భరతమాతకు పద్యమణిహారం

2
7

[dropcap]’స్వా[/dropcap]తంత్ర్య భారతికి అమృతోత్సవ హారతి’ – ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంబరాలు దేశమంతటా జరుపుకుంటున్న వేళ భరతమాతకు కవులు సమర్పించిన పద్యమణిహారం ఇది. దీనికి గౌరవ సంపాదకులుగా ఆచార్య ఫణీంద్ర, సంపాదకులుగా శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్ గారు వ్యవహరించి అద్భుతమైన ఈ పద్య కవితాఫలసాయాన్ని పండించారు. ఈ సంకలనాన్ని ‘అబ్జ క్రియేషన్స్’ వారు ప్రచురించారు.

“తెలుగు భాషకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చే ఛందోబద్ధ పద్యాలను సజీవంగా నిలుపుకుని భావి తరాలకు అందించవలసిన బాధ్యత   మనపై ఉంది.”

అంటారు సంపాదకులు తమ పరిచయ వాక్యాలలో. ఎంత నిజం? ఇతివృత్తంలో ఇమడని పద్యాలను స్వీకరించలేకపోయామనీ, మన్నించమనీ, వారు చెప్పడం వారి వినయశీలానికి తార్కాణం. కొన్ని పద్యాలకు సవరణలు చేశామనీ, ఆయా కవులు దానికి అంగీకరించినందుకు కృతజ్ఞతలు చెప్పడం కూడా సంస్కార విశేషమే. కవులు కూడా అభినందనీయులే.

‘విద్యాదదాతి వినయమ్’ అన్న ఆర్యోక్తిని ఉభయులూ సుసంపన్నం చేశారు. ఈ పద్యకవితా సంకలనంలో భారత స్వాతంత్ర్య పోరాటంలో తమదైన దోహదం చేసిన రాజకీయ నాయకులు, రచయితలు, సంఘ సంస్కర్తలు, ఎందరో ఉన్నారు. కేవలం లబ్ధ ప్రతిష్ఠులను మాత్రమే కాకుండా, చాలామందికి తెలియని ఎంతో మంది స్వాత్రంత్య్ర యోధులను కీర్తింప చేసి, సంపాదకులు ధన్యులైనారు.

‘ముక్తపదగ్రస్తము’ అనే ఒక చక్కని శబ్దాలంకారమున్నది. దానిని ఈ కూర్పులో అనుసరించినారు. అన్నీ సీస పద్యాలనే ఎన్నుకోవడం విజ్ఞతను సూచిస్తుంది. ఎందుకంటే, కేవలం ఒక్క పద్యంలో, ఒక్క పోరాట యోధుని గురించి సమగ్రంగా చెప్పడం అసాధ్యం. కందం, ఆటవెలది, తేటగీతి లాంటి పద్యాలలో  అసలు వీలు పడదు. సీస పద్యమైతే మెరుగు. నాలుగు పాదాలతో నాలుగు అంశాలను స్పృశించవచ్చు. క్రింద తేటగీతి లేదా ఆటవెలది పద్యం ఎలాగూ ఉండాలి కాబట్టి సారాంశం, ముక్తాయింపు వంటి వాటికి వాటిలో అవకాశం ఉంటుంది.

కె. ప్రసన్నకుమార్ గారి తొలి పద్యం ‘కావ్యార్థ సూచన’ సముచితంగా మొదలుపెట్టింది ఈ మణిహారపు అల్లికను. ఈ హారంలో ‘నాయకమణి’ అంటూ ఏదీ లేదు. అన్నీ దివ్యమణులే.

‘వీరగాథల నెత్తావి విరుల గూర్చి

భక్తి ముక్తపదగ్రస్త పద్యమాల

జేర్చి, నీ గళమందు వేసెదము, స్వేచ్ఛ

బడసిన యమృతోత్సవ వేళ భరతామాత!’

ఈ పద్యంలో ‘నెత్తావి విరులు’ అన్నాడు కవి. ఔచిత్యమంటే  అదీ! ఏవో పూలు కాదవి. నెర… అంటే మిక్కిలి తావి… అంటే సువాసన గల పుష్పాలతో ఈ మాలను కూర్చినారు. క్షేమేంద్రుని లాక్షణిక నిబంధన ఈ పద్యంలో చక్కగా పాటించినారు కవి.

