స్థాయీభేదం

2
10

[డా॥ చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి గారు రచించిన ‘స్థాయీభేదం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]టే[/dropcap]బుల్ మీదున్న ప్రూఫులు చూస్తున్న ఎడిటర్ దినకర్ ధీరజ్, కళ్ళజోడు తీసి, కళ్ళు కడుక్కుని వచ్చి,  కుర్చీలో కూర్చుని, కాస్సేపు కళ్ళు మూసుకుని ఉందామనుకున్నాడు. ఆ రోజు ఆ అదృష్టం లేనట్టుంది పాపం, వెంటనే ఫోన్ మోగింది. ఏదో తెలియని నెంబర్. అలాగని అసలు తెలియని మనిషి కాదు. ఆ మనిషి పేరు ‘ట్రూ కాలర్’ చూపించింది.

కళ్ళజోడు పెట్టుకుని, ఫోన్ ఎత్తాడు. అటుపక్క ఫోన్ చేసిన మనిషి, “ఎడిటర్ గారూ నమస్తే! నేను వి.వి.ఎల్. అలివేణిని. మీకు క్రైమ్ థ్రిల్లర్ కథ, ‘గోతి కాడ నక్క’, పంపానుకదా! ఇంతకీ, మీకు రాత్రిళ్ళు నిద్ర పడుతోందా లేదా?” అని అడిగింది. “నమస్తే అండీ! నాకు నిద్రలేమి అంటూ ఏదీ లేదండీ! భవిష్యత్తులో రావచ్చేమో! అయినా గానీ, ఎందుకు అడిగారు?” అడిగాడు ధీరజ్ .

“నా కథ రాస్తున్నప్పుడు నేనే భయపడి చచ్చానులెండి.  ఆంజనేయ దండకం పఠిస్తూ రాశాను సుమండీ! మీరు నన్ను మెచ్చుకోవాలనుకుంటున్నారు కదూ! గో అహెడ్. మీ ఇష్టం,” అంది అలివేణి. గతుక్కుమన్నాడు ధీరజ్. ఆ కథో అతుకుల బొంతలా తగులడింది. దాన్ని చదివి, తను భయపడి చచ్చి, ఈమెను మెచ్చుకోవాలా, అనుకున్నాడు.

“మరి, ఇంత అద్భుతమైన హారర్ కథ..” అని ధీరజ్ అనబోతుంటే, “ఊహూఁ, క్రైమ్ థ్రిల్లర్ కథ అండీ”, అని ధీరజ్ తప్పుని సరిదిద్దింది రచయిత్రి. ‘రెంటికీ తేడా ఏమిటో ఈవిడకసలు తెలుసునా?’ అని మనసులోనే అనుకుని, ఆ చెత్త కథ తనకు హారర్ కలిగించింది, అనుకున్నాడు. అసలు, రచయిత ఏ రకం కథ రాస్తాడో, అదే విధంగా పాఠకుడికి అనిపించాలి. లేకపోతే రక్తి కట్టదు.

“సార్, ఏదో చెప్పబోయారు”, అంది రచయిత్రి. ధీరజ్ వెంటనే తేరుకుని, “ఆ, అదేనండీ, మీ కథ చాలా గొప్పది కదా, పారితోషికం ఇవ్వని మా పత్రికకి పంపించారేమిటా, అని ఆలోచిస్తున్నానండీ”, అన్నాడు. ఆవిడ వెంటనే, “థాంక్ యూ సో సో మచ్ సార్. మీరు గీటురాయి లాంటివారు. మీ పరీక్ష పాస్ అయితే, నేను అనతికాలంలోనే ప్రఖ్యాత రచయిత్రినౌతాను! ప్లీజ్, ప్లీజ్ వచ్చే వారమే వేసేద్దురూ!” అని షెడ్యూలింగ్ కూడా చేసేసింది అలివేణి.

