తంబురా రక్ష!

0
13

[శ్రీ సముద్రాల హరికృష్ణ రాసిన ‘తంబురా రక్ష!’ అనే గల్పికని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]1[/dropcap]950ల ప్రాంతం.

దక్షిణామూర్తి గారు జగమెరిగిన సంగీత విద్వాంసులు.

ప్రచారం, ఆర్భాటాలు లేకున్నా, ఆయన ఉంటున్న దోసపాడు గ్రామం చుట్టుపక్కలా, తదితర పెద్ద ఊళ్ళలో వారి పేరు అందరికీ పరిచయమే, వారంటే మహా గౌరవమే.

రేడియో ఆంధ్రదేశంలో వచ్చిన కొత్త రోజులవి.

త్వరలో వీరు రేడియోలో కూడా పాడబోతున్నారు అని వార్త ఆ మధ్యే వచ్చింది కూడా.

సంగీతం తెలిసిన వారికి, వీరి రవ్వ గమకాలు, ఆలాపన లోని నిలకడతనం, స్పష్టమైన ఉచ్చారణ, పాడుతున్న కీర్తన లోని సాహిత్యభావ ప్రకటన వాగ్గేయకారుడి హృదయాన్ని ఆవిష్కరించేదిగా ఉండటం- ఇత్యాదులు ఆకట్టుకుంటే;

దీనికి అటు వైపుగా,శాస్త్రీయ సంగీతపు ఓనమాలతో కూడా పరిచయం లేని వారికి నచ్చేది వారు కచ్చేరికి ముందర, మధ్యమధ్య ఒక అయిదారు నిమిషాలు కళ్ళు మూసుకుని, ధ్యాననిష్ఠులై ఉన్నారా అనిపించే పద్ధతిలో, తన తంబూరను మీటటం!

అది శ్రవణేంద్రియానికి ఒక పర్వమే!

ప్రక్రృతి స్వరాలైన షడ్జ పంచమాల ఆనంద లహరీ తంతన్యమానమే!

విన్న శ్రోతలందరూ ఆ దైవికమైన నాదంలో మైమరచి పోవాల్సిందే, అంతటి ప్రభావవంతమైన సునాదమది!

దానితో, ఇంకే గాయకుడికీ రాని సంఖ్యలో శ్రోతలు ఆయన కచ్చేరీలకు వచ్చేవారని ఆ రోజులలో ప్రసిద్ధి!

***

కందిపాడు గ్రామంలోని అమరేశ్వరస్వామి దేవాలయంలో తన్మయత్వంతో గాన కచ్చేరి చేస్తున్నారు ఆ రోజు.

మార్దంగికుడూ, వయోలిన్ వాయించేవారూ, ఇద్దరూ ఆ ఊరి వారే.

మూర్తిగారికి మొట్టమొదటిసారి, తన ఇంటికి కాస్త దూరమైన ఆ గ్రామంలో కచ్చేరీ చేయటం.

ప్రియశిష్యుడి సొంత ఊరు కాబట్టి, ఒప్పుకున్నారు, కాస్త రైలు ప్రయాణం శ్రమ అయినా!

***

అనుకోకుండా ఒక సంగీత ధారలాగా, వరుసగా ఒకే రాగం, ‘తోడి’లో రెండు కీర్తనలు పాడేశారు ఆ రోజు!

సాధారణంగా కచ్చేరీలలో జనరంజకంగా ఉండటానికి ఒకే రాగం పునరావృత్తం కాకుండా ప్రణాళిక వేసుకుంటారు.

ఇవాళ చాలా సహజంగా జరిగిపోయింది, తోడిలో “కొలువమరె గదా..” పాడగానే, అవ్యవధానంగా, “కద్దనువారికి..”, అప్రయత్నంగా వెలువడింది వారి నోట!

రెండు కీర్తనలలోనూ తంబూర ప్రశంస రావటం ఒక విశేషం, వారి తంబూరనాదం ప్రత్యేకంగా విందామని వచ్చిన కొంతమంది శ్రోతలకు, ఆ రోజు!

శ్రోతలను మైమరపించేట్టు దక్షిణామూర్తి గారు పాడిన ఆ రెండూ త్యాగయ్య గారి కీర్తనలే–

కొలువమరె గదా కోదండపాణి..

వేకువజామున వెలయుచు తంబూర చేకొని గుణముల చెలువొంద పాడుచు..

రెండోది,

కద్దనువారికి.. నిద్దుర నిరాకరించి ముద్దుగా తంబూర పట్టి..

ఆ రోజు వారికి అత్యంత ప్రీతిపాత్రుడైన శిష్యుడు సోమేశ్వరం తంబూర వేశాడు, గురువుగారి పాటకు, మహదానంద పడుతూ!

మూడున్నర గంటల పాటు కచేరీ బ్రహ్మాండంగా చేసి, మంగళం పాడి ముగించారు మూర్తిగారు.

***

సంధ్య వేళ దాటి గంట పైనే అయింది.రాత్రి సుమారు ఏడున్నర గంటల సమయం.

