సుయోధనుడికి స్వాగత గీతం

0
10

[‘శ్రీకృష్ణ పాండవీయం’, ‘దానవీర శూర కర్ణ’ సినిమాలలో సుయోధన పాత్రధారికి పలికే స్వాగత విశ్లేషిస్తున్నారు శ్రీ గోనుగుంట మురళీకృష్ణ.]

[dropcap]యన్.[/dropcap]టి.రామారావు భీముడిగా, యస్.వి.రంగారావు దుర్యోధనుడిగా, సావిత్రి ద్రౌపదిగా నటించిన ‘పాండవ వనవాసం’ చిత్రం 1965లో విడుదల అయింది. ఇందులో ముగ్గురూ పోటీలు పడి నటించినా, దుర్యోధన పాత్రలో నటించిన యస్.వి.ఆర్. గారికి ఎక్కువ పేరు వచ్చింది. విలన్ అని కూడా మర్చిపోయి పండితులు, పామరులు అందరూ ఆ పాత్రకు జేజేలు కొట్టారు. ఆ చిత్రం చారిత్రాత్మక విజయం సాధించింది.

దాంతో యన్.టి.ఆర్., గారికి కూడా దుర్యోధన పాత్ర పోషించాలని ముచ్చట కలిగింది. తానే కథను తయారు చేసుకుని, దర్శకత్వం వహిస్తూ ఆ మరుసటి సంవత్సరం ‘శ్రీకృష్ణ పాండవీయం’ (1966) చిత్రం నిర్మించారు. శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు రెండు పాత్రలు తానే పోషించారు. ఈ చిత్రంలో దుర్యోధనుడిని ఆహ్వానిస్తూ ఆలపించే స్వాగత గీతం ఒకటి సి.నారాయణ రెడ్డి గారి చేత రాయించారు. ఆ గీతంలో సామాన్యులకి అర్థం కాకపోయినా ప్రతి చరణం చివర సుదీర్ఘ సంస్కృత ప్రౌఢ సమాసాలు ఉపయోగించాలని నిబంధన పెట్టారు యన్టీఆర్. ఆయన కోరినట్లే రాసి ఇచ్చారు సి.నా.రె.

అయితే ఈ సినిమాలో ఎక్కడా దుర్యోధనుడు అనే మాట వినబడదు. యన్.టి.ఆర్.,కి సుయోధన నామమే ప్రియమైనది. ఎందుకంటే దుర్యోధనుడు కూడా సామాన్యుడేమీ కాదు. ఒక విధంగా చెప్పాలంటే భీముడిని మించిన వీరుడు. పాండవుల పట్ల కొంత మత్సరం చూపించాడేమో గానీ మంచి పరిపాలనా దక్షుడు. దుర్యోధనుడి పాలనలో ప్రజలు కష్టాలు పడినట్లు వ్యాసులవారు గానీ, కవిత్రయం గానీ మహాభారతంలో చెప్పలేదు. అందుకే తన చిత్రాల్లో దుర్యోధనుడిలో ఉన్న మంచి లక్షణాలనే చూపిస్తారు యన్.టి.ఆర్., కథ మొత్తం సుయోధనుడు అనే వినబడుతుంది. పాటను విశ్లేషించే ముందు పాట నేపథ్యం కొద్దిగా చూద్దాం.

