తల్లివి నీవే తండ్రివి నీవే!-33

0
10

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

ఈశ్వరః సర్వభూతానాం

యుగాయితం నిమేషేణ చక్షుసా ప్రావృషాయితం।

శూన్యాయితం జగత్ సర్వం గోవిన్ద విరహేణ మే॥

(చైతన్య మహాప్రభు శిక్షాష్టకం – 7)

లిప్తపాటు కాలమైనా నీకు దూరమైతే ఆ సమయం కొన్ని యుగాల మాదిరి అనిపిస్తుంది. జగత్తు అంతా శూన్యమైపోతుంది. కళ్ళవెంట నీరు వర్షధారల వలె కారుతూనే ఉంటుంది.

  1. సంభవః — తనకు తానుగానే (కర్మముల వంటి కారణములు, బంధములు లేకుండానే) అవతరించువాడు. శ్రద్ధా భక్తులతో కోరుకొన్నవారికి దర్శనమిచ్చువాడు.
  2. భావనః — కామితార్థములను ప్రసాదించువాడు. మాలిన్యములు తొలగించి వారిని పునరుజ్జీవింపజేయువాడు.
  3. భర్తా — భరించువాడు; భక్తుల యోగ క్షేమములను వహించువాడు. సకల లోకములకును పతి, గతి, పరమార్ధము.
  4. ప్రభవః — దివ్యమైన జన్మ (అవతరణము) గలవాడు. కర్మ బంధములకు లోనుగాకుండనే అవతరించువాడు.
  5. ప్రభుః — సర్వాధిపతి, సర్వ శక్తిమంతుడు. బ్రహ్మాదులకు కూడ భోగ మోక్షములొసగు సమర్ధుడు.
  6. ఈశ్వరః — సర్వులనూ పాలించి పోషించువాడు. అన్నింటిపై సకలాధిపత్యము గలవాడు. మరే విధమైన సహాయము, ప్రమేయము లకుండ, ఇచ్ఛామాత్రముగ, లీలామాత్రముగ ఏదయిన చేయగలవాడు.

***

దాదాపు 5300 సంవత్సరాల క్రితం.

దేవాదిదేవుడు (పరబ్రహ్మ) శ్రీకృష్ణ అవతారం ఎత్తిన సందర్భమది. చల్దులారగించుట అనే లీలా వినోదం జరుతున్నప్పటి విషయం ఇది. అప్పటికే అఘాసుర సంహారం జరిగింది.

ఇక్కడ గోపకుమారులతో కృష్ణుడు చల్దులు ఆరగిస్తుండగా, అక్కడ లేగదూడలు పచ్చికలు మేస్తున్నాయి. కన్నయ్య వాటిని ఒక కంట కనిపెడుతూనే ఉన్నా, కేవలం సాక్షిగా ఉండి వాటి కదలికలను నియంత్రించటం లేదు. ఆ ఆలమందలు పచ్చని పచ్చికలున్న గుబుర్లలోనికి చొరబడి అక్కడ మేత మేస్తూ భయంకరమైన అరణ్యంలో చాలా దూరం వెళ్ళిపోయాయి. గోపబాలకులు దీనిని గమనించలేదు. వారు శ్రీకృష్ణుని సాంగత్యంలో మునిగిపోయి ఉన్నారు. అలా భగవత్సాంగత్యంలో భాగవతులు లీనమై ఉంటే భగవానుడే వారికి సంబంధించినవన్నీ కనిపెట్టుకుని చూస్తుంటాడు.

కాసేపటికి త్రేన్చుకుని, తేరుకున్నాక, భోజనాలు చేస్తూ లేగల కోసం చూశారు గోపబాలకులు. సహజంగానే అవి కనిపించ లేదు. వారు కంగారు పడ్డారు.

అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు.

“మన లేగదూడలు లేత పచ్చికల మేతలలో లీనమైపోయి, ఉత్సాహంతో అడవిలో చాలా దూరం వెళ్ళిపోయి నట్లున్నాయి. ఎక్కడకి వెళ్ళాయో యే మయ్యాయో? ఏ క్రూరజంతువుల కైనా చిక్కి ఆపదలో పడ్డాయో? ఏమిటో? నేను వెదకి తీసుకొస్తాను. మీరు కంగారు పడకుండా చల్దులు ఆరగిస్తూ ఉండండి.”

