తగిన శిక్ష!

0
13

[శ్రీమతి ఏ. అన్నపూర్ణ రచించిన ‘తగిన శిక్ష!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఫో[/dropcap]న్లో కొత్త నంబర్ నుంచి కాల్ వస్తే రిప్లై ఇవ్వకుండా వదిలేసింది యామిని.

ఎవరో కానీ వదలకుండా విసిగిస్తూ ఉంటే సైలెంట్ మోడ్‍లో పెట్టింది.

కానీ ముఖ్యమైన కాల్ కోసం ఎదురుచూస్తూ ఫోన్ వైపు చూడక తప్పలేదు. కొత్త నెంబర్ కాల్ వస్తూనే వుంది. మళ్ళీ వాళ్ళు చేయకుండా వార్నింగ్ ఇవ్వాలని “హలో ఎవరు? ఇలా విసిగిస్తున్నారు.. మేనర్స్ లేవా..” అని గట్టిగా అడిగింది.

“నేను మీ మామగారి ఫ్రెండ్ డాటర్‍ని. నా పేరు పుష్ప. మా వారికి జాబ్ కావాలి. మీరు ఆ జాబ్‌కి రికమెండ్ చేస్తే తప్పకుండా వస్తుంది అని గంగాధరం గారే చెప్పారు.” అంటూ చెప్పింది ఆమె.

“చూడండి మీరు ఎవరైనా సరే నేను ఎవరికీ రికమెండ్ చేయను. ఈ విషయం గంగాధరం గారికి కూడా తెలుసు. ఆయన చెప్పరు. ఇక విసిగించవద్దు. నేను బిజీగా వున్నాను.” అని చెప్పింది యామిని.

ఆ తర్వాత ఇక ఆ విషయమే మర్చిపోయింది.

చాలా రోజుల తర్వాత యామినిని కలవడానికి ఒక యువకుడు వచ్చాడు. చాలా వినయంగా అమాయకంగా కనిపిస్తున్నాడు. గేటు దగ్గిర సెక్యూరిటీ అడ్డుకున్నా వినలేదు. చిన్న స్లిప్ మీద పేరు వచ్చిన పని రాసి ఇచ్చాక అనుమతి ఇచ్చింది యామిని.

“కూర్చో సిద్ధూ! ఇప్పుడు చెప్పు. మొదట నువ్వు అపాయింట్‌మెంట్ ఎందుకు తీసుకోలేదు?”

“నేను చాలా రోజులు తిరిగాను మేమ్. ఆయన ఎవరో మరి. అస్సలు నన్ను పట్టించుకోలేదు. నేను చాలా అన్యాయం అయిపోయాను. మిమ్ములను కలిసి మీకు తెలియకుండా జరిగిన విషయం తెలియ చెప్పాలని

వచ్చాను.” అన్నాడు సిద్ధూ.

“సరే! నీ పట్టుదలకు మెచ్చుకుంటున్నాను. నీకు జరిగిన నష్టం, నాకు తెలియని విషయం ఏమిటో చెప్పు.”

“నాకు తండ్రి అని చెప్పుకోలేని ఒక దుర్మార్గుడి చేతిలో మోసపోయింది మా అమ్మ. అర్థం అయింది కదా మేమ్! కూలిపనులు చేసి నన్ను పెద్దవాడిని చేసింది. ఎవరో మంచిమనిషి నా చదువుకు సాయపడ్డారు. చదువు పూర్తి అయ్యాక ఒక కాలేజీలో లెక్చచర్ పోస్టుకి అప్లై చేసాను. ఇంటర్వ్యూ జరిగింది. వెంటనే నన్ను సెలక్ట్ చేశారు. అప్పాయింట్‍మెంట్ లెటర్ పంపుతాం అన్నారు. వారం రోజులు ఎదురు చూసాను. రాలేదు. కాలేజీకి వెళ్లి అడిగితే తెలిసింది. నాకు రావలసిన పోస్ట్‌లో ఒక రిటైర్ అయిన వ్యక్తిని, లంచం తీసుకుని అపాయింట్ చేశారు. పోనీ అంటే అతడికి టీచింగ్ అనుభవంలేదు. ఒక కంపెనీలో ప్యాకింగ్ వర్క్ చేసాడు. ఆ కంపెనీ క్లోజ్ చేస్తే టీచింగ్ పోస్టులో అపాయింట్ చేసుకోడం విద్యార్థులకు ఎలాంటి మేలు చేస్తుంది? అదే మిమ్ములను అడిగి తెలుసుకోవాలని వచ్చాను.” చెప్పేడు సిద్ధూ.

“నాకు ఇందులో ప్రమేయం ఉందని నీకు ఎవరు చెప్పేరు?” అతడు చెప్పిన మాట వినగానే నిలువునా కోపంతో మండిపడింది. ఆ కాలేజీ మానేజ్‌మెంట్ చేసింది ఘోరమైన తప్పు.. కనుక.!

