సస్పెన్స్ థ్రిల్లర్ సుళల్ (ది వొర్‍టెక్స్)

0
12

[dropcap]ఒ[/dropcap]క వెబ్ సిరీస్ గూర్చి నేను మొదటి సారిగా వ్రాస్తున్న విశ్లేషణ ఇది.

ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. ఈ తరహా కథలు ఇష్టపడేవారికి తప్పక నచ్చుతుంది. ఈ రివ్యూలో నేను సస్పెన్స్ గుట్టు విప్పను గాక విప్పను.

ఈ వెబ్ సిరీస్ చూసిన వారికి నా రివ్యూ పూర్తిగా అర్థం అవుతుంది. ఇది రివ్యూనా అంటే రివ్యూ కాదు. ఈ సిరీస్ చూశాక నాలో కలిగిన ఆలోచనలు కూడా నిష్పక్షపాతంగా ఇందులో చర్చించబోతున్నాను.

సినీ విశ్లేషణలు, పుస్తక విశ్లేషణలు, ఇలా వెబ్ సిరీస్‍ల గూర్చి విశ్లేషణలు వ్రాయటం నా వృత్తి కాదు. కేవలం సరదా కొద్ది వ్రాస్తుంటాను. ఏదో కాలక్షేపం కోసం చూసి వదిలేయటం కాక అందులో నాకు నచ్చిన అంశాలు ఉంటే నలుగురీకి తెలియాలి అన్న ఉద్దేశంతో ఇలా వ్రాస్తుంటాను బహుశా.

ఈ రివ్యూ కాస్త భిన్నమైనది. తొలిసారిగా ఒక వెబ్ సిరీస్ గూర్చి వ్రాయబోతున్నందువల్ల విభిన్నం అని అనటం లేదు.

ఈ సుళల్ వెబ్ సిరీస్ ఒక రెండు వాక్యాలలో వ్రాయదగ్గ ఒక చిన్న పాయింట్ ని కథగా ఎన్నుకుని తీయబడ్డ సిరీస్. కాకపోతే, ఎక్కడా బోర్ కొట్టకుండా, ఉత్కంఠ సడలకుండా చివరి భాగం వరకు మనల్ని కుర్చీలోంచి లేవకుండా చూసేలా తీశారు దర్శకులు.

సాంకేతిక అంశాలు అన్నీ అద్భుతం. ఫోటోగ్రఫీ, లైటింగ్, నేపథ్య సంగీతం, నటీనటుల నటన ఇలా ఏ విభాగాన్ని తీసుకున్నా పేరుపెట్టేటట్టు లేదు.

కాకపోతే, ఈ వెబ్ సిరీస్ పేరే గందరగోళంగా ఉంది. వీరు తెలుగులో దీన్ని సుడల్ అని వ్యవహరిస్తున్నారు. వారి ఉద్దేశం సుడులు కావచ్చు. ఇంతకూ ఈ తమిళ పేరు సుళల్ పక్కన ఇంగ్లీష్ లో వొర్‍టెక్స్ అని పేర్కొన్నారు. అంటే సుడిగుండాల్లో సుడులు తిరుగుతూ ప్రవహించే నీటి ప్రవాహం అని అర్థం.

సరే కథ విషయానికి వస్తే:

అది ఒక చిన్న ఊరు. ఆ ఊరి పేరు సంబాలూరు(ఇది కల్పిత గ్రామం. ఆర్కే నారాయణ్ గారి మాల్గుడి లాగా). ఈ ఊరు అందమైన నీలగిరి శిఖరాల ఒడిలో, ఊటీకీ దగ్గర ఉంటుంది. చక్కటి ప్రకృతి ఒడిలో కండ్లకు ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడ.

ఈ ఊరిలో ఒక సిమెంట్ ఫాక్టరీ (నాకు తెలిసి నీలగిరి శిఖరాలలో సిమెంట్ ఫాక్టరీ నడపటానికి అనువయిన వనరులు అస్సలు లేవు), ఒక పోలీస్ స్టేషన్, ఒక క్రిష్టియన్ మిషనరీ పాఠశాల, ఆసుపత్రి, ట్యూషన్ సెంటర్, రైల్వేస్టేషన్, ఒక గ్రామ దేవత గుడి, కొండ శిఖరాల మధ్య ఏర్పడ్ద ఒక సరస్సు, స్మశానం ఇవన్నీ ఉంటాయి. ఈ పట్టికలో పేర్కొన్న ప్రతి ఒక్క అంశం ఈ కథతో సంబంధం ఉన్నవే.

