స్వప్నసౌధం

1
7

[డా॥ చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి గారు రచించిన ‘స్వప్నసౌధం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]స[/dropcap]హారన్‌పూర్ ఫేమ్ డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని, ఎడమ పక్క పాపిడి తీసుకుని, మోకాలు దాకా వచ్చే వాలుజడ వేసుకుంటోంది సౌదామిని. తన శిరస్సుని అధిరోహించిన కురులలో నలుపు కన్నా తెలుపు రంగునే ఎక్కువ చూపిస్తోంది అద్దం.

ఆమె ముఖాన చిరునవ్వు విరిసింది. ‘అద్దం అబద్ధం ఆడదు, అవి నా వయసుకి తగ్గ గౌరవం’, అనుకుందామె. చామన ఛాయ, పెద్ద కళ్ళు, గులాబీ రంగు పెదవులు, కొంచెం వంకర-టింకర పళ్ళు-వెరసి కోలపు ఆకృతిలో ఉన్న ఆమె ముఖం. మంచి వర్చస్సుతో కూడి ఉంటుంది. అది ఆమెపై గౌరవాన్ని పెంచేదే గాని, కోరిక పెంచేది కాదు.

వార్డ్‌రోబ్ తెరిచి, పేరుకుని ఉన్న పట్టుచీరల్లో తను వెళ్ళబోయే సందర్భానికి సరిపడే చీర బయటికి తీసింది. ఆమె ఖరీదైన చీరలు కడుతుంది, కానీ అవి కళ్ళు మిరుమిట్లు గొలిపేటట్టు మెరవవు. బహుశః, ‘నా పేరులో ఉండే మెరుపు చాలు. ఇన్ని మెరుపులుంటే చూసే వాళ్ళ కళ్ళకి ప్రమాదం’, అనుకుందో ఏమో!

ఆమె వజ్రాలు ధరిస్తుంది, అయినా అవి అమెరికన్ డైమండ్స్ కన్నా ధగద్ధగాయమానంగా మెరవవు కదా! కానీ తను వెళ్ళబోయే సందర్భానికి అవి నప్పవు. మామిడి పండు రంగుకి, దానికి అయిదు వేళ్ళ వెడల్పున్న రెండు వరుసల సిసలైన బంగారపు మామిడి పిందెల జరీచీరకీ నప్పేటట్టు, బంగారపు సెట్లు బయటకి తీసింది. ఒక అంచు ముదరపచ్చ, మరొకటి కమలాపండు రంగు. బంగారం మీద పచ్చలు, పగడాలు పొదిగిన నెక్‌లేస్, అటువంటివే దుద్దులు, ఉంగరం, గాజులు బయటకు తీసింది.

తన చెప్పుచేతలతో, తన కారు, రాత్రి పూట పగటిని తలపించేటట్టు విద్యుద్దీపాలతో మెరిసిపోతున్న ఆ స్టార్ హోటల్ ఆవరణలోనికి దూసుకెళ్ళి, సౌదామినిని గుమ్మం దగ్గర వదిలిన తరువాత వాలే చేత పడి, పార్కింగ్ లాట్లో ఓ మూల సెటిల్ అయ్యింది.

***

లోపలకి వెళ్తున్నప్పుడు తనని పలకరించిన వారందరికీ తన సంస్కారం ప్రకారం ప్రతి నమస్కారం చేస్తూ ముందుకు సాగింది. వాళ్ళలో గురువులు కొంత మంది కనిపించారు. వాళ్ళకి పాదాభివందనం చేసి, వాళ్ళు చెప్పిన పాఠాలవల్ల తను కంప్యూటర్లను ప్రజాసేవ కోసం ఎలా ఉపయోగించిందో వివరించి, ధన్యవాదాలు చెప్పుకుంది.

వారి నుంచి సెలవు తీసుకుని ముందుకి వెళ్తుంటే, ఒక చోట కొందరు స్త్రీలు కనిపించారు. వాళ్ళంతా నల్లటి జుట్టుతోనూ, బోలెడన్ని ఆభరణాలతోనూ, మెరిసే పట్టు చీరలతోనూ కళకళలాడుతున్నారు. వాళ్ళ ముందు తను, తన నగలూ, కట్టుకున్న ఒరిజినల్ జరీ మైసూర్ సిల్క్ చీరా వెలవెలబోతున్నాయి.

వాళ్ళలో కొందరు తనని ఎరుగుదురు. అటు నడిచింది ఆమె. “హలో సౌదామినీ, ఎలా ఉన్నారు? నన్ను గుర్తు పట్టారా?” అడిగింది ఒకావిడ. “ఉష గారు, ట్రిపుల్ ఈ నాకు ఏడాది సీనియర్”, అంది సౌదామిని తడుముకోకుండా.

“మీ జ్ఞాపకశక్తి అమోఘం”, అంది ఉష. ఈలోగా క్లాస్‌మేట్ గౌతమి అటు వచ్చి, “ఏమ్మా, సౌదామినీ, ఏ ఐ‌బి‌ఎంలోనో రిటైర్ అయ్యవా?” అని అడిగింది. “లేదమ్మా, ప్రభుత్వంలో”, అంది ఆమెతో. అంతలోనే, ఉష కల్పించుకుని, “నాకు మా బావతో పెళ్ళయ్యింది. మన రాష్ట్రానికి ఫ్యాషన్ ఫాబ్రిక్స్ హోల్‌సేల్ బిజినెస్. పిల్లలు కూడా టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ చదివి, ఆయనకి చేదోడు-వాదోడుగా ఉంటున్నారు”, అంది.