..అంటే మీరు నా భక్తిలో మునిగి ఉన్నారు. కనుక మీకు సంబంధించిన బాధ్యతలన్నీ నాకు కూడా బాధ్యతలే.

మనం గమనించాల్సిన విషయం.. పరమాత్మ భక్తిలో లీనమై ఉండటం తద్వారా ఇతర బాధ్యతలు పట్టించుకోక పోవటం లౌకికంగా చూస్తే తప్పు లాగనే అనిపిస్తుంది. కానీ, నిజానికి భగవద్భక్తిలో లీనమై ఉండటమే మనం నిజానికి చేయాల్సిన పని. ఆ గోపబాలకులు లౌకిక విషయాలలో మునిగి బాధ్యతను (గోవులను రక్షించే) విస్మరించలేదు. శ్రీకృష్ణ పరమాత్మ చెంత, ఆయన సాంగత్యాన్ని అనుభవిస్తూ ఆయనలో లీనమై ఉన్నారు.

అందుకే కన్నయ్య..

కర్ణాలంబిత కాక పక్షములతో గ్రైవేయహారాళితో

స్వర్ణాభాసిత వేత్రదండకముతో సత్పింఛదామంబుతోఁ

బూర్ణోత్సాహముతో ధృతాన్నకబళోత్ఫుల్లాబ్జహస్తంబుతోఁ

దూర్ణత్వంబున నేఁగె లేఁగలకునై దూరాటవీవీధికిన్.

(పోతన భాగవతము – 10.1-502)

జులపాల జుట్టు చెవులదాకా వేళ్ళాడుతూ ఉంది.

మెడలో హారాలు మెరుస్తున్నాయి.

బంగరంలా మెరిసే కఱ్ఱ చేతిలో ఉంది.

చక్కటి నెమలి పింఛం తలపై ధరించాడు.

ఇవన్నీ ఐశ్వర్యానికి, సౌభాగ్యానికి చిహ్నాలు (affluence). శ్రీమాన్ అనే నామానికి ఒప్పే లక్షణాలు. అందుకే ఇటు పోతన గారైనా, అటు వ్యాస భగవానుడైనా ఈ విషయాలను ప్రత్యేకించి ఎత్తి చూపారు.

ఎఱ్ఱటి అర చేతిలో తెల్లటి అన్నం ముద్ద మెరిసి పోతూ ఉంది.

ఎర్రటి అరచేయి అత్యద్భుతమైన ఆరోగ్యానికి చిహ్నం. అది లక్ష్మీ కళ. ఆరోగ్యవంతులైన వారి చేతులు అలా ఎర్రగా ఉంటాయి. ఆరోగ్య లక్ష్మి అక్కడ నివాసముంటుంది. అలాంటి చేతిలో తెల్లటి అన్నపు ముద్ద.

అన్నం పరబ్రహ్మ స్వరూపం. అంటే ఆవిధంగా అక్కడ లక్ష్మీనారాయణలు సాక్షాత్కారం జరిగింది అనే చెప్పాలి. ఆ తల్లి నిత్యానపాయని. ఈయన ఆ తల్లి లేకుండా ఉండలేడు. శ్రీనివాస తత్వం.

ఇలా గోపాల కృష్ణుడు ఉత్సాహంతో లేగదూడలను వెదకడానికి అడవిలో ఎంతో దూర ప్రాంతాలకి వెళ్ళాడు.

గోవులు వేదాలు. (గో శబ్దానికి వేదములు అని అర్థమున్నది కదా).

ఆ వేదాలను వెతుకుతూనే వెళ్ళాడు కన్నయ్య. ఆయనకు ఎన్నిసార్లు వేదాలను వెతికి రక్షించే పని పడిందో!

అలా వెళ్తూ శ్రీకృష్ణుడు ఆ లేగల జాడ కనిపెట్టసాగాడు.

ఇవిగో ఇక్కడ పచ్చిక మేసాయి.

ఇక్కడ నీరు త్రాగాయి.

ఇదిగో ఇక్కడ మళ్లీ బయలుదేరాయి.

ఇక్కడ ఒక్కచోటికి మందగా చేరాయి.

