తల్లివి నీవే తండ్రివి నీవే!-48

0
17

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

స్మృతి, శృతి

నమః శ్రియై లోకధాత్ర్యై బ్రహ్మమాత్రే నమో నమః।

నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః॥1॥

ప్రసన్నముఖపద్మాయై పద్మకాంత్యై నమో నమః।

నమో బిల్వవనస్థాయై విష్ణుపత్న్యై నమో నమః॥2॥

విచిత్రక్షౌమధారిణ్యై పృథుశ్రోణ్యై నమో నమః।

పక్వబిల్వఫలాపీనతుంగస్తన్యై నమో నమః॥3॥

సురక్తపద్మపత్రాభకరపాదతలే శుభే।

సురత్నాంగదకేయూరకాంచీనూపురశోభితే।

యక్షకర్దమసంలిప్తసర్వాంగే కటకోజ్జ్వలే॥4॥

మాంగల్యాభరణైశ్చిత్రైర్ముక్తాహారైర్విభూషితే।

తాటంకైరవతంసైశ్చ శోభమానముఖాంబుజే॥5॥

పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే।

ఋగ్యజుస్సామరూపాయై విద్యాయై తే నమో నమః॥6॥

ప్రసీదాస్మాన్ కృపాదృష్టిపాతైరాలోకయాబ్ధిజే।

యే దృష్టాస్తే త్వయా బ్రహ్మరుద్రేంద్రత్వం సమాప్నుయుః॥7॥

(ఇతి శ్రీవరాహపురాణే శ్రీవేంకటాచలమాహాత్మ్యే నవమోఽధ్యాయే దేవాదికృత శ్రీలక్ష్మీస్తుతిర్నామ మహాలక్ష్మీచతుర్వింశతినామస్తోత్రమ్)

51.మనుః

మననము చేయు మహిమాన్వితుడు. సంకల్పము చేతనే సమస్తమును సృష్టించిన వాడు.

ద్వైత వ్యాఖ్య ప్రకారం..

॥అవబోధరూపత్వాన్మనుః॥ – జ్ఞాన స్వరూపుడైన వాడు మనుః

అద్వైత వ్యాఖ్య ప్రకారం..

॥మననాత్ మనుః॥ – చితించువాడు, మననము చేయువాడు.

॥మాన్యోఽతోఽస్తి మన్తా॥ ఇతి శృతేః

॥మన్త్రో వా ప్రజాపతిర్వా మనుః॥ – మంత్ర స్వరూపుడు. ప్రజాపతి స్వరూపుడు.

శ్రీ భగవానువాచ।

ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్।

వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవేఽబ్రవీత్॥

(భగవద్గీత 4.1)

నేను ఈ సనాతనమైన యోగ శాస్త్రమును సూర్య భగవానుడైన వివస్వానుడికి చెప్పాను. అతను మనువుకి, మనువు ఇక్ష్వాకునికి దీనిని ఉపదేశించారు.

ఆ మనువు. వైవస్వత మనువు. ప్రస్తుతం మనం ఉన్న మన్వంతరమునకు చెందిన మనువు.

ఇక పరాశర భట్టరు వ్యాఖ్య చూద్దాము.

॥సంకల్ప లవమాత్రాచ్చ మననాత్ మనుః ఉచ్యతే॥ – తన సంకల్ప మాత్రము చేతనే, తన శక్తిలో లవలేశమును మాత్రమే వాడి (వేయవ వంతు అనుకోవచ్చు) అటు విరాట్ పురుషుని, ఇటు హిరణ్యగర్భుడైన బ్రహ్మను సృష్టించినవాడు మనుః

తన సంకల్పము లేదా కేవలం ఆలోచనతోనే ఈ సృష్టిని చేసి, నిర్వహించువాడు మనువు.

మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా।

మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః॥

(భగవద్గీత 10.6)

సప్త ఋషులు, వారి పూర్వం నలుగురు మహాత్ములు (సనకసనందాదులు), పద్నాలుగు మంది మనువులు, వీరందరూ నా మనస్సు నుండే జన్మించారు. వారి నుండే ఈ లోకం లోని సమస్త ప్రజలు అవతరించారు.

