తల్లివి నీవే తండ్రివి నీవే!-28

2
12

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

సాకార నిరాకారం

తవ కర కమలవరే నఖమద్భుత శృంగం
దళిత హిరణ్యకశిపు తనుభృంగం
కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే

ఓ కేశవా! నరహరి రూపాన్ని ధరించిన ఓ శ్రీహరీ! నీవు భృంగము వంటి హిరణ్యకశిపుని దేహాన్ని నీ కరకమలముల యొక్క అద్భుతమగు నఖములతో చీల్చివేసితివి. అట్టి నీకు జయము జయము.

ధర్మవినాశనం జరుగుతున్నప్పుడు దాన్ని పరిరక్షించడం కోసం జగత్తులో భగవదవతారం ప్రకటితమవుతుంది. భక్త రక్షణే లక్ష్యంగా, దానిలో దుష్టశిక్షణం ఒక అంశంగా జరిగిన అవతారమే శ్రీ నృసింహ అవతారం.

“ఇప్పుడే నా ఖడ్గంతో నీ శిరస్సును ఖండిస్తాను. ఏ విధంగా నీ శ్రీహరి నిన్ను రక్షిస్తాడో చూస్తాను,” అని క్రోధావేశంతో హిరణ్యకశిపుడు పలికినప్పుడు దానికి సమాధానంగా భగవంతుడు నరహరి అవతారుడై ఆవిర్భవించాడు.

ఎలా? ఎందుకు?

ఇక్కడో విచిత్రం ఉంది. ఈ నృసింహావతారం విష్ణుః అనే నామమును ఆధారం చేసుకుని ఉద్భవించిన అవతారం. అది ఎలాగో ప్రహ్లాద చరిత్రము ద్వారా తెలుసుకుందాము.

లీలావతిని నారదుడు తనతో తీసుకుపోయాడు. ఆదరించాడు. “నారాయణ.. నారాయణ” అనే అష్టాక్షరీ మంత్రం ప్రహ్లాదుడి చెవిన అమ్మ కడుపున ఉండగానే పడింది. తత్వం వంట బట్టింది. అందుకనే పుట్టుకతోనే ప్రహ్లాదుడు విష్ణుభక్తుడయ్యాడు.

గమనిక: ప్రహ్లాద చరిత్ర జరిగినది మనముంటున్న శ్వేతవరాహ కల్పంలోని వైవస్వత మన్వంతరంలోని 4వ మహాయుగంలో. ఆ లెక్కన చూస్తే కనీసం 10,75,00,000 సంవత్సరాల కాలం క్రితం జరిగింది. అదే ఈ మహాయుగంలో జరిగి ఉంటే అది 30 లక్షల సంవత్సరాల క్రితమనుకోవచ్చు.

తపస్సు పూర్తిచేసి మృత్యువు తేలికగా తన దరి చేరకుండా వరం కూడా పొందిన హిరణ్యకశిపునకు తిరిగి తన రాజ్యానికి రాగానే పుత్రోత్సాహం కలగక పోగా మనో వ్యాకులత మిగిలింది. తన శత్రువైన శ్రీహరి పేరును పదేపదే ప్రహ్లాదుడు జపించడం, ఆయననే శరణుకోరాలని చెప్పటం శరాఘాతంలా తగిలింది.

శుక్రాచార్యుని కుమారులైన చండా మార్కులను పిలిచి విద్యాబుద్దులను నేర్పించమని ప్రహ్లాదుని అప్పగించాడు. చండామార్కులు మొండి బాలలకు కూడా విద్య నేర్పటంలో నిష్ణాతులు. అయినా హిరణ్యకశిపుని ఆశ నెరవేరలేదు. ప్రహ్లాదుడు విష్ణునామ స్మరణ విడవలేదు.

రాక్షస రాజు కొడుకని కూడా చూడకుండా కఠినంగా దండించి అయినా విష్ణునామ స్మరణ మాన్పమని హెచ్చరించాడు. నయానాభయానా అన్నిరకములుగా చెప్పి చూశారు గురువులు. గురువులకే పాఠాలు చెప్పి తోటి శిష్యులను సహితం తనవైపుకి తిప్పుకున్నాడు ప్రహ్లాదుడు.

అది తెలసి తమకులంలో చెడపుట్టావని అన్నాడు హిరణ్యకశిపుడు. హరి నామాన్ని ఉచ్చరించకుండా ఉండటం కోసం ప్రహ్లాదుని కొడుకని చూడకుండా అనేక చిత్రహింసలు పెట్టించాడు.

కొండలపై నుండి తోయించాడు. బండరాళ్ళనెత్తించాడు. పృథ్వి! భూదేవి తల్లిలా కాచుకుంది దేవదేవుని ఆఙ్ఞ మీద.

ఎంతో ఎత్తుకు తీసుకుని వెళ్ళి సముద్రంలో పడవేయించాడు. అప్! లక్ష్మీదేవి పుట్టినిల్లు. సముద్రుడు కాపాడి బైటకు చేరేలా చేశాడు.

మంటలలో పడవేయమన్నాడు. అగ్ని! పునీతుడై బైటకు వచ్చాడు ప్రహ్లాదుడు. పుటం పెట్టిన బంగారంలా.

ఎంతో ఎత్తుకు తీసుకుని వెళ్ళి ఊపిరాడకుండా చేయాలని చూశారు. ఆ పరమాత్మయే తన హృదయంలో ఉండగా వాయువు ఇబ్బంది పెడతాడా? హాయిగా శ్వాస ఆడింది. ఆకాశం నుండీ క్రింద పడవేస్తే స్వయంగా శ్రీమన్నారాయణుడే వచ్చి తన చేతులతో పట్టుకుని కాపాడాడు.

