తాళం చెవి

7
6

[dropcap]క[/dropcap]రోనా లాక్‌డౌన్ ఎత్తేశారు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న మల్టీ నేషనల్ కంపెనీ వారు ఇవాళ వస్తున్నారు. ఎలాగో వాళ్ల చేత ‘యస్’ అనిపించుకుంటే చాలు. టై అప్ పూర్తైతే తమ షేర్లు నిలబడతాయన్న ఆశ! ఐదు రోజుల క్రితం కుండీలో జల్లిన ధనియాలు కొత్తిమీరగా పెరిగినందుకు సంబర పడిపోతూ, హుషారుగా పృధ్వి డాబా లోంచి లోపలికెళ్ళి రెడీ అయాడు. త్రీ పీస్ సూట్ బయటికి తీశాడు. కోట్ కిందకి తెచ్చుకున్నాడు. ఆలోచనల్లో తేలుతూనే, కవిత అందించిన టిఫిన్ ప్లేట్ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నాడు.

“పాత బట్టలు వేసుకున్నావేం?”

“లాస్ట్ బోర్డు మీటింగ్‌కేగా కొన్నది!”

“అంటే ఏడాదైపోయిందిగా, ఏడాది పాతది”

“ఈ సంవత్సరమంతా కట్టలేదుగా, లాక్‌డౌన్”, అనబోయి, అనకుండానే టిఫిన్ పూర్తిచేశాడు పృథ్వి. వాష్ ఏరియాలో ప్లేట్ పెట్టేసి వచ్చి, సోఫాలో కూర్చున్నాడు. తనకిష్టమైన పుస్తకంలో నాలుగు వాక్యాలు చదువుకుని వెళ్లడం అలవాటు. కవిత మళ్ళీ హాల్ లోకి వచ్చింది.

“ఇవాళేగా, డి డే?”

తల ఊపాడు.

“సమాధానం చెప్పొచ్చుగా?!”అంది. పృథ్వి తలెత్తి చూశాడు:

ఓ! ఇదేదో సబ్బు బుడగ వ్యవహారం. ఇట్టే పగిలిపోవచ్చు….. అనుకున్నాడు. పైకి మాత్రం, “హా! టెన్షన్” అన్నాడు.

సిచువేషన్‌ని బాగానే మేనేజ్ చేశానన్న కాన్ఫిడెన్స్ వచ్చింది.

కవిత ఎదుట నిల్చొని నవ్వుతూ, “నన్ను చూసి వెళ్ళు. అంతా బాగా జరుగుతుంది” అంది.

పృథ్వి నవ్వాడు. “థాంక్యూ! హోప్ సో!”అంటూ ల్యాప్టాప్ బ్యాగ్ భుజాన వేసుకుని ఫైల్స్ అందుకున్నాడు.

కారు తలుపులు చెక్ చేస్తున్న భరత్, “జీ, సాబ్!”, అంటూ ముందుకు వచ్చి కోట్ అందుకుని కార్లో హేంగ్ చేశాడు. పృధ్వి ముందు సీట్‌లో అన్నీ సర్దేసి వెనుక కూర్చుని రిలాక్స్ అయ్యాడు. అగరు ధూప పరిమళం హాయిగా ఉంది. లాఫింగ్ బుద్ధ బొమ్మ దగ్గర ఒకే ఒక పువ్వు తాజాగా ఉంది.

చిరునవ్వుతో, కళ్ళజోడు తీసి చూసుకుంటుండగా, భరత్ బలినో వేగాన్ని పెంచాడు.

మెయిన్ రోడ్‌కు వచ్చే సరికి, విల్లా ప్రాంతంలో ఉన్న చల్లదనం తగ్గి సూర్యకిరణాల తీవ్రత, ట్రాఫిక్ సందడి నాలుగింతలయ్యాయి. పృథ్వి నుదిటి మీద ముడతలు పడ్డాయి. ఒంటి మీద కోట్ పీస్ బరువుగా తోచింది. ఒక్క నిమిషం చాలు మూడ్ మారడానికి! ఆలస్యం ఔతోందని నిట్టూర్చాడు. ఏం ప్రయోజనం లేకపోయినా ట్రాఫిక్‌ని చూస్తూ మూడు నిమిషాల్లో మరో మూడు సార్లు నిట్టూర్చాడు. పాత స్టీమ్ ఇంజన్ గుర్తొచ్చింది. తనకే! ఐనా అసహనం.

