తల్లివి నీవే తండ్రివి నీవే!-58

0
13

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

కృష్ణం వాసుదేవం జగద్గురమ్-5

యజ్ఞేశ అచ్యుత గోవిందా మాధవ అనంత కేశవా।

కృష్ణ విష్ణోహృషీకేశ వాసుదేవ నమోస్తుతే॥

కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే।

ప్రణతః క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః॥

ప్రణతః క్లేశ నాశాయ స్తోత్రవేత్రైక పాణయే।

ఙ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృత దిగే నమః॥

బాల కృష్ణుడు నందగోపుడు, ఇతర ప్రముఖులతో ఇంకా ఇలా కొనసాగించాడు.

“మనకు జీవన హేతువు లైన పశువులకూ, మన పశువులను తృణజలాదులచే నిత్యమూ పోషిస్తున్న పర్వతానికి, మనకు దీవెన లొసగే విప్రవర్యులకూ సంతుష్టి కలుగునట్లుగా యజ్ఞం చేయడం మంచి బుద్ధి అవుతుంది.

ఇంద్రయాగానికి ఏమేమి సంభారాలు తెప్పించదలిచారో అన్నీ విచారించి ఇప్పుడు తెప్పించండి. పరమాన్నములు, అప్పాలు, పిండివంటలు, పప్పుకూరలు వండించండి. హోమాలు చేయించండి. బ్రాహ్మణోత్తములకు గోదానాలు దక్షిణములతో కూడ సరస పదార్థ సంపన్నాలైన అన్నాలు పెట్టండి. అచంచల భక్తితో కొండకు పూజలు చేయండి. పతితులకు అనాథలకూ భోజనాలు పెట్టండి. కుక్కలు మొదలైన జంతువులచే భక్ష్యములు తినిపించండి. పశువులకు గడ్డి ఇవ్వండి.”

ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పినదంతా కర్మను గురించే కానీ దానిని ఈశ్వరార్పణముగా చేయమని.

ఈ మాట మనకు చారిత్రకముగా (అంటే ఇతిహాసములలో) చెప్పినది కేవలం శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే. మదర్పితమ్ అని కూడా చాలాసార్లు చెప్తాడు. అంటే కృష్ణుడే ఈశ్వరుడు.

శ్రీవైష్ణవము లేదా విశిష్టాద్వైతం ప్రకృతిని కూడా సత్యమనే చెప్తుంది. కాకపోతే అది నశ్వరము. కనుక దాని మీద ఎక్కువ దృష్టి పెట్టక శాశ్వతమైన ఈశ్వరుని పైనే త్రికరణములను లగ్నము చేయమని నేర్పుతుంది.

ఇలాంటి శ్రీకృష్ణుడు చెప్పిన పనిని నందాదులు చేస్తే, ఇంద్రుడు ఆయనకు ఎదురు వెళ్ళి భయంకరమైన గాలివాన సృష్టించి, మెరుపులు, ఉరుములతో అల్లకల్లోలం చేశాడు. అందరికీ ఙ్ఞానదీపాన్ని చూపే జగద్గురువు వాసుదేవుడికి మెరుపుల్లో ఉండే కాంతి ఒక లెక్కా?

అయినా ఆయన చులాగ్గా గోవర్ధన గిరి ఎత్తి, దాని క్రింద అందరికీ ఆశ్రయం కల్పించాడు.

అది ఎలాగో చూద్దాము.

కిరి యై ధర యెత్తిన హరి

కరి సరసిజముకుళ మెత్తుగతిఁ ద్రిభువన శం

కరకరుఁడై గోవర్థన

గిరి నెత్తెం జక్క నొక్క కేలన్ లీలన్.

(పోతన భాగవతము – 10.1-915)

కిరి = వరాహావతారుడు

ఐ = అయ్యి

ధరన్ = భూమిని

ఎత్తిన = ఉద్ధరించినట్టి

హరి = కృష్ణుడు

కరి = ఏనుగు

సరసిజ = పద్మము

ముకుళము = మొగ్గను

ఎత్తు = పైకెత్తుట

గతిన్ = వలె

త్రిభువన = ముల్లోకములను

శంకరకరుడు = సుఖము కలిగించు వాడు

ఐ = అయ్యి

గోవర్ధన = గోవర్ధనము అనెడి గోవర్ధన గిరి – <<<గో (గోవులు, జీవులు, ఇంద్రియములు) వర్ధనము (వర్ధిల్లజేయు) గిరి (ఉన్నతమైనది, పర్వతము)>>>

గిరిన్ = కొండను

ఎత్తెన్ = మీది కెత్తెను

చక్కన్ = చక్కగా

ఒక్క = ఒంటి

కేలన్ = చేతితో

లీలన్ = విలాసముగా.

