స్ఫూర్తిమంతం ‘స్వయంసిద్ధ’ కథలు

4
9

[dropcap]భం[/dropcap]డారు విజయ, పి. జ్యోతి గారి సంపాదకత్వంలో ఇటీవల విడుదలైన కథా సంకలనం ‘స్వయంసిద్ధ’. ఒంటరి మహిళల జీవన గాథలు ప్రధాన ఇతివృత్తం ఈ కథలకి. “ఈ సంకలనం ఓ ప్రత్యేక పరిస్థితిలో జీవిస్తున్న స్త్రీల మీద ఫోకస్ చేయడం వల్ల పాఠకుల దృష్టి ప్రత్యేక సమస్యపై కేంద్రీకృతమవుతుంది. ఆ కేంద్రీకృత దృష్టి ప్రతి సమస్యపైనా అవసరమే. ఆ అవసరాన్ని ఒంటరిగా జీవించే మహిళల పట్ల గుర్తించి ఈ కథా సంకలాన్ని తీసుకొచ్చిన సంపాదకులు భండారు విజయ, పి. జ్యోతి అభినందనీయులు” అన్నారు తమ ముందుమాటలో ప్రసిద్ధ రచయిత్రి ఓల్గా గారు.

ఒకే ఇతివృత్తం మీద కథల సంకలనం రూపొందినప్పుడు కథలన్నీ ఒకే రీతిలో ఉంటాయేమో, కథలలో వైవిధ్యం ఉండదేమో అన్న అనుమానం కొందరు పాఠకులకు కలగవచ్చు. అయితే ఇతివృత్తం ఒకటే అయినా వేర్వేరు రచయిత్రులు భిన్న నేపథ్యాలతో, తమవైన అనుభవాలతో అందించిన వైవిధ్యభరితమైన కథలు ‘స్వయంసిద్ధ’ కథలు.

జీవితంలో తోడు కోల్పోయి, ఒంటరి ప్రయాణం సాగిస్తూ, ఎన్నో సమస్యలను ఎదుర్కుంటూ తమ లక్ష్యాలను ఆశయాలను సాగించిన మహిళల స్ఫూర్తిదాయక కథలివి.

ఎవరి జీవితం వారిది, ఎవరి పోరాటం వారిది, ఎవరి గెలుపు వారిది – అయినా వీటన్నింటినీ కలిపే అంతస్సూత్రం – తాము ఒంటరివారైనా, ఎవరికీ తీసిపోమని, చీకటి మలుపులను దాటి వెలుగుబాటలో పయనించగలమని సమాజానికి చాటిచెప్పడం; తమలాంటి మరికొందరికి ప్రేరణ నివ్వడం.

సమాజంలో సమస్యలన్నీ ఒకే విధంగా వుండనట్లే, ఒంటరి మహిళలు ఎదుర్కొనే సమస్యలు ఒకేలా అనిపించినా, ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతుల కారణంగా గిరిజన, దళిత, మైనారిటీ వర్గాల స్త్రీలకు మరికొన్ని సమస్యలు అదనంగా ఉంటాయని ఈ కథా సంకలనంలోని కథలు చెబుతున్నాయి.

ఇందులోని కథలు రచయితల అనుభవాలు మాత్రమే కాదు. ఇతరుల అనుభవాల నుండి తీసుకున్నవి కూడా. ఈ కథల్లో ఏవీ ఊహాజనితం కావు. వాస్తవాల చుట్టూ అల్లుకున్న కథలు యివి.” అన్నారు సంపాదకులు తమ ముందుమాటలో.

హస్మిత ప్రచురణలు వెలువరించిన ఈ పుస్తకంలో 40 కథలున్నాయి. ఈ కథలేవీ మునుపు ప్రచురితమైనవి కావు. ఈ సంకలనం కోసం ప్రత్యేకంగా రచించినవే.

***

చిన్న వయసులోనే భర్తని పోగొట్టుకుని, హేళనలని, సూటిపోటి మాటలను ఎదుర్కుంటూ జీవన పోరాటం సాగిస్తున్న కరుణ ఓ సందర్భంలో బలహీనపడి తన్ను తాను నిందించుకుంటే స్నేహితురాలు ధైర్యం చెప్పి సమాజం తీరుతెన్నులను స్పష్టం చేసి భరోసా కల్గిస్తుంది ‘నేనున్నాను కనుకే’ కథలో. రచన శీలా సుభద్రాదేవి గారు.