అని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ చెప్తాడు. ఆ విధంగా వీరందరినీ తన మనస్సంకల్పం చేతనే సృష్టించిన కారణంచేత కూడా ఆయన (ఆ విశ్వశక్తి) మనుః.

శబ్దశాస్త్రం ప్రకారం

॥మన జ్ఞానే – మను అవబోధనే – మనుతే బుధ్యతే॥ – తెలుసుకొనుట. మనశ్శక్తి. ఆ శక్తి ఉన్న దేవతా స్వరూపమే మనువు.

॥నాన్యతోస్తిమన్తా॥ – వీనికంటే తెలుసుకునేవాడు లేడు. ఆలోచనాశక్తియే విష్ణువు. అందుకే ఆయన మనువు.

ఐన్ ర్యాండ్ సంపదను నిర్వచిస్తూ తన మేగ్నమ్ ఆపస్ అని చెప్పే అట్లాస్ ష్రగ్డ్ లో ఫ్రాన్సిస్కో డాంకోనియా చేత ఇలా చెప్పిస్తుంది.

Wealth is the product of man’s capacity to think.

Wealth. సంపద. ఆలోచనా శక్తికి రూపం. ఆలోచనాశక్తి విష్ణువు. ఆ శక్తికి రూపం లక్ష్మీదేవి.

52.త్వష్టా

శిల్పివలె నానా విధ రూపములను, నామములను తయారు చేసినవాడు. బృహత్పదార్ధములను విభజించి సూక్ష్మముగా చేసి ప్రళయ కాళమున తనయందు ఇముడ్చుకొనువాడు.

ద్వైత వ్యాఖ్యానం ప్రకారం..

॥దీప్తా॥ – తేజోరూపుడు. ప్రకాశించునట్టివాడు.

శంకర భాష్యం ప్రకారం..

॥సంహారసమయే సర్వభూతతనూకారణత్వాత్ త్వష్టా త్వక్షతేస్తనూకారణార్థాత్ తృచ్ ప్రత్యయః॥ – సంహార సమయమున అందరినీ కృశింపజేయువాడు.

ఇక భట్టరు వ్యాఖ్యకు వస్తే..

॥త్వక్షతి తనూకరోతీతి త్వష్టా॥ – విభజించువాడు.

వేటిని విభజిస్తాడు? దేనికి విభజిస్తాడు? ఎలా విభజిస్తాడు?

॥త్వచ్ఛాతీతి తమాకరోతీతి త్వష్టా॥ – నామరూపాత్మకములను విడివిడిగా అని వేదములో నిరుక్తములో

॥త్వష్టా రూపాణామధిపతిః॥ – మనకు గోచరమయ్యే సర్వమునూ – రూప గుణ విశేషాలతో – తయారుచేయువాడు త్వష్ట. దీని వలన పై మూడు నామములకు (అమరప్రభుః, విశ్వకర్మా, మనుః) అధిభూతమైన పరమాత్మయే విశ్వమును నిర్మించాడు. సృష్టించాడు. అందుకే ఆయన విశ్వకర్మా!

మనువులను మనస్సుతో సృష్టించాడు. మానసము.

ఏ విధంగా అయితే ఒక బ్రహ్మాండము నుంచీ ఉద్భవించినది ఎలా అయితే దాని లక్షణములను (దానితో పోలిస్తే తక్కువ మోతాదులో అయినా సరే) చూపుతుందో, చతుర్మఖ బ్రహ్మ గారు కూడా సృష్టి ప్రారంభించిన తరువాత ఆయన కూడా మానసపుత్రులను సృజించాడు. ఇక్కడ పుత్రులు అంటే సంతానం అని. లింగసంబంధంగా తీసుకోకూడదు.

ఇలా సమస్త రూపములకూ వాటి వాటి ప్రత్యేకమైన ఆకారములను, లక్షణములను ఇచ్చినవాడు కనుక ఆయన త్వష్టా.