“చూస్తానండీ, సాధారణంగా మా షెడ్యూల్స్ రెండు-మూడు వారాల ముందే ఖరారు చేయబడతాయి”, అని ఫోన్ కట్ చేశాడు ధీరజ్. ‘జిందగీ నా మిలే దుబారా’లో ఉంగరం మీద అభిప్రాయం అడిగితే వచ్చిన అపార్థం వల్ల ఆడపిల్లకి ప్రపోజ్ చేయవలసి వచ్చిన అభయ్ డియోల్‌లా ఫీల్ అయ్యాడు. ‘ఆవిడ పాజిటివ్ ఆటిట్యూడ్ మండిపోనూ’, అని మనసులో గింజుకున్నాడు.

ఓ చిన్న ప్రభుత్వోద్యోగం ఇచ్చే జీతం తప్ప పై సంపాదన అసలు లేని మన సంపాదకుడు రెండు రోజుల వరకూ మనిషి కాలేకపోయాడు! “ధీరూ, నలతగా ఉందా?” అని నుదురు తడుముతూ అంది భార్య. “నలత కాదోయ్, ఇది ఒక రచయిత్రి తెచ్చిపెట్టిన కలత!” అని దీనంగా వాపోయాడు.

ఆమె వెంటనే, “ఇస్తే గిస్తే రచయితలిస్తారు గానీ రచయిత్రులు కలతను దిగమింగే వారే తప్ప ఇచ్చేవారు కారు!” అనేసరికి ధీరజ్‌కి అదో కారుకూతలా వినిపించింది. పుండు మీద కారం జల్లినట్లయ్యి, ‘ఈవిడ స్త్రీ పక్షపాతం మండిపోనూ’, అని తిట్టుకున్నాడు, తనో మగ ఫెమినిస్టు అన్న విషయం మరచిపోయి.

ఇంతలో ఫోన్ మోగింది. ‘ఈ కడుపుమంటతో పాటు ఇదో తంటా!’ అని విసుక్కుంటూ ఐడీ చూడకుండా ఫోన్ ఎత్తాడు. “నమస్కారం ఎడిటర్ గారూ!” అందో ఆడ గొంతుకు. ‘మళ్ళీ ఆడలేడీసుతో నాకు పడును చిక్కు’, అని విసుక్కుంటూ, “నమస్కారం అమ్మా, చెప్పండి”, అన్నాడు నీరసంగా, తన కోపం, విసుగు, వగైరా కనిపించనీయకుండా!

ఆమె పూర్వజన్మలో పోలీసు కుక్కో ఏమో, అతని మాటల్లోని తేడాని ఇట్టే పసిగట్టేసింది. “మిమ్మల్ని డిస్టర్బ్ చేశానాండీ? పోనీ, మీ ఫ్రీ టైమ్ చెప్తే, అప్పుడే ఫోన్ చేస్తా”, అందావిడ. ‘ఈ భాగ్యానికి ఫ్రీ టైమ్ కూడానా’, అనుకుని, పైకి, “నో, నో, నేను ఫ్రీగానే ఉన్నాను. చెప్పండి,” అన్నాడు ధీరజ్.

“వినాయక చవితికి మీరు పెట్టిన ‘తొండమునేకదంతము’ పోటీకి నేనొక కథ పంపానండీ”, అందావిడ. “వాటి ఫలితాలు పోయిన వారమే వచ్చాయి. వెబ్‌సైటులో చూసుకోండి”, అన్నాడు ధీరజ్. “నాకు ప్రైజ్ రాలేదండీ”, అందావిడ.

“చూడండమ్మా, మేము ఏ పోటీ పెట్టినా పారదర్శకతతో నిర్వహిస్తాం. మీరు పంపే ఈమెయిల్ తాలూకు పాస్వర్డ్ కూడా కథలతో సంబంధం లేని వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళే కోడ్ ఇచ్చి, వాటిని న్యాయ నిర్ణేతలకి పంపిస్తారు. జడ్జీలు వాటిని పరిశీలించి వాళ్ళకి పంపాక, డీకోడ్ చేసి వాళ్ళు నాకు పంపుతారు. అప్పటి వరకూ నా ప్రమేయం ఉండదు”, అని కొంచెం నొక్కి వక్కాణించాడు, ఆమె తనకి బహుమతి ఎందుకు రాలేదో సంజాయిషీ అడుగుతోంది అనుకుని.