“వావ్, బాగుంది”, అని అక్కడి నుంచి గౌతమితో ముందుకి కదిలింది. గౌతమి ఒక ప్రైవేట్ కంపెనీలో ప్రోగ్రామింగ్ హెడ్‌గా రిటైర్ అయ్యిందట. “నిన్నగాక మొన్న అందరం పరికిణీ ఓణీలు వేసుకుని కాలేజీలో చేరినట్టు ఉంది కదా, అప్పుడే మనం రిటైర్ అయిపోయాం”, అని గుర్తుకు తెచ్చుకుంది సౌదామిని. “మరే, ఆ రోజుల్లో చుడీదార్లు వేసుకుంటే వింతమృగాన్ని చూసినట్టు చూసేవారు ఆడాళ్ళూ, మగాళ్ళూ కూడా!” జవాబిచ్చింది గౌతమి. “గౌతమి గారూ, ఇలా వస్తారా?” అని ఎవరో పిలిస్తే ఆమె అటు వెళ్ళింది.

ఏమీ తోచక దిక్కులు చూస్తున్న సౌదామిని వైపుగా ఒక తెల్లటి పొడవాటి మనిషి వచ్చాడు. జుట్టు నల్లగా ఉంది గానీ, అది చిర పరిచిత ముఖారవిందమని తెలుస్తూనే ఉంది. అతను చేతులు జోడించి, “నమస్కారం సౌదామిని గారూ, గుర్తున్నానా?” అని అడిగాడు. అతను ఎనిమిది వేళ్ళకి పెట్టుకున్న ఉంగరాల్లో పొదిగుండి, ధగద్ధగాయమానంగా శోభిల్లుతున్న రాళ్ళు, హాల్‌ని కాంతివంతం చేస్తున్న షాండ్లియర్ల వెలుతురుతో జతకట్టి, మెరుపు అనే పేరున్న సౌదామిని కళ్ళనే జిగేలుమనేటట్టు చేశాయి.

ఆమె ఒక్క క్షణంలో తేరుకుని, “సుధాకర్ గారూ, మిమ్మల్ని ఎలా మరచిపోగలను? నాకు జీవితంలో స్ఫూర్తినిచ్చిన కొద్దిపాటి మనుషుల్లో మీరొకరు కదా”, అంది. “అది నా అదృష్టం లెండి. మీరు ఐ‌ఏ‌ఎస్ ఆఫీసర్‌గా ఒక పెద్ద పోస్ట్‌లో ఉన్నారట?” అన్నాడతను.

“రిటైర్ అయ్యానండీ”, అంది సౌదామిని. అతను “ఒక్క నిముషం”, అని మొబైల్లో ఏదో చేసి, “రాజస్థాన్‌లో ముఖ్య కార్యదర్శిగా రిటైర్ అయ్యి, ఏమీ ఎరుగనట్టు మాట్లాడుతున్నారు, ఎంత నిరాడంబరులండీ మీరు! మనం చదువుకున్న కాలానికీ, ఇప్పటికీ తేడా చూశారా? అప్పట్లో మనింట్లో ఆ నల్ల ఫోన్ ఉంటే గొప్ప. ఇప్పుడు గూగుల్ తల్లి పుణ్యమా అని మీరే పోస్ట్‌లో రిటైర్ అయ్యారో ఇప్పుడే, ఇక్కడే కనిపెట్టాను!” అన్నాడు స్మార్ట్ ఫోన్ చూపిస్తూ. ఆమె ఏమీ అనకుండా చిరునవ్వు నవ్వి ఊరుకుంది.

“ఫ్యామిలీ సంగతేమిటి? మీవారో పెద్ద ఆఫీసర్, మీ పిల్లలు కూడా ఐ‌ఏ‌ఎస్ ఏనా?” అడిగాడు సుధాకర్. “నో”, అంది ఆమె, కాస్త ఆశ్చర్యపడుతూ. స్త్రీలలో కలిసి కూర్చుంటే, భర్త, పిల్లలు నగా, నట్రా- ఇలాంటివి పోల్చి చూసుకుంటూ ఎంత సేపైనా గడిపెయ్యచ్చు. ఆ అగత్యం నుండి తప్పించుకుని ఇటొస్తే, పురుషుడు, అందునా తనకు స్ఫూర్తినిచ్చిన వాడు, ఇలా అడిగితే నిర్ఘాంతపోదూ?

“ఓ, సారీ”, అని గతుక్కుమన్నాడు అతను. “అబ్బే, అలాంటిదేమీ లేదు. ఐ యాం సింగిల్”, అనేసరికి మౌనం వహించడం అతని వంతయ్యింది. “మీ సంగతేమిటి?” అని అడిగింది సౌదామిని. “మా ఆవిడ హోం మేకర్. ఇద్దరు అబ్బాయిలూ, కోడళ్ళు, మనవలతో సహా సిలికాన్ వ్యాలీలో ఉన్నారు.

కాలేజీ రోజుల్లోనే నిర్ణయించుకున్నాను, ఒకరి కింద పనిచేసే కన్నా నలుగురికి ఉపాధి కల్పించడం మిన్న అని. అందుకే, నేను స్ట్రక్చరల్స్‌లో ఎంటెక్ చేసి, ఇక్కడ ‘నిర్విఘ్న కన్‌స్ట్రక్షన్స్’లో ఆక్టివ్ పార్ట్‌నర్‌గా ఉన్నాను. మనూళ్ళో హై రైజ్ కట్టడాలు, గేటెడ్ కమ్యూనిటీలు, హైవేలు- ఇలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లు సాధారణంగా మన ఫర్మ్‌కే వస్తాయి.

మరో విషయం – మన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యొక్క డెబ్భై అయిదేళ్ళ పుట్టిన రోజు పండుగని-అదేనండీ, ప్లాటినం జూబిలీ సెలెబ్రేషన్స్‌ని – ఇవ్వాళ, ఇక్కడ స్పాన్సర్ చేస్తున్నది కూడా మన ఫర్మేనండోయ్”, అన్నాడు తను.

