గురించి చెప్పిన విషయాన్ని వివరించాడు కులగురువుకు.

వశిష్ఠుల వారు కొంత సేపు ఆలోచించాడు.

తరువాత నెమ్మదిగా “మహారాజా! గొప్పవాళ్ళుకు అల్పమైన విషయాలకు కోపం రాదు. సంతోషము రాదు. దుఃఖము కూడా కలగదు. రాముడు మేఘగంభీర స్వభావుడు. ఏదో లోతైన విషయము ఉండబట్టే అలా ప్రవర్తిస్తున్నాడు..” అన్నాడు.

దశరథుడు కంగారుగా “గురుదేవా! తరుణోపాయమేమి?” అన్నాడు

“సమయం వచ్చినప్పుడు అన్నీ సర్దుకుంటాయి. మీరు ఆందోళన పడకండి. సమయం కోసం మనము ఎదురుచూడటమే ప్రస్తుతం చెయ్యగలిగేది. రామచంద్రుడు సామాన్యుడు కాదు. అతడికి సామాన్య ప్రామాణికాలు వర్తించవు. మీరు ఎలాంటి చింత పెట్టుకోకండి. రాముడిని ఏదో తీవ్రంగా ఆలోచనకు గురిచేస్తున్నట్టున్నది. రాముడు నా దగ్గర రాకుండా వుండడు. అప్పుడు నేను విషయం కనుక్కుని పరిష్కరిస్తాను.” అని ఊరడించి నిష్క్రమించాడు.

***

దశరథుడు సభలో ఉన్నాడు. విశ్వామిత్రుడు వచ్చాడని వార్త తెచ్చాడు ద్వారం వద్ద ఉండే సేవకుడు..

కొంత తత్తరపడ్డాడు మహారాజు.

ఇదేమిటి ఈ ముని అకస్మాత్తుగా వచ్చాడనుకున్నాడు. ఏ విషయం బయటపడకుండా సభకు ఆహ్వానించి ఆర్ఘ్యపాద్యాదులు ఇచ్చి పూజించి నమస్కరించాడు.

“ఓ విశ్వామిత్ర మహర్షి! స్వాగతం. ఎంతో సంతోషన్ని కలిగిస్తోంది మీ రాక. మీ దర్శనం వలన మేము ఎంతో పవిత్రలమయ్యాము. మీరు ఎందుకు వచ్చారో ఆ పని జరిగినదనే అనుకోండి. మీరు కోరినది మీ పాదాల వద్ద పెట్టటానికి సిద్ధం..” అన్నాడు వినయంగా దశరథుడు.

విశ్వామిత్రుడు సంతోషపడ్డాడు.

“రాజా! నీకు శుభం. నీ ప్రజలకు, రాజ్యానికి శుభమగు గాక. నేనో పని మీద వచ్చాను. నాకు సహాయం కావాలి..” అన్నాడు విశ్వామిత్ర ముని.

“ఏ సహాయమైనా సరే, జరిగినదనే అనుకోండి మునివర్యా!” అన్నాడు దశరథుడు.

“రాజా! నేను ఒక మహాయాగం తలపెట్టాను. దానిని ఎలాంటి ఆటంకాలు లేకుండా జరపాలి. కాని కొందరు దానవులు యజ్ఞాన్ని ధ్వంసం చేస్తున్నారు. మేము యాగమప్పుడు శాంతులమై ఉండాలి. మా యాగం జరగటానికి రక్షణగా నీ పెద్ద కుమరుడు రాముని పంపు!!” అన్నాడు ముని.

దశరథుడికి క్షణకాలం ప్రపంచం ఆగింది.

అతను కొంచం తేరుకొని “మహాముని! మీకు తెలియనిది ఏముంది? రాముడు నా బహిర్ ప్రాణం. ముక్కుపచ్చలారని బాలుడు. నేను రాముని విడిచి బ్రతకలేను. మీకు కావలసినంత సైన్యమిచ్చి పంపుతా. అదీ కాదంటే నేనే వచ్చి యాగరక్షణ చేస్తాను. కానీ రాముని పంపలేను. పసిబాలుడు. ఆ క్రూర దానవులను ఎదిరించలేడు…” వేడుకోలుగా అన్నాడు.