ఇదిగో ఇక్కడ మంద విడిపోయింది.

Deductive reasoning.

ఇలా చూసుకుంటూ కృష్ణుడు వెనుదీయకుండా లేగలను వెదుకసాగాడు.

దట్టమైన అడవిలో పచ్చిక గుబురులలోనూ.

భయంకర మృగాలుండే చెట్ల గుంపుల లోనూ.

చెట్లవెనుక.

పర్వతాలపైనా.

కొలనుల చెంత.

నదుల దగ్గర.

అంతటా వెదికాడు.

అలా బాల కృష్ణుడు గోవులను వెతుకుతూ ఉంటే బ్రగ్మదేవుడికి మాయ కమ్మింది.

ఎందుకు?

వేదాలు కనపడవలసిన వారికి కనబడటం లేదు కనుక. అంటే గోపాలురకు వారి గోవుల ఆచూకీ తెలియటం లేదు. వేదముతో సంబంధం తెగితే మనను కమ్మేది మాయయే. అందుకే..

భూమికి దిగి వచ్చిన బ్రహ్మదేవుడు ఇలా అనుకున్నాడు.

ఇతడు పసిబాలుడు కదా!

అఘాసురుడు మ్రింగిన గోపబాలురను లేగలను ఎలా రక్షించగలిగాడు?

ఇది ఈ భూలోకం లోనే చాలా ఆశ్చర్యకరమైన విషయం.

ఎందుకు?

అఘాసురుడు దేవతలను కూడా వేధించగల శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. అంటే భూమి మీద ఉండే ఒక సాధారణ బాలకుడు (!) అతడిని ఎలా ఓడించగలడు?

ఈ మాయబాలకుడి మహాశక్తి ఎలాంటిదో పరీక్షించి చూద్దాం అనుకున్నాడు చతుర్ముఖ బ్రహ్మ.

దాంతో బ్రహ్మ గారు ఇటు అడవిలోని లేగలను, అటు భోజనాలు చేస్తున్న బాలురనూ ఒక రహస్య ప్రదేశంలో దాచాడు.

అప్పుడు గోపాల కృష్ణుడు దూడలజాడలు కనపడక తిరిగి వారు చల్దులారగిస్తున్న కొలను వద్దకు వచ్చాడు. అక్కడ గోపబాలురు కూడా కనిపించలేదు. వారిని పిలిచి వారు ఇక్కడ లేరని నిర్ధారించు కున్నాడు. ఇప్పటిదాకా సాధారణ బాలకుడిగా వ్యవహరించిన కృష్ణుడు ఇక తన ఈశ్వర తత్వాన్ని ప్రదర్శించాడు. విశ్వంలోని రహస్యాలన్నీ ఎరిగిన వాడు కదా. ఇది బ్రహ్మగారి పని అని గ్రహించాడు.

ఇలా పిల్లలను, లేగదూడలను వంచనచేసి మాయం చేయవలసిన అవసరం బ్రహ్మ గారికి లేదు నిజానికి. కానీ మాయకు లొంగి అహంకరించి ఆ పరబ్రహ్మనే పరీక్షించాలని చూశాడు.

నా కన్నుకప్పి ఈ పని చేశాడు హిరణ్యగర్భుడు. అతణ్ణి తిరిగి మోసం చేయడం నాకు పెద్ద కష్టమైన పని కాదు. అయినా వారిని తిరిగి తీసుకురాడానికి అతణ్ణి వంచించడం ఎందుకు? వద్దులే! అనుకున్నాడు.

పెదవులపై చిరునవ్వులు చిందించాడు. శ్రీహరి ఈ బ్రహ్మాండాలకు అధిపతి.

ఇంటికి తిరిగివెళ్ళి మీ పిల్లలు లేరమ్మా అని గోపికలకు చెప్పడం దేనికి? నేనే గోపబాలకుల రూపాల లోనూ, గోవత్సాల రూపాల లోనూ సంచరిస్తాను. గోపికలు గోపకులు ఎప్పటిలాగే తమ పనులు తాము చేసుకుంటారు.

బాల కృష్ణుడు ఆ యా లేగదూడల, గోపబాలకుల రూపాలను అన్నీ తానే ధరించాడు. అందరూ ఆయనలో భాగాలే కదా!

