స్వప్నించకు సమయం కాని సమయాన

0
6

[dropcap]నే[/dropcap]నా కొత్త సెక్షన్‌కి వెళ్లి ఆరునెలలు కావస్తూంది. సెక్షన్ సూపర్‌వైజర్‌తో కలసి మొత్తం ఏడుగురు స్టాఫ్ – ఒక ఆడ ప్యూనూ, మరొక మగ ప్యూనూను. వాతావరణం స్నేహపూరితం. ఒకరినొకరు ఆదుకుంటూ పనెక్కువైనప్పుడు పాలుపంచుకుంటూ సాఫీగా పనిచేసే విభాగం. అటువంటి పని వాతావరణం దొరకడం అరుదు. అలా సెక్షన్ ఆహ్లాకరంగా ఉండటానికి కారణం-దానికి దిశానిర్దేశం చేసే చుక్కాని సూపర్‌వైజర్. అటువంటి పకడ్బందీగా సాగే చోట పని చేస్తే – ఎటువంటి మందకొడితనం గల వాడికైనా పని చేసే మూడ్ వచ్చేస్తుంది; ఉదయ కాలంలో దానికదే విడివడే మొవ్వులా.

ఇకపోతే, అంతమందిలోనూ నాకళ్లకెప్పుడూ చెదరని నవ్వుతో, నలగని ముఖారవిందంతో పనిని అప్‌డేట్‌గా ఉంచుకునే సీనియర్ ఆడిటర్ భవాని అంటే నాకు అభిమానం. పనిచేయడం ముఖ్యమే, కాదనను. కాని అంతకంటే ముఖ్యం కళాత్మకంగా పని చేయడం, సీటుని పకడ్బందీగా ఉంచుకోవడం. ఆమె నవ్వూ, ఆమె చూపూ ఎంత తాజాగా ఉంటాయంటే-చిరకాల అనుబంధం గల స్త్రీమూర్తి ఎవరో కళ్లముందు నిల్చుని సాంత్వనగా మాట్లాడుతున్నట్లుంటుంది. లవ్లీ పర్సనాలిటీ.

ఆ రోజు మధ్యాహ్నం వేళ అందరూ లేచి భోజనాలకు వెడలిపోయిన తరవాత నేను ఒక్కణ్ణీ మిగిలాను. చివరి నోటింగ్ ముగించి లేచేటప్పట్టికి నాకెదురుగా నవ్వుతూ నిల్చుంది భవాని; చిన్నపాటి టిఫిన్ బాక్స్ అందిస్తూ. నేను కూడా నవ్వుతూనే అందులోనుంచి కొద్దిపాటి పులిహోరని ప్లాస్టిక్ స్పూన్‌తో అందుకుంటూ అన్నాను-

“ఇంట్లో ఏమైనా విశేషమండీ!” ఆమె తల అడ్డంగా తిప్పింది; కాదన్నట్టు. నేను మరొక ప్రశ్న వేసేలోపల ఆమే బదులిచ్చింది – “మీకోసం తెచ్చాను”

ఆశ్చర్యంగా చూసాను. నాకోసం ఈమె టిఫిన్ బాక్స్ తేవడం యేమిటి? నా భోజన వసతులు చూసుకోవడానిక మా ఆవిడ లేదా నన్ను కన్న తల్లి లేదా! నేను అదోలా ముఖం పెట్టి చూడటం గమనించిన భవాని ఈసారి నా కళ్లలోకి సూటిగా చూస్తూ అడిగింది- “అంటే నేను మీ కోసం తెచ్చిన పులిహోర తినరన్నమాట?”