తనకు దూరంగా సేవకుల చేత చేయిస్తుంటే వారు బాలకుడని, యువరాజు అని ప్రయత్నపూర్వకంగా వధించటం లేదని తలచి, స్వయంగా తల్లి లీలావతి చేతనే విషమిప్పించాడు. కాలకూటం. హాలాహలం మ్రింగిన శివుడు ఈ విషాన్ని హరించాడు శ్రీహరి మాట మీద.

ఏనుగుల చేత త్రొక్కించాడు. లక్ష్మీదేవి వాహనములు. మెడలో దండ వేసి, ఎత్తి తమ మీద కూర్చోబెట్టుకుని తిప్పాయి నగరమంతా.

సర్పాలతో కాటు వేయించాడు. అంతులేనన్ని పడగలు కలిగి, శ్రీమన్నారాయణుడి పాన్పు అయిన అనంతుడి అండ ఉండగా సర్పాలు ఏమి చేయగలవు?

కత్తులతో నరికించాడు. గదలతో మోదించాడు. కత్తులు విరిగి పోయాయి. గదలు పగిలి పోయాయి.

నందకపాణి, కమోదకీధరుడు అయిన గోవిందుడి అండ ఉన్న ప్రహ్లాదుడికి ఈ మామూలు ఆయుధములు ఒక లెక్కా?

విసిగి వేసారిన హిరణ్యకశిపుడు, చివరకు ప్రహ్లాదుని తన ఆంతరంగిక మందిరానికే రప్పించాడు.

ప్రహ్లాదుని లక్షణాలు..

ప్రహ్లాదుడు ఎల్లప్పుడు విష్ణువును తన చిత్తమునందు చేర్చుకుని ఇతర ఆలోచనలు అన్నీ వదిలేస్తాడు. సౌందర్యము, కులము, చదువు, ధనము సమృద్ధిగా ఉన్నా కూడా గర్వాన్ని దరిచేరనీయడు. గొప్ప వస్తువులు ఎన్నో అందుబాటులో ఉన్నా ఇంద్రియ వాంఛలకు లోనుకాడు. దివ్యమైన యౌవనమూ బలమూ అధికారములు అన్నీ ఉన్నా కామము, క్రోధాది అరిషడ్వర్గానికి లొంగడు. వ్యసనాలలో తగులుకోడు. లోకంలో కనబడేవీ, వినబడేవీ అయిన వస్తువులను వేటినీ కావాలని వాంఛించడు. సర్వకాల సర్వావస్థల యందు శ్రీహరి నామ స్మరణే!

ఆ రాక్షస రాకుమారుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ఎప్పటికీ వదలిపెట్టడు. అలాగే సుగుణాలు అన్నీ, ఎప్పటికీ విడిచిపెట్టకుండా, అతనిలో ప్రోగుపడి ఉంటాయి. ఇలా గొప్ప సద్గుణాలు కల ప్రహ్లాదుడు ఎప్పుడు సహజసిద్ధంగా భక్తితో భగవంతుడూ, ఆత్మలో వసించేవాడూ అయిన శ్రీమహావిష్ణువును ధ్యానిస్తూ ఆనందిస్తూ ఉండేవాడు. అతని హరి భక్తి నానాటికి అతిశయిస్తూ ఉండేది.

అలాంటి సుగుణాల గని వంటి ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని ఎదుట నిలుచున్నాడు.

ఇలా అన్నాడు హిరణ్యకశిపుడు: కుమారా ప్రహ్లాదా! చూస్తుంటే ఇదంతా నాకు వింతగా ఉంది. ఈలాంటి బుద్ధి నీ అంతట నీకే కలిగిందా? లేక పగవారు ఎవరైనా కలుగజేశారా? లేక నీ గురువులు రహస్యంగా నేర్పారా? ఆ విష్ణువు మన రాక్షసులకు ఎంతో ద్రోహం చేశాడో నీకు తెలుసు కదా! అతనిని కీర్తించకు, అతని పేరు కూడా తలచుకోకు.

ప్రహ్లాదుడు మిన్నకున్నాడు.

హిరణ్యకశిపుడు: ప్రహ్లాదా! దేవతలను పారదోలవయ్యా. లేకపోతే దేవతా విభులను పట్టి చావబాదటం కాని, సిద్ధులను బాగా వేధించటం కాని మునీశ్వరులను బాధించటం కాని, లేదా యక్షులు, కిన్నరులు, గంధర్వులు, పక్షి రాజులు, నాగరాజులను చంపటం కాని చెయ్యాలి. ఇలా చేయటం మన ధర్మం. అది మానేసి, హరి అంటూ గిరి అంటూ అజ్ఞానం అనే అంధకారంతో ఎందుకు మూర్ఖుడిలా చెడిపోతున్నావు. పరధర్మం కూడదు.

ప్రహ్లాదుడు: జీవుల స్వధర్మమే శ్రీహరి యందు భక్తి కలిగియుండుట తండ్రీ! జ్ఞానులు మోహం తొలగించుకొని భగవంతుని యందు ఏకాగ్ర భక్తి ప్రపత్తులతో ఉంటారు. అట్టి వారికి తమ పర భేదం అనే మాయా మోహం అంటదు. ఆ భగవంతుడు విష్ణుమూర్తికి నమస్కరిస్తున్నాను.

హిరణ్యకశిపుడు: చాలించు నీ ప్రేలాపాలు.

ప్రహ్లాదుడు: తాము వేరు, పరులు వేరు అనే మాయ అనే భ్రాంతిలో ఉంటారు అఙ్ఞానులు. సర్వాత్మకుడు అయిన భగవంతుడిని ఎంత తెలివితేటలూ, పాండిత్యం ఉపయోగించినా కూడా తెలుసుకోలేరు. ఆ విష్ణుమూర్తిని బ్రహ్మ వంటి వేద విజ్ఞాన ఖనులు కూడా సంపూర్తిగా తెలుసుకోలేని వారే. ఇక ఇతరులు సామాన్యులు ఆ పరాత్పరుడు అయిన విష్ణుమూర్తిని ఎలా దర్శించగలరు?