డా. చెంగల్వ రామలక్ష్మి గారి ‘ఒంటరి పోరాటం’ కథ ‘డౌన్ సిండ్రోమ్’ తో పుట్టిన పాపని పెంచిన మహిళ కథ. పుట్టిన ఆరునెలలకి పాపకి సమస్య ఉందని తెలిసి సుజాత భర్త పాపని చీదరించుకుంటాడు; ఆడపిల్ల పుట్టినందుకు మాటలతో వేధిస్తుంది అత్తగారు. పాపని జాగ్రత్తగా చూసుకోవాల్సిన భర్త – తన బాధ్యత లేనట్టు విడాకులిస్తాడు. తల్లిదండ్రుల సహకారంతో కొంతకాలం, వాళ్ళిద్దరూ గతించికా, ఒంటరిగా – మానసిక సమతుల్యత లేని కూతుర్ని పెంచుతూ భవిష్యత్తులో ఆమెకో దారి చూపాలని కృషి చేస్తుంది సుజాత.

భర్త మరణాన్ని తట్టుకుని ధీరగా మారి పిల్లల కోసం, తోటి స్త్రీల కోసం బ్రతుకు పోరు కొనసాగిస్తున్న యమున – తమ ఆఫీసులోనే వేధింపులకి గురువుతున్న మరో ఒంటరి మహిళ గీతకి ధైర్యం చెబుతూ తోడుగా ఉంటుంది.  అయితే తన సంపాదన కోసం అర్రులు చాచి వేధించిన తోడేళ్ళలాంటి బంధువుల ఒత్తిడిని తప్పించుకోలేక బలవ్మరణానికి పాల్పడుతుంది గీత. స్త్రీల సమస్యలకి పరిష్కారం స్త్రీల చేతుల్లోనే ఉందని, వాళ్ళు సంఘటితమైతే – వాళ్ళ ప్రశ్నలకి వాళ్ళే సమాధానలవుతారని చెప్తుంది డా. సి. భవానీ దేవి గారి ‘ప్రశ్నే జవాబు’ కథ.

చిన్న వయసులోనే భర్త దూరమై ఇద్దరు చిన్నపిల్లలతో – జీవితంలో సంకట స్థితి ఎదురైనప్పుడు అగ్రికల్చరల్ బిఎస్‍సి చదివిన దేవి వ్యవసాయాన్ని ఉపాధిగా ఎంచుకుంటుంది. అత్తమామల సహకారంతో తమ పొలంలో మిర్చి పంట వేస్తుంది, ఊర్లోని మగవాళ్ళంతా హేళన చేస్తారు, మా వల్లే కావడం లేదు, ఇక నీ వల్ల ఏమవుతుందని. కల్తీ విత్తనాలు కావడంతో మిర్చీ పంట సరిగా పండదు. కానీ ఈ సారి దేవి తన చదువుని, విజ్ఞానాన్ని రంగరించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఆకుకూరలు పండిస్తుంది. అందులో విజయం సాధిస్తుంది. క్రమంలో వ్యవసాయంలో నిలదొక్కుకుని చుట్టుపక్కల వారికి ఆదర్శంగా మారుతుంది డా. తాళ్ళపల్లి యాకమ్మ రచించిన ‘భూదేవి’ కథలో.

నిరక్షరాస్యులైన తల్లిదండ్రులని మాయ చేసి, తమ కూతురిని జోగినిగా చేస్తే ఆ కుటుంబానికి మంచి జరుగుతుందని ఆ ఊరి పటేల్ – ఓ యువతిని జోగినిగా మారిస్తాడు. దేవుని పెండ్లాం గా ముద్ర పడిన ఆమెకు పిల్లలు కలిగితే  తండ్రి ఎవరో చెప్పుకోలేని స్థితి కలుగుతుంది. ప్రభుత్వ ఫించను పొందాలంటే భర్త చనిపోయినట్టు సర్టిఫికెట్ కావాలంటారు అధికారులు. ఆ సర్టిఫికెట్ ఆమె ఎలా తేగలుగుతుంది? కొండంత వేదనని నాలుగు పేజీలలో కుదించిన జూపాక సుభద్ర గారి ‘దేవుని పెండ్లం దేనిపోత’ కథ  ఇప్పటికీ కొన్ని గ్రామాలలో కొనసాగుతున్న ఈ దురాచారాన్ని అరికట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది.

