తమసోమా జ్యోతిర్గమయ-6

0
6

[box type=’note’ fontsize=’16’] “తమకున్న తొందర వీళ్ళకి ఎందుకు లేదో.. అర్జెంటుగా ఆపరేషన్ చెయ్యాలని తెలిసీ కూడా….” భర్త గురించి రాధ ఆందోళనని గంటి భానుమతితమసోమా జ్యోతిర్గమయ’ ధారావాహిక ఆరవ భాగం చెబుతుంది. [/box]

[dropcap]ఆ[/dropcap] ఆలోచన రాగానే కంగారుగా గది దగ్గరికి వెళ్ళింది. లోపల డాక్టర్లు ఇద్దరు మాట్లాడుకుంటూ మాధవ్‌ని చూస్తున్నారు. ఆ తరవాత అక్కడినుంచి వేరే దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ గది తలుపులు మూసేసారు, పైన ఉన్నగాజు తలుపులోంచి చూసింది. ఎవరు లేరు. గది మధ్యలో మాధవ్ చక్రాల బెంచి మీద పడుకుని ఉన్నాడు.

ఎప్పుడూ నలుగురి మధ్య ఉండే మాధవ్ అలా ఒంటరిగా ఆ పెద్ద గదిలో చలనం లేకుండా పడుకుని ఉన్నాడు. చూస్తూంటే అనుమానం వస్తోంది, ప్రాణం ఉందా లేదా…. ఈ డాక్టర్లు నాటకం ఆడుతున్నారా…. వెంటనే తిరిగింది. అంతకు ముందు చూసిన డాక్టరు దగ్గరికెళ్ళింది. ఆ డాక్టరు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. అతను ఫోను పెట్టేసి రాధని చూసాడు. లేచాడు.

“ఇవాళ ఆదివారం కదా…. అందరు డాక్టర్లు రారు. ఎవరి అవసరం ఉంటే వాళ్ళే వస్తారు. మీ పేషెంటు గురించే మాట్లాడుతున్నాను. న్యూరో సర్జన్లు రావాలి. ఈ లోపల ఎమ్మారై చేయించేస్తే వాళ్ళు వచ్చేసరికి రెడీగా ఉండచ్చు.”

“తొందరగా వాళ్ళని రమ్మని చెప్పగలరా. అతనికి ఏదైనా అవుతే…”

“చెప్పాను కదా, ఆదివారం కదమ్మా, డాక్టరు గారు కేసులుంటేనే వస్తారు.. అయినా అతని ఇల్లు పెద్ద దూరం కాదు కాని, ఓ అరగంటలో వస్తున్నానని అన్నారు. రాగానే మీ కేసే చూస్తారు, మీ కోసమే వస్తున్నారు. మీరు కూచోండి.”

చేసేదిలేక బయటికి వచ్చింది. అక్కడ నారాయణ ఉంటే అతనికి డాక్టరు చెప్పినది చెప్పింది.

నిస్సహాయంగా నాలుగువైపులా చూస్తూ, మాటలు మర్చిపోయిన దానిలా ఉంది. ఆయా ఎదురుగా నుంచుని పిలిచే వరకూ ఈ లోకంలోకి రాలేదు.

“డాక్టరుగారు ఇప్పడే వచ్చారు, ముందు మీరే వెళ్ళండి. మిమ్మల్నే పంపిస్తా…….” అని అంది గుమ్మం దగ్గర కూచున్నఆయా. అంతలో లేత బూడిద రంగులో ఉన్న యూనిఫారంలో ఉన్న ఓ మనిషి వచ్చి, ఆమెని పంపిచాడు. ఆమె వెళ్ళిపోయింది.

డాక్టరు తన ముందునుంచి వెళ్ళినా తనకి తెలీలేదు. కళ్ళు కూడా పనిచేయడం మానేసాయా…. గుమ్మం దగ్గరున్న మనిషిని పిలిచి అడిగింది, “డాక్టరు గారు ఇక్కడి నుంచే వెళ్ళారా” అని .

“లేదమ్మా.. వెనక నుంచి వచ్చారు. వాళ్ళు రావడం మాకు తెలుస్తుంది.”

అంతలోనే బెల్ మోగింది. గుమ్మం దగ్గరకూచున్న మనిషి లేచి లోపలికి వెళ్ళాడు. వెంటనే బయటికి వచ్చాడు. చేత్తో సైగ చేసాడు, లోపలికివెళ్ళమని. లోపలికి వెళ్ళింది. డాక్టరు రమ్మన్నట్లుగా తల ఊపాడు. అతని వైపు చూసింది. అతనే న్యూరో సర్జన్ డాక్టర్ నరేంద్ర, అక్కడున్ననేం ప్లేట్ వల్ల తెలిసింది. మనిషి నలుపు ,పొట్టిగా ఉన్నాడు. కానీ ఏదో ప్రత్యేకత. అది అతని చదువు, వృత్తి మాటతీరు వల్ల వచ్చినది.

