[box type=’note’ fontsize=’16’] ప్రఖ్యాత సాహిత్య విమర్శకుడు, కవి, పండితుడు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య మార్గదర్శనంలో హైదరాబాద్ శివార్లలోని నారపల్లిలో ప్రారంభమయిన మేధ తోట స్వాధ్యాయ గ్రంథాలయ, పరిశోధన సంస్థ గురించి కోవెల సంతోష్ కుమార్ అందించిన ప్రత్యేక వ్యాసం.[/box]
జాతీయోద్యమంలో తెలుగు రాష్ట్రాల్లో గ్రంథాలయోద్యమం సృష్టించిన విప్లవం అసాధారణమైంది. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం, రాజరాజనరేంద్ర భాషానిలయం, సారస్వత నికేతనం, శబ్దానుశాసన గ్రంథాలయం, గౌతమి, వేటపాలెం, వర్ధమానసమాజం.. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో.. తెలుగు సారస్వత వికాసంతోపాటు జాతీయోద్యమంలో అత్యంత కీలకమైన పాత్రను నిర్వహించాయి. కేవలం విజ్ఞాన స్థానాలుగానే కాక ఉద్యమకేంద్రాలుగా సమాజాన్ని, ప్రజలను ఏకత్రితం చేయడంకోసం తీవ్రంగా కృషిచేశాయి. భారత జాతీయోద్యమ స్ఫూర్తి.. తెలుగు రాష్ట్రాల్లో గ్రంథాలయోద్యమాన్ని సుసంపన్నం చేసింది. కేవలం సామాజికంగా గ్రంథాలయాలను అభివృద్ధి పరచడమే కాకుండా.. చాలామంది సారస్వతమూర్తులు తమ ఇండ్లనే విజ్ఞాన భాండాగారాలుగా మార్చారు. ఆస్తుల విలువ కంటే.. పుస్తకాల విలువ ఎక్కువగా ఉన్న మహానుభావులు ఎందరెందరో ఉన్నారు. పుస్తకాలనే ఆస్తులుగా పెంచుకొన్న వారి సంఖ్య చెప్పనక్కరలేదు. ఆసేతు హిమాచలం తిరిగి కనిపించిన పుస్తకాన్నల్లా తమ గ్రంథసంచయంలో భాగం చేసిన వారు అనేకులు.
ఇప్పుడు పుస్తకాలు చదువలేని వాతావరణం. మాతృభాష మాట్లాడటమే అరుదై.. చదువటం కరువైన దుస్థితి.. మహామహుల పుస్తకాలు లైబ్రరీకి అప్పజెప్తే అక్కడా చెదలు పట్టిన పరిస్థితి. నెల్లూరు వర్ధమాన సమాజం గ్రంథాలయంలో బెజవాడ గోపాలరెడ్డి, మరుపూరు కోదండరామిరెడ్డి లాంటి మహానుభావులు విరాళంగా అందించిన పుస్తకాలను ఇవాళ చూసేవారే లేరు. లైబ్రరీలను మొక్కుబడిగా ఒకరిద్దరిని నియమించి నామమాత్రంగా నడుపుతున్న పరిస్థితి. లైబ్రరీలకు వచ్చేవారు లేరు.. వచ్చిన వారికి ఫలానా పుస్తకం ఉన్నదని చెప్పేంత పరిజ్ఞానం ఉన్నవాళ్లు లేరు. ప్రభుత్వాల ఉదాసీనత వల్ల మాతృభాషను దూరం చేసి.. కెరియర్ ఓరియంటెడ్ చదువులు నెత్తిన రుద్దడంతో.. మనిషిలో సంపూర్ణంగా వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే భాషా, సాహిత్య, చరిత్ర, సంస్కృతి, తాత్వికత ఈతరం విద్యార్థులకు పూర్తిగా దూరమయ్యాయి. ఫలితం.. ఒత్తిడి.. సమస్యలకు పరిష్కారం దొరక్కపోవడం, మానసికంగా అత్యంత సున్నితంగా తయారుకావడం.. చిన్న చిన్న విషయాలకు జీవితాలు వ్యర్థమనుకొని బలవన్మరణాలకు పాల్పడటం వంటివి జరుగుతున్నాయి. వ్యక్తి వికాసానికి సంబంధించిన ఎలాంటి బోధనలు ఇప్పుడు జరుగటం లేదు. దీంతో ఈ విజ్ఞానమంతా మూలన పడుతున్నది.
ఈ తరం విద్యార్థులను పూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దాలంటే.. మన భారతీయ సాహిత్యం, తాత్త్వికత, చరిత్ర, సాంస్కృతిక గ్రంథాల పఠనం అత్యంత అవసరం. మంచి లక్షణాలు, చెడు లక్షణాలు, సమస్యలు.. సంక్షోభాలు, పరిష్కారాలు, దైవత్వం, మానవత్వం, రాక్షసత్వం నడుమ జరిగే సంఘర్షణలు.. అన్నింటి గురించిన అవగాహన ఉంటే మనిషిలో సెన్సిబిలిటీ వీలైనంత తగ్గిపోతుంది. తన్నుతానుగా ఎదగడానికి దారి ఏర్పడుతుంది. ఈ బృహత్తర లక్ష్యంతోనే ప్రఖ్యాత సాహిత్య విమర్శకుడు, కవి, పండితుడు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య మార్గదర్శనంలో హైదరాబాద్ శివార్లలోని నారపల్లిలో స్వాధ్యాయ గ్రంథాలయ, పరిశోధన సంస్థ ప్రారంభమైంది. దీర్ఘకాలిక లక్ష్యంతో ప్రారంభమైన ఈ పరిశోధన సంస్థ ఇప్పుడిప్పుడే అడుగులు కదుపుతున్నది.
