స్వాతి చినుకు

6
13

[డా. రాయపెద్ది వివేకానంద్ రచించిన ‘స్వాతి చినుకు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]స[/dropcap]మయం: సాయంత్రం ఏడు గంటలు (అమెరికా కాలమానం)

స్థలం: వాషింగ్టన్ – డీసీ (ఉత్తర అమెరికా)

నా విజయం నాకే ఇంకా పూర్తిగా నమ్మశక్యం కావటం లేదు.

నన్ను ఉద్దేశించి ‘మా నూతన సీఈవో గారికి స్వాగతం’ అన్న బ్యానర్లు ఎటు చూసినా కనిపిస్తున్నాయి.

తెలుగు టీవీ చానెళ్ళలో అనౌన్సర్లు తమ భాషా పాటవాన్ని చూపిస్తూ కెమెరాల ముందు మాట్లాడుతూనే ఉన్నారు.

“ఒక తెలుగువాడు ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రభావవంతమైన సంస్థకి అధినేతగా ఎన్నికవటం పట్ల ప్రకృతికూడా పులకించిందా అన్నట్లు పల్చటి మంచు పేలికలు పావురం ఈకల్లా నిరంతరాయంగా పుడమి తల్లిని స్పృశిస్తున్నాయా?” అని ఒక అనౌన్సర్,

“ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు అందరు ఆ విజయం తమదేనేమోనన్నంతగా ఆనందిస్తున్నారు” అని ఇంకొక అనౌన్సరు, ఇలా రకరకాలుగా వార్తా కథనాలు అన్ని టీవీ ఛానెళ్ళలో వస్తున్నాయి.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే శాసించగల విశ్వవిఖ్యాత సాఫ్ట్‌వేర్ దిగ్గజం తాలూకు ప్రధాన ఆర్ అండ్ డి విభాగం. బహుళ అంతస్తుల కార్యాలయ భవనం వాషింగ్టన్ నగరానికే తలమానికంగా నింగికెగసి ఠీవీగా నగరాన్ని చూస్తున్నట్టుగా ఉంది.

అన్ని అంతస్తులకన్నా పై అంతస్తులో, నా నూతన ఆఫీస్ ఛాంబర్‍లో, మొదటి సారిగా నాకు ఇవ్వబడిన ‘సింహాసనం’ లాంటి కుర్చీలో కూర్చుని అద్దాలలోంచి బయటకు చూస్తుండిపోయాను.

అభినందనల పరంపర కొనసాగుతోంది. భారతదేశ రాష్ట్రపతి, ప్రధానీ, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీడియో కాల్ చేసి నన్ను అభినందించారు కొద్ది సేపటి క్రితమే.

ఇందాకే మా సంస్థ సంస్థాపకులు వచ్చి నన్ను అభినందిస్తూ ఇచ్చిన గౌరవ సమావేశం ముగిసింది. దాని తర్వాత అంతర్జాతీయ విలేకరుల సమావేశం జరిగింది.

సరాసరి ప్రసారాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త చేరిపోయింది. అభినందనల వెల్లువ ప్రారంభం అయ్యింది.

“ఇంకో అరగంటలో అమెరికా రాష్ట్రపతి మిమ్మల్ని అభినందిస్తూ ఇస్తున్న పార్టీకి మనం బయలుదేరాలి” వినయంగా నా సెక్రటరీ చెబుతున్నాడు. ‘సరే’నన్నట్టుగా తలూపాను.

నాకు నిజమైన అభినందన ఇందాకే అందింది. దాని ముందు మిగతా అభినందనలు అన్నీ దిగదుడుపే. ఈమెయిల్ ద్వారా దాన్ని నాకు పంపింది మా కేశవుడు సార్. ప్రింటవుట్ తీసి ఉంచాను దాన్ని. అందులో ఉన్నవి కొన్ని కవితా పంక్తులు, ఓ రెండు వాక్యాల ఉత్తరం.

అవి చాలు నాకు నూతన శక్తిని ఇవ్వటానికి.

ఓగ్ మ్యాండినో వ్రాసిన ‘ది గ్రేటెస్ట్ సేల్స్‌మాన్ ఇన్ ది వరల్డ్ ‘ పుస్తకం లోని స్క్రోల్ నెంబర్ ఆరు నుండి కొన్ని కవితా పంక్తులు నా కోసం ప్రత్యేకంగా వ్రాసి పంపారు కేశవుడు మాష్టారు.

