తగిన శిక్ష

1
14

[బాలబాలికల కోసం ‘తగిన శిక్ష’ అనే చిన్న కథని అందిస్తున్నారు శ్రీమతి పి.యస్.యమ్. లక్ష్మి.]

[dropcap]పి[/dropcap]ల్లలూ, ఇవాళ మీకొక మంచి కథ చెప్తాను. అయోధ్యలో శ్రీరామచంద్రుడు రాజ్యం చేస్తున్న కాలంలో జరిగిన కథ ఇది.

ఒక రోజు ఒక కుక్క రాములవారి ఆస్ధానానికి వచ్చింది తనకి న్యాయం చెయ్యమంటూ. శ్రీ రామచంద్రుడు ఆ కుక్క బాధ ఏమిటి, కారణం ఎవరు అని అడిగాడు.

అప్పుడు కుక్క తాను మధ్యాహ్నం మండుటెండలో వీధి వెంట ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్తుండగా ఒక బీద బ్రాహ్మణుడు బిచ్చమెత్తుకుంటూ తనని కొట్టాడని, దెబ్బ బాగా తగిలి బాధగా వుందని చెప్పింది. దానికి శ్రీరామచంద్రుడు తన రాజ్యంలో మనుషులే కాదు, జంతువులు కూడా ఆకలి దప్పులకి బాధ పడకూడదని మంత్రులకి తక్షణం తీసుకోవాల్సిన చర్యలు ఆదేశించాడు.

మరి కుక్కకి న్యాయం చెయ్యాలి కదా. ఆ బీద బ్రాహ్మణుణ్ణి పిలిచి కుక్కని కొట్టింది నిజమేనా, కారణమేమిటని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు తాను మండుటెండలో భిక్షకోసం తిరుగుతున్నానని, ఆ రోజు తనకి భిక్ష దొరకలేదని, ఆ కోపంలో అడ్డుగా వచ్చిన కుక్కని కొట్టిన మాట నిజమేనని ఒప్పుకున్నాడు. నేరం ఒప్పుకున్న బ్రహ్మణుడికి ఏమి శిక్ష వెయ్యాలా అని ఆలోచిస్తున్న రాముడితో కుక్క, మహారాజా, ఆ బ్రాహ్మణుడిని ఒక ధార్మిక సంస్ధకి అధినేతని చెయ్యండి అని విన్నవించుకుంది.

శ్రీరామచంద్రుడు ఆశ్చర్యపోయాడు. తనని కొట్టిన బ్రాహ్మణుడిని ఏదైన ఒక ధార్మిక సంస్ధకి అధిపతిని చెయ్యమని కోరిన కుక్కని ఆశ్చర్యంగా చూసి కారణం అడిగాడు. అప్పుడా కుక్క, శ్రీరామచంద్రా, పూర్వ జన్మ పుణ్యం వలన నాకు గత జన్మ జ్ఞాపకాలు వున్నాయి. కిందటి జన్మలో నేను ఒక సదాచార సంపన్నుడనైన బ్రాహ్మణుడిని. ఒక ధార్మిక సంస్ధకి అధిపతిని. ఎన్నో పుణ్య కార్యాలు చేశాను. కానీ తెలిసీ తెలియక కొంత ప్రజల సొమ్ము కూడా తిన్నానేమో. అందుకే నాకీ కుక్క జన్మ వచ్చింది. ఈ బ్రాహ్మణుడు పరమ లోభి, ఆవేశపరుడు. కనుక ధార్మిక సంస్ధ అధిపతిగా అకృత్యాలు చెయ్యక మానడు. అంటే ఆయన తన బుధ్ధి మార్చుకుంటేగానీ ఈ జంతు జన్మనుండి తప్పించుకోలేడు, అదే ఆయనకి తగిన శాస్తి అన్నది.

రామాయణ కథగా ప్రచారంలో వున్నా మనం చేసుకున్న కర్మ ఫలాన్ని మనం అనుభవించక తప్పదనేది ఇప్పుడూ మనం నమ్ముతున్న నిజం. పిల్లలూ, అమ్మా, నాన్నా వాళ్ళ ఉద్యోగాల్లో తీరిక లేకుండా వుండి మీ గురించి కొంచెం తక్కువ సమయం కేటాయించవచ్చు. ఏం చేస్తాం. మరి మీరు బాగుండాలనే కదా వాళ్ళంత కష్టపడేది. అందుకే మీరూ చిన్నప్పటినుంచే కొంచెం సహనం అలవాటు చేసుకోండి. అనవసరంగా ఎవరినీ కొట్టద్దు, తిట్టద్దు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here