ఆమె రెండు క్షణాలపాటు మౌనం వహించి, “నా రచనాపటిమని మెరుగు పరచుకోవాలని అనుకుంటున్నాను సార్. మీ జడ్జీల విమర్శలుంటే నాకు చెప్తారా, ప్లీజ్?” అని అర్థించింది. కొంచెం చల్లబడ్డ ధీరజ్, “ఆ విమర్శ విని తట్టుకునే శక్తి మీకుందా?” అని, నిక్కచ్చిగా అడిగాడు. “వర్ధమాన రచయిత్రిని కదండీ, విమర్శలను అర్థం చేసుకోకుండా ఎలాగ ఎదుగుతానంటారు?” అందావిడ.

‘అబ్బో’, అనుకున్నాడు ధీరజ్. “సరేనండీ, మీ పేరు, కథ పేరు చెప్పి, రెండు రోజుల తరువాత ఇదే సమయానికి ఫోన్ చేయండి”, అన్నాడు. “నా పేరు అర్భకపురపు వరాహ లక్ష్మీ నరసింహ వీర వేంకట సత్యవతి. నేను పంపిన కథ పేరు, ‘సుబ్బాయమ్మ సాహసం’ అండీ”, అంది ఆవిడ. ‘పక్కా తెలుగు పేరు, ఏ టు జెడ్ ఆన్ని అక్షరాలూ ఉన్న పేరు’ అనుకున్నాడు ధీరజ్. “ఎల్లుండి ఇదే టైమ్‌కి కాల్ చేయండి”, అని ముగించాడు ధీరజ్.

ఠంచన్‌గా ఫోన్ వచ్చింది. ధీరజ్ ఆమె నెంబర్ ఎక్కించుకోలేదు కాబట్టి ఎవరో పోల్చుకోలేక పోయాడు. “నా పేరు చాలా పొడవు. సుబ్బాయమ్మననుకోండి”, అంది సత్యవతి. మనసులో చిరునవ్వు నవ్వుకుని, “మీకు మీ కథ గురించిన విమర్శ వినే ధైర్యం ఉందిగా?” అన్నాడు ధీరజ్. “అందుకే కదండీ మిమ్మల్ని శ్రమ పెడుతున్నాను! కానీ, కర్ణ కఠోరమైన వ్యాఖ్యలు వచ్చాయేమిటి నా దురదృష్టం కొద్దీ?” అని బయటికే అనేసింది సత్యవతి.

“నిజాలు నిష్ఠూరంగానే ఉంటాయి కదండీ. అందరూ చెప్పాలనుకున్నది తియ్యగా చెప్పరు కదా! పైగా మీరు చూసే ఉంటారు, పది బహుమతులు ప్రకటించి, నాలుగింటికే బహుమతులిచ్చాం. మన పత్రికలో ఒక స్థాయికి తక్కువగా ఉన్న రచనలని మన జడ్జీలు నిర్మొగమాటంగా తిరగ్గొడతారు. ఈ పోటీలో మన జడ్జీలు ఆ పనే చేశారు! మేమా విషయాన్ని గురించి రాసినప్పుడు నాకు చెవిపోటు వచ్చే స్థాయికి రచయితలు నన్ను విమర్శించారు. కానీ, మన పత్రిక ప్రత్యేకత ఉన్నది ఉన్నట్టు చెప్పడం. అందుకే అడిగాను,” అన్నాడు ధీరజ్.

