తల్లివి నీవే తండ్రివి నీవే!-27

0
10

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

నిరాకార సాకారమ్

పత్రం పుష్పం ఫలం తోయం

యో మే భక్త్యా ప్రయచ్ఛతి।

తదహం భక్త్యుపహృతమ్

అశ్నామి ప్రయతాత్మనః॥

భగవద్గీతలో ప్రధానంగా నాలుగు మోక్ష తత్వాలు/మార్గాలు చెప్పబడ్డాయి.

  1. సాంఖ్యము
  2. కర్మ
  3. జ్ఞాన
  4. భక్తి

ఈ నాలుగు తత్వాలను అనుసరించటం ద్వారా జీవులు భగవంతుని చేరగలరు.

వాటిలో ఏ మార్గాన్ని అనుసరించాలి అన్నదాని మీద ఒక్కొక్కరికి ఒక్కొక్కరకమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరికి వారు వారికి చేతనైన విధంగా అర్థం చేసుకున్నారు. మరి సంపూర్ణంగా ఏ మార్గమో తెలసినదెవ్వరికి? అదే అసలు మార్గము. భక్తియోగము గొప్పదని చెప్తారు. అన్నిటికన్నా సులభమైన మార్గం అది. ప్రహ్లాదుడు ఉదాహరణ.

సులభమైనది జనాలు త్వరగా గ్రహించరు. లేదా పట్టించుకోరు.

The world is full of obvious things which nobody by any chance ever observes – Sherlock Holmes.

భగవద్గీత ఏడవ, ఎనిమిదవ అధ్యాయాలలో (జ్ఞాన విజ్ఞాన యోగము, అక్షరబ్రహ్మ యోగము) శ్రీ కృష్ణ భగవానుడు యోగ ప్రాప్తికి, భక్తియే అన్నింటికన్నా సులువైన మార్గమని, భక్తియే అత్యున్నత యోగ విధానమని ప్రకటించాడు. తొమ్మిదవ అధ్యాయమైన రాజవిద్యా యోగంలో – విస్మయాన్ని కలిగించే, ఆరాధనా భావాన్ని, భక్తినీ ఉత్పన్నం చేసే – తన సర్వోత్కృష్ట మహిమలను గురించి చెప్పాడు.

తాను అర్జునుడి ముందు తన సాకార రూపంలో నిలబడి ఉన్నా, తాను ఒక సామాన్య మానవుడినే అని అపోహ పడవద్దని తెలియచేస్తున్నాడు. తాను ఏ విధంగా, తన ఈ భౌతిక శక్తిని ఆధీనంలో ఉంచుకొని, సృష్టి ప్రారంభంలో అనేకానేక జీవ రాశులను సృష్టించి, ప్రళయ సమయంలో తిరిగి వాటిని తనలోకే లయం చేసుకుంటాడో, తదుపరి సృష్టి చక్రంలో మరల వాటిని ఎలా వ్యక్తపరుస్తాడో, వివరిస్తాడు. అంతటా బ్రహ్మాండంగా వీచే గాలి కూడా ఆకాశంలోనే ఎలా స్థితమై ఉంటుందో, అలాగే సమస్త జీవ రాశులూ ఆయన యందే నివసిస్తూ ఉంటాయి. అయినా, తన దివ్య యోగ మాయా శక్తి ద్వారా, ఆయన తటస్థంగా, నిర్లిప్తంగా, ఈ కార్యక్రమాలకు కేవలం సాక్షిగా, అన్నీ గమనిస్తూ ఉండిపోతాడు.

సనాతన ధర్మంలోని ఎందరో దేవుళ్ళ, దేవతల అయోమయాన్ని శ్రీ కృష్ణుడు ఇక్కడ ఆరాధనా విషయముగా కేవలం ఒకే భగవంతుడు ఉంటాడు, మిగిలినవన్నీ ఆయా సందర్భాలు బట్టీ వచ్చిన విశ్వశక్తి యొక్క ఇతర రూపాలు అని వివరించటం ద్వారా పరిష్కరిస్తున్నాడు. ఆయనే లక్ష్యము, ఆధారము, ఆశ్రయము. సర్వ భూతములకు నిజమైన స్నేహితుడు. ఆయనే యోగము, ఆయనే యోగి. యోగవిదులకు నేత.