భరత్ కేసి చూస్తే, తదేకంగా ఎదురుగా ఉన్న సిగ్నల్ వైపు 80 నుంచి అంకెలు తగ్గడం గమనిస్తూ ఉన్నాడతడు. పక్కనున్న కార్లో పెద్దావిడ కూర్చున్నారు. మరో కార్‌లో ఇద్దరు పాటలు వింటూ, నవ్వుతున్నారు. ఇంకో పక్క మెట్రో బస్ దుమ్ము ధూళి తో. కాసేపటికి, మళ్ళీ ప్రయాణం మొదలైంది.

అప్పటిదాకా పృథ్వి తుఫానులో చిక్కిన చెట్టులా ఉన్నాడు.

***

ఆ సాయంత్రం పృథ్వి వెనక సీట్లో కూలబడ్డాడు. చెప్పరాని బాధ అలలు అలలుగా వస్తోంది. ఏడాది ప్లానింగ్, ఆర్నెల్ల వర్క్, రిపోర్ట్స్, అన్నీ, అన్నీ వేస్ట్ అయిపోయేయ్. ఒక్క రోజులో ఆశలన్నీ వాడిపోయాయి. విసుగు, చిరాకైంది.

తెలియని కోపం వచ్చేసింది. కరోనా స్థితి సహా అన్నిటి మీదా …

“ఆ ట్రక్ వెనక్కి ఎందుకు? పక్క లేన్‌లో వెళ్ళచ్చుగా?” అరిచాడు పృథ్వి.

భరత్ కళ్ళు కాళ్ళు సెంటీమీటర్ కూడా కదల్లేదు. ఒకసారి కార్ హేంగింగ్ సరి చేసి, మౌనంగా ఉన్నాడు.

“నా మాటంటే లెక్కే లేదు!” గొణిగాడు.

పాదరసంలా పెరిగిన కోపంతో, పృథ్వి ఇంకేదో అనబోయాడు. ఇంతలో కార్ల మధ్య నుంచి ముసలి ఆవు, బరువైన తన శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోలేక ఇబ్బందిగా వస్తోంది. ట్రాఫిక్ పోలీసు దాని వీపు మీద రాస్తూ వాహనాల్ని పక్కకు వెళ్ళమని సైగ చేస్తూ ముందుకు నడిపిస్తున్నాడు.

“ఇంత సిటీలో వీటిని రానీయకుండా చూడొచ్చు కదా?ఇదే అమెరికాలో అయితే….” అన్నాడు.

“సాబ్! ఇది సిటీ కాదు, అవుటర్‌కి వచ్చేసాం! ఎవరో ఈ మధ్యనే వదిలేసుంటారు. ఒక గ్రూప్ వీటిని దత్తత తీసుకుంటున్నారు. ఇంకా వాళ్ళ దృష్టికి వెళ్ళుండదు” అన్నాడు భరత్ తాపీగా.

ఏభైకి అటూఇటూ వయసు, పూనా లోకల్, భరత్ భాయ్ చాలా నమ్మికైన డ్రైవర్. ఆఫీస్ నుంచి వచ్చే ఇంకెప్పుడైనా అయుతే ఎలక్షన్లు, ఫ్యాక్టరీ లేబర్, సినిమాలు ఎన్నో వాళ్ళిద్దరూ ముచ్చటించుకుంటారు. పృథ్వి ఆ మూగ జీవాన్ని చూశాక తగ్గాడు. భరత్ అద్దంలోకి చూసి,

“పనవ్వలేదా సాబ్?” అన్నాడు.

“ఎలా చెప్పావ్?”

“నిలువెల్లా వణికిపోతున్నారు. కళ్ళు అసహనంగా, అలసటగా ఉన్నాయ్”.

“నేనెప్పుడూ టెన్షన్ కాండిడేట్‌నే కదా!”అడిగాడు పృథ్వి.

“ఎపుడూ ఉండేది వేరు. ఇది వేరు. నిరాశకు చాలా రూపాలుంటాయి”.

 “నా గురించి నువ్వేమనుకుంటావ్?” పృథ్వి మళ్ళీ అన్నాడు.

“సాబ్! నేను స్టీరింగ్ ముందు కూర్చుంటే దేని గురించీ ఆలోచించను”.

“హా!హా!హా!ఎప్పుడూ సతాయిస్తానేమో కదూ?”