“అమిత ఆత్మ విశ్వాసం నాలో తలెత్తితే,
నా వైఫల్యాలని గుర్తు తెచ్చుకుంటాను,
సమృద్ధిగా నా పళ్ళెంలో ఆహారం ఉన్నప్పుడల్లా,
ఆకలితో నిద్ర లేని రాత్రులని సవినయంగా గుర్తు తెచ్చుకుంటాను.
నిర్లక్ష్యం నాలో తలెత్తినప్పుడల్లా,
నా పోటీదారులని స్ఫురణలోకి తెచ్చుకుంటాను.
భజనపరులు నా చుట్టూ చేరి నన్ను పొగడ్తలతో ముంచెత్తినప్పుడల్లా,
నేను సిగ్గుతో చితికిపోయిన క్షణాలని స్ఫురణలోకి తెచ్చుకుంటాను.
అహం నాలో తలెత్తినప్పుడల్లా,
ప్రకృతి ముందు నేను పిపీలికం లాంటి వాడిని అని గుర్తు తెచ్చుకుంటాను.
ఐశ్వర్య లక్ష్మి నాపై దయ చూపినప్పుడల్ల,
పేదల పట్ల నా సామాజిక బాధ్యత గుర్తు తెచ్చుకుంటాను.
నేనీ రోజే కాదు ప్రతీ రోజు నా భావోద్వేగాలని అదుపులో పెట్టుకుంటా.
దుఃఖంలో ఉన్నప్పుడు సంతోషం,
సంతోషంలో ఉన్నప్పుడు దుఃఖం కలగజేసే ఈ వాక్యాన్ని నేనెప్పుడు మరువను –
‘ఈ క్షణం కూడా గతంలో కలిసిపోతుంది. ఈ క్షణం శాశ్వతం కాదు’
—-
ఈ కవితా పంక్తులని ప్రతిరోజు చదువుకో ఇకపై. నీ విజయాన్ని సగర్వంగా ఆస్వాదిస్తున్నాను
– నీ కేశవుడు”

అంతే. అందులో ఉన్నది.

అది ఎన్ని సార్లు చదువుకున్నానో నాకే తెలియదు. అది చదివిన ప్రతి సారి నాలో కొత్త ఉత్తేజం.

“కార్ సిద్ధంగా ఉంది” సెక్రటరీ చెబుతున్నాడు.

పోలియో వల్ల చిన్నప్పుడే స్వాధీనం తప్పిన ఎడమకాలిని దగ్గరగా లాక్కుంటూ, కర్ర ఆధారంగా నడవసాగాను. ఆఫీస్ బాయ్ వినయంగా గాజు తలుపు తెరిచి నుంచున్నాడు.

లిఫ్ట్ వంక నడుస్తున్నాను. నా ఆలోచనలు గతంలోకి వేగంగా సాగిపోయాయి.

ఇవ్వాళ కేశవుడు సార్ పదే పదే గుర్తు వస్తున్నారు. ఆయనే లేకుంటే నా జీవితం ఎలా ఉండేదో ఆలోచించటానికి కూడా ఒళ్ళు జలదరిస్తుంది.

కేశవుడు సార్ ముఖంపై చిరాకన్నది ఎవ్వరూ ఎప్పుడూ చూడలేదు. ఆరడుగుల ఎత్తు. నేను చూసినప్పటికి దాదాపు ముఫై సంవత్సరాల వయస్సు ఉంటుంది ఆయనకు. తెల్లటి శరీర ఛాయ, బలమైన శిల్పం, ఒత్తైన జుత్తు, పల్చటి గడ్డం, పెదాలపై చెరగని చిరునవ్వు, దయ వర్షించే కళ్ళు ఇదీ కేశవుడి రూపం. ఆయన ఎప్పుడు తెల్లటి కుర్తా పైజామలలో దర్శనమిచ్చేవారు.

అతడిది ఏ ప్రాంతం? ఎవ్వరికి తెలియదు.

అతను విశ్వమానవుడు.

అతడి మాతృభాష ఏమిటి? ఇది కూడా ఎవ్వరికీ తెలియదు.

తెలుగెంత తియ్యగా మాట్లాడతాడో, ఇంగ్లీష్ అంతే ఆశువుగా మాట్లాడతాడు. ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, జపనీస్, హిందీ, తమిళ్ ఆతని నాలుక చివర ఉంటాయి. ఆయన వ్రాసే వ్యక్తిత్వ వికాస వ్యాస పరంపర తెలుగు, హిందీ, తమిళ్ పత్రికలలో ప్రచురితమయ్యేవి.

వీటన్నిటికి మించి ఒక మంచి వ్యక్తిగా అందరి హృదయాలలో అతి త్వరలోనే స్థానం సంపాయించుకున్నారు.

***

అవి నేను ఇంజినీరింగ్ చదువుతున్న రోజులు.

నేను ఏ మాత్రం ఆకర్షణీయంగా ఉండను. చిన్నప్పటినుంచే ఏర్పడిన బట్టతల, ఆకర్షణీయంగా ఉండని నల్లని శరీర ఛాయ, సోడాబుడ్డి లాంటి కళ్ళద్దాలు, చప్పిడి ముక్కు ఇవీ నా రూపురేఖల గురించి వర్ణించి చెప్పాలంటే ప్రధాన అంశాలు. వీటన్నిటికి తోడు నాపై పగబూనాడా భగవంతుడు అన్న తీరుగా కాలికి పోలియో ఒకటి అదనపు ఇబ్బంది నాకు.