“ఇవాళ ఆదివారం, ఎమర్జెన్సీ కేసుల్నే చూస్తాం..” అంటూ డాక్టరు లేచి గాజు తలుపులు తోసుకుని మాధవ్ ఉన్న దగ్గరికి వెళ్ళారు. స్ట్రెచరు మీద స్పృహ లేకుండా ఉన్న మాధవ్‌ని చూస్తూనే అన్నీ కనుకున్నాడు. సురక్షలో డాక్టరు ఇచ్చిన రిపోర్టులన్నీ చూసాడు. వాటిని ఇలా చూసి వెంటనే రాధకి  ఇచ్చేస్తూ ఆమెని చూసాడు.

“తలకి దెబ్బలు తగిలాయి, అందుకని ముందు ఎమ్మారై చేయాలి, అప్పుడే తెలుస్తుంది, లోపల ఎలా ఉందన్న సంగతి. మనిషి చిన్నవాడే అయినా అడుగుతున్నాను, లోపల ఏదైనా మెటల్ ఆబ్జెక్స్ ఉన్నాయా అంటే  స్టెంట్ కానీ నీ రిప్లేస్‌మెంట్, హిప్ రిప్లేస్‌మెంటు లాంటివి కానీ జరిగాయా…..”

“లేదు, అలాంటివి ఏం లేవు…” తలని అడ్డంగా ఊపింది.

“ఏదైనా మెటల్‌వి ఉంటే కష్టం. ఓకే అయితే వెంటనే చేయించండి” అంటూ బెల్ నొక్కాడు. బయట గుమ్మం దగ్గరున్న అటెండర్ లోపలికి వచ్చాడు.

“ఎక్స్‌రే డిపార్టుమెంటుకి తీసుకెళ్ళి, ఎమ్మారై చేయించుకుని రా…. అక్కడ ఇంక ఎవరున్నా సరే, ముందు ఈ పేషెంటుది చేయించమన్నారని చెప్పు…. ” అంటూ ఓ కాగితం మీద రాసి ఇచ్చాడు. రాధ చేతికిచ్చాడు.

ఆమె తీసుకుని ఆ స్లిప్‌ని చూసింది. అర్థం కాని రాత, చివర మాత్రం ఎమ్మారై అని రాసి, ఆఖరి అక్షరాన్నిఎడమ వైపుకి ఓ గీతలా లాగాడు. మళ్ళీ రాధని చూసి తల ఊపాడు వెళ్ళమన్నట్లుగా.

బయటికి వచ్చింది. రాధ బయటికి రాగానే, అక్కడ ప్రశాంత్, నారాయణ ఆతృతగా ఆమె కోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నారు.

“ఏం అన్నారూ…..” అంటూ ఆమెని చూస్తూ అన్నారు

“ఎమ్మారై చేయించమన్నారు. వెళ్దాం……” అని అందే కాని, రాధకి బెంగగా ఉంది. ఇంతవరకూ వైద్యమే మొదలుపెట్టలేదు. ఉదయం ఆరుగంటలకి యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు పదకొండు అవుతోంది. ఇంతవరకూ ఐవీ ఫ్లూయిడ్స్ మాత్రమే ఇస్తున్నారు. అది కూడా మధ్యలో ఓ గంట ఇవ్వనే లేదు. ఇంత పెద్ద ఆసుపత్రిలోనే ఇలా ఉందంటే ఇంక మామూలు ఆసుపత్రుల సంగతి ఏఁవిటీ……ఈ లోపలే.. ఛ…ఛ.. ఇలా ఆలోచించకూడదు…. మాధవ్‌కి ఏం కాకూడదు.. దేవుడా… మేమేం చెయ్యలేదు. ఎవరికి హాని చెయ్యలేదు. మా జీవితాలని డిస్టర్బ్ చెయ్యకు.

అంతలో శబ్ధం చేస్తూ, గదిలోంచి స్ట్రెచర్ తీసుకొచ్చి రాధ ముందు ఆపి ఆమెని చూసి పద మన్నట్లు తల తిప్పాడు అటెండర్. నారాయణ ప్రశాంత్ ,రాధ అందరూ మాధవ్ వైపు ఓ సారి చూసి తల ఊపారు. అతను కూడా రండి అన్నట్లు తల ఊపాడు.

అంతా ఎమ్మారై కోసం తయారయ్యారు ముందు స్ట్రెచరు, వెనక పరుగులాంటి నడకతో రాధ, ప్రశాంత్, నారాయణ ఖాళీగా ఉన్న కారిడార్ల లోంచి వెళుతున్నారు. అడుగుల శబ్దం, చక్రాల శబ్దం గట్టిగా వినిపిస్తోంది. ప్రతీ నిమిషం కదుల్తున్నకొద్ది, రాధకి భయం ఎక్కువవుతుంది. లిఫ్ట్ దగ్గరికి వచ్చారు. లిఫ్ట్ చాలా పెద్దగా ఉంది. ముందు మాధవ్‌ని తీసుకెళ్ళాకా మిగిలిన వాళ్ళు లోపలికి వెళ్ళారు. గబగబగా లిఫ్ట్‌లో పైకి వెళ్ళారు. మళ్ళీ పరుగు, మరోసారి కారిడార్లు, అలా ఓ,నాలుగు దాటి, ఓ బ్రిడ్జి లాంటి దానిమీద నుంచి వెళ్ళి, మరో బిల్డింగ్ లోకి వెళ్ళారు. అది కొత్తగా తయారయిన బిల్డింగ్. పాత కొత్త బిల్డింగ్‌ల మధ్య ఓ చిన్న సందు లాంటిది రావడంతో ఈ బ్రిడ్జి లాంటిది కట్టారు, అని స్టెచరు లాక్కెళుతున్న మనిషి అన్నాడు. ఆ బిల్డింగ్ నుంచి లిఫ్ట్ లో దిగి, ఓ చోట ఆగారు. ఆ బిల్డింగ్ కూడా చాలా పెద్దగా ఉంది.