శిష్యుడు సోమేశ్వరం తోడు రాగా, తన సామాను సంచీ, తంబూర జాగ్రత్తగా పెట్టుకుని ఎడ్లబండిలో బయలుదేరారు మూర్తిగారు రైల్వే స్టేషనుకి!

అక్కడ ప్యాసింజరు రైలు ఎక్కితే, సుమారు గంటకి తన ఊరు చేరుతారు.

ఇంకొక శిష్యుడొకడు గురువుగారు వచ్చే సమయానికి స్టేషన్‌లో ఉంటాడు సిద్ధంగా, వారికి ఇల్లు చేరే వరకు తోడుగా, సహాయంగా!

రైలు రాగానే గురువుగారి సామానూ, తంబూర జాగ్రత్తగా సర్ది రైలు బయలుదేరే వరకు ఉండి, శిష్యుడు వెళ్ళిపోయాడు.

దాదాపుగా ఖాళీయే -పెట్టెలో ఎవ్వరూ లేరు, దక్షిణామూర్తి గారు తప్ప!

చల్లగాలి వీస్తుంటే కాస్త కునుకు పట్టింది, అలసి ఉన్న ఆయనకి.

కాస్సేపాగి, కళ్ళు తెరిచి చూసేటప్పటికి, నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో రైలు ఆగి ఉంది, సిగ్నల్ వల్లనో ఏమో!

ఎప్పుడు ఎక్కడ ఈ రైలు ఎక్కాడో కానీ, ఇంతింత మీసాలతో, గొంగళీ ఒకటి కప్పుకుని ఎదురుగా ఒక దుక్కలాగా ఉన్న మనిషి తన వంకే చూస్తూ కూర్చుని ఉండటం గమనించారు మూర్తిగారు.

బహుశా అప్పుడే రైలు ఆగిన వెంటనే, ఎక్కి ఉండి ఉంటాడు, పక్కనే ఉన్న తోపు లోంచి వచ్చి!

ఈయన కళ్ళు తెరవగానే, “ఏయ్ అన్నీ ఇచ్చేయ్, గొలుసు, ఉంగరం, డబ్బులూ అన్నీ”, అని హుంకరించాడు!

వీడితో తగువు పెట్టుకుని లాభం ఎటూ లేదు, పైగా ప్రమాదం కూడా అనుకుని, తన దగ్గర ఉన్నవీ, సన్మానం చేసి ఊరు వారు ఇచ్చినవీ, అన్నీ ఇచ్చేశారు మూర్తిగారు.

“ఊఁ అదీ మాట”, అని ఒక వెడ నవ్వు నవ్వి, ఆ దొంగ “అదేంటి ఆ బట్టలో కట్టి ఉంది, అది కూడా ఇవ్వు”, అన్నాడు గద్దిస్తూ!

“అదొక్కటీ ఇవ్వను అది నా పూజా వస్తువు, నా తంబూర”, అన్నారు మూర్తిగారు.

“ఏంటదీ, తం బూరానా?! సొరకాయ బుర్ర కాదూ, నీ పెళ్ళికి బూరా కాదూ” అని వేళాకోళంగా నవ్వి అదీ లాక్కున్నాడు వాడు మొరటుగా!

మూర్తి గారికి ఏంచేయాలో తోచలేదు, రైలు పెట్టెలో ఎవ్వరూ లేరు, బయటా పిట్ట పురుగు కనబడలేదు సహాయం కోసం అరుద్దామంటే!

ఇంతలో వారి చేతి వేళ్ళు అలవోకగా తగిలాయి, తంబూరా తీగలకి!

ఎంత అనుకోకుండా తగిలినా, అభ్యస్తమైన వారి విద్య పలికినట్లు ఒక సునాదం వెలువడింది తంబూర లోంచి.

దొంగ కూడా ఒక్క క్షణం తబ్బిబ్బయ్యాడు, ఆ నాద మాధురికి!

ఇదేదో మోత మోగే పెట్టె బాగా ఎక్కువకి అమ్ముకోవచ్చు అన్నది వాడి ఆలోచన!

సన్మానంలో వచ్చిన డబ్బు, బంగారు నాణేలూ, శాలువలు, తనవే అయిన గొలుసూ, ఉంగరాలూ అన్నీ పోయినా పరవాలేదు, తంబూర మాత్రం వదులుకోవడానికి పాపం, ఆ సంగీత విద్వాంసుడి మనస్సు ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు.

కానీ వాడు ఇచ్చేట్టు లేడే అనుకొని, చివరకు ఆశ వదులుకుని, తంబూరకు ఉన్న ‘జీవాళి’ మాత్రం తనకు ఇచ్చేయమన్నారు, ప్రాధేయపడుతూ!

“అదేంటి మధ్యలో! అది ఏం చేస్తుందో చూపించు”, అన్నాడు దొంగ!

వెంటనే ఏదో తళుక్కుమని ఆయన బుర్రలో మెరిసింది!

వాడు చెప్పినట్టే, అది తీసి తంబూర మీటారు, మూర్తిగారు.

చప్పగా వినపడ్డది శబ్దం, ఇది వరకు విన్న దానికంటే!

