శ్రీశైల మల్లయ్యా! దైవమే నీవయ్యా!!

2
11

[నంద్యాల సుధామణి గారు రచించిన ‘శ్రీశైల మల్లయ్యా! దైవమే నీవయ్యా!!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]ది హైదరాబాద్ లోని శివార్లలో ఓ పేద్ద అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్! వేలాది ఫ్లాట్లు.. అక్కడ వుండేవాళ్లు ఎక్కువ మంది ఐ.టి. ఉద్యోగులే!

ఉత్తరాది నించీ దక్షిణానికి వలసలు పెరిగాయన్న మాటను నిజం చేస్తూ ఎక్కువ మంది ఉత్తర భారతీయులే వుంటారు. తెలుగువాళ్లూ చాలా మందే వున్నారు. మొత్తం మీద దేశంలోని అన్ని రాష్ట్రాల జనాభాతో మినీ భారతదేశంలా వుంటుంది ఆ గేటెడ్ కమ్యూనిటీ.

రోజల్లా ఇళ్లలో, బళ్లలో.. గూళ్ల ల్లోని గువ్వపిట్టల్లా వున్న పిల్లలను తీసుకుని పార్కుల్లోకి దారి తీస్తున్నారు తల్లులూ.. తండ్రులూ.. పనిమనుషులూ! పిల్లలు చెర నుండి బయటపడిన ఖైదీల్లా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు తాత్కాలికంగానైనా.

ప్లేయింగ్ జోన్సన్నీ పిల్లలతో, వారి తల్లిదండ్రులతో నిండిపోయాయి.

పదవీవిరమణ చేసిన మగవాళ్లు కొందరు కొన్ని బెంచీలను ఆక్రమించేసుకుని కూర్చున్నారు. వచ్చే ఎన్నికల గురించిన చర్చల్లో నిమగ్నమై వున్నారు.

కొందరు ఉత్తరాది స్త్రీలు హనుమాన్ చాలీసా పారాయణం చేసి, భజనలోకి దిగారు.

అప్పుడే ఆఫీసుల నుంచి వచ్చిన తల్లిదండ్రులు తమ పిల్లల కోసం పార్కులలో వెదుక్కుంటూ, వాళ్లను ఇళ్లకు తీసుకెళ్తున్నారు.

బ్రిస్క్ వాక్‌లు చేసే యువతీ యువకులు, బాస్కెట్ బాల్, క్రికెట్, ఫుట్ బాల్ వంటి రకరకాల ఆటలు ఆడేవాళ్లూ, సైకిళ్లు తొక్కేవాళ్లూ, మోకాళ్ల నొప్పులతో నిదానంగా నడిచే వృద్ధులూ, స్విమ్మింగ్ పూల్స్‌లో ఈతలు కొట్టేవాళ్లూ, జిమ్‌లో క్యాలరీలను కరిగించేవాళ్లూ ఇలా పరమ కోలాహలంగా వుంది ఆ ప్రాంతమంతా.

కాంప్లెక్స్ చుట్టూ రెండు రౌండ్లు తిరిగి అలసటగా మా రాతి బెంచీల వైపు వెళ్లి కూలబడ్డాను. ఆ బెంచీలు ఒక మూలగా వుంటాయి. మా గ్రూప్‌లో ఎవరు ముందరొస్తే వాళ్లు ఒక బెంచీని ఆక్రమించి సిద్ధంగా వుంచుతారు. అదృష్టం బావుంటే ఎదురుగా వుండే బెంచీ కూడా దొరుకుతుంది.

రామలక్ష్మి యేదో చెబుతోంది. శారద, ప్రీతి, జానకి శ్రద్ధగా వింటున్నారు.

శ్రీశైలం ప్రాంతానికి దగ్గరలో వున్న ఆత్మకూరు దగ్గరున్న సిద్ధాపురం రామలక్ష్మి సొంతవూరు. భర్త టీచర్‌గా చేసి రిటైరయ్యారు. కొడుకు హైదరాబాదులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండటం వల్ల ఇక్కడ వుంటున్నారు.

కానీ వాళ్లిద్దరి మనసులూ ఎప్పుడూ వాళ్ల వూరి పైనే వుంటాయి. శివరాత్రి ముందర మాత్రం తప్పక వాళ్ల వూరికి వెళ్లి, వారి ఊరిమీదుగా నడిచివెళ్లే శివభక్తులకు సేవలు చేసి వస్తుంటారు. శ్రీశైలం మహిమలన్నీ ఆమె కథలు కథలుగా వివరిస్తుంటుంది. కొన్నిసార్లు విన్నవే అయినా ఆ కబుర్లు అందరికీ భక్తి స్ఫూర్తిని కలిగిస్తుంటాయి.

కళ్లు విశాలం చేసి, ఆయా దృశ్యాలు తను మనసులో చూస్తూ మనకు కూడా కళ్ల ముందు కనిపించేలా చెబుతోంది రామలక్ష్మి.

“కార్తీకమాసం అప్పుడు కొంచెం తక్కువే గానీ, శివరాత్రి ముందర మావూరి మీది నించి ఎందరు శివభక్తులు పోతుంటారో తెలుసా?

బస్సులు, కార్లు, వ్యాన్ లలో పోయేవాళ్ల గురించి కాదు నేను చెప్పేది..

కర్నాటక నుంచీ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలనించీ కొన్ని వేల మంది కాలినడకన వస్తుంటారు తెలుసా ప్రీతీ! అంటే అయిదారు వందల కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ.. కేవలం స్వామి దర్శనం కోసం వస్తుంటారు. వాళ్లకు కొన్ని దగ్గర దారులు తెలిసి వుంటాయనుకో. అయినా చాలా దూరమే! వీళ్లలో మగవాళ్లతో పాటు ఆడవాళ్లు కూడా వస్తుంటారు. కాళ్లకు చెప్పులుండవు.

‘ఓం నమశ్శివాయ, శివాయనమః ఓం’ అన్న మంత్రాలు మారుమోగిపోతుంటాయి.

శంఖాలు వాయించేవాళ్లు కొందరు, త్రిశూలాలు పట్టుకునేవాళ్లు కొందరు, ఢమరుకాలు మోగిస్తూ నడిచేవాళ్లు కొందరు, డోలు మెడకు వేలాడదీసుకుని మోగించేవాళ్లు కొందరు, చిడతలు వాయిస్తూ భజనలు పాడేవాళ్లు కొందరు, చిన్నాపెద్దా పల్లకీలలో, కావడులలో పార్వతీ పరమేశ్వరుల ఫోటోలు పెట్టుకొనీ, శివలింగాలు పెట్టుకొనీ కొంతమంది వస్తుంటారు. కొందరు భజనలు పాడుతూ వుంటే, కొందరు నాట్యాలు చేస్తూ వుంటారు. వారిలో పురుషులు చేసే నాట్యాలు చూసి తీరాలి.

త్రిశూలాలు తిప్పుతూ, ఢమరుకాలు మోగిస్తూ, బలమైన పాద ముద్రలు వేస్తూ, వేగంగా తిరుగుతూ ‘హరోం హర హర’ అంటూ నాట్యం చేస్తూ వుంటే ప్రమథగణాలే నర్తిస్తున్నట్టు వుంటుంది తెలుసా! రోమాలు నిక్కబొడుచుకుంటాయి”

అందరం ఆమె మొహంలోకి చూస్తూ ఆ సంఘటనను కళ్ల ముందుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం శక్తి మేరకు!