అక్కడ అన్ని బోర్డుల మీద, నిత్య డయాగ్నస్టిక్ సెంటర్ అని రాసి ఉంది. దాని కింద వాళ్ళు ఇచ్చే సేవల గురించి ఉంది. అక్కడ ఏ ఏ డిపార్టుమెంట్లున్నాయో రాసి అంది. అందులో పని చేసే డాక్టర్ల పేర్లు, వాళ్ళ డిగ్రీలు, అవి ఎక్కడినుంచి తీసుకున్నారో ఆ దేశాల పేర్లు ఉన్నాయి. అవన్నీ చూస్తూనే వెళ్తున్నారు. మళ్ళీ ఓ చిన్న కారిడార్ దాటి, మెయిన్ ఎంట్రెన్స్  వైపుకి వెళ్లారు. అక్కడ గుమ్మం పక్కన కూడా  ఓ తెల్లటి బోర్డు మీద ఓ అరడజను మంది డాక్టర్ల పేర్లు వాళ్ళ డిగ్రీలు అవీ ఉన్నాయి. ఆ గాజు తలుపులు తోసుకుని లోపలికి వెళ్ళారు. ఒక్కసారిగా చల్లగా అనిపించింది. అదో పెద్ద హాలు. చాలా ఖరీదుగా అధునాతనంగా ఉంది. సోఫాలు కుర్చీలు పెద్దగాజు కిటికీలు వెనీషియన్ బ్లైండ్స్, ఫాల్స్ రూఫ్, లైట్లు, అందులో ఎమ్మారై అని ఉన్న దగ్గరికి  వెళ్ళారు.

“మీరిక్కడే కూచోండి.” అంటూ స్ట్రెచర్‌ని అక్కడే ఉంచి,ఆ మనిషి లోపలికి వెళ్ళాడు.

ముగ్గురూ కూచుని, డాక్టరు కోసం చూస్తున్నారు.

రాధ అటూ ఇటూ చూసింది. ఓ ఇద్దరు కూచుని ఉన్నారు. వాళ్ళు కొంచెం ప్రశ్నార్థకంగా చూస్తున్నట్లుగా అనిపించింది. లోపలి కెళ్ళిన మనిషి తలుపు తీసుకుని  బయటికి వచ్చాడు.

“ఆదివారం కదా, టెక్నీషియన్ ఉన్నాడు కానీ డాక్టరు ఇంకా రాలేదు. అతను వచ్చాకా వెళ్ళాలి…”ఆ మాటలు అక్కడ కూచున్న వాళ్ళకి వినపడింది. వెంటనే ఓ పంచ కట్టుకున్న మనిషి లేచాడు.

“మేము గంటనుంచి ఇక్కడ కూచున్నాము. మేము ముందు వెళ్ళాలి. మీరు ఇప్పుడొచ్చి వెళ్ళాలనుకుంటే ఎలా…. మా తరవాత ఆ మనిషి… ఆ తరవాత మీరు….” అంటూ వేలుతో ఎవరెవరు  ఎవరి తరవాత వెళ్ళాలో చూపిస్తున్నాడు.

రాధ ఏం అనలేదు. వాళ్ళ అలా అనడంలో తప్పేం లేదు. కాని తనేం చెయ్యనేరదు. అందుకే తలని పక్కకి తిప్పేసుకుంది. మనసంతా ఆందోళనగా ఉంది. ఎమ్మారైలో ఏం తెలుస్తుందో…. ఎక్కడ ఇంజ్యూరి ఉందో… ఏం అంటారో.. ఏం చేయాలో..

ప్రశాంత్, నారాయణ ఇద్దరూ లేచి అటూ ఇటూ తిరిగి వచ్చి రాధకి ఎదురుగా నుంచున్నారు. ఆమె వాళ్ళని చూసింది.

అంతలో డాక్టరు వచ్చారు. అందరిలో కదలిక వచ్చింది. అతను అందరినీ ఓ సారి చూసి, లోపలికి వెళ్ళారు. అతని వెనకే మరో ఇద్దరు వెళ్ళారు. మరో రెండు నిమిషాలకి, లోపలినుంచి, టెక్నీషియన్, అటెండెంటు బయటికి వచ్చి, మాధవ్‌ని తీసుకెళ్తూంటే, ఆ కూచున్న ఇద్దరూ లేచి ముందుకొచ్చారు.

“మేం వెళ్ళాలి. మీరు ఇప్పుడు వెళ్తే ఎలా….”.

