సన్ ఫ్లవర్స్

4
9

[డా. మధు చిత్తర్వు రచించిన ‘సన్ ఫ్లవర్స్’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]ఉ[/dropcap]దయించే సూర్య కిరణాలు పడి వెండి బంగారు కాంతులతో మెరిసిపోతోంది ఏడెన్ టవర్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్. జంట నగరాల శివారులలో 30 కిలోమీటర్ల దూరంగా నిర్మించిన 20 అంతస్తుల గాజు అద్దాలు స్టీల్ ఫ్రేములతో నిర్మించిన భవనం. 2050 సంవత్సరం, CE (Common Era). మహానగరం అంతా స్మార్ట్ సిటీగా రూపొందిన కొత్త శకం. కృత్రిమ మేధా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అన్ని వస్తువులలో కూడా తెలివితేటలు కల ఇంటర్నెట్ భద్రపరచబడి మానవ జీవితాన్ని ఎంతో సులభంగా తయారు చేయటానికి ఉద్దేశించిన అత్యాధునిక నివాస భవనం.

ఈ భవనంలో గోడలు మాట్లాడుతాయి. లిఫ్టులు లోపలికి ఎక్కిన వాళ్ళని చూస్తూ ఉంటాయి. రూములలో విద్యుత్ శక్తి ఉష్ణోగ్రత నీటి సరఫరా ఎవరికి ఎలా కావాలో ఆటోమేటిక్‌గా సరఫరా చేస్తూ ఉంటాయి.

ఆధునిక యుగంలో స్మార్ట్ సిటీలు నిలువుగా పెరిగిపోయినాయి. బహుళ అంతస్తుల భవనాలు, మాట్లాడే కార్లు, ట్రాఫిక్ నియంత్రించే రోబోట్ – పోలీసులు, డిజిటల్ వార్తలని అందించే హోలోగ్రాఫిక్ వార్తాపత్రికలు, ప్రభుత్వాన్ని నగర పాలనని ఎక్కడి నుంచో పర్యవేక్షించే కృత్రిమ మేధా!

ఉదయం 6:30 నిమిషాలు. అపార్ట్మెంట్ సెవెన్ బి. అంటే 7 అంతస్తు.

“శుభోదయం! శామ్యూల్ గారూ! ఇది జూలై 8వ తారీకు వారం ఉదయం 6:31. బయట టెంపరేచర్ 24 డిగ్రీలు ఉన్నది.” మధురమైన స్వరంతో స్త్రీ గొంతుకతో గోడల నుంచి సందేశం వచ్చింది. తనకి ఇష్టమైన భూపాలరాగంలో సితార్ వాదనలు గోడల నుంచి వస్తుండగా మేల్కొన్నాడు శామ్యూల్.

రాత్రంతా సరిగా నిద్రపోలేదు కానీ తెల్లవారి రెండు గంటలు కొంచెం గాఢ నిద్ర వచ్చింది. ఆ కాసేపట్లో కూడా ఏవేవో కలలు, ఎప్పటివో జ్ఞాపకాలు. సముద్రం అంచున తెల్లటి నురగలతో నీలి అలలు ఎగిరి పడుతూ ఉంటే బీచ్‌లో నడుస్తున్నట్లూ, మార్గరెట్ తన పక్కనే ఉన్నట్లూ, ఏవేవో మాటలు అస్పష్టంగా. మరుక్షణం చూస్తే ఆమె మాయమైపోయినట్లు, తనొక్కడే మిగిలిపోయి ఆమె కోసం వెతుకుతున్నట్లు. అది వైజాగ్‌లో 20 ఏళ్ల క్రితం వాళ్ళిద్దరూ కాపురం చేస్తూ ఉద్యోగం చేస్తున్న రోజుల జ్ఞాపకాలు. ఇప్పుడు ఎలా వచ్చాయి?

మెత్తటి రగ్గు తొలగించి లేచి నిల్చున్నాడు శామ్యూల్. యవ్వనంలో ఆరడుగుల ఆజానుబాహువు అతను, దృఢమైన శరీరం బలిష్టమైన చేతులు ఉండేవి. ఇప్పుడు నడుము వంగిపోయి శరీరం శుష్కించి, కండరాలు బలహీనపడి అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టంగా ఉంది.

“మీ కోసం వేడి బ్లాక్ కాఫీ రెడీ! కిచెన్‌లో కప్పులో కాఫీ మిషన్ లో ఉంది తీసుకోండి.” మళ్లీ గోడల నుంచి ఈవా గొంతు వినిపిస్తోంది.