ఈ కారణాల వల్ల నాకు తీవ్రమైన ఆత్మన్యూనతాభావం ఉండేది. నాలో నేనే అన్నట్టు ఉండేవాడిని. నాకంటూ ఒక లోకం ఏర్పరచుకుని నేను, నా చదువు అన్నట్టు ఉండేవాడిని. అందువల్ల చదువుల్లో మంచి మార్కులే వచ్చేవి. పెద్ద లక్ష్యాలు కూడ ఏమీ ఉండేవి కావు, అందర్లా ఇంటర్‌మీడియేట్ అవంగానే, ఇంజినీరింగ్‌లో చేరిపోయాను.

అక్కడ జరిగింది నా జీవితంలో మార్పు.

కేశవుడు గారు అక్కడ లెక్చరర్. ఆయన వల్ల నా జీవితంలో తీవ్రమైన మార్పులు రాబోతున్నాయి అని నాకు చూచాయగా కూడా తెలియదు ఆయనను నేను చూసిన మొదటి క్షణంలో.

మొదటి సారి ఆయన్ని చూసినప్పుడు నాకు ఏ ప్రత్యేక భావమూ కలుగలేదు.

అయస్కాంతం లాంటి ఆయన వ్యక్తిత్వం, ఇంద్రజాలం లాంటి ఆయన మాటల ప్రభావం నా జీవితంలో ఊహించని మార్పులనే తెచ్చాయి.

నాలోని ఆత్మన్యూనతని నేను జయించిన క్షణాలు నాకు బాగా గుర్తే.

అసలా రోజు ప్రారంభం అవటమే గమ్మత్తుగా జరిగింది.

కేశవుడు సార్ క్లాసుకు ఆలశ్యంగా వచ్చారు. కేశవుడు సార్ క్లాసుకు ఆలశ్యంగా రావటం అంటే అది ఒక అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. సాధారణంగా ఇటు సూర్యుడు అటు పొడిచినా అంత ఆశ్చర్యపడవలసిన పనిలేదు కానీ ఆయన ఆలశ్యంగా రావటం అంటే నిజంగా ఆశ్చర్య పడవలసిన విషయమే, సమయ పాలన విషయంలో ఆయనకు అంతటి పేరు ఉంది.

ఆయన మా కాలేజ్ లో ప్లేస్‌మెంట్ ఆఫీసర్ కూడా. లెక్చరర్‌గా మాకు ఆయన బోధించే అంశాలు వ్యక్తిత్వవికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లీష్ బాషలో మాట్లడటంలో శిక్షణ. అంటే మమ్మల్ని ఉద్యోగాలకు అర్హులుగా చేసే అతి ముఖ్యమయిన బాధ్యత ఆయనది.

ఇలాంటి పోస్టు ఒకటి లేకపోలేదు మా కాలేజిలో. ఇదివరకు ఉన్న లెక్చరర్లు ఏదో తూతూ మంత్రంలాగా చేశారే గానీ విద్యార్థుల జీవితాల్లో ఇంత బలమైన ప్రభావాన్ని తీసుకురాలేకపోయారు అన్నది వాస్తవం.

కేశవుడు సార్ రాకతో మా కాలేజిలో చాలా మంచి మార్పులు వచ్చాయి. విద్యార్థుల జీవితాల్లో, వ్యక్తిత్వాలలో మార్పులు ఎలాగయితే తెచ్చారో, సబ్జక్టు బోధించడంలో కూడా కళాత్మకతకి పెద్దపీట వేసేవారు.

ఇక ఆ రోజు ఆలశ్యంగా వచ్చారని చెప్పాను కద. మేమంతా వారి రాకకై ఎదురు చూస్తూ కూర్చున్నాము.

ఇంతలో ఓ గమ్మత్తు జరిగింది.

అకస్మాత్తుగా ఓ ఆగంతకుడు ఉరుములేని పిడుగులా మా తరగతి గదిలోకి దూసుకు వచ్చాడు. కొన్ని కొన్ని ప్రదేశాలలో కొందరి పొలకువ నవ్వులపాలు కావటం మీకు తెలియనిదేమి కాదు. ఈ వచ్చిన వ్యక్తి వేసుకున్న దుస్తులను బట్టి, అతని పోకడల్ని బట్టి చూస్తే అతను ఏ రైతు బజార్లోనో, మండీల బజార్లోనో మూటలు మోస్తు కనిపిస్తే ఎవరికీ వింతగా అనిపించేది కాదేమో ఎవరికీ.

ఇంజినీరింగ్ కాలేజి క్లాస్ రూంలో, అందునా అందరి అభిమాన పాత్రుడు కేశవుడు సార్ నిలబడాల్సిన వేదిక మీద అతను ప్రత్యక్షమవటం అందరికీ నవ్వు పుట్టిచ్చింది.

కట్ బనీన్ ఒకటి నామమాత్రంగా ఉంది అతని శరీరం పై, దాన్నిండా చిరుగులే. దుమ్ము కొట్టుకుపోయిన ఆ బనీనుకు తోడుగా, మోకాళ్ళ దాకా పైకి మడిచి కట్టుకున్న ఓ పాత లుంగీ. బాగా మాసిపొయిన గుబురైన గడ్డం, తైల సంస్కారం లేని జుత్తు, కాస్తా వంగి పోయిన నడుం, దుమ్ముకొట్టుకుపోయిన పాదాలు, వాటికి పాదరక్షలు కూడా లేవు. ఇవి స్థూలంగా అతని రూపు రేఖా విలాసాలు.

