తల్లివి నీవే తండ్రివి నీవే!-19

0
12

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

నర నారాయణమ్

నర నారాయణమ్
ఉద్ధరేదాత్మనాత్మానం
నాత్మానమవసాదయేత్।
ఆత్మైవ హ్యాత్మనో బంధుః
ఆత్మైవ రిపురాత్మనః॥6.5॥ – భగవద్గీత నుంచీ

ఆత్మనా — మనస్సు ద్వారా
ఆత్మానం — నిన్ను నీవే
ఆత్మానం — నిన్ను
ఆత్మా — మనస్సు
ఆత్మనః — మన యొక్క
ఆత్మా — మనస్సు
ఆత్మనః — మన యొక్క

నీ మనస్సు యొక్క శక్తిచే నిన్ను నీవు ఉద్ధరించుకొనుము, అంతేకాని పతనమైపోవద్దు. ఎందుకంటే మనస్సే నీ మిత్రుడు, మనస్సే నీ శత్రువు.

ఇక్కడ చూశారా, ఆ ఆత్మ అన్న పదం ఒక్కొక్క సందర్భంలో ఎన్ని రకాలైన అర్థాలతో ఆ శ్లోకంలో ఇమిడిపోయిందో? అర్థాలే! (గుర్తు పెట్టుకోండి). మరి పరమాత్మకు ఎన్ని నామాలుండాలి? వాటికి ఎన్ని అర్థాలుండాలి?

మహాభారతంలో లెక్క పెట్టలేనన్ని పాత్రలున్నాయి. ఆ పాత్రలన్నింటికీ తమకంటూ ఏదో ఒక ప్రత్యేకత ఉంది. కొన్ని పాత్రలకైతే ఆ ప్రత్యేకతతో పాటు పదుల సంఖ్యలో పేర్లు కూడా ఉన్నాయి. అవి జన్మతః వచ్చిన పేర్లు. తల్లితండ్రులు పెట్టిన పేర్లు. తెచ్చుకున్న బిరుదములలాంటి పేర్లు. లేదా సమయసందర్భాలను బట్టీనో, ఇతర పాత్రలతో ఉన్న సంబంధ బాంధవ్యాలను ఆధారం చేసుకుని సంబోధించిన పేర్లు కావచ్చు. నామములు.

ముఖ్యంగా ఈ మహాభారతంలో విశిష్ట స్థానం కలిగిన పాండవ మధ్యముడు అర్జునుడికైతే పది పేర్లు ప్రసిద్ధంగా ఉన్నాయి.

  1. అర్జునుడు
  2. ఫల్గునుడు
  3. పార్థుడు
  4. కిరీటి
  5. శ్వేత వాహనుడు
  6. బీభత్సుడు
  7. విజయుడు
  8. జిష్ణుడు
  9. సవ్యసాచి
  10. ధనంజయుడు

ఇవే ఆ పది పేర్లు. ఈ పేర్లు అర్జునుడికి ఎలా, ఎందుకొచ్చాయన్న వివరాలు మహాభారతంలోని విరాటపర్వంలో వివరించబడ్డాయి. కానీ, ఎన్ని పేర్లు ఉన్నా ఆ జీవుడు ఆ దేహంతో సంబంధంగా ఉన్నంత కాలం అర్జునుడిగా సంబోధింపబడ్డాడు. ఆ పేరుతోనే ఎక్కువగా ప్రసిద్ధుడైనాడు.

ఇక్కడో విచిత్రం చూద్దాము. దానికన్నా ముందు అర్జునుడి పేర్ల విషయం వచ్చింది కనుక వాటి గురించి చూద్దాము.