సాహిత్య చరిత్ర, విమర్శ, కవిత్వంతో పాటు భారతీయ చరిత్ర, సంస్కృతి, తత్త్వశాస్త్రం, బయోగ్రఫీ, బిబ్లియోగ్రఫీ, నిఘంటువులు, విజ్ఞాన సర్వస్వాలు, ప్రాచీన ఆధ్యాత్మిక గ్రంథాలు, లలిత కళలు, నాటకాలు, కథలు, నవలలు, ఇతిహాసాలు, పురాణాలు.. పత్రికలు, రాజకీయాలు, అభినందన సంచికలు.. పెయింటింగ్స్ ఇలా రకరకాల అంశాలతో కూడిన తెలుగు, ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళం, దేవనాగరి భాషలలో దాదాపు 15వేల జాతీయ, అంతర్జాతీయ గ్రంథాలతో ఈ పరిశోధన సంస్థ ప్రారంభమైంది. ఇది అత్యంత అసాధారణ పుస్తక భాండాగారం. తంజావూరు సరస్వతీ మహల్, భీమిలి ఆనందవనం సద్గురు శ్రీశివానందమూర్తి గారి గ్రంథాలయం, నెల్లూరు వర్ధమాన సమాజం, వరంగల్ శబ్దానుశాసన గ్రంథాలయం, రాజరాజ నరేంద్ర భాషానిలయం, హైదరాబాద్ శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం వంటి ప్రఖ్యాత గ్రంథాలయాలను తరచి తరచి చూసి వాటి స్థాయిలో కాకపోయినా.. అందుకోలేకపోయినా.. ఉన్న కొద్ది స్థలంలో వీలైనన్ని గ్రంథాలను పొందుపరిచే ప్రయత్నం జరిగింది. జాతీయ స్థాయిలో వచ్చిన అనేకానేక గ్రంథాలు ఇక్కడ భద్రమై ఉన్నాయి.
ఇది కేవలం ఏ కోచింగ్ సెంటర్ లాంటిదో.. రోజూ దినపత్రికలు చదివే సాధారణ కమ్యూనిటీ హాల్ వంటిది కాదు. కాలక్షేపానికి మించి పరిశోధకులకు, ఔత్సాహిక చదువరుల కోసం తగిన విజ్ఞాన సంపద తోడ్పాటును అందించేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇది. ఇందులో దాదాపు పది వేల పుస్తకాలతో డిజిటల్ గ్రంథాలయం కూడా అందుబాటులో ఉన్నది. ఇక్కడ చదువుకొనగోరే స్కాలర్లు వారి వారి సౌకర్యం మేరకు వచ్చి చదువుకోవచ్చు. చదువరుల కోసం ప్రత్యేకంగా ఒక గదిని కూడా కేటాయించడం జరిగింది. ఈ సంస్థను మరింత విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ నుంచి చిత్తూరు వరకు.. మహబూబ్ నగర్ నుంచి ఇచ్చాపురం వరకూ వ్యక్తిగతంగా.. వినియోగించకుండా ఉండిపోయిన అపూర్వ, ప్రాచీన, ఆధునిక విజ్ఞాన సంపదను – (అవి తాళపత్రాలు, రాగిరేకులు, రాతి ఫలకాలు.. వంద సంవత్సరాల నాటి పుస్తకాలు.. రాత ప్రతులు పత్రికలు.. కరపత్రాలు.. ప్రముఖుల అరుదైన ఫొటోలు.. వారి రాత ప్రతులు.. ఆధునిక పుస్తకాలు.. అరుదైన పెయింటింగ్స్.. ఈబుక్స్.. ఆడియో క్లిప్స్.. తదితరాలు ఏవైనా) సమీకరించి భౌతికంగా, డిజిటల్ పరంగా భద్రపరిచేందుకు కృషి జరుగుతున్నది.
ఈ ప్రయత్నానికి ఇప్పటికే అనేకమంది సహృదయులు స్పందించారు. సాంకేతికంగా, భౌతికంగా సహాయం చేసిన వారు అనేకులు. ఇప్పుడు దీన్ని డిజిటలైజ్ చేసే ప్రయత్నం జరుగుతున్నది. డిజిటలీకరణ కోసం అవసరమైన యంత్రసామగ్రి సాధన కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇందుకోసం ఎవరి దగ్గరైనా స్వాధ్యాయలో భద్రపరచదగిన విజ్ఞాన సంపత్తి ఉన్నట్టయితే పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ రవాణా సంస్థల ద్వారా అయినా స్వాధ్యాయకు మీ దగ్గర ఉన్న అపూర్వ సంపదను పంపవచ్చు. ఇది పదిమందికీ ఉపయోగపడేలా సేవాభావంతో.. మన తరానికి.. తర్వాతి తరానికి మన భారతీయ, తెలుగు సాహిత్య సంపదను భద్రంగా అందించాలనే సత్సంకల్పంతో ప్రారంభించినది.
చిరునామా..
స్వాధ్యాయ పరిశోధన సంస్థ.. 4-48/12,
రోడ్ నెం.3, బాబానగర్, నారపల్లి,
ఘట్కేసర్ మండలం, మేడ్చల్ జిల్లా, తెలంగాణ-500088..
ఫోన్ నం 9052116463, 9966726405..
ఈమెయిల్.. kovelas@gmail.com, vallabha1942000@gmail.com