స్వావలంబన

0
11

[dropcap]రా[/dropcap]త్రి భోజనాలయ్యాయి. వైదేహి వంటిల్లు సర్దేసి, వచ్చేసరికి జగపతి టి.వి. చూస్తున్నాడు. ఆమె వచ్చి, ప్రక్కనే మరో కుర్చీలో కూర్చుంది. జగపతికి తెలుసు… ఆమె అడగాలి అనుకునే విషయం.

“ఇంక.. టి.వి. కట్టేయవచ్చు కదా?” అంది.

“నిద్రొస్తే నీవెళ్ళి పడుకోవచ్చుకదా?” అన్నాడు నవ్వుతూ.

“మీరు… ప్రొద్దున్న ఆ పని ఎందుకు చేశారో చెప్పందే నిద్ర పట్టదు” అంది.

ఆమె వైపు తిరిగి చూశాడు. ఆమెలో తెలుసుకోవాలనే ఆసక్తే కాదు, ఏదో.. ఆదుర్దా కూడా కనిపిస్తోంది.

టి.వి. ఆఫ్ చేసి, రిమోట్ ప్రక్కనే పెట్టి కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు.

“ఇపుడు చెప్పు, నీ అనుమానం.. అంత ఆదుర్దా ఎందుకు నీకు?” అడిగాడు జగపతి.

“ఎప్పుడు మీరే బ్యాంకుకు వెళ్లేవారు. మధ్యాహ్నం నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్లి… నాతో కూడా సంతకాలు పెట్టించారు. అంత పెద్ద మొత్తం డబ్బు వేశారు. ఏమిటని అడిగితే ‘తర్వాత స్తిమితంగా చెప్తా’ అన్నారు కదా..  ఇప్పుడైనా చెప్తారా?” అడిగింది వైదేహి.

“అర్థం కాలేదా?” అడిగాడు.

“అర్థంకాకే కదా అడుగుతున్నాను?” అందామె.

“నేనేం ప్రభుత్వ ఉద్యోగాలు చేయలేదు. రిటైర్ అయ్యాక వచ్చే పెన్షన్ డబ్బులతో కూర్చుని తినటానికి. ఏదో బట్టల వ్యాపారం చేశాను. దానితోనే పిల్లలిద్దరనీ చదివించుకున్నాం. వాళ్ళ దశ బాగుండి ఉద్యోగాలు వచ్చి, పిల్లలతో వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. ఇపుడు వెనుకటిలా తిరిగి చేసే శక్తీ, ఆ పరిస్థితులు కూడా ఇవాళ…”

“మీరు చేయక పోయినంత మాత్రాన పస్తులుంటున్నామా?” అడిగింది.

“చెప్పేది పూర్తిగా విను మరి…”

“సరే, చెప్పండి” అంది వైదేహి.

“స్వంత ఇంట్లో ఉంటున్నాం. పైన అద్దెకు ఇచ్చాం కనుక, భుక్తికి లోటు లేదు. ఏదైనా అవసరమో… అనారోగ్యమో వస్తే… పిల్లల వైపు చూడాల్సి వస్తోంది కదా…” ఆగాడు జగపతి.

వైదేహి ఆయన వైపే చూస్తోంది.

“మనం అడిగితే, వాళ్లకూ ఇవ్వాలని ఉంటుంది. కానీ.. వాళ్ళకు వచ్చేదాన్ని మించిన ఖర్చులు, అవసరాలు వాళ్ళకూ ఉంటాయి కదా…”

“ఎందుకుండవూ… ఎదిగే పిల్లలు.. వాళ్ళ చదువులు…” అందామె.

“ఆ… అందుకే.. అది ఆలోచించే నేను అప్పుడెప్పుడో చౌక రోజుల్లో కొన్న ఆ పదిహేను సెంట్లు స్థలానికి మంచి ధర వస్తే అమ్మేశాను..”

“అమ్మారులే… పిల్లలకు చెప్పారాని..”