“మీ కేసు వేరు. ఈ కేసు వేరు. ఇతను మీరనుకుంటున్నట్లుగా వీఐపీ కాదు. ఏ రాజకీయనాయకులతోను సంబంధంలేదు. ఇతనిని ముందు తీసుకెళ్ళడానికి కారణం యాక్సిడెంటు. ఏ మాత్రం ఆలస్యం అయినా ఏం జరిగినా జరగచ్చు. మీ యిద్దరిదీ, మోకాళ్ళు, ఇతనిది తల….లోపలది అర్జెంటుగా చూడాలి. ఇక్కడ ముందు వెనకా అని కాదు, సమస్య తీవ్రత.. అంతే…”అంటూ లోపలికి తీసుకెళ్ళిపోయారు

వాళ్ళిద్దరు నొచ్చుకున్నారు. “అయ్యో అలాగా తెలీక అన్నాము. పరవాలేదు.. మేము ఆగుతాం… ముందు అతడినే తీసుకెళ్ళండి” అంటూ రాధా వాళ్ళని చూస్తూ “తెలీక అన్నాము. సారీ….”

రాధ ఏం అనలేదు. నారాయణ ప్రశాంత్ పరవాలేదన్నట్లుగా తల ఊపారు.

మాధవ్‌ని లోపలికి తీసుకెళ్ళాకా రాధ బయటికి వెళ్ళింది. సౌమ్య ఫోన్ చేసింది. ఎలా రావాలో అడ్రస్సు అడిగితే, చెప్పింది. ఇంకా కొంత మంది స్నేహితులకి కూడా చెప్పింది. వాళ్ళ అందరికి చెప్పిన, రాధ ఆలోచనలో పడింది. మాధవ్ ఇంటికి….. చెప్పాలా వద్దా… ఓ పది నిమిషాలు ఆలోచించింది. చెప్తేనే మంచిది అన్న నిర్ణయానికి వచ్చింది. ‘మా కొడుకు చచ్చి పోయాడనుకుంటాం. మాకు వాడు పుట్ట లేదనుకుంటాం అని అన్న వాళ్ళకి ఈ యాక్సిడెంటు విషయం చెప్పాల్సిన అవసరం ఉందా….’

ఉంది. అప్పటి కోపం తాత్కాలికం.  కన్న ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. లేని ధైర్యాన్ని తెచ్చుకుంది. లాండ్ లైనుకి చేసింది. తియ్యలేదు. ఇంట్లో ఎవరూ లేరేమో. వెతకగా వెతకగా, మాధవ్ తండ్రి సెల్ నంబరు దొరికింది. మాట్లాడడానికి భయపడింది. గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఓ సారి కళ్ళు మూసుకుంది. మెల్లిగా నంబరు నొక్కింది. రింగవుతోంది. తీసారు.

“హలో….. ఎవరూ….”. ఆ గొంతులోని చిరాకు గమనించింది. మాట్లాడాలా, వద్దా.

గొంతు పెగల్చుకుని “హలో… నేను రాధని..” అంది. ఒక్కసారి నిశ్శబ్దం…..

“రాధా అంటే….” వెంటనే అటు వైపున.. కూడా నిశ్శబ్ధం.

“నేను మాధవ్ వైఫ్‌ని…. మాధవ్‌కి యాక్సిడెంటు అయింది… ఆ విషయం చెప్పాలని మీకు చేసాను. మేము జూబిలీ హిల్స్‌లో ఉన్న చరకసంహితలో ఉన్నాము. ఇవాళే…. పొద్దున్న…. ఆరు అవుతూండగా ….ఆఁ … తలకి దెబ్బలు బాగానే  తగిలాయి. …ఇప్పుడా….. ఇప్పుడు, ఏమో…. తెలీదు… ఎమ్మారై తీస్తున్నారు. ఆ రిపోర్టు వచ్చాకా చూసి, ఆ తరవాత ఆపరేషన్ చేస్తారు…. ” నిశ్శబ్ధం.

అవతలినుంచి ఏ విధమైన స్పందన లేదు. ఇంక పెట్టేసింది. చెప్పడం తనవంతు. తన బాధ్యత అయిపోయింది. ఆ తరవాత వాళ్ళిష్టం….. ఇప్పుడు తన వాళ్ళు. అమ్మకి నాన్నగారికి…. చెప్పాలి… తన మీద కోపం ఉండచ్చు కాని ఇప్పుడు ఉండదు. ఆ ఇల్లు వదలి ఏడాది అయింది. ఈ ఏడాదిలో జరిగిన మార్పులు ఆ కోపాన్ని తగ్గించి ఉండచ్చు.

ఏంటో,ఈ బంధాలూ, అనుబంధాలూ.. ఎంతవరకూ నిలుస్తాయి..! డబ్బుతో ముడి వేసుకున్నవి ఎన్ని రోజులుంటాయి! డబ్బుతోనే పోతాయి. ఇప్పుడు అదే జరిగింది. అమ్మా వాళ్ళు తన బాధని అర్థం చేసుకుంటారా..! రాధ మన అమ్మాయి. దాని తప్పుల్నిమనం క్షమించకపోతే ఎలా.. మనం పెద్దవాళ్ళం, రాధ మనకన్నా చిన్నది ఎన్ని రోజులు మనసులో ఉంచుకుంటాము… ఇప్పుడు అది కష్టాల్లో ఉంది. మనం ఆసరాగా ఉండాలి. అని అనుకుంటారా.! లేకపోతే… దాని ఖర్మ.. మనల్ని కాదని వెళ్ళిపోయింది… మనం ఎంత బాధ పడతామో అని కూడా చూడలేదు. ఇప్పుడు మన అవసరం వచ్చింది. అందుకే ఫోను చేసింది…. అని అనుకుంటారా!.. మేము పెద్దవాళ్ళం అన్నదానికి అర్థం ఏంటీ అని వాళ్ళల్లో వాళ్ళే విశ్లేషించుకుంటారా….”