ఏకచక్రపురంలో ప్రచ్ఛన్న వేషంలో ఉన్న పాండవుల ఉనికి ద్రౌపదీ స్వయంవరంలో అర్జునుడు మత్య్సయంత్రం భేదించటంతో బయల్పడుతుంది. భీష్ముడు, ద్రోణుడు వంటి కురువృద్ధులందరూ పాండవులతో వైరం మీకు క్షేమం కాదని, వారితో సఖ్యమే మేలు చేస్తుందని, వారి రాజ్యభాగం వారికి పంచి ఇవ్వమని దృతరాష్ట్రుడికి బోధిస్తారు. దృతరాష్ట్రుడు అయిష్టంగానే అంగీకరించి ఖాండవప్రస్థాన్ని ఇస్తాడు. అరణ్యప్రాంతమే ఎందుకు, రాజ్యంలో సగం ఇవ్వు అని ధర్మరాజు అభ్యంతరం చెప్పలేదు. వినయంగా అంగీకరించి పెదతండ్రి ఇచ్చిన ప్రదేశంలోనే మయుడి సాయంతో అద్భుతమైన నగరం ఏర్పాటు చేసుకుని రాజసూయ యాగం తలపెడతాడు. దానికి దేశదేశాల రాజులతో పాటు కౌరవులను కూడా ఆహ్వానిస్తాడు.

చిత్ర విచిత్ర కల్పనా భరితమైన మయసభా మందిరాన్ని చూడాలని దుర్యోధనుడు వస్తాడు. “ఏమి ఈ మందిర సౌందర్యము? నిర్మాణ చాతుర్యమున విశ్వకర్మను మించినాడీ మయశిల్పి!” అనుకుంటూ అక్కడి విశేషాలు చూసుకుంటూ వెళుతుంటే స్తంభాల మీద శిల్పాలు మానవకాంతలుగా మారి ఇలా ఆహ్వానం పలుకుతూ ఉంటాయి.

“స్వాగతం! సుస్వాగతం! స్వాగతం

కురుసార్వభౌమా! స్వాగతం! సుస్వాగతం!

శత సోదర సంసేవిత సదనా!

అభిమానధనా! సుయోధనా!”

స్వాగతం, కురువంశానికి సార్వభౌముడైన సుయోధనుడికి మంచి స్వాగతం అంటూ మొదలు పెట్టారు శిల్పసుందరీ మణులు. ఆ సార్వభౌముడు ఎలాంటివాడు? వందమంది సోదరుల చేత సేవించబడుతున్న వాడు, అభిమానమే ధనముగా గలవాడు. ఆయనే సుయోధనుడు అని చెబుతున్నారు. ఇక్కడ వందమంది సోదరులలో సుయోధనుడిని తీసేస్తే మిగిలినది తొంభై తొమ్మిది మందే కదా అనే సందేహం రావచ్చు. గాంధారి గర్భవతిగా ఉన్నప్పుడు భర్త పరిచర్యల కోసం ‘సుఖద’ అనే పరిచారికను నియమిస్తుంది. ఆ సమయంలో దృతరాష్ట్రుడికి, ఆ పరిచారికకు అనురాగం అంకురించి, ఫలితంగా ఒక కుమారుడు కలుగుతాడు. అతడి పేరు యుయుత్సుడు. అతడు చివరివరకూ కౌరవపక్షంలోనే ఉంటాడు. అయితే దుర్యోధనుడు చేసే పనులు ఇష్టపడక, చివరలో కురుక్షేత్రయుద్ధ సమయంలో పాండవపక్షం చేరతాడు. యుద్ధం తర్వాత కౌరవ సోదరులలో మరణించకుండా మిగిలింది యుయుత్సుడు ఒక్కడే! అతడితో పాటు కలిపి దుర్యోధనుడికి వందమంది తమ్ముళ్ళు. పాటలో పల్లవి అయింది. మొదటి చరణంలో సుయోధనుడి గుణగణాలు ఇలా వర్ణిస్తున్నారు.

“మచ్చలేని నెలరాజువు నీవే!

 మనసులోని వలరాజువు నీవే!

 రాగభోగ సురరాజువు నీవే!

రాజులకే రారాజువు నీవే!

ధరణిపాల శిరోమకుట మణి

తరుణ కిరణ పరిరంజిత చరణా!”