అన్ని పద్యాలనూ సమీక్షించడం ‘గ్రంథ విస్తర భీతి’కి దారి తీస్తుంది కాబట్టి, కొన్ని పద్యాల సొబగులను గురించి ముచ్చటించుకొందాం. అట్లని, ముచ్చటించబడని పద్యాలు తక్కువ స్థాయివని కాదు. అన్నీ ఆణిముత్యాలే.

ఆచార్య ఫణీంద్ర ‘మంగళ్ పాండే’తో శుభ ప్రారంభం చేశారు. ఆయనను ‘ప్రథమ యోధుడు’ అనడం ఎంతో తగినది. ‘పోరి, ఉరి తీయబడినట్టి వీరుడితడు’ అన్న పద్యపాదంలోని వృత్యనుప్రాసాలంకారం, పదాల పోహళింపుతో బాటు, భావపు గుబాళింపును కూడా కలిగి ఉంది. మహ్మద్ షరీఫ్ గారు ‘మౌల్వీ లియాఖత్ అలీ’ గురించి రాసిన పద్యంలో ‘సంగ్రామ చరిత యందు నిలిచె చిరుతపులిగ’ అంటారు. ‘ఛేకానుప్రాసము’తో ఆ మహనీయుని సంగ్రామ పటిమను మనముందు నిలిపినారు కవి.

నేమాని సోమయాజి గారి ‘అరబిందో ఘోష్’ ఒక మేలైన పద్యం. ఘోష్‌ను ‘భారతదేశపు ఆధ్యాత్మ పరిమళంబు’ అంటారాయన. చక్కని Metaphor (రూపకం) ఇది. అతివాద మితవాద సిద్ధాంత రాద్ధాంతాలలో, మార్గదర్శనం చేసినాడనటంలో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు. ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి ‘వినాయక్ దామోదర్ సావర్కర్’ను తీసుకొన్నారు. జిన్నాను, ‘తుపాకీ చేతున్నదని నిర్భయంగా బెదిరించిన వీరుడు’ సావర్కర్. “ఆయన చెరసాల చరిత చదివితే చాలు, దేశ రక్షకులవుతారు” అంటారు కసిరెడ్డి. ‘దేశభక్తులు’ అనకుండా, ‘దేశ రక్షకులు’ అనడంలోనే స్వారస్యమంతా ఇమిడి ఉంది.

ముక్కు శ్రీ రాఘవ కిరణ్ గారు ‘మౌలానా అబుల్ కలాం ఆజాద్’ గురించి వ్రాసిన పద్యంలో ‘హిందూ ముసల్మాన్ల హితము గోరి పత్రికలు స్థాపిచి వ్రాయువాడు, దేశ విభజన నొప్పని ధీరుడు’ అని ఆజాద్ గారిని వర్ణించారు. ఇరు మతాల వారూ అన్నాదమ్ముల వలె కలిసి మెలసి ఉండాలని ముస్లిం నాయకులు కూడా తలపోశారు. చక్రవర్తి రాజగోపాలాచారి గారిని ‘చాణక్యుని కెంతేని సరిజోడు’ అని ప్రస్తుతించారు అయాచితం నటేశ్వర శర్మ. అలాగే ‘అబాదీ బానో బేగం’ అనే మహిళ ఖిలాఫత్ ఉద్యమంలో ‘ముస్లిం స్త్రీ శక్తిని చాటిందనీ, తిలకునిధికి తిలకమద్దింద’నీ తెలియజేశారు.

పేరి వెంకట సూర్యనారాయణ గారు ‘సుబ్రహ్మణ్య భారతి’ని గురించి ఇలా అంటారు –

‘విప్లవ గీతాలు వెల్లువగా వ్రాసి

సాంఘిక మౌఢ్యాల సంస్కరణమ్ముకై’

దీక్షితుడైనాడని చెప్పడం మనసుకు హత్తుకుంటుంది. ‘దండి యాత్ర’లో గాంధీజీకి అండగా ‘భారతీయ పతాక నెగురవేసిన’ కమలాదేవి ఛటోపాధ్యాయ, మన మన్ననకు పాత్రురాలు. అల్లూరి సీతారామరాజును వినుతిస్తూ, తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ –

‘మిరపటపాల్ పంపి, మెరుపు దాడులు చేసి

… … …. …..