విశ్వామిత్రుడు కన్నుల నుంచి నిప్పులు కురిపిస్తూ

“రాజా! రాముడు బలవంతుడు. ధైర్యవంతుడు. దానవులను ఎదిరించగల ధీశాలి. పైగా నీవు మాట ఇచ్చావు. ఇచ్చిన మాట తప్పుతావా? ప్రతిజ్ఞాభంగం చేసినవాడిలా మిగిలిపోతావు. నేను వెళతాను..” రౌద్రంగా అంటూ దిగ్గున లేచాడు.

వశిష్ఠుడు లేచి వచ్చి విశ్వామిత్రుడ్ని ఆపాడు.

మహారాజును ప్రక్కకు తీసుకుపోయాడు. “మహారాజు! ఇచ్చిన మాట తప్పకు. రాముని పంపు. ఏమీ కాదు. అంతా మంచే జరుగుతుంది..” సముదాయించాడు.

దశరథుడు కులగురువు మాట మన్నించాడు. రాముని పిలుచుకు రమ్మని సేవకులను పంపాడు.

రాజసేవకుడు రాముని పరిస్థితి తెలిసినవాడు.

సేవకుడు వినయంగా “మహాప్రభూ! రాముడు తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చినప్పట్నుంచి అదొక విధంగా ఉన్నాడు…” అంటూ మునుపు దశరథ మహారాజుకు చెప్పిన వివరాలన్ని విన్నవించాడు.

విశ్వామిత్రుడు ఆ విషయం విని సంతోషపడ్డాడు.

“రామభృత్యుడా! నీవు చెప్పినది వింటే ఆనందం కలుగుతోంది. దిగులు పడకు. రాముడిని తీసుకు రా. రాముడు తప్పక వస్తాడు. గురువు మాట, తండ్రి మాట రాముడు కాదనడు..” అంటూ ప్రోత్సహించాడు.

అటు పై సభ వైపు తిరిగి, “సభికులారా! రాముని గురించి వింటే మీకు తెలిసే ఉంటుంది.. రామునికి వైరాగ్యం కలిగింది. ఇది ఆపత్తు వల్లనో, రోగం వల్లనో, కామం వల్లనో కాక వివేకం వల్ల కలిగింది. ఇది సంతోషకరమైన విషయం..” అంటూ మహారాజుతో “దశరథ మహాహరాజా! రాముని గురించి దిగులు వద్దు. రాముని చిత్తం జ్ఞానవైరాగ్యాలతో నిండి ఉంది. కాకపోతే స్వధర్మాచరణ విషయమై లేశమాత్రం శంక వల్ల ఇలా చింతాగ్రస్థుడైనాడని నాకనిపిస్తోంది. ఆ శంక తీరిస్తే జీవన్మక్తుడిగా రాజపాలన చెయ్యగలడు..” అంటూ విశ్వామిత్రుడు చెబుతుండగా

రాముడు సోదర సమేతుడై సభలోనికి వచ్చాడు.

ఆనంద స్వరూపుడు, ఆజానుబాహుడు, పూర్ణ తేజస్సుతో వెలుగుతూ సోదర సమేతంగా రాముడు సభలోకి రాగానే సభలో అందరూ సంతోషంగా జయజయధ్వనులు చేశారు. రాముని రాక సభలోని వారికి ఆనందాన్ని నింపింది.

రాముడు అందరికీ వందనాలర్పించి వచ్చి సభ మధ్య నేల మీద కూర్చున్నాడు.

అతనికి ఇచ్చిన ఆసనం వైపు చూడనన్నా లేదు.

