స్వయం భక్షణ

15
11

[శ్రీ జి.వి. కళ్యాణ శ్రీనివాస్ రచించిన ‘స్వయం భక్షణ’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

 

[dropcap]“హ్యా[/dropcap]పీ ఫాదర్స్ డే!!”

వెనుకనుండి మెడ చుట్టు చెయ్యి వేసి డాడీను పొదివి పట్టుకుని ప్రేమగా అన్నది అధిత.

చేతులు విదిలిస్తూ “అబ్బా అలా మెడ చుట్టూ చెయ్యి వేసి నన్ను హత్తుకోవద్దు అని ఎన్ని సార్లు చెప్పాలి?” చిరాకుగా అన్నాడు ఆత్రేయ.

ఒక్కసారి అధిత ముఖం చిన్నబోయింది. కళ్ళు నీళ్లతో నిండి పోయాయి.

“ఈ రోజు ‘హ్యాపీ ఫాదర్స్ డే’ అందుకు..” ఇంకా ఏదో చెప్పబోయింది అధిత.

విసుక్కున్నాడు ఆత్రేయ. “ఐతే ఏమిటట? పదిహేను ఏళ్ళు వచ్చాయి, ఇలా నన్ను ముట్టుకోవద్దు అని ఎన్ని సార్లు చెప్పాను?! పెద్దదానివి అయ్యావు. వయసుకు తగ్గట్టు ఉండు.” విసురుగా అన్నాడు ఆత్రేయ.

ఆత్రేయ అరుపులకు అధిత భోరున ఏడ్చింది. ఆత్రేయకు ఏమి చెయ్యాలో పాలుపోలేదు. తమాయించుకుని, కూతురు తలమీద చెయ్యి వేసి “చూడు బంగారు తల్లి నాకు ఇవ్వన్నీ నచ్చవు. ఏమి అనుకోకు” అన్నాడు. అంటున్నాడు కానీ తన ప్రవర్తనకు తనకే సిగ్గుగా ఉంది. కడుపున పుట్టిన కూతురు ఆప్యాయంగా హత్తుకుంటే ఈసడించుకోవటం, తన మీది తనకే చిరాకు వేసింది. ఇది మొదటి సారి కాదు, ఎప్పుడు ఇంతే,

“డాడీ.. నాకు జడ వెయ్యవు?” అంటే, “నేను ఏమన్నా పనికి పాటా లేకుండా ఉన్నానా? లేక ఆడపిల్లలకు జడ వేస్తూ కూర్చోమంటావా? ఏమిటి? వెళ్ళు, వెళ్లి మీ అమ్మతో వేయించుకో” అనేవాడు.

“డాడీ, నాకు అన్నం స్పూన్‌తో తినిపించవా, మా ఫ్రెండ్స్ వాళ్ళ నాన్న అలానే కూర్చోపెట్టుకుని తినిపిస్తాడుట” అని అడిగితే, “వెళ్ళు.. వెళ్ళు.. వాళ్ళ నాన్న దగ్గిరకి వెళ్ళు, అక్కడే తిను, నాకు ఇలాంటివి పట్టవు” అనేవాడు చాలా వెటకారంగా. అధిత ముఖం చిన్నది చేసుకుని వెళ్లి పోయేది. ఇప్పుడు అంత ఉధృతి తన ప్రవర్తనలో లేదు కానీ రెండు ఏళ్ల క్రితం ఐతే అలానే ప్రవర్తించేవాడు. తనకు తెలుసు తానూ తప్పు చేస్తున్నాడని. తనకు తెలియటం లేదు అలా ఎందుకు? అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నాడో. ఆడపిల్ల అని కాదు కాని, మరేదో ఉంది.

అతని మనసులో గూడు కట్టుకున్న గుబులు, బాధ అది ఒక్క భార్య కౌముదికి మాత్రమే తెలుసు.

“డాడీ ఎందుకు ఎప్పుడూ ఫాదర్స్ డే అనగానే మండిపడతారు? తాతకు కూడా గ్రీటింగ్స్ చెప్పరు. మనని అయన దగ్గిరకు తీసుకుపోరు? తాత ఫోన్ చేసినా నన్ను మాట్లాడనివ్వరు. అయన కూడా తాతతో గదిలోకి వెళ్లి మాట్లాడతారు. మన ముందు మాత్రం మాట్లాడరు. ఎప్పుడన్నా తాత గురించి అడిగితే మాట దాట వేస్తారు. మా ఫ్రెండ్స్ వాళ్ళ తాతలు స్కూల్ దాక వచ్చి దింపుతారు. ఇప్పటికీ. మన తాత ఎందుకు మన ఇంటికి రారు? ఐదు ఏళ్ల క్రితం మనం అక్కడకే వచ్చాం, అక్కడే వుండే వాళ్ళం. మన ఇప్పుడు ఇలా బయటకు ఎందుకు వచ్చేసాం? అసలు డాడీ ఇలా ప్రవర్తించేవాళ్ళు కాదు. ఇండియా వచ్చిన కొంత కాలం తర్వాత నుండి డాడీ ఇలా ప్రవర్తిస్తున్నారు” కూతురు అడుగుతున్న ప్రశ్నలకు, మాట్లాడుతున్న మాటలకూ కౌముది సమాధానం చెప్పటం లేదు.