వాళ్ళ ఆలోచనల సంగతి అనవసరం. వాళ్ళు ఏదైనా అనుకోని…. ఏమైనా ఫోన్ చెయ్యాలి. ఎంతో ఆలోచించింది. సెల్ తీసింది. నంబరునొక్కింది.

“హలో” అంది.

“రాధేనా…” అని వెంటనే అంది తల్లి. డిస్‌ప్లే అయిన నంబరుని బట్టి గుర్తుపట్టింది. అందుకే రాధ అని అనగలిగింది.

“అవును….నేనే….” అని మొదలుపెట్టి ఆ రోజు జరిగిది అంతా చెప్పి, ప్రస్తుతం ఏ హాస్పటల్‌లోఉన్నారో కూడా చెప్పింది. తన డ్యూటి అయిపోయింది. తరవాత వాళ్ళిష్టం…. ఎందుకంటే రాధ తల్లి జవాబుకోసం ఎదురుచూడలేదు. అందరికీ విషయం చెప్పాకా, ఏదో ఆలోచిస్తూ అలా కూచుండిపోయింది.

“రాధా, కొంచెం ఇలా రా….” ఉలిక్కిపడి తల తిప్పి చూసింది. నారాయణ, ప్రశాంత్ అక్కడ నుంచుని ఉన్నారు.

రాధ వాళ్ళదగ్గరికి వెళ్ళింది. వాళ్ళ చేతిలోఓ చిన్న పాకెట్ ఉంది

“ఇలా ఇక్కడ కూచుని దీన్ని తిను….” రాధ కళ్లనుంచి నీళ్ళు రాలాయి. వద్దన్నట్లుగా తలని అడ్డంగా ఊపింది.

“అలా అనకు. ఇప్పుడు టైము ఒంటి గంట దాటిది. ఇందులో రెండు సాండ్‌విచ్‌లున్నాయి, తినెయ్యి, మాధవ్‌కి ఏం కాదు.  లోపల అన్నీ బావుంటాయి. యేవిధమైన సర్జరీ అవసరం ఉండదు. ఒకవేళ చేసినా తను మామూలుగా అయిపోతాడు. అదే విషయాన్ని మనకి చెప్తారు. ఏం పరవాలేదు. అంతా బాగా అయిపోతుంది. ముందు ఇది తిను ఎప్పుడనగా బయల్దేరారో…. ఏమో…..”

రాధ ఏం మాట్లాడలేదు. మనసు ఒప్పుకోలేదు. కానీ  ఆకలి మనసుని జయించింది. ఎక్కడో తప్పు చేస్తున్న ఫీలింగ్. అయితే అన్నీ ఓ పక్కకి వెళ్ళిపోయాయి. కాని తినలేదు.

“ఎమ్మారై పూర్తిగా అవడానికి ఓ నలభై నిమిషాలు పైనే పడుతుంది. లోపల ఏం అయిందో తెలిసిపోతుంది. వెంటనే ఏం చేయాలో అది చేసేస్తారు. ఏం పరవాలేదు… ఏంభయం లేదు. నువ్వు ఇది తిను”

చేతిలో పాకెట్ ఉంది. కాని, ఆమె తినలేదు. దేవుడిని ప్రార్థిస్తోంది. లోపల ఎముకలు విరగకూడదు. రక్తం గడ్డ కట్టకూడదు. రక్తస్రావం ఉండకూడదు. కోమాలోకి వెళ్ళకూడదు. ఆమెకి ఏం ఊహించాలని లేదు. ఏమీ జరగకూడదు…….

“డబ్బు కట్టారా….” అని అడిగింది….

“పూర్తిగా కట్టలేదు.సాయంత్రం కడ్తామని అన్నాం.”

“రాధా…. ఏం అనుకోకు… మీ పర్సనల్ అని కాకపోతే… ”

ఆమెకి అర్థమయింది…. “నాకు తెలుసు…. మీరేం అడగదలుచుకున్నారో… ఎవరికైనా చెప్పాలా…. అనే కదా.. నాకు అందరూ ఉన్నారు కాని లేనట్లే….. మా పెళ్ళి కులాంతరం, భాషాంతరం కూడా…. అందుకని మా పెద్దవాళ్ళ ఆమోదం కానీ, అంగీకారం కానీ లేదు. మాది దాదాపు రెండేళ్ళు స్నేహం ఆ తరవాత వ్యక్తిగత విషయాలు మాట్లాడుకునే దగ్గరితనం వచ్చింది. అది ప్రేమ కావచ్చు. ఒకరిని విడిచి మరొకరు బతకలేని స్థితి కాదు కానీ పెళ్ళి చేసుకుంటే బావుండుననిపించింది. ఎందుకంటే మేమిద్దరం చిన్నపిల్లం కాదు. ఇరవై తొమ్మిదేళ్ళవాళ్ళం. పెద్దవాళ్ళ అంగీకారం కోసం ఓ ఏడాది ఎదురుచూసాం. సరిఅయిన స్పందన రాలేదు. అంతే పెళ్ళిచేసుకున్నాం.” అంటూ వాళ్ళ మొహాలు చూసింది.