1.అర్జునుడు: అర్జున అంటే తెల్లని వర్ణమని అర్థం. అర్జునుడు తెల్లగా ఉంటాడు. అది నిర్మల వర్ణం. శుద్ధ సత్త్వం. ఆ కాలంలో శ్రీకృష్ణుడి తర్వాత సత్త్వ గుణంలో అర్జునుడు ప్రసిద్ధుడు. ధర్మ దేవత అంశ అయిన విదురుడు, యుధిష్ఠిరుడు సత్వ గుణానికి ప్రతీకలుగా ఎప్పుడూ ఉండనే ఉన్నారు (Conditions apply). సత్త్వ గుణం వల్లే మానసిక స్థిరత్వం, తద్వారా యుద్ధంలో వెనుకడుగు వేయని తత్వం వస్తాయి. ఇక సహజంగా క్షత్రియవర్ణం కనుక రాజసం. అందుకే..

మొత్తం భూమిలో తన వర్ణంతో సమానమైన వర్ణం దుర్లభమని, తాను పరిశుద్ధమైన పని చేస్తానని, అందుకే తనను అర్జునుడంటారని స్వయంగా అర్జునుడే భారతంలో చెబుతాడు. అంటే మనసులో ఒకటి, పైకి ఒకటి ఉండదు.

2.ఫల్గున: ఉత్తర ఫల్గునీ విశేషకాలంలో అంటే పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని నక్షత్రాల సంధి కాలంలో అర్జునుడు జన్మించాడు. అలా పుట్టడం వల్లే అర్జునుడికి ఫల్గున అనే పేరొచ్చింది.

3.పార్థుడు: అర్జునుడి తల్లి కుంతీదేవికి పృథ అనే మరో పేరు కూడా ఉంది. ఆమె కొడుకుల్లో చివరివాడైన అర్జునుడికి పార్థుడనే పేరు వచ్చింది. అర్జునుడికి మాత్రమే! ఎందుకు? ముందు ముందు చూద్దాం.

4.కిరీటి: అర్జునుడి పరాక్రమానికి మెచ్చి ఇంద్రుడు ఒక కిరీటం ఇస్తాడు. అది యుద్ధంలో అర్జునుడి తలపై ఎప్పుడూ ప్రకాశిస్తుంటుంది. ఆ కిరీటం అభేద్యం, సుస్థిరం. అందుకే అర్జునుడు కిరీటి. దీని విశేషాలు కూడా ఈ విషైకంగా తెలుసుకోదగ్గవే. ముందు ముందు చూద్దాము.

5.శ్వేత వాహనుడు: యుద్ధరంగంలో అర్జునుడు ఎప్పుడూ తన రథానికి నియమంగా తెల్లటి గుర్రాలనే కడతాడు. ఆ కారణంగానే అతనికి శ్వేతవాహనుడని పేరు వచ్చింది. సత్త్వగుణం. స్థిరత్వం.

6.బీభత్సుడు: బీభత్సమంటే – చూసేవారికి ఒళ్లు జలదరించేలా చేసే స్థితి. యుద్ధరంగంలో అర్జునుడు శత్రువుల్ని చీల్చిచెండాడినప్పుడు అటువంటి దృశ్యాలను సృష్టిస్తాడు. తద్వారా వీలైనంత తక్కువ జనప్రాణ నష్టంతో త్వరగా యుద్ధం ముగించాలన్నది అతని ఆలోచన. భయపడి అన్నా పారిపోతారని. విచిత్రం చూడండి.. పేరు భీభత్స. ఆలోచన సత్త్వం. అందుకే అతడు బీభత్సుడయ్యాడు.

7.విజయుడు: ఎంతటి బలవంతులు తనను ఎదిరించినా, యుద్ధంలో జయాన్ని సాధించగలడు. అందుకే అందరూ అర్జునుణ్ని విజయుడంటారు. యుద్ధంలో ఎక్కడా అర్జునుడు పరాజయం పొందలేదు భీష్ముడు బ్రతికి ఉన్నతం కాలం.

8.జిష్ణుడు: తాను చూస్తుండగా యుద్ధంలో ఎవరైనా ధర్మరాజు శరీరానికి గాయం కలిగిస్తే, వాళ్లను హతమారుస్తాడు. అది అన్నగారి పట్ల తనకున్న ప్రేమ, గౌరవం వల్ల పెట్టుకున్న నియమం. కనుక తాను జిష్ణుడనని అర్జునుడే చెప్పాడు.

