ప్రఖ్యాత రచయిత్రి తమిరిశ జానకిగారికి కొత్తూరి దీక్షితులు అవార్డు

0
6

[dropcap]ప్ర[/dropcap]ముఖ రచయిత్రి శ్రీమతి తమిరిశ జానకికి కొత్తూరి సుబ్బయ్య దీక్షితులు వెంకటలక్ష్మిగార్ల అవార్డును ప్రతిష్ఠాత్మకంగా తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ చేతులమీదుగా త్యాగరాయ గానసభలో ప్రదానం చేశారు శ్రీమతి హైమావతీ భీమన్న.

తల్లి తండ్రులను ఆదరించే పిల్లల సంఖ్య తగ్గిపోతున్న ఈనాటి తరం యువతీ యువకులకు హైమావతి ఆదర్శమని వక్తలు కొనియాడారు. 250 కధలు 16 నవలలు ఎన్నెన్నో వ్యాసాలూ రాసిన/ రాస్తున్న జానకి అభినందనీయురాలని ఆమెకి అవార్డు ఇవ్వడం సముచితమని సాహితీవేత్తలు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథి మామిడి హరికృష్ణ మాట్లాడుతూ అమ్మ అనే పదానికి నిర్వచనం హైమవతమ్మ అని, పెట్టే  చెయ్యి ప్రేమించే మనసూ ఆమె సొంతమని,  జానకిగారు గొప్పరచయిత్రిని ఆమెతో తనకి బాగా అనుబంధముందని అన్నారు. విశిష్ట అతిధి సుధామ మాట్లాడుతూ భీమన్నగారితో కూడా తనకి అనుబంధముందని వారి సాహిత్యాన్ని చిన్నప్పుడు చదివానని వారి అడుగుజాడల్లో నడుస్తున్న హైమావతి ధన్యురాలనిచ  తమిరిశ జానకిగారి పుస్తకాలూ ఎన్నింటికో సమీక్షలు రాయడం ముందుమాట రాయడం కూడా చేసిన అదృష్టం తనదని అన్నారు.

సభాధ్యక్షురాలు డా. ముక్తేవిభారతి మాట్లాడుతూ పాలేరు నాటకం వరంగల్లో ప్రదర్శించినప్పుడు తాను హైమావతిగారు వెళ్లామని అద్భుతమైన ఆ నాటకం చూసిన జనాలు ఆనందించడం తాను కళ్లారా చూశానని  సుబ్బయ్యదీక్షితులుగారి అవార్డు జానకిగారికివ్వడం సముచితమని అన్నారు.

విశేష అతిధి డా. జయరాములు మాట్లాడుతూ రెండేళ్లక్రితం సుబ్బయ్యదీక్షితులుగారి అవార్డును అందుకున్న తాను ధన్యుడని చెప్పి జానకిగారికి శుభాకాంక్షలందించారు. ఆత్మీయ అతిధి డా.గురజాడ శోభా పేరిందేవి మాట్లాడుతూ హైమావతి సర్వకళల సమన్విత అని,  కానీ ఎన్నో కళలు బాధ్యతలు త్యాగాలవల్ల వెలుగులోకి రావడం జరగలేదని లేకుంటే ఎమ్మెల్సీ కాగల సత్తా ఆమెలో పుష్కలంగా ఉందని అంటూ తాను మొట్టమొదట చదివిన సీరియల్ ఆంధ్రప్రభలో వొచ్చిన  విశాలి అని చెప్పారు. రచయిత్రి సుజలా గంటి స్వయంగా కేక్ తయారు చేసి హైటెక్ సిటీనుండి వొఛ్చి హైమావతిగారి జన్మదినాన్ని పురస్కరించుకుని మనవరాలి చేత కట్ చేయించడం జరిగింది. ఆమె భర్త మూర్తి గారు కొత్తూరి దీక్షితులుగారి ప్రియ శిష్యుడిగా వారితోగల అనుబంధాన్ని సభాసదులతో పంచుకున్నారు.

హైమవతిగారి జన్మదినాన్ని పురస్కరించుకుని కిటకిటలాడిన సభకి విచ్ఛేసిన సాహిత్య సంగీత అభిమాన ప్రేక్షకులకు తీపి కారా పేకెట్లు మిత్రురాలు డా.ముక్తేవి భారతి, సన్నిహితురాలు డా. శోభ తయారు చేయించి పంచారు. “చీర తేవద్దు. అది నా ఒక్కదానిదే అవుతుంది. అందరికి నోరు తీపి చేద్దాము. అదే మీరు నాకు ఇవ్వవలసిన కానుక” అని అనడం ఆమె సౌజన్యానికి, సమాజ అభిమానానికి నిదర్శనం. వందమందికి పాకెట్స్ పంచడం చూసి ఆనందించిన ఆ విశ్వజనయిత్రి తన స్పందనలో పేరు పేరునా అందరికి కృతఙ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో  ఉక్కిరిబిక్కిరిగా ఉన్నప్పటికీ తన మీద అభిమానంతో విచ్చేసిన పుత్రసమానుడైన  హరికృష్ణకి గారికి  ప్రత్యేక కృతజ్ఞతలందించారు.

కార్యక్రమ ఆరంభంలో సంస్థ నిర్వాహకురాలు రమణకుమారి  అద్భుతంగా బోయిభీమన్నగారి లలితా సంగీతాన్నిమరో ఇద్దరితో కలిసి ఆలపించడం వీనులకు విందునందించింది. రాగరాగిణి సంస్థని రాగరంజితంగా చెయ్యడంలో సోదరీమణులు రమణకుమారి సుబ్బలక్ష్మిల పాత్ర ప్రశంసనీయమని వక్తలు అన్నారు. కార్యక్రమంలో భర్త బోయి భీమన్నగారి లలితసంగీత గీతాన్ని పరవశంగా ఆలపించి సభికుల కరతాళ ధ్వనులను బోయి హైమావతి అందుకోడం కొసమెరుపు.

– సూర్యకిరణ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here