రంగుల హేల 11: సున్నితత్వాలు – కఠినత్వాలు

1
11

[box type=’note’ fontsize=’16’] “మనకున్న లోకజ్ఞానంతో మనల్ని మనం పరిస్థితులకు/పరిసరాలకు అనుగుణంగా మలచుకుని ఆటో సజెషన్స్ ఇచ్చుకోకపోతే మన మనుగడ కష్టమైపోతుంది” అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మిరంగుల హేల” కాలమ్‌లో. [/box]

[dropcap]చ[/dropcap]దువుకునేటప్పుడు ఎంతో సుకుమారంగా, దయార్ద్రపూరితంగా ఉండేవాళ్ళం. హైస్కూల్‌లో ఉండగా పాత ‘దేవదాసు’ సినిమా చూసి నేను వారం రోజులు జ్వరపడ్డాను. ఆ తర్వాత ‘మరోచరిత్ర’ సినిమా చూసి అదే పరిస్థితి. ఇంకా చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో చదువుతుండగా ‘మనుషులు మారాలి’ సినిమా చూస్తూ హాల్లో వెక్కి వెక్కి ఏడ్చాను. పక్కనున్న పెద్దవాళ్ళు ఎవరూ జాలి పడకపోగా “నోర్ముయ్” అన్నారు. ఇప్పటికీ ‘చీకటిలో కారుచీకటిలో’ పాట అనే వింటే ఆ దుఃఖపు వరద గుర్తొస్తుంది.

క్రమంగా వయసు పెరిగింది. చదువు పూర్తి చేసి ఉద్యోగం చేస్తూ, సంసారంలో పడి యాభయ్యేళ్ళు వచ్చేవరకూ ఆ సున్నితత్వాన్ని కాపాడుకుంటూనే వచ్చాను. అయితే ఇటీవల కొన్ని సంవత్సరాలుగా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి చూసి నా హృదయం యొక్క రియాక్షన్ పూర్తిగా మారిపోయింది. సున్నితంగా స్పందించే హృదయపు పొరేదో పిగిలిపోయిందని నాకనుమానంగా ఉంది, డప్పు చాలా గట్టిగా బాదితే అది పగిలిపోయినట్టు.

నిత్యం వార్తా పత్రికల్లో, టీవీ ఛానళ్లలో వార్తలు విని వినీ మనలో స్పందన తగ్గిపోయింది. పదేళ్ల క్రితం ఒక చోట ఆక్సిడెంట్ అయ్యి కొందరు చనిపోవడం, ఎక్కడో పడవ మునిగి మరి కొందరు మరణించడం జరిగితే నెలల తరబడి ఆ బాధని అందరం మోస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అనునిత్యం సిటీ పేపర్ నిండా మరణవార్తలే. హింసాత్మక పరువు హత్యలూ, కొడవళ్ళ, కత్తుల దాడులూ ఇంకా అనేక రకాల పరమ భీభత్స సమాచారమే!

ఇవన్నీ చదివి చదివీ మనం మొద్దు బారిపోయాం. ఇదివరకు ఎవరన్నా విద్యార్థి పరీక్ష ఫెయిల్ అయ్యి ఆత్మహత్య చేసుకుంటే రెండు మూడు రోజులు అదే కడుపులో మెదిలి విలవిల్లాడేవాళ్ళం. అయ్యో! బంగారం లాంటి పిల్లాడు మట్టిలో కలిసిపోయాడే అని.

ఇప్పుడైతే పోతేపోయాడులే, ఇవాళ కాకపోతే మరో సమస్యేదో వచ్చినప్పుడైనా పోయేవాడే. పెందరాళే పోయాడు ఒక పనైపోయింది. ఇలా బ్రతుకంటే భయపడే వాడికి బ్రతకడం కష్టమే మరి అనిపిస్తోంది. మన మృదువైన మనసు పెట్టే బాధను భరించి భరించి కూడా ఇలా కరడు కట్టిపోకపోతే మనం అన్యాయమైపోతాం.