ఆమె చెప్పమని కోరిన తరువాత, కాగితంలోంచి చదవడం మొదలుపెట్టాడు. “‘ఈ రచన చివరి వరకూ చదివించింది. కానీ, ఈ ఒక్క గుణం చేత ఆ కథ గొప్పదనే పేరు పొందలేదు. సుబ్బాయమ్మ చేసింది సాహసమే అయినా, ఈ కథలో సామాజిక స్పృహ, ప్రయోజనం దండిగా ఉన్నా, ఆ పాత్ర చిత్రీకరణలో కొన్ని లోపాలున్నాయి. అందువలన ఈ కథ బహుమతికి అర్హం కాదు. ఉదాహరణకి..’” అంటూ కొన్ని సందర్భాలు ఉటంకించాడు ధీరజ్.

అటుపక్క మౌనం. “చూశారా, నిజాన్ని అంగీకరించడం ఎంత కష్టమైన పనో! అందుకే సంపాదకులు ఇలా అడిగిన వాళ్ళతో ఏవో చెప్పి విషయాన్ని దాటవేస్తారు. ఏమీ అనుకోకండి. ఈ మాటు మీరు కథాగమనంతో పాటు పాత్ర నిర్మాణం మీద కూడా ధ్యాస పెట్టండి. సరేనా?” అన్నాడు ధీరజ్.

సత్యవతి, “మీరన్నది నిజం. నేను ఎంత సేపూ కథ ఆపకుండా చదివించిందా-లేదా అన్న విషయం మీదే శ్రద్ధ చూపాను. మీకు నా ధన్యవాదాలు. ఓ పది రోజుల్లో మీకు లోపాల్లేని కథొకటి పంపిస్తాను. మీకు నచ్చితే వేసుకుంటారా?” అని అడిగింది. “అదీ అసలైన పోటీ తత్వం అంటే! మనం నిన్న కన్నా ఇవ్వాళ మెరుగుగా ఉన్నామా లేదా అన్నదే అసలు సిసలైన పోటీ! మంచి కథను రాయండి. మీకు నా శుభాకాంక్షలు”, అని ముగించాడు ధీరజ్.

***

సరిగ్గా పది రోజుల్లో ఫోన్ చేసింది సత్యవతి. ధీరజ్ ఇంకా ఆమె నెంబర్ సేవ్ చేసుకోని కారణంగా ఆమెను మళ్ళీ గుర్తు పట్టలేదు. “నేనండీ, సుబ్బాయమ్మని. అప్పుడే మరచిపోయారా? అవును లెండి, మీకు బోలెడు మంది రచయితలతో పరిచయం ఉంటుంది. నేనో పిపీలకాన్ని కదా!” అంది. ఆమె నొచ్చుకుందేమో అని నచ్చజెప్ప చూశాడు ధీరజ్.

ఆమె నిష్కర్షగా నిజాలు మాట్లాడే రకమని పాపం ధీరజ్ అప్పుడు గ్రహించలేదు. అనునయంగా, “మీరు నాకు వాట్సాప్‌లో మీ కథను పంపండి. నేను వెంటనే చదివి అరగంటలో ఫోన్ చేస్తాను. ఏమైనా దిద్దుబాట్లుంటే చేయడానికి మీరు తయారుగా ఉండాలి”, అన్నాడు ఆమెతో. ఆమె ధన్యవాదాలు చెప్పుకున్న తీరులోనే ఎంతో సంతోషం వినిపించింది ధీరజ్‌కి.

సత్యవతి అతనికి కథ పంపించి, అరగంట తరువాత అలారం పెట్టుకుంది, ఫోన్‌లో. కానీ, పావుగంటలోనే ధీరజ్ నుండి ఫోన్ వచ్చింది. అతను చెప్పే తప్పులని రాసుకోవడానికి చేతిలో కలం పుచ్చుకుంది. ఆమె, “చెప్పండి, ఎడిటర్ గారూ!” అనగానే, “మీ పట్టుదలకి నా జోహర్లండీ! పట్టుమని పది రోజుల్లోనే పట్టుదలతో తప్పులు ఎన్నలేని కథని రాశారు. మీకు అభినందనలు. ఇంతకీ, దీన్ని మాకిస్తారా, లేక వేరే పోటీకి పంపిస్తారా?” అని ఉత్సాహంగా అన్నాడు ధీరజ్.

