[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
కృష్ణం వాసుదేవం జగద్గురమ్-2
దేవకీతనయ దుఃఖదవాగ్నే రాధికారమణ రమ్యసుమూర్తే।
దుఃఖమోచన దయార్ణవ నాథ శ్రీపతే శమయ దుఃఖమశేషమ్॥4॥
గోపికావదనచంద్రచకోర నిత్య నిర్గుణ నిరంజన జిష్ణో।
పూర్ణరూప జయ శంకర శర్వ శ్రీపతే శమయ దుఃఖమశేషమ్॥5॥
గోకులేశ గిరిధారణ ధీర యామునాచ్ఛతటఖేలనవీర।
నారదాదిమునివందితపాద శ్రీపతే శమయ దుఃఖమశేషమ్॥6॥
ద్వారకాధిప దురంతగుణాబ్ధే ప్రాణనాథ పరిపూర్ణ భవారే।
జ్ఞానగమ్య గుణసాగర బ్రహ్మన్ శ్రీపతే శమయ దుఃఖమశేషమ్॥7
(అచ్యుతాష్టకమ్ 2, శ్రీ శంకరకృత)
దేవకీ దేవి ఏడవ మారు గర్భం ధరించినప్పుడు, శ్రీమహావిష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని గోకులంలో ఉన్న రోహిణీ దేవి గర్భంలో ప్రవేశ పెడతాడు. ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు. చెరసాలలో దేవకికి గర్భస్రావం అయిందని జనులు అనుకుంటారు. కొన్ని రోజులకు దేవకీ దేవి ఎనిమిదో మారు గర్భం ధరిస్తుంది. దేవకీదేవి ఎనిమిదో మారు గర్భం ధరించి నప్పుడు కంసుడికి చెడు శకునాలు, మృత్యు భీతి కలుగుతుంది. లక్ష్మీనాథుడు దేవకి గర్భములో ఉండడం చూసి దేవతలు, యక్ష, కిన్నర, కింపురుషులు దేవకీ దేవి ఉన్న చెరసాలకు వచ్చి స్తుతిస్తారు.
శుకమహర్షి శ్రీకృష్ణ జననాన్ని ఈ విధంగా వర్ణించాడు.
అథ సర్వగుణోపేతః కాలః పరమశోభనః।
యర్హ్యేవాజనజన్మర్క్షం శాంతర్క్షగ్రహతారకమ్॥10.3.1॥
దిశః ప్రసేదుర్గగనం నిర్మలోడుగణోదయమ్।
మహీమంగళభూయిష్ఠపురగ్రామవ్రజాకరా॥10.3.2॥
శుభముహూర్తం సమీపించే కొద్దీ రోహిణి నక్షత్రం ఉచ్చస్థితిలో ఉంది. అన్ని గ్రహాలు, ఇతర నక్షత్రాలు ఈ సందర్భానికి తగిన విధంగా ఉండాల్సిన చోట్లకు వాటంతట అవే చేరుకున్నాయి. స్వామి అవతార ప్రయోజనాన్ని నెరవేర్చేందుకు తగిన విధంగా. అందుకే శ్రీకృయ్ణ భగవానుడు శ్రీమద్భగవద్గీతలో చెప్పినట్లు..
॥కాలోఽస్మి లోకక్ష్యయకృత్॥ – మహాకావ్యం స్వరూపుడు ఆయన. అన్నీ ఆయన అధీనంలో ఉంటాయి. అది మరోమారిక్కడ నిరూపితమైనది.
నద్యః ప్రసన్నసలిలా హ్రదా జలరుహశ్రియః।
ద్విజాలికుల సన్నాద స్తబకా వనరాజయః॥10.3.3॥
వవౌ వాయుః సుఖస్పర్శః పుణ్యగన్ధవహః శుచిః।
అగ్నయశ్చ ద్విజాతీనాం శాంతాస్తత్ర సమిన్ధత॥10.3.4॥
నదులు, సరస్సులు, చెరువులు మొదలైనవి నీటితో నిండి ఉన్నాయి. నీరు స్పష్టంగా విశ్వాన్ని ప్రతిబింబిస్తున్నట్లు అనిపించింది. పక్షుల కిలకిలారావాలతో అడవులు నిండిపోయాయి. మనసుకు ఆహ్లాదకరంగా ప్రకృతి వికసించినట్లు అనిపించింది. అంతటా ప్రశాంతమైన నిశ్శబ్దం ఆవరించింది. శాంతి అకారణంగా అంతటా రాజ్యమేలడంతో అందరూ సుఖంగా ఉన్నారు. కంసుడు వంటి దుర్మార్గులు తప్ప.