సాధారణంగా పెద్ద పెద్ద కన్‌స్ట్రక్షన్ కంపెనీలంటే ఆమెకు వేరే ఆలోచనలొస్తాయి. కానీ, సుధాకర్ మీద సదభిప్రాయముంది గనుక, “భేష్, మీకు సంపాదించడమే కాదు, ఇవ్వడం కూడా తెలుసునన్న మాట. సంతోషమండీ!” అని మనస్ఫూర్తిగా అంది సౌదామిని.

అతను వేరే పనులతో అటూ ఇటూ తిరుగుతూంటే, ఆమె ఇప్పటి బాచ్ పిల్లలతో చదువు గురించి ఏవో కబుర్లు మొదలెట్టింది. స్టార్టర్స్ వడ్డించారు. కొంతమంది పిల్లలు ఐ‌ఏ‌ఎస్‌కి ఎలాగ ప్రిపేర్ అవాలో అడిగారు. తను పాస్ అయ్యి మూడున్నర దశాబ్దాలు దాటినా, ఈ ప్రశ్నకి జనాలు జవాబుని ఆశిస్తారని తెలుసు. తనకు తోచినదేదో చెప్పింది.

ఈమాటు సుధాకర్ మరో పొడుగాయనతో వచ్చి, “వీణ్ణి గుర్తు పట్టారా?” అన్నాడు. సౌదామిని మొహంలో అయోమయం చూసి, “వీడు వీరప్రతాప్, నా బిజినెస్ పార్ట్‌నర్. మనిద్దరికీ మధ్య బాచ్. మీకు గుర్తుంటే, కాలేజీ యూనియన్ ఎన్నికల్లో పోటీ లేకుండా గెలిచింది వీడేనండీ”, అన్నాడు సుధాకర్. సౌదామిని, వీరప్రతాప్ ఒకరికొకరు నమస్కారం చేసుకున్నాక, అతను తన విజిటింగ్ కార్డు ఇచ్చాడు. ఏదో గుర్తొచ్చిన వాడిలా సుధాకర్ కూడా తన కార్డు ఇచ్చాడు.

ప్రతాప్ ఆమె కార్డు కోసం అడిగితే, తను ఇప్పుడు పదవీ విరమణ చేసిందని, అందుకనే కార్డు లేదని చెప్పింది. తన మొబైలు నెంబర్ మాత్రం ఇద్దరికీ ఇచ్చింది.

ఇంతలో మీటింగ్ మొదలయ్యింది. సుధాకర్ కాలేజీ చరిత్ర గురించి చెప్తూ, “ఇంజనీరింగ్ సర్వీస్‌లో సెలెక్ట్ అయిన వాళ్ళు కోకొల్లలు. సివిల్ సర్వీసెస్‌లో కూడా ఇన్నేళ్ళలో బోలెడు మంది ఎంపికయ్యారు. ఐ‌ఏ‌ఎస్‌లో మాత్రం మెరుపులాంటి మన సౌదామిని గారొక్కరే ఎంపికయ్యారు. రాజస్థాన్ రాష్ట్రానికి ముఖ్య కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు..” అని ఇంకా పలు విధాల పొగిడితే, ఆమె చాలా మొహమాట పడిపోయింది.

డిన్నర్ అయ్యాక ఇంటికి వచ్చి, విజిటింగ్ కార్డులు తీసి, సుధాకర్ నెంబర్ మొబైల్లో ఎక్కించుకుని, ఆ సాయంత్రపు సంఘటనలను నెమరు వేసుకుంది. సంతోషంగా నిద్రలోకి జరుకుంది.

***

మరుసటి రోజు లేచి సంతోషంగా ఆ ముందు రోజు విశేషాలని మళ్ళీ గుర్తు చేసుకుంది సౌదామిని. ఇన్నేళ్ళ తరువాత సుధాకర్‌ని కలవడం, అతనే వచ్చి తనని గుర్తుపట్టి పలకరించడం తనకి అమితానందాన్ని ఇచ్చింది. పుస్తకాల అరల్లో ఒక దాని తాళం తీసి, అక్కడ పేరుకుని ఉన్న నలభై అయిదు డైరీల్లోంచి కొన్ని పురాతనమైనవి తీసి, తను కాలేజీ చదువుకునేటప్పటి అనుభవాలను గుర్తు చేసుకోవాలనుకుంది.

ముందుగా తను కాలేజీలో చేరిన మొదటి రోజు విశేషాలను గుర్తు చేసుకోవాలనుకుని, డైరీలోని ఆ పేజీకి వెళ్ళింది.

జూలై 12:

‘భవిష్యత్తుని ప్రభావితం చేసే కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ చెయ్యబోతున్నానంటే భలే థ్రిల్లింగ్‌గా ఉంది. రాగింగ్ రక్కసి కోరలకి చిక్కుకోకుండా ఉంటే బావుణ్ణు, అనుకుంటూ దేవుడికి దణ్ణం పెట్టుకుని బయలుదేరాను. ఒక తెలివున్న, పనికిమాలిన మూక రాగింగ్‌కి పూనుకుంది.

ఇంతలో ఎక్కడనుండి ఊడిపడ్డాడో ఏమో, తెల్లగా పొడుగ్గా ఉండే ఒక అబ్బాయి, ‘మీరు ఫస్ట్ ఇయర్ కదండీ.. ఏ బ్రాంచ్?’ అని అడిగి, ‘కంప్యూటర్స్, అంటే ఇప్పుడు మీ క్లాస్ మొదటి అంతస్తులో ఉంటుంది. ఇలా చూడండి.. మెట్లనుండి కుడి పక్కగా రెండో గది. మెట్లు ఇటుపక్క ఉన్నాయి, వెళ్ళిరండి’, అని నన్ను పంపేశాడు. అతనికి కృతజ్ఞతలు చెప్పుకుని వెళ్ళాను.