ఈ చిత్రంలో ఒకదానికి ఒకటి సంబంధం లేని మూడు కథలు సమాంతరంగా నడుస్తూ, అక్కడక్కడా మెలిపడుతూ, చివరికి వచ్చేసరికి అన్ని చిక్కుముడులు వీడి పోతాయి.

కథలో చెప్పదలచుకున్న పాయింట్ చాలా చిన్నది. ఇది చెప్పటానికా మనల్ని ఎనిమిది ఎపిసోడ్ల పాటు ఇంత చక్కగా ఎంగేజ్ చేశాడు దర్శకుడు అని అనిపిస్తుంది ఖచ్చితంగా, చివరిదాకా చూశాక.

ఏ మాటకామాట చెప్పుకోవాలి, ఇలాంటి వేఫర్ థిన్ సబ్జెక్ట్ తీసుకుని కూడా ఎక్కడా బిగి సడలకుండా తీసిన దర్శకుడు అభినందనీయుడు.

మొదటి కథ: ఇందాక చెప్పినట్టు ఆ ఊరిలో ఒక సిమెంట్ కర్మాగారం ఉంటుంది. దాని యజమాని వడ్డే ముఖేష్ (యూసఫ్ హుస్సేన్). ఇంచుమించు ఆ ఊరికి సంబంధించి ఆయన ధీరూభాయ్ అంబాని అంతటోడు. ఆయన వృద్ధాప్యం వల్ల సిమెంట్ కర్మాగారం నిర్వాహణ బాధ్యతలను తన ఏకైక కుమారుడు త్రిలోక్ వడ్డే (హరీష్ ఉత్తమన్‍)కి  అప్పజెపుతాడు. ఈ త్రిలోక్ పాత్రచిత్రణ అద్భుతంగా ఉంది. ఒక్క త్రిలోక్ పాత్ర అనే కాదు, ప్రతి పాత్రని చాలా చక్కగా రూపొందించారు.

యాదృచ్ఛికంగా త్రిలోక్ పగ్గాలు చేపట్టినప్పటినుండి ఆ కర్మాగారానికి నష్టాలు రావడం మెదలవుతుంది. ఇది కథా ప్రారంభం సమయంలో ఈ ఊర్లో పరిస్థితి.

తండ్రి యజమాన్యంలో ఫాక్టరీ ఉన్నప్పుడు కార్మికులని స్వంత బిడ్డలలాగా చూసుకునేవాడని, కొత్త తరం యాజమాన్యం మొదలయ్యాక కార్మికులకి కష్ట కాలం మొదలయిందని మనకు తెలుస్తూ ఉంటుంది.

ఈ గ్రామంలో డెబ్బై శాతం ప్రజలు ఈ కర్మాగారం మీద ఆధారపడి జీవించే ఉద్యోగులే. ఈ కర్మాగారపు కార్మిక నాయకుడు షణ్ముగం (పార్తీబన్ రాధాకృష్టన్-అలనాటి సినీనటి సీత ఒకప్పటి భర్త). ఈ షణ్ముగం కరడుగట్టిన వామపక్షవాది. ఈయన నిరంతరం కారల్ మార్క్స్, లెనిన్ సిద్దాంతాలు వల్లె వేస్తుంటాడు, ఇంటి గోడలపై పెరియార్ రామస్వామి చిత్రపటం, కార్ల్ మార్క్స్  చిత్రపటం వేలాడుతూ ఉంటాయి. ఈయన నిబద్దత గలిగిన ఒక మంచి కార్మికనాయకుడు.  ఈయన సహజంగానే నాస్తికుడు. ఈయన కోసం కార్మికవర్గం యావత్తు తమ ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్దంగా ఉంటారు.

ఒక రోజు హటాత్తుగా ఈ కర్మాగారం అగ్నికి ఆహుతి అవుతుంది. అనుమానాస్పద పరిస్థితులలో షణ్ముగం నిలుచుని ఉంటాడు ఫాక్టరీ గేట్ బయట.