“ధన్యవాదాలు ఎడిటర్ గారూ. ఎంత మాట! మీ వల్ల నా రచనలో లోపాలు సరిదిద్దుకునే అవకాశం నాకు దొరికింది కదండీ! తప్పకుండా మీ పత్రికలోనే ప్రచురించండి”, అంది సత్యవతి. “ధన్యవాదాలండీ! మా సహాయక ఎడిటర్ మిమ్మల్ని సంప్రదిస్తారు. మీరు ఆయనకి మీ క్లోజ్ అప్ ఫోటో, మీ గురించి పది వాక్యాలు రాసివ్వండి”, అని ముగించాడు ధీరజ్.

***

ఆ కథ ప్రచురింపబడిన తరువాత..

“థాంక్యూ ఎడిటర్ గారూ, నేను సుబ్బాయమ్మని. ఈ కథ మీద బోలెడు కామెంట్స్ వచ్చాయి, అన్నీ ప్రశంసలే!” అంది సత్యవతి ఉత్సాహంగా. “నాకెందుకు థాంక్స్? ప్రచురించే వరకే మా బాధ్యత. ఆ మెచ్చుకోలంతా మీ కథ తాలూకు స్వార్జితం”, అని ప్రోత్సహించాడు ధీరజ్. తరువాత తనే, “సంక్రాంతికి ముత్యాల ముగ్గుల కథల పోటీలున్నాయి. ఉత్తమ పదిహేను కథలకి చెరో వెయ్యి రూపాయల బహుమతి. ఒకటే షరతు – కథలో ఎక్కడో అక్కడ ముగ్గుల ప్రస్తావన ఉండాలి”, అన్నాడు. “తప్పకుండా పాల్గొంటానండీ. థాంక్యూ సార్”, అని అత్యుత్సాహంతో ఫోన్ పెట్టేసింది సత్యవతి.

***

భోగి రోజు సాయంత్రం సహాయక ఎడిటర్ ఫోన్ చేశాడు; బ్యాంక్ వివరాలు చెప్తే, బహుమతి సొమ్ము పంపిస్తానన్నాడు. సత్యవతి తన చెవులను నమ్మలేక పోయింది. వివరాలిచ్చింది, డబ్బు వచ్చింది. మరుసటి రోజు తన కథ పదిహేనులో ఎన్నో అంకెలో ఉందో చూద్దామని వెబ్‌సైటు తెరిచింది.

అక్కడ బహుమతుల గురించి ఇలా రాసుంది: “పోయినసారి ‘తొండమునేకదంతము’ పోటీలో నాలుగే కథలు బహుమతికి అర్హమైన విషయం పాఠకులైన మీకు తెలిసిందే! అప్పుడు మేము చేసిన వ్యాఖ్యలు రచయితలని నొప్పించాయో ఏమోగాని ఈమాటు పదిహేను బహుమతులకి మొత్తం పది కథలే రావడం విశేషం.

“అందుకని, వాటిని పరిశీలనకు పంపకుండా కథలు రాసిన రచయిత(త్రు)లందరికీ ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలని సంపాదకవర్గం నిర్ణయించింది. కథలు పంపిన పది మంది రచయిత(త్రు)లకు శుభాకాంక్షలు. మరొక విశేషం- ‘తొండమునేకదంతము’ పోటీలో పాల్గొన్న 143 కథకులలో కేవలం ఒక్కరే ఈ పోటీలో పాల్గొన్నారు. వారికి ప్రత్యేక అభినందనలు”.