క్లాస్‌లోకి వెళ్ళాక కొందరు అమ్మాయిలు అతని గురించి మాట్లాడుకుంటున్నారు. ‘ఎవరో సుధాకర్ అట. ఫోర్త్ ఇయర్ సివిల్. అమ్మాయిలని రాగ్ చేస్తే ఊరుకోడట. అతని వల్ల మనం హాయిగా క్లాస్‌కి వచ్చేశాం’, అని. ఎంతటి ఉన్నత స్వభావం! భార్యనే ఆడపిల్లని కట్నం కోసం మంట పెట్టే మగాళ్ళున్న ఈ దేశంలో ఇటువంటి వాళ్ళని చూస్తే సంతోషంగా ఉండదూ!’

తరువాత స్వాతంత్ర్య దినోత్సవం నాడు జరిగిన విశేషాలు చదువుకుంది.

ఆగష్టు 15:

‘జోరుగా వాన పడుతోంది. అందుకని, జెండా వందనాన్ని ఎగ్గొడతామా ఏమిటి? రెయిన్ కోట్ వేసుకుని బస్‌స్టాప్‌కి వెళ్ళడానికి అడుగులో అడుగేసుకుని నడుస్తుంటే, బస్సే ఎదురొచ్చింది. చెయ్యిత్తితే ఆగింది. డ్రైవరుకి ధన్యవాదాలు చెప్పుకుని ఎక్కాను. దిగాక కాలేజీకి వెళ్తున్నప్పుడు, దారిలో నా క్లాస్‌మేట్ రవి ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో కనిపించాడు- చేతిలో ఇంకా అంటించని సిగరెట్టుతో. నన్ను చూసి దాన్ని వెనక్కి పెట్టేశాడు.

‘ఆపాటి గౌరవమిచ్చాడు బాగానే ఉంది కానీ, అతని క్షేమం కోరే సాటి మనిషిగా, అతనికి మంచి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉన్నట్టు అప్పుడు అనిపించింది. ఇప్పుడు ఇతను, ఇతణ్ణి చూసి మరి కొందరు పొగాకు సేవించి, ఏ రోగమో తెచ్చుకుంటే, గురజాడ వారు చెప్పినట్టు, దేశమెలా బాగుపడుతుంది?

అంతే, సందిగ్ధం తీరిపోయి, నాలోని దేశభక్తి ఉగ్రరూపం దాల్చింది. పైకి మాత్రం మర్యాదగా, ‘రవీ, మీ విషయంలో జోక్యం చేసుకోవడానికి నేను మీకు ఏమీ కాను. కానీ, దురలవాట్లతో ఆరోగ్యం పాడుచేసుకుంటే, మనం, అంటే యువత, దేశాన్ని అత్యున్నత స్థాయికి ఎలా తీసుకెళ్ళగలం? తరువాత మీ ఇష్టం. నచ్చకపోతే మన్నించండి’, అని వచ్చేశాను. ఇప్పుడనిపిస్తోంది, నేనేమైనా సంఘసంస్కర్తనా ఏమిటని! ఏమిటేమిటి? నా బుద్ధి అలాంటిదే.

సరే గానీ, ఈ రోజు, జెండా ఎగురవేశాక, విద్యార్థులలో ఎవరినైనా మాట్లాడమంటే, సుధాకర్ చొరవ తీసుకుని, ఈ దేశపు యువత ఏయే విధంగా దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించచ్చో వివరించాడు. దానికి పునాది నీతి, నిజాయితీ అని కూడా సూచించాడు.

‘నాకు అతని స్పీచ్ తెగ నచ్చేసింది! అందరికీ ఇలా ఉన్నతమైన ఆదర్శాలు, ఉన్నతమైన లక్ష్యాలు ఉంటే దేశం ముందుకే కదా వెళ్తుంది! దేశంలో ఒక పక్క సుధాకర్ లాంటి ఆదర్శవాదులు, మరో పక్క రవిలాంటి ‘స్వవినాశకులు’! ఏం చేస్తాం?’

@@@

డైరీ మూసేసి నవ్వుకుంది సౌదామిని. తనలో ఉన్న ఆదర్శాలు మరొకరి నోట వింటే ఇంప్రెస్ అవక ఇంకేమవుతుంది?

***

మరుసటి రోజు..

డైరీలో పేజీలు తిప్పుతూ ఫేర్‌వెల్ పార్టీ నాటి జ్ఞాపకాల దగ్గరకి వెళ్ళింది. ‘సుధాకర్ కాలేజీ వదిలి వెళ్ళిపోతున్నాడు. తను పట్టిందల్లా బంగారమగుగాక! అతని వల్ల దేశానికి మేలు జరుగు గాక! అతనే కాదు, వాళ్ళ బ్యాచ్ వాళ్ళందరూ దేశానికి మేలు చేయాలని దేవుణ్ణి కోరుకుంటున్నా!’ అని రాసుకుంది తను.

‘అతనికి నామీద గొప్ప అభిప్రాయం లేదేమో, శుభాకాంక్షలు చెప్పి వెళ్ళిపోయాడు. ఇది నా తలరాతా, దురదృష్టమా, లేకపోతే చేజారిన అవకాశమా?’ అని బాధతో తానే రాసుకుంది. ఆ రోజుల్లో ఆడపిల్లలు అబ్బాయిలకి ప్రపోస్ చేసే ప్రసక్తి లేదు. ఆ అబ్బాయి చేయలేదంటే, మరి ఇంతే సంగతులు కదా!