“దారిలోని ఊళ్లలో బావులు, చెరువులు, కాలవల దగ్గరా ఆగి, స్నానాలు చేసుకుని, బట్టలు ఉతుక్కొని, వంటలు వండుకోని, దేవాలయాలలోనూ, సత్రాలలోనూ అప్పటికప్పుడు శుభ్రం చేసుకుని విడిదిచేస్తారు. చేసుకున్న ఆహార పదార్థాలను దేవుడికి నివేదిస్తారు. భజనలు చేస్తారు. ఒళ్లెరగకుండా నిద్రిస్తారు. మళ్లీ తెల్లవారుఝామునే లేచి, స్నానాదికాలూ, పూజలూ, ఉదయాహారాలూ ముగించుకుని, తిరిగి ప్రయాణం మొదలెడతారు.

వాళ్లను చూడటానికి చుట్టు పక్కల ఊళ్ల నుంచి తండోపతండాలుగా జనం వచ్చి నమస్కారం చేసుకుంటారు తెలుసా? అంతటి భక్తులకు నమస్కారం చేసుకుంటే పాపాలు పోతాయని భావిస్తారు.

ప్రతీ సంవత్సరం వచ్చే వాళ్లు కొందరు కొన్ని కొన్ని ఊళ్లలో కొందరిండ్లలో అలవాటుగా రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకొని పోతారు. వాళ్లు అనేక రోజుల నించీ ప్రయాణంలో వుండటంతో వస్త్రాలు చినుగులు పట్టి వుంటే వాళ్లకు కొత్తబట్టలు పెట్టి, దారిలో వాళ్లకు కావలసిన సామాను సమకూర్చి, డబ్బు ఇచ్చి సాగనంపేవారు ఆ ఇళ్ల యజమానులు.

మొదట్లో ఒకటి రెండు వేల సంఖ్యలో శివభక్తులు వచ్చేవాళ్లు. తర్వాత కాలంలో జనమూ అధికమైనారు. భక్తీ పెరిగింది. విపరీతంగా భక్తులు రావడం మొదలైంది.

మా చుట్టుపక్కల ఊళ్లవాళ్లకూ ఉత్సాహం పెరిగింది. కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో విరాళాలు సేకరించి ఆ దారిలో పెద్ద పెద్ద టెంట్లు వేయించడం, బోర్లు తవ్వించి నీళ్ల వసతి కల్పించడం, స్నానాల గదులు, మరుగుదొడ్లు యేర్పాటు చేయించడం వంటి సేవలు చేస్తున్నారు. పెద్ద పెద్ద వంటగదులు కట్టి వంటవాళ్లను యేర్పాటు చేసి, భోజనం నిరంతరాయంగా అందుబాటులో వుండేలాగా చెయ్యడం వంటి పనులు చేస్తున్నారు. డాక్టర్లను పిలిపించి యాత్రికులకు వైద్యం చేసి, ఉచితంగా మందులిప్పిస్తున్నారు.

ఆ దృశ్యం ఎంత బాగుంటుందో తెలుసా శారదా! నేను, మా ఆయనా సత్యసాయి సేవా సమాజంలో చేరి ప్రతి సంవత్సరమూ సేవ చేస్తాము” ఒక్కసారి ఆగి, అందరివైపూ చూసి చెప్పడం మొదలుపెట్టింది రామలక్ష్మి.

“యాత్రికులను కుర్చీల పైనా, అరుగుల పైనా కూర్చోబెడతాము. ముందు చల్లని నీళ్లతో కాళ్లు కడుగుతాము. కొందరి కాళ్లలో ముళ్లు దిగి వుంటాయి. వాటిని తీసి, కొబ్బరినూనె రాస్తాము. కాళ్లు నెర్రెలు చీలివుంటాయి కొందరికి. వారి కాళ్లకు ఆయింట్‌మెంట్‌లు పూసి, మర్దన చేస్తాము. వెచ్చని నీళ్ల బకెట్లలో వాళ్ల కాళ్లు వుంచి సేదతీరేలా చేస్తాము. మా ఊళ్ల లోని మగవాళ్లు యాత్రికులలోని మగవాళ్లకూ, ఆడవాళ్లకు ఆడవాళ్లు ఈ సేవలన్నీ చేస్తారు. ఒక్కోసారి స్త్రీ పురుష భేదం కూడా వుండదు. భగవద్భక్తునికి చేస్తే భగవంతునికే సేవచేసినట్టు భావిస్తారు. అంతే!

కొందరు పిల్లలు వాళ్ల ఒళ్లునొప్పులు తీరేలా ఒళ్లు పడతారు కూడా! అక్కడ కులభేదం లేనే లేదు. పేదా గొప్పా తేడా లేదు. యాత్రికులు శివస్వరూపులు. వాళ్లకు సేవచేసే మేము శివకింకరులం!

అంతదూరం నుంచీ, కాలి నడకతో, మా ఊరి పక్కన ఉన్న శివయ్యను దర్శించుకోవడానికి వాళ్లు అంత భక్తితో వస్తే.. అతిథులుగా, శివస్వరూపులుగా భావించి, వాళ్లను సేవించడం తమ అదృష్టంగా భావిస్తారు ఊరివాళ్లు.

యాత్రికుల్లో శ్రీమంతులూ వుంటారు. ఆడవాళ్లు బంగారు నగలు పెట్టుకుని భయం లేకుండా వస్తారు. మధ్యతరగతి వారు, పేదవారు కూడా వస్తారు. పురుషులందరూ విభూతి, కుంకుమ పెట్టుకుంటారు. కన్నడ స్త్రీలు కూడా విభూతి పట్టెలు పెట్టుకుని, మధ్యలో కుంకుమ పెట్టుకుంటారు. మరికొందరు నుదుటి నిండా పసుపు చిక్కగా రాసుకుని, మధ్యలో రూపాయకాసంత కుంకుమ పెట్టుకుంటారు. వాళ్లను చూస్తుంటే పార్వతీ దేవి స్వరూపాల్లా వుంటారు. మా ఊళ్లలోని ముత్తైదువులు వాళ్లకు పసుపుకుంకుమలు, తాంబులాలూ ఇచ్చి సత్కరిస్తారు.

వాళ్లు సేదతీరి తిరిగి ప్రయాణమయ్యేటప్పటికి వాళ్లకు కొత్త బట్టలు, దుప్పట్లూ, టూత్ బ్రష్‌లూ, పేస్టులూ, సబ్బులూ, బట్టల సబ్బులూ, నీళ్లసీసాలూ, పళ్ల రసాలూ, ఆవకాయలూ, పొడులు, పచ్చళ్లూ, బియ్యం, పప్పులూ, మందులూ, టార్చిలైట్లు, దోమల బ్యాట్‌లూ, దోమల మ్యాట్లూ, దోమలు కుట్టకుండా క్రీములూ అన్నీ ఎవరికేమి కావాలో అవన్నీ సమకూర్చుతారు.

ఆ దృశ్యం చూడటానికి రెండు కండ్లు చాలవనుకో! వాళ్ల భక్తి ముందర మనమెంత? మనం చేసేదెంత? అనిపిస్తుంది. ఇంకా యేమైనా చేద్దాం.. వాళ్లకు సేవ చేస్తే శివయ్యకు మన మీద కూడా దయ కలుగుతుందేమో.. అనిపిస్తుంటుంది.

మన ప్రాంతంలో అంతటి పరమేశ్వరుడు అమ్మవారితో పాటు వెలసి వుండటం మా పూర్వజన్మ సుకృతం.. అనిపిస్తుంది. అంతటి స్వామి కోసం ఇంత కష్టపడి భక్తులు వస్తుంటే మనం చేతులు ముడుచుకుని ఎట్లా కూర్చుంటాం.. చెప్పండి!

ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాలలోని ఇతర ప్రాంతాల వాళ్లు కూడా వెంకటాపురం అనే వూరి దాకా వాహనాల మీద వచ్చి, అక్కడి నుంచీ దాదాపు ఎనభై కిలోమీటర్ల దూరం నడిచి శ్రీశైలం చేరుకుంటారు” ఊపిరి తీసుకోవడానికి అన్నట్టు ఆగింది రామలక్ష్మి.

ప్రీతి కళ్ల వెంట ఆనంద బాష్పాలు.. కాదు.. కాదు.. భక్తి బాష్పాలు రాలుస్తూ.. రామలక్ష్మి భుజం మీద తల ఆన్చి, “ఆంటీ! మీరెంత పుణ్యాత్ములు! ఎంతటి సేవ చేశారు! చేస్తున్నారు! కేవలం స్వామిపై భక్తితో, ఆయనను చూడటానికి వందల కిలోమీటర్ల దూరం ఉట్టి కాళ్లతో ఆ మహా భక్తులు నడిచి రావడమా? మీరు వాళ్ల కాళ్లు కడిగి, ముళ్లు తీసి, సేవలు చెయ్యడమా? మీరెంత పుణ్యం సంపాదించుకున్నారు ఆంటీ” అంది రామలక్ష్మి భుజంపై తలను రాస్తూ.

ప్రీతి కళ్లు తన చీరకొంగుతో తుడిచింది రామలక్ష్మి. ఆమె భుజం చుట్టూ చేయి వేసి, తన తల ప్రీతి తలకు ఆన్చి ఆమెను గోము చేసింది. “నీకు పిల్లలతో వీలు కుదరదని ఆగాను గానీ, లేకపోతే నేను శివరాత్రికి మావూరికి నిన్ను తీసికెళ్లేదాన్ని ప్రీతీ!” ప్రేమగా ఆమె ముఖాన్ని నిమురుతూ చెప్పింది రామలక్ష్మి.

ప్రీతిని మేము అందరం మా కూతురులాగా చూసుకుంటాము.

“ప్రీతీ! అప్పుడే నీ భక్తి బాష్పాలను అయిపోజేసుకోవద్దు. ఇందిరగారు చెప్పేది కూడా విను. మరి ఇంత ప్రేమతో అంతదూరం నుంచి వచ్చిన భక్తులు స్వామిని కలకండ పెచ్చులతో ఎలా కొడతారో కూడా తెలుసుకో!” అన్నది నా వైపు చూస్తూ జానకి.

“చెప్పండి ఆంటీ! మీ తాతగారు శ్రీశైలంలో ధర్మకర్తగా చేశారని మీరు చెప్పారు ఒకసారి! స్వామితో వాళ్ల అనుభవాలన్నీ వినాలని వుంది. చెప్పండి.. చెప్పండి.. అయినా కలకండ పెచ్చులతో స్వామిని కొట్టడమేమిటి?” అని నా వైపు తిరిగి ఆత్రుతగా అడిగింది ప్రీతి.

ప్రీతి మా ‘వాకీ.. టాకీ’ గ్రూప్‌లో అందరికంటే చిన్నది. మేమంతా అరవైయేళ్లు పైబడ్డ వాళ్లమే! తను ముఫ్ఫయ్ అయిదేళ్ల పిల్ల. చాలా చురుకుగా వుంటుంది. కలగలుపుగా వుంటుంది. ముందు సాఫ్ట్‌వేర్‌లో పనిచేసి, పిల్లల పెంపకం కోసం కొన్నేళ్లు మానేసింది. ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దవాళ్లయ్యాక పార్ట్ టైమ్ లెక్చెరర్‌గా పనిచేస్తోంది. చాలా భక్తి. మా గ్రూప్‌లో ఎప్పుడూ దైవసంబంధమైన చర్చలు జరుగుతూంటాయి. అవి వినడానికి మా దగ్గరికి వచ్చి కాసేపు గడుపుతుంది. ఈ మధ్యే పరిచయం అయింది ఆ అమ్మాయి.

నేను శ్రీశైలం గురించి మా పెద్దమ్మగారు చెప్పిన విషయాలు మనసులోకి తెచ్చుకుంటూ చెప్పడం మొదలెట్టాను.

“మా తాతగారు శ్రీ పాణ్యం రామయ్యగారు వృత్తిరీత్యా లాయరు. కర్నూలు జిల్లా కోవెల కుంట్ల అనే ఊరు వారిది!

శ్రీశైలదేవస్థానంలో పుష్పగిరి పీఠం తరఫున ధర్మకర్తగా పని చేసేవారు. మా తాత, అవ్వా సంవత్సరంలో ఒకటి రెండు నెలలు అక్కడే వుండి పోయేవారట! వాళ్లు ఎన్నో విశేషాలు చెప్పేవారని మా పెద్దమ్మగారు చెప్పేవారు ప్రీతీ! పెద్దమ్మగారు బాలవితంతువు. పరమ భాగవతోత్తమురాలు! ఆమె కూడా వారితో వెళ్లి తృప్తిదీరా స్వామిని, అమ్మవారిని సేవించుకునేది. ఆ కాలంలో అంటే.. 1930 ప్రాంతంలో ఎన్నో కష్టాలు పడి శ్రీశైలం చేరుకునేవారట.

ఇప్పట్లో నేరుగా రోడ్డుమీద నడవడం కొంత సులభమే! అప్పుడు సరైన రోడ్డు వుండేది కాదు. నిటారైన కొండనెక్కేటప్పుడు వుంటాయట వారి తిప్పలు!

ఇప్పుడు కొండ పైన కూడా చక్కగా చదును చేశారు.. మంచి రోడ్డు వేశారు. పూర్వకాలంలో కొండ చాలా నిటారుగా వుండేదట!

‘చేదుకో మల్లయ్యా! చేదుకో మల్లయ్యా! ఆదుకో మల్లయ్యా!’ అని అరుస్తూ కొండనెక్కేవారట ఆ రోజుల్లో. ఎక్కినంతసేపూ అదే నినాదమే!

మా తాతా అవ్వా మొదట్లో గుర్రాల మీద వెళ్లేవారట. కొంచెం రస్తా యేర్పడిన తర్వాత ఎద్దుల బండిలో వెళ్లేవారట! రోడ్డు పడిం తర్వాత కారులో వెళ్లేవారట.

ఎలాగో అష్టకష్టాలు పడి చేరుకుంటారు కొండ పైకి. అక్కడ కులాల వారీగా సత్రాలుంటాయి. అక్కడికెళ్లి సామాన్లు పడేసి, స్నానమైనా చెయ్యకుండానే, కాళ్లయినా కడుక్కోకుండానే ఆ మురికి బట్టల తోనే ధూళి దర్శనానికి బయలు దేరుతారు.

ఆ మల్లికార్జునుడిని చూడగానే దూరదేశంలో వుండిపోయిన తండ్రిని చాలా రోజుల తర్వాత చూస్తే.. ఇన్నాళ్లూ తమను పట్టించుకోలేదన్నట్టుగా, తమ కష్టాలకు కారణం ఆయనేనన్నట్టుగా పిల్లలకు వచ్చే భావోద్వేగం లాంటిది కలుగుతుంది. దాంతో స్వామిపై నిష్ఠూరం, కోపం, బాధ అన్నీ కలగలిపి వచ్చేస్తాయట!

