తల్లి కోరిక

1
13

[box type=’note’ fontsize=’16’] లేఖిని సంస్థ నిర్వహించిన 2021 దీపావళి కథల పోటీలలో ఎంపికైన కథ ‘తల్లి కోరిక’. రచన తెలికిచెర్ల విజయలక్ష్మి. [/box]

[dropcap]ఎ[/dropcap]దురు ఫ్లాట్ లోనించి కల్యాణి అరుపులు, హాసిని ఏడుపు ఒకదాని తరువాత ఒకటి వినిపిస్తున్నాయి. రోజూ జరిగే కార్యక్రమమే అయినా, సహించలేక కుమారి బయటకు వచ్చి, ఎదురింటి తలుపు కొట్టింది.

కోపంగా తలుపు తీసిన కల్యాణి, ఎదురింటి కుమారి ఆంటీని చూసి…

“మీరా ఆంటీ, మా ఆయన వచ్చేరనుకున్నాను. రండి లోపలకు” అంటూ లోపలకు తీసుకు వెళ్ళింది కల్యాణి.

కల్యాణి వెంట లోపలకు వచ్చి, సోఫాలో పుస్తకాలు పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న హాసినిని చూసి గుండెల్లో మరుగు పడిన పాత గాయం రేగినట్టయి, గొంతు మెలిపెట్టినట్టు బాధ కలిగింది. వెళ్లి హాసిని పక్కన కూర్చొని నెత్తిమీద చెయ్యి వేసి…

“హోమ్ వర్క్ చేస్తున్నావా హాసినీ?” అంటూ ముద్దుగా అడిగింది కుమారి.

వెక్కుతూనే ‘అవును’ అన్నట్టు తల ఊపింది హాసిని.

“చూడండి ఆంటీ, అక్షరం ముక్క రాయదు. ఎన్ని దెబ్బలైనా తింటుంది. మిడిగుడ్లు వేసుకొని మింగేసేటట్టు ఎలా చూస్తోందో చూడండి” అంటూ తిడుతూ… హాసినికి మరొక మొట్టికాయ ఠంగున వేసింది కళ్యాణి.

“ఒద్దమ్మా, పిల్లని అలా కొట్టద్దు. దెబ్బలు, ఏడుపులు వినలేక ఇక్కడికి వచ్చేను. హాసిని లానే ముద్దులొలికే ఒక బంగారు తల్లి కథ చెబుతాను. మరేమీ అనుకోకుండా పాపను కాసేపు టీవీ చూడమని చెప్పు, నువ్వు ఓపికగా విను” అంది కుమారి.

***

పేద కుటుంబంలో నలుగురు పిల్లల నడుమ పుట్టిన అరుణకి, పెద్ద చదువులు చదువుకొని ఉద్యోగం చెయ్యాలనే కోరిక వుండేది. ఆ కోరిక తీరకుండానే, గుండెల మీద భారం వదిలించుకోవాలని, చిన్నదే అయినా గవర్నమెంట్ ఉద్యోగస్తునికిచ్చి పెళ్లిచేసి పంపారు తల్లితండ్రులు.

భర్త మంచివాడే కానీ… అక్కడ కూడా పేదరికం వెన్నంటి నీడలా ఉంది. అత్త మామల అవసరాలూ, అప్పుల నడుమ ఇద్దరు ఆడపిల్లలకి తల్లయింది అరుణ. అప్పుడే నిర్ణయించుకుంది, పిల్లలని ఎలాగైనా మంచి చదువులు చదివించి, ఉద్యోగస్తులను చేయాలని.

పిల్లలు పెరుగుతున్నారు. ఎప్పుడూ పిల్లల చదువు ధ్యాస తప్ప మరొక ఆలోచనలేదు అరుణకి. చిన్నమ్మాయి బుద్దిగా చదువుకొని, అన్నీ అప్పచెప్పేసేది. పెద్దది రమ్య మాత్రం చదువులో బాగా వెనకబడి వుండేది.

