స్వస్తి..!!

1
10

నా..
మా..
అనే పదాలు మరచి
‘మన’ అనే పదం..
ఉచ్చరించలేని..
మహానుభావులుగా
చెలామణి అయ్యే..
స్వార్థ జనావళికి,
వారి స్నేహానికీ,
స్వస్తి పలికేస్తా!

ముఖస్తుతితో
మునగచెట్టు ఎక్కించి,
పొగడ్తల మత్తుతో
ఒళ్ళు పులకింపజేసి ,
నా వీపు వెనక..
నా శీలాన్ని వెక్కిరించే,
నక్కజిత్తుల
నాగన్నల స్నేహానికి
స్వస్తి పలికేస్తా!

అవసరానికి ఒకలా,
అవసరం తీరాక మరోలా,
మనిషిని లెక్కగట్టే
మాయమనుష్యుల
స్నేహానికి,
మరో ఆలోచన లేకుండా,
స్వస్తి పలికేస్తా!

హోదాల గర్వంతో,
‘మనీ’ ఉందన్న మదంతో
స్నేహాన్ని
చిన్నచూపు చూసే,
ఇరుకు బుద్ధి..
మకిలి మనస్సుల
మురికి స్నేహానికి,
స్వస్తి పలికేస్తా!

కులంతో..
మతంతో..
ప్రాంతంతో..
భాషతో..
స్నేహాన్ని ముడిపెట్టే,
కుచ్చిత బుద్ధుల,
దొంగస్నేహానికి..
స్వస్తి పలికేస్తా!

నిండు హృదయంతో,
నన్ను నేను నమ్ముతూ
నిజాయితీగా బ్రతికేస్తా..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here