మౌనంగా.. ఉండిపోయింది కొద్దిసేపు.

“అన్నం తిని స్కూల్‌కు వెళ్ళు. తరువాత చెపుతాను” అన్నది. అవును. కూతురు పెద్దది అయ్యింది. అడుగుతున్నది. ఆత్రేయ మనసులోని దిగులు గురించి అధితకి ఎప్పుడో చెప్పేది. ఎందుకు చెప్పలేదో కూడా తెలియదు.

అధిత స్కూల్‌కు వెళ్ళాక, ఆత్రేయ భుజం మీద చేయి వేసి, గుండెలకు హత్తుకుంది.

ఆత్రేయ కళ్ళు చెమ్మగిల్లి, వెచ్చని కంటినీరు కౌముది చేతిమీద పడ్డాయి. వెచ్చగా ఆమె కన్నీళ్లు జారి ఆత్రేయ తల మీద వర్షించాయి. ఇద్దరు అలా మౌనంగా వుండిపోయారు కొద్దిసేపు.

మనసులు బరువెక్కి మూగబోయినపుడు మౌనం సంభాషణ అవుతుంది.

***

ఆఫీస్ లోకి అడుగు పెట్టగానే హెచ్.ఆర్. రామ్ మోహన్ ఎదురయ్యారు.

“హలో! ఆత్రేయగారు!! వచ్చారా..?!! రండి. నిన్న మీరు రాలేదు, సెలవ పెట్టారు,.. మన కొత్త యం.డి. గారు, ఈ రోజు ‘ఫాదర్స్ డే’ అని సరదాగా అందరు లంచ్ అవర్‌లో వాళ్ళ వాళ్ళ ఫాదర్‌ల గురించి పంచుకోవాలి అన్నారు. మనం తండ్రిని సరిగా ఆదరించటం లేదు. ఎప్పుడు తల్లి గురించిన విషయాలే మాట్లాడుతూ ఉంటాం, అందుకు అందరు ఒకటిన్నర నిమిషం మించకుండా అందరు వాళ్ళ వాళ్ళ జీవితంలో వాళ్ళ తండ్రి పాత్ర గురించి చెప్పాలి అన్నారు. మన ఉన్నతికి తండ్రి రోల్ చాల ముఖ్యం కదా?!” అంటూ చెప్పుకుంటూ పోతున్నాడు రామ్ మోహన్.

ఆత్రేయ ముఖం ఎర్రబడింది, ఆ మాటలు చిరాకుని తెప్పిచాయి. ఏదో అనబోయి, తమాయించుకుని అక్కడనుండి తన క్యూబికల్‌కు వెళ్లి పోయాడు. డైరెక్టర్ హోదాలో ఉన్న తాను గభాలున ఏదో మాట్లాడితే తరువాత తలనొప్పి. పైగా ఆత్రేయ ఆ కంపెనీలో ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‍కు డైరెక్టర్. లాప్‌టాప్ ఓపెన్ చేసి పనిలో పడిపోయాడు. కొత్త యం.డి. చాలా మంచివాడు. ఆత్రేయ అంటే చాలా గౌరవం. తాను ఎక్కువ సలహాలు ఆత్రేయ నుండే తీసుకుంటూ ఉంటాడు. ఆత్రేయ అద్భుతమైన పనిమంతుడు. వర్క్‌లో వున్నప్పుడు ఎవరితో అనవసర మాటలు ఉండవు. లేడీ స్టాఫ్ అంటే చాలా గౌరవంగా ఉంటాడు. అస్సలు అతనంటేనే చాలా చాలా గౌరవం అందరికి. ప్రత్యేకంగా లేడీ స్టాఫ్‌కు. కాన్ఫరెన్స్ రూమ్ లోకి పిలవటాలు, కళ్ళతో ఒళ్ళు అంతా పలకరించడం లాంటివి అస్సలు చెయ్యడు. ప్రాజెక్ట్ ఫైనాన్స్ డీటెయిల్స్ కానీ, మరి ఇతర డీటెయిల్స్ తాను స్టాఫ్ సీట్ దగ్గిరకు వచ్చి తెలుసుకుంటాడు. గుడ్ మార్నింగ్స్, హలో అని కూడా చెప్పడు. మర్యాదగా నవ్వుతు పలకరిస్తారు. ఎవరితో మాట్లాడినా రెండు అడుగులు దూరం నిలబడి మాట్లాడతాడు. తమాషాగా ఉంటుంది కొందరికి అతని ప్రవర్తన.