క్లాసులు పెరుగుతున్నకొద్దీ… రమ్య చదువులో మందకొడిగా ఉండేసరికి, అరుణ తను టెన్షన్ పడి, పాపను చితక్కొట్టేది. పాప కళ్ళల్లో ఎప్పుడు తల్లిని చూసినా భయమే. ఆఖరికి కొట్టుకొమ్మని ఒళ్ళు ఇచ్చేసేది. ఎంత కొట్టినా చలనం లేకుండా ఉండేది ఒక్కొక్కసారి.

టెన్త్ అరవై పర్సంట్ మార్కులతో పాసయింది. రమ్య సైన్స్ గ్రూప్ తీసుకుంటానని అంది. “సైన్స్ గ్రూప్ తీసుకొని నీకు డాక్టర్ చదివే తెలివితేటలు లేవు. మాకు అంత డబ్బు పెట్టే శక్తి లేదు. నర్స్ కోర్స్ చదివించటం నాకు ఇష్టంలేదు” అని మాథ్స్ గ్రూప్ తీయించింది కూతురుకి. మాథ్స్‌లో పూర్ అయిన రమ్య ఫెయిల్ అయ్యింది. ఎదిగిన పిల్ల అని చూడకుండా బెత్తంతో బాదేది అరుణ.

రమ్య జీవితంలో సంతోషంగా గడిచిన రోజులు వేళ్ళతో లెక్కపెట్టచ్చు. సరిగా మార్క్స్ రాకపోతే అమ్మ కొడుతుంది అనే భయం నిద్రలో కూడా ఉండేది. బాగా దెబ్బలు తిని నాన్న ఒడిలో ఒదిగి పడుకున్నప్పుడు మాత్రమే సంతోషం కలిగేది రమ్యకు.

“ఎందుకే, పిల్లని అలా వేధిస్తావు. చూడు, నిద్రలోకూడా ఎలా వణుకుతోందో” అని ఎప్పుడైనా రమ్య తండ్రి అంటే…

“మీకు తెలీదు, మీరు ఊరుకోండి. పిల్లలను వెనకేసుకు రావద్దు. నాకు మాత్రం అది పరాయిదా ఏంటి? నా పిల్లల జీవితం నా జీవితంలా కాకూడదు. రమ్యను మంచి పొజిషన్‌లో చూడాలి నేను. దాని జీవితం బాగుండాలని నా తాపత్రయం” అనేది .

“అయినా సరే నువ్వు పిల్లల విషయంలో ఇంత కఠినంగా వుండటం నాకు నచ్చటంలేదు అరుణా” అంటూ భర్త ఎంత చెప్పినా వినిపించుకోకుండా…

“మనం పడిన ఆర్థిక బాధలు పిల్లలు పడకూడదు. వాళ్ళకి మంచి చదువులు చదివించి, వాళ్ళని నేను మంచి పొజిషన్లో చూడాలి” అరుణకి ఎప్పుడూ అదే తపన.

చదువులో డల్ అయినా సరే మెల్లిగా ఇంజినీరింగ్ పూర్తి చేసింది రమ్య. చదువు పూర్తి అవగానే ఉద్యోగం వచ్చింది రమ్యకు. అరుణకి చాలా సంతోషం అనిపించింది. ఆ సంతోషాన్ని భర్త, పిల్లలతో పంచుకుందాం అనుకుంటే అందరూ మౌనంగా ఉన్నారు.

కూతురు రమ్య బొంబాయి వెళ్లి ఉద్యోగంలో జాయిన్ అయింది. రమ్య దూరమైన దగ్గరనుంచీ, కూతురు విషయంలో చాలా కఠినంగా ప్రవర్తించేనని భావన కలిగింది. తప్పు చేశానేమో అని బాధ మనసులో మెదిలింది అరుణకి.

అరుణ కూతురుతో ఎంతో మాట్లాడాలి, ఎన్నో కబుర్లు చెప్పుకోవాలి అని ఫోన్ చేస్తే… అంటీ ముట్టనట్లు భయంగా మాట్లాడే కూతురుతో ఏం మాట్లాడాలో అర్థమయ్యేది కాదు అరుణకు. దూరపు బంధువులు బాగా డబ్బున్న వాళ్ళ అబ్బాయికి రమ్యని పెళ్ళిచేసుకుంటామని కబురు పెట్టేరు. ఆ కబురు అరుణకి చాలా ఆనందాన్నిచ్చింది. కూతురు గొప్పింటి కోడలిగా వెళ్లాలని, సంతోషంగా ఉండాలని తలచింది.