అన్ని అవయవాదులు ఆ యా బాలుర పోలికల్లోనే ఉన్నాయి. అంతే కాకుండా, ఆ బాలురు ధరించే చేతికఱ్ఱలు, వస్త్రాలు, దండలు, వేణువులు, కొమ్ముబూరాలు, ఆభరణాలు, వారి వయస్సులు, గుణాలు, మాటలాడే యాస ఏ ఒక్కటీ వదలకుండా సంపూర్ణంగా ఆ యా బాలుర, లేగల స్వరూపాలు అన్నీ తనే ధరించాడు. అంతా ఆయనే! అన్నీ ఆయనే. చరములు, అచరములు, గోచరములు, అగోచరములు, అన్నీ.. అన్నీ ఆయనే కదా.

రూపంబు లెల్ల నగు బహు

రూపకుఁ డిటు బాలవత్సరూపంబులతో

నేపారు టేమి చోద్యము?

రూపింపఁగ నతని కితరరూపము గలదే?

(పోతన భాగవతము – 10.1-512)

ఈ జగన్నాటకంలో అందరి రూపాలూ ధరించే అంతర్యామి స్వరూపుడు ఆ గోపాలకృష్ణుడు. ఆ ఆ లీలామానుష విగ్రహుడు ఇలా బాలుర యొక్క, లేగల యొక్క రూపాలు ధరించడంలో ఏమి ఆశ్చర్యం ఉంది. ఏ రూపంలో అయినా ఉన్నవాడు అతడే. జాగ్రత్తగా గమనిస్తే అతడు సర్వాత్మకుడు రూపాతీతుడు కనుక అతనికి రూపం అన్నది వేరే ఉండదు కదా. అవును, ఆ జగన్నాటక సూత్రధారి ధరించలేని పాత్ర ఏముంటుంది?

అందరినీ భరించు వాడు. భక్తుల యోగ క్షేమములను వహించువాడు; సకల లోకములకును పతి, గతి, పరమార్ధము (భర్తా!).

విచిత్రంగా మందలోని పశువులను తమ ఇంటి వైపు తోలమని చెప్పేవాడు తానే, అలా తోలుతున్న గొల్లపిల్లలు తానే, అలా తోలబడి తమ ఇళ్ళకు వెళ్తున్న పశువులు తానే. అలా ఆ శ్రీహరి గొప్పవినోదంగా రేపల్లెకు వెళ్ళాడు. సూత్రధారి పాత్రధారి అభేదమా జీవాత్మ పరమాత్మల అభేదమా, ఆహా! ఏమి లీల! పోతన ఆశ్చర్యపోయాడు. మనకూ ఆశ్చర్యమే!

అహంకారమును లేదా మాయను తొలగించుకుని చూస్తే బ్రహ్మ గారికి కూడా ఆశ్చర్యమే!

ఇలా తన నేస్తులైన ఆ గోప బాలురు, లేగలు యొక్క స్వరూపాలు అన్నీ తానే ధరించి, విహరిస్తూ గోకులానికి తిరిగివచ్చి,

వారి వారి దొడ్లలో ఆయా దూడలను ఆయా స్థానాలలో కట్టేశాడు.

ఆయా బాలకుల స్వరూపంలో ఆయా ఇళ్ళల్లో ప్రవేశించాడు.

వారి వారి వేణువుల ద్వారా వేణునాదం వినిపించసాగాడు.

గోపబాలకుల తల్లులు కొడుకుల వేణునాదాలు విన్నారు. అవి వీనులవిందుగా వినిపించి వారి మనస్సులు పరవశించాయి. వెంటనే ఆ తల్లులు లేచి కుమారులను కౌగిలించుకుని శిరస్సులను మూర్కొన్నారు. వారి పాలిళ్ళు అందు పాలు ఉవ్వెత్తుగా చేపుకుని వచ్చాయి. గోపికలు అమృతంతో సమాన మైన ఆ పాలను నిండైన ప్రేమతో కొడుకులకు త్రాగించారు.

పరమాత్మకు పాలు పట్టే భాగ్యం! ఏమి అదృష్టం! ఎంత అదృష్టం!

