తల్లివి నీవే తండ్రివి నీవే!-26

0
8

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

ప్రహ్లాద నారదమ్

యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః।

తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ॥ (భగవద్గీత 18.78)

(యోగీశ్వరః అనేది పాఠాన్తరమ్)

యత్ర — ఎక్కడైతే

యోగ-ఈశ్వరః — యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడు

కృష్ణః — శ్రీ కృష్ణ

యత్ర — ఎక్కడైతే

పార్థః — అర్జునుడు, పృథ పుత్రుడు

ధనుః-ధరః — అత్యుత్తమ విలుకాడు (ధనుర్ధారియై)

తత్ర — అక్కడ

శ్రీః — సిరిసంపదలు

విజయః — విజయము

భూతిః — అభ్యుదయము

ధ్రువా — అనంతమైన

నీతిః — ధర్మము

మతిః-మమ — నా అభిప్రాయము (సఞ్జయ ఉవాచ)

ఎక్కడైతే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, ఎక్కడ ధనుర్ధారియైన (ఆ కాలంలో) లోకోన్నత వీరుడైన అర్జునుడు ఉంటారో, అక్కడ సిరి సంపదలు, విజయము, అభ్యుదయము, ధర్మము వర్ధిల్లుతాయి. ఇది నా అభిప్రాయము అని సంజయుడన్న మాట. ధృతరాష్ట్రుడు అడిగినప్పుడు.

సాకారంగా, మనకు కూతవేటు దూరాన ఉన్న కాలంలో భగవంతుడు (భగవచ్ఛక్తి) ఈ భూమి మీద తిరుగాడిన సందర్భం మనం చెప్పుకునే మహాభారత సమయంలో అంటే 5200 సంవత్సరాల క్రితం జరిగింది.

ఒక గంభీరమైన ప్రకటన చేస్తూ భగవద్గీత సంపూర్ణమౌతుంది.

ధృతరాష్ట్రుడు యుద్ధం యొక్క పరిణామం/ఫలితం పట్ల ఆందోళనతో ఉంటాడు అందుకు బదులుగా, రెండు సైన్యముల పరస్పర భౌతిక పరమైన సామర్థ్యముల లెక్కలు వ్యర్థమని సంజయుడు అతనికి చెప్తున్నాడు. ఈ జరుగబోయే యుద్ధంలో ఒక్కటే తీర్పు ఉంటుంది – విజయం ఎల్లప్పుడూ భగవంతుడు, అతని శుద్ధ భక్తుడు ఉన్న పక్షమే ఉంటుంది. వీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఉన్నవారికి (అంటే ధర్మపక్షాన ఉన్నవారికి) ఎల్లప్పుడూ శుభమే కలుగుతుంది.

భగవంతుడు సర్వ స్వతంత్రుడు. ఆయన లేదా ఆ విశ్వశక్తి స్వయం సమృద్ధిగల జగదీశ్వరుడు. అందుచేతనే ఆయన అర్చన-ఆరాధనలకు అత్యంత యోగ్యుడు.

న తత్సమశ్చాభ్యధికశ్చ దృశ్యతే (శేతాశ్వాతర ఉపనిషత్తు 6.8) – ఆయనకు సరితూగేవారు ఎవరూ లేరు. ఆయనకంటే గొప్పవారు ఎవరూ ఉండరు.

తన అసమానమైన మహిమను ప్రకటించటానికి తగిన వాహకం ఆయనకు కావాలి. ఆయనకు శరణాగతి చేసిన జీవాత్మ, భగవంతుని యశస్సుని ప్రకాశింపచేయటానికి అటువంటి ఒక చక్కటి వాహకంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా, ఎక్కడైతే సర్వోత్కృష్టుడైన పరమేశ్వరుడు, ఆయన యొక్క పరిపూర్ణ భక్తుడు ఉంటారో, పరమ సత్యము యొక్క తేజస్సు ఎల్లపుడూ అసత్యపు చీకటిని జయిస్తుంది. ఇంకే ఇతర ఫలితమూ ఉండజాలదు. There is no other result.

This is independent of all if’s and but’s.

ఇంతవరకూ నిర్గుణ బ్రహ్మ గురించి, నిరాకార విశ్వశక్తి గురించి రాగా, ఇకపైన యోగము, సాకార బ్రహ్మ గురించి వస్తుంది.

యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరః।

నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః॥

18. యోగః

యోగముచే పొందదగినవాడు కనుక భగవానుడు యోగః అని స్తుతించబడుతున్నాడు. సాధ్య వస్తువైనా భగవానుడు సాధన కూడా అయి ఉన్నాడు. సాధ్యసాధకుడైన ఆయన సాధకునికన్నా అన్యము కాలేడు. కనుక సాధ్య వస్తువైన భగవానుడు తనకన్నా అన్యం కాదని గ్రహించిన సాధకుడు ఇన్ద్రియ మనోబుద్ధులను నిగ్రహించి, యోగయుక్తుడై యోగీశ్వరుడైన భగవానునితో కలసి ఐక్యమయిపోవటమే యోగము.

నీటిలో కరిగిన పంచదార వలె.

అందువల్లనే భగవానుడు యోగః అనే పేరును సార్థకం చేసుకున్నాడు.

॥యోగః చిత్తవృత్తి నిరోధః॥

ఈ మాట పతఞ్జలి మహర్షి సూత్రము. దీనినిబట్టీ చూడగా భగవానుడు సాధన స్వరూపుడు.

॥సమత్వం యోగ ఉచ్యతే॥ అనే గీతావాక్యాన్ని బట్టీ తాను సాధ్యవస్తువు.

సత్యసన్ధతీర్థుల వారి ద్వైత వ్యాఖ్య ప్రకారం..

యుజ్యతే హృది యోగిభిః ధ్యాయత ఇతి యోగః – హృదయమునందు యోగులచే ధ్యానింపబడువాడు.

యునక్తి గుణాన్ స్వస్మిన్నితి వా – గుణములను తనయందు చేర్చుకొనువాడు.

భక్తానాం భవతరుణోపాయ – ఇతి వా

భక్తులను సంసారము దాటించుటకు ఉపాయమైనవాడు. అంటే తన యోగము ద్వారా భక్తులను సంసారమనెడి కడలిని దాటించువాడు యోగః.

యోగమంటే మనోవాక్కాయ కర్మలచే అద్వైత భావనను కలిగి ఉండటమే.

ఇక్కడ ప్రహ్లాద చరిత్రను చూచుట సూనృతము.

భగవద్గీత విభూతి యోగంలో శ్రీకృష్ణ భగవానుడు..

॥ప్రహ్లాద శ్చాస్మి దైత్యానాం॥

అంటాడు. అంటే దైత్యులలో నేను ప్రహ్లాదుడను.

ఎందుకామాట అన్నాడు? గొప్ప భక్తుడనా? అలాంటి భక్తుడేగా విదురుడు. మరి నరులలో నేను విదురుడిని అనలేదే?

ఎక్కడ తేడా ఉందంటే..

ప్రస్తుత వైవస్వత మన్వంతరంలో జరిగిన విషయం. దరిదాపుల 30 లక్షల సంవత్సరాల క్రితం.

హిరణ్యాక్షుని వధ తరువాత హిరణ్యకశిపుడు శ్రీహరిపై ఆగ్రహిస్తాడు. ఇక్కడో విచిత్రం ఉంటుంది. జీవాత్మల ద్వైదీభావనలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. ముందు వెళ్ళి హిరణ్యకశిపుడు తన తల్లి దితికి, వదినె గారైన ఋుషభానుకు గొప్పలు ఉపదేశం చేస్తాడు. ఆ నాటి కాలానికి చారిత్రకములైన విశేషాలను, ఆ నాటికి ఐతిహ్యములను బోధిస్తూ, వాటి నుంచీ ఉదాహరణలు చెప్తూ శోకింపతగదు అని చెప్తాడు.

కానీ, బోధన బోధనే. స్వలక్షణం స్వలక్షణమే.

హిరణ్యకశిపుడు శ్రీమహావిష్ణువు మీద ప్రతీకార వాంఛతో రగిలిపోతాడు. ఆతనికి సహాయం చేశారనే నెపం మీద దేవతల మీద కూడా పగ పెంచుకుంటాడు. ముల్లోకాలను ఆక్రమించాలని, శ్రీహరి కోసం వదకాలని, ఆ పైన..

అందుకు తనకున్న బలం చాలదు కనుక తపస్సు చేయటానికి వెళ్తాడు. అప్పటికి అతని ధర్మపత్ని లీలావతి గర్భిణి. ఏడవ నెల. హిరణ్యకశిపుని తపస్సు ఎంతకాలం సాగుతుందో తెలియదు. అతని తీవ్రతను బట్టీ అది ఆధారపడి ఉంటుంది. ఈలోగా అతనికి సంతానం కలిగితే, ప్రత్యేకించి పుత్రుడుదయిస్తే, తండ్రి గారి బదులు ఇతను తమ పైకి దండెత్తి రావచ్చును. లేదా తన తండ్రికి ఏదైనా అయినా, ఆ పుత్రుడు రాక్షస రాజు కావచ్చు. అతడు అమిత బలశాలి కావచ్చు.