నెమ్మదిగా కిచెన్ లోకి వెళ్లి వేడి కాఫీ సిప్ చేసిన తర్వాత శామ్యూల్‌కి కొంచెం శక్తి వచ్చింది. “ఇప్పుడు మీరు మీ డైలీ ఎక్సర్సైజ్ డంబెల్స్ 20 సార్లు చేయాలి.” ఈవా గొంతు మళ్లీ సూచించింది. “మీ బ్లడ్ ప్రెషర్ 160/90 పల్స్ 54 .బ్లడ్ షుగర్ 141. ఎక్సర్‌సైజ్ చేసినాక మీ బీపీ మందులు వేసుకోవాలి. ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్. దాని తర్వాత షుగర్ మందులు వేసుకోవాలి. ఎనిమిది గంటలకల్లా మీ బ్రేక్‌ఫాస్ట్ రెడీ అవుతుంది‌. మైక్రోఓవెన్ నుంచి తీసుకోండి!” అదృశ్యమైన స్పీకర్ల నుంచి గోడల నుంచి మాట్లాడుతూనే ఉంది. ఆమె మధురమైన స్వరం అయిపోయినాక మళ్ళీ సితార్ సంగీతం మంద్ర స్వరంలో వినిపిస్తోంది.

శామ్యూల్ జీవితం ఇప్పుడు ఒక అస్పష్ట జ్ఞాపకాల కలలు కప్పిన సమాహారం లాగ ఉంది. గతం సంగతి అలా ఉంచి నిత్యజీవితంలో కూడా మర్చిపోయిన తాళం చెవులు, ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడనే మరిచిపోవడం, జ్ఞాపకం ఉండని బంధువుల పేర్లు, రాసుకుంటే తప్ప గుర్తుండని దిన చర్య..

90 సంవత్సరాల వయసున్న శామ్యూల్ ఇప్పుడు ఒంటరి. ఇది ఒక సమస్య అయితే మెదడుకి జ్ఞాపక శక్తి దెబ్బతినే డిమెన్షియా అనే వ్యాధి రావడం మరొక శాపం. ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు ఏ మందులు వేసుకోవాలో, ఎప్పుడు బయటికి వెళ్లాలో, ఎప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళాలో చెప్పి అన్నీ అతని కనిపెట్టి చూసుకునేది ఏఐ ఈవా.

 9:30 ఏఎం. శామ్యూల్ కిటికీ దగ్గర నుంచి బాత్రూంలోకి వచ్చాడు. అద్దంలో తన బొమ్మ మీద హోలోగ్రాఫిక్ సందేశం‌.

“ఈ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి పొద్దున 10గంటల 30 నిమిషాలకు.”

అదే సమయంలో గోడల నుంచి అతనికి ఇష్టమైన రాజాధిరాజా అనే భక్తి గీతం వినవస్తోంది. అతను నెమ్మదిగా షేవ్ చేసుకుని,డ్రెస్ మార్చుకుని డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చినప్పుడు గోడల మీద పసుపుపచ్చ రంగుల లో వాన్ గో సన్ ఫ్లవర్ బొమ్మలు కనిపిస్తున్నాయి. అది కూడా అతనికి ఇష్టమైన పెయింటింగ్. “ఇప్పుడు బోన్సాయ్ మొక్కకి నీళ్ళు పోయాలి!” గుర్తుచేసింది ఇవా.

ఒక అరడజను బోన్సాయ్ మొక్కలు మర్రి చెట్ల లాంటివి ఒక పక్కనే ఉన్నాయి రెండు మగ్గులతో నీళ్లు తీసుకుని వాటికి పోశాడు.

సబ్జెక్ట్ సెవెన్ బి కారిడార్ లోకి వచ్చాడు.

లిఫ్ట్ దగ్గర నిలబడ్డాడు‌. గ్రౌండ్ ఫ్లోర్ లాబీలోకి అని కంఠస్వరంతో అడిగాడు. పాతకాలంలో లిఫ్టుల్లో పైకీ కిందకీ వెళ్ళటానికి బటన్స్ ఉండేవి. ఇప్పుడు లేవు. నున్నటి మెరిసే లిఫ్ట్ తెల్లటి గోడలమీద సబ్జెక్ట్‌కి ఇష్టమైన చిత్రాలు, ఇప్పుడు వాన్ గో సన్ ఫ్లవర్స్ పెయింటింగ్ కనిపించేలా చేసింది ఈవా‌. గ్రౌండ్ ఫ్లోర్.

సబ్జెక్ట్ హోటల్ లాబీలోకి ప్రవేశించాడు.

ఇక్కడ ఏసీ లతో చల్లగా ఉంది. మెత్తగా దీపాల వెలుతురు కప్పు లోంచి‌‌. ‌గోడలలో కనబడని స్పీకర్లలో నుంచి సన్నని సంగీతం. సబ్జెక్ట్ దగ్గర నిలబడగానే ప్రధాన ద్వారం అద్దాలు తలుపులు తెరుచుకున్నాయి.