రెండవ కథ: ఈ షణ్ముగంకి ఇద్దరు అమ్మాయిలు. నందినీ, నీలా. మొగుడి నాస్తికతతో పొత్తు కుదరక, ఈయన భార్య సెల్వి (లతా రావు)  పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వారిద్దరినీ, మొగుడికి అప్పజెప్పి తాను సన్యాసం తీసుకుని ఒక గురువు గారి ఆశ్రమంలో ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ ఉంటుంది.

పెద్దమ్మాయి నందిని (సినీ నటి ఐశ్వర్యా రాజేష్) తరచు మానసిక వత్తిడికి గురవుతూ తద్వారా హఠాత్తుగా వచ్చే ఫిట్స్‌తో ఇబ్బంది పడుతూ హటాత్తుగా గ్రామం విడిచి పెట్టి కోయంబత్తురుకి వెళ్ళిపోయి అక్కడ సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా స్థిరపడుతుంది. అక్కడకి వెళ్ళాక ఆమె ఆరోగ్యం కుదుటపడుతుంది కూడా.

రెండో అమ్మాయి నీల (గోపికా రమేష్) పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసులో ఉంటుంది. పదవతరగతి చదువుతూ, క్రీడలలో, ఫోటోగ్రఫీలో రాణిస్తూ చురుగ్గా ఉంటుంది. కథా ప్రారంభం అయ్యేటప్పటికి వీళ్ళింట్లో పరిస్థితి ఇది.

కథ యావత్తూ ఈ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది ఇక. పదవతరగతికి వచ్చేవరకు ఈ అమ్మాయి చదువుల సరస్వతిగా రాణిస్తు ఉంటుంది, అని చెపుతారు ఆమె టీచర్లు. మన కథ ప్రారంభం అయ్యే సమయానికి ఈ పిల్ల కూడా తన అక్కలాగా ఏదో మానసిక వ్యథతో బాధపడుతు ఉండటం మనకు తెలుస్తుంది. ఏదో ఒక విషయాన్ని అక్కకి ఫోన్ చేసి చెప్పటానికి ఒకట్రెండుసార్లు ప్రయత్నించి అక్క బిజీగా ఉండటంతో ఆ విషయం దాటవేస్తుంది. చెప్పుకోవడానికి తల్లి లేదు దగ్గర.

తల్లి సన్యాసం తీసుకుని పోయింది, అక్క ఇంటిలోంచి పారిపోయింది.

హటాత్తుగా ఒక రోజు ఈ పిల్ల కూడా ఇంట్లో నుంచి అదృశ్యం అవుతుంది. చక్రి (కదిర్) పోలీసు ఇనస్పెక్టర్.

షణ్ముగం వాళ్ళ ఇంటి పరిస్థితుల కారణంగా, చక్రి కూడా మిగతా అందరిలాగా ఆ పిల్ల అదృశ్యాన్ని మొదట తేలిగ్గా తీసుకున్నప్పటికీ , వేరే కేసుకి సంబంధించి అన్వేషిస్తూ, సీసీ టీవి దృశ్యాలలో ఆ పిల్ల అపహరణకి గురి అయినట్టు కనిపెట్టి అప్రమత్తమవుతాడు.

అప్పటి నుంచి చక్రి తన సీనియర్ ఆఫీసర్ ఎస్.ఐ రెజీనా (సినీనటి శ్రేయా రెడ్డి) సహకారంతో ఈ కేసుని సీరియస్‌గా తీసుకుని శోధన మొదలుపెడతాడు.

ఈ కథ సాగుతూ మొదటి కథతో (ఫాక్టరీ తాలూకు అగ్ని ప్రమాదం) అప్పుడప్పుడూ ముడిపడుతూ ఉంటుంది.

మూడవ కథ:

పోలీస్ ఇన్స్పెక్టర్ చక్రికి పెళ్ళి నిశ్చయం అయి ఉంటుంది. ఆ అమ్మాయి పేరు లక్ష్మి. ఆ పాత్ర రూపకల్పన చాలా బాగుంది. ఈ అమ్మాయి ఆసుపత్రిలో నర్స్‌గా పని చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి కాబోయే భర్తని మనసారా ప్రేమిస్తుంటుంది.

ఈ చక్రి తన చిన్ననాటి క్లాస్‍మేట్ నందినిని (షణ్ముగం పెద్దబిడ్డ) ఇష్టపడుతున్నాడేమో అని మనకు అనిపిస్తూంటుంది. ఇది ఒక ఉపకథ.