అయినా సరే, అతని మేలు కోరే మనిషిగా, అతనికి సివిల్ ఇంజనీరింగ్‌లో విశ్వవిద్యాలయం మొత్తం మీద మొదటి ర్యాంక్ లభించిందని తెలిసినప్పుడు పొంగిపోయింది. నాణ్యతతో కూడిన ఆకాశహర్మ్యాలు ఇతను ఏ వూళ్ళో ఉంటే, అక్కడ వెలుస్తాయి. బోలెడంత మందికి ఉపాధి లభిస్తుంది. వస్తువుల అవసరం బట్టి ఆయా రంగాల్లో సంపద పెరుగుతుంది. బాగుంది, అనుకుంది తను.

***

కానీ విషయం ఆక్కడితో ఆగలేదు. ఏదో వెలితి తన మనసుని కలచి వేస్తుండేది. ఎప్పుడో అప్పుడు ఇద్దరం ఒకరికి ఒకరు తారసిల్లకపోతామా, అనుకునేది సౌదామిని. అప్పట్లో ఫోన్లు ఉండేవా, ఏమన్నానా? అడ్రస్ అడగడం ఎంత తప్పు? అది జరగలేదు.

పోనీ, తన మనసులో మాట తను చెప్పి ఉంటే, అటో ఇటో తేలిపోయి ఉండేదిగా! ప్చ్, అది అంత సులభమైన పని కానేకాదు. కొంపదీసి, అతను ఆ రోజుల్లో సినిమాల స్టైల్లో ‘మీరు నా తోబుట్టువు వంటి వారు’, అంటేనో? మొత్తానికి ఒక అవకాశం ఆంఫట్ అయ్యింది. మళ్ళీ వస్తుందో రాదో అని భయపడ్డ రోజులు కోకొల్లలు. ఆమె డైరీ రాతలే వాటికి ఋజువులు.

***

ఆ రోజుకి డైరీ మూసేసి మెల్లగా నిద్రలోకి జారుకుంది సౌదామిని. ఇన్నేళ్ళకి, అంటే ఇంచుమించు నాలుగు దశాబ్దాల తరువాత కూడా నిద్రాణమైన అనురాగం, అగ్నిపర్వతంలా బద్దలై, లావాని విరజిమ్మినట్టు తనని ఇంత డిస్టర్బ్ చేస్తుందని కలలో కూడా అనుకోలేదు.

@@@

సింగపూర్లో ‘గార్డెన్స్ బై ద బే’, అనే పర్యాటక స్థలం ఉంది. అక్కడ ప్రపంచంలోకెల్లా ఎత్తైన ఇండోర్ జలపాతం ఉంది. అక్కడ ఏడంతస్తుల లిఫ్ట్ కూడా ఉంది. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కో విధమైన కళ్ళవేడుక! పెద్ద పెద్ద రాజభవనాలని లఘురూపంలో పాలరాతితో చేసిన చోట తను నిలబడిపోయి, ‘ఏడంతస్తుల మేడ ఇది, వడ్డించిన విస్తరిది, నాకు..’ అంటూ ఒకటే ఏడుపు మొదలెట్టింది తను. ‘మినీ, ఏమైందిరా? ఏమైనా పీడకల గుర్తొచ్చిందా?’ అని ఓదార్చడానికి దగ్గరకి వచ్చాడు సుధాకర్. ఉలికిపడి లేచిందామె. కలలో కూడా తెలియని బాధేనా?

@@@

మంచినీళ్ళు తాగి, నిద్ర పట్టకపోతే, చదువుకునే రోజుల్లో వచ్చిన ఇలాంటి కల తాలూకు వివరాలకోసం డైరీ వెతికింది.

‘గోదారి ఒడ్డున నిలబడితే లంకలు కనిపించినట్టు, నేను సముద్రపొడ్డున నిలబడి ఉంటే, కనుచూపు మేరలో, అంటే, అలలు విరిగే చోట, ఒక లంక కనిపించింది. పచ్చదనంతో నిండి ఉంది. చిన్న దీవి. అప్పుడే ఒక పడవ అటువైపుగా సాగుతోంది. వెనుదిరిగి నా వద్దకు వచ్చింది. అందులో సుధాకర్ కూర్చుని ఉన్నాడు. ఒక చేతిలో ఏదో ‘మందు సీసా’ ఉంది. రెండో చెయ్యి నాకందిస్తూ, ‘రా, మినీ, అలా ఆ దీవి వరకూ వెళ్లొద్దాం’, అన్నాడు.

‘ఒక పరిచయస్థుడు సిగరెట్ నోట్లో పెట్టుకుంటే నచ్చని నేను, ఎంత ఇష్టపడ్డ వాడైతే మాత్రం, ఒక తాగుబోతుతో వాహ్యాళికి వెళ్తానా? ఊహూ, కుదరనిపని. ఆ కోపం చాలు, మెలకువ తెప్పించడానికి. అదో అపశకునంలా తోచింది నాకు. నేను ఇష్టపడింది, ఒక తెలివితేటలున్న తాగుబోతునా, అని మథన పడ్డాను. ఇది ఫలించని ప్రేమకి సంకేతమా? ఏమో! అంతలోనే గుర్తొచ్చింది, అదొక కల అని, అన్ని కలలూ నిజమవవని! పైగా, నాకు తెలిసి, భారతదేశంలో ఒడ్డున నిలబడితే కనపడే లంకలు లేవు. ఈ తేడా ఆలస్యంగా గ్రహించినందుకు నా మట్టిబుర్రకి నేనే ఒక మొట్టికాయ ఇచ్చుకున్నాను’.

మళ్ళీ నీళ్ళు తాగి, నిద్రకి ఉపక్రమించింది సౌదామిని. ఈ మాటు బాగానే పడుక్కుంది.