“అదేం లేదు, అలవాటేగా మీ బాడ్ మూడ్? అద్దం మీద ఆవగింజ. ఎలానూ మామూలైపోతారు. మీ ఇష్టం మీది. అందాక వస్తే, ఎవరి మర్జీ వారిది కదా! సింపుల్” అన్నాడతను. నెట్‌ని‌ తాకుతూ, ల్యాండైన టెన్నిస్ గేమ్ బాల్‌లా ఉందీ మాట. కారు పరుగులు పెడుతోంది.

“భరత్ భాయ్! కాసేపెక్కడన్నా ఆగి వెళ్దాం” అన్నాడు పృద్వి.

రాత్రి 8 ఔతోంది. కారు సైడ్‍కి తీశాడు భరత్ భాయ్.

నలభై ఏళ్ళకే పెద్ద కంపెనీకి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసే పృథ్వికి ఏ అలవాటూ లేదు. అందుకే అతను ‘చిల్’ అవడని అందరూ అంటారు. ‘టెంపర్’ బాస్ అనుకుంటారు కూడా.

పృథ్వీ కార్ డోర్ తీసి దిగాడు. ఒళ్ళు విరుచుకున్నాడు. పక్క నుంచి కార్లు దూసుకు పోతున్నాయి. ఒకటో, రెండో ఫట్ ఫట్ ఆటోలు. మంచు దిగుతోంది. పార్కింగ్ లైట్ల వెలుగులో కారు పొగలు కక్కుతున్నట్టు భ్రమ! ఎక్కడో బాజాలు మోగుతున్నాయ్. అక్కడ పండగ. ఇక్కడ ఓటమి! మరీ ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేసానా? డామిట్! లీగాలిటీస్ పట్టుకున్నారు. ఎలా మిస్సయ్యానూ?ప్చ్…….

“భరత్ భాయ్! ఐ ఫెయిల్డ్!”

వెనక నుంచి ముందుకొచ్చి డ్రైవర్ సీట్ పక్కనున్న విండో మీద తట్టి దించాక చెప్పాడు. భరత్ తల పంకించాడు.

స్టీరింగ్ మీద నుంచి చేతులు తీసి, సీట్ బెల్ట్ కూడా తీశాడు. ఇంకా ఏదో అనబోయాడు. అంతలో భరత్, “వాళ్ళకేం బాధలున్నాయో?” అన్నాడు.

“ఎవరికి?”

“అదే ఆ విలాయత్ వాళ్ళకి”

“అగ్రిమెంట్ అయాక వెనక్కి తగ్గారు. మర్యాద లేదు” అన్నాడు కోపంగా.

“కరోనా ప్రపంచాన్ని మార్చింది సాబ్!”

“ఏం లేదు! ఇప్పుడంతా తగ్గింది, వీళ్ళే ఇలా మోసం….”

పృథ్వి మాటలకు జవాబుగా భరత్ ఏదో చెప్పాలని నోరు విప్పాడు.

“చెప్పు భాయ్!”

“మీరు వినరు, సాబ్! ఇప్పుడు మీరు వినలేరు. విన్నా ఆలోచించరు. ఆలోచించినా ఒప్పుకోరు. అది మీకు సరైనది కాదనుకుంటారు”.

పార్టనర్స్, ఆడిటర్ ఎవర్నడిగినా తనే కరెక్టనీ,తన కోపాన్ని ఫైటింగ్ స్పిరిట్ అనీ అంటారు. ఇలా ఎవరూ చెప్పలేదు. చెప్పరు కూడా. పృథ్వి అవాక్కయ్యాడు.

ఇంతలో ఇందాకట్నుంచి అసహనంగా ప్యాంట్ పాకెట్ తడుముతుంటే, చేతికేదో తగిలింది. బయటికి తీసి పార్కింగ్ లైట్ వెలుతురులో జాగ్రత్తగా చూశాడు. పాత సేఫ్ తాళంచెవి! దారం కట్టి ఉంది. ఏడాదిగా చాలా సార్లు వెతికినా దొరకలేదు. ఇప్పుడిలా!

పృథ్వికి ఏదో స్ట్రైక్ అయింది. నవ్వొచ్చింది. గిరుక్కున వచ్చి, ఫ్రంట్ సీట్ లో కూర్చున్నాడు. డోర్ జాగ్రత్తగా వేసి, “మీ ఇంట్లో మిమ్మల్ని దింపేసి, తర్వాత నేను బంగ్లాకు వెళ్తా!” అన్నాడు.