గుర్తింపు కార్డ్ లేనిదే మా క్యాంపస్ లోనికి ఎవ్వరికి అనుమతి ఉండదు. అలాంటిది ఇతను ఎలా రాగలిగాడు? ఇతను ఖచ్చితంగా మా కాలేజి ఉద్యోగి కాదు.

కొంపదీసి పిచ్చివాడు కాడు కద. ఏ రాయో తీసుకొని మా అందరిపైకి దాడికి దిగడు కద. కానీ అతనిలో అలాంటి పిచ్చి పోకడ ఏమి కనిపించలేదు. థాంక్ గాడ్.

ఒకసారి అందర్నీ భావ రహితంగా పరికించి చూసి, హఠాత్తుగా ఒక్క గెంతులో కిటికీ వద్దకు చేరుకున్నాడు. కిటికీకి ఉన్న వర్టికల్ బ్లైండ్స్‌ని చీల్చినంత పనిచేసి, తొలగించి కిటికి అద్దంలోంచి దూరంగా కనపడే సముద్రాన్ని చూస్తుండిపోయాడు.

పిచ్చివాడిగా మారిపోయిన భావకవి ఏమో? మేమంతా అవాక్కయి అతన్నే చూస్తుండిపోయాము. ఎవ్వరూ ఊహించని విధంగా అప్పుడు జరిగింది ఆ సంఘటన.

వంగిపోయి ఉన్న నడుముని క్షణంలో వెయ్యవవంతులో నిటారుగా చేసుకుని, నవ యవ్వనంలో ఉన్న చిరుతలా ఛక్ ఛక్ మని రెండే రెండు అంగల్లో వేదిక మీదకి చేరిపోయాడు అతను.

అంతటితో ఆగిపోలేదు, గొంతు సవరించుకున్నాడు, ‘అయ్య బాబోయ్, ఏ టార్జాన్ లాగానో, ది ఏప్ మేన్ లాగానో గుండెల్నిబాదుకుంటూ ‘ఓఓఓహో’ అని పెడబొబ్బలు పెడతాడా ఏమిటి? బ్రతికుంటే బలుసాకు తినవచ్చు, నేనైతే పారిపోతాను బాబూ’ అనుకుని నా పోలియో కర్రని దగ్గరకి తీస్కుని లేవటానికి సిద్ధ పడిపోయాను.

నన్నాశ్చర్యంతో ముంచెత్తుతూ అతడు స్వచ్ఛమైన ఆంగ్లంలో ఉపన్యాసం ప్రారంభించేశాడు. స్పష్టమైన ఉచ్చారణతో, శ్రావ్యమైన కంఠంతో “గుడ్ మార్నింగ్ మైడియర్ ఫ్రెండ్స్” అన్నాడు తన ఉపన్యాసానికి నాందీ వాక్యంగా.

నిజంగానే అన్నాడా లేదా నాకలా అనిపించిందా? నా మిత్రులందరూ అదే విధమైన అయోమయానికి గురయి ఉన్నారు అని అర్థమయింది వారి ముఖ భంగిమలని బట్టి.

నా సందేహ నివృత్తి చేస్తూ ఆయన స్వచ్ఛమైన ఆంగ్లంలో తన ఉపన్యాసాన్ని కొనసాగించారు. అది ఉపన్యాసమా కాదు, అది ఒక ఝరి, ఒక వాక్ప్రవాహం, ఒక ఇంద్రజాలం. యువతకి మత్తు వదిల్చి, దిశా నిర్దేశనం చేయగల మంత్రోపదేశం. ఆ ఉపన్యాసం గూర్చి మాటల్లో వర్ణించలేను, ఆ ఉపన్యాసంలోని ఒక్కొక్క పదం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

“గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను సాఫ్ట్‌వేర్ కంపెనీలో హెచ్.ఆర్. మేనేజర్‌గా పని చేస్తున్నాను” అయన తన ప్రసంగాన్ని కొనసాగించారు.

ఆయన పని చేస్తున్న సాఫ్ట్‌వేర్ కంపెనీ పేరు వినంగానే నాకు పొలమారిపోయింది, గొంతులో తడారి పోయింది. ఆ కంపెనీ సాఫ్ట్‌వేర్ కంపెనీలల్లో రారాజు లాంటిది. ఆ కంపెనీకి మా నగరంలోనే మూడు సువిశాల క్యాంపస్‍లు ఉన్నాయి. ఆ కంపెనీని భారతదేశంలో తమ ఆఫీసులు నెలకొల్పవలసిందిగా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు భగీరథ ప్రయత్నాలే చేశారు. హెచ్.ఆర్. మేనేజర్‌గా ఆయన రావటానికి ఐఐటీలే ఎర్ర తివాచీలు పరచి ప్రాంగణ నియామకాలప్పుడు ఆయనకు అడుగులకు మడుగులు ఒత్తుతాయి. మా కాలేజీ లాంటి సామాన్యమయిన కాలేజీకి ఆయన రావటం అంటే అది మరుసటి రోజు పతాక శీర్షికలలో రాదగ్గ వార్త.