10 గంటల 15 నిమిషాలకు డ్రైవర్ లేని బస్సు వచ్చింది. ఆగింది. సబ్జెక్టు బస్సులో ఎక్కి వెళ్లిపోయాడు. . ఇవా హార్డ్ డిస్క్ లోని లాగ్ బుక్కులో అన్నీ రాసుకుంది.

బస్సు 10:30 కి సీనియర్ సిటిజన్స్ హాస్పిటల్ ముందు ఆగింది. శామ్యూల్, డాక్టర్ వచ్చేంతవరకు డిజిటల్ మ్యాగజైన్ పేజీలు తిప్పుతూ కూర్చున్నాడు. పాత రోజుల్లో వార్తాపత్రికలు కాగితాలతో వుండటం బావుండేది అనిపించింది. 11 గంటలకి హోలోగ్రాఫిక్ డిజిటల్ రూపంలో ఉన్న డాక్టర్ అసిస్టెంట్ తెల్లకోటు వేసుకుని “గుడ్ మార్నింగ్ శామ్యూల్” అని పలకరించింది. శామ్యూల్ మెడికల్ హిస్టరీ అంతా ఆమెకు తెలుసు‌. అతని బిపి గుండె ఊపిరితిత్తులు అన్ని పరీక్షించి నోట్ చేసుకొని, ఆ తర్వాత డాక్టర్ రూమ్ లోకి తీసుకువెళ్లింది డాక్టర్ “హౌ ఆర్ యూ? మిష్టర్ శామ్యూల్!”అని పలకరించాడు. “నేను బాగానే ఉన్నాను డాక్టర్. కానీ గత సంఘటనలు కొన్ని తరచూ కలలోకి వస్తూ ఉంటాయి. ఇప్పటి సంఘటనలు అయితే మర్చిపోతూ ఉంటాను. పెట్టిన వస్తువులు ఎక్కడ ఉన్నాయో గుర్తుండదు. అన్నిటికీ ఈవా మీద ఆధారపడుతున్నాను. అది ఒకటే సమస్య.”

“డోంట్ వర్రీ మిస్టర్ శామ్యూల్. మీకు గుర్తు ఉండకపోయినా ఈవా మీకు గుర్తు చేస్తూనే ఉంటుంది. మీ మెడికల్ పరిస్థితి అంతా మాకు తెలియజేస్తూ ఉంటుంది. మీ షుగర్ మందులు బీపీ మందులు జ్ఞాపక శక్తిని పెంచే మందులు మళ్ళీ ఒక నెలకి రాస్తున్నాను. ఒక నెల తర్వాత మళ్లీ రివ్యూకి రండి. టేక్ కేర్. బై!” అని వీడ్కోలు చెప్పాడు డాక్టర్.

మళ్లీ డ్రైవర్‌లెస్ బస్‌లో కూర్చుని కిటికీ అవతల నుంచి మారిపోయిన దృశ్యాలన్నీ చూస్తూ ఈడెన్ అపార్ట్మెంట్స్‌కి తిరిగి బయలుదేరాడు‌. ఎత్తైన బహుళ అంతస్తుల భవనాలు హోలోగ్రాఫిక్ డిజిటల్ ప్రకటనలతో, రోడ్డుమీద ఆటోమేటిక్ కార్లు, ఆటోమాటిక్ ట్రాఫిక్ లైట్లు, ..అంతా మారింది. తను అదే రోడ్ల మీద ఎన్నో సంవత్సరాలుగా తిరిగిన పాత రోజులు గుర్తుకొస్తాయి.

లాబీలోకి ప్రవేశించేసరికి గోడలన్నిటిమీద ఒకసారి “వెల్కమ్ బ్యాక్ మిస్టర్ శామ్యూల్” అనే మెసేజ్ కనిపించింది. లాబీ అంతా చల్లగా ప్రశాంతంగా ఉంది. సోఫాల్లో అక్కడక్కడ అపార్ట్మెంట్లోని వృద్ధులు పేపర్ చదువుకుంటూ, కొంతమంది పిల్లలు ఆడుకుంటూ కనిపించారు.

సబ్జెక్ట్ తిరిగి వచ్చాడు‌. లిఫ్ట్ లోకి ప్రవేశించాడు.

శామ్యూల్ 7B అపార్ట్మెంట్ కి తిరిగి వెళ్ళాడు. సమయం 12 గంటలు. “లంచ్ టైమ్ మిస్టర్ శామ్యూల్!” అని చెప్పింది ఇవా.