కొందరు ‘జెంటిల్మన్ సిండ్రోమ్’ అని కూడా అనుకుంటారు.

కొందరు ‘హాలో ఎఫెక్ట్’లో ఉంటారు.

‘జెంటిల్మన్ సిండ్రోమ్’కి ‘హాలో ఎఫెక్ట్’ కి తేడా, ‘జెంటిల్మన్ సిండ్రోమ్’ ఉన్నవ్యక్తి అతి వినయం గాను, అతి కలివిడిగాను ఉంటూ, అతి మంచివాడిగా కనిపించవచ్చు అలానే అనిపిస్తాడు కూడాను. కానీ అతని అంతర్గత స్వభావం అదే అయి ఉండాలి అని లేదు. కానీ ‘హాలో ఎఫెక్ట్’లో చుట్టూ ఉన్న జనాలు ఆ వ్యక్తిలో కొన్ని లక్షణాలను గమనించి మంచివాడిగా, గొప్పవాడిగా వాళ్లే నిర్ణయం తీసుకుని, అదే అనుకుంటూ వుంటారు. అదే విషయాన్నీ ప్రచారం కూడా చేస్తారు. ఉదాహరణకు సమాజంలో తెల్లగా వున్నవాళ్లు శుభ్రంగా వున్నారు అనుకోవటం, కళ్ళజోడు పెట్టుకుంటే తెలివి గలవాళ్ళు అనుకోవటం, నాలుగు గొప్ప మాటలు నచ్చే విధంగా మాట్లాడితే మేధావి లేదా లీడర్ అనుకోవటం, అలా అన్నమాట. ఆత్రేయ విషయంలో అలానే ఉండేది. ఆత్రేయ కూడా తెల్లగా బలంగా ఉండటం, తక్కువ మాట్లాడటం ఇవ్వన్నీ అతని మీద ఏ విధంగా చూసినా, అతనిని చూసినా వాళ్లకు ఎవ్వరికైనా, ఒక సదాభిప్రాయమే కలుగుతుంది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్‌లో అందరు ఆఫీస్ మధ్యలో చేరారు. వారాంతం కావటం, మరో గంటలో దుకాణాలు సర్ధేసే ప్లాన్‌లో ఉండటంతో అందరు ఉత్సాహంగా వున్నారు. ‘ఫాదర్స్ డే సెలబ్రేషన్’ లో భాగంగా ఒక్కొక్కళ్లు వాళ్ళ తండ్రి గురించి ఒకటిన్నర నిమిషం చెప్పటం మొదలెట్టారు. ఆత్రేయకు చాలా చిరాకుగా వుంది. చాలా ఇబ్బందిగా ఉంది.

ఆత్రేయ టర్న్ రాగానే, ముఖం మీద నవ్వు పులుముకుని, అందరి వంకా చూశాడు. అతని తరువాత చివరిగా యం.డి. టర్న్ ఉంది.

“నేను నా తండ్రి గురించి చెప్పే గొప్ప విషయాలు ఏవి లేవు. అందరికి జన్మ ఇచ్చినట్టే నాకు ఇచ్చారు. మిడిల్ క్లాస్ ఫామిలీలో వాళ్ళ పిల్లలకు స్కూల్ ఫీజులు ఎలా కడతారో నాకు అలానే కట్టారు. పెద్దగా చెప్పటానికి ఏమీ లేదు” అన్నాడు.

కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయారు స్టాఫ్ అంతా.

ఆత్రేయ మీద ఉన్న అభిప్రాయానికి అయన ఉన్న పరిస్థితికి, కనీసం ఐదు పది నిముషాలు మాట్లాడతాడు అనుకున్నారు అందరూ. యం.డి. కూడా అలానే అనుకున్నాడు.

తరువాత యం.డి. ఒక పదినిమిషాలు తన ఉన్నతికి తన తండ్రి ఎలా సహాయం చేసారో, అతి బీద స్థితి నుండి తాను ఎలా ఎదిగాడో, ఆ విషయంలో తన తండ్రి పాత్రను చెప్పుకుంటూ పోయాడు. ఆత్రేయకు ఇవేవి బుర్రలోకి వెళ్ళటం లేదు. టీ పార్టీ ఐపోయాక ఇంటికి బయలుదేరాడు ఆత్రేయ.

***

కౌముది కాఫీ అందిస్తూ అన్నది, “ప్రొద్దున మీరు ఆఫీస్‌కు వెళ్ళాక మావగారు ఫోన్ చేశారు. ఒంటరిగా ఉండలేకపోతున్నా, వెనక్కు రమ్మని అన్నారు. అయన ఇంకా ఏదో చెప్పేలోపు.. ఆయన వచ్చాక మాట్లాడదాము అని చెప్పి నేను ఫోన్ పెట్టేసాను.”

“ఉహు..” అన్నాడు ఆత్రేయ. అతని మనసు మనసులో లేదు.