ఆమె గొంతులో అభ్యర్థన లేదు. ఆదేశం ఉంది. నేనిక ఏమీ మాట్లాడకుండా అందుకుని నిదానంగా చూస్తూ అన్నాను – “నేను అందరిలా టిఫిన్ బాక్స్ తీసుకురాకుండా వస్తున్నాననుకుంటున్నారేమో! అది కాదు వాస్తవం. చిన్నప్పటినుంచీ నాకలవాటుంది-స్కూలు వెళ్ళేటప్పుడు గాని – కాలేజీకి వెళ్ళేటప్పడు గాని సుష్టుగా భోంచేసే వెళ్ళడం. ఉదయం లేచిన వెంటనే కాస్తంత వ్యాయామం చేసి కప్పు టీ గాని కాఫీగాని తీసుకుంటాను. అంతే! ఆ తరవాత సుష్టుగా భోంచేయడమే! ఇప్పుడూ అంతే సుమా! మధ్యాహ్నం వేళ రెండు బిస్కట్లు ఒక కప్పుటీతో సరి. మీరు అభిమానంతో ఇస్తున్నారు కావున తీసుకుంటాను ఈ ఒక్కసారికి మాత్రమే–” అంటూ గబగబా తినడం పూర్తి చేసి కడిగి ఇవ్వడానికి రెస్ట్ రూము వేపు వెళ్లడానికి లేచేటప్పటికి భవాని సర్వసన్నధ్ధురాలై ఖాళీ బాక్సుని అందుకుంది నవ్వుతూ. అలా నవ్వుతూనే అడిగింది- “ఎలాగుందో చెప్పలేదు?” ఎందుకో జవాబివ్వలేక పోయాను. లేచి వెళ్లిపోయాను క్యాంటీను వేపు.

ఆ రోజు సాయంత్రం రిక్రియేషన్ క్లబ్బులో కార్యక్రమం ఉండటాన బల్లపైనున్న ఫైల్సు అన్నిటినీ పేర్చి పెట్టి లేస్తున్నప్పుడు సౌదామిని భర్త వద్ద నుండి ఫోన్ వచ్చింది. నాకు ఆశ్చరం వేసింది. కాని పూట వెంగళ్రావు నుండి కాల్ రావడమేమిటి?

“అన్నయ్యా! నీ మరదలు పిల్ల గురించి నీకొక మఖ్యమైన విషయం చెప్పాలి. వెంటనే రావాలి. వచ్చేటప్పడు పెరడు నుండి ఇంట్లోకి రా!” అంటూ ఫోను పెట్టేసాడు.

నాకు దిమ్మతిరిగినట్లయింది. ఏదో ఉందనడం యేమిటి – నాకు మాత్రమే చెప్పడానికి పిలవడమేమిటి? అందులో పెరడు నుండి రమ్మనడం యేమిటి? నేను సూపర్‌వైజర్‌కి ఓమాట చెప్పి గబగబా మెట్లు దిగి పార్కింగ్ ప్లేస్ నుండి బైకుని తీసి కిక్కిచ్చాను.

వెంగళ్రావు వాళ్ళ వీధి చేరి అతడు చెప్పినట్టే పెరడు నుండి ఇంట్లోపలకు ప్రవేశించాను. నన్ను జాప్యం చేయకుండా తిన్నగా ఇంటి వాకిట వరకూ తీసుకువెళ్లి వీధికి అటు వేపు చూడమన్నాడు. నేను తలెత్త చూసేటప్పటికి సౌదామిని – గడ్డం పెంచుకుని ముఖం నిండా నవ్వు పులుముకున్న ఎవరితోనో ఒక్కసారి కూడా అటుగాని ఇటు గాని చూడకుండా ప్రహరీగోడకు ఆనుకుని మాట్లాడుతూంది.

నేను నాలోకి నేను చిన్నగా నవ్వుతూ పొడిపొడిగా దగ్గాను. కాని అప్పటికీ సౌదామిని ఆగలేదు. తిరిగి చూడలేదు. అప్పుడు సన్నాయి నొక్కులు నొక్కేలా వెంగళ్రావు వేపు తిరిగి అడిగాను- “అతడేమిటి కవా లేక రచయితా?”

“ఏదో పత్రికల్లో పని చేస్తున్నాడని, పేరు జమదగ్ని అని చెప్పాడతను.

అప్పుడు బ్రాడ్‌గా నవ్వుతూ అన్నాను- “ఇప్పుడర్థం అయింది మా మరదలు పిల్ల ఎందుకంత ప్యాషనేట్‌గా కబుర్లాడుతుందో!”

అర్థం కానట్టు చూసాడు వెంగళ్రావు.

“సౌదామిని గురించి నాకు చిన్నప్పట్నించి తెలుసు. స్వతహాగా ఎమోషనల్. స్కూలు రోజుల్లోనే చిట్టిపొట్టి కవితలు వ్రాసేది. స్కూలు మ్యాగజైన్లో కూడా వచ్చేవి” నా మాటను అతడు అంగీకరించలేదు.