పిమ్మట, ఆ గోపికా తల్లుల హృదయాలు ఆనందంతో పరవళ్ళు తొక్కగా వారు

ఎంతో వేడుకతో కొడుకులకు నలుగుపెట్టి తలంటి స్నానాలు చేయించారు.

గంధాలు పూసారు. చక్కని ఆభరణాలు అలంకరించారు. (శ్రీకృష్ణునికి ఇష్టమైనవి).

నుదిటిపై రక్షా తిలకాలు పెట్టారు. (ఆయనకు మంగళాశాసనం చేశారు).

అన్ని రకాల పదార్థాలతోనూ భోజనాలు పెట్టారు. (నైవేద్యం సమర్పయామి).

ఎంతో ప్రేమతో వారిని ఆదరించారు. ఆయన సాంగత్యంలో తరించారు.

ఎందుకు? ఆయన ఈశ్వరుడు కనుక.

ఏ బాలకులు ఏ తల్లులకు ఏ యే విధంగా ఆనందం కలిగించారో ఇప్పుడు అలాగే ఆ యా బాలకులు ఆ యా తల్లులకు అ యా విధాలైన ఆనందాలు కలిగించారు. అంటే ఎలాంటి రూపంలో భక్తులు పరమాత్మను కొలుస్తారో వారిని ఆ యా రూపములలోనే నేను అనుగ్రహిస్తాను అని ఇక్కడికి 80 సంవత్సరాల తరువాత కురుక్షేత్రంలో భగవద్గీతోపదేశంగా చెప్తాడు కదా! అలాగే ఆ యా బాలకుల రూపాల్లో వారి తల్లులను అనుగ్రహించాడు పరమాత్మ.

తన ఈశ్వరతత్వాన్ని చూపాడు.

ఇటు గోవుల సంగతి.. వాటిని పెద్దవారు మేపి తీసుకు వచ్చారు. కొట్టములలో ఉంచారు. ప్రేమతో కడిగారు. అలా వదిలేశారు.

దొడ్లలో ఉన్న ఆవులు తమ దూడలను చూడగానే

అంబా అంటూ బిడ్డలను పిలిచాయి.

హుమ్మంటూ దూడలను వాసన చూశాయి.

ఆనందంతో చటుక్కున మూత్రాలు కార్చాయి.

ప్రేమతో దూడలను నాకాయి.

పొదుగుల నుండి కురుస్తున్న క్షీరధారలను లేగదూడలకు అందించాయి.

ఈ దృశ్యాన్నే ఆండాళ్ దర్శించింది. అందుకే 21వ తిరుప్పావై పాశురంలో ఆ అనంత క్షీరధారలను గురించి ప్రస్తావించింది.

గోపికలకు, గోవులకు కూడా తమ బిడ్డల రూపంలో ఉన్న బాల కృష్ణునిపై మాతృప్రేమ ఎంతో ఎక్కువగా కలిగింది. శ్రీహరి కూడా వారిని తల్లులు అంటూ ఎంతో స్వచ్ఛమైన ప్రేమతో పసిపిల్లవాడిగా, లేగదూడలుగా వారి మధ్య ప్రవర్తించాడు. ఆ సౌలభ్యాన్ని ప్రత్యేకించి విశేషంగా ప్రస్తావించారు పరాశర భట్టర్ తమ భగవద్గుణ దర్పణమ్ అనే వ్యాఖ్యలో.

ఇలా బాలకృష్ణుడు గొల్లపిల్లల రూపాలూ దూడల రూపాలు తానే ధరించి, అందరి రూపాలలోనూ ఉన్న తనను తాను రక్షించుకుంటూ, ఆ బృందావనంలోనూ గోకులంలోనూ మహమహిమతో ఒక ఏడాది పాటు విహరించాడు.

బలరాముడు క్రమంగా ఒక విషయం గ్రహించాడు. ఈ విధంగా అనుకున్నాడు.

తల్లిపాలు విడిచిన వయస్సులో ఉన్న బిడ్డల మీదా దూడల మీదా గోపకులకు ఆవులకు ఇంత అధికంగా వాత్సల్యం ఎలా పుట్టుకు వచ్చింది?

వీరు ఇదివరకు కృష్ణుని ఎడల మమకారంతో ఎంత ప్రేమ చూపేవారో, ఇప్పుడు తమ బిడ్డలపైన ఆ విధమైన ప్రేమ చూపుతున్నారు.