తండ్రి కౌముదికి ఫోన్ చెయ్యటం అస్సలు ఇష్టం లేదు.

“కాసేపటికే మీ పిన్ని కూడా ఫోన్ చేసింది. మొన్న రాజారావు కూతురు పెళ్ళికి ఎందుకు రాలేదు? మీ మావగారు వస్తారు అనా? అని అడిగింది. పెళ్లిలో బంధువులు అందరు మీ గురించి ఒకటే మాట్లాడుకున్నారుట. ఐదేళ్ల నుండి ఒకే ఊళ్ళో ఉంటూ వేరే ఇంట్లో తండ్రికి దూరంగా ఉండటం, తల్లి పోయిన ఏడాది లోపే భార్య తోడు లేని ఆయనకు ఒక వంటవాడిని పెట్టి వెళ్లి పోవటం ఏమిటీ? అని. మన ఆత్రేయకు ఏమి అయింది? ఐదు ఏళ్ల నుండి తండ్రిని అలా దూరంగా ఉంచాలిసిన అవసరం వాడికి ఏముంది? వాడికి ఒక్కతే కూతరు, ఈ ముసలాయన ఏమన్నా భారమా? అని అందరు అనుకున్నారట. ఫోన్‌లో ఆవిడ నిష్ఠురంగా చెపుతుంటే భలే బాధ అనిపించింది.

పక్కింటి పెద్దావిడ, మన అధితను మీ తాత ఊళ్ళోనే ఉన్నా, ఎప్పుడూ ఇంటికి తీసుకు రారు ఏమిటీ? అని అడిగితే దానికి ఏమి చెప్పాలో తెలియక తికమక పడిపోతోంది.” కౌముది చెప్పింది.

ఆత్రేయకు మాత్రం ఇవన్నీ కొత్త ఏమీ కాదు, గత ఐదు ఏళ్ల నుండి ఇలాంటి కామెంట్స్ ఫేస్ చేస్తూనే ఉన్నాడు. ఆత్రేయ మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. కౌముది మనసంతా దిగులుగా వుంది.

చెప్పుకోలేని బాధ ఆ ఇద్దరిలో గూడుకట్టుకుని ఉంది. కొన్ని బాధలు చెప్పుకుంటే పోతాయి అంటారు. ఈ బాధ చెప్పుకుంటే కూడా పోదు అని ఆ ఇద్దరికి మాత్రమే తెలుసు.

***

“ఇంక చెప్పరా.. పెద్దనాన్న ఎలా వున్నారు? అన్నట్టు మీ ఇల్లు చిక్కడపల్లిలోగా ఉంది. అదేమీ చేశారు? అన్నట్టు పెద్దనాన్న కనపడటం లేదు. బయటకు వెళ్ళారా?” ప్రశ్న మీద ప్రశ్న అడుగుతున్నాడు పంకజ్ కాఫీ తాగుతూ.

ఆత్రేయ, పంకజ్ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. పంకజ్ ఆత్రేయ నాన్నను పెద్దనాన్న అని పిలుస్తాడు. నిజానికి పంకజ్‌ది బెంగుళూరు. తెలుగు ఫ్యామిలీ. అమెరికా చదువుకు ఆత్రేయ, పంకజ్ కలిసి వెళ్లారు. అక్కడే కలిసి చాల కాలం ఉద్యోగం చేసారు, పంకజ్ మరో ప్రాజెక్ట్ పనిమీద జర్మనీ వెళ్లిపోయాడు, ఆత్రేయ తల్లి మరణం వల్ల ఐదు ఏళ్ల క్రితం ఇండియా వచ్చేసాడు. అధిత అమెరికాలో వున్నప్పుడు పుట్టింది. పంకజ్ మాత్రం ఐదు ఏళ్ళనుండి ఇండియా రాలేదు. ఇక్కడి విశేషాలు ఏవి ఆత్రేయ పంకజ్‌తో పంచుకునే వాడు కాదు.

ఆత్రేయ ముఖాన్ని కొద్దిగా ఇబ్బందిగా పెట్టాడు. పంకజ్ మళ్ళీ అడిగాడు. “ఏమిటిరా మాట్లాడవు? పెద్దనాన్న ఎక్కడ?”

“నేను నాన్నతో ఉండటం లేదు” అన్నాడు ఆత్రేయ.

కౌముది, వాళ్ళ ఎదురుగా సోఫాలో కూర్చుని వుంది. ఆమె ఇక అక్కడ వుండలేనట్లు లేచి వెళ్ళబోయింది.

“అదేమిటి కౌముది? వీడు ఇలా మాట్లాడుతున్నాడు. నువ్వైనా చెప్పలేకపోయావా? అక్కడ ఉండగా మీరు మీ అత్తగారు పోగానే, మంచి పొజిషన్‌లో వున్నా కూడా, వాడు ఇండియా వెళ్లిపోదాము అంటే, అధిత కెరీర్ గురించి కూడా ఆలోచించకుండా, సరే అన్నావు. వాడి కన్నా నువ్వే మీ మామయ్య కోసం పరిగెత్తుకుంటూ వచ్చావు. పైగా ఆ వయసులో ఆయన్ను అలా ఒంటరిగా..??!!” అన్నాడు పంకజ్.