“అలాగా మాకెప్పుడూ అనుమానం రాలేదు, అందరూ ఎలా ఉన్నారో మీరు అలాగే ఉన్నారు… మన ఈ ఐటీ ఉద్యోగాల్లో ఎవరూ కూడా వీటిని పట్టించుకోవడం లేదు. పైగా పర్సనల్ విషయాలు మనం ఎప్పుడూ అడగం… అవన్నీ అనవసరం కూడా.. మన స్నేహంలో మార్పు ఏం ఉండదు. మీకు అన్ని విధాలా అండగా ఉంటాం.”

ఇదే తేడా స్నేహితులకి, ఇంట్లోవాళ్ళకి…. ఎవరి లిమిట్స్‌లో వాళ్ళుంటారు.

“థాంక్స్…. అది నాకు తెలుసు…. అందుకే నేను మీకే ఫోను చేసి మీ సహాయం కోరాను. ఇంక మనం బయటికి వెళ్దామా డబ్బు తెచ్చుకుందాం…..” అంటూ లేచింది. టాపిక్ మార్చింది.

“ఎంత కోపం ఉన్నా, ఎంత ఇష్టం లేకపోయినా, ఇలాంటి విషయం తెలిస్తే అన్నీ మర్చిపోయి వస్తారు…. అందుకని…. ఫోను చేస్తే బావుంటుంది…. వాళ్ళంటే పెద్దవాళ్ళు. కొడుకు మీద ఆశ ఉండడం సహజం..”

“మీరన్నట్లుగానే నాకు అనిపించింది. కానీ, చేస్తే ఏం అనుకుంటారో…. ఇన్నాళ్ళు లేనిది, ఇప్పుడు మేం కావలసి వచ్చామా… ఏ మోహం పెట్టుకుని మాట్లాడుతోంది…. అని అనుకుంటారేమో అని… కాని మళ్ళా చెయ్యకపోతే ఇంకేం అనుకుంటారో…..”

“నువ్వు ఈ సమయంలో అవన్నీ మనసులో పెట్టుకోకు. నంబరు ఇయ్యి, నేను మాట్లాడుతాను వాళ్ళతోని… వాళ్ళు ఏం అనుకుంటే నీకెందుకూ… అనుకుంటే అనుకోనీ… నేను మాట్లాడుతా….”

“అక్కర్లేదు, ఆల్‌రెడీ నేను మాట్లాడాను. మాధవ్ పేరెంట్స్‌తో మా పేరెంట్స్‌తో కూడా మాట్లాడాను ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను ఇంక వాళ్ళిష్టం. అహంకారం వెర్సెస్ అభిమానం..ప్రేమ”

“అయినా నేను మరోసారి మాట్లాడుతాను నంబరు ఇయ్యి…..” అని ప్రశాంత్ అంటే రాధ తన సెల్‌లో నంబరు వెతికి చెప్పింది.. ప్రశాంత్ తన మొబైల్‌లోనుంచి మాట్లాడాడు. రాధ అంతా వింటోంది. ఏ హాస్పటలో,ఎలా రావాలో చెప్పాడు.

“వాళ్ళు వస్తామన్నారా…..”

“ఆఁ…. ముందు కొంచెం కంగారు పడ్డారు. తరవాత మామూలు అయ్యారు. వస్తాం అని ఏఁ అనలేదు. విన్నారు అంతే.”

రాధ తనది మాధవ్ ఏటీఎం కార్డులు ఉపయోగించి డబ్బు తీసుకుంది. అంత డబ్బు ఒకే దానిలోంచి ఇవ్వరని తెలుసు. ఇప్పుడు తీసిన డబ్బు కూడా సరిపోదు. మరో దానిలోంచి తరవాత తీసుకోవచ్చు అని అంది.

వచ్చాకా కూడా మాధవ్ కోసం ఎదురుచూసారు. సుమారు ఓ అర గంట తరవాత, మాధవ్‌ని బయటికి తీసుకొచ్చారు. చూడగానే ఆమెకి అనుమానం వచ్చింది. ఉన్నాడా లేదా.

మళ్ళీ మాధవ్ ముందు, వెనకన పరుగు లాంటి నడక, ముగ్గురు… లిఫ్ట్, బ్రిడ్జి, మళ్ళీ లిఫ్ట్. మళ్ళీ గాజు తలుపుల వెనక  గది మధ్యలో మాధవ్‌ని ఉంచారు. అందరూ న్యూరో సర్జన్ గది ముందు కూచున్నారు. న్యూరో సర్జన్ గదిలో ఎవరో ఉన్నట్లున్నారు. తలుపులు వేసి ఉన్నాయి. అక్కడున్న అటెండరుకి, తాము వచ్చిన సంగతి చెప్పమని అన్నారు. అటెండరు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన మనిషి బయటికి ఎప్పుడొస్తాడా డాక్టర్లు ఏం అంటారా అన్నట్లుగా ఆ గది వైపే చూస్తున్నారు. ఓ రెండు నిమిషాల్లో ఆ అటెండరు బయటికి వచ్చాడు. ముగ్గురూ అతని దగ్గరికి వెళ్ళారు.