“చెప్పానుగా. వాళ్లేమన్నారో తెల్సా?”

“ఏమన్నారు?” అడిగింది.

“వాళ్ళేమన్నారో చెప్పే ముందు, కొన్ని సంఘటనలు గుర్తు చేస్తాను…”

కొద్ది క్షణాలు ఆగాడు జగపతి.

“ఆ మధ్య.. నాకు ఒంట్లో బాగాలేక, ఆసుపత్రిలో ఉన్నప్పుడు.. పెద్దవాడు, చిన్నాడు ‘నాదగ్గర ఇంతే ఉంది.. నీవు మిగతావి చూడు’ అని ఒకడంటే… ‘నేను మాత్రం అంత ఎక్కడ తేను’ అని మరొకడు అనుకోవటం… నేను విన్నాను. నాకు మనసు చివుక్కుమంది…” ఆగాడు జగపతి.

“వాళ్లకూ సంసారం.. ఖర్చులు…” అంది వైదేహి ఏమనాలో తెలియక.

“సరే… అదలా పోనీ, ఆ మధ్య మన చుట్టుపక్కల వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్తూ… మనల్నీ అడిగారు వస్తారని. నువ్వూ ‘వెళదాం’ అని సంబరంగా అడిగావ్. ఇద్దరికీ ముప్పయి వేలు అవుతాయి. అడిగితే ఏమన్నారు?” అడిగాడు జగపతి.

‘ముప్పై వేలంటే మాటలా? తొందరేముంది? ఎప్పుడొకప్పుడు వెళ్ళవచ్చులే’ అన్నారు కొడుకులు. గుర్తు వచ్చింది ఆమెకు.

“……………..”

“వాళ్ళ ఇబ్బందులు తీరేది ఎన్నటికీ? పెద్దోడికి పిల్లలు పెద్దయ్యాక, వాళ్లకు ఉద్యోగాలు, పెళ్లిళ్లు అయ్యాక. చిన్నాడి పిల్లలకి కూడా చదువులు పూర్తయ్యాక. అంటే, ఇంకా పదీ.. పదిహేనేళ్లు ఆగాలి. అప్పటికీ మనం ఉంటామా? ఉన్నా.. తిరిగి చూసే అంత ఓపిక మనకి ఉంటుందా?” అడిగాడు జగపతి.

“అవుననుకోండి… మరి వాళ్ళకున్న ఇబ్బందులు అవి…” అందామె.

“కాదనను. మన పరిస్థితి ఏంటి? పిల్లలు పుట్టిన దగ్గర్నుంచి వాళ్ళ పెంపకం, చదువులు ,పెళ్ళిళ్ళు, కాస్త ఇల్లూ వాకిలి కూడబెట్టడం చేసాం. వాళ్లు పైకి వచ్చారు.. ఆస్తులకు, ఆశలకు అంతు, దరీ లేదు. ఆయుషుకు ఉందిగా?”

మాట్లాడలేదు వైదేహి.

“జీవితాన్ని కాస్త సరదాగానో, కొంతైన సత్కాలక్షేపం గానో గడుపుదామని ఆశపడేసరికి.. సంపాదించే ఓపికా, అవకాశాలు కూడా తగ్గాయి…”

“……………..”

“అయినా, వాళ్ళకేం తక్కువ చేశాం? చదివించాము, ఉద్యోగాలు చేసుకుంటున్నారు.ఇల్లు, స్థలాలు అమర్చిపెట్టాము కదా?” అడిగింది వైదేహి.

“వాళ్లకి ఎన్ని అమర్చినా, ఇవాళ మనం కూర్చుని ఖర్చు పెట్టుకోవటానికి రూపాయలు పరంగా దాచుకోలేక పోయాం… మన దగ్గరకు వచ్చేసరికి, అదనపు ఖర్చు, బాధ్యతలాగా ఉంది.”