ఆత్రేయ కళ్ళలో నీళ్లు చూసి పంకజ్ మౌనం వహించాడు, ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు ఆత్రేయ వంక.

***

దాదాపు నాలుగేళ్ళ పదిన్నర నెలల క్రితం.. చలికాలం ప్రవేశిస్తున్నదేమో.. సంధ్య చీకటి చిక్కగా పరుచుకుంటున్నది.

“వాడు ఇంకా ఆఫీస్ నుండి రాలేదు ఏవిటి కౌముది?”

బెడ్ రూమ్ గుమ్మం దగ్గిర నుండి వినిపించిన మాటలకూ కౌముది గభాలున వెనక్కు తిరిగింది. “కొద్దిగా లేట్ అవుతుంది అనుకుంటా మావయ్య,” అన్నది కౌముది.

“అవునూ ఈ అధిత ఎక్కడికి వెళ్ళింది?” మళ్ళీ అడిగారు సుందరేశ్వరావు గారు.

“అదిగో ఆ ఎదురింట్లో పిల్లలు పరిచయం అయ్యరుగా! వాళ్ళు రమ్మంటే వెళ్ళింది. యు.ఎస్.ఎ. లో పుట్టింది, ఇక్కడకు వచ్చాక అంతా కొత్తగా సరదాగా వుంది, మూడు ఏళ్ల క్రితం ఇక్కడకు ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇదే రావటం.”

“అలాగా! ఐతే మనం ఇద్దరమే వున్నాం అన్నమాట..” అన్నారు సుందరేశ్వరావు గారు.

“అవును మామయ్య.. అయనకు ఆఫీస్‌లో కొద్దిగా పని వుంది. ఆన్‍సైట్ నుండి ట్రాన్స్‌ఫర్ కదా! ఇండియా బ్రాంచ్‍లో ఏడాది పనిచేస్తాను అని వచ్చారు” అన్నది.

“పోనిలే వాడిని ఆఫీస్ లోనే ఉండమను, మనం ఇక్కడ ఉందాం..” అన్నారు సుందరేశ్వరావు గారు.

అయన మాటలు అర్థం కాలేదు. ‘అసలు ఏమి మాట్లాడుతున్నారు ఈయన. అత్తగారు పోయిన తరువాత ఈయన కొద్దిగా అయోమయంగా వున్నారు’ అనుకున్నది కౌముది.

“కాఫీ ఏమన్నా కావాలా మావయ్య?” మళ్ళీ తానే అడిగింది.

“నీ చేత్తో ఏమిచ్చినా అమృతమే!” వంకరగా నవ్వుతు అన్నారు సుందరేశ్వరావు గారు.

“దానిది ఏముంది మామాయ్యా, మా అత్తగారి చేతి కాఫీ అంత అద్భుతం ఐతే కాదు అనుకోండి” అన్నది కౌముది నవ్వుతూ.

“పదండి వేడి వేడి కాఫీ ఇస్తాను. అయన వస్తే, బయటకు ఏదన్న హోటల్‌కు వెళదాము. గత నెల రోజులుగా మనం ఇంట్లోనే తింటున్నాం” అంటూ కిచెన్ వైపు వెళ్ళటానికి బెడ్ రూమ్ గుమ్మం వైపు వచ్చింది కౌముది. సుందరేశ్వరావు గారు కదలకుండా అక్కడే నిలబడి వున్నారు.

“పదండి మావయ్య” అన్నది కౌముది.

“పద.. నేను అడ్డమా నీకు?” అన్నారు సుందరేశ్వరావు గారు.

‘ఏమిటీ ఈ తిక్క?’ అనుకుంటూ కౌముది ఆయనకు తగలకుండా కిచెన్ వైపుకు వెళ్ళింది. ఎంత పక్కనుండి వెళ్లినా సుందరేశ్వరావు గారికి కౌముది భుజం కొద్దిగా తగిలింది. సుందరేశ్వరావు గారు ముసిముసిగా నవ్వటం, కౌముదిని అయోమయంలో పడేసింది.

రాత్రి ఈ అనుభవం ఆత్రేయ దగ్గిర బెడ్ రూమ్‌లో వున్నపుడు చెపుదాం అనుకుని ఎందుకులే అని అప్పటికి వదిలేసింది.

ఇది ఆక్కడితో ఆగలేదు, వంట చేస్తున్నపుడు, ఆత్రేయ ఇంట్లో లేనప్పుడు కౌముది వెనుక నుండి ఊపిరి తగిలే అంత దగ్గిరగా నిలబడటం, కావాలని చేయి తగిలించటం, ఇలా అయన చేష్టలు రోజు రోజుకి శృతి మించుతున్నాయి. గత నెల రోజుల నుండి ఇదే వరస. మొదట్లో సర్దుకుపోయినా పోను పోను ఆయన ప్రవర్తన అసహ్యంగా అనిపించింది కౌముదికి.