వేదాలలో పేర్కొనబడిన కర్మ కాండల పట్ల ఆసక్తి ఉన్నవారు స్వర్గాది లోకాలను పొందుతారు. వారి పుణ్య ఫలం క్షయం అయిపోయిన తరువాత తిరిగి మర్త్యలోకానికి చేరుకుంటారు. కానీ, ఆ పరమేశ్వరుని పట్ల అనన్య భక్తితో నిమగ్నమై ఉన్నవారు ఆయన పరంధామమునకే చేరుకుంటారు. ఈ విధంగా శ్రీ కృష్ణుడు తన పట్ల ఉండే అనన్య భక్తి యొక్క సర్వోన్నత శ్రేష్ఠతను విశదీకరించాడు.

ఇటువంటి భక్తిలో, మన దగ్గర ఉన్నదంతా ఆయనకే సమర్పించి, ప్రతీదీ ఆయనకోసమే చేస్తూ, మనము భగవంతుని చిత్తముతో సంపూర్ణంగా ఏకమై నివసించాలి (యోగము). ఇటువంటి స్వచ్ఛమైన పవిత్రమైన భక్తిచే, మనము కర్మ బంధాలనుండి విడిపింపబడి, భగవంతునితో ఆధ్యాత్మిక ఏకత్వం పొందుతాము. అలా పొందగలిగేవారు యోగవిదులు. వారి అందరినీ నడిపించువాడు, వారికి మార్గము అయిన వాడు, వారి గమ్యం స్థానము అయిన వాడు యోగవిదాం నేతా.

అలాగే తను ఒకరి పట్ల అనుకూలంగా, మరొకరి పట్ల ప్రతికూలంగా ఉండను అని చెప్తాను. ఆయన సమస్త ప్రాణుల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడు. పరమ పాపిష్ఠి వారు (అజామీళుడు) అయినా సరే ఆయనను ఆశ్రయిస్తే, ఆయన వారిని ఆహ్వానించి, స్వీకరించి వారిని శీఘ్రముగా పుణ్యాత్ములుగా, పవిత్రులుగా తీర్చిదిద్దుతాడు. తన భక్తులు ఎన్నటికీ నశింపరు అని ఆయన హామీ ఇస్తున్నాడు.

ఆయన వారి యందే స్థితమై ఉండి, వారికి లేనివి సమకూర్చి పెడతాడు. వారికి ఉన్నవాటిని సంరక్షిస్తాడు. అందుకే, మనం సర్వదా ఆయనను స్మరించాలి, ఆరాధించాలి, మన మనస్సు-శరీరమును ఆయనకు సమర్పించాలి, ఆయన్నే సర్వోన్నత లక్ష్యంగా చేసుకోవాలి.

సమోఽహం సర్వభూతేషు న మే ద్వేష్యోఽస్తి న ప్రియః।

యే భజంతి తు మాం భక్త్యామయి తే తేషు చాప్యహమ్।। (భగవద్గీత 9.29)

నేను సర్వ ప్రాణుల యందు సమత్వ బుద్ధితో ఉంటాను. నేను ఎవరి పట్ల పక్షపాతం చూపను. విరోధ భావం తో ఉండను. కానీ, ప్రేమతో నన్ను ఆరాధించే భక్తులు నాయందే వారు నివసిస్తున్నారని ఎరుగుదురు (వ్యాపించిన విశ్వమందు).

నారాయణాయ.

నేను వారి యందు నివసిస్తాను. ఈ విషయము వారికి తెలుసు.

శ్రీ కృష్ణ భగవానుడు దీనికి ముందు చెప్పిన శ్లోకం,

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే।

తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్।। (భగవద్గీత 9.23)

ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ, నా యందు అనన్య భక్తిలో నిమగ్నమై ఉన్న వారు, నా యందే సతతమూ మనస్సు నిలిపిన వారికి, వారికి లేనిదేదో అది సమకూర్చి పెడతాను. వారికి ఉన్నదాన్ని సంరక్షిస్తాడు. వారి బాధ్యత నేను తీసుకుంటాను.

పై శ్లోకం భగవంతుడు తన భక్తుల పట్ల పక్షపాతంతో ఉంటాడా అన్న సందేహాన్ని కలుగ చేస్తుంది. ఎందుకంటే, మిగతా అందరూ కర్మ సిద్ధాంతానికి లోబడి ఉంటే,

భగవంతుడు తన భక్తులను దాని నుండి విముక్తులను చేస్తాను అని చెప్పాడు. పైగా వారి సమస్త బాధ్యతా తనదే అని కూడా చెప్పాడు. ఇది ఆయన పక్షపాత దోషానికి సూచిక కాదా?