భరత్ కళ్ళల్లో అభిమానం, ఆత్మీయత తొంగిచూసాయి. పృధ్వీ సాబ్ ఇంతే! మంచివాడు. తెలివైనవాడు. చురుకు. కానీ, తలుచుకోగానే పన్లన్నీ ఐపోవాలంటాడు. ఇవాళ్రేపు ఎన్నో మార్పులు. ఎన్నెన్నో కారణాలు.

భరత్ మెల్లగా కారు ముందుకు పోనిచ్చాడు.

వాళ్ళిల్లు సిటీకి పది కిలో మీటర్లు. అది దాటాకే పృథ్వి గేటెడ్ కమ్యూనిటీ.

***

గాజు గ్లాసులో ఇచ్చిన వేడి టీ వసారాలో కూర్చుని తాగుతూ చుట్టూ చూస్తున్నాడు పృథ్వి. పాత హిందీ పాట వినిపిస్తోంది.

‘తూ జహా,జహా చలేగా, మేరా సాయా సాథ్ హోగా..” తలిదండ్రులు, స్నేహితులు, భార్య,పిల్లలు ఎవరు? ఎవరుంటారు సదా తోడు?. ఊహు. వాళ్ళు రాకపోవచ్చు. వారి విషెస్ వస్తాయి.

మనసు తేలికైంది. ఆందోళన తగ్గింది.

భరత్ స్నానం, సాయంకాలం ప్రార్థన చేసాక వచ్చాడు. పృధ్వీకి రెండు వేడి సమోసాలు, పచ్చి మిరప కాయలు ఒక ప్లేట్లో తెచ్చిచ్చాడు.

 “నన్ను బాగా గమనించావ్ భాయ్!” అన్నాడు పృథ్వి.

“ఓ! మీరింకా అక్కడే ఆగిపోయారు సాబ్!” చిరునవ్వు నవ్వుతూ, ఎదురుగా పేము కుర్చీ మధ్య నున్న గోతి లోకి జారిపోతూ అన్నాడు.

“మీ గురించి చెప్పండి.” అంటూ సమోసా తుంపాడు పృథ్వి.

“అందరూ లెక్కలేసి నచ్చిన పనిలోకి వెళ్తారు. నాకలా జరగలేదు. నాన్న పోవడంతో అర్జంటుగా డ్రైవింగ్ లోకి దిగాను. టాక్సీ మీద 11 సంవత్సరాలు చేసి మీ దగ్గర ఛాన్స్ వస్తే చేరాను.”

అతని కొడుకు రాత్రి భోజనం తెచ్చిచ్చాడు. భరత్ వారించాడు.

“మీరు కానివ్వండి.లేటౌతోంది” అన్నాడు పృథ్వి.

కుర్చీలో ముందుకు జరిగి,స్టూల్ లాక్కుని, ప్లేట్ దానిపై పెట్టాడు. నాలుగు పుల్కాలు మధ్యలో ఉన్నాయి. సబ్జి, రసం, పెరుగు, పప్పు, అన్నీ చిన్న చిన్న కటోరీల్లో సర్దారు.ఒక పుల్కా ముక్క తుంపి, నుదిటి దగ్గరగా చెయ్యెత్తి కళ్ళు మూసి ఏదో తలుచుకుని, కంచంలో ఓ పక్కన పెట్టి, “నన్నొదిలి వెళ్ళిన పెద్దలకీ, నా పెద్ద కొడుక్కీ” భరత్ చిరునవ్వు నవ్వాడు.

పృథ్వికి ఒళ్ళు జలదరించింది.

జీవితంలో ‘లాస్’ అంటే ఇదీ! పచ్చి మిరపకాయ కొరికిన ఘాటుకు కెచప్‌లో వేలు ముంచి,నోట్లో పెట్టుకొని జుర్రాడు పృథ్వి.

ఇద్దరూ మౌనాన్ని వెళ్ళ దీస్తున్నారు. చలి పెరుగుతోంది.

సెప్టెంబర్ మాసం. ఎదురుగా చెట్టుకింద నలుగురైదుగురు కబుర్లు చెప్పుకుంటూ గట్టిగా నవ్వుతున్నారు. ఇదంతా అపురూపంగా అనిపించింది. తమ విల్లాల మధ్య లక్షల విలువ చేసే కార్లు సముద్రపుటొడ్డున రాళ్లలా పడుంటాయ్. వాటి మీద ఆకులు రాలి పడే చప్పుడొక్కటే వినబడుతుంది. రాత్రి పూట కుక్కలు కూడా మత్తుగా, పేర్చిన మట్టి కుండీల్లా,శూన్యపు ముద్దల్లా పడుకుంటాయి.