నెలరాజు అంటే చంద్రుడు. చంద్రుడికైనా మచ్చ ఉంటుందేమో గానీ, నీకు మాత్రం ఎలాంటి మచ్చలేని పున్నమి చంద్రుడి వంటి వాడివి. మా మనసులలో కొలువైన మన్మథుడివి. వలచిన వారిని అనురాగంతో చూడటంలోను, భోగాలలోను ఇంద్రుడి వంటి వాడివి. సురలు అంటే దేవతలు, దేవతల రాజు ఇంద్రుడు. రాజులందరిలోకి రారాజువి నువ్వు. అంతేకాదు! ఈ భూమి మీద గల రాజులు అందరూ నీకు లొంగిపోయి శిరసులు వంచి పాదాభివందనం చేసేటప్పుడు వారి కిరీటాలలోని మణుల కాంతులతో మెరిసిపోయే పాదాలు గలవాడివి అని వర్ణిస్తున్నారు నాట్యగత్తెలు.

వాస్తవానికి మహాభారతంలో ఈ వర్ణన ధర్మరాజు గురించి ద్రౌపది చెబుతుంది “ఎవ్వని వాకిట నిభమద పంకంబు..” అనే పద్యంలో. ఈ పద్యం సీసపద్యంలో చెప్పగా దానికింద తేటగీతిలో “అతడు భూరిప్రతాప, మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణి ఘ్రుణి వేష్టితాంఘ్రితలుడు కేవల మర్త్యుడే ధర్మసుతుడు” అని అంటుంది. అంటే “ఆయన ప్రతాపానికి రాజులందరూ తలలు వంచి నమస్కారాలు చేస్తూ ఉంటే వారి కిరీటాల నుంచీ వచ్చే మణికాంతులతో ఆయన పాదాలు వెలిగిపోతుంటాయి. అటువంటి కీర్తిప్రతిష్ఠలు, పరాక్రమం గల ధర్మరాజు సామాన్య మానవుడని ఎలా అనుకుంటాను?” అని అర్థం. అంతటివాడు పరులచెంత దాస్యం చేయటం చూసి సహించలేక పోతున్నాను అంటుంది ద్రౌపది విరాటపర్వంలో. తిక్కన రాసిన ఈ పద్య భావాన్ని దుర్యోధనుడికి అన్వయిస్తూ పాటలో రాశారు నారాయణరెడ్డి.

ఇక రెండవ చరణంలో ఆయన పట్ల తమకు గల వలపును ఇలా వ్యక్త పరుస్తున్నారు.

“తలపులన్ని పన్నీటి జల్లులై

వలపులన్ని విరజాజి మల్లెలై

నిన్ను మేము సేవించుటన్నది

ఎన్ని జన్మముల పున్నెమో అది!

కదనరంగ బాహుదండ ధృతగదా

ప్రకట పటు శౌర్యా భరణా!”

నిన్ను గురించి తలచుకునేటప్పుడు మాకు గలిగిన తలపులే నీకు పన్నీటి జుల్లులు, నీ పట్ల మాకు గల వలపులే జాజులు, విరజాజులు, బొండుమల్లెలు. ఈ విధంగా నిన్ను మేము సేవించుకునే భాగ్యం కలగటం ఎన్ని జన్మలలో చేసుకున్న పుణ్యమో కదా! యుద్ధరంగంలో గదాయుద్ధం చేసేటప్పుడు నీ భుజాలకు తగిలిన దెబ్బలు కాయలు కాచి, అవి నీ శౌర్యాన్ని, సాహసాన్ని తెలియజేస్తున్నాయి. ఆ కాయలే నీ బాహువులకు నిజమైన ఆభరణాలు. అంతేకానీ భుజకీర్తులు, రత్నాభరణాలు ఆభరణాలు కావు అని నాట్యం చేస్తున్న శిల్ప సుందరీమణులు అంటున్నారు. ఇక్కడ ధృతము అంటే ధరింపబడిన అని అర్ధం.