శ్రీ కృష్ణ భగవానుడు ఈ సందేహ నివృత్తి చేయాలనే ఉద్దేశంతో, ఈ శ్లోకాన్ని (9.29) ‘సమోఽహం’ అన్న పదంతో మొదలు పెడుతున్నాడు. ‘నేను అందరి పట్ల సమంగా ఉంటాను. నా దగ్గర అందరికీ సమానంగా వర్తించే చట్టం ఉంది, దాని పరంగానే నేను నా కృపని ప్రసాదిస్తాను’ అని.

ఈ సూత్రం, ఇంతకు క్రితం 4.11వ శ్లోకంలో చెప్పబడింది:

యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్।

మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః॥

‘నాకు ఏ ప్రకారంగా మనుజులు శరణాగతి చేస్తారో, నేను వారికి ఆ విధంగానే ప్రతిస్పందిస్తాను. అందరూ నా మార్గాన్ని అనుసరించాల్సిందే’.

This is about Laws of the Universe. Everything and everyone is governed by the laws of universe. They act the same in any frame of reference, at any point of time, and at any point in the space. There are exceptions like singularities. But they’re dealt with in a special manner by the universal force. Just that we cannot comprehend it.

Doesn’t mean it doesn’t happen or occur. Gravity existed before Newton had his Apple-concussion. Just that none talked about it.

కానీ, సంకర్షణ అన్నది ఆ శక్తే. దాని గురించి మొల్ల (తన రామాయణంలో పరోక్షంగా చెప్పింది. మహర్షులు ఆ శక్తిని దర్శించే వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ నామాలను అందించారు.

‘అందరూ నా మార్గాన్ని అనుసరించాల్సిందే’.

దీనిని ఈవిధంగా అవగతం చేసుకోవాలి.

వారు ఆయన ఓ భాగమే అని అవగాహన కలిగి ఉన్నారు కనుక, ఆయన గురించి ఆయన ఎలా శ్రద్ధవహిస్తాడో ఈ భక్తుల గురించి కూడా ఆయనే చూసుకుంటాడు. అంతే తప్ప పక్షపాతం లేదు.

20. ప్రధాన పురుషేశ్వరః

ప్రధాన అంటే ప్రకృతి.

పురుష అంటే జీవుడు.

ఈశ్వరః అంటే..

సర్వులనూ పాలించి పోషించువాడు. అన్నింటిపై సకలాధిపత్యము గలవాడు. మరే విధమైన సహాయము, ప్రమేయము లేకుండా, ఇచ్ఛామాత్రముగా, లీలామాత్రముగా ఏదైనా చేయగలవాడు.

అలాంటి వాడు ఎవ్వడు?

మనం చూశామా? విన్నామా? కన్నామా?

ము. ము. ము.

అంతే కాదు. ఆయన నడయాడిన నేలలో నడుస్తున్నాం. ఆ నేలలో పండిన పంటలు వాటినుండీ వచ్చే ఫలసాయాన్ని కూడా ఆస్వాదిస్తున్నాం. ఆయన పీల్చి వదిలిన గాలిలో ఏ వెయ్యోవంతో మనం పీల్చి ఉంటాం. ఆయన స్వర తరంగాలు అనంత వాయువుల్లో మిళితమైనా, వాటి ప్రభావాన్ని కాస్తో కూస్తో మనం ఈనాటికీ, ఇంకెన్నటికైనా అనుభవిస్తూనే ఉంటాం. ఏదో క్షణాలలో మన చెవులనో, శరీరాన్నో తాకే ఉంటాయి.

ఎవరాయన? మనకు అత్యంత దగ్గరగా ఉన్న, మనం కాకపోయినా మన పై తరాలలో లక్షల, కోట్ల సంవత్సరాల క్రితం కాకుండా… కాలంలో కూతవేటు దూరంలో కాల స్వరూపుడు నడయాడాడు. పలికాడు. ధర్మాన్ని ఆచరించాడు. ఉద్ధరించాడు. ఇప్పుడు మనం ఈ మాత్రం ఉండగలుగుతున్నాము అంటే అసలైన కారణం కూడా అయిన వాడు..

ఈశ్వరః పరమః కృష్ణః సచ్చితానంద విగ్రహః।

అనాదిరాది గోవిన్దః సర్వకారణ కారణమ్॥

శ్రీకృష్ణ భగవానుడు.

కృష్ణస్తు భగవాన్ స్వయం!