కూరెళ్ళ పుష్పవల్లి గారి ‘చిన్న చిన్నవి’ – స్త్రీల చిన్న చిన్న అవసరాలేంటో చెప్తుంది, ఒకే విషయంలో మగవారి దృక్కోణానికీ, ఆడవారి ఆలోచనా విధానానికి ఎంత తేడా ఉంటుందో చెప్తుంది. ఈ కథ గురించి తన ముందుమాటలో “నవ్యలాంటి ఆధునిక యువతికి సర్దుకుపోవడం చాయిస్ కాదు. సర్దుకుపోవాల్సిన అగత్యమూ లేదు. తెలిసి తెలిసీ అసమ సంబంధాలోకి వెళ్లి జీవితాన్ని ఇన్వెస్ట్ చేసి ప్రశాంతతని పోగొట్టుకోడానికి యివాళ ఆమె సిద్ధంగా లేదు” అని డా. ఎ. కె. ప్రభాకర్ గారు చెప్పినవి అక్షర సత్యాలు.

శ్రద్ధగా పనిచేసే వారి మీదే అన్ని పనులు పడతాయి. బాధ్యతలని సక్రమంగా నిర్వహించే వాళ్ళంటే కొన్ని పని స్థలాలలో కొందరికి అలుసు. అవి ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు లేదా స్కూళ్ళు కావచ్చు. భారమంతా ఒకరిపై మోపి, మిగతా వాళ్ళు తప్పించుకు తిరుగుతుంటారు. తమ పరిస్థితుల ఆధారంగా తమని అడ్వాంటేజ్‍‌గా తీసుకుంటున్నారన్న గ్రహించిన ఏ కొందరో దాన్ని ఎదిరిస్తారు. పి. జ్యోతి గారి ‘గమ్యం’ కథలో కూడా ఇలాగే ఒంటరి తల్లి, లాంగ్వేజ్ టీచర్ అయిన నెరేటర్ – తన సింగిల్ స్టేటస్‍ని తమకి అనుకూలంగా మార్చుకోవాలనే వారిని నిలువరిస్తుంది. తన స్వరం గట్టిగా వినిపిస్తూనే ముందుకు సాగాలని నిర్ణయించుకుంటుంది.

శైలజామిత్ర గారి కథ ‘వష్టి’ – కథ శీర్షికలానే విలక్షణంగా ఉంది. జీవితంపై విరక్తి చెంది తనువు చాలించాలకున్న వష్టి, అనుకోని రీతిలో మరో ఒంటరి తల్లి మహతికి దగ్గరై ఆమెకి అండగా నిలిచి, తాము అనుకున్న విధంగా జీవించేందుకు ప్రేరణిస్తుంది. “ఒంటరితనం అనేది మనకు మనం కల్పించుకున్నది. ఎవరైనా పక్కన ఉంటే చాలు, ధైర్యంగా ఉంటుందని అనుకోవడం భ్రమ మాత్రమే. ధైర్యం మనలో మనం పెంచుకోవాలి తప్ప, వేరొక వ్యక్తిలో వెతుక్కోకూడదు” అన్న ఈ కథలోని వాక్యాలు ఆలోచింపజేస్తాయి.

గూడెంలో వాళ్ళు తనని ఎప్పుడూ ఎందుకు ఆడిపోసుకుంటారో జయమ్మకు తెలుసు. పోనీలే పెద్దగా చదువులేని వాళ్ళు అని వాళ్ళని పట్టించుకోదు. కానీ, తాను ఒంటరినని తెలిసి ఆఫీసులో మగవారు తనని మాటలతో, చూపులతో, చేతలతో ఎలా వేధిస్తున్నారో గ్రహించినప్పుడు తానేం చేయాలో నిర్ణయించుకుంటుంది. తాను అనుకున్నది సాధిస్తుంది. ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ముందు ఒంటరితనం చాలా స్వల్పమైనదని చెప్తుంది డా. గంధం విజయలక్ష్మి గారి ‘నీలిచీర’.