తల బలంగా విదిలించాడు. “లేదన్నయ్యా! వ్యవహారం నువ్వనుకున్నంత సింపుల్ కాదు. శృతి మించి రాగాన పడినట్లుంది. నేను వెనక్కి తగ్గమని వార్నింగ్ ఇచ్చినా మానడం లేదు మీ మరదలు పిల్ల. నువ్వు మరొక విషయం గమనించలేదనుకుంటాను, ఇంట్లోపల పాప నిద్రిస్తూంది. పాప ఏడుస్తుందేమో – ఆకలి పుట్టి కేకేలు వేస్తుందేమోనన్న చింతే లేకండా సౌదామిని కబుర్లాడుతూంది, గమనించావా అన్నయ్యా! మీ చినమామయ్య కూతురు కదా – తదుపరి చర్య తీసుకునే ముందు ఒక మాట చెప్పాలని నిన్ను పిలిపించాను. అంతే” అన్నాడు.

నివ్వెరపాటుతో చూసాను. వెంగళ్రావు మళ్ళీ చెప్పసాగాడు-“నేను బిజినస్ టూర్ పైన వెళ్ళినప్పుడల్లా అతడు ఇక్కడకు వచ్చి కబుర్లాడుతున్నాడన్నది కూడా నాకు తెలుసు. ఈ వ్యవహారం మా అత్తామామలకు కూడా తెలిసినట్లుంది.”

నేనిక మాట్లాడలేదు. నిశ్శబ్దంగా పెరడు వేపు నడచి నిద్రిస్తూన్న పాపను చిన్నగా ముద్దుపెట్టుకుని, వచ్చిన దారమ్మటే రోడ్డుపైకి చేరుకున్నాను. ఇల్లు చేరుకున్న మరునిమిషమే సౌదామినిని రుద్రదేవత ఆలయ ప్రాంగణాన మరునాడు ఉదయం కలుసుకోమని మొబైల్ ద్వారా మెసేజ్ పంపించాను.

మరునాడు సౌదామిని నేను చెప్పిన ప్రకారం గుడి ఆవరణలో ఉన్న ఉసిరి చెట్టు చప్టా పైన కూర్చుని ఎదురు చూస్తూంది; చేతిలోని పాపతో బుజ్జి బుజ్జి మాటలాడుతూ. నేను బైక్‌ని రోడ్డు ప్రక్కన పెట్టి సౌదామినికి ఎదురెళ్లి మొదట పాపను చేతిలోకి తీసుకున్నాను. ఎందుకో మరి నాలోని ప్రేమంతా పాప పైకే వెళ్తుంది. కాసేపు పాపతో ఆడుకుని అడిగాను – “ఏమిటిదంతా సౌదామినీ! ఆ జమదగ్నితో నీకు దగ్గరితనం ఉందని తెలుసుకుని నేనే ఇంతగా కళవళపడిపోతున్నానే – మరి మా చినమామయ్య చినఅత్తయ్యా ఎంతగా టెన్షన్‌గా ఫీలవుతారో ఆలోచించావా? అసలు పెళ్ళైన స్త్రీవి – ఒక బిడ్డ తల్లివి. కొంచమైనా పర్యవసానాల గురించి తలపోస్తున్నావా! నిన్ను పెళ్ళి చేసుకోమని నన్నందరూ మెడ వంచడానికి పూనుకుంటున్నప్పుడు నేనేమన్నానో గుర్తుందా?”

తలూపింది గుర్తుందన్నట్టు. ఐనా నాలోని భావావేశం ఆగలేదు. “ ‘మేం ముగ్గురన్నదమ్ములం. మాకు తోబుట్టువన్నది లేదు. నిన్ను మా తోబుట్టువుగానే చూస్తున్నాన’న్నాను. ఆ బంధం మనసున పెట్టుకుని నాకు నిజం చెప్పు సౌదామినీ!” చెప్పడం ఆపి సౌదామినిని నిదానంగా చూసాను. నాకు తీవ్ర విస్మయం కలిగింది. ఇసుమంత కూడా చెదరకుండా నిబ్బరంగా నావేపు చూస్తూ నిల్చుంది.

నేను రెట్టించి అడిగాను- “వుడ్ యు ప్లీజ్ కమ్ అవుట్?” సౌదామిని అదే నిబ్బరమైన చూపుతో బదులిచ్చింది – “యస్! ఐ వుడ్ కమ్ అవుట్ అండ్ టెల్ యు ది ట్రూత్. ఎంటైర్ ట్రూత్. నేను జమదగ్నిని ప్రేమిస్తున్నాను. ఇక చివరి వరకూ ప్రేమిస్తూనే ఉంటాను” ఈ మాటతో నాకు నిజంగానే కోపం మిన్ను ముట్టింది.