దశరథుడు రామునితో, “కుమారా! వశిష్ఠ ముని వద్ద జ్ఞానసముపార్జన చేసిన నీవు ఇలా చింతలో మునిగి ఉండు కారణమేమి? ఇక్కడ కుల గురువులు ఉన్నారు. విశ్వామిత్ర మహాముని ఉన్నారు. నీ సందేహం తీర్చుకో. ఆ చింత మాను నాయనా!!” ఎంతో లలానగా చెప్పాడు.

అప్పుడు రాముడు తన మనస్సులో ఉన్న విషయాలను

“కిం నామేదం బతసుఖం యేయం సంసార సంతతిః।
జాయతే మృతయే లోకో, మ్రియతే జననాయచ॥”

(ఈ సంసారంలో సుఖం ఎక్కడ ఉంది. పుట్టటం చావటం కోసమే తప్ప సుఖం లేదు) అని ప్రకటించాడు. “ఇదే నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది. మనిషి నిరంతరం సుఖం కొరకు అన్వేషిస్తూ దుఖం పొందుతాడు. సుఖం ఆశలో దుఃఖాన్నీ సంతోషంగా అనుభవిస్తాడు. మరింత దుఃఖం పొందుతాడు. జీవితమంతా సుఖం కోసం తపిస్తూ దుఃఖంలో జీవిస్తాడు. తాను వెతుకుతున్న సుఖం, సంతృప్తులు తనలోనే వున్నాయని గ్రహించలేడు. చెప్తే అర్థం కాదిది. ఇది  తలపుకు వచ్చి దేని మీదా మనసు నిలవటం లేదు. ఏ పని చేపట్టాలన్నా నేనెవ్వరిని, నేను సాధించేదేమిటి అన్న సందేహం వస్తోంది. ఇదీ నా సమస్య.. దీనికి పరిష్కారం వుందా?”

రాముని ఈ వైరాగ్యానికి వశిష్ఠుల వారు సమాధానమిచ్చారు.

“పూర్వమ్ ఉక్తం భగవతా యత్ ‘జ్ఞానం’ పద్మజననా!
సర్గదౌ, లోకశాంత్యర్థం తదిదం కథయామ్యహమ్॥”

“ప్రియశిష్యుడైన ఓ రామచంద్రా! పూర్వం సృష్టికి ముందు బ్రహ్మదేవుడు చెప్పిన ఆత్మ తత్త్వం నీకు చెబుతాను. వినుము..” అంటూ రామునికి బోధ ప్రారంభించాడు  వసిష్ఠుడు.

“పరమాణౌ పరమాణౌ చిదాకాశః స్వకోటరే।
జగల్లక్ష్మీ సహస్రాహి ధత్తే కృత్వాథపశ్యతి॥”

ఈ శ్లోకానికి మాములు అర్థం – చిదాకాశమనే పేరు గల పరమాత్మ, తనలోతానే ఒక చిల్లిని అనగా ఆకాశాన్ని కల్పించుకొని, దానిలోని ప్రతి పరమాణువులోనూవేల కొలది జగత్తునుసృష్టించి, ధరించి, చూస్తూ ఉంటాడు”.

గురువుగారు చెప్తున్నది రాముడికి అర్థం అయింది. ఇతరులకు అర్థం కాలేదు. “మాకు వివరంగా చెప్పండి” అన్నారు.

“పరమాత్మ చిదాకాశం. చిదాభాస ఈశ్వరుడే అంతఃకరణ ప్రతిబింబ జీవుడు. అంటే, మాయప్రతిబిండయిన చిదాభాసుడిని ఈశ్వరుడంటారు. అంతఃకరణంలో ప్రతిబింబిస్తే జీవుడంటారు.”

“చిదాభాసం అంటే?”