“లోపల డాక్టరు గారు, ఎమ్మారై తీసిన డాక్టరు వచ్చారు. అతనితో మాట్లాడుతున్నారు” అని వెళ్ళిపోయాడు.

ఆ డాక్టరు ఏం చెప్పారో, ఏం డైయాగ్నైస్ చేసారో క్షణాలు భారంగా నడుస్తున్నట్లుగా ఉంది.. ఓ అరగంట తరవాత డాక్టరు బయటికి వచ్చారు, అందరినీ ఓ సారి చూసి, “వెంటనే ఆపరేషన్ చేయాల్సిందే..” అని అన్నారు.

ఆ చూపులు ఎందుకో భయం వేసింది రాధకి.

“డాక్టర్ ప్రమాదం ఏం లేదు కదా….” అంది.

అతను ఓ సారి ఆమెని చూసి కళ్ళు చిన్నగా చేసాడు.

“అలా అని చెప్పడానికి లేదు. ప్రయత్నం చేద్దాం…… మరో ఇద్దరు స్పెషలిస్టులు డాక్టర్లు కూడా అవసరం. వాళ్ళని పిలవాలి…… ఒక్క డాక్టరుతో అయ్యేది కాదు”.

“ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు……”

“మరో ఇద్దరు రావాలి కదా…..వాళ్ళు వచ్చిన వెంటనే….” మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.

నోరు తెరుచుకుని  ఉండిపోయింది. ఆ డాక్టర్లు ఎప్పుడు రావాలి? ఎప్పుడు మొదలెట్టాలి? అతను వెళ్ళిన వైపు బెంగగా చూసింది.

“డాక్టర్లు వస్తారు, మొదలు పెడ్తారు, ఇక్కడ ఉండి మనం ఏం చెయ్యగలం. రిసెప్షన్‌లో కూచుందాం, వరుణ్ సౌమ్య వాళ్ళు వస్తామన్నారు. ఆపరేషన్ మొదలు పెట్టే సమయానికి థియేటరు ముందు కూచుందాం.. అయినా మేం ఉన్నాం కదా… ఏం భయం లేదు రా.. మనం  వెళ్దాం.”

ఖాళీగా ఉన్న ఆ కారిడార్ లోంచి నడుస్తూంటే అడుగుల శబ్దం తప్ప మరేం వినిపించడం లేదు. అంతా కలిసి రిసెప్షన్లో కెళ్ళి కూచున్నారు. “మనుషులు ఎవరూ లేరు. ఆదివారం కదా, లేకపోతే జాతరలా ఉంటుంది. వచ్చేవాళ్ళూ, వెళ్ళేవాళ్ళూ, ఆసుపత్రి వాళ్ళూ అటూ ఇటూ తిరుగుతూ…..” అన్నాడు

“ఇంకా నయం  గుడ్డిలో మెల్ల, ఆదివారం అయినా ఓ డ్యూటీ డాక్టరున్నారు. ఎమర్జెన్సీ కేసులు చూడ్డానికి. అతనున్నాడు కాబట్టి మాధవ్‌ని చూసాడు. కేసుని అర్థం చేసుకున్నాడు. వెంటనే న్యూరో సర్జన్‌తో మాట్లాడాడు, పిలిచాడు. అతను కూడా వెంటనే వచ్చాడు. చూసాడు. చెయ్యాల్సినవన్నీ, చేయగలిగినది చేయించాడు. ఇంతకన్నా ఏంకావాలి. ఎంత డబ్బు తీసుకుంటారో, అంతే శ్రద్ధ  రోగి మీద  చూపించారు…. ఇదే ఈ ఆసుపత్రులలో ఉన్నది.”అన్నాడు నారాయణ.

“మరో ఇద్దరు డాక్టర్ల వస్తారు అని అన్నారు, మరి వాళ్ళు ఎప్పుడు వస్తారో….! వాళ్ళు వచ్చాకనే కదా ఆపరేషన్ చేయడం…. ఉదయం ప్రమాదం జరిగింది. జరిగి కూడా ఏడు గంటలయింది. ఇంతవరకూ ఏం చేసారూ.. అంటే ఏం లేదు” అంది రాధ బాధగా….

“అబ్బే ఏం జరగదు…. నువ్వేం వర్రీ కాకు. రేపు ఈ టైముకి మాట్లాడుతాడు. మాధవ్‌కి ఏం కాదు. ఏం కాకూడదు… ఆపరేషన్ అయ్యాకా అబ్జర్వేషన్‌లో ఉంచుతారు, ఆ తరవాత మామూలు అయిపోతాడు…” రాధ కృతజ్ఞతగా చూసింది.

అంతలో ఓ అబ్బాయి అటు వెళ్తూ కనిపించాడు. అంతకు ముందు చూసిన మనిషే.