“ఇప్పుడేగా ఉద్యోగం వచ్చింది. కొన్నాళ్ళు పిల్లని హాయిగా సంతోషంగా ఉండనీ తొందర ఎందుకు?” అని భర్త ఎంత నచ్చచెప్పినా వినకుండా… రమ్యని గొప్ప ఇంట్లో ఇచ్చి పెళ్లి చేయటానికే నిశ్చయించుకుంది అరుణ.

చదువులో అలిసిపోయిన రమ్యకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేకపోయినా, తల్లి అంటే అలవాటైన భయంతో పెళ్లికి ఒప్పుకుంది. అందమైన ఉద్యోగ జీవితం అనుభవించకుండానే, ఉమ్మడి కుటుంబమైన అత్తవారి ఇంట అడుగుపెట్టింది. రమ్య నిశ్శబ్దంగా బెరుకుగా ఉడడం చూసి తోడికోడలు, ఆడపడుచు తమమాట నెగ్గించుకుని, రమ్య మీద చాడీలు చెప్పి, భర్త మనసుకి రమ్యను దూరం చేసేరు.

గొప్పింటి వాళ్ళయిన అత్తవారు రమ్యని పురిటికి పంపలేదు. అరుణ కూతురుని చూడటానికి వెళితే, “మా కోడల్ని మేము చూసుకోగలము. మీ సహాయానికి ధన్యవాదాలు” అని తిప్పి పంపారు.

పురిటి కబురు వస్తుందని ఎదురు చూస్తున్న రమ్య తల్లి తండ్రులకు, వియ్యాలవారినించీ నించీ ఫోన్ వచ్చింది…

“మాకు మనవడు పుట్టేడు. మీ అమ్మాయికి పురిటిలో మతి తప్పింది. ఇప్పుడు మానసిక చికిత్సాలయంలో ఉంది. వెళ్లి మీ అమ్మాయిని మీరు చూసుకోండి” అనే కబురు శరాఘాతంలా తగిలింది అరుణకు.

పరుగున వెళ్ళేరు రమ్య తల్లి తండ్రులు, కూతుర్ని అక్కున చేర్చుకుందా తల్లి. రమ్య తల్లి తండ్రులను పోల్చుకునే స్థితిలో లేదు. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టు, శూన్యంలోకి చూస్తూ… వేళ్ళతో గాలిలో లెక్కలు వేసుకుంటూ… ఏదేదో మాట్లాడుతున్న కూతుర్ని చూసి గుండె చెరువయ్యింది అరుణకు. కూతురు ఆరోగ్యం బాగవ్వాలని వెయ్యి దేముళ్లని కోరుకుంటోంది ఆతల్లి.

ఆ తల్లికి కూతురుని చదివించాలానే బలమైన సంకల్పం ఎంత బలంగా వుండేదో, ఇప్పుడు అదే కూతురు ఆరోగ్యం బాగుచేయించే ప్రయత్నం, అందరిలో ధైర్యంగా బ్రతికే నేర్పు తెలియచేయాలని సంకల్పించుకుంది.

“చిన్నారిని భయపెట్టి, కొట్టి చదివించకమ్మా. లాలించి బుజ్జగించి చదివించమ్మా. ఆ పిచ్చిదయిన రమ్య తల్లిని నేనే, అరుణకుమారిని. భయం భయంగా నన్ను చూసే ఆ కళ్లను తలచుకొని ఎప్పుడూ కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటాను. నాలాంటి పరిస్థితి నువ్వు తెచ్చుకొని, పసిపాపకు దూరమవకు, వస్తాను” అంటూ కళ్ళు తుడుచుకొని నిష్క్రమించింది అరుణకుమారి.

కల్యాణి ఒక్క పరుగున వెళ్లి కూతురు హాసినిని దగ్గరకు తీసుకుంది. ‘ఎంత చదువుకుంటే అంతే చదువుకోరా కన్నా, నిన్ను బలవంతం పెట్టను. నావైపు భయంగా చూడకు’ అనుకొంటూ హాసిని కళ్ళను ముద్దులాడింది కల్యాణి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here