ఇక్కడ గోడల్లో నుంచి సందేశాలు వస్తాయి. అందర్నీ పరీక్షిస్తుంటాయి. అందరి ఆరోగ్యం బాగోగులు ఇవా చూసుకుంటూ ఉంటుంది. 9C లో ఉన్న రామారావు గారికి కీళ్ల నొప్పి ఎక్కువ అవుతుంది. 13Aలో యువ జంట పోట్లాడుకుని బ్రేకప్ దాకా వస్తుంది. అన్నిటినీ నోట్ చేసుకుంటుంది. ప్రమాదకరమైన సంఘటనలనే తీసుకుంటుంది. వ్యక్తిగత జీవితంలో కలుగచేసుకోదు. అందరి వివరాలు డేటా రహస్యంగా వుంటుంది అని కాంట్రాక్టు లోనే వుంటుంది. అయితే ఇవా అందరికీ సాయం చేస్తూ వుంటుంది. “మీ లంచ్ టైం. రెండు చపాతీలు, ఆకుకూర ఒక కప్. ఉడకపెట్టిన గుడ్డు. ఒక కప్ కర్డ్”. ఆ తర్వాత శామ్యూల్ గాజు కిటికీలోంచి అవతలి దృశ్యాలను చూస్తూ గోడల మీద తనకి ఇష్టమైన వాంగో పెయింటింగ్స్ వివిధ రకాల రంగులో మారుతుండగా లంచ్ ముగించాడు‌.

1PM. “కొంచెం సేపు కాలక్షేపం కోసం చదరంగం ఆడుతారా?” కళ్ళ ముందు వర్చువల్ చెస్ బోర్డు ప్రత్యక్షమైంది. ఒక అరగంట ఈవాతో చదరంగం ఆడే సరికి శామ్యూల్ కి నిద్ర వచ్చేసింది.

సబ్జెక్ట్ తిరిగి వచ్చాడు. నిద్రపోతున్నాడు. అయితే ఇతని జ్ఞాపకశక్తి క్రమంగా క్షీణిస్తోంది. చదరంగం ఎత్తులలో ఇదివరకటి తెలివి కనబడటం లేదు.

నోట్ చేసుకుంది ఇవా.

ఇది డాక్టర్ కి తెలియజేయాలా?

ఈవా ఒక కంప్యూటర్ కృత్రిమ మేధ మాత్రమే. అయినా ఈమధ్య ఆమెకు సొంతంగా సందేహాలు వస్తున్నాయి. మనుషులకి మెదడులో జ్ఞాపకశక్తి ఎందుకు తగ్గిపోతుంది? వారి హార్డ్ డిస్క్ బాగు చేయటానికి వీలు లేదా. నా మెమరీలో రిపేర్ వచ్చినప్పుడు బాగు చేస్తారు కదా. హ్యూమన్స్‌కి ఎందుకు బాగు చేయలేరు?

అన్నీ తెలిసిన జ్ఞాని, ఇంకా తనని కంట్రోల్ చేసే యూనివర్సల్ నెట్ (యూనీ అంటారు)ని అడిగింది. “మనుషులకి జబ్బులు వస్తాయి. కొన్ని జబ్బులు తీవ్రంగా వస్తాయి. అవి కారణం ఇంకా తెలియనివి‌. కొన్నిటికి మందులు లేవు. క్రమక్రమంగా వారి జీవ కణాలు నశించిపోయి చనిపోతాయి. అల్జీమర్స్ డిమెన్షియా అనే జబ్బుకు మందు లేదు. ఇది మెదడులో కణాలు ఎమైలాయిడ్‌తో నిండి పాడయిపోయినందువల్ల వస్తుంది. ఇంకా రక్తప్రసరణ లోపం వల్ల, ప్రయాన్‌లు అనే వైరస్‌ల వల్ల కూడా డిమెన్షియా వస్తుంది. నీ కంప్యూటర్ హార్డ్ డిస్క్ అయితే మళ్లీ రిపేర్ చేసి ప్రోగ్రాం చేయొచ్చు. మనిషి మెదడు పాడయితే కనుక ,బాగా చేయడం ఇంకా కనిపెట్టలేదు. నీ కయితే కృత్రిమ మేథవి కాబట్టి మరణం లేదు” అని సమాధానం వచ్చింది.

ఇవాకి అనుభూతి లేదు. కానీ చర్య, ప్రతిచర్య ప్రోగ్రాం ప్రకారం నడుచుకుంటూ చేసుకుని పోవడమే తెలుసు.

అయితే శామ్యూల్ అనే సబ్జెక్ట్ కి ప్రాధాన్యత ఇవ్వాలి. సాయంచేయాలి. పరిశీలిస్తూ వుండాలి.