“చిదాభాసం అంటే చిత్తునుండి అభాసగా తోచిన అహంవృత్తి. అంటే ఒకటిగా తోచిన అహంవృత్తి (సత్త్వ) రజస్తమోగుణ సంపర్కం వల్ల మూడై, ఆ మూడింటితో పంచభూతోత్పత్తియై ఆ అయిదింటి వల్ల అనేకం కలిగిందని అర్థం. అదే శరీరం నేననే భ్రాంతిని కల్పిస్తుంది. నేను  అనేదెవరు? దేహమా? దేహం కన్నా భిన్నమయినదా? రూపంగా చెప్పవలసి వస్తే  చిదాకాశం, చిత్తాకాశం, భూతాకాశం అని మూడు విధాలుగా నిర్వచిస్తారు. చిదాకాశమే ఆత్మ తదాభాస (ప్రతిబింబ) మే చిత్తాకాసం; అంటే చిత్తమన్న మాట. ఆ చిత్తం మనోబుద్ధ్యహంకారములుగా మారినప్పుడు అంతఃకరణం అంటారు. కరణం అంటే ఉపకరణం అన్నమాట.  కాళ్ళు,  చేతులు మొదలైనవన్నీ  బాహ్యకరణాలనీ  లోపల పనిచేసే ఇంద్రియాలు  అంతఃకరణాలని అంటారు. ఆ అంతకరణాలతో కూడిన  చిదాభాస్సుణ్ణే జీవుడంటారు. వస్తువైన చిదాకాశం యొక్క ఆభాసమైన చిత్తాకాశమే భూతాకాశాన్ని చూసేప్పుడు  మనో ఆకాశమనీ  వస్తువును చూసేప్పుడు  చిన్మయమనీ  అంటారు.  అందుకే ‘మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః ‘  అన్నారు. ఆ మనసే ఎన్నెన్ని బ్రాంతులనో కల్పిస్తుంది. అర్ధమయిందా?” చిరునవ్వుతో అడిగారు వశిష్ఠులవారు.

“అంటే, మొత్తం అంతా ఒకటేనా?”

“సర్వత్రా ఉన్నది ఒక్కటే అయినప్పుడు, అన్నీ ముందరే నిశ్చయించినప్పుడు ఇక మనము ఏ పనినైనా చెయ్యటం మాత్రం ఎందుకు?”  రాముడు ప్రశ్నించాడు.

“క్రియాశీలత్వం సృష్టి. అది లేనిదే సృష్టిలేదు. అయితే ఆత్మజ్ఞానాన్ని పొందిన తరువాత క్రియాశీలత్వంలో కోరికలు అణగిపోతాయి. జ్ఞానికి అజ్ఞానికి ప్రవర్తనలో తేడా వుండదు. తేడా వారి వారి దృక్కోణాల్లో వుంటుంది. అజ్ఞాని అహంతో తన చర్యలన్నిటినీ తనవిగా భావిస్తాడు. జ్ఞానికి అహం నశిస్తుంది. అతడు తానీ దేహానికి పరిమితం అనుకోడు. అప్పుడు పనిచేయటం ఏమిటి? నిర్వ్యాపారం ఏమిటి?

“విచారయాచార్య పరంపరాణాం
మతేన సత్యేన సితేన తావత్
యావద్విశుద్ధం స్వయమేవ బుద్ధ్వా
హ్యనూన రూపం పరమభ్యుపైషి॥” అన్నారు వశిష్ఠులవారు.

పురుష ప్రయత్నంతో ఆ కర్మలను జయించవచ్చు. పురుష ప్రయత్నం ద్వారా విచారం (వివేకవంతమైన ఆలోచనలు) చేస్తూ ఎవరికి వారే తనలోని బ్రహ్మతత్త్వన్ని సాక్షాత్కరించుకోగలరు.” అన్నాడు వశిష్ఠుడు.

ఇతరులంతా అయోమయంగా చూశారు.

శ్రీ రామచంద్రుడు శాంతంగా నవ్వాడు.

రాముడి వదనంపై చిరునవ్వు వెన్నెలలా పరచుకుంది. ఆ వెన్నెల ప్రవాహంలో  అందరూ స్నానమాడి సంతోష తరంగాలపై ఉయ్యాలలూగారు.

రాముడు, సోదరుడితో కలసి విశ్వామిత్రుడి వెంట వెళ్ళాడు.

***

తరువాత వశిష్ఠుడు రాముడికి ఏకాంతంలో  తత్త్వ, వివేక, జ్ఞానాన్నిబోధించాడు.

