స్వామి సర్వప్రియానంద – అష్టావక్రగీత

2
17

[స్వామి సర్వప్రియానంద గారు అష్టావక్రగీతపై చేసిన వ్యాఖ్యానం గురించి ఈ రచనలో వివరిస్తున్నారు శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ.]

[dropcap]స[/dropcap]ర్వప్రియానంద.

ఈ పేరు ఆయనకు ఎవరు పెట్టారో కాని నిజంగానే సర్వులకూ ప్రియమైనవాడు.

సున్నితత్వం, మృదుత్వం, దైవత్వంతో కూడిన సంస్కారానికి రూపమాయన.

గులాబీలలో మెత్తదనము, పారిజాతాల పవిత్రత గుర్తుకు వస్తాయి ఆయనను చూసిన వారికి. దైవత్వాన్ని వెదజల్లుతూ ఒక దివ్యమైన తేజస్సు కూడి ఆ స్వామి నడుస్తుంటే ప్రతి ఒక్కరూ ఆ దైవత్వానికి ప్రణమిల్లుతారు.

ఆయన నిఖార్సైన వేదాంతి. అద్వైతాన్ని నమ్మి, నలుగురుకీ పంచుతున్నవాళ్ళలలో ముఖ్యుడు.

చక్కటి స్పష్టమైన భాష, గొప్ప అనుభవాలతో కూడిన ప్రసంగము అందర్ని అలరిస్తుంది. ప్రతి ఒక్కరిని ఆయన గౌరవించే తీరు అత్యంత అపురూపము. ఇటు వంటి సంస్కారము నిజంగా అరుదు.

జీవన్ముక్తులు తప్ప మరి ఎవ్వరూ అలా సరిసమానంగా చూడలేరు అందరినీ. ఆయనకున్న ఓపిక అమోఘం. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ తరగతులు – ప్ర్రశ్నోత్తరాలతో అందరికీ అర్థం చేయించటానికి ఆయన ఎంతో శ్రమ తీసుకుంటారు.

రామకృష్ణమఠానికి చెందిన ఈ స్వామి గత పాతిక సంవత్సరాలుగా సన్యాసిగా జీవిస్తూ ప్రజలను తన వేదాంత ప్రసంగాలతో ప్రభావితం చేస్తున్నాడు. ఆయన వలన ప్రభావితమై ఎందరో జీవితంలో శాంతిని సాధన చేస్తున్నారు. ఉపాధ్యాయులుగా, ప్రబోధకులుగా స్వామి ఎంతో పేరుగాంచారు. బేళూరు మఠములో, తదనంతరము అమెరికాలో ఆయన తన సేవలందిస్తున్నారు.

కోవిడ్ మూలంగా ఆయన తన న్యూయార్కు ఆశ్రమమం నుంచి ఆన్‌లైన్ ప్రసంగాలను మొదలుపెట్టారు. ఆయన మీటింగ్స్ అంటే ఎవ్వరూ వదలుకోరు. అందుకే మఠం వారు వాటిని యూట్యూబులో పెడతారు. అలా ఆత్మబోధ నుంచి అపరోక్షనుభూతి వరకూ, ఉపనిషత్తులు, దుక్ దృశ్య వివేవకం వరకూ మనకు లభ్యం.

ఒకానొక సమయంలో తెలుగులో కావలసినవి దొరకక, అద్భుతమైన వీరి ప్రసంగాలకు విని, బానిసగా మారిన వారిలో ఈ జీవి కూడా ఉంది. ఆనాటి నుంచీ ఆయన చెప్పే వేదాంతాన్ని ప్రత్యక్షంగా విని ఆకళింపు చేసుకోవాలన్న కోరిక పెరిగింది.

వెతుక్కుంటే స్వామి ప్రతి ఆదివారం న్యూయార్కులో వేదాంత సోసైటీ వారి ప్రాంగణములో బోధ చేస్తారని తెలిసింది.

కోరికలు తీర్చుకోవాలన్న కోరిక లేకపోయినా ఈ విషయం మాత్రం శ్రీవారికి చెప్పి ఆ స్వామి తరగతికి ఒక్కసారన్నా తీసుకుపోమ్మని కోరాను.

ఆయన “మనకు చాలా ప్రయాణాలు ఉన్నాయి. మనము న్యూయార్కు గట్రా అంటే మరింత ఖర్చు. చూద్దాములే ఎప్పటికో..” అంటూ పొంగు పాల మీద నీరు చిలకరించారు.