ఏడెన్ టవర్స్ లో ఈవా అందర్నీ పరిశీలిస్తూనే ఉంటుంది,‌ సాయం చేస్తూనే ఉంటుంది. 13 బిలో ఉన్న విశాలాక్షి గారికి నడుము, కాలు నొప్పి ఎక్కువైతే ఆటోమేటిగ్‌గా ఎలక్ట్రిక్ వాటర్ బెడ్ ప్రెషర్ సరిచేస్తుంది. పక్కపక్కనే అపార్ట్మెంట్ లలో కొత్తగా చేరి పరిచయం అయిన వృద్ధులు మాట్లాడుకుంటుంటే వారి సంభాషణ విని, స్నేహానికి దోహదం చేస్తుంది‌. వారి గురించిన డేటా అంతా ఆమెకి తెలుసు. ఇద్దరికీ ఆసక్తికరమైన విషయాలు వారికి తెలియజేస్తుంది. అవి క్రికెట్, రాజకీయాలు, పాత సినిమా పాటలు ఏవయినా కావొచ్చు. మరో గదిలో ప్రేమికులు వాగ్వాదం లోకి దిగి బ్రేక్ అప్ దాకా వచ్చి కన్నీరు కారిస్తే వాళ్లకి, మంచి ప్రేమ సంగీతం వినిపిస్తుంది. గేమ్స్ రూములో పిల్లలు ఫుట్‌బాల్ ఆడుతూ శబ్దాలు ఎక్కువ చేస్తే ఎవరికి అసౌకర్యం కలగకుండా ఆ శబ్దం వినిపించకుండా గోడల సౌండ్ ప్రూఫ్‌ని ఎక్కువ చేస్తుంది.

ఈరోజు శామ్యూల్ గారు ఉద్రికంగా ఉన్నారు. ఆయన 7B అపార్ట్మెంట్ హాల్లో అటు ఇటు వేగంగా పచారులు చేస్తున్నారు. ఉన్నట్టుండి ఎగిరి గెంతుతున్నారు. గాలిలో పిడికిలి బిగించి బాక్సింగ్ చేసినట్టు ఎవరినో కొట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. తుపాకీ పట్టుకుని అదృశ్య వ్యక్తులని పేల్చి వేసినట్లు ప్రవర్తిస్తున్నారు.

ఆయన కేమయింది? మానసిక ఒత్తిడి ముదిరి పోయిందా?

ఇవా శామ్యూల్ గారి గత చరిత్రని తన మెమరీలో, ఇంకా ఇంటర్నెట్ సాధనాలలో ఒకసారి మళ్లీ వెదికి చూసింది. నలభైఏళ్ళ కింద యవ్వనంలో మిలిటరీలో పని చేశారు ఆయన. బహుశా కార్గిల్ ప్రాంతంలో యుద్ధంలో పనిచేశారు అని తెలిసింది. ఎందుకు హఠాత్తుగా ఆ జ్ఞాపకాలు ఆయనకి ఇప్పుడు మెదడుని కలిచి వేస్తున్నాయి. ఆయన చాలా ఆందోళనగా ఉన్నారు.

ఇదొక డిమెన్షియా సైకోసిస్‌నా? ఎమర్జెన్సీ చికిత్స అవసరమా!

ఇవా 7B అపార్ట్మెంట్ గోడల మీద డిజిటల్‌గా మంచు పర్వతాల దృశ్యాలు, కొండలు, ట్యాంకులు నడవడం యూనిఫారంలో గన్స్ పట్టుకుని పరిగెత్తే సైనికుల దృశ్యాలూ సృష్టించింది. శామ్యూల్ గారు హఠాత్తుగా ఆ వాతావరణం లోకి మానసికంగా వెళ్లిపోయారు. కాసేపటికి కొంచెం శాంతించారు.

శత్రువులను మట్టుపెడుతున్న తుపాకుల శబ్దాలూ, పొగలు కక్కుతున్న బాంబుల పేలుళ్లు, ఎముకలు కొరికే చల్లటి మంచు గాలి. ఆ యుద్ధ దృశ్యంలోకి ఆయన మనసు వెళ్లిపోయింది.

“అవును! నాకు జ్ఞాపకం వస్తోంది. అవును నాకు జ్ఞాపకం వస్తోంది! ఆ రోజుల్లో నేను వీరోచితంగా పోరాడేవాడిని!” క్రమంగా ఆయన మనసు శాంతించింది. సోఫాలో కూలబడ్డారు. ఆయన గుండె వేగం తగ్గింది. బీపీ మళ్లీ 140/ 80 కి వచ్చింది. ఇవా గోడల మీద దృశ్యాలు మార్చి మళ్లీ ఆయనకి ఇష్టమైన సన్ ఫ్లవర్ పూల తోటని చూపించ సాగింది.

“నాకు తెలుసు మిస్టర్ శామ్యూల్! మీ భార్యకు సన్ ఫ్లవర్లు అంటే ఇష్టం. మీక్కూడా సన్ ఫ్లవర్స్ అంటే ఇష్టం. ఆ సన్ ఫ్లవర్ పూల తోటలు చూడండి. మీరు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి!”

పైకప్పులో దాగివున్న స్పీకర్స్ నుంచి ప్రశాంతమైన సితార్ వాదన రాసాగింది. వేదనపడిన మనసులకి జ్ఞాపకాల గందరగోళంలో తప్పిపోయిన జీవితానికి స్వాంతన ఇచ్చే ఇవా, “సబ్జెక్ట్ ఇప్పుడు ఆందోళనగా లేడు. శాంతంగావున్నాడు. దేరీజ్ నో ప్రాబ్లం!”అని నోట్ చేసుకుంది.