భర్త, కొడుకు నిర్లక్ష్యానికి బలైన వసంత డిప్రెషన్‍కి లోనవుతుంది. క్రుంగుబాటుతో తనని తాను బాధ పెట్టుకుంటున్న వసంత సమస్యని గుర్తించిన అక్క శారద – నీలవేణి సహాయాన్ని కోరుతుంది. శారద, నీలవేణి కలిసి – కౌన్సిలర్ సహాయం తీసుకోవడానికి వసంతని ఒప్పిస్తారు. మొదట భర్త, తర్వాత కొడుకు – పురుషాధిక్య భావంతో ఓ స్త్రీ జీవితంలో ఎలా జులుం చేశారో వైష్ణవి శ్రీ గారి ‘నా ఇల్లు’ కథ చెబుతుంది.

రేణుక అయోల గారి ‘అనగనగా ఒక అమ్మాయి’ ఓ గొప్ప సత్యాన్ని చెబుతుంది – “జన్మ ఎత్తడానికి ఇద్దరు కావాలి. ఆఖరి ప్రయాణానికి నలుగురు కావాలి. ఆ మధ్యలో పోరాటమంతా మనదే” అంటూ. తన తల్లి ఒంటరి జీవితం ఎందుకు గడిపిందో – తల్లి మరణించాకా తెలుసుకున్న యువతి – తల్లి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనుకుంటుంది.

తల్లి ఒంటరి కావడంతో న్యూనతాభావంతో పెరుగుతుంది కూతురు హసిత – అయినంపూడి శ్రీలక్ష్మి గారి ‘ఒకటే జిందగీ’ కథలో. ఎవరినీ నమ్మక, ఏ బంధం లోనూ చిక్కుకోకుండా బ్రతకాలని అనుకుంటుంది. కాని పెళ్ళి చేసుకోమని తల్లి చెప్పినప్పుడు తల్లిని నిలదీసి – ఎందుకో ఒంటరి జీవితం, దీని వల్ల నువ్వు ఏం సాధించావు? అంటూ ప్రశ్నించి – తనని పెంచి పెద్ద చేయడం కోసం ఎన్నో ఆనందాలకి దూరమైన ఆ తల్లిలో మార్పుకి కారణమవుతుంది.

తనున్న జీవితం నుంచి కాస్త ఎదగాలనుకున్న ‘టామీ’కి డబ్బు సాయం చేస్తుంది ‘రా’. బోయ్ ఫ్రెండ్‍తో హింసలు పడుతూ, గర్భం దాల్చిన టామీకి క్రూయిజ్ షిప్‍లో ఉద్యోగం వస్తుంది. అబార్షన్ చేయించుకుని ఆ ఉద్యోగంలోకి వెళ్ళాలనుకుంటుంది టామీ. టామీ తర్వాతి కాలంలో ‘రా’ కి  కృతజ్ఞతలు తెల్పుతూ ఓ ఉత్తరం రాసి – అప్పట్లో తను ఇచ్చిన డబ్బుని మార్సెల్‍తో పంపిస్తుంది. ‘రా’ ఆ ఉత్తరం చదువుకుంటుంటే, మార్సెల్ నవ్వుతుంది. శ్రీసుధ మోదుగు గారి ‘మార్సెల్ నవ్వింది’ కథా నేపథ్యం ఈ పుస్తకంలోని మిగతా కథల నేపథ్యానికి భిన్నమైనది.

వైవాహిక జీవితంలోని లైంగిక హింసని కళ్ళకు కడుతుంది జ్వలిత గారి ‘మనోవర్ణాలు’ కథ. పెళ్ళి పేరుతో చేసే పెత్తనాలకి భయపడ్డ అనిత తాను ప్రేమించిన పవన్‍తో తన పెళ్ళికి తల్లి సరోజ అంగీకరించినా – వద్దంటుంది. ఆమె నిర్ణయం వెనుక భయాన్ని పవన్ అర్థం చేసుకుంటాడు. కౌన్సిలర్ సహాయంతో అనితలో మార్పుకు ప్రయత్నిస్తారు. అనిత, పవన్ జీవన ప్రయాణం మొదలుపెట్టడంతో సరోజ మనసు కుదుటపడుతుంది.