అదీ ఆయన స్థాయి.

అలాంటి వ్యక్తి ఒక దరిద్రుడి వేషంలో మా ముందు ఎందుకు నిలుచున్నాడో మాకెవ్వరికీ ఒక పట్టాన అర్థం కాలేదు.

ఆయన చెప్పుకుపోతున్నాడు

“నేను అత్యంత అభిమానించే, గౌరవించే వ్యక్తి మీ కాలేజిలో ఉన్నాడు అంటే మీరు ఆశ్చర్య పోతారేమో. ఆయనెవరో కాదు మీ కేశవుడు మాష్టారే. నేను ఆయన కోసం ఏమయినా చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను.

నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే, అందుకు కారణం కేశవుడు మాష్టారే. నేను ఒకప్పుడు ఒక సాధారణ విద్యార్థిని, నా పై నాకు ఏ మాత్రం ఆత్మవిశ్వాసం లేకుండా ఉండేవాడిని, ఆయన మార్గదర్శనం వల్ల ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను.

ఇక విషయంలోకి వస్తే, మా కంపెనీలో ఈ వేళ ఆటవిడుపు. అందులో భాగంగా విచిత్ర వేషధారణ పోటీలో పాల్గొంటున్నాను నేను. నా కార్లో కంపెనీకి వెళుతుండగా దారిలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర యాదృచ్ఛికంగా కేశవుడు సార్ కంటపడ్డాను ఈ వేళ ఉదయం.

ఆయనకేమి తోచిందో ఒక చిన్న కోరిక కోరారు. ఆయన అడిగితే నేను ఏది కాదనలేను కద.

ఇంతకూ ఆయన కోరిందేమిటంటే, ఇదే వేషంలో మీ అందరి ముందు కాసేపు నిలబడి, ఆ తర్వాత ఏదైనా ఉపన్యసించి వెళ్ళమని కోరారు. అంతే.”

ఆ తరువాత ఆయన ఒక గంట పాటు ఇంటర్వ్యూ స్కిల్స్ గూర్చి, వ్యక్తిత్వ వికాసం గూర్చి, సాఫ్ట్‌వేర్ పరిశ్రమలో భవిష్యత్ అవకాశాల గూర్చి అనర్గళంగా ఉపన్యసించారు.

అతనెన్నుకున్న టాపిక్స్‌లో చతురోక్తులకు, హాస్యానికి అవకాశం తక్కువ. మామూలుగా విద్యార్థుల పరిభాషలో చెప్పాలంటే డ్రై టాపిక్స్ అవి. కానీ ఆయన ప్రసంగం మొదటి నుంచి చివరి వరకు మమ్మల్ని మంత్రముగ్ధులని చేసింది. ఆ గంటా ఒక నిమిషంలా గడిచిపోయింది. నా సహ విద్యార్థులందరి పరిస్థితి కూడా అలాగే ఉంది, మేము ఆ ప్రసంగంలో ఎంతగా లీనమయ్యామంటే – కేశవుడు సార్ ఎప్పుడొచ్చి ముందు వరుసలో కూర్చున్నారో కూడా మేము గమనించలేదు.

స్టాండింగ్ అవేషన్ అన్న ఆంగ్ల పదానికి సజీవ సాక్షాత్కారాన్ని ఆ రోజు నేను నా కండ్లముందరే చూడగలిగాను. ఆయన ప్రసంగం ముగించగానే మేమందరం మాకే తెలియకుండా ఒక్కసారిగా నిలబడిపోయి ఒకే శృతిలో ఆగకుండా చప్పట్లు చరుస్తూనే ఉండిపోయాము. మా అందరి మధ్య నుండి హుందాగా నడుచుకుంటూ బయటకు వెళ్ళి, తనకై ఎదురు చూస్తున్న కార్ డ్రయివర్, బీఎండబ్యూ కార్ డోర్ తీసి వినయంగా నుంచుని ఉండగా ఆయన కార్ ఎక్కి కూర్చునే వరకు మేము స్పృహలోకి రాలేదు. ఉన్మాదులలాగా చప్పట్లు చరుస్తూనే ఉండిపోయాము. మేము తేరుకునే లోగానే కారు ముందుకు సాగిపోయింది.

ఈలోగా కేశవుడు సార్ ఎప్పుడు వేదికనెక్కారో తెలియదు, చిరునవ్వులు చిందిస్తూ “వారితో మన కాలేజి ఆడిటోరియంలో ఒక పూర్థి స్థాయి సమావేశం ఏర్పాటు చేయిద్దామా?” అని అడిగారు .

మేమందరం ముక్త కంఠంతో “ఎస్. ఎస్. చేయండి” అని మా సమ్మతిని తెలిపాము.