“మేమ్! అక్కడ పనిచేసే సెక్యూరిటీ నా క్లాస్‌మే‍ట్‌కి ఫాదర్. ఆయన చెప్పేరు. ఐతే నేరుగా మీకు సంబంధం వుందని కాదు.. భరత్ గారికి వుంది అని చెప్పేరు. మీరు చాలా సిన్సియర్ అని ఇలాంటివి సహించరు అని కూడా తెలుసు. అందుకే వచ్చాను.”

ఆ విషయం అప్పటిదాకా తెలియని యామినికి తల తిరిగిపోయింది. అసహ్యంతో కంపరం కలిగింది.

బయటపడకుండా “సిద్ధూ! నీకు న్యాయం జరుగుతుంది. నాదీ హామీ. నువ్వు ఇంతటితో చదువు ఆపవద్దు. నీకు మంచి భవిష్యత్తు వుంది. నువ్వు వెళ్ళు. మళ్ళీ తర్వాత కలుస్తాను.” అని పంపేసింది.

ఆ రోజు ఫోను చేసి కాలేజీలో పోస్టుకి రికమెండ్ చేయమని మామగారి పేరుతో అడిగినవాళ్ల గురించి కూడా తెలుసుకుంది. వాళ్ళు సిద్ధూ చెప్పిన వాళ్ళే!

ఆ దంపతుల కొడుకులు ఇద్దరూ వున్నత స్థాయిలో వున్నారు. పుష్ప జాబ్ చేస్తోంది. భర్తకి వుద్యోగం అవసరం లేదు. రిటైర్ అయ్యే వయసు. ఇంకా సంపాదించాలనే ఆశతో సిద్దూకి వచ్చే ఉద్యోగాన్ని డబ్బుతో కొనుక్కున్నాడు. దీని వెనుక భర్త ప్రమేయం యామిని సహించ లేకపోయింది.

అందులో కూడా గంగాధరం గారి ప్రమేయం లేదు. కేవలం అంతా భరత్ పన్నాగమే!

అంటే భరత్ ఇలా కాలేజీ మేనేజ్‌మెంటుతో చేరి అక్రమంగా సంపాదిస్తున్నాడు.

ఈ విషయాలు ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెం‍ట్‌కి ఫిర్యాదు చేసి అతడ్ని పట్టించింది. అతడికి సంబంధించిన కాలేజీలు అన్నిటిని క్లోజ్ చెయిన్చింది.

ఈ విషయాలు ధైర్యంగా బయటపెట్టిన సిద్ధూని అభినందించింది. తర్వాత సిద్దూకి ఐఐటీ చెన్నైలో PHD కి సీటు వచ్చిందని తెలుసుకుంది.

భరత్ భార్య అయివుండి యామిని ఒత్తిళ్ళను నిర్భయంగా ఎదుర్కొంది.

“అమ్మాయి యామిని.. నీకు ఇది బాగుందా? భరత్‌ని నిందితున్ని చేయడం?” అన్నాడు.. గంగాధరం ఆమె ఏమంటుందో అని.

“గౌరవనీయులైన గంగాధరం గారు! మీరు పోలీస్ డిపార్ట్‌మెంటులో నిజాయితీగా పేరు తెచ్చుకున్నారు కదా; మీకు భరత్.. అదే మీ కుమారుడు చేసిన పని సిగ్గుగా అనిపించలేదా?” అడిగింది.

“ఎస్ యామిని, నిజంగా సిగ్గుపడుతున్నాను.. వాడు నా రక్తం అయినందుకు. అలాగే నువ్వు నా కోడలు అయినందుకు గర్వపడుతున్నాను. కంగ్రాట్యులేషన్స్!” అంటూ అభినందించాడు.

యామిని ధైర్యాన్ని, నిజాయితీని, ఉన్నత స్థాయిని సహించలేక అసూయతో అడ్డదారులు పట్టాడు భరత్.

నిజానికి ఆమెను కావాలని ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, కలిసి జీవించే కాలంలో అసూయ మొదలైంది.

లోలోపల ఆమె ప్రతిష్ఠను దిగజార్చే పనులు చేసాడు. భర్తను కనుక తెలిసినా సీరియస్‌గా తీసుకోదు పట్టించుకోదు.. ఆఫ్ట్రాల్ లేడీ.. అనుకున్నాడు.

ఆమె డైవోర్స్ ఇవ్వలేదు.. కానీ.. అతడిని దూరంగా ఉంచింది. ఒంటరిని చేసింది. నిస్సహాయుడిని చేసింది.

పిహెచ్‌డి పూర్తి చేసిన సిద్ధూ అక్కడే ప్రొఫసర్‍గా చేరడంతో అతడికి న్యాయం చేకూరిందని యామిని సంతోషపడింది.

ఆమె మాత్రమే కాదు గంగాధరం గారు కూడా సంతోషించారు. ఆయన I P S ఆఫీసర్ అయినా యామినినే సమర్థించి తన హుందాతనం నిలబెట్టుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here