“నీకు మతి గాని భ్రమించలేదు కదా! ప్రేమన్నదాని కోసం పెళ్లికి ముందు ఆలోచించాల్సింది. పెళ్లయి ఒక బిడ్డకు తల్లివయి ఇప్పుడు పరపురుషుణ్ణి ప్రేమిస్తున్నానంటావా? అంతా మామూలన్నట్టు కట్టుకున్న భర్తను కన్‌ఫ్యూజ్ చేస్తావా? ఇది కలలో కూడా తలపోయకూడని విషయం.”

“ప్రేమ చెప్పి రాదు బావా! మనసుతో దానికి చెలగాటాడడం ఎక్కువ. అసలు మనసు నామాట ఎప్పుడు వింది గనుకనా!”

“బాగా ఆలోచించే మాట్లాడుతున్నావా సౌదామినీ! నువ్వు పెద్దదానివయి పోయావని చూస్తున్నాను. లేక పోతే నీ చెంప ఛెళ్లు మన్ను. క్షణికోద్రేకాన్ని ప్రేమంటావా!”

“ఇప్పుడు మాత్రం నిన్నెవరు ఆపారు బావా! ఎప్పటికీ మీ ఇంటి సౌదామినినేగా! కాని ఒకటి మాత్రం ఖాయం. నేను జమదగ్నిని ప్రేమించడం మానలేను. అతడు నన్ను ప్రేమించడం మానలేడు”

“మరైతే నేనీ విషయాన్ని మా చిన్నమామయ్యకూ చిన్నత్తయ్యకూ చెప్పడం తప్ప నాకు వేరే దారి కనిపించడం లేదు. ఎందుకంటే—వెంగళ్రావు నీకు డైవోర్స్ ఇవ్వడానికి ప్రయత్నాలు ప్రారంభినట్టున్నాడు” సౌదామిని చలించలేదు. బదులివ్వలేదు. ఉసిరి కొమ్మల్లోకి చూస్తూ ఉండిపోయింది. నాకెందుకో చంటిపాపను తీసుకుని గట్టిగా హత్తుకోవాలనిపించింది, కాని ఆపుకున్నాను. అదొక అబ్సెషన్ కాకుండా మనసా వాచా ప్రేమే అనుకున్నా – అది కన్నకూతురుకంటే ఎక్కువా! అడుగులు చూసి వేయవద్దా!

నాలుగు రోజులు దాటిన తరవాత కూడా సౌదామిని వ్యవహారం గురించి మా చిన్నమామయ్య వద్ద గాని చిన్నత్తయ్య వద్దగాని ప్రస్తావించలేదు. వాళ్ళకు కూడా కూతురు విషయం తెలిసుంటుందని వెంగళ్రావు చెప్పాడుగా!వాళ్లుగా వచ్చి చెప్పేంత వరకూ వాళ్ళనెందుకు అలజడికి లోను చేయడం?