ఈ సమయంలో, చీకటి వేళ అర్ధరాత్రి, దేవకీదేవి దివ్య పురుషునికి జన్మనిచ్చింది. ఆ పురుషుడు నాలుగు చేతులతో జన్మించాడు. ఆ హస్తాలలో శంఖ చక్ర గదా పద్మాలు ఉన్నాయి. కిరీటం సూర్యసమ తేజంతో వెలిగిపోతోంది. చెవిపోగులు మరియు ఆభరణాలతో అలంకరించబడ్డాడు. దట్టమైన మేఘంలా నల్లగా ఉన్నాడు. పసుపు వస్త్రం ధరించి, ఆ మహిమాన్వితుడు దయతో, దేవకీ వసుదేవుల మనస్సులలో ఎటువంటి సందేహాలకూ తావు లేకుండా శ్రీహరి స్వయంగా జన్మించాడు.
అప్పుడా దివ్య పురుషుని దేవకీవసుదేవులు పూజించారు తగువిధంగా. వారిని ఇక వేచి ఉంచకుండా ఆ శ్రీహరి బాలుడిగా మారిపోయాడు.
జ్ఞాని అయిన వసుదేవుడు ఆ బిడ్డలోని దైవత్వానికి సంబంధించిన చిహ్నాలను వెంటనే గుర్తించి, ఆ బిడ్డకు సాష్టాంగ నమస్కారం చేసి, అలా కనిపించినందుకు సర్వశక్తిమంతుడిని ప్రశంసించాడు. కంస రూపంలో పొంచి ఉన్న ఆపదను గ్రహించిన వసుదేవుడు, “ఓ ప్రభూ, ఈ లోక రక్షణ కోసం నువ్వు ఇప్పుడు నా ఇంట్లో ప్రత్యక్షమయ్యావు. ఈ సమస్త సృష్టికి నీవే ప్రభువు. ఈ లోకంలో రాజులుగా సంచరిస్తున్న రాక్షసుల సైన్యాలను, అమాయక ప్రజల రక్షణ కోసం మీరు కూల్చివేస్తారు. ఓ ప్రభూ, నువ్వు మా ఇంట్లో పుడతావు అన్న ఆకాశవాణి పలుకులు విన్న రాక్షస రాజు కంసుడు నీ అన్నలందరినీ చంపేశాడు. నువ్వు పుట్టావు అని విన్న వెంటనే కంసుడు తన ఆయుధాలతో నిన్ను చంపడానికి వస్తాడు.”
దేవకీదేవి కూడా చాలా ఆశ్చర్యపోయింది అదే సమయంలో కంసుని నుంచీ పొంచి ఉన్న ముప్పు గురించి మరింత భయపడింది. కనిపించే అన్ని చిహ్నాలతో పిల్లల యొక్క దైవత్వాన్ని ఎవరికీ కనిపించకుండా దాచడం కష్టమని ఆమె భయపడింది. ఆమె తన ఒడిలో పసిబాలుని రూపంలో ఉన్న పరమాత్మను ఈ క్రింది విధంగా ప్రార్థనతో సంబోధించింది. “ఓ ప్రభూ! శ్రీమన్నారాయణా! నీవు సమస్త విశ్వానికి ఆధారభూతుడవు. జ్ఞానమనే వెలుగువు. నువ్వు పరబ్రహ్మానివి. భౌతికాథ్యాత్మిక జగత్తులన్నిటికీ కారణము నీవే. సకలకాణకారుడవు నీవే. నిన్ను ఆశ్రయించిన వారందరినీ నీవు రక్షిస్తావు. ఉగ్రసేన మహారాజు కుమారుడైన కంసుడి భయం నుండి నీవు మమ్మల్ని రక్షించావు. ఓ ప్రభూ! యోగులు మరియు జ్ఞానులు నిన్ను నేను ఇప్పుడు చూసే రూపంలో గ్రహిస్తారు. నీ రూపాన్ని బట్టి కంసుడు నిన్ను ఎలా గ్రహిస్తాడో మరి. నీ శక్తి తెలియని వ్యక్తులు ఈ రూపంలో అలాంటి బిడ్డ ఎలా పుడుతుందో అర్థం చేసుకోలేరు. అందువల్లే నీవిప్పుడు మాకు సాధారణ శిశువు వలె గోచరించి అనుగ్రహిస్తున్నావు. నిన్ను ఈ చెఱపట్టి నుంచీ తప్పించే మార్గం తెలిపి అనుగ్రహించు.