‘ఈశ్వారా! నీ అనుగ్రహం ఇలా వచ్చిందా’ అనుకొని సాగిపోవటమే మన పని.

కాని ఈశ్వరుడు వింటాడు. చెప్పేది, మనస్సులోని కోరికలు.. స్వచ్ఛమైనవైతే.

(మనము పరమాత్మను గ్రహించటానికి ఒక మొదటి అడుగు వెయ్యాలి. తరువాతవి ఆయనే నడిపిస్తాడు.) అందుకే వారంలో ఆయన అట్లాంటా వచ్చి అష్టావక్రసంహిత మీద రెండు రోజులు తరగతులు తీసుకుంటారని ప్రకటన చూశాము.

మేము గురుపూజ, తదుపరి శంకరుల మీద ప్రసంగం కోసము ప్రయాణములో ఉన్నాము.

కాబట్టి ఎలా అనుకున్నా.. శ్రీవారు “వచ్చేదాము. ఆయనే కదిలి మన ఊరు వస్తుంటేనూ..” అని ప్రోత్సహించారు. (డబ్బు ఖర్చులేని పనులకు మావారి సహకారం అమోఘం)

అలా ఆ దివ్యమైన అష్టావక్రగీతలో, స్వామి సర్వప్రియానంద వారందించే జ్ఞానామృతంలో మునిగి తేలే అవకాశం వచ్చింది ఉపాధికి.

ఆ జ్ఞానము ఎంత త్రాగినా ఇంకా త్రాగవలసినదే. అదీ ఇటు వంటి జ్ఞానగురువుల నుంచి అయితే మరి ఆలోచనే ఉండదు. ఆయన వచ్చిన సమయంలో స్వామికి ప్రేమభక్తిగా ఏదైనా వండి ఇవ్వాలనిపించింది. Vedanta society వారిని అడిగితే వారు ఉపాయం చెప్పారు. అలా కొంత వండి సమర్పించాము ఆశ్రమానికి. స్వామి సమక్షంలో కొంత సేపు ధ్యానం చేసుకొని ఆనందం అనుభవించాము.

వారి ప్రసంగాలు అన్నీ ఆంగ్లం కాబట్టి తెలుగేతరలు ఎవ్వరైనా వినవచ్చు. దివ్య గురుదేవులు శ్రీరామకృష్ణ పరమహంస మన వంటి బద్ధజీవులకు అందించిన ఎన్నో దివ్య వరాలలో స్వామి సర్వప్రియానంద ఒకరు అని మనకు తెలుస్తుంది ఆ స్వామిని కలిస్తే. ప్రతి ఒక్కరూ తప్పక ఒక్కసారైనా వారి దివ్యామృతం గ్రోలాలి.

అష్టావక్రగీత మేము చిన్మయానంద వారి తరగతులలో విన్నా, ఆ జ్ఞానము మనము ఆత్మదర్శులయ్యే వరకూ తిరిగి తిరిగి వినవలసినదే. అష్టావక్రగీతలో పదహేనవ చాప్టరైన ఆత్మజ్ఞానము మీద స్వామి రెండు రోజులు ప్రవచించారు. దీనినే తత్వజ్ఞానము, ఆత్మ విద్యా అని కూడా అంటారు. ఈ జ్ఞానము మనము మరల మరల విన మననము చేసుకోవలసినది.

***

అక్షరాలు అంతమైన చోట,

ఆలోచనలు అణగారిన చోట

తర్కజ్ఞానము మలిగిన చోట

అష్టావక్ర మొదలవుతుంది..

***

నత్వం దేహో.. నతే దేహో..

నీవు దేహం కాదు.. దేహం నీది కాదు.

ఈ శరీరము నేను కాదు.. నేను శరీరము కాదు.. మరి నేను ఎవరు?

చేస్తున్న పనులకు కర్తను నేను కాను. భోక్తను నేను కాదు.. మరి నేను ఎవరు?

చెదిరిపోవు మారిపోవు శరీరము నేను కాదు.. మరి నేను ఎవరిని?

మానవుడు సాక్షీభూతము.

అలలు సముద్రం నుంచి వేరు కాదు. వేరన్న భావము ఉన్నా పరిశీలించి చూస్తే ప్రతి అలలో ఉన్నది జలమే కదా.