మందార మకరంద మాధుర్యమునఁ దేలు-
  మధుపంబు వోవునే మదనములకు?
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు-
  రాయంచ సనునె తరంగిణులకు?
లలిత రసాలపల్లవ ఖాదియై చొక్కు-
  కోయిల చేరునే కుటజములకుఁ?
బూర్ణేందు చంద్రికా స్ఫురితచకోరక-
  మరుగునే సాంద్ర నీహారములకు?
నంబుజోదర దివ్యపాదారవింద
చింతనామృతపానవిశేషమత్త
చిత్త మేరీతి నితరంబుఁ జేరనేర్చు?
వినుతగుణశీల! మాటలు వేయు నేల?
(ఆంధ్ర మహాభాగవతం – సప్తమ స్కంధం, 7.150)

మందార పూలలోని మకరందం త్రాగి మాధుర్యం అనుభవించే తుమ్మెద, ఉమ్మెత్త పూల కేసి పోతుందా? రాజహంస స్వచ్ఛమైన ఆకాశగంగా నదీ తరంగాలపై విహరిస్తుంది కాని వాగులు వంకలు దగ్గరకు వెళ్ళదు కదా? తీపి మామిడి చెట్ల లేత చిగుళ్ళు తిని పులకించిన కోయిల పాటలు పాడుతుంది తప్ప కొండ మల్లెల వైపు పోతుందా? చకోర పక్షి నిండు పున్నమి పండువెన్నెలలో విహరిస్తుంది కాని దట్టమైన మంచు తెరల వైపునకు వెళ్తుందా?

తండ్రీ చెప్పండి.

పద్మనాభుడైన విష్ణుమూర్తి దివ్యమైన పాదపద్మాలను ధ్యానించటం అనే అమృతం గ్రోలటంలో మాత్రమే నా మనసు పరవశించి ఆనందం పొందుతుంది. వెయ్యి మాటలు ఏల? హరిపాదాయత్త మైన నా చిత్తం ఇతర విషయాల పైకి ఏమాత్రం పోదు.

హిరణ్యకశిపుడు: నీవు నాకు శత్రువు తప్పించి కొడుకువు కావు. నిర్మలమైన రాక్షస కులం అను గంధపు తోటలో నీవు ముళ్ళ చెట్టులా పుట్టావు. ఎప్పుడూ రాక్షస కులాన్ని నాశనం చేస్తున్న విష్ణువును నుతిస్తున్నావు.

ప్రహ్లాదుడు: లోకంలో గుడ్డివాడికి వెన్నెల నిరుపయోగం. చెవిటివాడికి శంఖ ధ్వని వినబడదు. మూగవాడికి గ్రంథపఠనం సాధ్యపడదు. నపుంసకుడికి కాంత మీద కోరిక ఫలించదు. కృతఘ్నుులతో బంధుత్వం కుదరదు. బూడిదలో పోసిన హోమద్రవ్యాలు నిరుపయోగమైనవి. పిసినిగొట్టు వాడికి సంపద పనికి వచ్చేది కాదు. పందికి పన్నీరు వంటి సువాసనలు తెలియనే తెలియవు. అలాగే విష్ణు భక్తి లేని వారి జీవితాలు నిస్సారములైనవి, వ్యర్థములైనవి తండ్రీ!

హిరణ్యకశిపుడు కోపంతో హుంకరిస్తాడు. పాదములతో నేలను గట్టిగా తంతాడు. అగ్ని గోళాల వంటి కనులతో ప్రహ్లాదుని వైపు చూస్తాడు.

కానీ, ఆ బాలకుడు, నారద మహర్షి శిష్యుడు అయిన ప్రహ్లాదుడు..

కమలాక్షు నర్చించు కరములు కరములు-
  శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు-
  శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు-
  మధువైరిఁ దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు-
  పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి.
దేవదేవుని చింతించు దినము దినము
చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు
తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి.
(ఆంధ్ర మహాభాగవతం – సప్తమ స్కంధం, 7.169, 169.1)

నాన్న గారూ! కమలాల వంటి కన్నులు కల ఆ విష్ణుమూర్తిని పూజిస్తేనే అవి చేతులు. లేకపోతే చేతులు, చేతులు కావు. శ్రీపతి అయిన విష్ణుదేవుని స్తోత్రము చేస్తేనే నాలుక అనుటకు అర్హమైనది. కాకపోతే ఆ నాలుకకు సార్థకత లేదు. దేవతలను కాపాడే ఆ హరిని చూసేవి మాత్రమే చూపులు. ఇతరమైన చూపులకు విలువ లేదు. ఆదిశేషుని పానుపుగా కల ఆ నారాయణునకు మ్రొక్కేది మాత్రమే శిరస్సు. మిగిలిన శిరస్సులకు విలువ లేదు.

విష్ణు కథలు వినే చెవులే చెవులు. మధు అనే రాక్షసుని చంపిన హరి యందు లగ్నమైతేనే చిత్త మనవలెను. పరమ భగవంతుడైన ఆయనకు ప్రదక్షిణము చేసేవి మాత్రమే పాదాలు. మిగతావి పాదాలా? కావు కావు. పురుషోత్తము డైన ఆయనను భావించే బుద్ధే బుద్ధి. లేకపోతే అది సద్భుద్ధి అనిపించుకోదు. ఆ దేవాది దేవుడైన విష్ణుమూర్తిని తలచు దినమే సుదినము. చక్రాయుధం ధరించు ఆ నారాయణుని గాథలు విశదపరుచు చదువు మాత్రమే సరైన చదువు. భూదేవి భర్త అయిన గోవిందుని గురించి బోధించే వాడే గురువు. విష్ణుమూర్తిని సేవించ మని చెప్పే తండ్రే తండ్రి కాని ఇతరులు తండ్రులా? కాదు.