సర్వోన్నతుడు అయిన ఆ భగవానుడు అప్పుడు దేవకి మరియు వసుదేవులకు వారి గతం గురించి చెప్పాడు. “అమ్మా! పూర్వ జన్మలో నిన్ను పృష్ణి అని, వాసుదేవుడు సుతప అని పిలుచుకునేవారు. సంతానాన్ని సృష్టించమని బ్రహ్మదేవుడు మీ ఇద్దరికీ చెప్పినప్పుడు, మీరు నా అనుగ్రహం కోసం వేల సంవత్సరాలు తపస్సు చేసారు. నేను మీ ముందు కనిపించాను, మీరు నా లాంటి కొడుకును పొందాలనే కోరికను వ్యక్తం చేశారు, ఆ తర్వాత నేను పృష్ణిగర్భునిగా కనిపించాను. నేను మీకు వామనునిగా కూడా జన్మించాను మీరు అదితీకశ్యపులైనపుడు. నేను ఇప్పుడు మూడవసారి మీ కుమారునిగా వచ్చాను. ఇకపై మీరిద్దరూ నన్ను మీ కొడుకుగా మాత్రమే భావించండి, అంత్యకాలాన మీరు మోక్షాన్ని పొందుతారు.”
అదే సమయంలో పరమాత్ముని అధీనంలో ఉండే యోగమాయ నందగోపుని భార్య యశోదాదేవి గర్భాన స్త్రీ శిశువుగా గోకులంలో జన్మించింది.
ఆ మాయ విష్ణ్వాఙ్ఞతో ప్రపంచం మొత్తాన్ని ఆవరించింది. దేవకి మరియు వసుదేవులను పట్టి ఉంచిన గొలుసులు విడివడినాయి. వారికి కాపలాగా ఉన్న కాపలాదారులు నిద్రపోయారు. తాళం వేసిన తలుపులు తెరుచుకున్నాయి. భగవంతుని ఆదేశానుసారం, వాసుదేవుడు ఆ పిల్లవాడిని యమునా నది మీదుగా గోకులంలోని నందగోపుని నివాసానికి తీసుకువెళ్లాడు. ప్రవహిస్తున్న యమునా నది, వసుదేవునికి దారి ఇచ్చింది. ఆదిశేషుడు స్వామికి వరం వల్ల ఇబ్బంది కలుగకూడదని తన పడగలతో ఛత్రం పట్టాడు. తల్లిని నీవే తండ్రివి నీవే! పీఠికలో గోదా సంబంధంగా ఇదే విధంగా ఆదిశేషుడు ఛత్రంలాగా మారటం ఉంది.
గోకులంలో కూడా యాదలందవులందరూ యోగమాయకు కట్టుపడ్డారు. వాసుదేవుడు తన సొంత కొడుకుని యశోద పక్కన పెట్టి, ఆమె కూతుర్ని ఎత్తుకున్నాడు. బిడ్డ ప్రసవానికి అలిసిపోయిన యశోద ఏమి జరుగుతుందో తెలియక ఆనందంగా ఉంది.
వాసుదేవుడు ఆ చీకట్లో వచ్చిన దారినే తిరిగి కంసుని కారాగారానికి చేరాడు. అక్కడ ఆ పిల్లను దేవకి పక్కన పెట్టగానే కారగృహ ద్వారాలు మునుపటిలా మూసుకున్నాయి.
అప్పుడే పుట్టిన పాప ఏడుపు కాపలాదారులకు వినిపించింది.
గోకులంలో కూడా మాయ తొలగి పోతుండగా, యశోద కూడా తన పక్కనే ఉన్న మేఘంలా నల్లగా ఉన్న ఆ చిన్నారి ఏడుపులకు లేచింది.
ఇదంతా పరబ్రహ్మ మహిమను తెలిపే విధంగా ఉన్న జననం.
ఆయన జననం అందరినీ ఆనందపరచినది. ఆయన అంటే అందరికీ ఆకర్షణ మొదటి క్షణంలోనే ఏర్పడింది. అందుకే ఆయన కృష్ణుడయ్యాడు.
శ్రీకృష్ణ భగవత్తత్వాన్ని గ్రహించాక మిగిలిన నామములను పరిశీలిద్దాము.
(సశేషం)