“ఈవేళ్టి సంఘటన గూర్చి మీ విశ్లేషణ ఏమిటీ?” ప్రశాంతంగా అడిగారు కేశవుడు సర్.

మా అందరి విశ్లేషణలూ ఏకాగ్రతతో విన్నారు. సాలోచనగా తల పంకించారు.

తన ఉపన్యాసానికి నాంది వాచకంగా “ఫస్ట్ ఇంప్రెషన్ ఈఈఈఈస్…” అంటూ ఆగిపోయారు, ఆ మిగతా వాక్యం మేము పూర్తి చేయాలి అన్న సూచనగా తన కుడి చేతిని కదిపారు గాల్లో.

“ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్.. ది బెస్ట్ ఇంప్రెషన్” అని మేమంతా ముక్త కంఠంతో మిగతా వాక్యాన్ని పూరించాము.

మమ్మల్ని అభినందించకపోగా “మీ అందరి సమాధానం తప్పు” అని స్థిరంగా చెపుతూ చిరునవ్వుతో మా వంక చూస్తు ఉండిపోయారు.

మేమంతా అయోమయంలో పడిపోయాము.

“మై డియర్ ఫ్రెండ్స్” అంటూ ఆయన గొంతు సవరించుకుని చెప్పటం ప్రారంభించారు.

అలా సంబోధించి దయవర్షించే కళ్ళతో మా వంక చూస్తు గొంతు సవరించుకున్నారు అంటే మాకావేళ జ్ఞానభిక్ష మృష్టాన్న భోజనంలా దొరకబోతోంది అన్నమాట.

నాకు ఆ క్షణంలో తెలియదు ఆయన ఇవ్వబోతున్న ఆ ఉపన్యాసం నా జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పబోతోంది అని. అప్పటి దాకా నాలో ఆవరించి ఉన్న ఆత్మన్యూనతా భావాలు, సెల్ఫ్ పిటీ శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోయి ఆ స్థానంలో కొత్తగా ఆత్మ విశ్వాసం పూర్తిగా ఆవరించబోతోంది అని నాకు తెలియదు.

ఆ క్షణాలు నాకు ఇప్పటికీ గుర్తే. ఆ రోజు ఆయన నా జీవితం మీద చూపిన ప్రభావం సామాన్యమయినది కాదు.

ఆయన చెప్పటం మొదలెట్టారు

“మన ఫస్ట్ ఇంప్రెషన్స్ భావోద్వేగాల మీద ఆధారపడి ఏర్పడతాయి. ఎదుటి మనిషి వేసుకున్న దుస్తులను బట్టి, పై పై మెరుగులను బట్టి, వారి హావభావలని బట్టి మనం మనకు తెలియకుండానే ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏర్పరచుకుంటాము. ఇక్కడొక గమ్మత్తైన విషయం చెప్పాలి. ఇలా పై పై రూపాన్ని బట్టి ఏర్పడిన ఫస్ట్ ఇంప్రెషన్స్ చాలా తాత్కాలికం. ఇందాక మీరే చూశారుగా.

ఇందాక ఆయనని చూడగానే ఎవరో మూటలు మోసే కూలీ అనుకున్నారు మీరు మొదట. కానీ అది నిజం కాదు అని మీకు కాసేపట్లోనే తెలిసింది.

మొదట మీకు ఏర్పడిన భావాలన్నీ ఆయన దుస్తులవల్ల, హావభావాల వల్ల మీరు ఏర్పరుచుకున్న తాత్కాలిక భావాలు. ఇవన్నీ కూడా భావోద్వేగాల కారణంగా ఏర్పడిన ట్రాన్సియెంట్ భావాలు, ఒక అధ్యయనం ప్రకారం రూపం బట్టి, దుస్తులని బట్టి, శరీర ఆకృతిని బట్టి, శరీరము యొక్క రంగుని బట్టి మనం ఏర్పర్చుకునే భావాలన్నీ ఇలాంటివే, ఇవన్నీ తాత్కాలికమే.

ఆ తరువాత ఆయన ప్రసంగం ప్రారంభించగానే ఆయన ఉపయోగించిన భాష, భావ ప్రసరణా సామర్థ్యం (కమ్యునికేషన్ స్కిల్స్), ఆయన అందిస్తున్న జ్ఞానం, వారు ఉపయోగించిన పదజాలం, వారి మాటల్లోని లోతు వీటన్నింటి వల్ల మీ అభిప్రాయాలు పూర్తిగా మారిపోయాయి.

ఇలా ఒక వ్యక్తి యొక్క మాటలు, జ్ఞానం చూసిన తరువాత ఏర్పడే ఇంప్రెషనే శాశ్వతమైన ఇంప్రెషన్. ఇదే సిసలైన ఫస్ట్ ఇంప్రెషన్.

ఇకపై వారిని గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా మీకు ఆయన తాలుకూ ఈ విధమైన సకారాత్మక భావాలే కలుగుతాయి. ఈ రకంగా నిలబడిపోయేదే బెస్ట్ ఇంప్రెషన్. ఇదే సిసలైన ఫస్ట్ ఇంప్రెషన్.