9.సవ్యసాచి: యుద్ధరంగంలో ఏ చేతితోనైనా అల్లెతాటిని లాగగలడు. కానీ ఆ లాగడంలో ఎడమచేతి వాటం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి సవ్యసాచిగా అర్జునుడు ప్రసిద్ధుడయ్యాడు.

10.ధనంజయుడు: భూమినంతటినీ జయించి పరాజితులైన రాజుల నుంచి అపారమైన ధనం పొందడం వల్ల ధనంజయుడయ్యాడు.

ఇక పదకొండో పేరు కృష్ణుడు. అవును.. మీరు వింటోంది నిజమే! ఖాండవ వన దహన సమయంలో శివుడు, బ్రహ్మ ప్రత్యక్షమై అర్జునుడికి ‘కృష్ణుడు’ అనే నామధేయాన్ని ప్రసాదించి దివ్యాస్త్రాలు ఇచ్చారు. ఎందుకంటే అర్జునుడు శ్రీకృష్ణుడికి బహిఃప్రాణం ఒక రకంగా. శ్రీకృష్ణుడు ఈ బంధాలన్నింటికీ అతీతుడన్నది వేరే విషయం.

నర, నారాయణ తత్వం విషైకంగా చూస్తే ఈ మాట నిజమే. అర్జునుడికి కృష్ణ అనే పేరు తగినదే. కాకపోతే.. మిగతా పది పేర్ల లాగా ఈ పేరు పెద్దగా ప్రసిద్ధి చెందలేదు.

ఇలా నారాయణుడి నామ సహస్రం మధ్యలో నరుడి నామ దశకాన్ని తలుచుకుంటం అవశ్యం. మరొక రకంగా చూస్తే..

ఆ విచిత్రమేమిటంటే..

భీష్మాచార్యుడు ధర్మదేవత ఎదురుగ్గా నరుడికి శ్రీవిష్ణు సహస్రనామం బోధిస్తున్న సమయానికి కొన్ని వారాల క్రితం..

కురుక్షేత్రం మహాభారతం యుద్ధానికి సమాయత్తమౌతోంది. ఉభయ సేనలు రణభూమిలో నిలిచి ఉన్నాయి. ధృతరాష్ట్ర ఉవాచ, దానికి సమాధానంగా సంజయ ఉవాచ, దుర్యోధనుడు ద్రోణుడిని చేరి ఉభయ సేనల శక్తి సామర్థ్యాలను అంచనా కట్టి వివరించటము, శంఖ నాదాలు, ధర్మజుడు పెద్దల ఆశీర్వచనాలు గైకొని యుద్ధం సన్నద్ధతను వెల్లడించటం, తమ పక్షాన ధర్మం లేదనుకుంటే తమ వైపు ఉన్న సేనలు ఆఖరి అవకాశంగా కౌరవ పక్షానికి మారవచ్చని చెప్పటం, అలాగే తమ వైపు ధర్మం ఉందని నమ్మితే ఆఖరి అవకాశంగా కౌరవ పక్షం నుంచీ తమ వైపు రావచ్చని ఆహ్వానం పలకటం, యుయుత్సుడు పాణ్డు పుత్రుల పక్షానికి రావటం అన్నీ జరిగాయి.

అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణునితో తమ రథాన్ని ఉభయ సేనలు సరిగ్గా కనపడే స్థానానికి తీసుకుని పొమ్మని అర్థిస్తాడు. సేనలను చూస్తాడు. బంధుమిత్రులను కాంచుతాడు. వ్యామోహానికి లోనవుతాడు. బుద్ధి నశించి విషాదయోగంలో పడతాడు. యుద్ధాన్ని వదిలేసి సన్యసిస్తానని, ఈ హింసను చేయటం తన వల్ల కాదని తర్కంతో వాదిస్తాడు. దాన్ని తర్కంతోనే భేదించి, బుద్ధియోగాన్ని బోధిస్తూ సామాన్య, విశేష ధర్మాలను చర్చకు పెడతాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆపైన ధర్మ సూక్ష్మాలు తెలియజెప్తాడు.