దేహి శరీరంలోని చేతులు, నాలుక, కళ్ళు, శిరస్సు, చెవులు, చిత్తం, పాదాలు, బుద్ధి ఒకటేమిటి? సమస్తమైన అవయవాలు విష్ణు భక్తిలో పరవశమై పవిత్రం కావలసిందే. లేకపోతే అతడు భగవంతుని విషయంలో కృతఘ్నుడే. ప్రతి రోజూ, ప్రతి చదువూ శ్రీ హరి స్మరణలతో పునీతం కావలసిందే. ప్రతి గురువూ, ప్రతి తండ్రీ నారాయణ భక్తిని బోధించాల్సిందే. అవును లోకైకరక్షాకరు డైన విష్ణుమూర్తికి అంకితం గాని దేనికి సార్థకత లేదు. ఇది గుర్తుంచుకోండి.

ఇలా విష్ణుభక్తి ఒకటే తరుణోపాయం అంటూ ప్రహ్లాదుడు నదురు బెదురు లేకుండా చెప్తున్న పలుకులు తండ్రి హిరణ్యకశిపుడికి వాడి ములుకులు లాగ నాటుకున్నాయి. అతను కోపంతో ఎగిరెగిరి పడుతున్నాడు. కణతలు అదురుతున్నాయి. పళ్ళతో పెదవులు కొరుకుతూ, ప్రహ్లాదుడి క్రూరంగా అసహ్యంతో చూస్తూ.. హిరణ్యకశిపుడు ఒక్కసారిగా వికటాట్టహాసం చేసాడు. చివాలున లేచి సింహాసనం మీద నుంచీ క్రిందికి ఉరికి వచ్చాడు. ఒరలో ఉన్న ఖడ్గాన్ని లాగి ఝళిపించి భక్తాగ్రేసరుడైన ప్రహ్లాడుడిని భయపెడుతూ ఇలా అన్నాడు.

“విష్ణువును ఆతని భృత్యునివలె తెగపొగడుతున్నావు. అసలు ఎక్కడ ఉంటాడు? ఏ విధంగా ఉంటాడు? ఏ రీతిగా తిరుగుతూ ఉంటాడు? ఏ పద్ధతిలో వస్తుంటాడు? ఊఁ చెప్పు. లేకపోతే నిన్నూ, నీ హరిని సంహరిస్తాను.”

అలా తండ్రి గద్దిస్తున్నప్పటికి పరమ హరిభక్తుడు అయిన ప్రహ్లాదుడు ఏ మాత్రం జంకలేదు. పైగా అమితమైన ఆనందంతో నిలువెల్లా పులకించిపోయాడు. ఆవగింజంత ఆగ్రహం కూడా లేకుండా, హృదయం నిండా హృషీకేశుడిని తలచుకుని నమస్కారాలు చేసాడు. ఆనందంగా ఉన్న బాలురకు సహజమైనట్లుగానే తన సంతోషంలో తాను అత్యంత విశ్వాసంతో నృత్యం చేస్తూ ఇలా పలికాడు.

కలఁ డంభోధిఁ, గలండు గాలిఁ, గలఁ డాకాశంబునం, గుంభినిం
గలఁ, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం
గలఁ, డోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింగవ్యక్తులం దంతటం
గలఁ, డీశుండు గలండు, తండ్రి! వెదకంగా నేల యీ యా యెడన్.
(ఆంధ్ర మహాభాగవతం – సప్తమ స్కంధం, 7.274)

“నాన్న గారూ! భగవంతుడు అయిన శ్రీమహావిష్ణువు లేని చోటు విశ్వములో ఎక్కడా లేదు. అంతట వ్యాపించియే ఉన్నాడు (విష్ణుః).”

శ్రీమహావిష్ణువు తన వ్యాపకత్వాన్ని చూపుతూ సృష్టి యావత్తూ తానై నిలిచాడా క్షణాన.

ప్రహ్లాదుడు చెప్పుకుంటూ పోతున్నాడు.

“నీటిలో, గాలిలో, ఆకాశంలో ఉన్నాడు. భూమిమీద ఉన్నాడు. అగ్నిలోను ఉన్నాడు. సర్వదిక్కులలోను ఆయన ఉన్నాడు.”

అందుకే అన్నిచోట్లా శ్రీమన్నారాయణుడు ప్రహ్లాదుని రక్షించాడు. సునాయాసంగా.

ప్రహ్లాదుడు కొనసాగిస్తున్నాడు.

“పగలు రాత్రి సమయాలలో ఉన్నాడు. సూర్యుడు , చంద్రుడు, ఆత్మ, ఓంకారం, త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, స్త్రీ పురుష నపుంసక అనే త్రిలింగ వ్యక్తులు అందరు ఇలా బ్రహ్మాది పిపీలక పర్యంతమందు ఆయన ఉన్నాడు. అట్టి సర్వ పూర్ణుడు, సర్వవ్యాపి, సర్వేశ్వరుడి కోసం ఎక్కడెక్కడో వెదకాల్సిన పనిలేదు. సర్వే, సర్వకాల సర్వావస్థలలోను ఉన్నడయ్యా!”

ఇందు గలఁ డందు లేఁ డని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెం దెందు వెదకి చూచిన
నందందే కలఁడు దానవాగ్రణి! వింటే.
(ఆంధ్ర మహాభాగవతం – సప్తమ స్కంధం, 7.275)

“ఓ హిరణ్యకశిప మహారాజా! శ్రీమహావిష్ణువు ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉండడు అని చెప్పడానికి లేదు. అయన సర్వోపగతుడు అంటే సర్వకాల సర్వావస్థల అన్నటి యందు ఉండే వాడు. ఈవిషయంలో ఏమాత్రం సందేహం అన్నది లేదు. అందుచేత ఎక్కడైనా సరే వెతికి చూడాలే కాని అక్కడే ఉంటాడయ్యా. రాక్షసరాజా!”