ఇక ఎస్.ఐ రెజీనాకి ఒక పుత్రుడు ఉంటాడు. వాడి పేరు అదిశయం (ఎఫ్ జే). టీనేజిలో ఉన్న ఈ కుర్రాడికి ఊర్లో ఏమంత మంఛి పేరు ఉండదు. కానీ అతని తల్లికి భయపడి ఎవ్వరూ బయటపడకుండా సహిస్తూ ఉంటారు. రెజీన భర్త సిమెంట్ ఫాక్టరీ యజమాని వద్ద ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు చూస్తూ ఉంటాడు.

ఈ రెజీనాకి, కార్మిక నాయకుడు షణ్ముగానికి మధ్యలో ఎప్పుడు తగాదాలే. ఆవిడ తమ యాజమాన్యానికి కొమ్ము కాస్తూ కార్మికులని అణచి వేస్తోంది అని అతను ఆవిడమీద నిర్భీతిగా విరుచుకుపడుతూ ఉంటాడు. అతని నోటికి ఆవిడ జడుస్తుంది, కార్మిక వర్గపు అండ ఉండటం వల్ల కూడా అతని మీద చర్య తీస్కోవాలి అంటే భయపడుతూ ఉంటుంది లోలోపల. కానీ పైకి ఆవిడ చాలా కఠినంగా ప్రవర్తిస్తూ కార్మికులని అణచివేస్తూ ఉంటుంది.

మొత్తమ్మీద ఈ రెజీనా దంపతులకు కార్మిక వ్యతిరేకులు అన్న పేరు ఉంటుంది.

ఈ రెజీనా వాళ్ళబ్బాయి ఒక రోజు స్నేహితులతో కల్సి కేరళలోని మున్నార్కి తన బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడానికి వెళతాడు. ఓ రెండు రోజుల అనంతరం అతని నుండి మెసేజెస్, ఫోన్ కాల్స్ రావడం ఆగిపోతుంది. ఇక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది.

ఈ అదిశయం పత్తా లేకపోవడం ( ఫోన్ కాల్స్ ఆగిపోవడం), నీలా అదృశ్యం అవడం, ఫాక్టరీ కాలిపోవడం ఇవన్నీ ఒకదానితో ఒకటి ఏ విధంగా మెలికపడుతూ కథ సాగుతుందో తెరపై చూడాల్సిందే.

***

ఈ మూడు కథల ఇలా జరుగుతూ ఉండగా అదే ఊరిలో గ్రామ దేవత ఉత్సవం ఓ తొమ్మిది రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. ఈ గ్రామదేవత ఉత్సవం సందర్భంగా నరబలులు జరిగాయా అన్న అనుమానాలు చెలరేగుతాయి. ఇదే సందర్భంలో నీలా అదృశ్యం అవటం, ప్రేక్షకులకి ఏదో ఒక  రకమైన భయం కలుగుతుంది.

ఉండేది ఉండంగా, కొన్నేళ్ళ క్రితం సిమెంట్ ఫాక్టరీ ప్రారంభించిన సమయంలోనే అమ్మణ్ణి అనే అమ్మాయిని బలి ఇచ్చారు అన్న ఇంకో వార్త వెలుగులోకి వస్తుంది.

ఇక ఇక్కడి నుండి కథ అనేక మలుపులు తిరుగుతూ ఊహించని పాయింట్ వద్ద ఒళ్ళు గగుర్పొడిచేలా ముగుస్తుంది.

-ఫాక్టరీ ఎలా తగలబడింది అనేది ఒక మిష్టరీ

-ఈ మిష్టరీ ఇలా ఉండగా కథ మర్డర్ మిష్టరీగా మారుతుంది. అంతటితో ఆగక ఊహించని విధంగా మరికొన్ని మిష్టరీలు జత కూడుతూ వెళతాయి.

చక్రి ఒక్కో మిష్టరీ ఛేదించే కొద్ది, కథ మరింత సంక్లిష్టంగా మారుతూ వెళుతుంది.

***

తమిళంలో తీయబడ్డ ఈ మర్డర్, సైకో మిష్టరీని తెలుగులోకి డబ్బింగ్ చేశారు. ఒక్క తెలుగులోనే కాదు హిందీ, కన్నడ, మలయాళం లాంటి భారతీయ భాషలతో పాటు, ఈ వెబ్ సిరీస్ ని ప్రపంచంలోని ఇతర 30 భాషలలోకి అనువాదం చేసి, దానికి తోడుగా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ సాయంతో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.