ఒక రోజు మధ్య రాత్రి ఆత్రేయకు మెలకువ వచ్చి, మంచి నీళ్ల కోసం కిచెన్ వైపు వెళుతున్నప్పడు చూశాడు – తండ్రి కూతురు రూమ్ దగ్గిర తచ్చాడటం. “ఏమిటి నాన్నా?!” అని అడిగితే.. “ఏమీ లేదు..” అని అక్కడ నుండి జారుకున్నారు సుందరేశ్వరావు గారు.

మర్నాడు రాత్రి భోజనం అయ్యాక ఈ విషయం కౌముదితో చెప్పాడు. కౌముది భయంతో వణికిపోయింది. ఒక్క ఉదుటున కూతురు గదిలోకి వెళ్ళింది. పదేళ్ల కూతురును నిద్ర లేపి తన గదిలో వేరే మంచం వేసి పడుకోబెట్టింది. అర్థం కాక ఆత్రేయ అడిగాడు, “ఏమిటి ఇదంతా?” అని. కౌముది భోరున ఏడ్చింది.

“ఏమయ్యింది” అని అడిగాడు. “నరకంలా ఉందండి” అన్నది కౌముది. అయోమయంగా చూసాడు ఆత్రేయ.

“ఏమయ్యింది?”

“గత కొంత కాలం నుండి, మావగారి ప్రవర్తన మరీ మితిమీరి పోతున్నది. మొన్న మీరు డెప్యూటేషన్ మీద బెంగుళూరు వెళ్లిన తరువాత – ఆయన ప్రవర్తన మరి దారుణంగా వున్నది నాతో. నేను సాయంత్రం వాషింగ్ మెషిన్ వేసి బట్టలు ఆరేస్తుంటే, వెనక నుంచి వచ్చి నాకు తగులుతూ, ‘నీకు సాయం చేస్తా, బట్టలు ఆరేస్తా కాని, నాకు ఏమి ఇస్తావు’ అన్నారు? అదేమిటి మామగారు అలా మాట్లాడతారు అంటే, తప్పు ఏముంది?, నీ అందం అంతా ఆలా వేస్ట్ చెయ్యకు అన్నారు. అడగకుండా బెడ్రూమ్ లోకి వచ్చేస్తున్నారు, మంచం మీద కూర్చుని ఈ మంచం మీద మీ అత్తగారు నేను పడి దొర్లితే నీ మొగుడు పుట్టాడు, మరి వాడు లేనప్పుడూ.. అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు” అంటూ భోరున ఏడ్చింది కౌముది.

అసలు నమ్మలేక ఆ పోతున్నాడు ఆత్రేయ. తండ్రిని అలా ఊహించటం కష్టంగా వుంది అతనికి.

“మీరు లేనప్పుడు ఒంటరిగా ఉండాలి అంటే నరకంలా వుంది” అంది. “అధిత స్కూల్‌కి, మీరు ఆఫీస్‌కి వెళ్లిపోగానే నేను నా బెడ్ రూమ్ తలుపులు బిడాయించుకుని ఉంటున్నా” అన్నది కౌముది వెక్కి వెక్కి ఏడుస్తూ. నిద్ర పోతున్న అధితకి తన ఏడుపు వినపడకుండా జాగ్రత్త పడింది కౌముది. “ఇంకా, నా ముందు అడల్ట్ కంటెంట్ మూవీస్ చూస్తూ, నేను అక్కడనుండి వెళ్లిపోతుంటే, ‘అబ్బో ఇవేవి తెలియకుండానే కన్నవా పిల్లని’ అంటారు. సిగ్గుతో ప్రాణం పోతోంది అయన మాటలకు. తట్టుకోలేక మీతో చెపుతాను అని అంటే చెప్పుకో, నమ్మేది ఎవరు? అంటున్నారు.”

రక్తం మరిగిపోతున్నది ఆత్రేయకు. ఇందాకే సుందరేశ్వరావు గారు, అధిత రూమ్ దగ్గిర తచ్చాడటం చూసాక ఇక తట్టుకోలేకపోయాడు.

బెడ్ రూమ్ తలుపు తీసుకుని తండ్రి రూమ్ దగ్గరకు వెళ్ళాడు ఆత్రేయ.

“మీరు కౌముదితో ప్రవర్తిస్తున్న తీరు నాకు తెలిసింది. దీనిపై మీ సంజాయిషి ఏమిటి? కూతురు లాంటి కోడలిపైనా ఏమిటి మీ ప్రవర్తన?” చాలా గట్టిగా నిలదీసాడు ఆత్రేయ.