ఇప్పుడు శ్రీమన్నారాయణుడే తండ్రియన్న సంపూర్ణ భావనలో ఉన్నాడు. హిరణ్యకశిపుడు కేవలం రాక్షస రాజుగా మిగిలాడు.

తనకే ఎదురు చెప్తాడా అన్న ఆగ్రహంతో ఊగిపోతున్నాడు హిరణ్యకశిపుడు. అంచేత ‘హరి హరి అంటున్నావు ఎక్కడున్నాడ్రా చూపగలవా?’ అంటు బెదిరిస్తున్నాడు తండ్రి. కొడుకు ప్రహ్లాదుడు నదురు బెదురులేని అయిదేళ్ళ పిల్లాడు. తన బాల్యానికి తగినట్లు అలా చిరునవ్వులతో నటనలు చేస్తూ ‘సర్వోపగతుడు శ్రీహరి’ అని సమాధానం చెప్పాడు.

పోతన గారు ఇక్కడ తారాస్థాయికి చేరారు వారి భక్తిలో. అందుకే ఈ భాగాన్ని ఆంధ్ర మహాభాగవతం నుంచీ స్వీకరించాను.

ఆసరికే ఆ పరమభక్తుని మాట పొల్లుపోకుండా నారాయణుడు నరసింహరూపంలో విశ్వమంతా వ్యాపించి సిద్ధంగానే ఉన్నాడు.

గతంలో విష్ణుః అనే నామమునకు శ్రీరామాయణం నుంచీ వ్యాఖ్య చూశాము. ఇక్కడ ఆ హరి నారసింహ రూపంలో తన విష్ణుతత్వాన్ని చూపబోతున్నాడు.

ఈ విధంగా ప్రహ్లాదుడు “భగవంతుడు సర్వ నామ రూపధారులందు అంతట ఉన్నాడు.” అని చెప్తుంటే, హిరణ్యకశిపుడు “ఎక్కడా లేడు” అంటూ బెదిరిస్తున్నాడు.

అప్పుడు విష్ణుమూర్తి మహా మహిమాన్వితమైన నరసింహ రూపంతో సర్వ చరాచరము లన్నిటి యందు ఆవేశించి ఉన్నాడు.

భక్తుల సామర్థ్యాలు ఎలా ఉంటాయో, భక్తుల ప్రపత్తికి నారాయణుడు ఎంత బలంగా స్పందిస్తాడో, అతని సర్వ వ్యాపకతా శీలం, అచ్యుత శీలం ఎలాంటివో నిరూపించే ప్రహ్లాదుని కొరకు శ్రీహరి సాకారుడై భాసించాడు.

ఓజస్, సహస్ చూపుతూ వషట్కారుడై, భూత, వర్తమాన, భవిష్యత్ అనబడే కాలములను స్థంభింపజేస్తూ ఎచటి నుంచీ అయినా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.

ఇక హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు తన కొడుకు అన్న సంగతి మరచాడు. విశ్వ రూపుడైన ఆ హరిలో తాను భాగమేననీ, ఆయనే తాను అని, తాను ఆయనలోని వాడే అని ప్రహ్లాదుడు ఎఱిగి ఉన్నాడు. దాని వల్ల ఆ రక్కసునికి ఆ బాలకుడు విష్ణువు వలెనే కనిపించసాగాడు. అందుకే ఆగర్భ శత్రువులా చూస్తూ…

“డింభకా! పద్మాక్షుడు విష్ణుమూర్తి సర్వవ్యాపి అన్నిట ఉంటాడని ఇంత గట్టిగా చెప్తున్నావు. అయితే మరి ఈ స్తంభంలో చూపించగలవా ఆ చక్రం గిక్రం పట్టుకు తిరిగేవాణ్ణి,” అన్నాడు.

అందుకు ప్రహ్లాదుడు: ఆ విశ్వాత్ముడు విష్ణువు బ్రహ్మ దగ్గర నుండి గడ్డిపరక దాకా సమస్త ప్రపంచంలోనూ నిండి ఉన్నాడు. అటువంటప్పుడు, ఇంత పెద్ద స్తంభంలో ఎందుకు ఉండడు? ఈ స్తంభంలో పరంధాముడు ఉన్నాడు అనటంలో ఎటువంటి అనుమానమూ లేదు. నిస్సందేహంగా ఉన్నాడు. కావాలంటే ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తాడు కూడా.

మదోన్మత్తుడు అయి, ఆవేశంతో ఆ రాక్షస రాజు హిరణ్యకశిపుడు అరచేతితో, జీవకోటి చూడ శక్యం కాకుండా ఉన్నట్టి, భయంకరమైన కాంతులు వెదజల్లుతున్నట్టి, శ్రీ నరసింహస్వామి వారి ఆవిర్భావానికి సంరంభ పడుతున్నట్టి ఆ స్తంభాన్ని బలంగా చరిచాడు.

ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాణ వైరుండును, వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును, రోషానలజంఘన్యమాన విజ్ఞాన వినయుండును, వినయగాంభీర్యధైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును, తామస గుణచంక్రమ్యమాణ స్థైర్యుండును నై విస్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరి నిందుఁ జూపు మని కనత్కనక మణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్దంతి దంత భేదన పాటవ ప్రశస్తం బగు హస్తంబున సభామండప స్తంభంబు వ్రేసిన వ్రేటుతోడన దశదిశలను మిడుంగుఱులు చెదరం జిటిలి పెటిలిపడి బంభజ్యమానం బగు నమ్మహాస్తంభంబువలనఁ బ్రళయవేళాసంభూత సప్తస్కంధబంధుర సమీరణ సంఘటిత ఘోరజోఘుష్యమాణ మహా వలాహకవర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాతసంఘ నిర్ఘోష నికాశంబు లయిన ఛటచ్ఛట స్ఫటస్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జంజన్య మానంబులై యెగసి యాకాశ కుహరాంతరాళంబు నిరవకాశంబు జేసి నిండినం బట్టుచాలక దోధూయమాన హృదయంబు లయి పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖి ముఖర చరాచర జంతుజాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగాఁ బ్రపుల్ల పద్మ యుగళ సంకాశ భాస్వర చక్ర, చాప, హల, కులిశ, అంకుశ, జలచర రేఖాంకిత చారు చరణతలుండును, చరణచంక్రమణ ఘన వినమిత విశ్వంభరాభార ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మకులశేఖరుండును, దుగ్ధజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరుస్తంభ యుగళుండును, ఘణఘణాయమాన మణికింకిణీగణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబరశోభిత కటిప్రదేశుండును, నిర్జరనిమ్నగావర్తవర్తుల కమలాకరగంభీర నాభివివరుండును, ముష్టిపరిమేయవినుత తనుతరస్నిగ్ద మధ్యుండును, కులాచల సానుభాగ సదృశ కర్కశవిశాల వక్షుండును, దుర్జన దనుజభట ధైర్య లతికా లవిత్రాయమాణ రక్షోరాజ వక్షోభాగ విశంకటక్షేత్ర విలేఖన చంగలాంగలాయమాన ప్రతాప జ్వల జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్రరేఖాయమాణ వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాతనఖరతర ముఖనఖరుండును, శంఖ, చక్ర, గదా, ఖడ్గ, కుంత, తోమర ప్రముఖ నానాయుధమహిత మహోత్తుంగ మహీధరశృంగసన్నిభ వీరసాగరవేలాయమాన మాలికా విరాజమాన నిరర్గళానేకశత భుజార్గళుండును, మంజు మంజీర మణిపుంజ రంజిత మంజుల హార, కేయూర, కంకణ, కిరీట, మకరకుండలాది భూషణ భూషితుండును, ద్రివళీయుత శిఖరిశిఖరాభ పరిణద్ధ బంధుర కంధరుండును, బ్రకంపనకంపిత పారిజాతపాదపల్లవ ప్రతీకాశ కోపావేశ సంచలితాధరుండును, శరత్కాల మేఘజాలమధ్య ధగద్ధగాయమాన తటిల్లతాసమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును, కల్పాంతకాల సకలభువనగ్రసన విజృంభమాణ సప్తజిహ్వ జిహ్వాతులిత తరళతరాయమాణ విభ్రాజమాన జిహ్వుండును, మేరు మందర మహాగుహాంతరాళవిస్తార విపుల వక్త్ర నాసికారంధ్రుండును, నాసికారంధ్ర నిస్సరన్నిబిడ నిశ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్తసాగరుండును, పూర్వపర్వత విద్యోతమాన ఖద్యోత మండలసదృక్ష సమంచిత లోచనుండును, లోచనాంచల సముత్కీర్యమాణ విలోలకీలాభీల విస్ఫులింగ వితానరోరుధ్యమాన తారకాగ్రహమండలుండును, శక్రచాప సురుచిరాదభ్ర మహాభ్రూలతా బంధ బంధురభయంకర వదనుండును, ఘనతర గండశైలతుల్య కమనీయ గండభాగుండును, సంధ్యారాగ రక్తధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును సటాజాల సంచాల సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండును, నిష్కంపిత శంఖవర్ణ మహోర్ధ్వ కర్ణుండును, మంథదండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణవేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాశి కల్లోల శీకారాకార భాసుర కేసరుండును, పర్వాఖర్వ శిశిరకిరణ మయూఖ గౌర తనూరుహుండును నిజ గర్జానినద నిర్దళిత కుముద సుప్రతీక వామ నైరావణ సార్వభౌమ ప్రముఖ దిగిభరాజ కర్ణకోటరుండును, ధవళధరాధరదీర్ఘ దురవలోకనీయ దేహుండును, దేహప్రభాపటల నిర్మధ్యమాన పరిపంథి యాతుధాన నికురంబ గర్వాంధకారుండును, బ్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణావీరరస సంయుతుండును, మహాప్రభావుండును నయిన శ్రీనృసింహదేవుం డావిర్భవించినం, గనుంగొని.

హిరణ్యకశిపుడు అలా శ్రీమహావిష్ణువుతో శత్రుత్వం వహించాడు. శత్రుత్వం వలన అతని మనస్సులో రోషం అగ్నిలా భగభగమండింది. ఆ రోషాగ్ని జ్వాలలు చెలరేగి అతనిలోని విజ్ఞానము, అణుకువలను కాల్చివేశాయి. ధైర్యగాంభీర్యాల వలన అతని హృదయం ధగ ధగ మెరిసింది. హృదయ చాంచల్యం వలన తామస గుణం విజృంభించింది. ఆ తామస గుణం వల్ల అతని స్థైర్యం చిందులు త్రొక్కసాగింది. అంతట పట్టలేని ఆవేశంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిపై హుంకరించాడు. ఆ విష్ణు విరోధి “దీనిలో హరిని చూపించరా” అనంటూ సభామండప స్తంభాన్ని అరచేతితో బలంగా చరిచాడు.

ఆ దెబ్బకు అతని చేతి బంగారు మణిమయ కంకణాలు గణగణ ధ్వనించాయి. ఆ రాక్షసరాజు దిగ్గజాల దంతాలను విరిచేయ గలిగిన తన బలిష్ఠమైన చేతితో కొట్టిన ఆ దెబ్బకి చిటిలి పిటిలి ఆ మహాస్తంభం ఫెళఫెళమని భయంకర ధ్వనులు చేసింది. పది దిక్కులా విస్ఫులింగాలు విరజిమ్మాయి. కల్పాంత కాలంలో అతి తీవ్రమైన వేగంతో వీచే సప్త విధ మహావాయువుల ఒత్తిడివలన ఉరుములతో ఉరకలువేసే భయంకర ప్రళయ మేఘాలు వర్షించే పిడుగుల వంటి భీకర ధ్వని వెలువడింది.