స్వామి ఆలయంలో కూర్చుని వాళ్లు ఎన్ని కష్టాలకోర్చి ఆయనను చూడడానికి వచ్చారో రకరకాలుగా వాళ్ల భాషలలో వర్ణిస్తారట!

ఆ సంవత్సరం పంటలు ఎలా పండినాయో, వానలు ఎలా పడ్డాయో చెబుతారట. పిల్లల గురించీ, వాళ్ల పెళ్లిళ్లూ, పేరంటాలూ, చదువులూ గురించి చెప్తారట. ఎన్ని కష్టాలు పడి, ఎన్ని ఖర్చుల కోర్చి ఈ ప్రయాణపు యేర్పాట్లు చేసుకున్నారో, రోజుల తరబడి ఎలా నడిచి వచ్చారో.. కాళ్లు ఎట్లా పుండ్లు పడినాయో, చెట్లకొమ్మలు తగిలి ఒళ్లు ఎలా చీరుకుపోయిందో, దారిలో క్రూరమృగాలు ఎట్లా భయపెట్టాయో, దొంగలబారి నించి ఎట్లా తప్పించుకున్నారో, స్వామి దయతో ఈ అవరోధాల నించి ఎట్లా బయటపడ్డారో వివరిస్తారట!

ఈసారి నిన్ను చూడడానికి రాలేమేమో అనుకున్నాం! కానీ, నిన్ను చూడకుండా వుండలేక, నీ కోసం, అమ్మ కోసం వచ్చామని చెప్తారట! ‘నా ఒంటిమీద దెబ్బలేని చోటు అంటూ వుందా? నువ్వే చూడు!’ అని ఆక్రోశిస్తారు. వారి బాధను అర్థం చేసుకున్నానన్నట్టుగా స్వామి శిరస్సుపై వున్న పువ్వులు జలజలా రాలుతాయట!

కొందరు కన్నడిగులైతే భ్రమరాంబా దేవిని తమ మైసూరు మహారాజా వారింటి ఆడబడుచుగా భావిస్తారట!

‘అంతటి సుకుమారియైన మా రాకుమారిని పెండ్లాడి, ఆమెను ఇంతటి అడవిలో ఉంచుతావా? మా ఆడపిల్లను ఇన్ని బాధలు పెడతావా? ఆమె భర్తవైనందుకు, మాకు అల్లుడివైనందుకు నిన్ను చూడడానికి ఇంత దూరం వస్తున్నాం తెలుసా?’ అని నిష్ఠూరాలాడుతూ తమతో తెచ్చుకున్న కలకండ పెచ్చులను శివుడిపై విసురుతారట! ‘స్వీట్ రివెంజ్’ అంటే ఇదే కదా!” ఆగాను నేను అందరి వైపూ చూస్తూ.

అందరూ సంభ్రమంగా నవ్వారు. అలనాటి భక్తుల భావోద్వేగాలు వాళ్ల కళ్లలో స్పష్టంగా కనబడ్డాయి నాకు.

“వారి నిష్ఠూరాలనూ, దూషణలనూ ప్రేమగా భరిస్తాడట స్వామి. వాళ్లు ఒంటినిండా అలసటతో, కాళ్ల నొప్పులతో అట్లా మాట్లాడుతున్నారు గానీ, వారి మనసులో ఎంత ప్రేమ నింపి తీసుకొచ్చారో ఆయనకు తెలీకపోతే కదా!

అక్కడి నించీ భ్రమరాంబాదేవి దగ్గరికి పోయి, ‘అమ్మా! మా మహారాజా వారి ఆడబడుచువే! ఈ కొండల్లో, కోనల్లో వుండే ఖర్మ నీకేంటమ్మా? మాతో రామ్మా! మైసూరులో మహారాజా వారి కోటలో దిగబెడతాం!

మల్లికార్జునుడు నీ కోసం నీ వెనకే రాడా యేమి? అయినా ఎద్దునెక్కి, కారడవుల్లో, కంద మూలాలు తినేవాడిని నువ్వెట్లా పెళ్లాడావమ్మా! ఈ ఆడపిల్లల మనసు అర్థం చేసుకోలేమమ్మా! శ్రీమంతుడిని చేసుకోకుండా ఇలాంటి వాడిని చేసుకున్నావేమిటమ్మా? నిన్ను చూడాలంటే మేము ఇంతింత దూరాలు రావాలామ్మా? చూడు మేము ఎంత శ్రమపడి వచ్చామో!’ అని వాళ్ల కష్టాలన్నీ వెళ్లబోసుకుంటారట! కన్నీళ్ల పర్యంతం అవుతారట!

అమ్మ, వారి నిందాస్తుతికి, ఆత్మీయతకు ఆనందించి, చిద్విలాసంగా తల వూపుతున్నదేమో అన్నట్టుగా ఆమె శిరసు మీది పూలు జలజలా రాలుతాయట!

మీ భక్తిని మెచ్చానన్నట్టుగా ఆమె కళ్లలో నుంచి అనుగ్రహం కురుస్తుందట!

ఆ తర్వాత ఆ భక్తులందరూ ఎవరి గదులకు వారు వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు.

మహారాష్ట్రకు చెందిన భక్తులు అమ్మవారిని తమ ఇంటి ఆడబడుచుగా భావించి, ఒడి బియ్యం, కానుకలు తెస్తారట! వివిధ కులాల వాళ్లకు శ్రీశైలంలో వేరు వేరు సత్రాలు వుంటాయి. ఉచిత భోజనాలూ వుంటాయి. వచ్చిన భక్తులందరూ అలసట తీర్చుకుని, స్వామిని సేవించుకుని, చూడవలసిన ప్రదేశాలన్నీ చూసి, మళ్లీ బండ్లలో, ఇతర వాహనాల్లో తిరిగి ఇళ్లకు వెళ్లేవారట.

కానీ, ఇన్ని ఆనందాలతో పాటు కొన్ని విషాదాలు కూడా జరిగేవి. ఆ కాలంలో, ఆ అడవిలో దోమలు విపరీతంగా వుండటం వల్ల అనేక మంది మలేరియా జ్వరాలతో పడేవారట! అప్పుడు చెట్ల మందులతో జ్వరం తగ్గేవారికి తగ్గేది. కొందరు జ్వరంతో అక్కడే ప్రాణాలు వదిలేసేవారట.

అలానే మరోసారి ఒక తల్లీ కూతురూ శ్రీశైలం వచ్చి, ఎక్కడా వసతి దొరకలేదేమో.. ఒక చెట్టు కింద వంట చేసుకుంటున్నారట. మంట వేడికి చెట్టు పైన వున్న తేనెపట్టులోని తేనెటీగలు లేచి వారిపై దాడిచేసి కుట్టాయట. పాపం.. వాళ్లిద్దరూ అక్కడికక్కడే చనిపోయారట.

అరుదుగా భక్తులు పులుల బారిన కూడా పడేవారట!”

“అయ్యో! దేవుడి కోసం అంతంత దూరాలు నడిచొస్తే దేవుడు కాపాడడా ఆంటీ?” మొహమంతా బాధ నిండిపోగా అన్నది ప్రీతి.

“మన ప్రారబ్ధాన్ని తప్పించడం ఎవరి తరం ప్రీతీ! అటువంటి క్షేత్రంలో, శివరాత్రి రోజులలో, స్వామి సన్నిథిలో పోవడం కూడా ఆయన అనుగ్రహమే అనుకోవాలి. సరే.. ఇంకా ఇంటరెస్టింగ్ విషయాలు వున్నాయి.. విను మరీ..” అని మళ్లీ మొదలుపెట్టాను.