ఇట్లు సృష్టికి అనువుగా ఉన్న విశ్వమును బ్రహ్మగారికి ఇచ్చినవాడు..

53.స్థవిష్టః

బ్రహ్మాండమును తనయందు ఇముడ్చుకొన్న బృహద్రూప మూర్తి. సమస్త భూతజాలమునందును సూక్ష్మ, స్థూల రూపములుగా నుండు విశ్వ మూర్తి.

దీనికన్నా ముందు మనం పై మూడు నామములను ఒక గుత్తిగా పరిశీలించాలి. దానికి కారణం..

విశ్వకర్మా – తయారు చేసేవాడు. మనుః – ఆలోచన, సంకల్పముతో అన్నిటినీ సృష్టించేవాడు. త్వష్టా – వైవిధ్యములగు నామ రూప విశేషాలను అందించేవాడు.

The Architect

The Executioner

The destroyer – అంటే ఇక్కడ నాశనము చేస్తాడు అని కాదు. శంకర వ్యాఖ్య ప్రకారం వచ్చిన సంహార సమయమున అందరినీ కృశింపజేయువాడు.

॥త్వష్టా రూపాణి పింశతు॥ – అథర్వణ వేదం నుంచీ.

॥త్వష్టా రూపాణి హి ప్రభుః॥ – ఋగ్వేద వాక్యం.

సామవేదం షణ్ముఖ శర్మ గారు ఈ త్వష్టా అనే నామాన్ని సూర్య సంబంధంగా కూడా వివరించవచ్చు అన్నారు.

<<<రూపాలను, ఖనిజాలను, వృక్షాలను మలిచే శక్తి సూర్య కిరణాలలో ఉన్నది. మనం దేనినైనా చూడగలుగుతున్నామంటే అది వెలుతురు వలనే. ఆ వెలుతురు మనకు వచ్చేది సూర్యుని వలన. సూర్యాస్తమయం తరువాత ప్రపంచంలో పని చేసే సౌరశక్తిని త్వష్టా అంటారు. వివిధావస్థలలో సౌరశక్తి ప్రక్రియలను అనుసరించి వివిధ సూర్య నామాలను వేదం వివరించింది>>>

పై విషయాన్ని మరింత విస్తరించి ముందుకు తీసుకుని వెళితే ఎన్నో విశేషాలు మనకు తెలుస్తాయి.

బయాలజీలో ఫొటోట్రాపిజమ్ గురించి చదివి ఉంటారు.

Phototropism is the growth of an organism in response to a light stimulus. It’s most commonly observed in plants, but can also occur in other organisms like fungi.

Light Detection: Plants have specialized cells called photoreceptors that detect light.

Hormone Redistribution: When light hits a plant from one side, the hormone auxin is redistributed to the shaded side of the stem or shoot.

Cell Elongation: Auxin promotes cell elongation on the shaded side, causing that side to grow faster than the illuminated side.

Bending: The uneven growth results in the stem or shoot bending towards the light

ఫోటోట్రోపిజం అంటే కాంతి ఉద్దీపనకు ప్రతిస్పందనగా ఒక జీవి యొక్క పెరుగుదల/ఎదుగుదల. ఇది సాధారణంగా మొక్కలలో మనం చూస్తాము. కొన్ని శిలీంద్రియాలలో కూడా శాస్త్రవేత్తలు గమనించారు.

ఇది ఎలా పనిచేస్తుంది:

కాంతి వైపు గమనం: మొక్కలు కాంతిని గుర్తించే ఫోటోరిసెప్టర్స్ అని పిలువబడే ప్రత్యేక కణాలను కలిగి ఉంటాయి.

హార్మోన్ పునఃపంపిణీ: ఒక వైపు నుండి కాంతి మొక్కను తాకినప్పుడు, ఆక్సిన్ అనే హార్మోన్ కాండం లేదా రెమ్మ యొక్క నీడ పడిన వైపుకు పునఃపంపిణీ చేయబడుతుంది.