ఆ శ్రీకృష్ణ పరమాత్మయే ప్రధాన పురుషేశ్వరుడు.

అటు ప్రకృతి, ఇటు జీవుడు. రెండూ ఆయన సృష్టియే.

ప్రకృతి మాయ అంటుంది అద్వైతం. ప్రకృతి ఈశ్వరుడి సృష్టి అయినప్పుడు, మాయ కూడా ఆయన సృష్టి అయినప్పుడు.. ప్రకృతి మాయ అనటం అసంబద్ధం.

ఆ ప్రకృతిని, ఈ జీవులను సృష్టించి, పాలించి, పోషించువాడు విష్ణువే. అందుకే ఆయన ప్రధాన పురుషేశ్వరుడు.

ప్రకృతి బంధాల నుంచీ మనను అనగా జీవులను విడిపించి రక్షించేవాడు.

శ్వేతాశ్వతరోపనిషత్ చెప్పినట్లు..

॥ప్రధాన క్షేత్రఙ్ఞ పతిర్గుణేశః॥

ప్రకృతికి, పురుషునికి తానే ప్రభువు అని సూచించుట చేత ఆయన పరిమితుడని భావింపరాదు. ఆయన సర్వవ్యాపి అని నిరూపితమైనది.

ఇప్పటి దాకా నిరాకార నిర్గుణ బ్రహ్మము గురించి చెప్పాడు భీష్మ పితామహుడు.

చెప్పి కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ఇదంతా ఆయన ప్రమేయం లేకుండానే జరిగి పోతోంది.

నకులుడికి అనుమానం వచ్చింది. శ్రీకృష్ణ భగవానుని వైపు చూశాడు. ఆయన దృక్కులు భీష్మాచార్యుని మీదే ఉన్నాయి.

“పితామహా! సాక్షాత్ భగవత్ స్వరూపమే మన ముందు యదునందనుడి రూపంలో నిలచియుంటే, నీవు చెప్పిన భగవత్ గుణములన్నియు నిరాకార బ్రహ్మను సూచిస్తున్నాయేమిటి?” అని అడిగాడు.

“మాద్రీ పుత్రా! నిరాకార నిర్గుణ బ్రహ్మము, సాకార సగుణ బ్రహ్మము రెండూ మన కోసమే. ఇక పైన రాబోయే నామము సాకార రూపమే.” భీష్మాచార్యుడు సమాధానమిచ్చాడు.

విష్ణు సహస్రనామాలలో మొదటిసారిగా వచ్చే సాకార రూపం, నారసింహ అవతారం.

ఇది చాలా గుహ్యమైనది. చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే భగవత్తత్వం అవగతమౌతుంది. సాకార, సౌలభ్య పరబ్రహ్మ అవసరం తెలుస్తుంది.

॥గుహ్యాద్గుహ్యతరం॥

చాలా సులువుగా అనిపిస్తూనే, చాలా తికమక పెట్టే విషయం.

21. నారసింహవపుః

నరుని సింహమును బోలిన అవయువములు గలవాడు.

ఇక్కడ రెండు ప్రశ్నలు.

పైన సింహం క్రింద నరసరూపం. అంటే సింహపు శిరస్సు, నరుల మొండెము.

సింహపు మొండెము, నరుని శిరస్సు.

మనకు పైదే తెలుసు. అవతారం కూడా అలాగే వచ్చింది. ఎందుకు రెండవ రూపంలో అవతరించలేదు?

ప్రహ్లాదుని కాచుటకై శ్రీనారసింహావతారమును ధరించి అవతరించినవాడు. అభయమునొసగువాడు. మంగళ మూర్తి. శివః

ఇక్కడ గమనించాల్సిన ఒక విచిత్రం ఉంది.

నారసింహవపుః అనేది 21వ నామము. దానిని దర్శించినది ప్రహ్లాదుడు.

శ్రీమహావిష్ణువు దశావతారాలు ప్రఖ్యాతినొందినా, భాగవతం ప్రకారం 21 అవతారాలు దాల్చాడు. ఆ విధంగా 21 అనే సంఖ్య ప్రాముఖ్యం వహిస్తోంది.

అంతే కాకుండా ఇది శ్వేతవరాహ కల్పం. హిరణ్యాక్ష వధ. తదనంతరం హిరణ్యకశిపుని ఆగడాలు. ఆపైన నృసింహావతారం. మన కల్పంలో ఆవిర్భవించిన సాకారబ్రహ్మ కనుక మనకు విశేషం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here