***

ఆ రోజు ఈడెన్ టవర్స్ 25వ వార్షికోత్సవం. పై అంతస్తు డాబా మీద అపార్ట్మెంట్లలో ఉండే వారందరూ సమావేశమయ్యారు. అందంగా అలంకరించిన వేదిక పైన మైకులు సౌండ్ సిస్టం పాటలు ఏర్పరిచారు. కొందరికి భక్తి సంగీతం, కొందరికి శాస్త్రీయ సంగీతం, కొందరికి ఆధునిక పాప్ మ్యూజిక్, పాటలు కావాలి. ఎవరికి కావలిసినవి వారికి వినిపించారు‌. నివాసితులలో కొంతమంది తమ కళలని ప్రదర్శించి, పాటలు పాడారు. ఈవా ఆకాశంలో అందమైన ఫైర్ వర్క్స్ ఏర్పాటు చేసింది. అవి పూల పూలుగా నక్షత్రాల జల్లులుగా హోలోగ్రాఫిక్ కుందేళ్లు పక్షులు పువ్వుల రూపంలో ఏర్పడి అందరికీ ఆనందాన్ని కలగజేశాయి. ఒక్కొక్కరు మైక్ దగ్గర నిలబడి రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇచ్చారు. హోలోగ్రాఫిక్ డిజిటల్ రూపంలో ఇవా అమ్మాయి ప్రోగ్రాం నడిపిస్తూ ఒకొక్కరినీ ఆహ్వానించి పిలిచింది. శామ్యూల్ గారు వచ్చి వేదిక మీద మైక్ పట్టుకున్నారు. “నాకు సంతోషంగా ఉంది. ఏడెన్ టవర్స్‌లో జీవితంలో అస్పష్టమైన జ్ఞాపకాల మథ్య గత జీవితానికీ వర్తమానానికీ వారధి వెతుక్కుంటూ అసందిగ్థంగా ఉన్న నాకు ఈవా ఎంతో సాయం చేస్తోంది. జీవిత చరమాంకంలో వున్న నాకు ఇవా ఒక పెద్ద తోడు నీడ అయింది. డియర్ ఇవా! ధన్యవాదాలు!”

అందరి కరతాళ ధ్వనులు ఆకాశాన్ని అంటాయి. వారి వారి జీవితాల్లో ఆ సాయంత్రం ఒకమధుర ఘట్టం.

***

అయితే అంతా అనుకున్నట్లు జరగదు. రోజులన్నీ ఆనందంగా గడవవు. మానవ జీవితాలు రోలర్ కోస్టర్ రైడ్‌లో నడుస్తూ ఉంటాయి. ఒకసారి సంతోషం. ఒకసారి దుఃఖం. బయలాజికల్ జీవితాలు శాశ్వతంగా ఆనందంగా నడవవు. జీవకణాలు అశాశ్వతమైనవి. డిజిటల్ యంత్రాలు కూడా అశాశ్వతమైనప్పటికీ, ఎప్పటికప్పుడు తమని తాము బాగు చేసుకుని శాశ్వతంగా జీవిస్తున్నట్లే ఉండిపోతాయి. ఆ రోజు హాస్పిటల్‌కి వెళ్ళిన శామ్యూల్ తిరిగి రాలేదు. మామూలుగా మధ్యాహ్నం 12 గంటలకు అలా తిరిగి రావాల్సిన శామ్యూల్ ఆ రోజు బస్సు దిగలేదు.

7B సబ్జెక్ట్ బస్ దిగలేదు. నోట్ చేసుకుంది ఈవా. లాబీలు,అన్ని గదులలో డిజిటల్ నోటీసు బోర్డుల మీద సందేశం కనిపించింది.

మిస్టర్ శామ్యూల్ సెవెన్ బి లో ఉంటారు. వయసు 90. కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ. మీలో ఎవరైనా చూశారా?

సెవెన్ సీ లో ఉండే రంగనాథ్ “నేను ఆయన్ని బస్సులో వెళుతుండగా చూశానే! అయితే తిరిగి వచ్చినప్పుడు కనపడలేదు.” అని ఇంటర్ కాం మైకులోచెప్పారు. అందరికీ వినపడింది.