సయ్యద్ నజ్మా షమ్మీ గారి ‘జీవనయానం’ కథ మనుషుల మధ్య ప్రేమాభిమానాలు కాలానికి అతీతంగా మారిపోతుంటాయని చెబుతుంది. డా. నందిగామ నిర్మల కుమారి గారి ‘రత్తమ్మ’ కథ నేలకొండపల్లి బౌద్ధక్షేత్రం నేపథ్యంగా సాగుతుంది. భర్త వదిలేసిన తనని తాను ఎప్పుడూ ఒంటరి అనుకోక, కూతురిని పెంచి పెద్ద చేసి ఆమెకి బ్రతుక్కి ఆధారం చూపిన రత్తమ్మ ఆత్మగౌరవం ముందు అన్నీ దిగదుడుపే అవుతాయి.

రాంభక్త పద్మావతి గారి ‘రెండు చందమామలు’ కథలో బ్రెస్ కాన్సర్ వల్ల భర్తకి దూరమై, భర్త తెలివిగా పుట్టింట్లో దింపేసి వెళ్ళిపోతే తల్లిదండ్రులకు భారం కాకూడనుకున్న శాంతి ఓ గొప్ప నిర్ణయం తీసుకుంటుంది. ముద్రబోయిన రచన గారి ‘పురోగామి’ ట్రాన్స్ మహిళల జీవితాల లోని వ్యథని చూపుతుంది. సింగిల్ పేరెంట్‍గా కూతురిని పెంచడంలో సమీర ఎదుర్కున్న ఇబ్బందులు, వాటిని అధిగమించిన తీరుని కోళ్ళ సావిత్రిదేవి గారి ‘తిరుగుబాటు’ కథ చెప్తుంది.

డా. గోగు శ్యామల గారి ‘మూసొడ్డు’ కథ ఒంటరి శ్రామిక మహిళల వెతలను చెబుతుంది. బ్రతుకుతెరువు కోసం గ్రామాల నుంచి నగరానికి మూసీ నది ఒడ్డున గుడిసెలు వేసుకుని ఉంటున్న కుటుంబం కళమ్మది. కాచీగుడా మెయిన్ రోడ్‍ని ఉడిచి శుభ్రం చేసే పని ఆమెది. ఆకతాయిల వేధింపులు ఎదుర్కున్నా, పిల్లలను తన జీవితపు వెలుగులుగా భావిస్తూ – బ్రతుకుపోరులో ముందడుగు వేస్తుంది.

‘కొంగున నిప్పులు కట్టుకుని’ నీతిగా నిజాయితీగా బతికిన ఓ ఒంటరి తల్లి కూతురు శ్రీజ – బాగా చదువుకుని డాక్టర్ అవుతుంది. ఒకప్పుడు పురుషాధిక్య భావంతో తల్లిని వదిలి వెళ్ళిపోయిన తన తండ్రికే వైద్యం చేసి, చివర్లో తానెవరో వెల్లడించి ఆయన అహంకారాన్ని అణుస్తుంది ఎం.ఆర్. అరుణకుమారి గారి ‘వామన పాదం’ కథలో.

కలల ప్రపంచాన్ని అందుకోవాలని హైదరాబాద్ వచ్చిన జబీన్, చందన కాల్ సెంటర్‍లో పని చేస్తూ అపరిచితులు చేసే ఫోన్ కాల్స్‌లోని అవమానకరమైన, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు భరిస్తూంటారు. తమ లక్ష్యం సాధించాలంటే సమాజపు క్రూర చూపులను పట్టించుకోకుండా, బలహీన పడకుండా ముందుకుపోవాలని నస్రీన్ ఖాన్ రచించిన ‘వియర్డ్’ కథ చెబుతుంది.

శాంతిశ్రీ బెనర్జీ గారి ‘అవని’ కథ హిందూ యువతి, ముస్లిం యువకుడి ప్రేమా పెళ్ళి నేపథ్యంలో సాగుతుంది. మతాచారాలలో తేడాల వల్ల కాకుండా, ఆర్థిక కారణాల వల్ల, పెద్దల అహంభావం వల్ల విడిపోతారు. వాళ్ళిద్దరూ. భర్తతో విడిపోయినా, పిల్లలకి తండ్రి ప్రేమని దూరం చేయకుండా వాళ్ళ భవిష్యత్తుకై కృషి చేస్తుందా తల్లి.

