రంగుల హేల 23: సస్పెన్స్ సంబరాలు

0
6

[box type=’note’ fontsize=’16’] “మనకి ఫీల్ అయ్యే రసజ్ఞత ఉండాలి గానీ అన్ని చోట్లా సస్పెన్స్ విరాజిల్లుతూనే ఉంటుంది” అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మిరంగుల హేల” కాలమ్‌లో. [/box]

[dropcap]ఈ[/dropcap] రోజుల్లో జనానికి తమ నిత్య జీవితపు రక రకాల అసంతృప్తుల మధ్య సస్పెన్స్ మంత్రం కాస్త శాంతినిస్తోంది. వార్తా విశేషాల్లో కూడా ఏదో సగం చెప్పి మిగిలింది బ్రేక్ తర్వాత అంటూ యాంకర్ టీ పెగ్గు కోసం తప్పుకుంటుంది. ఆమె చెప్పబోయే తర్వాతి వార్త గురించి మనం తహతహలాడాలని ఆ పిల్ల ఆశ. ఆ గ్యాప్‌లో మనల్ని ప్రలోభ పెట్టి ఏవేవో వస్తువులు కొనిపించెయ్యాలని ప్రకటనదారుల వ్యాపారపు కోణాలు.

మనం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మ్యాగజైన్స్‌లో సస్పెన్స్ చూసి తెగ ఇదయిపోయి, మురిసి ముక్కలవుతాం గానీ మన నిత్య జీవితంలో ఉన్న సస్పెన్స్ కంటే ఏదీ గొప్పది కాదు. ఈ రోజు మనతో పాటు టిఫిన్ తిని, టీ తాగి ఫ్రెండ్‌లా నవ్వుతూ జోకులేసిన సహాయకురాలు మర్నాడు పొద్దున్నేఅపరిచితురాలిలా మారిపోయి ఫోన్ అయినా చెయ్యకుండా స్వగ్రామం వెళ్ళిపోయి కూచుంటుంది. మనం లబోదిబో మంటుంటే ప్రశాంతంగా, “మీకు పోయిన వారమే చెప్పానమ్మా! ఏదో ఒక రోజు ఊరికెళ్లే పనొస్తుందని”… అనేసి ఒకానొక సేఫ్టీ క్లాజ్ వెనక దాక్కుంటుంది. ఏమనగలం? రెండు రోజుల తర్వాత వచ్చిన ఆమె వైపు దీనంగా చూడడం తప్ప. మనం ఆ అమ్మాయిని మార్చి మరో అమ్మాయిని వెదుక్కునే సవాలే లేదు!

ఇక టీవీ సీరియల్స్‌లో సస్పెన్స్ మనకి తప్పని కఠిన కారాగార శిక్ష కాబట్టి దాని గురించి చెప్పే పనసలే లేదు. క్షణ క్షణం మనకి సస్పెన్స్ విందు చెయ్యాలని సీరియల్ దర్శక నిర్మాతలు నిరంతరం సుదీర్ఘ తపస్సు చేస్తూ ఉంటారు. సీరియల్‌లోని పాత్రలకి తాము తయారు చేసుకున్న టీ కూడా తాగుతారని గ్యారంటీ లేనన్ని కష్టాలుంటాయి. రక రకాల అసాధ్యమైన సమస్యలు వస్తుంటాయి వాళ్ళకి. అందరి చేతుల్లోనూ గన్ లుంటాయి. ఎవరు ఎవరిని అంతం (షూట్ చేసెయ్యడం, తినే పదార్ధాల్లో విషం కలిపెయ్యడం) చెయ్యాలని కుతంత్రాలు చేస్తారో తెలీదు. ఎప్పుడెవరు కిడ్నాప్ అయిపోతారో తెలీదు. ప్రోమో ముక్కలు అటూ ఇటూ అతికి కూడా సస్పెన్స్ సృష్టిస్తూ ఉంటారు. అవి పరమ కిరాతక శాడిస్టిక్ రచయితలు రాసిన కథలు కదా మరి. అవి పూర్తి కానే కావు. మనతో పాటే అవీ జీవిస్తూ ఉంటాయి.

మనకి ఫీల్ అయ్యే రసజ్ఞత ఉండాలి గానీ అన్ని చోట్లా సస్పెన్స్ విరాజిల్లుతూనే ఉంటుంది. రాజకీయ నాయకులు ఎవరెందుకు ఏ పార్టీలో ఎంతకాలం ఉంటారో సస్పెన్సే…కారణాలు కూడా సస్పెన్సే. ఏ బ్యానర్ సినిమాలో ఎవరు నటీనటులుగా ఎంపిక అవుతారో సస్పెన్సే కదా !