“నేను ఒప్పుకోను ఆంటీ.. తన భక్తులను కాపాడాల్సిన బాధ్యత ఆయనదే.. ఆయన వాళ్లను కాపాడితీరాలి!” మొండికేసింది ప్రీతి.

శారద కర్మసిద్ధాంతం గురించి వివరించి, ఆమెను సర్దడానికి ప్రయత్నించింది.

ఏమనుకుందో.. “తర్వాత యేం జరిగిందో చెప్పండి ఆంటీ..” అని త్వరపెట్టింది ప్రీతి.

“ఇలా శివరాత్రి అయ్యాక ఓ పదహైదు రోజుల దాకా భక్తులు వుంటారట. తరువాత పూజారులు, ఆ వూరివారు, అడవి లోని చెంచువారు మాత్రమే వుండేవారు. చెంచువాళ్లు అమ్మవారినీ, అయ్యవారినీ ‘మా అక్కా బావా’ అని ఆప్యాయంగా వ్యవహరిస్తారట! అరుదుగా మాత్రమే యాత్రికులు వచ్చేవారు.

“అందరూ వెళ్లిపోయాక మా తాతగారు, వారి పరివారంతో కర్నూలుకు వెళ్లిపోయేవారట. అప్పుడు జరిగిన అమ్మవారి విశేష మైన మహిమ ఒకటి చెప్పనా?” అన్నాను నేను.

“చెప్పండి ఇందిరా! దొంగతనం యేదో జరిగింది. అదేనా?” అన్నది జానకి నేను చెప్పబోయేది ఊహించేస్తూ.

“అవును జానకీ. మా తాతగారు ధర్మకర్త కావడం వల్ల వచ్చేటప్పుడు కర్నూలులో ప్రభుత్వట్రెజరీలో దాచిన అమ్మవారి, అయ్యవారి నగలు శ్రీశైలానికి సెక్యూరిటీతో తీసికెళ్లేవారట!

కర్నూలులో మా మేనత్త ఇంటికి ఆ నగలను తెస్తే.. ఆవిడ కుంకుడు కాయల రసంతో వాటిని తళతళలాడేలా తోమి, శుభ్రం చేసేదట! వాటిని శ్రీశైలానికి తీసికెళ్లి, అమ్మ వారికీ, అయ్యవారికీ అలంకరించి, తిరిగి కర్నూలుకు తీసుకొచ్చి ట్రెజరీలో అప్పగించాలి.

అప్పట్లో మా తాతగారికి కారు వుండేదట! ఒకసారి కారులో ఎగుడుదిగుడు దారిలో వచ్చేసరికి చీకటిపడింది. నగలను ట్రెజరీలో జమ చేసే వీలులేక, మా మేనత్త గారింట్లో ఇనప్పెట్టెలో పెట్టి, భయ పడుతూనే పడుకున్నారు అంతా. సెక్యూరిటీగా ఇద్దరు పోలీసులు వుండగానే జరిగిందీ సంఘటన!

ఎవరో దీనినంతా తెలుసుకుని, రాత్రి దొంగతనానికి వచ్చారు. పోలీసులతో సహా అందరికీ మత్తు మందు యేదో వాసన చూపించారు. ఇంటి తలుపులు బద్దలుకొట్టి లోపలి కొచ్చి, గడ్డపలుగులతో ఇనప్పెట్టెను పగలగొట్టడానికి ప్రయత్నించారు. ఎంతకూ ఇనప్పెట్టె పగిలినట్టు లేదు. తెల్లవారుతుండగా నిరాశతో గడ్డపలుగులు అక్కడే పడేసి వెళ్లిపోయారు.

మా తాతగారికి మెలకువ వచ్చే సరికి తెల్లగా తెల్లవారి పోయింది. తలుపులు బార్లా తెరిచి వున్నాయి. ఇల్లంతా బీభత్సంగా వుంది. భయంతో గుండెలవిసి పోయినాయి ఆయనకు. చూస్తే ఇనప్పెట్టె చెక్కు చెదరలేదు.

తెరిచిచూస్తే నగలన్నీ వున్నాయి. దేవుడి గదిలో పెట్టుకున్న రెండు మూడు వెండి వస్తువులు మాత్రం పోయినాయి. ఇదంతా భ్రమరాంబా మల్లికార్జునుల మహిమ అని పదేపదే మొక్కుకున్నారు అందరూ.

అందునా అవి మామూలు నగలు కావు. శ్రీకృష్ణదేవరాయలు, శివాజీ మహారాజ్, ప్రతాపరుద్రుడు, ఇంకా ఎందరో మహారాజులు సమర్పించిన వెల లేని ఆభరణాలు! అవి పోయి వుంటే మా తాతగారు జైలు పాలయ్యేవారు. కుటుంబం ఛిన్నాభిన్నం అయ్యేది. అమ్మవారికి కృతజ్ఞతగా అప్పుటికి వారం రోజుల క్రితం పుట్టిన మా మేనత్త కూతురికి ‘భ్రమరాంబ’ అని పేరుపెట్టారు మా తాతగారు. ఇదంతా 1944-45 ప్రాంతంలో జరిగింది.”

“ఎంత అద్భుతం ఆంటీ! ఏదో సినిమాల్లో చూసినట్టు అనిపిస్తోంది. లేకపోతే గడ్డపలుగులతో కొట్టినా ఇనప్పెట్టె పగలకపోవడం ఏంటి? నిజంగా అమ్మవారే మీ తాతగారిని కాపాడింది ఆంటీ!” సంబరంగా అన్నది ప్రీతి. అందరూ యేదో పెద్ద ఆపద నుంచి బయట పడ్డట్టు దీర్ఘంగా నిట్టూర్చి తేలికపడ్డారు.

ఈసారి జానకి అందుకుంది.

“మన తెలుగువాళ్లలో తక్కువ గానీ, అరవ్వాళ్లు, కన్నడిగులు, మరాఠీవాళ్లకు భక్తి చాలా ఎక్కువ ప్రీతీ!

మేము పదేళ్ల కిందట ఒక తమిళ స్వామీజీతో పాటు పది మందిమి కాశీకి వెళ్లి అక్కడ కంచి కామకోటి మఠంలో దిగాము. అప్పుడు అక్కడ ఒక తమిళ మామీ కలిశారు. ఆవిడకు అరవయ్యేళ్లుంటాయి.

ఆమె, మరొక అరవై మంది బృందంతో చెన్నై నుంచి కాశీకి నడుచుకుంటూ వచ్చిందట! వారంతా వైశ్యకులానికి చెందిన వారు.

వారి సామాన్లన్నీ బస్సులో ముందుగానే వెళ్లిపోతాయట! ఆ బస్సులో ఈ యాత్రానిర్వాహకులు ముందుగా వెళ్లి, వీళ్లకు భోజనం, వసతి యేర్పరుస్తారట! అన్నీ ప్లాన్ ప్రకారం జరుగుతాయి. ఎవరికైనా అనారోగ్యం వస్తే వారిని బస్సులో తీసుకెళ్తారట!

నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే.. చెన్నై నుంచి ఆ ముసలావిడ 2000 కిలోమీటర్ల దూరం ఎట్లా నడిచింది? అంత శ్రమకు ఎలా తట్టుకుంది? రోజూ 20- 30 కిలోమీటర్లు.. ఒక్కోరోజు అంతకంటే ఎక్కువ కూడా ఎట్లా నడిచింది? నెలల తరబడీ ఎట్లా నడిచిందీ? అన్నీ ప్రశ్నలే మిగిలినాయి నాకు.” అన్నది జానకి.