***

ఓ నెల్లాళ్ళ తరువాత..

ఘంటసాల మాస్టారు ఆలపించిన, ‘వాతాపి గణపతిం భజేహం’, రింగ్ టోన్ మోగింది. సుధాకర్ పేరుని సూచించింది మొబైలు. చిరునవ్వుతో, ‘హలో’, అంది. ఆమె గొంతులో మాధుర్యం సహజసిద్ధమైనదే! ఇప్పుడు సుధాకర్‌పై ఉండే ఇష్టంతో కలిసి, ఇంకాస్త తీయదనాన్ని సంతరించుకుంది!

తనని ‘మినీ’, అని పిలిస్తే బాగుండు అని మనసు రొద పెట్టినా, మర్యాదస్తుడైన అతను అలా చేయడని ఆమెకు తెలుసు. “నమస్కారం సౌదామిని గారూ, ఈ ఆదివారం మధ్యాహ్నం మీరు మా ఇంటికి భోజనానికి వచ్చి, మా ఆతిథ్యాన్ని స్వీకరించి, మదర్పిత చందన తాంబూలాదులన్ గైకొనమని విన్నపం”, అన్నాడు సుధాకర్. అతను పిలిచిన విధానానికి ముచ్చట పడి, కోకిల స్వరమున్న ఆమె చిలుకలా కిలకిలా నవ్వేసింది.

“మీరు నన్ను సీరియస్‌గా తీసుకోరని అనుకున్నాను సుమండీ! మగవాళ్ళు పిలిస్తే ఆత్మగౌరవం ఉన్న ఏ స్త్రీ కూడా భోజనానికి రాదు కదా! అసలు, ఈ ఐడియా నాది కాదు, మా పూర్ణిమది. ఇదిగో, మా ఆవిడ మీతో మాట్లాడుతుంది”, అని లైన్‌లోకి పూర్ణిమని పిలిచాడు సుధాకర్. ఆవిడ మర్యాదగా పిలిచింది. ప్రతాప్ కుటుంబం కూడా వస్తోందని చెప్పింది.

సౌదామిని మళ్ళీ ఆలోచనలో పడింది. ఇంత మంచి, మర్యాద తెలిసిన వాడు గనుకనే తనకు ప్రపోజ్ చేయలేదా? పోనీ, తను తల్లిదండ్రులకి విషయం చెప్పి లాంఛనంగా పెళ్ళి సంబంధం కుదుర్చుకుని ఉండవచ్చు కదా! కానీ, తనకి అంతటి ధైర్యం ఎక్కడిది?

పైగా, వయోవృద్ధులూ, జ్ఞానవృద్ధులూ అయిన తన తల్లిదండ్రులు అతని గురించి ప్రశ్నలు వేస్తే, అతని ఆశయాల గురించి తప్ప తనకేమీ తెలియదే! ఇది విని, వాళ్ళు తన ప్రణయాన్ని కేవలం ఆకర్షణ అని కొట్టి పారేస్తేనో?

***

భోజనానికి వెళ్ళేటప్పుడు ఇరు కుటుంబాల వారికీ డ్రై ఫ్రూట్ గిఫ్ట్ బాక్స్‌లు, ఇద్దరు స్త్రీలకీ జాకెట్టు బట్టలూ, పసుపు కుంకాలు తీసుకుని వెళ్ళింది సౌదామిని.

సుధాకర్, పూర్ణిమలు గేటు నుంచీ స్వాగతం చెప్పారు. ఆమె ఊహించినట్లే వాళ్ళిల్లు చాలా పెద్దది. ఆతిథ్యంలో వాళ్ళు ఆరితేరారు కాబోలు, అన్ని చక్కగా కుదిరి, సవ్యంగా జరిగాయి. కానీ, సౌదామిని మాత్రం పూర్ణిమ అపూర్వ సౌందర్యాన్ని గుర్తించి, ఆ అందాన్ని తన అందంతో పోల్చుకోవడంలో మునిగిపోయింది. ఇదంతా బయట పడకుండానే సుమీ!

సౌదామినికి తెలుసు, ఇది ముగిసిపోయిన బంధమని. పునరుద్ధరింపబడిన పరిచయంతో అతనికి దగ్గరయ్యి, మరో ఆడదాని జీవితంలో నిప్పులు పోసే రకం కాదు తను. కానీ, అప్పట్లో భవిష్యత్తు మీద ఆశాభావం ఉండేది. ఇప్పుడు, ఆ పాత జ్ఞాపకాలే సంతోషాన్నిస్తున్నాయి. ఇది ఆమె మనసుకి అహేతుకంగా అనిపించింది. అయినా సరే, ఆ డైరీలు చదవకుండా ఉండలేకపోతోంది.

ఇంటికొచ్చిన తరువాత, టేబుల్ మీదున్న విజిటింగ్ కార్డు చూసి, మూడవ ఏటి ఎన్నికల గురించి ఏముందో చూద్దామని డైరీ తెరిచింది.

జూలై 30:

‘కాలేజీలో ఒకటే ఎన్నికల హోరు. వేంకటేశ్వర్లు అనే కంప్యూటర్ సైన్స్ సీనియర్ గెలుస్తాడని అందరూ అనుకునేవారు. అతను ఇప్పటికే ప్రోగ్రామింగ్‌లో దిట్టట. అది కాకుండా కాలేజీలో క్రీడాసదుపాయాలు మెరుగుపరుస్తానని వాగ్దానం చేశాడు. టాయ్లెట్ల శుచి, శుభ్రత కూడా మెరుగు పరుస్తానని, కాలేజీలో ప్రతీ వింగ్‌లోనూ స్వచ్ఛమైన తాగే నీరు ఏర్పాటు చేస్తానన్నాడు.