నాకు కూడ ఈ బిడ్డలను లేగలను చూస్తుంటే కృష్ణుని చూసినట్లే ప్రేమా, ఇష్టాలు కలుగుతున్నాయి.

ఇది ఏమిటో మహా అద్భుతంగా ఉంది.

ఇంతకు ముందు ఇలా ఎన్నడూ ఎరుగను.

మానవులు కానీ, దానవులు లేదా దేవతలు కానీ చేసిన మాయ కాదు కదా?

లేక నా స్వామి అయిన విష్ణుమూర్తి యొక్క మాయ యేమో.

నా స్వామి మాయే అయి ఉంటుంది.

వ్రజదేశంలో ఉన్నంత వరకూ బలరామునికి తాను ఆదశేషుడను అన్న స్పృహ కాస్త ఎక్కువగా ఉండేది. అందుకే శ్రీకృష్ణుడు ఆ పరబ్రహ్మయే అని తెలిసి మసలేవాడు.

బలరాముడు ఇలా ఆలోచించి, దివ్యదృష్టితో పరిశీలనగా చూసాడు ఆ రోజు. తన స్నేహితులు, లేగదూడలు అన్నీ కృష్ణుడే అని గ్రహించాడు.

ఇలా యోగదృష్టితో చూసినప్పటికీ బలరాముడు నమ్మలేక కంగారుపడ్డాడు. తన పక్కనున్న బాల కృష్ణుని ఇలా అడిగాడు.

ఇంతకు ముందు వరకూ లేగదూడలన్నీ ఋషుల అంశలతో జన్మించినవి అనీ,

గోపాలకులు అందరూ దేవతల అంశలు అనీ

నాకు అనిపిస్తూ ఉండేది.

ఇప్పుడు చూస్తే లేగలూ బాలకులూ అందరూ నిస్సందేహంగా నీవే అని నాకు అనిపిస్తున్నది.

ఈ వింత ఏమిటి?

ఇలా బలరాముడు ప్రశ్నించే సరికి కృష్ణుడు అన్నగారి యెడల అనుగ్రహంతో ఉన్న రహస్యం విప్పి చెప్పాడు. బలరాముడు విషయం గ్రహించాడు. ఈవిధంగా శ్రీహరి బాలురు లేగలు తానే అయి చరించినది ఒక ఏడాది. ఆ కాలం బ్రహ్మదేవునికి తన కాలమానం ప్రకారం లిప్తపాటు.

బ్రహ్మ గారు వచ్చి దూడల రూపంలోనూ, బాలకుల రూపంలోనూ కనిపిస్తున్న బాలకృష్ణుని చూసి నివ్వెరపోయి ఇలా ఆలోచించుకున్నాడు.

ఈ గోకులంలో ఉండే బాలకులు దూడలూ అందరూ నా మాయా గుహలో ఇప్పటికీ అక్కడే నిద్రపోతున్నారు.

ఎక్కడకీ పోలేదు.

మళ్లీ ఎవరైనా సృష్టి చేసారు అనుకుందాం అంటే నేను తప్ప సృష్టికర్తలు అయిన బ్రహ్మలు ఇంక ఎవరూ లేరు.

మరి వీరెవరు?

ఎలా వచ్చారు?

ఆ నాటికి భూలోకంలో ఏడాది గడిచింది. మరి ఈ కృష్ణుడితో విహరిస్తున్న వీళ్ళంతా ఎక్కడ నుంచి వచ్చారు?

నేను సృష్టిస్తే గాని ఈ జీవరాసు లేవీ పుట్టవు కదా. సృష్టి చేసే వాడిని నేనొక్కడినే గాని మరింకొకడు లేడు కదా. బ్రహ్మదేవుడుగా నేను సృష్టించిన గొల్లపిల్లలు దూడలు కాక వేరేవి ఎలా వచ్చాయి? వీటిని ఎవరు సృష్టించారు? అందరిలోనూ ఒక్కటిగా ఉండే పరబ్రహ్మ కాదు కదా వీటి సృష్టికర్త?