అందరినీ అన్నింటినీ నడిపించేది చైతన్యమే.

నామ, రూప బేధాలు పైపై మాయ. ఆ మాయ తత్త్వం తెలిస్తే మాయను చేధించవచ్చు.

వేగవంతమైన జీవన విధానంలో శాంతి ఏది?

సత్‌చిత్‌ఆనంద స్వరూపమే స్వస్వరూపముగా ఉన్నది. మాయ చేత కప్పబడి ఉంది. ఈ మాయను విడిచి చూడగలిగితే తెలిసేది స్వరూప జ్ఞానమే. అదే ఆనందం.

పైపైన మనము పెట్టుకున్న ఈ పొరలను ఛేదించటమే మన కర్తవ్యం. దానికి మనకు సత్సంగం సహాయకారి.

దీనికి మనకు దృక్ దృష్ట బేధం సహాయపడగలదు. చూసేది స్థిరం, చూడబడుతున్న మారుతుంది. ఆ విషయం మీద విచారం (ఆలోచన) చేస్తుంటే అర్థం చేసుకోగలరు.

ఆ విచారం ఈ రకంగా సాగాలి.

  1. జగత్తు (world as it is)
  2. పంచభూతాల విలాసం (matter around)
  3. మాయా విలాసం (paradox)
  4. చిద్విలాసం (conciseness)
  5. చిద్‍వివర్త (conciseness transformed) అవిద్యా జీవునికి బ్రహ్మము ప్రపంచముగా అగుపడుచున్నదే గానీ, ప్రపంచరూపముగా మారనూలేదు. ప్రపంచమును పుట్టించనూలేదు.దీనికి శంకరులు “వివర్త” మని పేరు పెట్టారు. అంటే తన స్వరూపంలో మార్పు లేకుండా అన్యరూపంగా అగుపడడాన్ని వివర్తమందురు. తాడు పాముగా కనపడటమన్న ఉదాహరణగా చెప్పవచ్చు.
  6. చిన్మయం (pervaded conciseness) according to Panpsychism conciseness pervades the universe and its fundamental feature of it. The same things Vedanta explains from centuries.
  7. చిన్మాత్ర (conciseness only)

ఈ విధమైన జ్ఞాన ప్రయాణం విచారము వలన సంభవము. మనము మన చుట్టూ ఉన్న సమస్యలను చూసి బెంబేలు పడకుండా సమస్యలో భాగం కాకుండా పరిష్కారానికి భాగముగా మసలగలిగితే మనకు స్వస్వరూప జ్ఞానము వైపు ప్రయాణము సాధ్యపడగలదు.

మనము చేస్తున్న ప్రతి పనికీ గమ్యం పరమాత్మ అయి ఉండాలి. లేదా చేస్తున్న పని పరమాత్మ పని యన్న భావనతో సాగాలి.

***

వేదాంత పంచదశి అన్న వేదాంత గ్రంథం శ్రీ విద్యారణ్య విరచితం. అందులో కూడా ఏడు మెట్లగా పరమాత్మను అనుభవములోనికి తెచ్చుకోవటము గురించి వివరించారు.

  1. అజ్ఞాన దశ.
  2. ఆవరణ
  3. విక్షేప
  4. పరోక్ష జ్ఞానము
  5. అపరోక్షజ్ఞానము
  6. అత్యంత దుఃఖనివృత్తి
  7. పరమానంద ప్రాప్తి (Limitless Existence Conciseness Bliss)

(పైన ఉన్నవాటిని వివరంగా విచారిస్తే వ్యాసము పెద్దదవుతుందని మరొక్కమారు వివరించుకొవచ్చని ప్రస్తుతం వదిలివేస్తున్నా) ఈ వివేకానికి మనకు మహావాఖ్యాలు సహకారం అందచేస్తాయి. (ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అహంబ్రహ్మాస్మి)

వేదాంతాన్ని చిన్న చిన్న హస్య కథలతో మిళితం చేస్తూ తన స్వయం అనుభవాలను పంచుతూ స్వామి వివరించారు.

అందులో రెండు కథలు తప్పక పంచుకోవాలనిపించాయి.