విషయం అర్థమైన సత్యవతికి ఆనందం ఆవిరయ్యి, కోపం నషాళానికి అంటింది. వెంటనే సహాయక ఎడిటర్‌కి ఫోన్ చేసి, ముందు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పింది. తర్వాత వాళ్ళ పత్రిక అకౌంటు నెంబర్ గాని, ఫోన్‌పే నెంబర్ గాని అడిగింది. కారణం తెలుసుకున్న అతను కంగారుపడి ఎడిటర్ చేత ఫోన్ చేయించాడు. మళ్ళీ కుశల ప్రశ్నలయ్యాక అదే పాట పాడింది సత్యవతి.

“ఆదేమిటండీ, సిరి రా మోకాలడ్డు పెడుతున్నారు?” అడిగాడు ధీరజ్. “మీ పత్రికలో నాకు నచ్చిందే నిక్కచ్చితనం. తక్కువ స్థాయిలో ఉంటే నా కథకి బహుమతి లభించకూడదు. ఈ మెహర్బానీ ఎందుకు చేస్తున్నారు? చేస్తే చేశారు! నన్ను ఆ లిస్ట్‌లో ఎందుకు చేర్చారు?” అంది నిర్మొహమాటంగా, కానీ పద్ధతిగా, శాంతంగా.

ధీరజ్ నివ్వెరపోయాడు. ఈవిడెవరో మ్యూజియం పీస్ అనుకున్నాడు. అయినా వెంటనే తేరుకుని, “ఈరోజు మా ఆఫీసు మూసి ఉంది. మీరు రాసిన కథ నాకు పంపిస్తే కనీసం ఒక జడ్జీకైనా చూపించి, భోజనం లోపల ఏ విషయం తెలియజేస్తాను. ఆయన బాలేదంటే అలాగే డబ్బు తిరిగిద్దురు గాని”, అనేసి ఫోన్ పెట్టేశాడు.

అతని మాట మీద నమ్మకం కుదరకపోయినా, పంపించింది. రెండు గంటల్లో జడ్జీ గారి వ్యాఖ్యలు వాట్సాప్‌లో వచ్చాయి. ‘కథావస్తువు బాగుంది. సమాజంలో అణగదొక్కబడిన ఒక బలహీన వర్గంపై కథ రాయడం మామూలు విషయం కాదు. శిల్పం కూడా లోపాలు లేకుండా ఉంది. కొసమెరుపు అలరించింది. బహుమతికి తగ్గ కథ’.

ఆమెకి ఎందుకో నమ్మకం కుదరలేదు. ధీరజ్‌కి ధన్యవాదాలు చెప్పుకుని, సత్యవతి ఆలోచించింది. అవి న్యాయనిర్ణేత వ్యాఖ్యల్లా అనిపించలేదు తనకి. వార్తాపత్రికల్లో ఉత్తరం సారాంశంలా అనిపించింది. అదే మాట బయటికి అనేసింది కూడా. ధీరజ్ మాత్రం ఒక జోక్‌లాగ తీసుకుని, నవ్వి వదిలేశాడు.

***

ఆ రోజు ఆదాయప్పన్ను కమిషనర్ ఆఫీసులో చాలా హడావుడిగా ఉంది. నన్నయ్య సహస్రాబ్ది సందర్భంగా ఒక అంతర్జాల వారపత్రికకి ఎడిటర్‌గా ఉంటూ తెలుగు భాషకి ప్రోత్సాహాన్నిచ్చిన ఆదాయప్పన్ను శాఖ సూపర్నెంట్ దినకర్ ధీరజ్‌కి సన్మానం జరగబోతోంది. అదే సమయంలో అతను కథలు రాయడం ఎలాగనే అంశం మీద రచించిన పుస్తకం కూడా ఆవిష్కరింపబడుతోంది.

