తల్లివి నీవే తండ్రివి నీవే!-44

1
10

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

పద్మప్రియా వల్లభ

హేమకూటవిమానాంతః భ్రాజమానాయ హారిణే।

హరిలక్ష్మీసమేతాయ పద్మనాభాయ మంగళమ్॥

శ్రీవైకుంఠవిరక్తాయ శంఖతీర్థాంబుధేః తటే।

రమయా రమమాణాయ పద్మనాభాయ మంగళమ్॥

(అనంత పద్మనాభ స్వామి మఙ్గళాశాసనమ్ 3, 4)

పద్మ, కమల ఇత్యాదులకు సంబంధించిన నామములు శ్రీమహావిష్ణువునకు అత్యంత ప్రీతిపాత్రమైనవి అని గతంలో చెప్పుకున్నాము. శయన రూపంలో వెలసిన శ్రీ అనంతపద్మనాభస్వామి కేవలం వైష్ణవులకే కాదు, భారతీయులకు అత్యంత ప్రీతిపాత్రమైన దైవం. పౌరాణిక విశిష్టత సంతరించుకున్న, చారిత్రక నేపథ్యం కలిగిన సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం కేరళలో ఉన్న తిరువనంతపురం.

శ్రీమహావిష్ణువు యోగనిద్రా మూర్తిగా దర్శనం ఇచ్చే ఆ ఆలయం అపురూప శిల్పకళకు నిలయం. శ్రీమహావిష్ణువు కొలువైన 108 పవిత్ర క్షేత్రాల్లో అనంత పద్మనాభ క్షేత్రం ఒకటి. ‘పద్మనాభ’ అంటే నాభియందు పద్మము కలిగిన వాడు అని అర్థం. యోగ నిద్రామూర్తిగా శయనించి ఉండగా, నాభి నుంచి వచ్చిన కమలంలో బ్రహ్మ ఆసీనుడై ఉన్న అనంత పద్మనాభ స్వామి దివ్య మంగళ రూపం భక్తులకు నయనానందం కలిగిస్తుంది. శేషుడి మీద శయనించిన శ్రీమహావిష్ణువు చేతి కింద శివ లింగం కూడా ఉంటుంది. ఈ విధంగా ఈ ఆలయం త్రిమూర్తులకు నిలయం. గర్భగుడిలో మూలవిరాట్టు వెనుక, కుడి, ఎడమ గోడల మీద అపురూపమైన దేవతామూర్తుల చిత్రాలు ఉంటాయి. శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీమహావిష్ణువు ఉత్సవ మూర్తుల విగ్రహాల్ని కూడా భక్తులు దర్శించుకోవచ్చు. తిరిమళిశై ఆళ్వార్ చెప్పిన పాఠమునకు ఉదాహరణగా కూడా ఈ దేవాలయం నిలుస్తుంది.

పద్మనాభస్వామి దేవాలయం పుట్టు పూర్వోత్తరాల గురించి కేరళ ప్రాంతంలో ఎన్నో కథలు చెప్పుకుంటూ ఉంటారు. వాటిలో ప్రధానమైనది ‘విల్వ మంగళతు స్వామియార్’గా ప్రసిద్ధికెక్కిన దివాకర ముని కథ. ఆ ముని శ్రీకృష్ణ భగవానుడి దర్శనం కోసం తపస్సు చేశాడు. ఆయనను కరుణించేందుకు భగవంతుడు మారు రూపంలో, ఒక అల్లరి పిల్లవాడిగా వచ్చాడు. ముని పూజలో ఉంచిన ఒక సాలగ్రామాన్ని తీసుకొని మింగేశాడు. కోపంతో ఆ పిల్లవాడిని ముని తరిమికొట్టగా, బాలకుడి రూపంలో ఉన్న శ్రీ కృష్ణ పరమాత్మ సమీపంలో వున్న ఒక చెట్టు పక్క దాక్కున్నాడు. మరుక్షణమే ఆ చెట్టు పడిపోయి, విష్ణుమూర్తిగా మారిపోయింది. శయన భంగిమలో- అనంత శయనంగా – యోగ నిద్రా మూర్తి తరహాలో స్వామి దర్శనమిచ్చాడు. అనంత పద్మనాభ స్వామి అంటే అక్కడ అనంతుడు అంటే ఆదిశేషుడు. ఆదిశేషుడితో కూడిన పద్మనాభ స్వామి. లేదా ఆదిశేషుని పై శయనించిన పద్మనాభ స్వామి.

అప్పుడు స్వామి రూపం/ఆకారం దగ్గర నుంచీ చూడలేనంత పెద్దదిగా ఉంది. అంత పెద్ద ఆకారాన్ని దగ్గరగా నిలుచుని పూర్తిగా, తనివి తీరా దర్శించుకోలేక పోతున్నాననీ దివాకరముని స్వామి వారిని ప్రార్థించగా, స్వామి మూడవ వంతు పరిమాణానికి తగ్గి దివాకరముని ని అనుగ్రహించాడు. అయితే ఆ రూపం కూడా పెద్దది గానే ఉన్నది. మూడు ద్వారాల గుండా మాత్రమే తన దర్శనానికి వీలుంటుందని స్వామి వారు చెప్పారు. ఇక్కడో విశేషం ఉంది, సందర్భానుసారంగా చూద్దాము.