అసలే హిరణ్యకశిపుని చేత రెచ్చగొట్టబడిన దైత్యులు అప్పుడే తమ చేతనైనంతలో అలజడి సృష్టిస్తున్నారు. అందు చేత ఆ హిరణ్యకశిపుని కుమారుని వధిస్తే తమకు భవిష్యత్ లో సమస్య రాకుండా ఉంటుందని ఆలోచనతో అదితి కుమారుడైన ఇంద్రుడు లీలావతిని బలవంతంగా తీసుకుని వెళతాడు. ఆమె మహాపతివ్రత.

కారణమేదైనా శ్రీహరి ధర్మపక్షమున ఉంటాడని తెలసినా, ఇంద్రుడు తన అహంకారముతో చేసిన తప్పుడు పని ఇది. గర్భిణీ స్త్రీని బలవంతముగా స్వంత వారికి దూరంగా తీసుకుని వెళ్ళటం ఒక తప్పు అయితే, ఆమెకు పుట్టబోయే శిసువును చంపాలనుకోవటం ఘోరం. ఇంద్రుడు తప్పు చేస్తున్నాడు. దానిని ఆపటం ఇతర దేవతల వల్ల కాదు.

ఇక అతనిని ఆపగలిగేది బ్రహ్మ గారు మాత్రమే. కానీ, ఇక్కడ రెండు పనులు జరగాలి. ఒకటి హిరణ్యకశిపుని వధ జరగాలి. ఎంత తన తల్లి, వదినె గార్లతో తత్వం మాట్లాడినా ఆ దైత్య రాజు వైదిక ద్వేషియే. ఎందరో తపస్వుల యఙ్ఞయాగాదులను ధ్వంసం చేశాడు. ఎందరో మునులను, ఋుషులను చంపాడు. రాక్షసులు చెలరేగిపోవటానికి కారకుడు కూడా. అతని అండ చూసుకుని వారు చేసే ఆగడాలు అన్నీ ఇన్నీ కాదు. కనుక భవిష్యత్ లో అయినా ఆ పని జరగాలి. అందుకు ఒక ప్రత్యేకమైన ఘటన జరగాలి. అలాంటి వాటిని నిర్వహించాలంటే సమ మనస్కుడు, ధర్మపరుడు, త్రిగుణాలకు అతీతుడు అయి ఉండాలి.

ఇంద్రుడు ప్రస్తుతం తాము గుణావేశుడై ఉన్నాడు. దేవతలకు లొంగడు. బ్రహ్మగారు సృష్టి కార్యంలో. అందుకు అవసరమైనది రజోగుణం. శ్రీమహావిష్ణువు పర దేవత. కనుక ఇది ఆయన పని కాదు. ఇక ఇలాంటివి సాదించటానికి మహానుభావుడైన నారద ముని కంటే యోగ్యులు ఎవరు ఉంటారు?

అంతే! వెంటనే ఇంద్రునికి అడ్డుగా నిలచాడు. నారదమునిని దాటి వెళ్ళే సాహసం ఇంద్రుడు చేయలేడు. కారణాలు విదితమే. నారద ముని ఇంద్రునికి హితోపదేశం చేసి, ఈ రాబోయే శిశువు వల్ల దేవతలకు ముప్పు ఉండదని తెలియజెప్పాడు. పైగా ఇతని వల్లే హిరణ్యకశిపుని కథ ముగింపు కూడా జరుగుతుందని హామీ ఇస్తాడు. దేవతల రేడు లీలావతిని నారదమునికి అప్పగిస్తాడు.

వెనుక తరుముకు వస్తున్న రాక్షసులకు నారదముని లీలావతి మీద దేవతల దాడులు ఇక మీదట కూడా జరుగవచ్చని (వారు కూడా జీవాత్మలేయ – త్రిగుణాలకు అతీతులు కారు), కనుక ఆమెను తానే స్వయంగా కాపాడతానని చెప్పి ఆ నిండు చూలాలిని తన ఆశ్రమానికి తీసుకుని వెళతాడు. అక్కడ ఆమెకు సంరక్షణ చేస్తాడు. భర్త దూరంగా ఉన్నాడు. శత్రువులు ఏక్షణానైనా మీదకు రావచ్చు. శిశువుకు హాని తలపెట్టవచ్చు. అందువల్ల లీలావతి భయపడుతూ, వేదన అనుభవిస్తూ ఉంటుంది.