ట్రిమ్‌గా తయారయ్యి సభాస్థలికి చేరుకున్నాడు ధీరజ్. వాళ్ళ కమిషనర్ సమయానికి కాస్త ముందే అక్కడికి రావడంతో కార్యక్రమం మొదలయ్యింది. ధీరజ్‌ని పరిచయం చేసినప్పుడు ఆవిడ డాబు-దర్పం చూపించకుండా అతనికి ప్రతినమస్కారం చేసింది. ముఖ్య అతిథి అయిన ఆవిడ పక్కనే అతని ఆసనం ఉంది. ‘రాచదృష్టి తనమీద పడుతుం’దేమోనని భయపడుతూ బిక్కుబిక్కుమని కూర్చొన్నాడు ధీరజ్.

అది ఆఫీసు ఫంక్షన్ కనుక పెద్ద ఆఫీసర్లని ఎవరూ పేరు పెట్టి మాట్లాడరు. ‘అదనపు కమిషనర్ సర్’, ‘కమిషనర్ మేడమ్’, ఇలా సంబోధిస్తారు. కమిషనర్ మేడమ్ జ్యోతి ప్రజ్వలనం చేసింది; ధీరజ్ గురించి మాట్లాడుతూ, ఆఫీసులో అతని పనితీరుని, నిజాయితీని మెచ్చుకుంది. మాతృభాష మీద ప్రేమతో ఖాళీ సమయంలో ఎడిటర్‌గా పనిచేస్తున్నా, ఆ బాధ్యత కూడా సక్రమంగా నిర్వర్తించడం గొప్ప విషయమని కొనియాడింది.

ఆమె మళ్ళీ వచ్చి సీట్‌లో కూర్చొన్నప్పుడు, “మేడమ్, మీరు సుబ్బా.. సారీ, సత్యవతి గారా?” ఆశ్చర్యంగా అడిగాడు ధీరజ్. ఆమె నవ్వుతూ తల ఊపింది. “ఈ విషయం ముందే తెలుసా మీకు?” అన్నాడు ఆతృత అపుకోలేక. “ఈ కార్యక్రమం తలపెట్టినప్పటి నుండీ”, అని జవాబిచ్చింది సత్యవతి.

“ఎందుకు దాచారు మేడమ్? మీ గొంతు బట్టి గుర్తుపట్టాను గాని,” అన్నాడు ధీరజ్. “నేను దాచడానికి ప్రయత్నించలేదు. మీరే పట్టించుకోలేదు!” అందామె. ధీరజ్ ఆలోచించాడు – ఆమె ఫోటో, బయోడేటా ఎప్పుడూ చూడలేదు తాను; గట్టిగా చెప్పాలంటే ఎవరివీ చూసే సమయముండదు తనకు. ఆహ్వాన పత్రికలో ఓ సగటు సర్కారీ బాబులాగ అతిథుల పదవుల గురించి పట్టించుకున్నాడు గానీ పేర్ల గురించి కాదు.

“మేడమ్, నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. ఇంత పెద్ద ఆఫీసర్, అదే కమిషనర్‌ని కలిసే అవకాశం ఎంత మందికి దక్కుతుంది, చెప్పండి?” అని మురిసిపోయాడు ధీరజ్. “ఒక విషయం చెప్పండి. సంక్రాంతి పోటీల ఆ జడ్జీ ఎవరు?” అని అడిగింది సత్యవతి. మౌనం వహించాడు ధీరజ్. “అందుకే ఆ డబ్బు దేవుడి హుండీలో వేసేశాను”, అంది సత్యవతి.

“క్షమించండి కమిషనర్ మేడమ్, అది నేనే”, అన్నాడు ధీరజ్. “ఇది అఫీషియల్ ఫంక్షన్ కనుక క్షమించాను. నేను మీతో భాషాచర్చ చేసినప్పుడు మీరు ఎడిటర్ గారే, నేను సుబ్బాయమ్మనే!” అంది సత్యవతి. నిర్ఘాంతపోయి చూస్తున్న ధీరజ్‌తో, “స్థాయీభేదం పాటించక పోవడం మీకే కాదు, మాకూ తెలుసు,” మళ్ళీ తనే అంది నవ్వుతూ.

సమాప్తం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here