1. కాశీ యువరాణి

ఒక రాజ్యంలోని రాణి తన రాజాంతపురములో వేసే చిన్న నాటకానికి ‘కాశి యువరాణి’ పాత్రకు చిన్న బాలిక కావలసి వచ్చింది. ఆమెకు ఎవ్వరూ సంతృప్తినివ్వక తన కుమారుడికి బాలికలా అలంకరించి నాటకం వేయించింది. ఆ బాలిక రూపులో ఉన్న యువరాజు అందానికి ముగ్దుడై రాజ్య చిత్రకారుడు ఆమె వేషాన్ని చిత్రంగా గీస్తాడు.

ఆ చిత్రం రాజ్యాంతపురంలో మరుగపడుతుంది. యువరాజు పెద్దవాడై యువకుడై, పట్టాభిషేకానికి తయారుగా ఉంటాడు.

ఒకనాడు అంతపురంలో విహరిస్తూ పురాతనమైన చిత్రపటం చూస్తాడు. ఆ అందమైన బాలిక చిత్రపటం మీద ‘కాశి రాజకుమార్తె’ అని ఉంటుంది. యువరాజుకు ఆ బాలిక అందం మీద మక్కువ కలుగుతుంది. ఆలోచించి ఆ బాలిక నేటికి తన ఈడు ఉంటుందని అనుకుంటాడు. ఆమెను పొందటమెట్లో అన్న ఆలోచన కలిగినప్పుడు మార్గం తోచదు. దానితో దిగిలు పడి క్రుంగిపోతూ ఉంటాడు. ఎవరికీ అర్థంకాదు యువరాజు విచారం.

ఆస్థానములో వృద్ధ మంత్రి యువరాజును బుజ్జగించి అతని దిగులుకు కారణమేమిటని అడుగుతాడు.

దానికి యువరాజు ఆ చిత్రపటం చూపి “ఈమెను పొందలేని జన్మ వ్యర్థం” అంటాడు.

వృద్ధ మంత్రి ఆ చిత్రపటాన్ని శ్రద్ధగా చూసి చిరునవ్వుతో “యువరాజా! అది నీవే. నీవే ఆ చిత్రపటములోని బాలిక, కాశి యువరాణి వేషములో” అంటాడు.

యువరాజు ఆశ్చర్యపడి నిజము తెలుసుకొని దుఃఖం నుంచి కోలుకుంటాడు.

మనము మాయచేత కప్పబడి అనేకమైన దుఃఖాలను తలకెక్కించుకుంటున్నాము. అది మాయయని, సకల చరాచరములకు కారణభూతమైన చైతన్యమే నిజ స్వరూపమై ‘నేను’ అన్న ఎరుక కలిగిన క్షణమున ఆ కష్టం, దుఃఖం పటాపంచలై పరమానందములో మునుగుతాము.

2వ కథ: 10వ వ్యక్తి.

పది మంది శిష్యులు నది దాటుతూ ఉంటారు. నది దాటిన తరువాత లెక్కలో తొమ్మిది మందే తేలుతారు. ఒకడు కొట్టుకుపోయాడని ఏడుస్తూ కూర్చుంటారు. అటుగా పోతున్న సాధువు వారిని కారణం అడిగి “అందరూ ఉన్నారు” అని చెబుతాడు. శిష్యులకు అర్థం కాదు.

“పదవ వ్యక్తివి నీవే” చెబుతాడు సాధువు.

“అది నేనే” అని తెలుసుకొని శిష్యులు ఆనందపడతారు.

భువిలో సర్వ చైతాన్యానికి కారణమైనదేది ఉంది అది మనలో ఉంది.

అదే ‘నేను’.

భగవాను రమణులు చెప్పిన “నీవెవరో తెలుసుకో” అన్నది ఇదే. ఇదే అద్వైతం. రెండోది లేదు. దాని మీదనే మన ధ్యాస మననం చేసి నిజ స్వరూపము తెలుసుకుంటే సర్వత్రా పరమానందమే కనపడగలదు.

స్వామి సర్వప్రియానంద గారి బోధనలు ఎవరికైనా అర్థమయ్యే సులభ ఆంగ్లంలో ఉంటాయి. యూట్యూబులో లభ్యము అవి. జిజ్ఞాసువులకే కాక మన వంటి సామాన్యులకు కూడా సహాయపడగల ఆ జ్ఞానాన్ని అందరూ అందుకోవాలని కోరుతూ

స్వస్తి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here