ఈ పాట ‘శ్రీకృష్ణ పాండవీయం’ చిత్రం కోసం సి.నారాయణ రెడ్డి రచించినది. టి.వి.రాజు సంగీత దర్శకత్వంలో దీనిని పి.సుశీల, పి. లీల గానం అనితరసాధ్యంగా గానం చేసారు. శిల్ప సుందరులుగా భారతి, తిలకం నర్తించారు. నాట్య సన్నివేశంలో చిన్న పాత్రలో కనిపించిన భారతి తర్వాత కాలంలో మంచి నటిగా గుర్తింపు పొందింది. అగ్గిదొర, లక్ష్మీనివాసం, నేరము శిక్ష, సిపాయి చిన్నయ్య వంటి చిత్రాలు పేరు తెచ్చిపెట్టాయి భారతికి.

ఇదే సన్నివేశం మరో చిత్రంలో కూడా వస్తుంది. ‘దానవీర శూర కర్ణ’ (1977) లో యస్. జానకి ఆలపించినది. ఈ గీతం కూడా సి.నారాయణ రెడ్డి గారే రచించారు. పెండ్యాల నాగేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించారు. ఇందులో సంభాషణలు కూడా చాల బాగుంటాయి.

మయసభా మందిరంలో అటు ఇటు పరిభ్రమిస్తున్న సుయోధనుడి మెడలో గాలిలో నుంచీ ఒక పూలమాల వచ్చి పడుతుంది. దాని పరిమళాన్ని ఆఘ్రాణిస్తూ “అమలానభావ సంభానమైన ఈ దివ్యప్రసూన మాలికా రాజము కురుసింహుని గళసీమను అలంకరించిన వారెవ్వరు?” అని ఒక్కక్షణం చుట్టూచూసి “అనిమిష యామినీ (అనిమిషులు అంటే దేవతలు, అనిమిష యామినులు అంటే దేవకన్యలు) అతిధిసత్కార దివ్యసేవా ప్రభావమౌనా! ఔ.. ఔ.. (కావచ్చు, కావచ్చు) అనుకుంటాడు. దూరం నుంచీ సన్నగా సంగీత ధ్వని వినిపిస్తూ ఉంటుంది. ‘ఏమా సుమధుర సుస్వరము? కాకలీ కలకంట కంఠ కుహూకుహూకార శృతిహిత దివ్య సురకామినీయైక సుస్వాగతమౌనా! (సుక్ష్మమైన మధుర ధ్వనితో ఏ దివ్య లోకాల నుంచో దేవకన్యలు వేదోక్తమైన స్వరంతో చెప్పే సుస్వాగతమా!)’ అనుకుంటాడు. ఇంతో “ఓ కురుసార్వభౌమా!” అంటూ ఎవరో సన్నగా పిలిచినట్లైంది. పరికించి చూసేసరికి అక్కడి సాలభంజికలు జవరాళ్ళుగా మారి నాట్యంచేస్తూ ఇలా పాడుతున్నారు.

“రార! ఇటురార! రసిక రాణ్మౌళి

 కొసరి తేలించరా కుసుమ శరకేళి”

మౌళి అంటే చంద్రుడు అని అర్థం. రాసికరాజులలో చంద్రుడి వంటి వాడా ఇటు రా! మరీమరీ తేలించు మన్మథ క్రీడలో అని పిలుస్తున్నది ప్రధాన నాట్యగత్తె.

“ఆ చుక్కలదొర సోయగమ్మునే ధిక్కరించు జిగికాడ

చక్కరవింటి జోదునే వెక్కిరించు వగకాడ

సరిసరి నీ మైసిరి, మాయురే నీ మగసిరి

మొలకమీసమున లలిత హాసమును

మలచుకున్నరాదేరా!”