వశిష్ఠుడి బోధనను అర్ధం చేసుకున్న రాముడు తన స్వస్వరూపం గ్రహించాడు. ఆ రోజు నుంచీ రాముడి వదనంపై దుఃఖ ఛాయలనెవ్వరూ చూడలేదు. అందరూ దుఃఖంగా భావించింది, పైకి కనబడే భావ ప్రకటన తప్ప అంతరంగంలోని నిశ్చలత్వం ఎవరి బుద్ధికీ అందలేదు.  తన కర్తవ్యాన్ని నిర్మోహంగా నిర్వహించాడు. కానీ మానవ శారీరక పరిమితులకు లోబడి సుఖదుఃఖాలను అనుభవించాడు సామాన్యుడిలా. అంతరంగంలో, సుఖదుఃఖాలకతీతమైన నిర్మోహమైన  ఆనందాంబుధిలో నిశ్చల తరంగాలపై స్థిరంగా  నిలిచాడు. ఈ రహస్యం  ఒక్క వశిష్ఠుడికే తెలుసు.

***

 రాముడికి  వశిష్ఠుడు వివరించిన ఆధ్యాత్మిక, యోగిక  వివరాలన్నీ కలిపి దాదాపు 32 వేల శ్లోకాలుగా వాల్మీకి ముని రచించాడు.

ఇది మూల రామాయణంలో కలిపితే నిడివి పెరుగుతుందని ముని దీనిని విడిగా ప్రచరించాడు. ఈ గ్రంథం ఆరు ప్రకరణాలుగా విభజించబడింది. అవి వైరాగ్య, ముముక్షు వవ్యహార, ఉత్పత్తి, స్థితి, ఉపశమ, నిర్వాణ ప్రకరణలు.

విస్తారంగా ఉదాహరణలతో ఉన్న ఈ గ్రంథరాజ్యం సాధకులకు మార్గదర్శకం చేసే అత్త్యంత ఉత్తమమైన గ్రంథంగా పేరుపొందింది.

ఇది  “వశిష్ఠ రామ సంవాదం, యోగవాశిష్ఠము, వశిష్ఠ గీత, జ్ఞాన వాశిష్ఠము” అన్న పేర్లతో ప్రసిద్ధి చెందింది.

ఈ బోధ పూర్తి అయ్యే సరికే ప్రతి వ్యక్తికి  సమస్త చింతలకూ సమాధానం దొరుకుతుంది.

ఎండలో ఉన్నది ఎలా ఎండిపోతుందో సాధకులకు తమ అజ్ఞానం ఎండిపోయి జ్ఞానం అందుతుంది. ఇది పూర్ణ జ్ఞానం. దీనిని శ్రద్ధగా చదివితే ఆత్మజ్ఞానం కలుగుతుందని జ్ఞానులైన పెద్దలు ఉటంకించారు. ఇది మూల రామాయణానికన్నా వేరుగా ఉంటుంది. ఎన్నో ఉపాఖ్యానాలతో కూడి ఉంటుంది. ఇందులోని ఉపాఖ్యానాలు మేధావులను సైతం ఆశ్చర్య కొలుపుతాయి. రాముని ప్రశ్నలు, వశిష్ఠులవారి సమాధానాలతో తత్త్వ, వివేక, జ్ఞానాన్ని ఇచ్చే పూర్ణ గ్రంథంగా పేరుపొందింది.

ఆ ఆత్మతత్త్వం గ్రహించి, జీవన్ముక్తుడయిన రాముడు తన జీవితాన్ని ధర్మబద్ధంగా గడిపాడు. కాబట్టే రాముని చరిత్ర సూర్య చంద్రులున్నంత కాలము మానవులను నడిపించే కథలా ఈ నేల మీద నిలబడిపోయింది. మనకు రాముడు అందుకే ఆదర్శపురుషుడైనాడు.

శ్రీరామ శరణం సదా – శ్రీరామ శరణం మమ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here