కుటుంబ పోషణ కోసం కామందుల దగ్గర చేసిన అప్పులు తీర్చకుండా, అన్న తన దారి తాను చూసుకుంటే – ఆ బాధ్యతని తన మీద వేసుకుంటుంది నీలవేణి. కష్టపడి చదివి ఐఎఎస్ పాసవుతుంది. తన నేస్తం వకుళను కూడా బాగా చదువుకునేలా ప్రోత్సహిస్తుంది. కాలక్రమంలో వకుళ ఆ ఊరి ప్రెసిడెంట్ అవుతుంది. వనజ తాతినేని గారి ‘దీపవృక్షాలు’ ప్రేరణాత్మక కథ.

చిన్నతనంలోనే పెళ్ళయి, పెళ్ళయిన నాలుగేళ్ళకే భర్తని పోగొట్టుకున్న కరీమా జీవితంలో ఎదిగిన వైనాన్ని షేక్ నసీమా బేగం గారి ‘కరీమా’ కథ చెబుతుంది. అత్యంత సానుకూల దృక్పథాన్ని చాటుతుందీ కథ. సమాజంలో వివక్షని ఎదుర్కుని తమ బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దిన ఇద్దరు అమ్మల కథ నాంపల్లి సుజాత గారి ‘విల్ పవర్’.

వి. శాంతిప్రబోధ గారి ‘స్టేటస్ సింగిల్’ కథలో “నాది మనసులో ముడిపడిన బంధం కానప్పుడు, నేను ఒంటరిని కాదని మీరెవరైనా చెప్పగలరా?” అని ప్రశ్నిస్తుంది వైవాహిక జీవితంలో మనసు, శరీరం బండబారిన ఓ స్త్రీ. పిల్లలు పెద్దవాళ్ళయి, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకున్న సమయంలో ఎన్నో పుస్తకాలు చదివి తాను కోల్పోయినదేంటే గ్రహించి భర్తకి విడాకులిస్తుందామె. తనలాగా తను బతకాలనుకుంటుంది.

గంగవరపు సునీత గారి ‘తపన’ తెలిసీ తెలియని వయసులో కూతురు తప్పుబాటలో నడవకూడదని కూతురికి అర్థమయ్యేలా చెప్పిన ఒంటరి తల్లి కథ. వృద్ధులైన అమ్మ, అమ్మమ్మల బాధ్యతలు చూస్తూ ఒంటరిగా జీవనం సాగించే ధీర కథ ఆకునూరి విద్యాదేవి గారి ‘క్షమజ’. ఒంటరి బంజారా యువతిని ఒక పోలీసు అధికారి వేధిస్తే, మరో పోలీసు అధికారి సాయం చేస్తాడు. తానేం చేసినా తన కూతురు స్రవంతి కోసమే అంటుందామె. చేయని నేరానికి 12 ఏళ్ళు జైలు శిక్ష అనుభవిస్తుంది. ఆమె కూతురే ఫారెస్ట్ ఆఫీసరై అయి వచ్చి మొదట తల్లిని గుర్తించక, తల్లి చూపిన తన చిన్నప్పటి ఫోటోని చూసి గుర్తుపడుతుంది. డా. సూర్యా ధనంజయ్ గారి ‘మ ఎక్లీ’ కథ మనసుని బరువెక్కిస్తుంది.

డా. తిరునగరి దేవకీదేవి గారి ‘అవిశ్రాంత’ కథలో అత్తగారింట ఆదరణ లేకపోవడం, ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్త – తను ఎదిగిపోవడంతో న్యూనతాభావానికి గురై అనుమానించడం, మగ కొలీగ్‍ల వేధింపు మాటలు – రకరకాల పుకార్లను తట్టుకుని తను అనుకున్నది సాధిస్తుంది నిధి.

ఎండపల్లి భారతి గారి ‘యాపకాయ అంత ఎర్రి’ కథ ఇద్దరు ఒంటరి మహిళల జీవితంలోని వ్యథని చెప్తునే, జీవితాలని తీర్చిదిద్దుకునేందుకు వారు చేసిన కృషిని గొప్పగా చెబుతుంది. సి. సుజాత గారి ‘ఓ విరామం’ కథ – నిరంతరం భార్యని అదుపులో పెట్టాలనుకునే భర్తకి దూరంగా వెళ్ళి, తన బ్రతుకును తాను బ్రతుకుతూ, కూతురిని జాగ్రత్తగా చూసుకోవాలనుకున్న తల్లి కథ. ఆడియో మెసేజ్‍లా చెప్పిన ఈ కథ ఓ చక్కని ప్రయోగం.