తన శక్తితో కాకపోయినా తన ప్రత్యర్థి బలహీనత వల్లైనా అతను గెలిచేటట్టున్నాడు. అతను చేసిన ప్రామిస్ ఏమిటంటే.. కాలేజీ రూపురేఖలు మార్చేస్తాడట! సివిల్ చదువుతున్నాడు కాబట్టి, ఇప్పుడున్న పసుపు రంగుకి బదులు మరో రంగుతో కాలేజీ బిల్డింగ్‌కి వెల్లలు వేయిస్తాడని అందరూ నవ్వుకునే వారు.

చదువులో అతని తెలివితేటల గురించి తెలియదు గానీ, లేటెస్ట్ మోడల్ జీన్స్ పాంట్లు, టీ షర్ట్లు వేసుకుని తెగ పోజులు కొట్టేవాడు. హీరో హోండా బైక్ మీదొచ్చేవాడీ షోకిల్లా. అతని ఎన్నికల వాగ్దానం కూడా అలాగే షో తప్ప, ధృవీకరించేందుకు ఏమీ లేదు. మేమంతా ఈ బాహ్యపు డాబులకి పడిపోతామనుకున్నాడు వెంగళప్ప!’

ఆగష్టు 1:

‘ఎన్నికల్లో ఓటెయ్యడానికి కాలేజీకి వెళ్తే, దారిలోనే తెలిసింది వేంకటేశ్వర్లు పోటీనుండి వైదొలగాడని, వీరప్రతాప్ ఏకగ్రీవంగా ఎంపికయ్యాడని. ఇదేదో పుకారేమోనని కాలేజీకి వెళ్ళి చూసొచ్చాను. నిజమే! వేంకటేశ్వర్లు వైదొలగాల్సిన అవసరం ఏమిటో మాత్రం ఎవరికీ అంతు చిక్కలేదు’.

***

సౌదామిని డైరీ మూసేసింది. ఛీ, సుధాకర్‌కి ఈ డబ్బారేకుల సుబ్బరాయుడితో పార్ట్‌నర్‌షిప్ ఏమిటి? విసుక్కుంది తను. ఏమో, ఈ పోజులరాయుడు ఏమైనా మంచి పని చేశాడేమో చూద్దాం, అనుకుని, ఫేర్‌వెల్ పార్టీ విశేషాలున్న పేజీ తెరిచింది. అందులో తెలిసిన విషయమేమిటంటే, యూనియన్ అధ్యక్షుడిగా అతడి ఏకైక ఘనకార్యం ఏకగ్రీవంగా ఎన్నికవడమే! బట్, వయసుతో పాటు మనుషులు మారతారు. ఆ పిస్తోలు పాంట్ల పిట్టల దొర ఇప్పుడు బాధ్యతాయుతంగా మారిపోయాడేమో! ఏమో!

***

బుర్ర పాడై, సుధాకర్ కాలపు డైరీ మళ్ళీ తెరిచింది. ఒకసారి సౌదామిని వక్తృత్వ పోటీకి సరైన సమాచారం దొరకలేదని లైబ్రరీకి దారి తీసింది. అప్పుడు తారసపడ్డాడు సుధాకర్. ‘వసుధైవ కుటుంబకం సాధ్యమేనా?’ అనే అంశం మీద పోటీకి వ్యూహం అవసరం గాని, సమాచారం అక్కరలేదన్నాడు.

ప్రచ్ఛన్నయుద్ధం తీవ్రస్థాయిలో ఉన్న 80వ దశకపు ప్రథమ భాగంలో అది కుదిరే పని కాదని వాదించొచ్చు, అన్నాడు. కానీ, మనుషులంతా భూమికి చెందినవారు గనుక వారనుకుంటే అది సాధ్యమేనన్నాడు. పాలకుల కుతంత్రాలకి తలొగ్గకుండా, మానవులు మానవుల్లా ఆలోచిస్తే, అది సాధ్యమౌతుందని వాదించమన్నాడు.

తను పాయింట్లు తయారు చేసుకునేటప్పుడు, అతను తెచ్చుకున్న పాఠ్యపుస్తకం చదువుకుంటూ కూర్చున్నాడు. తరువాత, ‘పరిచయ వాక్యాలు, ముగింపు చాలా ముఖ్యమైనవి. మధ్యలో ‘మెమె తెత్తే’ అన్నా పరవాలేదు’, అన్నాడు సుధాకర్.

తనకి మొదటి బహుమతి వచ్చిన తరువాత అతను ఎందుకు పాల్గొనలేదో అడిగింది. ‘గతేడాది నాకు జాతీయస్థాయిలో మొదటి బహుమతి వచ్చిందండీ! ఆ తర్వాత పోటీసన్యాసం చేశాను. ఎప్పుడూ నాకే బహుమతులొస్తే, కొత్త గొంతుకలు ఎప్పుడు వినపడతాయి చెప్పండి’, అన్నాడు సుధాకర్. బాబోయ్, ఇంత గొప్ప వక్త, ఇంత ఉన్నత వ్యక్తిత్వం గల మనిషి తనకి తెలిసినందుకు పొంగిపోయింది తను!

***

ఆ రోజుకి సుధాకర్ ఆలోచనలు ఆపేసి, ఎందుకు ఈ ఫ్లాష్‌బాక్‌లోకి వెళ్ళానా, అని తలపట్టుకుంది సౌదామిని. ఇన్నాళ్ళూ లేని ఈ ఫీలింగ్స్ ఇప్పుడెందుకు వచ్చి తనను హింసించాలి? మన జీవితంలోకి వచ్చిన వారందరూ చివరి వరకూ తోడుండరు కదా! మనలని వదిలేసి వెళ్ళిన వాళ్ళతో మన ఋణం తీరిపోయుండచ్చు కదా! గాలిలో మేడలు కట్టుకుని, అక్కడ ఉండాలనుకుంటే అవివేకం కదా!