ఆయన గూర్చి తలచుకున్నప్పుడల్లా మీకు ఆయన చినిగిపోయిన బనీను, మాసిపోయిన పంచ, పాదరక్షలు లేని పాదాలు గుర్తు రావు. ఆయన పంచిన జ్ఞానం, ఆయన చూపిన మార్గదర్శనం, ఆయన భాష, ఆయన వాడిన పదజాలం ఇవే గుర్తు ఉంటాయి శాశ్వతంగా.

ఇంకో ఉదాహరణ చెబుతాను.

చాలా అందంగా ఉండే వ్యక్తి, మంచి సూటు బూటుతో మీ క్లాసులోకి వచ్చాడు అనుకుందాం. అతన్ని చూడగానే ఒక మంచి భావం కలుగుతుంది సహజంగానే.

చూట్టానికి చాలా అందంగా హుందాగా ఉన్నా సరే, మాటలు సరిగ్గ మాట్లాడలేక తడబడిపోతూ ఉంటాడు. అతనికి ఏ విధమైన నైపుణ్యాలు ఉండవు. అతనికి అస్సలు మాట పెగలడం లేదు, అతడి భావాలు కూడా చాలా నేలబారుగా ఉన్నాయి.

అప్పుడు మీకు మొదట ఏర్పడిన ఇంప్రెషన్ ఏమయిపోయింది? వీగిపోయింది కద.

ఇక ఇప్పుడు మీరే ఒక కంపెనీకి అధినేత అనుకుందాం. మీ కంపెనీలో ఏర్పడే ఖాళీలను భర్తీ చేయటానికి అభ్యర్థులలో అందానికి ప్రాముఖ్యతనిస్తారా? లేక నైపుణ్యాలకా?

మీరు నైపుణ్యాలకే పెద్దపీట వేస్తారు.

అంటే ఏమిటి అర్థం? మన ఫస్ట్ ఇంప్రెషన్ – బెస్ట్ ఇంప్రెషన్ కాదు అనే కద.

ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటె మనలో చాలా మంది ఎంతో తెలివితేటలు ఉన్నప్పటికి, ఎంతో నైపుణ్యం ఉన్నప్పటికీ , తమ రూపం బాగాలేదనో, తమ చర్మరంగు తెల్లగా లేదనో, ఏదో చిన్న అవకరం ఉందనో ఆత్మన్యూనతకి గురయ్యి బాధ పడుతు ఉంటారు.

‘కౌంట్ ది బ్లెస్సింగ్స్’. మీకున్న మంచి లక్షణాలని, మీ సామర్థ్యాలని గుర్తించండి. మీ పరిధిలో లేని చిన్న చిన్న అవకరాల గూర్చి పట్టించుకోకండి.

ఒక శాస్త్రీయ అధ్యయనం ప్రకారం, బాహ్య అలంకరణల వల్ల ఏర్పడే ఫస్ట్ ఇంప్రెషన్స్ అనేవి పదే పది సెకన్లు నిలబడతాయట మన మనస్సుల్లో. ఎప్పుడయితే ఎదుటి వ్యక్తి మాట్లాడటం ప్రారంభిస్తాడో, అప్పుడు మనం ఏర్పరచుకునేది నిజమైన ఫస్ట్ ఇంప్రెషన్ అట.

పైకి కనిపించే మీ రూపం మీకు కెరియర్ పరంగా ఎటువంటి ఊతం ఇవ్వదు. మనం చూపాల్సిన ఏకాగ్రత అంతా మన నైపుణ్యాల అభివృద్ది మీదనే.

స్టీఫెన్ హాకింగ్ విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త. కానీ ఆయన వీల్ చెయిర్ కే అంకితం అయి ఉంటాడు. ఆయన శక్తి ఆయన ఆత్మ విశ్వాసమే.

ఏదో దిక్కుమాలిన సబ్బో, డియోడరెంటో వాడితే వచ్చేది కాదు ఆత్మ విశ్వాసం అంటే. మన తెలివితేటల్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటూ, మనపై మనం నమ్మకంతో ఏర్పరచుకున్న లక్ష్యాలని అధిగమించగలగడం వల్ల వస్తుంది ఆత్మ విశ్వాసం.

నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్, మహాత్మా గాంధీ, స్టెఫెన్ హాకింగ్, శ్రీ ఏపీజే కలాం, ఇళయరాజా వీళ్ళెవరూ రూపం పరంగా చూస్తే నవమన్మథులు అని చెప్పలేము. వారి అందమంతా వారి వ్యక్తిత్వంలో ఉంది. వారెన్నుకున్న రంగంలో వారి నైపుణ్యాలవల్ల వారికి ఆ అందం వచ్చింది.”

ఇంతలో ఒక కుర్రాడు లేచి “సర్ సినిమా రంగం అంటేనే గ్లామర్ ప్రపంచం కద, మరి మీ సిద్ధాంతం అక్కడ పని చేయదేమో” అని ఒక ప్రశ్న లేవనెత్తాడు.