బెబ్బులి గాండ్రించి తీండ్రించె’ అని మన గుండెలనుప్పొంగ చేస్తారు.

‘గుండె కెదురుగా గుండెను నిలుపుచు ఆంధ్ర కేసరి యైన అంశుమాలి’గా ప్రకాశం పంతులుగారు దర్శనమిస్తారు. ‘జార్జి జోసెఫ్’ అను స్వాతంత్య్ర సమరయోధుడు ‘చట్టమ్ము నెదిరించు; సమకరించకుమని’ హుంకరించినాడంటారు శ్రీనివాస భరద్వాజ కిశోర్.

‘రజాకారుల నెత్తుటి దారు లెదిరి, హరజనోద్ధరణకై పాటుపడి, తను, మన ధనమ్ములన్నీ పేదల కిచ్చిన’ రావి నారాయణ రెడ్డి ధన్యుడు.

ఇంకా; మనలో చాలామందికి తెలియని స్వాతంత్ర్య సమరయోధులు బ్రహ్మ ప్రకాశ్, భికాజీ రుస్తుం కామా, కొడాలి కమలాంబ, మైలార మహాదేవప్ప లాంటి ప్రాతః స్మరణీయులెందరో ఈ నెత్తావి విరుల మాలలో చోటు చేసుకున్నారు.

ఒక్కో పద్యం చదువుతూ ఉంటే గుండె ఉరకలు వేస్తుంది. వీరే గనుక ఉద్యమించకపోయి ఉంటే మన దేశపు గతి ఏమయి ఉండేదని భయం కలుగుతుంది. కులాలకు, మతాలకు, సమాజ హోదాలకు అతీతంగా సాగిన స్వాతంత్ర్య సమరం మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. సెక్యులరిజానికి విపరీతార్థాలు పుట్టుకొస్తున్న ఈ ప్రస్తుత సమాజానికి కనువిప్పు ఈ పద్యమాలిక. “ముందు అందరం భారతీయులం, తర్వాతే ఎవరమైనా” అని నిష్కర్షగా, నిష్కల్మషంగా ప్రబోధిస్తుంది ఈ కావ్యం.

ఈ కావ్యంలో పాలు పంచుకొన్న కవులందరికీ శత వందనాలు. స్థలాభావం వల్ల అందరి కవిత్వాన్నీ స్పృశించ లేకపోయాను. వారందరికీ సహస్ర వందనాలు. ఈ గ్రంథాన్ని విశ్వవిద్యాలయాలు తెలుగులో పాఠ్యాంశంగా నియమిస్తే బాగుంటుంది. ఒకే చోట ఇంతమంది సమరయోధుల గురించిన సమాచారం, ఛందోబద్ధంగా, సమగ్రంగా ఇంకెక్కడా దొరకదేమో?

ఈ మహాయజ్ఞంలో నేను కూడా ఒక సమిధనైనందుకు చాలా సంతోషిస్తున్నాను. ‘విద్యానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం’ అన్నట్లు ఈ కబ్బము అబ్బురమైన పండిత జనాదరణనే గాక, ఎప్పటికీ అవసరమైన మాతృదేశభక్తికి ప్రేరణగా నిలుస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సెలవు.

‘తేజస్వినావధీతమస్తు!’

***

సాతంత్ర్య భారతికి అమృతోత్సవ హారతి
(శతాధిక కవుల ముక్తపదగ్రస్త కావ్యము)
సంపాదకులు: కోడీహళ్ళి మురళీమోహన్
ప్రచురణ:
అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ, హైదరాబాద్
పేజీలు: 120
వెల: ₹ 250
ప్రతులకు:
కె. మురళీమోహన్
402, ఆనంద్ సాయి రెసిడెన్సీ,
రోడ్ నెం 2, కె.ఆర్.సి.ఆర్. కాలనీ,
బాచుపల్లి, హైదరాబాద్ 500090
ఫోన్: 9701371256
~
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here