అందుకని అందరూ ఒక్కసారి, లేచి ఆ అబ్బాయిని పిలిచారు. ఆ అబ్బాయి వచ్చి నుంచున్నాడు .

“డాక్టరు ఆపరేషన్ మొదలు పెట్టారా….”

“నాకు తెలీదు…” అంటూ వెళ్ళిపోయాడు.

“వాళ్లిక్కడ పనిచేసే వాళ్ళు. వాళ్ళకేం తెలుస్తుంది.. తెలిసినా చెప్పరు. కొన్ని రూల్స్ వాళ్ళకి కూడా ఉంటాయి. అయినా నేను వెళ్ళి కనుక్కుని వస్తాను” అని ప్రశాంత్ వెళ్ళి మరో ఐదు నిమిషాలకి తిరిగి వచ్చాడు.

“ఇంకా మొదలెట్టలేదు. ఆ  మత్తు మందిచ్చే డాక్టరు రావాలి కదా, ఆ డాక్టరింకా రాలేదుట.”

ఆమెకి ఒక్క సారి నీరసం వచ్చేసింది. తమకున్న తొందర వీళ్ళకి ఎందుకు లేదో.. అర్జెంటుగా ఆపరేషన్ చెయ్యాలని తెలిసీ కూడా…. అదే మాటని పైకి అంది.

“ఇవాళ ఆదివారం కదా, డాక్టర్లు ఉండరుట….. ఏ డాక్టరు అవసరం ఉంటే వాళ్ళని మాత్రమే పిలుస్తారుట…” అంటూ కూచున్నాడు.

“అదే మాట ఓ లక్షసార్లు అన్నారు. ఆదివారం కదా డాక్టర్లుండరు, ఆదివారం కదా డాక్టర్లుండరని,  అసలు మాధవ్‌ని చూసిన వెంటనే ఆపరేషన్ చెయ్యాలని అనుకున్నారు, దానికి మరో ఇద్దరి డాక్టర్ల అవసరం ఉంటుందని తెలిసి పిలిచినప్పుడు ఈ డాక్టర్ని కూడా అప్పుడే పిలిపించే ఏర్పాటు చెయ్యాలి కదా. అసలు వీళ్ళ ఉద్దేశ్యం ఏంటో… కావాలని చేస్తున్నారా……! నాటకాలు ఆడుతున్నారా….!”

నిశ్శబ్దంగా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు మత్తు మందు డాక్టరు రావాలి, ఎనస్తీషియా ఇవ్వాలి, ఆ తరవాత ఆపరేషన్ మోదలు పెట్టాలి. మాధవ్ ఎలా ఉన్నాడో తెలీదు, లోపలికి తీసుకెళ్ళిపోయారు. టైము రెండున్నర దాటుతోంది. ఏడు గంటల నుంచి ఏం వైద్యం జరగలేదు. ఎవరిని అనాలీ..! ఇక్కడ తను బలహీనురాలు. కోపం వస్తోంది. కాని, తన కోపం పనికి రానిది. మాధవ్ అన్నట్లు, తన ఫీలింగ్స్ తనలోనే ఉంచుకోవాలి. తనకి కోపం వచ్చిందా, రాలేదా అన్నది ఈ డాక్టర్లకి  అనవసరం.

“నేను ఇప్పడే వస్తాను” అని రాధ లేచి డాక్టరు గదిలోకి వెళ్ళింది. అక్కడ ఎవరూ లేరు. డాక్టరు కోటు మాత్రం కుర్చీకి తగిలించి ఉంది. ఓ సారి చుట్టూ చూసింది. నిస్సహాయంగా అక్కడున్నటేబుల్‌ని చూసి వెనక్కి తిరిగింది.

ఎవరైనా కనపడతారేమోనని బయటికి వచ్చి ఖాళీగా ఉన్న కారిడార్ చివరి వరకూ వెళ్ళి చూసింది. గదులు వరసగా అటూ ఇటూ ఉన్నాయి. కాని అన్నీ తలుపులు వేసి ఉన్నాయి. ఎవరూ కనిపించలేదు.

రిసెప్షన్ హాలుకొచ్చింది. నారాయణ, ప్రశాంత్ సెల్ ఫోనులో ఏవేవో చూసుకుంటున్నారు.

“సౌమ్యా వాళ్ళు వస్తామన్నారు.ఇంకా రాలేదు” అన్నాడు ప్రశాంత్ రాధని చూడగానే. “ఆదివారం కదా… పిల్లలు, హస్బెండు ఇంట్లో ఉంటారు కదా… వాళ్ళ సంగతి కూడా చూడాలి. వస్తారు…. వాళ్ళు వచ్చేలోపల… మీ ఇద్దరూ ఏదైనా తినేసి రండి. కేఫెటేరియాలో అన్నీ ఉన్నాయి….” అంది రాధ.

“నువ్వు కూడా రాకూడదా…. ముగ్గురం వెళ్ళి వచ్చేద్దాం…” అంటూ ఇద్దరూ లేచారు.

“మీరెళ్ళండి. సౌమ్యా వరుణ్ వస్తారు. ఎవరో ఒకళ్ళం ఉంటే బావుంటుంది. ఇప్పుడు మూడయింది. చాలా టైమయింది. మీరు తినేసి రండి..” అనగానే, వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here