‘స్వాతంత్ర్య భారతికి అమృతోత్సవ హారతి’ గ్రంథావిష్కరణ సభ విశేషాలు

0
10

[dropcap]భా[/dropcap]రత స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా నవ్య సాహితీ సమితి, అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థలు సంయుక్తంగా హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయంలో 9 ఆగష్టు 2022వ తేదీన ‘స్వాతంత్ర్య భారతికి అమృతోత్సవ హారతి’ అనే కావ్యావిష్కరణ సభ ఏర్పాటు చేశాయి. వేదిక పైనున్న పెద్దలచేత జ్యోతి ప్రకాశనం గావించిన అనంతరం శ్రీమతి శ్రీవల్లీ ఫణీంద్ర గారి దేశభక్తి గేయంతో సభ ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమానికి తెలుగు విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ఆచార్య టి.గౌరీశంకర్ అధ్యక్షత వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రంథావిష్కరణ గావించారు.

ఆచార్య టి.గౌరీశంకర్ తమ అధ్యక్షోపన్యాసంలో దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన త్యాగధనుల జీవితాలను ఈ గ్రంథంలో చక్కగా వర్ణించారనీ, ఇది నేటి యువతరానికి ఒక స్ఫూర్తిగా ఉపయోగపడుతుందని అన్నారు. గ్రంథ సంపాదకులు కోడీహళ్ళి మురళీమోహన్, గౌరవ సంపాదకులు ఆచార్య ఫణీంద్రలను అభినందించారు.

అనంతరం జస్టీస్ రామలింగేశ్వరరావు గ్రంథాన్ని ఆహూతుల సమక్షంలో ఆవిష్కరించారు. సంపాదకులు, గౌరవ సంపాదకులను న్యాయమూర్తి సన్మానించారు. తరువాత తమ ప్రసంగంలో తెలుగు భాష నిరాదరణకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించినవారి చరిత్రలను రానున్న తరాలు తెలుసుకునేలా పుస్తకాలు అందుబాటులోకి రావడం స్వాగతించదగ్గ విషయమని అన్నారు.

సంపాదకుల పక్షాన ప్రసంగించిన డాక్టర్ ఆచార్య ఫణీంద్ర ఈ గ్రంథం వెలువడడానికి మురళీమోహన్, అతని సోదరుడు ఫణి ప్రసన్న కుమార్, పరిష్కర్తగా తాను చేసిన కృషిని వివరించారు. 108 సీసపద్యాలలో శతాధిక స్వాతంత్ర్య సమరవీరుల పోరాట చరితను శతాధిక కవులు వ్రాయడమే కాక ముక్తపదగ్రస్త నియమాన్ని పాటిస్తూ ఒక పద్యానికి ఒక పద్యానికి ముడి వేస్తూ ఈ కావ్యాన్ని పుష్పమాలగా భారతమాతకు సమర్పించారని వివరించారు.

విశ్వసాహితి సంస్థ అధ్యక్షులు డా.బి.జయరాములు గ్రంథాన్ని సభకు పరిచయం చేశారు. ఈ సభకు గౌరవ అతిథులుగా హాజరైన ప్రముఖ పాత్రికేయులు శ్రీ ఉడయవర్లు, ప్రముఖ కవి శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ, ప్రముఖ కవయిత్రి శ్రీమతి లలితా పరమేశ్వరి తమ తమ ప్రసంగాలలో ఈ కావ్య విశిష్టతలను వివరించారు.

అతిథులను నిర్వాహకుల పక్షాన నవ్యసాహితీ సమితి అధ్యక్షులు శ్రీ వేమరాజు విజయ్ కుమార్, అబ్జ క్రియేషన్స్ వ్యవస్థాపక కార్యదర్శి శ్రీ కోడీహళ్ళి మురళీ మోహన్‌లు సత్కరించారు. ఈ గ్రంథ నిర్మాణంలో పాలుపంచుకున్న కవులలో సభకు హాజరైన కవులకు వేదికపై జస్టిస్ రామలింగేశ్వరరావు కావ్య ప్రతిని అందించారు. పెద్ద ఎత్తున సాహిత్యాభిలాషులు, పద్యప్రియులు పాల్గొన్న ఈ సభకు శ్రీ తంగిరాల చక్రవర్తి, మద్దిపట్ల విశ్వనాథం, పైడి హరనాథరావు, కె.చక్రపాణి తదితర ప్రముఖులు హాజయ్యారు. కోడీహళ్ళి మురళీమోహన్ వందన సమర్పణ అనంతరం జాతీయ గీతాలాపనతో సభా కార్యక్రమం ముగిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here