కృష్ణుడు ఆదివరాహమూర్తియై భూమిని పైకెత్తిన అచ్యుతుడు కదా. అందుకే ముల్లోకాలకూ మోదం కలిగించాలని, ఏనుగు తామర మొగ్గను పైకెత్తిన అంత అవలీలగా, ఒక్క చేత్తో గోవర్ధన పర్వతాన్ని గొడుగులాగ పైకెత్తాడు.

దండిని బ్రహ్మాండంబులు

చెండుల క్రియఁ బట్టి యెగురఁ జిమ్మెడు హరికిన్

గొండఁ బెకలించి యెత్తుట

కొండొకపని గాక యొక్క కొండా తలఁపన్?

(పోతన భాగవతము – 10.1-916)

బ్రహ్మాండాలను పూబంతులలాగ విలాసంగా ఎగురేసే గోవిందుడికి, ఒక కొండను పెల్లగించి పైకెత్తడం సులువైన పని గాక పెద్ద ఘనకార్యమా?

బాలుం డాడుచు నాతపత్ర మని సంభావించి పూగుత్తి కెం

గేలం దాల్చిన లీల లేనగవుతోఁ గృష్ణుండు దా నమ్మహా

శైలంబున్ వలకేలఁ దాల్చి విపులచ్ఛత్రంబుగాఁ బట్టె నా

భీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీగోపగోపంక్తికిన్.

(పోతన భాగవతము – 10.1-918)

పసిపిల్లాడు ఆటలాడుతూ గొడుగు అంటూ పూలగుత్తిని చేత్తో ఎత్తి పట్టుకున్నట్లు, చిరునవ్వుతో శ్రీకృష్ణుడు గోవర్ధనపర్వతాన్ని ఎత్తి కుడి చేత ధరించాడు. దారుణమైన మేఘాల నుండి రాలుతున్న వడగండ్లవానకు భయపడుతున్న గోపికలను గోపకులకు గోవుల కోసం ఆ కొండను పెద్ద గొడుగులా పట్టుకున్నాడు.

ఆ గోవర్ధన గిరిధారి యొక్క లీలను తాముగా అనుభవిస్తున్న గోకులంలోని పెద్దలు నందునితో ఆశ్చర్యంగా ఇలా అన్నారు.

“కన్నులు తెరవని పసివాడిగా, ఇంకా నామకరణం కూడా జరిగిందో లేదో, ఉన్నప్పుడే చన్నులపాలు తాగి రక్కసి పూతనను చంపాడు. మూడు నెలల ముద్దు బాలుడుగా ఉన్నప్పుడే కోపంతో శకటాసురుణ్ణి కూలతన్నాడు. ఏడాది పిల్లవాడిగా ఉన్నప్పుడే మెడ పట్టుకుని తృణావర్తుడిని పడద్రోసి పరిమార్చాడు. బాలుడుగా ఉన్నప్పుడే పడతి యశోదమ్మ కినిసి రోటికి కట్టగా ఈడ్చుకుపోయి జంటమద్దులను కూలద్రోశాడు. లేగలను కాస్తూ బకాసురుడిని చీల్చేసాడు. వత్సాసురుణ్ణి వెలగచెట్టుకి కొట్టి చంపాడు. బలవంతుడైన ఖరుడనే దానవుణ్ణి నిర్మూలించాడు. తరచి చూస్తే ఈ శ్రీకృష్ణుడు మానవమాత్రుడు కాదు అని తెలుస్తోంది.

సాహసంతో ప్రలంబాసురుణ్ణి బలరాముడిచే చంపించాడు. దారుణమైన దావానలం మ్రింగేసాడు. తలపొగరు దిగేటట్లు కాళీయుడిని అవలీలగా త్రొక్కాడు. ప్రాణాలు తీయకుండా యమునా మడుగు నుండి బయటకు గెంటేసాడు.

ఏడేళ్ళ బాలుడు ఏమిటి? ఏనుగు తామరపువ్వును ఎత్తినట్లు ఇవాళ మనం అందరం చూస్తుండగా ఒక్క చేత్తో పర్వతాన్ని పైకెత్తడం ఏమిటి? ఇదెంతో అద్భుతంగా ఉంది కదా!”