బుధవారం రాత్రి.  పడకగదిలోకి వెళ్ళేటప్పటికి మల్లెల వాసనలు-గుళాబీల ఘుమఘుమలు గుప్పుమని సందడి చేసాయి. కొన్నేళ్ల క్రితం ఇదే రోజున నాకూ పావనికీ నిశ్చితార్థం జరిగింది. అవి మామూలు మధుర స్మృతులా?భార్యాభర్తల అనుబందానికి పునాదులు వేసే ఆర్ద్ర స్మృతులు కదూ! ఇంట్లో పిల్లలిద్దరి అలికిడి లేదు. మూడో వీధిలో ఉన్న వాళ్లమ్మ వాళ్ళింటికి పంపించేసి ఉంటుంది. ఇక మా ఇద్దరి మధ్యా ఆనందడోలికల సన్నాయి సవ్వడ్లేగా!కాని ఆశ్చర్యం! ఎన్నడూ ఎరగని విడ్డూరం! మా ఇద్దరి నడుమా యెవరో-ఎవరో ఏమిటి-భవాని వచ్చి కూర్చున్నట్లనిపించింది. అక్కడికక్కడు నా రెండు చేతులూ పట్టుకుని తనను మరచి పోవలదని అభ్యర్థిస్తున్న హృదయ ఘోష వినిపిస్తున్నట్లనిపించింది. గుండె గతుక్కుమన్నట్లయింది. ఇదెక్కడి సోదెరా బాబూ! ఆవిడ జ్ఞాపకాలు మా మొగుడూ పెళ్ళాల పడక గది వరకూ రావడం యేవిటి! ఆరోజు మధ్యాహ్నం కూడా భవాని వచ్చి ఎంత వద్దన్నా విడవకుండా తన టిఫిన్ బాక్సునుంచి నాకు అందిచ్చిన సేమియా ఉప్మా గుర్తుకు వచ్చింది. ఆమె అందిచ్చిన ఆ సేమియా ఉప్మా కంటే ఆమె కళ్ళల్లో కనిపించిన ఆప్యాయత నా ఇరు కళ్ళల్లో నిలిచి పోయినట్టుంది. లేదు. కాకూడదు. ఇదంతా కొరివితో తల గోక్కునే వ్యవహారమే అవుతుంది. బంగారం వంటి మా సంసారం బూడిద పాలవుతుంది. కదిలే మేఘాలు చూసి బిందెలోని నీళ్ళను ఒలకబోసుకున్నట్లవుతుంది. రేపే వెళ్లి యూనియన్ వాళ్లకు నయానా భయానా నచ్చచెప్పి వాళ్ళ సహాయంతో మరొక సేక్షన్‌కి వెళ్లిపోవాలి; అది వర్క్ లోడ్‌తో మునిగిన ఎంతటి పెండింగ్ సెక్షన్ ఐనా సరే–

భవాని తలంపుల్ని పారద్రోలి పావనిని గుండెలకు హత్తుకునేందుకు చేతులు చాచాను. ప్రక్కనున్న ల్యాండ్ లైన్ ఖంగున మ్రోగింది. కొంపదీసి భవాని కాదు కదా! నేనిక చేసేది లేక పావనిని విడిచి ఫోను అందుకున్నాను. క్షణాలలో నా ముఖంలో రంగులు మారసాగాయి. కళ్ళు అంతకంతకూ పెద్దవి కాసాగాయి. నా ముఖకవళికలు గమనించి నన్ను ఒక్క ఉదుటున సమీపించి- “ఏమైందండీ!” అని కలవరపాటుతో అడిగింది పావని.

“ఫోను వెంగళ్రావుది. సౌదామిని ఇంటి ఆవరణ ముందు పడిపోయుందట. నన్ను వెంటనే రమ్మంటున్నాడు వెంగళ్రావు” అంటూ ఎక్కడివి అక్కడే విడిచి పావని చేయిపట్టుకుని అమ్మకు ఓమాట చెప్పి బైక్ తీసాను.

ఇద్దరమూ బైక్ దిగి గుంపుగా నిల్చున్న మనుషుల్ని తోసుకుంటూ వెళ్లేటప్పటికి కథ ముగిసినట్లు తెలుసుకున్నాను. సౌదామినివి ఎప్పుడో ప్రాణాలు పోయుంటాయి. కన్నీరు విడుస్తూ తేరి చూసాను. నా ప్రియమైన మరదలు పిల్ల అందమైన ముఖం పాలిపోయుంది. నేను ఎడతెగని దు:ఖంతో దగ్గరకు వెళ్ళబోయాను. ప్రక్కనే ఉన్న ఎస్.ఐ. నన్ను ఆపి- “సారీ! ఇది సూసైడ్ కేసు. శవాన్ని ఎవరూ ముట్టుకోకూడదు. పోస్ట్ మార్టమ్ జరిపించాలి” అంటూ నా చేతిలో ఏదో చిన్నపాటి నోటుని ఉంచాడు.

కళ్ల పొరల్నికప్పిన కన్నీటి చుక్కల్ని అరచేతితో తుడుచుకుంటూ చూసాను- “ఈ ప్రపంచం నన్ను ఓడించగలదు. కాని నా ప్రేమను మాత్రం ఓడించలేదు. అంతేకదా చిన బావా!”