నాకు నచ్చిన అంశం ఏమిటంటే, అరెరె ప్రపంచ భాషలన్నింట్లోకి విడుదల చేస్తున్నాము కద అని చెప్పి తమ స్థానికతని చూపించడంలో వాళ్ళేమీ వెనుకంజ వేయలేదు. ఎక్కడా కంగారు పడకుండా హాయిగా తమ సంప్రదాయాలని, వస్త్రధారణని, పద్ధతులని చక్కగా చూపించారు. తమిళనాడులో ఉండగా ఫార్మా కంపెనీలో మా  మేనేజర్ విద్యాసాగర్ అనే ఆయన చెప్పేవారు. ఎవ్వరైనా, తమిళ సినిమాలని డబ్ చేసుకుని చూడటమే బెటర్. వాటిని రీమేక్ చేయాలనుకున్నా చేయలేక విఫలం అవుతారు. ‘అదుదా! మణ్ వాసం’ అనే వారు ఆయన.

‘మణ్ వాసం’ అంటే, మట్టి వాసన అని అర్థం. అంటే ఆయన ఉద్దేశం, అక్కడి కల్చర్ వైవిధ్యంగా ఉంటుంది. వాళ్ళు సినిమా కథలని రాజీపడకుండా ఆ కల్చర్‍తో ముడిపడుతూ తీస్తారు కాబట్టి వేరే భాషవాళ్ళు రీమేక్ చేసుకోవాలన్నా అందులో ఆత్మ దెబ్బ తింటుంది అని.

ఈ వెబ్ సిరీస్ యావత్తూ –  నేపథ్యంలో వారు చూపించిన గ్రామదేవత ఉత్సవాలు చూపించిన తీరులో ఈ మణ్ వాసం కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. ఆ నిమ్మకాయలు, నాలుకలోకి గుచ్చుకున్న శూలాలు, నిప్పులమీద నడవటాలు, పూనకాలు, కోళ్ళని నోటితో కొరికి బలి ఇవ్వటాలు, సంప్రదాయ గ్రామీణ నృత్యాలు, తృతీయప్రకృతి మనుషుల విన్యాసాలు, వారి వేషాలు, వారి వస్త్రధారణ ఇవన్నీ అద్భుతంగా చూపించారు అనే చెప్పాలి. మనకి గానీ, ఇతర ప్రాంతాల ప్రజలకి నచ్చుతుందా లేదా అది అన్నది వేరు సంగతి.

కథలో భావోద్వేగాలు పతాక స్థాయికి చేరే కొద్ది, ఈ గ్రామీణ ఉత్సవంలో డప్పుల చప్పుడు, పూనకాలు, నాట్యాలు తీవ్రస్థాయికి చేరుతాయి.

దర్శకుడి పనితనం ఇలాంటి సందర్భాలలో కనిపిస్తుంది. ఇదే కాక యావత్తు కథని నడిపిన విధానం అద్భుతం.

ఇదంతా బాగుంది అనుకుంటే, చివర్లోకి వచ్చేటప్పటికి, ఒళ్ళు గగుర్పొడిచేలాంటి నిజాన్ని తెలియజేసి మనల్ని దుఃఖితుల్ని చేస్తాడు దర్శకుడు.

ఈ కథలో అందరూ మంచివారే. అందర్నీ మనం అనుమానించాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆ తర్వాత ఒక్కొక్కరి ఔన్నత్యాన్ని చూసి మనం నివ్వెరపోతాము. చివర్లో మనం ఊహించని విధంగా ఒకరు దోషిగా నిలబడి మన అంచనాల్ని తలకిందులు చేస్తారు.

***

కొన్ని చమత్కారాలు:

వీరు వేరే భాష ప్రేక్షకుల పట్ల ఏ మాత్రం పద్ధతి పాటించలేదు.

* టైటిల్స్  తమిళ భాషతో పాటు, ఇంగ్లీష్‍లో వేశారు. తెలుగులో వేయలేదు. తెర వెనుక సంభాషణలు ఒక్కటీ తెలుగులో డబ్ చేశారు.

* ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి, కానీ చిత్రంగా అవి తమిళ సంభాషణలకి అనుగుణంగా ఉన్నాయి. ఒక్కోసారి పాత్రలు ఏదో మాట్లాడుతాయి, సబ్ టైటిల్స్ ఏదో వస్తుంటాయి.