ఈ దెబ్బకు కేశవుడు సర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు అనుకున్నాం అందరం. అలాగయితే ఆయన కేశవుడు సర్ ఎందుకు అవుతారు?

ఆ కుర్రాడి వంక ఆదరణగా చూసి, చిన్నగా నవ్వి, కూర్చోమని సైగ చేసి, కొనసాగించారు ఆయన.

“వాస్తవమే. అందానికి వ్యతిరేకంగా నేనేదో ఉద్యమం నడపడం లేదు. ఆత్మన్యూనతతో బాధపడేవారు తమ అందం గురించి ఎక్కువగా ఆలోచించి కించపడవలసిన అవసరం లేదనే దానికి ఇదంతా చెప్పుకొస్తున్నాను.

కాకపోతే బాహ్య సౌందర్యం కాదు, అంతః సౌందర్యమే నిజమైన సౌందర్యం అని అర్థం చేసుకుని మీ మీ ప్రావిణ్యాలకు పదును పెట్టుకోండి అని చెబుతున్నాను.

మీ ముందు ఎంతో విశాలమైన ప్రపంచం ఉంది. మీరు ఎదగడానికి ఆకాశమే హద్దు. ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు, కాకపోతే మిమ్మల్ని ఆపే ఒకే ఒక అడ్డంకి మీ ఆత్మన్యూనత. ఒక్కసారి మిమ్మల్ని మీరు విశ్వసించటం ప్రారంభిస్తే ఇక మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు.

ఇక నీ ప్రశ్నకి వస్తే, అందమైన బాలీవుడ్ హీరోలు తమ విచక్షణారహితమైన ప్రవర్తన కారణంగా నాన్ బెయిలబల్ చట్టాల కింద కటకటాల వెనక్కి వెళ్ళిన వైనం మీకు తెలుసు. వారి అందం, ఆకర్షణ వారిని కాపాడలేకపోయాయి కద.

అలాగే ఆసియా ఖండంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు మన రజనీకాంత్ గారి మానసిక సౌందర్యం ముందు వారి శారీరక సౌందర్యం ఎవరూ పెద్దగా పట్టించుకోరు కద. భాషా భేదం లేకుండా ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు కద, వారు అయన శరీరపు రంగుని, ఆయన బట్టతలని పట్టించుకోరు. ఆయన అందం ఆయన వ్యక్తిత్వంలో ఉంది. ఆయన భావ వ్యక్తీకరణ ద్వారా మనకు ఆయన హృదయసౌందర్యం అందుతోంది.

సో మైడియర్ ఫ్రెండ్స్,

ఈ ప్రపంచానికి ఏమి కావాలో మీకు తెలిసిపోయింది, నైపుణ్యాలు, భావవ్యక్తీకరణ. ఈ రెండు అంశాలు మీరు సానపెట్టుకుంటే చాలు, మీ అవకరాలు, మీ చర్మపు రంగు లాంటి మీ చేతిలో లేని అంశాల గూర్చి మీరు దిగులు పడాల్సిన పని లేదు. మనం ఎలా ఉన్నాం అన్న చింత మానేసి, మనల్ని మనం చక్కగా ప్రెజెంట్ చేసుకుంటే చాలు.”

మాకు తెలియకుండానే మేము కరతాళధ్వనులతో క్లాసును మోత మ్రోగించాము.

నా వ్యక్తిత్వాన్ని సమూలంగా మార్చి వేసిన క్లాసు అది.

ఒక మంచి గురువు, ఒక మంచి మిత్రుడు, ఒక మంచి భార్య దొరకటం పూర్తిగా ప్రాప్తత మీద ఆధారపడి ఉంటుందంటారు.

కేశవుడు సార్ నా జీవితంలోకి రాకుంటే నేను అనేక లక్షల మంది విద్యార్థుల లాగా, ఓ సగటు యువకుడిలా అనామకంగా మిగిలిపోయేవాడిని బహుశా.

అందరికీ ఒక మంచి గురువు దొరకాలని నేను నిత్యం ప్రార్థిస్తుంటాను ఎందుకంటే, వేమన చెప్పినట్టు ప్రాప్తత ఎంతో ముఖ్యం.

‘చిప్ప(లోన) పడ్డ చినుకు స్వాతిముత్యంబాయె
నీటబడ్డ చినుకు నీటగలసె
ప్రాప్తికలుగు చోట ఫలమేల తప్పురా
విశ్వధాభిరామ వినురవేమ’

***

వైట్ హౌస్‌లో అమెరికన్ ప్రెసిడెంట్ కరచాలనం ఇస్తూ ‘కంగ్రాచ్యులేషన్స్’ అని నన్ను ఆలింగనం చేసుకున్నారు.

చెమర్చిన కళ్ళతో , పెదాలు తడబడుతుండగా ‘థాంక్స్’ అన్నాను.

నా థాంక్స్ నిస్సందేహంగా కేశవుడు సార్‍కే.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here