“అబ్బే అలాంటిది ఏమి లేదే! నేను మామూలుగానే వున్నాను, నీ పెళ్ళాం మాటలు నమ్మి నన్ను అవమానపరుస్తున్నావా?” చాలా మామూలుగా, అస్సలు భయం లేకుండా మాట్లాడుతున్నారు సుందరేశ్వరావు గారు.

గత నెల తద్దినం తరువాత, అప్పట్లో ఇంటికొచ్చిన పిన్ని పిల్లలతో ప్రవర్తన కొద్దిగా ఇబ్బంది పెట్టినా, ఆ వయసులో అలాంటిది ఏమి ఉండదులే అని అనుకున్నాడు ఆత్రేయ. ఇప్పుడు తెలుస్తోంది తండ్రి మనస్తత్వం. అసలు ఇది కాదు తన తండ్రి మనస్తత్వం. మరి ఏమిటిది? ఎంతో సంస్కారవంతంగా పెరిగిన, పెంచిన తన తండ్రి ఈయనేనా?

ఆత్రేయ మళ్ళీ అన్నాడు – “మిమ్మల్ని ఎంతో ప్రేమించే కోడలు కౌముది, అసలు ఇక్కడకు రావాలి అనగానే బయలుదేరింది, మరో మాట కూడా మాట్లాడకుండా. తనకు తల్లి, తండ్రి లేని కారణంగా మీలోనే, తండ్రిని చూసుకుంటున్నాను అని ఎన్నో సార్లు నాతో అనేది కౌముది. అలాంటి కోడలితో, మీ బిహేవియర్ ఇదా?!” అన్నాడు ఆత్రేయ.

ఇద్దరి మధ్య ఆ రాత్రి వాదన చాలాసేపు జరిగింది. రెండు రోజుల్లో మరో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు ఆత్రేయ. తెలిసిన ఫ్రెండ్ విదేశం వెళుతూ ఆత్రేయకు అద్దెకు ఇచ్చాడు.

పోతే పో అన్నట్టు ప్రవర్తించారు సుందరేశ్వరావు గారు.

***

చెప్పటం అపి పంకజ్ వంక చూసాడు ఆత్రేయ. పంకజ్ ముఖం వివర్ణం అయ్యింది.

“నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. ఇప్పటి వరకు నీకు తప్ప ఎవ్వరికి ఈ విషయం చెప్పలేదు” అన్నాడు ఆత్రేయ.

“ఐతే ఆయన్ని అలానే వదిలేసావా? ఏమిటి పరిష్కారం?” అన్నాడు పంకజ్.

అతని బుర్ర ఇప్పటికే వేడెక్కింది. అసలు ఆత్రేయ తండ్రిని ఎవరు చూసినా, ఇదీ అని చెప్పినా ఎవ్వరు నమ్మరు.

“లేదు లేదు అలా వదిలేయలేదు. డాక్టర్ రాధాకృష్ణ క్లినికల్ సైకాలజిస్ట్, ఆయన కౌన్సిలింగ్, మెడికల్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. ప్రతి రెండు, నెలలకు ఒకసారి కలుస్తున్నాను. కొందరిలో గూడుకట్టుకున్న కొన్ని ఆలోచనలు, చిన్నప్పటి నుండి అయన చూసిన ఎన్నో సంఘటనలు, ఆయన మనసులో కొన్ని భావాలను, ఆలోచనలను నింపి ఉంటాయి. అవి అప్పట్లో ఆయన భార్యతో కూడా పంచుకొని వుండరు. అవన్నీ కలసి ఆమె మరణంతో ఒక రకమైన డిప్రెషన్‌గా మారాయి. ఇది ఒక రకమైన మానసిక వ్యాధి.  ఇక్కడ ఆయన తన భార్య దూరమయిన ఒంటరితనాన్ని మరచిపోయేందుకు, తానింకా బ్రతికివున్నానని, తనకు తానే నిరూపించేందుకు ఇలా ప్రవర్తిస్తున్నారన్నాడు. అంతే కాదు, సమాజంలో పురుషత్వం అంటే ఉన్న భావన ప్రకారం, ఒక వయసు వచ్చాక తానిక పురుషుడిని కానన్న తీవ్ర నిరాశ కలుగుతుంది. దాంతో తానింకా పనికివస్తాడని నిరూపించుకోవాలన్న తపన పెరుగుతుంది. అందుకే, ముసలివారు చిన్న పిల్లలను దగ్గర తీయటం, ముద్దు చేయటం కూడా పైకి అనుకున్నంత అమాయకత్వం కాదంటారు. అందుకే అమ్మ పోయినప్పటినుంచీ నాన్న ప్రవర్తనలో ఈ భావన అడ్డు అదుపులేకుండా కనబడుతోంది. దీనికి మందులతో పాటూ కౌన్సిలింగ్ అవసరం అన్నాడు. ఒక స్త్రీ తన పురుషుడికి  దూరమైనా, మరణించినా తట్టుకుని నిలబడగలదు కానీ, పురుషుడు  ఒంటరిగా మనగలగటం కష్టం అన్నాడు. ఈ ఒంటరితనం భావననుంచి కలిగిన వికృతి ఆయన ప్రవర్తన అన్నాడు. కొన్ని మందులిచ్చాడు.  కౌన్సిలింగ్‌కు తీసుకురమ్మన్నాడు. ఇదిగో ఇవన్నీ మందులే. రేపో మాపో తీసుకు వెళ్లి ఇవ్వలిసినవి ప్యాక్ చెయ్యాలిసినవి వున్నాయి. నేను వారంలో ఒక రోజు ఆయనతో గడుపుతున్నాను. ఎవ్వరికి తెలియదు. నేనే చెప్పలేదు. ఎందుకు అంటే ఇదీ అని కారణం ఏమీ లేదు. అలా అని వృద్ధాశ్రమంలో చేర్చనూ లేను. డాక్టర్ వద్దు అన్నారు అయన పరిస్థితి చూసి.

