తాళం..!!

16
13

[dropcap]సా[/dropcap]యంత్రం ఆరుగంటలు అయివుంటుంది. సావిత్రమ్మ ఇంటికి వచ్చేసింది. ఉదయం ఆఫీసుకు వెళ్లడం సాయంత్రం ఇంటికి రావడం ఆమెకు కొత్తేమీ కాదు! కానీ, అది గతం. ఇప్పుడు తాను ఉద్యోగిని కాదు! ఆ.. రోజు మాత్రం సావిత్రమ్మ దినచర్యలో అది ప్రత్యేకమే! ఇంటికి వచ్చి తలుపు తాళం తీద్దాం అనుకునే లోపునే, ఆమె హ్యాండ్ బేగ్‌లో వున్న మొబైల్ మోగింది. ఎంత పనిలోవున్నా మొబైల్ మోగితే సావిత్రమ్మ ఫోన్‌కే ప్రాధాన్యత నిస్తుంది. ఇప్పుడు కూడా అదే పని జరిగింది.

మొబైల్ తెరిచి చూసిన సావిత్రమ్మ ఫోన్ రింగ్ అవుతున్నప్పుడు తెరపై కన్పించిన కాలర్ పేరు చూసి ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యపోవడమే కాదు ఆమె ఆనందంతో పులకించిపోయింది. అందుకే తలుపు తాళం తీయకుండానే, మెట్ల మీద కూలబడి ఫోన్లో మాట్లాడ్డం మొదలుపెట్టింది.

ఫోను మాట్లాడుతూనే ఆమె ఆలోచనలు గతంలోకి పరుగులు తీశాయి. ముప్పై ఏళ్ళ తర్వాత తనకు ఇష్టమైన వ్యక్తి, అప్పట్లో తనను అంతగా పట్టించుకోని, తనను నిర్లక్ష్యంగా లెక్కపెట్టని కిషోర్ ఫోన్ కాల్ అది.

ఆ.. రోజుల్లో అందంగా అతిలోక సుందరిగా పేరుతెచ్చుకున్న తన స్నేహం కోసం ఎందరో అబ్బాయిలు తహతహ లాడుతుండేవారు. కానీ తాను మాత్రం నిర్మల హృదయుడిలా కనిపించే కిశోర్‌ను ఇష్టపడేది. అయితే కిశోర్ మాత్రం అప్పటి ఈ సావిత్రిని అసలు పట్టించుకునేవాడు కాదు. అందుకే ‘ప్రేమించడం సులభం కానీ.. ప్రేమించబడడం కష్టం’ అని మనసులో అనుకుంటుండేది. అలా ప్రేమ, ప్రేమలేఖలు, వెంటబడడాలు వంటి సంఘటనలను దాటుకుని చదువు పూర్తి చేసుకోవడమే కాదు, తను కోరుకున్నవాడి ప్రేమ లభించక, తనను కోరుకున్నవారిని తాను ఇష్టపడక చివరికి పెద్దల కుదిర్చిన సంబంధం చేసుకుని మంచి ఉద్యోగంలోనే స్థిరపడింది సావిత్రి. ఆనతి కాలంలోనే ఇద్దరు ఆడపిల్లలకు తల్లి కూడా అయింది సావిత్రి.

అలాగే కిశోర్‌కు సంబంధించిన ఆలోచనలు కూడా మరుగున పడిపోయి, తాను ఆనందంగా జీవితాన్ని నెట్టుకొస్తున్న సమయంలో జరగకూడని అన్యాయం జరిగిపోయింది. తననూ, తన ఇద్దరు ఆడపిల్లలను అనాథలను చేసి భర్త రఘురామ్ కార్ ఏక్సిడెంట్‌లో చనిపోయాడు. అలాంటి క్లిష్టసమయంలో తనముందున్న సవాళ్ళను ధైర్యంగానే ఎదుర్కొని సఫలీకృతురాలైంది. పిల్లలు చదువు పూర్తి చేసుకుని, పెళ్లిళ్లు చేసుకుని విదేశాల్లో స్థిరపడిపోయారు. ఇప్పుడు ఆమె ఆరు నెలలు స్వదేశంలో ఉంటే మిగతా ఆరు నెలలు విదేశాల్లో పిల్లల దగ్గర గడుపుతుంది.

అలాంటి నేపథ్యంలో ఇన్నేళ్ల తర్వాత, తన ఫోన్ నంబరు సంపాదించి కిశోర్ తనకు ఫోన్ చేయడం సావిత్రమ్మకు ఆశ్చర్యమే అనిపించింది. ఆమె అతనితో మాట్లాడుతుంటే సమయం యిట్టే జారిపోయినట్లయింది.

చుట్టూరా చీకటి అలుముకుంది. వాళ్లిద్దరూ ఏమి మాట్లాడుకున్నారో ఏమో గానీ ఆమె ముఖం అంత చీకటిలోనూ వెలిగిపోతున్న వైనం సావిత్రమ్మకు కూడా తెలియదు. సంతోషంగా మొబైల్ బేగ్‌లో పెట్టుకుని ఇంటి తలుపు తీయడానికి తాళం కోసం బేగ్‌లో వెతకడం మొదలు పెట్టింది. యెంత వెతికినా తాళం కనపడలేదు. అదే పనిగా మళ్ళీ.. మళ్ళీ బేగ్ అంతా వెతికింది, తాళం కనిపించలేదు. అనుకోకుండా తనలో చోటు చేసుకున్న ఆనందం కాస్తా ఆవిరి అయిపొయింది. ఆశ చావక హ్యాండ్ బేగ్‌లో వున్న వస్తువులన్నీ నేలమీద పారబోసి తాళం కోసం వెతికింది. అయినా తాళం మాత్రం కనిపించలేదు.

సావిత్రమ్మను నీరసం ఆవహించడం ప్రారంభమైంది. ఆ సమయంలో ఎవరిని పిలవాలి? పైగా అది తాళం కప్ప కాదు, తలుపులోనే అమర్చిన ‘లాక్ సిస్టం’. ఏమి చేయాలో తనకు తోచలేదు. ఆ సమయంలో ఎవరికి ఫోన్ చేసినా ప్రయోజనం ఉండదు. బోర్లించిన హ్యాండ్ బేగ్ తీసుకుని వస్తువులన్నీ తిరిగి బేగ్‌లో సర్దుకుని, కనీసం పక్కింటికి వెళ్లి విషయం చెబుదామనే ఉద్దేశంతో ‘డోర్ లాక్ హేండిల్’ ఆసరా చేసుకుని పైకి లేచే ప్రయత్నం చేసింది నీరసంగా సావిత్రమ్మ. ఆశ్చర్యంగా ఆమె బరువుకి హేండిల్ కిందికి తిరిగి సునాయాసంగా తలుపు తెరుచుకుంది. అప్పుడు కాని సావిత్రమ్మకు గుర్తు రాలేదు, ఉదయం తాను బయటికి వెళ్లేప్పుడు ‘తాళం’ వేయలేదని. ఇంట్లోకి భయం భయంగా అడుగుపెట్టిన సావిత్రమ్మ హల్లో లైట్ వేయగానే టేబుల్ మీద స్టీల్ తాళం మిల మిల మెరుస్తూ కనిపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here