చూశారా? ఇక్కడ కూడా తామరపువ్వు లేదా పద్మము తో పోలిక.

అణువు నుంచీ బ్రహ్మాండము వరకూ వ్యాపించి, వీటన్నిటిని నడిపేవాడు కదా ఈ వాసుదేవుడు. పద్మము అనగానే అణువు అన్న విషయము మనం ఙ్ఞప్తికి తెచ్చుకోవాలి.

అందుకే వారు ఇంకా ఇలా చెప్పారు.

“ఓ గోపనాయకా! నందమహారాజా! నీ కుమారుడు గావించే పనులు మనుజులకు సాధ్యమయ్యే పనులా? నీ కొడుకు మానవమాత్రుడు కాదయ్యా!”

కృష్ణుడుని పొగడుతున్న గోపకులను చూసి నందుడు మునుపు గర్గమహాముని చెప్పిన రహస్యం స్మృతికి తెచ్చుకుని, “అవునవును, శ్రీ కృష్ణుడు జగద్రక్షకు డైన ఆ నారాయణుడి నిజాంశమే అని మనసులో భావిస్తున్నాను,” అన్నాడు. ఆ మాటలు విని గోపకులు ఆశ్చర్యచకితులై కృష్ణుడు విష్ణుమూర్తి అవతారమని భావించి సేవించారు.

ఆ పైన ఇంద్ర గర్వభంగం మనకు అవసరమిక్కడ లేదు.

శ్రీకృష్ణుడే శ్రీమహావిష్ణువు అన్నది చాలు.

ఆ నామము వచ్చిన సందర్భములో మనము కన్నయ్య లీలలను, పలుకులను సేవించాము. అంతే!

59. లోహితాక్షః – తామర పూవు వలె సుందరమగు ఎర్రని కనులు గలవాడు. అంధకారమును తొలగించు ఎర్రని కనులు గలవాడు.

అఙ్ఞాన, మోహాంధకారాలను తొలగించు వాడు.

60. ప్రతర్దనః – ప్రళయకాలమున అంతటిని (విపరీతముగ) నాశనము చేయువాడు.

ఇంద్రుని విషయంలో చూపినది దానికి ఒక చిన్న నిదర్శనం.

61. ప్రభూతః – పరిపూర్ణుడై జన్మించిన వాడు.

దేవకీదేవికి సాక్షాత్ పరమాత్మ సగుణ సాకార రూపంలో జన్మించటం చూశాము.

జ్ఞాన (గీతోపదేశము)

బల (రాక్షస సంహారము)

ఐశ్వర్య (లేని ఐశ్వరేయములేవి?)

వీర్య (పరాకరమమునకు సాటి ఏది?)

శక్తి (అన్ని శక్తులూ ఆయన అధీనంలో ఉండేవే)

తేజము ఆయన ఆకర్షణ, తేజస్సు గురించి ప్రత్యేకంగా చెప్పాలా?

మొదలగు సర్వగుణములు సమృద్ధిగా గలవాడు.

62. త్రికకుద్ధామః, త్రికకుబ్ధామః – సామాన్యలోకము కంటె మూడు రెట్లు పెద్దదైన పరమ పదమందు ఉండెడివాడు.

మూడు గుణ వర్గములకును ఆశ్రయమైన వాడు; ఊర్ధ్వ, మధ్య, అధో లోకములకు ఆధార భూతుడు. జాగ్రత్, స్వప్న, సుషుప్తి – మూడు అవస్థలందును వ్యాపించియున్నవాడు.

ఆది, మధ్య, అంతములు అన్నియు ఆయనే!

త్రికకుత్ – మూడు కొమ్ములు (మూపులు) గల శ్రీవరాహమూర్తి

ధామః – నివాస స్థానము, ప్రకాశవంతమైన కిరణము.

63. పవిత్రం – పరమ పావన స్వరూపుడు, పరిశుద్ధమొనర్చువాడు.

64. మంగళం పరం – అన్నింటికంటె మంగళకరమగు మూర్తి; స్మరణ మాత్రముననే అన్ని అశుభములను తొలగించి, మంగళములను ప్రసాదించువాడు.

ఈ నామములన్నియు శ్రీకృష్ణునికి ఒప్పేవే.

ఇక తరువాత నామములకు వెళ్దాము.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here