నేను సూసైడ్ నోటుని ఎస్సై గారికి తిరిగి ఇచ్చేస్తూ ఆవేశంతో అరిచాను- “దీనికంతటికీ కారకుడు వాడే! ఆ జమదగ్నిగాడే ఇన్‌స్పెక్టర్! వివాహిత అని తెలిసి కూడా మా మరదలు పిల్లను మోహపు రొంపిలో దించి, మాయ మాటలతో మతిని పోగొట్టి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తరవాత నేనూ సౌదామిని భర్తా కలసి డిటైల్డ్ రిపోర్టిస్తాం. ఆలస్యం గాని చేస్తే వాడు తప్పకుండా పారిపోతాడు ఇన్‌స్పెక్టర్, ప్లీజ్! వాడిల్లు ఎక్కడో కాదు – ఇదే వీధి చివరనే ఉంది” అన్నాను. ఎస్సై అలాగే అంటూ హెడ్ కానిస్టేబుల్‌కి అక్కడే ఉండమని ఆదేశాలు జారిచేసి జీపు వేపు కదిలాడు. నేను నడుస్తూనే వెంగళ్రావు చంకనున్న పాపను అందుకుని పావనికి అందిస్తూ- “ఇకపైన ఈ పాప నీ కూతురే!” అంటూ నేను ఎస్సైతో కలసి జీపులో కూర్చున్నాను. జీపులో కూర్చున్నానన్నమాటే గాని – దవళ్లు రెండూ బిగుసుకుపోయాయి. ధూర్తుడు సౌదామిని పెళుసైన ఎమోషన్స్‌తో ఆడుకున్నాడు! తనకు చెందని ఒక వివాహితను పెడదారి పట్టించాడు. ఎట్టి పరిస్థితిలోనూ వీణ్ణి విడచి పెట్టకూడదు.

నేనిచ్చిన సూచన ప్రకారం పోలీసు డ్రైవర్ జీపుని జమదగ్ని వాళ్ళ ఇంటిముందు నిలిపాడు. నేను ఒక్క గెంతున జీపునుండి ఎదురుగా ఉన్న జమదగ్ని వాళ్ల ఇంటి వేపు పరుగు వంటినడకతో చేరుకున్నాను.

అక్కడ నాకెదురైన దృశ్యానికి నివ్వెరపోయి కళ్లు మిటకరిస్తూ నిల్చున్నాను. ఇంటిలోనూ ఇంటి చుట్టూ పెద్దపాటి గుంపు! వెనుకడుగు వేయకుండా గుంపులోకి చొరబడ్డాను. అచ్చు సౌదామినిలాగే జమదగ్ని కూడా విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుని పడున్నాడు. అంటే – ఇద్దరిదీ మ్యూచువల్ సూసైడే! అతడి కుడిచేతిలో కూడా సూసైడ్ నోట్ గాలికి రెపరెపలాడుతూంది. నేను కళ్ళు రెండూ గట్టిగా మూసుకున్నాను. అప్పుడెవరో నా చెవి దగ్గర ఎవరో బొంగురు స్వరంతో ఊసులాడుతున్నట్టనిపించింది, చెవులు రొండూ ఒక్కసారిగా రిక్కించాను. “చెప్పు చినబావా! పెళ్లయినంత మాత్రాన మన హృదయం ప్రేమించడం మానుకోవాలా బావా!” నేను కళ్లు విప్పకుండానే మనసు పొరల నుండి బదులిచ్చాను – “అన్ని విషయాలలోనూ అన్ని దశలలోనూ స్వప్నించడం శ్రేయోదాయకం కాదు సౌదామినీ! అందునా-మన గురించి మాత్రమే మనం ఆలోచించడం యే మాత్రమూ శ్రేయోదాయం కాదు సౌదామినీ!”

నాకూ సౌదామినికీ మధ్య జరిగిన ఆ మౌన సంభాషణం తరవాత నేనిక అక్కడ నిల్చోలేదు. జమదగ్ని సూసైట్ నోటుని చూడాలనిపించ లేదు. జన సమూదాయాన్ని తోసుకుంటూ బైటకు వచ్చాను. చూడటానికేముంది-ఇక తెలుసుకోవడానికేముంది-ప్రపంచమంతా అత్యాశపు అలల పోటుతో కొట్టుమిట్టాడే నరకభూయిష్ఠమేగా!

ఎస్సై తన పనిలో తను పడటం గమనించిన నేను- ఇక ఎవరినీ ఇబ్బంది పెట్టదలచుకోలేదు; ముఖ్యంగా నన్నే మౌన నివేదనతో వెంటాడుతున్నట్టు చూస్తూన్న జమదగ్నిని! కాలినడకన దిక్కు తోచని వేపున నడకసాగించాను. పావని చేతిలోని సౌదామిని పాప గుక్కతిప్పుకోకుండా యేడుస్తూన్న శబ్దం నాకు వినిపిస్తూంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here