భరత్ భోజనం ముగించాడు. కుర్చీలోంచి లేస్తూ, “ఒక రోజు చూసేది వింత సాబ్! నిజానికి మనం రోజూ ఏం చేస్తే అదే మనకు రైట్” అన్నాడు.

ఇదేంటి? తన మనసులో మాట గురించే చెప్పాడు అనుకున్నాడు పృథ్వీ.

చాలా రోజులకి భరత్ తానుగా సంభాషణ మొదలు పెట్టడం హాయిగా అనిపించింది.”ఇవాళ మీ మాటలన్నీ రాసి పెట్టుకోవాలనిపించేలా ఉన్నాయి” అంటూనే పృథ్వీ ప్లేట్ పెట్టేసి, చేయి కడుక్కుని వచ్చాడు.

“డ్రైవర్ గా చెప్పానంతే. ప్రత్యేకతేమీ లేదు. మీరే ఈ రోజు ఏం జరిగినా అందులో ఏదో గ్రహించే ‘సోచ్’లో ఉన్నారు!” అన్నాడు భరత్. పృథ్వికి ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

“సిటీ డ్రైవింగ్ నాకు ఓపిక, ఒద్దిక నేర్పింది. ట్రాఫిక్ లైట్ ఏ క్షణాన మారుతుందో చూస్తూ ఆ వాహనాల ప్రవాహంలో పొద్దుటిలా పశువే ఉందో, పొట్టకూటి కోసం పెన్నులమ్మే పిల్ల ఉందో, బిచ్చమెత్తే తల్లే ఉందో, ఉన్నట్టుండి ట్రబులిచ్చి ఆగిన ఇంకో గాడీ ఉందో అని ఆగగలను. ఖాళీ ఉంటే ముందుకి, లేకుంటే ఆగేది. ఇదైనా మళ్ళీ మళ్ళీ ఆ సంఘటనలు ఎదురయాకనే తెలిసాయి. సఫేద్ బాల్ కే బాద్”, నెరిసిన జుట్టు కేసి చూపించాడు.”నేనూ స్టీరింగ్ మీద కొట్టాను. బండి దిగి ట్రాఫిక్ జామ్ దగ్గర పోలీసాద్మీ అయ్యాను” భరత్ నవ్వాడు. “మన చుట్టూ ఉండేవాటిని ప్లాన్‌లో కలుపుకోకూడదు. నిజానికి అలా చేయలేం సాబ్! దేన్నైనా చిన్న చిన్న భాగాలుగా చేసి చూస్తుంటే ఒక దారి దొరుకుతుంది. లేదా అలజడి ఒక్కటే దక్కుతుంది”.

పృథ్వి కుర్చీలో వెనక్కి వాలాడు. కాసేపయ్యాక సెలవు తీసుకొని ఇంటికి వచ్చేశాడు.

***

డిన్నరయ్యాక కవిత మెల్లగా అడిగింది, “డీల్ ఏమైంది?”.

డైనింగ్ టేబుల్ క్లియర్ చేస్తూ,”ఓకే కాలేదు.వాళ్ళకేం కష్టాలున్నాయో!” అన్నాడు పృథ్వి.

కాసేపు పిల్లలతో టీవీ గదిలో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ చూశాడు. ప్రతి ప్రశ్నకీ నాలుగు ఆప్షన్స్! జవాబు వెతకాలి. మనలో, మన చుట్టూ!

ప్రోగ్రామయ్యాక, అందరికీ గుడ్ నైట్ చెప్పి, పైన బెడ్ రూం లోకి వెళ్ళాడు.

ఆత్మీయంగా పాత తాళపు చెవిని దారంతో పైకెత్తి ఆడించాడు.

ఇప్పటికిప్పుడు ఆ లాకర్ ఓపెన్ చేద్దామా అనుకున్నాడు. కానీ తెరవాలనిపించలేదు. తాళం చెవిని పదిలంగా వాలెట్ లో,ఫొటో పెట్టే అరలో, కనబడేలా దూర్చాడు పృథ్వి.

కొన్నిటిని, దగ్గరే ఉన్నా గమనించం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here