“అడక్కపోయారా ఆంటీ ఆవిడను! అసలు అది మనుషులు నడిచే దూరమా?” విస్తుపోతూ అంది ప్రీతి.

“అడక్కుండా వుంటానా? అడిగాను. భజన చేసుకుంటూ, నామం చెప్పుకుంటూ, అందరితో నడుచుకుంటూ పోతే ఏ అలసటా అనిపించలేదమ్మా! ఆ అన్నపూర్ణమ్మే నా ఒళ్లో చేరి నడిపించి వుండాలి. ఒకవేళ ఎప్పుడన్నా నీరసం అనిపించినా, కాసేపు కూర్చుంటే చాలు.. ఉత్సాహం వచ్చేసేదమ్మా! నాకే ఆశ్చర్యం వేసేది’ అన్నది ఆమె” అని ముగించింది జానకి. అందరం ఆశ్చర్యచకితులం అయిపోయాం.

భక్తి ఎంత పనినయినా చేయిస్తుంది. భగవంతునిపై ప్రేమ అలసటను దగ్గరికి చేరనివ్వదు.

ఈసారి శారదకు ఉత్సాహం వచ్చింది. తమ కాశీయాత్ర గురించి చెప్పడం మొదలుపెట్టింది. “అందరూ తెలుసుకోండి. శ్రావణ మాసంలో కాశీకి పోతే చాలా ఇబ్బందిపడతాం తెలుసా?

మనకు కార్తీకమాసం ఎలాగో ఉత్తర దేశంలో శ్రావణమాసం అట్లాగన్న మాట! కాశీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచీ కొన్ని లక్షలమంది ‘కవాడియా’లు కాశీ, ప్రయాగ, హరిద్వార్, హృషీకేశ్, ఇంకా ఇలాంటి గంగాతీర క్షేత్రాలకు వస్తారు. కాశీకి చాలామంది వస్తారు.

వారు కావడి మోసుకుంటూ కాలినడకన ఆయా క్షేత్రాలకు వచ్చి, దైవదర్శనం తర్వాత వాళ్లు తమతో తెచ్చుకున్న కావళ్లలోని బిందెలు, పెద్ద చెంబులు వంటి వాటిలో గంగా జలం తీసుకు వెళ్తారు. ఆ గంగా జలంతో వాళ్ల ఊరిలోని ఇళ్లల్లో, శివాలయాల్లో శివుడికి అభిషేకాలు చేస్తారు. అది పెద్ద ఉత్సవం వాళ్లకు. మేము వెళ్లిన సంవత్సరం కాశీకి ఆరు లక్షల మంది కవాడియాలు వచ్చారట! కాశీలో కాలుపెట్టే చోటు లేదు.

ఆ ముందు సంవత్సరమే యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన యు.పి. లోని రోడ్లలో ఒక వైపు రోడ్డును వాళ్లకు కేటాయించేశారు. ఆ రోడ్ల నిండా నిండిపోయారు కవాడియాలు.. వందలమైళ్ల పర్యంతం!

దాంతో ఒకే రోడ్డులో రెండు వైపులా వెళ్లే ట్రాఫిక్ తో ఎక్కడికి పోవాలన్నా గంటలు గంటలు ట్రాఫిక్ జామ్‌తో బాగా ఇబ్బంది పడ్డాము. యోగి గారు వారిని ప్రోత్సాహపరుస్తూ వారిపై హెలికాప్టర్‌తో పూలు చల్లించారు. ఇబ్బంది కలిగినా వారి భక్తికి, యోగి గారు కవాడియాలను సత్కరించిన తీరుకు చాలా సంతోషం వేసింది మాకు.

అయితే ఆశ్చర్యం యేమిటంటే కవాడియాలలో ఎక్కువమంది కూడా నిరుపేద వర్గాలకు చెందిన వారుగా అనిపించారు. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ ప్రజలు శివుడి మీద భక్తితో, శ్రమను లెక్క జెయకుండా వందల కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడవడం, తిరిగి బిందెలనిండా నీళ్లతో అంతంత దూరాలు తిరిగి వెళ్లడం చూసి, వాళ్ల కాళ్లకు దండం పెట్టాలని పించిందండీ నాకైతే..” అన్నది శారద ఆనాటి కవాడియాలు కళ్లలో కదులుతుండగా.

“శారదా ఆంటీ! నేను ఈసారి శ్రావణమాసంలోనే కాశీకి వెళ్లి కవాడియాలను చూసివస్తాను తప్పకుండా. ఇబ్బంది అయితే అయింది.. అంతటి భక్తులను, వారి భక్తినీ చూడకుంటే నా జీవితం వేస్ట్ అనిపిస్తోంది ఆంటీ.. మా ఆయన్ను యెలాగైనా ఒప్పిస్తా చూడండి. ఆయన రానంటే నేను మా అత్తగారిని తీసుకొని ఫ్లైట్‌లో వెళ్లి పోతా! నేనూ ఓ కావడి కొనుక్కుని, గంగమ్మను అందులో పెట్టుకొని, తీసుకెళ్లి విశ్వనాథునికి అభిషేకం చేస్తా! నేను కావడితో గంగమ్మను హైదరాబాదుకు తీసుకురాలేను గానీ, గంగ చెంబులో తీసుకొచ్చి, మన శివాలయంలో అభిషేకం చేయిస్తాను. ఈ అవకాశం పోగొట్టు కోదలచుకోలేదు ఆంటీ.. మంచి విషయం చెప్పారు” అంటూ శారద చేతిని పట్టుకొని ఊపేసింది ప్రీతి.

ఈసారి నాకు భక్తుల పాదయాత్రా నుభవం మరొకటి గుర్తొచ్చింది. “అన్నట్టు ప్రీతీ! కొన్నేళ్ల క్రితం మహారాష్ట్రలోని క్షేత్రాలను దర్శించుకోవడానికి ఒక ఏడెనిమిది మందిమి ఒక వ్యాన్‌లో బయలుదేరాం.

షోలాపూర్ నుంచి పండరీపురం వెళ్తున్నాం. ఆ దారిలో తులజాపూర్ దాటిన తర్వాత వందలకొద్దీ భక్త బృందాలు పాటలు, భజనలు, నాట్యాలు చేసుకుంటూ పోతున్నారు. కొందరు స్త్రీలు తల పైన ఇత్తడి తులసి కోటలను మోసుకుంటూ వెళ్తున్నారు. కొందరు పల్లకీలలో పండరి విఠలుడు, రుక్మా బాయి ఫోటోలను, విగ్రహాలనూ మోసుకుంటూ పోతున్నారు.

మాకు అర్థంగాక బండి ఆపి, వాళ్లను విచారించాము. వాళ్లంతా పండరీపురానికి కాలినడకన వెళ్లే భక్తులట!

ప్రతీ సంవత్సరం ఆషాఢశుద్ధ ఏకాదశికి పండరీపురంలో విశేష ఉత్సవాలు జరుగుతాయట. వాటికి ఒక్కొక్క ఊరి నించి కొందరు భక్తులు బయలుదేరి, కాలినడకన పండరీపురం చేరుకుంటారట! దీనిని ‘వార్కరీ సంప్రదాయం’ అంటారట. ఈ యాత్ర చేసేవారిని ‘వార్కరీలు’ అంటారట. వారి జీవన విధానం కూడా సాత్వికంగా వుంటుంది. వారు మద్యమాంసాలను ముట్టుకోరు. దురలవాట్ల జోలికి పోరు. పూజా, పారాయణాలు, భజనలతో భక్తిమయంగా గడుపుతారు.