ఒకటి మాత్రం నిజం. ఈ ప్రపంచానికి తెలియదు అసలు నేను ఎందుకు తండ్రికి దూరంగా ఉన్నానో?!! నా కన్న కూతురు అడుగుతున్నా చెప్పుకోలేని పరిస్థితి నాది. తాత దగ్గిరకు వెళదాం అంటే, వద్దు అని సర్దిచెప్పటం చాలా కష్టం అయిపోయేది. ఇన్నేళ్లు మేమిద్దరం ఎవ్వరితో పంచుకోలేక మనసులోనే కుమిలిపోతున్న ఈ విషయం ఈ రోజు నీతో చెప్పాను. నా తండ్రి ప్రభావం కూడా నా మీద ఉంది. ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను ఈ విషయం తెలిశాక. నా కూతురు నాకు దగ్గిరగా వచ్చినా కూడా ఏదో భయం!! ఏమో నా కూతురిని దగ్గర తీయటంలో నా మనసులో కూడా ఏదో మూల ఏదయినా వికృత భావన జాగృతమవుతుందేమో నన్న భయం నా కూతురిని దగ్గరకు రానీయటంలేదు.  ఎందుకో నాకు నేను చిన్నప్పుడు చదివిన స్వయం భక్షణ చేసే గ్రీకుల ‘ఒరోబరోస్’ గుర్తుకువస్తోంది. తన తోకను తానే తినే డ్రాగన్, రాట్ స్నేక్‍లు గుర్తుకువస్తున్నాయి నాన్న కోడలిని, మనవరాలిని అలా చూస్తున్నారంటే. నేను ఇష్టపడ్డ నా తండ్రిని నేను అలా చూసేసరికి దాని ప్రభావం నా మీద అలా పడింది. నేను కూడా ఆ ‘ప్రెషర్’ నుండి బయట పడటానికి ప్రయత్నం చేస్తున్నా. నేనూ కౌన్సిలింగ్ తీసుకుంటున్నాను.

అందరికి నా ఈ ఏజ్ వచ్చే సరికి తండ్రితో స్నేహంగా ఉండటాన్ని ఇష్టపడతారు, నేను కూడా అయనకున్న ఈ ఒంటరితనాన్ని మాతో కలిసి ఉంటే పోగొట్టుకుంటారు కదా అని అనుకున్నాను. ఆయనతో పాటు ఏడాది లోగా వెనక్కి వెళ్లి పోదాము అని కూడా అనుకున్నా. అలాంటిది, అయన పరిస్థితికి ఆయన్ను ఒంటరిగా వదలలేక, ఇక్కడే ఉండిపోయాను” ఆ పైన మాట్లాడలేక పోయాడు ఆత్రేయ. అలా చాలా సేపు ఏడుస్తూనే వున్నాడు.

పంకజ్ గుండె బరువెక్కింది. మౌనం ఒక్కటే అక్కడ పరచుకుని ఉండిపోయింది.

కొడుకు యవ్వనం తీసుకుని దీర్ఘ కాలం సుఖభోగాలనుభవించి కోరిక తీరనిది, ఆరని అగ్నిలాంటిది అని గ్రహించాడు యయాతి. యవ్వనంలోనే  సుఖాలపై విరక్తి కలిగిన పురు కథ పంకజ్‌కు గుర్తుకు వచ్చింది.

“దేహం భక్షయన్నాత్మనా వినాశం
సాక్షాత్ కురుతే కర్మాణి జాగృయాత్
స్వయం భక్షణం త్యజేత్ పరాయుః
విషయోపాభోగాన్ సం త్యజేత్ సంతః”

ఇంద్రియ భోగాలను త్యజించండి అని అర్థం వచ్చే ఆ శ్లోకం ఎక్కడినుండో ఒక పిల్ల తెమ్మెరలా ప్రవహిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here