అనంతపద్మనాభస్వామి ఆలయంలో ఇప్పుడున్న ఆ మూడు ద్వారాలు రావడానికి అదే కారణమంటారు. ఏడు పరశురామ క్షేత్రాలలో ఒకటైన పవిత్ర స్థలంలో ఈ పద్మనాభ స్వామి దేవాలయం ఉందని మరొక నమ్మకం. కేరళ రాష్ట్రంలోని పదకొండు దివ్యక్షేత్రాలలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఒకటని ఆళ్వారులు రచించిన దివ్య ప్రబంధ గ్రంథాలు చెబుతున్నాయి. బ్రహ్మ, వాయు, వరాహ, పద్మ, స్కాంద పురాణాలలో ఈ దేవాలయం ప్రస్తావన వుంది. శఠారి అయిన శ్రీనమ్మాళ్వార్ ఈ పద్మనాభ స్వామి దేవాలయాన్ని కీర్తిస్తూ, నాలుగు పాశురాలను అనుగ్రహించారు. ఆ తిరు (శ్రీ) అనంత పద్మనాభ స్వామి కొలువున్న పురం కనుక ఆ ఊరు తిరు-అనంతపురం లేదా తిరువనంతపురం అయింది.

ఇంతకీ ఆ దివాకర మునిని స్వామి అనుగ్రహించకుండా ఎందుకు ముందు పరీక్షించారు?

ఆయన హృషీకేశుడు కనుక. దివాకరముని హృషీకములు ఆయన అధీనంలో ఉండటం వలన ఆ ముని దోషాలను గ్రహించాడు కనుక వారిని ఉద్ధరించేందుకు ఆ పరీక్ష పెట్టారు. బాలుని రూపంలో తిరుమలలో శ్రీ అనంతాళ్వాన్‌ను కూడా పరీక్ష పెట్టిన ఉదంతం కూడా ఉంది. దాని గురించి సమయానుకూలంగా తెలుసుకొనవచ్చు. ఈ అనంత అనే శబ్దానికి, బాల రూపంలో స్వామి అగుపించటానికి ఏ చిత్రమైన సంబంధం కలదో!

పద్మ, కమల, నీరజ (నీరజాక్షుడు).. ఇవన్నీ శ్రీహరిని వర్ణించేందుకు వాడతారు. పైగా ఆ నామములు కూడా శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైనవి. ఎందుకు?

ప్రత్యేకించి విశిష్టాద్వైతం గట్టిగా ప్రకటితమయ్యే ఉదంతాలకు బీజం లాంటిది అయిన

తస్యయథా కప్యాసం పుండరీక మేవ మక్షిణీ” అను సూత్రమునకు రామానుజుల వారు ఇచ్చిన భాష్యం

<<<“గంభీరాంభ స్సమూఁద్భూత సుమృష్ఠానాళ రవికర వికసిత పుండరీక దళామలాయ తేక్షణ:”

బాగుగా లోతైన సరస్సులో ఆవిర్భవించిన మృదువైన నాళము మీద సూర్యకిరణములచే వికశింపచేయబడిన రమ్యమైన తామరపద్మము యెక్క రేకుల వంటి విశాలమైన నేత్రములు కల స్వామి.>>>

కూడా ఉంది కదా!

48.పద్మనాభః

పద్మం నాభౌ యస్యాసౌ పద్మనాభః॥ – ఎవనికి పద్మము నాభి యందు కలదో అతడు పద్మనాభుడు.

పదోర్మా యస్యాసౌ పద్మః నాభే రాఙ్ఞోయం వృషభ రూపేణ ఇతి నాభః॥

ఇప్పుడు ఇక్కడ ఈ పద్మ సంబంధం స్వామికి ఎందుకు ఇష్టమో తెలుస్తుంది.

ఎవని పాదముల యందు “మా” మా అనగా లక్ష్మీదేవి కొలువై ఉన్నదో ఆతడు పద్ముడు. నాభి అనే రాజుకు వృషభుడుగా జన్మించాడు కనుక ఈతను నాభుడు. పద్ముడు, నాభుడు కనుక ద్వంద్వ సమాసాన్ని అనుసరించి పద్మనాభుడయ్యాడు శ్రీహరి.

ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఒకటి ఉంది.

పాదముల వద్ద లక్ష్మి ఉండటం అనేది చాలామంది అపార్థం చేసుకుంటారు. దానికి పెద్దలు ఐహికములైన సంపదలను అధీనంలో ఉంచుకొనుట అంటూ.. వివరణలు ఇస్తారు.

పాదములు కదలికకు, చైతన్యానికి చిహ్నాలు. అక్కడ లక్ష్మి అంటే విష్ణుశక్తి.. అనగా ఆ చైతన్య శక్తి అని అర్థం. గమనము అన్నది ఒక నిరంతర ప్రక్రియ. ఆ గమనశక్తిని మనకు ఈ రూపంలో చూపిస్తారు.

త్రిమూర్తులలో విష్ణువు (శ్రీమహావిష్ణువు కాదు) స్థితి కారకుడు. పోషకుడు. పోషించాలంటే పని చేయాలి. అంటే కదలిక కావాలి.

Entire physics and its existence are defined by the laws of motion. Without motion Physics is null. ఆ గమన శక్తిని గురించి చెప్పేదే ఈ వివరణ.

వృషభుడు లేదా ఋషభుడు అవధూత తత్వం తెలిపిన అవతారము. మరి దానికి ఈ నామమునకు ఎందుకు సంబంధం కలిగింది?

ఆ వివరాలను వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాము. మధ్యలోనే 47వ నామమైన హృషీకేశః అన్న దానిని కూడా తెలుసుకుందాము.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here