“అయితే ఇది మళ్ళీ పెట్టి మోగించు” అన్నాడు దొంగ, వినోదంగా!

ఆయన అది జాగ్రత్తగా మళ్ళీ పెట్టి, తంబూర మీటారు!

జీవాళి పెట్టగానే నాదసౌష్టవం, నాదసుఖం అగణితంగా పెరిగి వినిపించాయి!

ఆగి ఉన్న రైలు కటికీలోంచి సన్నటి గాలి!

ఆ మంద పవనంలో ఆ మధురమైన తంబూరనాదం మిళితమై, విన్న వారిని ఏదో నాదాత్మక రస లోకం లోకి తీసుకు వెళ్ళేట్టు ఉన్నది!

పక్వమైన, శ్రుతి బద్ధమైన తంబూర నాదం!

కరకువాడైన ఆ దొంగ గుండెలో కూడా ఏదో అనిర్వచనీయమైన అనుభూతి కలిగించినట్లుంది, ఆ నాదం.

వాడు బుర్ర గోక్కొని,” అయ్యోరూ, ఇదిగో తీసుకో – పంతులోరివి, నీ సొమ్ము నాకెందుకు గానీ, ఇదేదో అంటివే, ఇది మాత్రం నాకిచ్చేయ్, నీ సొమ్మంతా నీవే పట్టుకుపో”, అన్నాడు!

ఇంతలో రైలు కూత వినిపించింది, కదలటానికి సిధ్ధమన్న సంకేతంగా!

దొంగ, అన్నీ అక్కడే వదిలేసి, గభాల్న రైలు దిగి ఆ చీకట్లో తోపుల్లోకి దూసుకుంటూ వెళ్ళిపోయాడు, ఆ జీవాళి దారాన్ని అపురూపంగా చూసుకుంటూ!

‘దాంట్లోంచే వచ్చింది ఆ మధురమైన నాదం, అది ఎంతకైనా అమ్ముకోవచ్చని వాడి పిచ్చి భ్రమ’-అనుకున్నారు మూర్తిగారు కిటికీ గుండా వాడు వెళ్ళిన దారినే చూస్తూ!

‘అంతా దైవలీల’, అని నవ్వుకున్నారు, తన సామానూ, తంబూర మళ్ళీ జాగ్రత్తగా ఒకసారి చూసుకుంటూ!

***

సెలవుల తరువాత వచ్చిన శిష్యుడు సోమేశ్వరానికి ఈ విషయం అంతా చెప్పారు, గురువుగారు, పూసగుచ్చినట్టు!

చెప్పి, “తంబూర నాదమే రక్షించేసిందోయ్ ఆ రోజు. లేకపోతే, అన్నీ మనవి కాకుండా పోయేవే”, అన్నారు శిష్యుడితో!

“మీ సమయస్ఫూర్తి ఏం తక్కువా గురూగారూ, వాడికి మొత్తం నాదం ఆ దారంలోనే ఉందనే భ్రమ కల్పించగలిగారు, అన్నీ రక్షించుకోగలిగారు”, అన్నాడు, అన్నేళ్ళ శుశ్రూషతో ఏర్పడ్డ చనువుతో, సోమేశ్వరం!

“నాదేముందయ్యా, అంతా ఆ అమరేశ్వర స్వామి దయ, మీ ఊరి వారి చేతి చలువ! అంతే! సొమ్ము మనదైతే మిగులుతుంది, లేదో – రెక్కలొచ్చినట్లు ఎగిరిపోతుందోయ్, సోమం, విన్నావా”, అన్నారు, మూర్తిగారు,

‘రానిదీ రాదూ సురాసురులకైనా, పోనిదీ పోదూ భూసురులకైనా..’ అన్న అయ్యవారి మణిరంగు రాగ కీర్తన ఆలపిస్తూ, ఒకింత హుషారుగా!

ఇంతలో పూజా వేళైంది గురువుగారికి అని అంతా సిధ్ధం చేశాడు సోమేశ్వరం, శృతిచేసి ఉంచిన తంబూరతో సహా!

దక్షిణామూర్తి స్తోత్రం అందుకున్నారు, రాగరాజ నిలయమైన శంకరాభరణంలో భక్తిభావ బంధురంగా, గురువులైన మూర్తిగారు, తన్మయులై!

వినయంగా గురువుగారి కాళ్ళ దగ్గర కూచుని, తానూ వంతగా గొంతు కలిపాడు శిష్యుడు సోమేశ్వరం, ఆ శంకరాచార్య కృత మహాస్తోత్ర గానంలో!

సుశిక్షిత, సుమధుర గాత్రాల నుంచి వస్తున్న ఆ మంత్ర సమ శబ్దం, గాలి తరగల్లో అలా తంబూరనాద శుధ్ధతతో తేలి వెళ్తూ,అనతి దూరంలో కొలువైన అమరేశ్వరుని చెవుల కూడా పడే ఉంటుంది!

నాద తనువు కదా!

సునాదమంతా ఆయన చేరువకి వెళ్ళే యత్నంలోనే, ఎల్లప్పుడూ!

***

నాదతను మనిశం శంకరం,

నమామి మే మనసా శిరసా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here