ఆమెను ఊరడిస్తూ, ధైర్యం చెప్తూ నారదమహర్షి ఆమెకు భక్తిని బోధిస్తాడు. శ్రీహరి లీలలను బోధిస్తాడు. తన గత జన్మలో (కల్పాల క్రితం మాట అది) సేవ చేసిన యోగి పుంగవుల ద్వారా తెలుసుకొనిన ఆ నారాయణుని కథమృతాన్ని అందజేస్తాడు. ఆ కథలను గర్భస్థ శిశువు కూడా వింటాడు.

కాలం గడుస్తుంది. లీలావతి పుత్రుడికి జన్మనిస్తుంది. అతను పుట్టుకతోనే దివ్య తేజస్సును కలిగి ఉంటాడు. ఇతర శిశువులకు భిన్నంగా అత్యంత శాంత తత్వాన్ని కనబరుస్తాడు. నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తున్నట్లు పెదవులు కనీ కనిపించకుండా కదలుస్తూ ఉంటాడు. ఆ శ్రీహరి లీలలను తలచుకుంటూ నిరంతరం ఆనందంలో తేలియాడుతుంటాడు. అందుకే అతనికి ప్రహ్లాదుడు అనే పేరు వచ్చింది.

ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు కనుకనో, నిరంతరం తన నామస్మరణ, లీలాస్మరణం చేస్తున్నాడని అతనిని ఆపదల నుంచీ, మృత్యుముఖం నుంచీ రక్షించలేదు శ్రీమన్నారాయణుడు.

జన్మతః దైత్యుడైనా ఆ బాలుడు బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు. మరి నారద మహర్షి ఆశ్రమంలో జన్మించటమే కాకుండా తనను ఉద్దేశ్యించి మరీ ఆ మహానుభావుడు నేర్పిన విద్యను గరిపినవాడాయే!

అందుకే అతనికి శారీరక స్పృహ ఉండదు. తానే కాదు, చరాచర-గోచరాగోచర సృష్టిలో ప్రతి అణువూ శ్రీహరి అంశయే అని ఎఱిగిన వాడు. అతనికి రాతికి, ఎదుట ఉన్న జీవులకు, శ్రీహరికి తేడా ఉండేది కాదు. తనలోనే ఆ శ్రీహరి ఉన్నాడని, తాను కూడా ఆ నారాయణునిలో భాగమనే తలపులో ఉంటాడు. అంటే ప్రహ్లాదుడు శ్రీహరిలో భాగము.

విశ్వమ్!

అందులో భాగమే.

అంటే ప్రహ్లాదుడికి ఏమి జరిగినా అది నారాయణుడికి జరిగినట్లే. అంటే ప్రహ్లాదుడికి కష్టం అంటే అది స్వయంగా శ్రీహరికేయవచ్చిన కష్టము. అందుకే క్షణమాలస్యం చేయకుండా ఆ బాలకుని రక్షిస్తాడు శ్రీమహావిష్ణువు.

అంతటి వాడు కనుకనే “ప్రహ్లాద శ్చాస్మి దైత్యానాం” అంటాడు గీతాచార్యుడు.

<<<సాధ్య వస్తువైన భగవానుడు తనకన్నా అన్యం కాదని గ్రహించిన సాధకుడు ఇన్ద్రియ మనోబుద్ధులను నిగ్రహించి, యోగయుక్తుడై యోగీశ్వరుడైన భగవానునితో కలసి ఐక్యమయిపోవటమే యోగము.>>>

అలా సాధ్యుడైన భగవానుడు తనకన్నా అన్యం కాదని గ్రహించాడు ప్రహ్లాదుడు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఎల్లప్పుడూ నిగ్రహంలో ఉండేవి. యోగయుక్తుడైన ఆ భగవానుడితో నిమగ్నమై ఉండేవాడు.

అదే యోగము.

ఆ యోగమునకు అలవాలమైన వాడే యోగః.

ప్రహ్లాదునికి నారద మహర్షి బోధించిన మన్త్రము నారాయణ మన్త్రము.

ఏడు నెలలు నిండి ఎనిమిదవ నెల అందుకు సంకేతము. అష్టాక్షరి. తొమ్మిది నెలలు ముగిసి, పదవ నెలలో జన్మిస్తాడు ప్రహ్లాదుడు.

ఆ మంత్రం, దాని అర్థ పరమార్థాలు తెలిసిన వాడు కనుకనే (ప్రహ్లాదుడికి అర్థం కాలేదు. అర్థ సంపూర్ణం అయినది) ప్రహ్లాదుడు యోగి అయ్యాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here