ఎక్కడో ఒక చోట బాంబు బ్లాస్ట్ జరుగుతుంది. ఓ పాతిక మంది చనిపోతారు. ‘ఈ దురాగతానికి కారణం మేమేనని ఏ తీవ్రవాద సంస్థా ఇప్పటివరకూ ప్రకటించలేదు’ అని టీవీలో యాంకర్ యాంత్రికంగా వార్తలు చదువుతుంటే మనం ఏ స్థితికి వెళ్లిపోయామో అర్థమౌతుంది. ఇలాంటి సందర్భాలలో మనం ఎంత బాధ పడీ ప్రయోజనం ఏమన్నా ఉందా! గుండె రాయి చేసుకోకపోతే మన పరిస్థితి ఏంటి?

‘బంగారం మెరుగు పెడతామని ఇంటికొచ్చిన ఇద్దరు రౌడీలు గొలుసులు చెంబులో వేసుకుని పరారు.’ అదో న్యూస్. ఇన్ని ప్రచార సాధనాలు వచ్చి, ఇలాంటి కధానాలెన్నో విని కూడా ఆడవాళ్లు అలా వెర్రి గొర్రెల్లా ముక్కు మొహం తెలీని వాడికి మెడలో వస్తువులు తీసి (భర్తకే ఇవ్వం కదా) ఇవ్వడం ఏమిటి? వళ్ళు మండి పోయి బాగా అయింది అని చిరాకు పడకుండా, ఈ కథ విని అయ్యో అని జాలి పడగలమా?

‘తాగి వచ్చిన భర్త చేతిలో భార్య హతం.’ ఇదొక వార్త. వాడింత ఘనుడని తెలిసీ ఆ భర్తతోనే ఉండాలనుకోవడం, ప్రమాదమని తెలిసీ అక్కడే కాపురం వెలిగించడం జాలి కలిగిస్తుందా? నాలుగిళ్ళలో సహాయకురాలిగా పని చేసుకుంటే బ్రతకలేక పోయేదా అని కోపం కలిగిస్తుందా? మీరే చెప్పండి.

‘తోటి విద్యార్థినిపై ప్రేమించలేదని యాసిడ్ పోసిన యువకుడు’ – ఈ కలికాలంలో విద్యార్థులు శాడిస్టులుగా పరిణామం చెందారని తెలిసి తెలిసీ మగ కీటకాలతో స్నేహంగా ఉండడం అవసరమా? వాడు ప్రేమించేదాకా తెచ్చుకుని ఆపై ‘నో’ చెప్పి యాసిడ్ పోయించుకునే పరిస్థితి రాకుండా జాగ్రత్త పడలేరా ఈ పిచ్చి అమ్మాయిలు అని అరుస్తామా లేదా చెప్పండి!

‘నన్నేపెళ్లాడు’ అంటూ వాడి ఇంటిముందు ధర్నా చేసే ఆడపిల్లల్ని చూడగానే వీళ్లకి ఆత్మాభిమానం లేదా? నీతో పనైపోయింది నిన్ను నేను పెళ్లాడను అన్నవాడితో దెబ్బలాడి పబ్లిక్ సింపతీ సంపాదించి వాడి తల్లి తండ్రుల్ని బెదిరించి ఆ దరిద్రుడితోనే కాపురం చేస్తాననడం పిచ్చితనం కాదా! ఒక వేళ వాడు పెళ్ళాడినా ఏ రోజు ఏం చేస్తాడోనని భయం వెయ్యదా! ఇలాంటి వెర్రి ఆడపిల్లల్ని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకుపోవాలని మనకనిపిస్తే తప్పేం ఉంది? చెప్పండి?

మనకున్న లోకజ్ఞానంతో మనల్ని మనం పరిస్థితులకు/పరిసరాలకు అనుగుణంగా మలచుకుని ఆటో సజెషన్స్ ఇచ్చుకోకపోతే మన మనుగడ కష్టమైపోతుంది. ఈ లోక బాధల్ని గురించిన ఆలోచనలుచేస్తూ పోస్తే అవి స్లో పోయిజన్లాగా మారి మన ఆరోగ్యం చెడుతుంది. ఆపై మనం ఇతరుల మీద ఆధార పడి ఆనక సైకియాట్రిస్టుల కౌన్సిలింగ్ బారిన పడతాం. అవసరం గల వారికి మన వల్ల చెయ్యగల సహాయం చెయ్యడం ఎప్పుడూ మంచిదే తప్ప అతిగా స్పందించడం వల్ల లాభం లేకపోగా నష్టమే ఎక్కువ అని నా ఊహ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here