“………………”

“వైదేహి! ఈరోజు మనిద్దరం ఉన్నాం. ఉన్నది తింటూ, గడిచిన జీవితాన్ని నెమరువేసుకుంటూ కాలం గడుపుతున్నాము. కాలం ఇలాగే గడవదు… రేపోమాపో ముందువెనుక వెళ్ళిపోక తప్పదు. ఒకవేళ… నేనే… ముందుగా వెళ్లిపోతే…”

జగపతి మాట పూర్తికాక ముందే “ఎందుకలాటి మాటలు?” అంది.

“వినటానికి నీకు కష్టంగా ఉన్నా, తప్పించుకునేది కాదు కదా? చెప్పేది ప్రశాంతంగా విను…” అన్నాడు.

“……………..”

“మనలో ఒకరం మిగిలి పోయాక… ఒంటరితనంతో పాటు చెప్పుకోలేని అవసరాలు మనల్ని మరింత కుంగ తీస్తాయి. చేతిలో డబ్బులు ఉండవు. పిల్లల్ని అడుగుదామంటే.. ఓ పట్టాన నోరు తెరిచి అడగలేము. అడిగినా ఆ వేళకు వాళ్ల సమస్యలతో, ఇదిగో.. మొన్నటిలాగే సర్దలేకపోవచ్చును…”

‘‘…………….”

“అదే మనకంటూ కొంత మొత్తాన్ని.. మనం సంపాదించిన దానిలో మన చేతిలో ఉంచుకుంటే.. ఇటు మనకు, అటు పిల్లలకు కూడా ఇబ్బందిగా ఉండదు కదా?”

“నిజమేననుకోండీ….”

“ఈరోజు 30 లక్షలు వచ్చాయి. వాటిలో ఇరవై లక్షలు మన ఇద్దరిపేరున కలిపి జాయింట్ అకౌంట్ లో వేశాను. రేపు ఎప్పుడైనా మనలో మిగిలిన వాళ్ళం…”

“అనొద్దు. వినలేను”

తన చేతిలో ఉన్న భర్త చేతిని అసంకల్పితంగా బిగించిందామె, ఆ.. ఊహకు కూడా తట్టుకోలేనట్లుగా ఆయన భుజం మీద తలవాల్చింది. మరోచేత్తో ఆమె భుజాన్ని తట్టాడు అనునయంగా.

“…మిగతా పది లక్షలు రేపు… ఉత్తరోత్రా.. మన అవసరాలకు సమయానికి వాళ్ళ దగ్గరున్నా లేకపోయినా… పనికొస్తాయని విడిగా వేశాను.”

“పిల్లలకు చెప్పారా, ఏమన్నారు?”

నిర్వేదంగా నవ్వాడు జగపతి.

“చెప్పాను. ‘అరే! అప్పుడే అమ్మేశారా? నాలుగేళ్లు పోతే… నలభై, ఏభై లక్షలు వచ్చేవి కదా? రోడ్డు పక్కనున్న స్థలం. ఎందుకు తొందర పడ్డారు? పెద్ద పిల్ల పెళ్ళికి పనికి వస్తుంది అనుకున్నా’ అన్నాడు పెద్దవాడు.”

“చిన్నవాడు ‘అయ్యో, ఎందుకమ్మారు నాన్నా? మీ మనవడు ‘డాక్టర్ కోర్సు చదువుతా’ అంటున్నాడు. వాడి సీటుకోసం పనికి వస్తుంది అనుకున్నాను’ అన్నాడు.” చెప్పాడు జగపతి.

“పిల్లలు ఏమనుకుంటారోనండీ…” దిగులుగా అంది వైదేహి.

“ఏమనుకోరు. అనుకున్నా.. మెల్లగా వాళ్ళే అర్థం చేసుకుంటారు. స్వార్థంతో కాదు, ‘స్వావలంబన’ కోసమే నాన్న ఇలా చేశారని అర్థం చేసుకుంటారులే వైదేహీ! దిగులు పడక, పడుకో!” భరోసాగా చెప్పాడు జగపతి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here