కణాల సాగతీత: ఆక్సిన్ నీడ ఉన్న వైపున కణాల సాగదీతను ప్రోత్సహిస్తుంది, దీని వలన ఆ వైపు ప్రకాశవంతమైన వైపు కంటే వేగంగా పెరుగుతుంది.

వంగుట: ఈ అసమానంగా ఉండే పెరుగుదల కాండం లేదా రెమ్మ కాంతి మూలం వైపు వంగడానికి దారితీస్తుంది.

ఏది ఏమైనా కాంతి వైపు జీవుడి గమనం.

చాతుర్వర్ణ్యం మయా సృష్టం అంటూ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన దానిని భగవద్రామానుజులు విభిన్నంగా వ్యాఖ్యానిస్తారు. మామూలుగా అందరూ చూసే విధంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు అని కాకుండా

  1. దైవ
  2. మానుష
  3. స్థావర
  4. జంగమాలు

అని తెలియజేస్తారు. దేవతలు – బ్రాహ్మణ (సత్వ గుణం), మానవులు క్షత్రియ (రజోగుణం), స్థావరములు (చెట్లు, రాళ్ళు, పర్వతాలు.. – వైశ్య), జంగమాలు (తిరిగే జంతువులు – శూద్ర).

ఎలా అయితే వైశ్యులు తమకున్న వనరులను వీలైనంత తక్కువ పెట్టుబడిగా వాడి వీలైనంత ఎక్కువ లాభాలను గడించాలని చూస్తారో (lack quality not allowed or the business will go down) స్థావరాలైన వుక్షాలు, మొక్కలు వాటి జీవనానికి ఆధారమైన ప్రధాన వనరు అయిన సూర్యరశ్మిని బాగా ఉపయోగించుకునేందుకు చేయవలసినదంతా చేస్తాయి.

అంటే ఇక్కడ త్వష్టా అన్న నామము సూర్య సంబంధంగా ఉన్నప్పుడు ఎలా ప్రాధాన్యత సంతరించుకుంటుందో చూశాము.

దీనంతటికి మూల కారణము విశ్వకర్మా. ఆ విశ్వకర్మ సంకల్పము చేత ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. ఇన్ని రకాలైన భిన్న జీవాజీవరాశులు మనుగడలో ఉండటానికి కారణభూతుడు ఆ శ్రీమన్నారాయణుడు.

ఇంకా వివరంగా ఆలోచిస్తే విశ్వచైతన్యం అనేది ప్రతి జీవుడిలోను ఉంటుంది. ప్రతి జీవుడు ఆ విశ్వచైతన్యశక్తిలో భాగమే. విశ్వుడు అంటే జీవుడు. ఆ జీవుని చేత కర్మ చేయించే చైతన్యశక్తియే విశ్వకర్మా. అది శ్రీహరియే.

ఆ విశ్వకర్మ ఆలోచనా భావనా శక్తులుగా పని చేసినప్పుడు మనువు. శరీరంలో కూడా అనేక అవయవాలు వాటి వాటి నిర్దుష్టమైన పనులకు సృష్టింపబడి ఉన్నాయి. అనేక కణాలు, కండరాలు, కండర సమూహాలు వాటి వాటి బాధ్యతలను నెరవేరుస్తూ ఉంటాయి. మన దేహ విశ్వంలో పనిచేసే విశ్వకర్మ చైతన్యం ఈ రూపాలను మలిచే శక్తిగా పని చేసినప్పుడు త్వష్టా అనిపించుకుంటున్నాడు.

ఇంక శ్రీమహాలక్ష్మి విష్ణు చైతన్య శక్తిగా మనం మొదట ప్రతిపాదించుకున్నాము. ఆ వివరాలను చూసే ముందు..

విశ్వ సృష్టి రచన, విశ్వ నిర్వహణా సామర్థ్యం, ఇవన్నీ సక్రమంగా జరిగేందుకు కావలసినవన్నీ విష్ణుమూర్తికి ఇంత విస్తారంగా ఎలా ఒప్పాయో స్థవిష్ఠః అనే నామం చెపుతుంది!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here