* చెక్కరై (పంచదార) అనేది ఆ పాత్ర పేరు అయితే, తెలుగులో చక్రి అని మార్చారు. కానీ సబ్ టైటిల్స్‌లో ఒక్కోసారి చెక్కరై అనే వేసేస్తారు.

* నీ పేరెంత తియ్యగా ఉంది కద చక్రి అంటారు ఒక సారి సంభాషణల పరంగా. చక్రిలో తియ్యదనం ఏముంది అని జుత్తు పీక్కోవాలి తెలుగు ప్రేక్షకులు. అది చెక్కరై అని తెలిసిన తమిళప్రేక్షకులకు తెలుస్తుంది.

***

వెబ్ సిరీస్ చాలా ప్రభావవంతమైన మాధ్యమం అని నాకు అనిపించింది.

ఎందుకంటే ఇవి సినిమాలాగా ఓ రెండు మూడు గంటలలో ముగిసిపోవు. అనేక ఎపిసోడ్లు ఉండటం వల్ల ఆ పాత్రలు మనతో కల్సి కొన్ని రోజులు పాటు మన కళ్ళముందు మెదులుతూ మన స్మృతిపథంలో నిలిచిపోతాయి.

మన మనసులపై వీటి ప్రభావం అంతా ఇంతా కాదు. చాలా మంది మేము నిద్రాహారాలు మానేసి వీటిని ఒక్క ఊపున చూసేశాం అంటుంటారు. అవి ఇంప్రెషనబుల్ మెదళ్ళపై వేసే దుష్ప్రభావం అంతా ఇంతాకాదు.

ఆ పాత్రలు, వాటి మనస్తత్వాలు, వాటి సంఘర్షణలు, వాటి కష్టాలుమన మీద చాలా ముద్ర వేస్తాయి. దేవుని దయ వల్ల నేను ఎక్కువ వెబ్ సిరీస్‍లు చూడలేదు. కేవలం ఫామిలీ మాన్ (రెండు సీజన్లు), జీ 5లో గాలివాన ఇప్పుడు అమెజాన్ ప్రైంలో ఈ సుళల్,  ఇవి మాత్రమే నేను చూసిన వెబ్ సిరీస్‍లు.

వీటన్నింటిని చూసిన తర్వాత నాకు కలిగిన ఆలోచన ఒక్కటే. ఇంత ప్రభావవంతమైన మాధ్యమాన్ని ఉపయోగించుకుని ఎందుకు మంచిని ప్రేరేపించే ప్రయత్నం చేయరు ఈ దర్శకులు అని?  ఈ సమాజం ఎటుపోయినా వారికి బాధ లేదా?

వీటన్నింటి ద్వారా స్లోపాయిజన్ లాగా చాలానే చెడు చేరుతుంది ఇంప్రెషనబుల్ మైండ్స్‌లోకి.

***

ఏది ఏమైనా  దర్శకుడు చెప్పదలచుకున్న విషయాన్ని మనం సరిగ్గ అర్థం చేసుకుంటే కొన్ని సందేశాలు అందుకోవచ్చు ఈ సుళల్ వెబ్ సిరీస్ ద్వారా. అవేంటి అంటే,

1) టీనేజర్స్‌కి సెల్ ఫోన్స్ అనవసరం. వీలయినంత వరకు సెల్ ఫోన్స్ పిల్లలకి ఇవ్వకుంటే మంచిది.

2) అప్పుడే యవ్వనంలోకి వస్తున్న ఆడపిల్లలని సరిగ్గా సంరక్షించుకోకుంటే, దారుణమైన పరిణామాలు ఉంటాయి.

3) కుటుంబ సంబంధాలు బలంగా లేకుంటే పిల్లల గతి అధోగతే.

4) పిల్లలని ట్యూయిషన్లకి పంపటం అవసరమా అని ఒకసారి పునరాలోచించుకోవాలి తలితండ్రులు.

5) పిల్లలకి వాళ్ళడిగినంత డబ్బు ఇవ్వంగానే సరికాదు, వాళ్ళకి నైతిక విలువలని కూడా ఇవ్వాలి.

6) పిల్లలతో ఎవరు ఎక్కువ చనువు తీస్కునే ప్రయత్నం చేస్తున్నారు అన్న విషయన్ని చూసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here