ఆ ఛటపటారావాలు విపరీతంగా పైకి ఎగసి ఆకాశం అంతా నిండి కర్ణకఠోరంగా వినిపించసాగాయి. బ్రహ్మ గారు, ఇంద్రుడు, వరుణుడు, వాయుదేవుడు, అగ్నిభట్టారకుడు మొదలైన దేవతలందరితో, సమస్త జీవజాలంతో సహా బ్రహ్మాండభాండం గుండెలవిసేలా ఒక్కసారి ఫెఠేలున పగిలినట్లు అయినది.

స్తంభం ఛిన్నాభిన్నమైంది. దానిలో నుంచి దేదీప్యమానమైన దివ్య తేజస్సుతో నరహరి రూపంలో నారాయణుడావిర్భవించాడ. ఆయన పాదాలు చక్రం, చాపం, నాగలి, వజ్రాయుధం, మీనం వంటి శుభరేఖలు కలిగి, వికసించిన పద్మాల వలె ప్రకాశిస్తున్నాయి. ఆ స్వామి దివ్య పాదాలతో అడుగులు వేస్తుంటే, ఆ భారానికి భూమిని మోసే అష్టదిగ్గజాలూ, కులపర్వతాలూ, కూర్మరాజూ (కూర్మావతారుడు) అణిగి మణిగిపోతున్నారు. అంటే నారసింహ అవతారంగా ఆ వాసుదేవుడు సంపూర్ణ శక్తితో వచ్చాడు. నరసింహమూర్తి శ్రీవిష్ణు సహస్రనామములలో మొదటి సాకార రూపం. వరాహావతారం తరువాత మరల సంపూర్ణ శక్తితో నిర్గుణ బ్రహ్మ సగుణ-సాకార రూపంలో ఆవిర్భవించిన ఏకపూర్వ ఘట్టం అది.

ఆ ఉగ్రనరసింహుని ఊరువులు క్షీరసముద్రంలో పుట్టిన ఐరావతం తొండాల లాగా బలిష్ఠంగా బలవత్తరంగా ఉన్నాయి. పీతాంబరం ధరించిన ఆ స్వామి నడుముకు చుట్టి ఉన్న మణులు పొదిగిన మువ్వల ఒడ్డాణం గణ గణ మని మ్రోగుతోంది. ఆ స్వామి నాభి ఆకాశగంగా నదిలో సుళ్ళు తిరుగుతున్న మడుగులాగా గంభీరంగా ఉంది. ఆ నరసింహుడి నడుము పిడికిలిలో ఇమిడేటంత సన్నంగా ఉండి నిగనిగ మెరుస్తోంది. వక్షస్థ్సలం పెద్ద కొండ చరియ లాగా అతి కఠినంగా, విశాలంగా ఉండి ప్రకాశిస్తోంది. ఆ భీకరాకారుని గోళ్ళు వంకరలు తిరిగి వాడి తేలి, రాక్షససేనల ధైర్యలతలను తెగగోసే కొడవళ్ళలాగా ఉన్నాయి.

రాక్షసరాజు బండబారిన గుండె లనే పొలాలను దున్నే పదునైన నాగళ్ళు ఆ గోళ్ళు. శత్రువుల కళ్ళకి మిరుమిట్లు గొలిపే మంటలు మండుతున్న నెగళ్ళు ఆ గోళ్ళు. అవి గోళ్ళు కావు వజ్రాయుధాలు. అయినా అవి శరణాగతులైన భక్తుల నేత్రాలకు మాత్రం చకోరాలకు చంద్రరేఖలలాగా అందంగా కనిపిస్తాయి.

హిరణ్యస్తంభసంభూతి ప్రఖ్యాత పరమాత్మనే।
ప్రహ్లాదార్తిముషే జ్వాలానరసింహాయ మంగళమ్॥

మహోన్నతమైన పర్వత శిఖరాలవంటి ఆ నరసింహ స్వామి మూర్తి బాహువులు శంఖ, చక్ర, గదా, ఖడ్గ, కుంత, తోమరాది వివిధ ఆయుధాలు కలిగి ఉన్నాయి. వందలాదిగా ఉన్న ఆ బాహువులు వీరరసం అనే సముద్రానికి చెలియికట్టలలాగా ఉన్నాయి. అనేక పుష్ప మాలికలతో విరాజిల్లుతున్నాయి. కాంతులీనే కడియాలు, మణులు పొదిగిన మనోహరమై విరాజిల్లే హారాలు, భుజకీర్తులు, కంకణాలు, మకర కుండలాలు వంటి అనేక ఆభరణాలతో స్వామి ధగధగ మెరిసిపోతున్నాడు.

ఆ విభుని కంఠం మూడు రేఖలతో పర్వత శిఖరంలా దృఢంగా ప్రకాశిస్తోంది. ఆ దేవదేవుని కెమ్మోవి గాలికి కదిలే పారిజాత పల్లవంలాగా రాగరంజితమై, కోపావేశాలతో అదురుతోంది. శరత్ కాలంలో మేఘాల మధ్య మెరిసే మెరుపు తీగల్లాగా ఆ ఉగ్ర మూర్తి కోరలు తళతళలాడుతున్నాయి. ప్రళయకాలంలో సమస్త లోకాలనూ కబళించటానికి పరాక్రమించే అగ్ని జ్వాలలలాగా నాలుక బహు భీకరంగా ఉంది. ఆ వీరనరసింహ స్వామి నోరు, నాసికా రంధ్రాలు మేరు మంథర పర్వతాల గుహలలా బహు విస్తారంగా ఉన్నాయి.