ప్రతీ ఆషాఢమాసంలో కాలి నడకన పండరీపురానికి పోయి, స్వామిని దర్శించుకుంటారు.

మేము వారి భక్తిభావాన్ని పొగుడుకుంటూ పండరీపురానికి చేరాము. అక్కడ ఇసుక వేస్తే రాలనంతమంది జనం వున్నారు. సాయంత్రం అయింది. క్యూ కాంప్లెక్స్‌లో జనం కిక్కిరిసిపోయి వున్నారు. మేము ఎలాగో దళారులకు డబ్బు ఇచ్చి స్వామిని దర్శనం చేసుకొని, ఆ గుడి ఆవరణలోకి వస్తే.. అక్కడా ఎంతో మంది జనం!

అక్కడక్కడా కొందరు ఆడవాళ్లు ఓ ఇరవై ముప్ఫైమంది గుండ్రంగా కూర్చుని వున్నారు. మధ్యలో ఒక స్త్రీ కృష్ణుడిలాగా అభినయిస్తున్నది. చుట్టూ కూచున్న వాళ్లంతా గోపికలు. ఏవో సంభాషణలు జరుగుతున్నాయి గానీ, మాకు మరాఠీ భాష రాక పోవడం వల్ల అర్థం కాలేదు. మధ్యలో నిల్చుని కృష్ణ పాత్ర వేస్తున్న అమ్మాయి, ఒక్కో గోపికతోనూ యేదో మాట్లాడుతూ, నాట్యం చేస్తున్నది. అందరూ పాటలు పాడుతున్నారు. మేము వారిని చూస్తున్నామని కొంచెం సిగ్గుపడుతున్నారు. మేము చప్పట్లు కొట్టి వాళ్లను ప్రోత్సహించాము.

పోనీ వీళ్లంతా ఏదో చదువుకున్న వాళ్లా.. అంటే… అందరూ నిరక్షరాస్యులుగానే కనబడుతున్నారు. నిరుపేద వర్గాలకు చెందిన వారి లాగానే వున్నారు. వీళ్లకు ఇంత భక్తి ఎలా అలవడింది? ఇంత భక్తిని వాళ్లలో కలిగించిన వాళ్లెవరు? ఇన్ని పాటలు, ఆటలు ఎవరు నేర్పారు? దేవుడిని చూడ్డం కోసం వందల మైళ్లు అలవోకగా, ఉట్టికాళ్లతో నడిచి రావాలనే సంకల్పం ఎలా కలిగింది? వాళ్లకు అందుకు దక్కుతున్న ప్రతిఫలం యేమిటి? ఇలా అన్నీ ప్రశ్నలే!

ప్రశ్నల దారి ప్రశ్నలదే గానీ, నా మనసైతే నిండిపోయింది తృప్తితో. ఈ దేశంలో యేదో ప్రత్యేకత వుంది. ఈ మట్టిలోనే ఏదో చెప్పలేని గొప్పదనం వుంది.

నాకైతే వచ్చే జన్మలో మహా రాష్ట్రలో అలాంటి వార్కరీల ఇంట పుట్టి.. నేనూ వారితో పాటు పండరీపురం వెళ్లాలని వుంది ప్రీతీ!” అని తన వైపు చూశాను.

ఆకాశంలో కనిపిస్తున్న చంద్రబింబాన్ని చూస్తూ.. యేదో ఊహల్లో మునిగిపోయిన ప్రీతి,

“నాకైతే ఆ వార్కరీలతో కలిసి నడుస్తూ, తలపైన తులసికోట పెట్టుకోని డాన్స్ చేయాలని వుంది ఆంటీ!” అన్నది.

“మనిద్దరం వచ్చే జన్మలో వార్కరీల ఇంట్లో పుడదాంలే ప్రీతీ!” అన్నాను తన భుజం మీద చెయ్యి వేస్తూ.

“అమ్మో! మీ ఇద్దరేనా? మమ్మల్ని విడిచి మీరు ఎంజాయ్ చేసేద్దామనా? మేమూ వస్తాం మీతోటి!” అన్నది శారద. అందరం నవ్వుకున్నాము.

“వచ్చే జన్మదాకా ఎందుకు వెయిట్ చెయ్యాలి ఆంటీ? వచ్చే ఆషాఢంలో వెళ్దాం పదండి. ఒక గుంపులో చేరి కొద్దిదూరమైనా నడుద్దాం పదండి!” అన్నది ప్రీతి.

“ఇట్లా మన దేశంలో అనేకచోట్ల లక్షలాది మంది పాల్గొనే ఉత్సవాలూ, పాదయాత్రలూ జరుగుతూనే వున్నాయి కదా! నేపాలీలు అయితే కైలాసపర్వతం చుట్టూ, 50-60 కిలోమీటర్ల మేర అంగ ప్రదక్షిణ చేస్తారట. శబరిమలైకైతే లక్షలాది మంది భక్తులు వెళ్తారు కదా! ఆ కొండలు, కోనలు దాటి ఆ స్వామిని చూసి వస్తారు. అలాగే పళని సుబ్రహ్మణ్యస్వామి దగ్గరికి కావళ్లు మోసుకొని చాలామంది వెళ్తారు. తిరుపతిలో రోజూ లక్షలాది భక్తులు కొండనెక్కి వెళ్తుంటారు. జగన్నాథ రథయాత్ర సందర్భంలో అయితే లక్షలాది మంది రథోత్సవంలో పాల్గొంటారు. ఇలా కోట్లాదిమంది ఇంత భక్తితో పరవశించి పోతున్నా, ఇన్ని మత మార్పిడులు ఎట్లా జరుగుతున్నాయి? ఇలా మారినవాళ్లే మళ్లీ మన మతాన్ని ద్వేషించేవాళ్లుగా ఎందుకు తయారవుతున్నారు? కేవలం డబ్బుల కోసం కొందరు, వాళ్లిచ్చే తాయిలాల కోసం కొందరు, మతం మారితే ఆరోగ్యం బాగు పడుతుందనే భావంతో కొందరు, చెడు అలవాట్లు ఆ కొత్త దేవుడు మాన్పిస్తాడని కొందరు వెళ్తున్నారు. మన దేవుళ్లు ఇంతమంది వుండగా ఆ కొత్తదేవుళ్ల కోసం ఎందుకు ఇంతమంది మతం మారుతున్నారో అర్థం కాదు” ఆవేదనగా అన్నది జానకి.

“మన దేశం వెయ్యేళ్ల పైబడి పర మతాల దాడులు, బలవంతపు మతమార్పిడులు, భయంకరమైన హింస అనే చీకట్లలో దిక్కుతోచని పరిస్థితుల్లో వుండిపోయింది జానకీ. ప్రజలు అణచివేత, పేదరికం, పూర్వవైభవాన్ని తిరిగి పొందలేని అశక్తత, ఎలాగో ఒక లాగా పరమతాల వారి నుంచి మాన, ధన, ప్రాణరక్షణ చేసుకుంటే చాలనుకునే మనస్తత్వం, తిరగబడ లేని నీరసం మన జాతిని ఆవహించింది. ఆత్మగౌరవం అడుగంటింది.