అక్కడకు సాఙ్ఖ్య యోగం ముగుస్తుంది.

తర్వాత ఈశ్వరార్పణ బుద్ధితో కర్మనలనెలా చేయాలి అని తెలియజెప్పే కర్మయోగం.

యజ్ఞార్థాత్ కర్మణోఽన్యత్ర లోకోఽయం కర్మబంధనః।
తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర॥3.9॥ – భగవద్గీత నుంచీ.

చేయవలసిన కర్మలను (పనులను) ఒక యజ్ఞం లాగా, భగవత్ అర్పితంగా చేయాలి, లేదా, ఆ పనులు మనలను ఈ జగత్తులో కర్మబంధములలో కట్టివేస్తాయి. కాబట్టి, ఓ కుంతీ పుత్రుడా, నీకు నిర్దేశింపబడిన విధులను, వాటి ఫలితములపై ఆసక్తి లేకుండా, ఈశ్వర తృప్తి కోసం నిర్వర్తించుము.

అంటే చేయవలసిన కర్మలను ఒక యజ్ఞం లాగా చేయాలి. అప్పుడే దానికి చెందిన ఫలితము భగవదనుగ్రహం రూపంలో లభిస్తుంది (శ్రీమహావిష్ణుః  ప్రీత్యర్థే సహస్రనామ జపే వినియోగః ధృవుని కథ దగ్గర చూడండి – 9వ ఎపిసోడ్). కాకుంటే మనం కేవలం ఆ ఫలితం పొందటం కోసమే కర్మలను చేయకూడదు.

అర్జునుడు చివరకు యుద్ధానికి సమాయత్తమైనది వేరే విషయం.

ఒక్కసారి కాలంలో మరలా 1,50,36,00,000 సంవత్సరాలు వెనక్కి ప్రయాణిద్దాము.

అక్కడ వరాహావతార విషైకంగా..

కర్మ? భూమిని రక్షించటం.

దానిని వరాహమూర్తిగా అవతరించిన భగవానుడు ఏ విధమైన వికారాలకూ లోనవకుండా నిర్వర్తించి, ఆ పైన వేదాలను కాపాడి మనకు ఆదర్శమైనాడు. ఒక వరాహ రూపమే చేయగలిగినప్పుడు కర్మను, నా సృష్టి అయిన మీరు ఎందుకు కర్మను ఒక యజ్ఞం లాగా ఎందుకు చేయలేరు అనే భావన మన ముందుంచాడు యఙ్ఞవరాహస్వామి. అందుకే మనం కర్తవ్య నిర్వహణలో ఎన్నడూ వెనక్కి తగ్గరాదు. తండ్రి నేను ఇది చేశాను అని మనకు దారి చూపిస్తే బిడ్డలు అంతకు మించిన విధంగా చేయాలి కదా!

ఆ యజ్ఞార్థం జరిగిన చర్యలే వషట్కారః అన్న నామానికి అసలైన నిర్వచనం. అందుకే శ్లోకరూపంలో చెప్పబడింది.

Cosmic wit. వైశ్విక చమత్కారం. జీవులలో కర్మాచరణకు కావలసిన శక్తిగా నిలిచి, ఆ యజ్ఞం నిరాటంకంగా జరిగేందుకు దోహద పడుతున్న శక్తి స్వరూపమే వషట్కారః.

ఇది ఎల్లప్పుడూ.. అంటే భూత కాలమందు, వర్తమాన కాలమందు, భవిష్యత్ కాలమునందు నిరాటంకంగా జరుగుతూనే ఉంది కనుక ఆయన భూత, భవ్య, భవత్ప్రభుః కూడా. అంటే భూత భవిష్యత్, వర్తమానం కాలాలను తన అధీనంలో ఉంచుకున్నాడు కనుక భూత, భవ్య, భవత్ప్రభుః. ఉంచుకున్నాడు కనుకనే, ఆ శక్తి ఉంది కనుకనే, ఆయన కాలానికి ప్రభువయ్యాడు. కాలస్వరూపుడయ్యాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here