ఇలా ఈ గొల్లపిల్లలు దూడలు గురించి అలోచించుకుంటూ, సర్వస్వాన్ని తేలికగా తెలుసుకోవడంలో నేర్పరి అయిన ఆ పితామహుడు, ఆ జ్ఞానవృద్ధుడు (వయోవృద్ధుడు కాడన్నది గ్రహించాలి. ఈ లీల జరిగిన సమయానికి కూడా మన కాలపు బ్రహ్మ గారి వయస్సు 51 నడుస్తున్నది.

బ్రహ్మదేవుడు నివ్వెరపోయాడు. కంగారుపడి తనలోతాను అలోచించుకున్నా ఏం చేయాలో తెలియ లేదు.

మాయ అంటని వాడు శ్రీహరి. కానీ తాను సర్వ జగత్తులను తన మాయతో మోహింపచేయ గల నేర్పరి. అటువంటి శ్రీమహావిష్ణువునే మాయ చేద్దాం అనుకొని ఆశపడిన బ్రహ్మ గారు తానే ఆయన మాయలో చిక్కుకుని పోయాడు.

మాయకే ప్రభువా శ్రీహరి.

ప్రభుః – సర్వాధిపతి, సర్వ శక్తిమంతుడు. బ్రహ్మాదులకు కూడ భోగ మోక్షములొసగు సమర్ధుడు.

ఇక చెప్పేదేముంది?

అతను తన తలవాకిట సరస్వతి ఉన్నదనే సత్యం వలన కొంత గర్వపడుతూండే వాడు. చతుర్ముఖుడైన ఆ బ్రహ్మ జంకి వెనుకకు తగ్గుతూ, తన మనస్సులో ఎన్నోరకాలుగా ఆలోచించి చూసాడు.

ఒకసారి బాలుర వంక చూసాడు.

అందరూ మేఘశ్యామల మూర్తులూ, హారాలు కుండలాలు కిరీటాలు వైజయంతీమాలికలూ ధరించి చాలా అందంగా ఉన్నారు.

వక్షస్థలం పైన శ్రీవత్సం అనే పుట్టుమచ్చ, శుభకరాలైన బాహుపురుషులు, కాలిగజ్జెలు, బంగారు కడియాలు, నడుములకు కాంచీకలాపాలతో కనిపిస్తూ బ్రహ్మ గారిని బెదరగొట్టారు.

పాదాలనుండి శిరస్సులవరకూ తులసీ దళాల మాలలు ధరించారు.

వ్రేళ్ళకు రవ్వల ఉంగరాలు మెరుస్తున్నాయి. అందరికీ నాలుగేసి బాహువులు ఉన్నాయి.

నాలుగు చేతులలో శంఖం, గద, చక్రం, పద్మం ధరించి ఉన్నారు.

బంగారు పట్టువస్త్రాలు (ఉన్నతమైన పసుపు రంగు వస్త్రాలు) ధరించి ఉన్నారు. వెన్నెలవంటి చల్లని తెల్లని చిరునవ్వులు వెదజల్లుతున్నారు.

కన్నుల నుండి కరుణాకటాక్షాలు వెలువడుతున్నాయి.

కోటిసూర్యుల కాంతితో వెలిగిపోతున్నారు. సచ్ చిత్ ఆనందాలు తామే అయిన అనంత రూపాలతో విలసిల్లుతున్నారు.

అణిమ, గరిమ, మహిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశిత్వము, వశిత్వము అనబడే ఎనిమిది అష్టసిద్ధుల గుణాలూ తమలోనే ధరించి ఉన్నారు.

అందరూ అంతర్యామి స్వరూపులే కనుక, ఇది పరాయిది అనే భేదం వారికి లేదు.

లక్ష్మీదేవితో కూడిన నారాయణుని ప్రతిబింబా లైన రూపాలతో విలసిల్లుతున్నారు.

సృష్టిలో ఉన్న బ్రహ్మ దగ్గర నుండి చరాచర జీవరాశులు, అణిమ మొదలైన సిద్ధులు, మాయ, అహంకారము, బుద్ధి, మనస్సు, పంచమహాభూతాలు, పంచతన్మాత్రలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు మొదలైన ఇరవైనాలుగు తత్వాలు, మూడు గుణముల (సత్వరజస్తమో గుణాలు) కలయిక, కాలము, మార్పు, కారణము, సంస్కారము, కామము, కర్మము, వాని గుణాలు ఇవన్నీ రూపాలు ధరించి నృత్యాలు గానాలు మొదలైనవి చేస్తూ ఈ నారాయణ స్వరూపు లైన బాలకులకు లోబడి సేవిస్తూ కనిపించాయా చతుర్మఖ బ్రహ్మకు.