మన మిత్రులు, బంధువులు మరో పదేళ్ల తర్వాత ఈనాటి తరహాలో మనతో సంబంధ బాంధవ్యాలు నెరపుతారా అన్నది సస్పెన్సే! పరిస్థితులు ఒకేలా ఉంటాయని గారంటీ ఉందా?

మన జీవితం గురించి మనమంతా ఒక దశాబ్దానికి లేదా కనీసం ఒక అయిదేళ్లకి ప్రణాళికలు వేసుకుంటాం. ఏదో మన మనవంతు కృషి మనం చేస్తూ పోతాం. ఆర్నెల్ల తర్వాత ఏమవుతుందో చెప్పలేం. ఎప్పుడూ ఉండే ఉద్యమమే కదా అనుకునేలోపే రాష్ట్రాలు విడిపోవచ్చు. రాత్రికి రాత్రి మనం వరసగా ఏడేళ్లు చదువుకుని సర్టిఫికెట్లు తెచ్చుకున్న మన రాష్ట్రానికి తరలి పోవలసి రావచ్చు. తీరా వెళ్ళిపోయిన తర్వాత మరో నాయకుడు వచ్చి ‘యాక్! ఇక్కడ బాలేదు’ అంటూ రాజధాని మార్చి మనల్ని ఇంకెక్కడికో తీసుకుపోవచ్చు. ఇదంతా సస్పెన్స్ కాదా? ఇక్కడ మనమే బాధితులం కాబట్టి దాన్ని ఆనందించడం మానేసి గుక్కబట్టి వాపోతుంటాం. ఇతరులకి సస్పెన్సే సుమా! ఉద్యోగ బాదరబందీలు లేని ఇతర బిజినెస్ బాబులకు ఈ విషయాలన్నీ నిత్యం ఉత్సుకత, వినోదం కలిగిస్తూ ఉంటాయి.

ఇక రియల్ ఎస్టేట్ దంధా చేసే మహామహులు తమ కోట్లను పదిలంగా పెట్టుబడి పెట్టి వాటిని పదింతలు చేయాలనుకుంటారు. ప్లాన్ తిరగబడి ఆశించిన కోట్లు పోయినపుడు వచ్చే తలపోట్లు గుండెపోట్లుగా రూపాంతరం చెందుతాయి. వీరి ఉత్థాన పతనాలు సామాన్యులకి ఉత్కంఠను కలిగిస్తూ ఉంటాయి. ‘బాగా అయ్యింది. లేకపోతే ఎకరం మూడు కోట్లా? విడ్డూరం కాకపోతే!’ అని వాళ్ళు నవ్వుకుంటూ ఆనందిస్తుంటారు.

ఎన్నికల్లో ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారో సస్పెన్సే కదా! ‘మా నాన్న మహారాజు’ అనుకున్న యువరాణి ఓడిపోవచ్చు. ‘నేనిచ్చిన బియ్యం తిని, నేనేసిన రోడ్లపై నడుస్తూ నాకు కాక మరెవరికి ఓటేస్తావు భాయ్!’అని ఓటర్లని ముద్దుగా మొట్టికాయలు వేసి మీసం తిప్పిన దేశనాయకుడిని అమాయకంగా కనిపించే జనత గుక్క తిప్పుకోకుండా ఓడించి పారేసినప్పుడు అది కదా, సదరు నాయకుడు జీవితంలో అతి పెద్ద సస్పెన్స్ !

ఇలాంటి సస్పెన్స్ లన్నీపిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటంలా ఉంటాయనుకోండి. మన కళ్ళెదురుగా మేస్త్రి దగ్గర పని చేస్తూ బీదగా బతికిన వాళ్ళు కాలం కలిసొచ్చి కాంట్రాక్టర్ లయిపోయి కోటేశ్వరులయిపోతుంటారు. మనం ముప్పయ్యేళ్లు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి అందుకున్న సొమ్ము ఒక్క బిల్డింగ్లో వాళ్ళు మిగుల్చుకుంటూ ఉంటే ఆ సక్సెస్ స్టోరీ వినడానికి మనకెంత ఉబలాటంగా ఉంటుందో ! అందుకే కొందరు కుతూహలమ్మలు టీ.వీ. సీరియల్స్ చూడడంలో కన్నా ఇరుగు పొరుగు వారి వివరాలు సేకరించడంలో ఉత్సాహం చూపిస్తుంటారు.

మన జీవితంలో, కొత్త కొత్త థ్రిల్లింగ్ విశేషాలు లేకపోయినా పైవన్నీ చూస్తుంటే, వింటుంటే మన ఉబలాటపు ఉత్సాహాలు పెల్లుబుకుతూ ఉంటాయి కదా ! అదే మరి సస్పెన్స్ మహత్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here