అన్నీ తెలిసి, మరి కుక్కతోకలా ఎందుకు అతనిపై తన మనసుపోతోందని సౌదామిని కాస్త మనోమథనం చేసింది కూడా. ఆలోచించగా, చించగా, ఒకనాటి చలికాలపు సాయంత్రం తను చందన బ్రదర్స్ మెట్లు దిగుతున్నప్పటి విషయం గుర్తొచ్చింది. అతను రోడ్డుకి అవతలి పక్క ఉన్నాడు. హెల్మెట్‌లోంచి తనని చూశాడు. తమ చూపులు కలిసినా, అది శుభవేళ ఎందుకు అవలేదు? తను మొహం ఎందుకు తిప్పేసుకుంది? అమ్మ పక్కనుంటే మాత్రం దొరక్క దొరక్క దొరికిన అవకాశాన్ని జారవిడుచుకోవాలా? తప్పు తనదే అయినప్పుడు ఆడ దేవదాసులా గతం తలచుకుని ఈ వగపు ఏమిటి? నో, అసలు కారణం వేరే ఉండాలి కదా, అన్న విషయం గుర్తుకి వచ్చి, మళ్ళీ గతంలోకి వెళ్ళిపోయింది సౌదామిని.

***

తను సివిల్స్ మెయిన్స్ రాసిన తరువాత కొన్నాళ్ళు చదువు నుండి బ్రేక్ తీసుకున్న రోజులవి. నాన్న బాంక్ పనులు వెళ్ళి చూస్తూ ఉండేది తను. అలాంటి సందర్భంలో, ఒక రోజు, ‘మేడమ్, బాగున్నారా? నేను, రవి. ఇండిపెండెన్స్ డే.. సిగరెట్..’ అని పలకరించాడు.

‘బాగున్నారా?’ అని అడిగింది తను ముక్తసరిగా. ‘నాకేం, స్మోకింగ్ మానేసి ఆరోగ్యంగా ఉన్నాను. వేంకటేశ్వర్లు లేడూ, మన సీనియర్, యూనియన్ ప్రెసిడెంట్‌కి పోటీ చేసి, ఆఖరి నిముషంలో తప్పుకున్నాడు- వాళ్ళ నాన్నగారు పోయారు. నన్ను కొంత డబ్బు తెమ్మన్నాడు. బై ది బై, మనం చదువుకునే రోజుల్లోనే ఆయనకి గుండెజబ్బు వచ్చింది. ఆపరేషన్‌కి డబ్బుల్లేక అప్పుడే వెళ్ళిపోతారనుకున్నాం. కానీ, ప్రతాప్ కోరిక వీడి అవసరానికి అంది వచ్చింది’, అన్నాడు.

‘సారీ’, అని జవాబిచ్చింది తను. మొహంలో అయోమయం కనిపెట్టి, ‘వేంకటేశ్వర్లు గెలుస్తాడని అనుకున్నాం కదా! ప్రతాప్ బాగా సౌండ్ పార్టీ లెండి. తన గొంతెమ్మ కోరిక తీర్చుకోవడం కోసం ఎమ్.టెక్ చదువుతున్న సుధాకర్‌ని రాయబారం పంపించి, ఆపరేషన్ ఖర్చు తను పెట్టుకునేటట్టూ, దానికి ప్రతిఫలంగా అతను పోటీ నుండి తప్పుకునేటట్టు ‘గౌరవనీయుల ఒప్పందం’ చేయించాడు. అంకుల్‌కి ఇదంతా బోనస్ కదండీ’, అని తన ధోరణిలో చెప్పి, వెళ్ళిపోయాడు.

షాక్ తింది సౌదామిని. పక్కవాడి కష్టాన్ని వాడుకుని, తను ప్రెసిడెంట్ అవుతాడా? సుధాకర్ బుద్ధి గడ్డి తిందా ఏం? యువశక్తి గురించి ఉపన్యాసం ఇస్తే సరిపోదు. యువత తప్పు దారి పడుతుంటే వారించడం పోయి సహకరిస్తాడా? చెడు సావాసం కర్ణుణ్ణి కృంగదీయలేదూ! ఇదైన రెండ్రోజులకి చందన బ్రదర్స్ దగ్గర చూసింది అతణ్ణి. అందుకే అలాంటివాడితో మాట్లాడబుద్ధి కాలేదు తనకి.

వయసుతో పెరిగిన విచక్షణ వల్ల ఇప్పుడు ఒక మాట వినగానే, అన్నీ కోణాలలోంచి అలోచించి గాని ఒక నిర్ణయానికి రాదు తను. ఈ బుద్ధి అప్పుడే ఉంటే, తన జీవితం వేరుగా ఉండేదేమో?

సౌదామిని మనసు అల్లకల్లోలం అయిపోయింది. తన మనసుకి అద్దం పట్టినట్టు ప్రకృతి కూడా సహకరించింది. మూడు రోజులపాటు ఎడతెరిపి లేని వానలు. జనజీవనం స్తంభించిపోయింది. నాలుగవ రోజున నిర్మాణంలో ఉన్న ఒక ఇరవై అంతస్థుల భవనం కూలిపోయి, అక్కడ నివసిస్తున్న పనివారిని చంపిందట. అది ప్రముఖ బిల్డర్స్ ‘నిర్విఘ్న కన్‌స్ట్రక్షన్స్’ వారిదని, దాని ఓనర్లు పరారీలో ఉన్నారనీ తెలిస్తే తప్ప సౌదామిని నిర్మించుకున్న స్వప్నసౌధం కరిగిపోలేదు!

సమాప్తం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here