అంతట ఆ హరిసూనుడు ఇలా అనుకున్నాడు.

వేదాంత మంతా తెలిసినవారికి ఐనా ఈ విశ్వరూపాలు తెలియవు.

ఈవిధంగా దేదీప్య మానంగా ప్రకాశిస్తూన్న బాలురు కచ్చితంగా ఆ శ్రీహరి యే. నా తండ్రియే. నా తల్లియే!

తల్లివి నీవే!

తండ్రివి నీవే!

చల్లగ కరుణించే ఆ పరబ్రహ్మ నీవే!

అని గ్రహించాడు.

ఈసృష్టి అంతటికి పరముడైన ఈశ్వరుడు విష్ణుమూర్తి. తేజస్సు అనేది అతని నుండే పుట్టినది. దానివలన చరాచరమైన ఈ సృష్టి అంతా రూపొంది కాంతిమంతమై కళ్ళకు కనపడుతోంది. ఆ తేజస్సులో బ్రహ్మదేవుడను అనే నేను ఒక భాగం మాత్రమే.

కనుక ఆ తేజస్సును నేను కన్నులారా చూడలేకపోతున్నాను.

ఆ విషయం గ్రహింపుకు రాగానే ఆయన పరవశించి పోయాడు. అన్ని ఇంద్రియాలూ వ్యాపార శూన్యములు అయిపోయాయి. తండ్రిని అత్యంత దగ్గరగా చూసిన ఆనందంతో చేష్టలుడిగిపోయి నిలబడిపోయాడు.

ఇదీ సంగతి!

సంభవః – తనకు తానుగానే ఆవిర్భవించెడు వాడు.

మరి ఆయనకు సృష్టి చేయటం ఒక లెక్కా?

భావనః – కామితార్ధములను ప్రసాదించువాడు. మాలిన్యములు తొలగించి పునరుజ్జీవింపజేయువాడు.

చేసి చూపించాడు 5300 సంవత్సరాల క్రితం. బ్రహ్మ గారు ఆశ్చర్యం చకితుడైయ్యే విధంగా.

ప్రభవః – దివ్యమైన జన్మ (అవతరణము) గలవాడు. కర్మ బంధములకు లోనుగాకుండనే అవతరించువాడు.

అందుకేగా మాయామోహములకు లొంగలేదు. బ్రహ్మ చేసిన పన్నాగాన్ని అతి సులువుగా తిప్పికొట్టాడు.

ప్రభుః – సర్వాధిపతి, సర్వ శక్తిమంతుడు. బ్రహ్మాదులకు కూడ భోగ మోక్షములొసగు సమర్ధుడు.

ఇక చెప్పేదేముంది. బ్రహ్మ గారికి విషయం గ్రహింపుకొచ్చింది.

ఎక్కడో ప్రాచీన కాలంలో కాదు. మన కాలానికి కూతవేటు దూరంలో ఉన్న జరిగిన అత్యద్భుత సంఘటన.

ఈశ్వరః.

ఈశ్వరుడు.

శ్రీమహావిష్ణువుకు బహు గొప్పగా ఒప్పే నామములు ఇవన్నీ!

ఈ చరాచర జగత్తులో, విశ్వంలో (అది కూడా ఆయనే కదా), ఆ శ్రీమహావిష్ణువొక్కడే స్వయంభూః!

చూద్దాం!

బ్రహ్మ గారికి మాయ తొలగాక వేదఙ్ఞానం తిరిగి వచ్చింది. గోవులు తిరిగి వాటి నెలవులకు చేరాయి. ఈ విధంగా గో (వేద) రక్షణ చేసినాడు కనుక ఆ శ్రీమహావిష్ణువు గోవిందుడు.

ఇక్కడ multiverse theory, parallel universe theory కనిపిస్తాయి. ఒక్కసారి వాటిని కూడా పరిశీలిద్దాం!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here