చంద్రకళ గారి ‘గుమ్మితి’ కథలో కష్టాలతో జీవితం సాగించే నేస్తం కుమారిని ఆదుకునే ప్రయత్నం చేస్తుంది బుజ్జమ్మ. కొలిపాక శోభారాణి గారి ‘నిట్టాడు’ కథ పిల్లల కోసమే బతికే ఓ ఒంటరి తల్లి పోరాటాన్ని చెబుతుంది.

డా. సమ్మెట విజయ గారి ‘పోశాని’ కథ కళ్ళు చెమరించేలా చేస్తుంది. పని చేసే చేట వేధింపులని ఎదుర్కున్న పోశాని, తన ప్రమేయంలో లేకుండానే చిక్కుల్లో పడిన వైనం వేదనని కలిగిస్తుంది.

తోట సుభాషిణి గారి ‘సొంతిల్లు’ అద్దె ఇళ్ళ కోసం ఒంటరి మహిళలు ఎదుర్కునే సమస్యలని చెబుతుంది. తీవ్ర అనారోగ్యం చేసినా మైథిలిని భర్త పట్టించుకోడు. చివరికి మైథిలి సింగిల్ మదర్‍గా ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఇండిపెండెంట్ ఇల్లు కొనుక్కుని దాంట్లోకి మారిపోతుంది.

భండారు విజయ గారి ‘ఇడుపు కయిదాలు’ కథ ఒకే రకం సమస్యతో బాధ పడిన ఇద్దరు స్త్రీల కథ. యశోద తెగించి ఓ నిర్ణయం తీసుకుంటే సుధ సమాజానికి వెరచి ఎన్నో ఘర్షణల తర్వాత గానీ నిర్ణయం తీసుకోదు. జీవితాలు దిద్దుకోలేరు. తన పిరికితనానికి బాధపడతుంది సుధ.

భర్త విడాకులిచ్చాకా, ఒంటరిగా బ్రతకడం అలవాటు చేసుకుని – రచనల ద్వారా సాంత్వన పొందుదామని ప్రయత్నించిన ఓ కవయిత్రి రచయితల నుండి వేధింపులు ఎదుర్కున్నా; తట్టుకుని, వాటిని పట్టించుకోకుండా తన రచనల ద్వారా ఎంతో ఆనందాన్ని పొందుతుంది మందరపు హైమవతి గారి ‘స్వయం ప్రకాశిత’ కథలో.

బాలబోయిన రమాదేవి గారి ‘కొండమల్లి’ లైంగిక వేధింపులు ఎదుర్కున్న మహిళా కండక్టర్ పోరాటాన్ని చెబుతుంది. బస్‍లో శారీరిక వేధింపులకు గురైన గిరిజన యువతి సుక్లమ్మాయికి తిరగబడేలా ప్రేరణనిస్తుంది.

***

ఈ కథలు చదివాకా, ‘ఒంటరి మహిళల పట్ల సానుభూతి చూపితే సరిపోదు, బ్రతుకుపోరులో వారి ధైర్యానికి గౌరవం ఇవ్వాల’ని అనిపిస్తుంది. ఈ కథలు ఒంటరి మహిళలకే కాదు, స్త్రీలు అందరికీ ప్రేరణనిస్తాయి. నేర్చుకోగలిగితే పురుషులు కూడా నేర్చుకోదగ్గ అంశాలు ఈ కథల్లో ఉన్నాయి. ఆలోచింపజేసే కథా కదంబం ఈ పుస్తకం.

***

స్వయంసిద్ధ (కథా సంకలనం)
సంపాదకులు: భండారు విజయ, పి. జ్యోతి
ప్రచురణ: హస్మిత ప్రచురణలు
పేజీలు: 335
వెల: ₹ 300/-
ప్రతులకు:
భండారు విజయ
హెచ్.ఐ.జి బ్లాక్-1, ఫ్లాట్ నెంబర్ 10,
బాగ్ లింగంపల్లి, హైదరాబాద్ 500044.
ఫోన్: 8801910908, 8686468286
~
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు

https://telugu.analpabooks.com/swayamsiddha

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here