ఇక్కడ చుక్కలదొర అంటే చంద్రుడు, చక్కరవింటి జోదు (యోధుడు అనే పదానికి వికృతి జోదు) అంటే చెరకువిల్లు ధరించినవాడు మన్మథుడు, జిగి అంటే కాంతి, వగ అంటే విరహంతో కూడిన సంతాపం, మై అంటే మేను అని అర్థాలు. ఆ నిండు చంద్రుడి సౌందర్యాన్నే ధిక్కరించే కాంతి కలవాడివి, మన్మథుడినే వెక్కిరించే సౌందర్యశోభతో విరహిణుల మనసులలో సంతాపం రగిలించేవాడివి, నీ మేనిసిరి, నీ మగసిరి ఇవన్నీ మాయురే అనిపిస్తున్నాయి. కానీ అంత గంభీరంగా ఎందుకున్నావు? నీ మొలక మీసంలో మనోహరమైన చిరునవ్వు తొణికిసలాడేటట్లు చిరునవ్వుతో రావేలా! అని అంటున్నది. రెండో చరణంలో ఇంకా ఇలా చెబుతున్నది.

“రిక్కపుటద్దపు ముద్దులు చొక్కిట నిలుపరా నెలవంకలు

కెంపుల సొంపులు గిలుకు మోవి ముసింపరా మధురేఖలు

ఎలమిదారపున్నడలతో కళల వెసరించు పొన్నొడలితో

నినువరించి కలవరించి వేచిన ప్రణయ వల్లరినిరా! కురువరా! దొరా!”

ఇక్కడ రిక్క = నక్షత్రం, గిలుకరించు = చిలకరించు, మోవి = అధరము, ఎలమి = యౌవనము, నడలు = నడకలు, పొన్ = స్వర్ణం, ఒడలు = శరీరము అని అర్థాలు.

చుక్కల కాంతితో వెలిగిపోయే తన చెక్కిలి మీద ఆయన ముద్దుల ముద్రలు వేయాలట. ఎలాంటి ముద్రలు? నెలవంక లాంటివి. అంటే అర్ధచంద్రాకారము గలవి. అర్ధచంద్రాకారపు ముద్రలు ఎప్పుడు పడతాయి? దంతక్షతాలలో! కెంపుల వంటి అందాలు చిలికే పెదవి మీద తియ్యటి రేఖలు గీయమని చెబుతున్నది. యవ్వనంతో వికసించే నడకలతో, వెలుగులు చిందే బంగారువన్నె శరీరఛాయతో వస్తున్న నిన్ను చూసి వరించాను. నీకోసమే కలవరించి పోయే ప్రణయ వల్లరిని కురువీరా! అని చెబుతున్నది సాలభంజిక.

ఈ పాటలో శిల్పసుందరిగా జయమాలిని నర్తించింది. వయ్యారంగా ముందుకు అడుగులు వేయటం, అంతలోనే కవ్విస్తున్నట్లు వెనుదిరిగి క్రీగంట చూడటం వంటి అభినయం చక్కగా చేసింది. జయమాలిని అసలు పేరు అలివేలు మంగ. చక్కగా అమ్మవారి పేరు పెట్టుకుని, పేరుకు తగినట్లు తెల్లవారు జామునే లేచి తలస్నానం చేసి, దేవాలయంలో అర్చన చేసి, షూటింగ్‌కి హాజరు అయ్యేది. లక్ష్మీ పూజ, శ్రీ వేంకటేశ్వర వ్రత మహాత్మ్యం, జగన్మోహిని, మహాశక్తి వంటి చిత్రాల్లో మంచి పాత్రలు చేసింది.

ఇప్పుడు ఉదాహరించిన రెండు చిత్రాలలోనూ సుయోధనుడిగా యన్.టి.ఆర్., నటించారు. రెండు పాటలనూ నారాయణ రెడ్డి గారే రచించారు. రెండు చిత్రాలకూ యన్.టి.ఆరే కథను తయారు చేసుకుని, దర్శకత్వం వహించి, స్వంతగా నిర్మించారు. రెండు చిత్రాలూ ప్రేక్షకులు అఖండ ఆదరణతో విజయవంతం అయ్యాయి.

(Images Courtesy: Internet)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here