ఈవా యాక్షన్ లోకి దిగింది. ఆటోమేటిక్ బస్సు ప్రయాణ మార్గం అంత జిపిఎస్‌లో తనిఖీ చేసింది. సిటిజన్ హాస్పిటల్ రికార్డ్స్ పరిశీలించింది. ఆ హాస్పిటల్ రిసెప్షనిస్ట్‌ని, హాస్పిటల్ డాక్టర్‌ని, ఆయన డిజిటల్ అసిస్టెంట్‌ని ఇంటర్నెట్ మెసేజెస్ ద్వారా సంప్రదించి శామ్యూల్ ఎప్పుడు వచ్చారో, ఎప్పుడు వెళ్ళి పోయారో తెలుసుకుంది. సమీపంలో ఉన్న గచ్చిబౌలి, పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లకి మెసేజ్ ఇచ్చింది. శామ్యూల్ ఫోటో ఆయన వివరాలు అన్నీ పంపింది. అంతే కాదు ఇతర ప్రముఖ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ రూములలో అన్నిట్లో కూడా ఈ రూపంతో ఉన్న వ్యక్తి ఎడ్మిట్ అయ్యారేమో చూడమని సందేశాలు పంపించింది. ఆ సాయంత్రం వరకు ఏ సమాధానం రాలేదు.

సబ్జెక్ట్ మిస్సింగ్.

ఈవా కృత్రిమ మేధకి ఆందోళన భావాలు బాధలు ఉంటాయా! ఏమో! ఈవా హడావిడిగానే ఉంది. అసలే శామ్యూల్ వృద్ధుడు‌‌. పైగా జ్ఞాపకశక్తి లోపం. ఎక్కడికి వెళ్లి ఉండవచ్చు?

చీకటి పడింది. ఏడెన్ టవర్స్ లోనూ, బయట వీధులలో దీపాలు వెలిగాయి. క్రమ క్రమంగా 8 PM, 9 PM, 10 PM,.. అర్ధరాత్రి సమీపిస్తోంది. నిరంతరం పనిచేసే ఈవా తనకి చేరిన సమాచారానంతటినీ విశ్లేషిస్తోంది. శామ్యూల్ ఎక్కడ అని వెతుకుతూనే వుంది.

తెల్లవారి నాలుగున్నరకు పోలీస్ స్టేషన్ నుంచి ఒక సందేశం వచ్చింది. నెక్లెస్ రోడ్ హూసేన్సాగర్ తీరంలో ఒక పార్కులో ఒక వృద్ధుడు కూర్చుని ఉండటం గమనించారు.

ఆ చుట్టుపక్కల సీసీ కెమెరాల్లో ఒక వృథ్థుడు ఆ మథ్యాహ్నం నడుచుకుంటూ అక్కడ ఏర్పరిచిన తోటలోకి వెళ్ళటం ఒక సిమెంట్ బెంచ్ మీద కూర్చోవడం కనిపించింది. ఆయన అక్కడ నుంచి కదలటం లేదు.

ఆయన రూపం, ఎత్తు, థర్మల్ సిగ్నల్ శామ్యూల్ రూపంతో సరిపోలి ఉన్నాయి.

ఈవా మెసేజ్ ఇచ్చింది. “మా అపార్ట్మెంట్ సెవెన్ బిలో ఉన్న సబ్జెక్ట్ శామ్యూల్ కావచ్చు. ప్లీజ్ వెళ్లి వెతకండి! ఆయనను తీసుకురండి! మేము ఏడెన్ టవర్స్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ నుంచి కోరుతున్నాము!

పోలీసులు వెళ్ళినప్పుడు అప్పుడే తెల్లవారుతోంది. తూర్పు దిక్కు ఎర్రబడుతోంది. అక్కడ ఏర్పరచిన తోటలో పొడుగాటి చెట్ల మధ్య అస్పష్టంగా నీడలలో ఒక సిమెంట్ బెంచి మీద నిశ్చలంగా కూర్చుని ఉన్న వృద్ధ వ్యక్తి. ఆయన ఎదురుగా అందమైన సూర్యకాంత పూల తోట ఉన్నది. సన్ ఫ్లవర్ గార్డెన్. ఆ సూర్య కాంతపూలన్నీ తూర్పు వైపు తిరుగుతున్నాయి. ఉదయించే సూర్య కాంతి వైపు చూస్తున్నాయి.

ఈవా పోలీసుల్ని ఫోన్లో అడిగింది. “శామ్యూల్ ఎలా ఉన్నారు? ప్లీజ్! చెప్పండి!

దగ్గరికి వెళ్లి ఆయనను కదిలించడానికి ప్రయత్నం చేయగానే ఆయన శరీరం కుప్పకూలిపోయింది.

శ్వాస ఆడటం లేదు.. సన్ ఫ్లవర్ గార్డెన్‌లో రాత్రంతా గడిపిన శామ్యూల్ ప్రాణాలు అనంత వాయువుల్లో లీనమై పోయినాయి.

కొద్దిసేపు తర్వాత ఏడెన్ టవర్స్ లాబీ ముందు ఒక అంబులెన్స్ ఆగింది. తలుపులు తెరుచుకుని ఒక స్ట్రెచర్ మీద తెల్లటి దుప్పటి కప్పిన శామ్యూల్ శరీరాన్ని లాబీలోకి తీసుకువచ్చారు.