ఆ నాసికా రంధ్రాల నుండి వచ్చే వేడి నిట్టూర్పులకు తట్టుకోలేక సప్తసాగరాలు అల్లకల్లోలమై సలసల కాగుతున్నాయి.

Here is the first evidence of, though known even earlier, energy is forming into matter.

E = mC2

నిర్గుణ నిరాకార బ్రహ్మ = సగుణ సాకార బ్రహ్మ x కాంతి

అందుకే ఆ వేడి పుట్టింది.

ఆ భీకర మూర్తి కళ్ళలో తూర్పు కొండపై ప్రకాశించే సూర్యమండల కాంతులు తేజరిల్లుతున్నాయి. ఆ నేత్రాల అంచులు విరజిమ్ముతున్న విస్ఫులింగాల వలన సర్వ గ్రహమండలాలూ, నక్షత్ర మండలాలూ కకావికలై క్రిందుమీదులు అవుతున్నాయి. మనోజ్ఞమైన విస్తారమైన ఆ నరసింహావతారుని కనుబొమలు ముడిపడి ముఖం ఇంద్రుని ధనుస్సు వలె భయంకరంగా ఉంది. ఆయన చిక్కని చెక్కిళ్ళు గండశిలలలాగ మిక్కిలి కఠినంగా ఉన్నా, అంత కమనీయంగానూ ఉన్నాయి.

ఆ కమనీయత ప్రహ్లాదునికి.

దీర్ఘమైన జటలు సంధ్యా సమయంలో ఎఱ్ఱబడిన మేఘమాలికలను పోలిక మెరుస్తున్నాయి. ఆ జటలను అటునిటు విదల్చటం వలన పుట్టిన వాయువుల వేగం వల్ల ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానాలు వైమానికులతో సహా ఉయ్యాలలాగ ఊగుతున్నాయి. ఆ ప్రభువు చెవులు నిశ్చలములై శంఖాల వలె స్వచ్ఛంగా ఉన్నాయి. మందర పర్వతాన్ని కవ్వంలా చేసి చిలికేటప్పుడు గిరిగిర తిరిగే ఆ గిరి వేగానికి పాలసముద్రంలో పుట్టి ఆకాశం అంతా ఆవరించిన తుంపర్లు వలె ఆ భీకరావతారుని కేసరాలు భాసిల్లుతున్నాయి.

శరీరం మీది రోమాలు నిండు పున్నమి రాత్రి ప్రకాశంచే వెన్నెల వలె వెలిగిపోతోంది. ఆ నరసింహుని సింహగర్జనకు అష్టదిగ్గజాలైన కుముదము, సుప్రతీకము, వామనము, ఐరావతము, సార్వభౌమాల చెవులు పగిలిపోతున్నాయి.

Such an energy is accompanied by similarly potent sound. Here, the situation is that of the entire universe is taking a material form.

ఆ నరసింహ మూర్తి తెల్లని దేహం వెండికొండలా ప్రకాశిస్తూ, చూడటానికి శక్యంకాని విశేష కాంతితో వెలుగిపోతోంది. ఆ శరీర తేజోశ్రేష్ఠము శత్రువులైన రాక్షసుల గర్వాంధకారాన్ని చీల్చి వేస్తున్నది. ఆ నరకేసరి ఆకారం ప్రహ్లాదునికి సంతోష కారణంగానూ (శ్రీమాన్), హిరణ్యకశిపునికి సంతాప కారణంగానూ ఉంది. ఆ నరసింహ రూపుని అంతరంగం కరుణారసంతోనూ, బహిరంగం వీరరసంతోనూ విరాజిల్లుతూ ఉన్నాయి. దివ్యప్రభావ సంపన్నుడైన శ్రీనరసింహావతారుడు ఈ విధంగా సభా స్తంభం మధ్య నుండి ఆవిర్భవించాడు. పరమాద్భుతమైన శ్రీనరసింహ ఆవిర్భావ దృశ్యం చూసిన హిరణ్యకశిపుడు నిశ్చేష్టుడయ్యాడు.

నారసింహవపుః – నారసింహస్య వపుః యస్యసః నారసింహవపుః

అనగా భక్తుడు ప్రహ్లాదుడి భయాన్ని తొలగించేందుకు అతడు అనుకొన్న సమయంలోనే దివ్యమైన నరసింహ రూపమును ధరించినవాడు. ఇది భగవద్గుణదర్పణం ప్రకారం. విశిష్టాద్వైత వ్యాఖ్య.

యదేవేహ తదముత్ర యదముత్రతదన్విహ – కఠోపనిషత్ వాక్యము.

ఇచట ఏది కలదో అదియే అచట కలదు.

దీన్ని నరసింహావతారము నిరూపించింది.

నిరాకారంగానే కాక సాకారంగా కూడా అంతటా వ్యాపించి చూపిన నారసింహుడు పూర్ణ పురుషుడు.

అందుకే ఆయన

22. శ్రీమాన్

పరస్పర విరుద్ధములైన నర, సింహ రూపముల కలయిక వల్ల వచ్చిన వాడైనా, అతి సుందరముగా గోచరిస్తున్నాడు ఆ స్వామి. అట్టి మనోహర రూపమును దాల్చి ప్రహ్లాదుని కాచెను.

దంష్ట్రా కరాళం సురభీతినాశనం
కృత్వావపుర్దివ్య నృసింహరూపిణా

ఎందుకు ప్రహ్లాదుని కొరకు ఇంత శ్రమ (మన భాషలో మాత్రమే) తీసుకున్నాడు?

ప్రహ్లాదుడు తను ఆ హరియందు ఒక భాగమే అని సంపూర్తిగా ఎఱిగి ఉన్నాడు. అంటే ప్రహ్లాదుడికి ఏమి అయినా అది శ్రీహరికి అయినట్లే. అందుకు ఆయనను ఆయనే కాచుకున్నట్లు..

It’s more like a reflex action. గతంలో రక్షించినవన్నీ.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here