మన రాజులు చాలామంది బౌద్ధ మతం పాటించి, అహింసను, క్షమను అవలంబించారు. మంచిదే! కానీ, అహింసకూ, హింసకూ మధ్య నున్న సన్నటి రేఖను సరిగా గుర్తించలేకపోయారు. దేశరక్షణ కోసం యుద్ధం చేయడం కూడా హింసే నేమోనని వెనకాడినట్లనిపిస్తుంది. దేశాన్ని రక్షించాల్సిన రాకుమారులు భిక్షుకులై పోయారు. దేశంలో అరాచకం ప్రబలింది. క్షమ పేరుతో చేత చిక్కిన శత్రువును వదిలి పెట్టడం, అతడే తిరిగి బలం పుంజుకుని, దండెత్తిరావడం, మనల్ని ఓడించడం ఇవన్నీ మనం చరిత్రలో చదువుకున్నాం కదా. స్వాతంత్రం వచ్చాక కూడా మనకెంతో వంచన జరిగిందని ఇప్పుడే కదా గుర్తిస్తున్నాం..” అన్నది రామలక్ష్మి.

“ఇవన్నీ నిజమే కావచ్చుగానీ, మనవాళ్లు పచ్చిస్వార్థపరులు రామలక్ష్మీ.. నా పొట్ట నిండితే చాలు.. దేశం ఎట్లాపోతే నాకేం? అనుకునే రకాలు.. నాటి అంభి, జయచంద్రుని దగ్గర్నుంచీ.. నేటి రాజకీయ నాయకుల దాకా.. డబ్బులు తీసుకుని ఓట్లు వేసే ప్రజల దాకా చూస్తూనే వున్నాం కదా.. మన దైవభక్తి అంతా మన స్వార్థం కోసమే..! కోరికలు తీర్చుకోవడం కోసం భక్తి ఒక సాధనం గానీ, సంస్కారాలను సరిదిద్దుకోవడమే భక్తి అనే జ్ఞానపూర్వక భక్తి ఎంత మందిలో వుందో చూపించండి.. ఒక గుడిని కాపాడ్డానికి ఎవరైనా ముందు కొస్తారేమో చూడండి! ఎవరో కష్టాలూ, నష్టాలూ భరించాలి. మనం కడుపులో చల్లకదలకుండా వుండాలి. నాతో, మీతో సహా మనందరి మనస్తత్వమూ ఇదేనండీ. లోతుగా ఆలోచిస్తే ఇదే తెలిసేది!” ఆవేశంగా అన్నది జానకి.

“ఇవన్నీ సత్యాలే గానీ, ఇప్పుడు మనం మన మతాన్ని రక్షించుకోవడానికి యేమి చెయ్యాలో ఆలోచించాలి మనం. ప్రీతీ.. మా రోజులు చివరికొచ్చాయి. అయినా మా పిల్లలను, మనవళ్లు, మనవరాళ్లకు ఎంతో కొంత మా భావజాలం అందేలా చేస్తాం. నీలాంటి యువతులు యేం చెయ్యాలో ఆలోచించు. నీ పిల్లలు పెద్ద వాళ్లయ్యేసరికి వాళ్లను ఈ సమాజం లోని పరిస్థితులను ఎదుర్కునేలా ఎలా పెంచుతావో చెప్పు..” అన్నది శారద సవాలు విసురుతున్నట్టుగా.

“నేను ఈ మధ్య ఇదే ప్లాన్ చేస్తున్నాను ఆంటీ! నా ఫ్రెండ్స్‌తో కూడా చెప్తున్నాను. నేను చిన్నప్పుడు ఎలా పెరిగానో.. అంటే కష్టం సుఖం తెలిసేలా వాళ్లను పెంచుతాను. ప్రతీ విషయాన్నీ వాళ్లతో డిస్కస్ చేస్తాను. మన మతం గురించి వాళ్లకు అర్థమయ్యేలా చేస్తాను. మా బంధువులతో వాళ్లు కలిసేలా చేస్తాను. పూర్వీకుల గురించి చెబుతాను. రామాయణం, భారతం, భాగవతం రోజూ యేదో ఒకటి కాసేపు మా అత్తగారు ఇప్పటికే చెబుతున్నారు.

ఒక్కో విషయం గురించి వాళ్లు తెలుసుకోగలిగినంత లోతుకు వెళ్లి వివరిస్తాను. రోజూ వాళ్ల చేత ఏదో కొంత పూజ చేయిస్తాను. వాళ్లు అటు ఆధునికంగా వుంటూనే, మన సనాతన ధర్మం గురించి అవగాహన కలిగేలా చేస్తాను. వాళ్ల పనులు వాళ్లు చేసుకునేలా ట్రైనింగ్ ఇస్తాను. ఇంకా చిన్నదే గానీ, ముందు ముందు మా అమ్మాయికి డ్రెస్‌లు కొనే విషయంలో జాగ్రత్త పడతాను. ఆధునికంగా వుంటూనే మర్యాదగా కనిపించే దుస్తులు వేసుకునేలా జాగ్రత్త తీసుకుంటాను. ఇద్దరికీ రోజూ బొట్టు పెడతాను. ఇద్దరికీ కరాటే వంటివి నేర్పిస్తాను. పిల్లలు అమెరికనైజ్ కాకుండా ఇండియా పిల్లల్లాగా పెంచుతాను ఆంటీ! ఇప్పటికే మా పిల్లలు మిగతా పిల్లలకంటే వేరుగా వుంటారు ఆంటీ.. మా ఆయన పిల్లలకు రోజూ కథలు చెబుతారు. పద్యాలు నేర్పిస్తారు. ఇంకా ఎక్కడి కక్కడ, ఎప్పటికప్పుడు వాళ్ల భావాలను దిద్దుతాను.. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నారు. అవసరమైతే వాళ్ల కోసం ఉద్యోగం కూడా మానేస్తాను..”

ఆవేశంగా మాట్లాడుతున్న ప్రీతి వాక్ప్రవాహానికి అడ్డుపడుతూ ఆమె పిల్లలు ఇద్దరూ ఐదు, ఏడేళ్ల వయసువాళ్లు వచ్చి, ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి “అమ్మా! ఇంటికి పోదాం పద! ఆకలేస్తూంది” అని ప్రీతిని లేవదీశారు.

“పదండి.. పోదాం..” అని పిల్లలిద్దరినీ చెరో చేత్తో పట్టుకుని, “వెళ్లొస్తా ఆంటీ.. మళ్లీ రేపు మాట్లాడుకుందాం!” అని తమ బ్లాక్ వైపు నడిచింది ప్రీతి.

నేను, శారద, రామలక్ష్మి, జానకీ ఆమె వెళ్లిన వైపే చూస్తూ వుండిపోయాం! ప్రీతి లాంటి తల్లులు ప్రతి ఇంట్లోనూ తయారవుతే ఈ దేశం వచ్చే తరంలోనే బాగుపడిపోదా.. అని యోచిస్తూ ఎవరి బ్లాక్ వైపు వాళ్లు నడిచాం!!

భక్తులు చేసే పాదయాత్రలతో మొదలైన మా చర్చ ప్రస్తుతం దేశంలో వున్న రాజకీయ పరిస్థితులు, మతసామరస్యానికి అర్థం మారిన పరిస్థితులు, వాటిని ఎదుర్కోవడం గురించిన చర్చగా మారింది. ఈ పోరాటానికి భక్తిని ఊతకర్రగా చేసుకుని ముందుకు సాగడం అవసరమేననిపించింది. ఈ చర్చ ఈ రోజుతో ముగిసిపోకుండా రోజూ సాగించాలనే నిశ్చయంతో లిఫ్ట్ ఎక్కాను నేను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here