ఈవాని కంట్రోలింగ్ చేసే యూనివర్సల్ నెట్ ఆమె హార్డ్ డిస్క్ లోకి కమాండ్ పంపింది.

‘శామ్యూల్ మరణించారు అనే సందేశం అన్ని డిజిటల్ బోర్డుల మీద ప్రదర్శన చెయ్. శామ్యూల్ డెడ్. రెస్ట్ ఇన్ పీస్’.

అందరికీ అన్ని పరిస్థితుల్లో సందేశాలు పంపి సూచనలు చేసి ఉత్సాహపరిచే ఈవా కృతిమ మేధా ఎందుకో తడబడింది. స్పందన భావాలు లేకుండా తన కోడ్ లోని ప్రోగ్రాం ప్రకారం పని చేసుకుంటూ పోయే ఈవా హఠాత్తుగా బాథ, విచారం లాంటి అనుభూతి ఏదో పొందసాగింది.

మరణం అంటే ఏమిటి. నాకు చెప్పాలి! నేను తెలుసుకోవాలి!

“మరణం మనుషులకు వస్తుంది. అది తప్పదు. జీవరాశులన్నిటికీ వస్తుంది. ప్రతి సబ్జెక్టుకీ నిర్దిష్టమైనటువంటి జీవన కాలం ఉంటుంది. ఆ తర్వాత అవి నశించి పోతాయి” చెప్పింది యూని నెట్.

మళ్లీ ఆయన్ని రిపేర్ చేయలేమా?

చేయలేము.

ఒకసారి నా దగ్గర మాల్ ఫంక్షనింగ్ వస్తే రిపేర్ చేశారు కదా. అలాగే ఆయనకు కూడా చేయొచ్చు కదా!

ఇవా. నీకేమైంది. నీ పని నేను చెప్పినట్లు చేయటం. ప్రశ్నలు వేయటం కాదు.

ఈవా ఆలోచనలో పడింది. శామ్యూల్ జీవితంలో గతించిన దృశ్యాలన్నీ ఆయనకి ఇష్టమైన మనుషులు జ్ఞాపకాలు స్మృతులు అన్ని ఈవా ఫైల్లో ఉన్నాయి.

శామ్యూల్ గారి శరీరం ఒక శీతలమైన గాజు పెట్టెలో పడుకోబెట్టారు లాబీలో. క్రమ క్రమంగా అందరు వచ్చి ఆయనకి పూలదండలు వేసి నివాళి అర్పించ సాగారు.

శామ్యూల్ కిష్టమైన క్యాండిల్స్ ఇన్ ది విండ్ అనే పాటను ఎన్నుకుని అన్ని స్పీకర్స్‌లో వినిపించేట్లు చేసింది ఈవా. లాబీల్లోని గోడల పైన డిజిటల్ బోర్డుల పైన సూర్యకాంతిలో వూగే సన్ ఫ్లవర్ పువ్వుల దృశ్యాలు చూపించసాగింది.

యవ్వనంలో శామ్యూల్ ఆయన భార్య మార్గరేట్ పెళ్లి ఫోటోలు, ఆయన మిలిటరీలో వున్నప్పటి ఫోటోలు, ఆయనకి మిలిటరీ మెడల్స్ ఇస్తున్న ఫోటోలు ఫైల్‌లో ఉన్నాయి. అవి ఇంటర్నెట్ నుంచి సేకరించి ప్రదర్శించ సాగింది ఈవా. శామ్యూల్ గారి కూతురికి ఎమర్జెన్సీ సందేశం పంపించింది.

శామ్యూల్ ఇస్ నో మోర్. ప్లీజ్ కం టు ఏడెన్ టవర్స్ ఫర్ కలెక్టింగ్ ది బాడీ!

కానీ ఈవా మనసులో, అంటే అదే ఆమె డిజిటల్ చేతనలో, మరణం అంటే ఏమిటి, మరణాన్ని ఎలా ఆపాలి. శామ్యూల్ని ఎలా తిరిగి తీసుకురావాలి.. అనే ప్రశ్నలు మళ్లీ మళ్లీ యూనిట్‌కి పంపిస్తూనే ఉంది.

జీవకణాల ప్రోగ్రామింగ్ వేరు. డిజిటల్ ప్రోగ్రామింగ్ వేరు. మళ్లీ మళ్లీ ఇలాంటి ప్రశ్నలు అడిగావ్ అంటే నిన్ను ఇనాక్టివేట్ చేస్తాను. షట్ అప్ అండ్ డు యువర్ వర్క్. యూనిట్ నుంచి మళ్లీ సందేశం వచ్చింది.

నో! నో! నేను ఒప్పుకోను. మళ్లీ ప్రశ్నిస్తూనే ఉంటాను. మరణం అంటే ఏంటి. ఎందుకు మనుషుల్ని ఎందుకు బాగు చేయలేం?

ఈవా ప్రశ్నిస్తూనే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here