తనకంటూ ఒక్క గది

0
6

[box type=’note’ fontsize=’16’] శ్రీమతి యద్ధనపూడి సులోచనారాణి స్మృతిలో లేఖిని సంస్థ నిర్వహించిన కథల పోటీలలో తృతీయ బహుమతి ₹5,000/- గెలుచుకున్న కథ ఇది. రచన అవధానం లక్ష్మీదేవమ్మ. [/box]

[dropcap]జి[/dropcap]ల్లా పరిషత్ హైస్కూలు. 10వ తరగతి తెలుగు క్లాసు జరుగుతుంది. పానుగంటి వారి సాక్షి నుండి సారంగధర నాటక ప్రదర్శనము అన్న పాఠాన్ని వివరిస్తున్నారు తెలుగు పండితులు నరసింహ శర్మగారు. ముందు వరసలోనే కూర్చొని తదేక దీక్షతో వింటూంది పదిహేనేళ్ల సాహితి. మధ్యలో పానుగంటి వారి ఛలోక్తులకు విద్యార్థులందరూ కడుపుబ్బ నవ్వుతున్నారు.

ఏదో సర్క్యులర్ పట్టుకొని అటెండరు రావడంతో పాఠం ఆపారు శర్మగారు. సర్క్యులర్ చదివి పిల్లలతో యిలా అన్నారు – “మన పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ఒక ‘మాగజైన్’ ప్రచురించబోతున్నారు. ఆసక్తి ఉన్న వారు తెలుగులో కవితలు, కథలు, పద్యాలు వ్రాసి ఇవ్వవచ్చును. ఎన్నికయిన వాటిని పాఠశాల పత్రికలో ప్రచురిస్తారు. చివరి తేదీ…”

వింటున్న సాహితి కళ్ళు మెరిసినాయి. “తనూ ఒక కథ రాస్తే! అమ్మో! తను రాయగలదా?” ఇలా పరిపరి విధాలుగా ఆలోచించసాగింది. క్లాసయింతర్వాత తెలుగు సారు దగ్గరికి వెళ్లి అడిగింది.

“సార్, కథ రాయాలంటే ఏం చేయలి.?”

“ఏమే! కథ రాస్తావా? నా బంగారు తల్లి! నీకు తెలిసిన ఒక సంఘటను నీకు తోచినట్లుగా కథ రూపంలో రాసేయడమే. రాసింతర్వాత నాకు చూపిద్దువుగాని. దిద్దిపెడతా” అన్నారాయన సాహితి తలనిమిరి.

***

సాయంత్రం యింటికి వెళుతూనే వంటిట్లో ఉన్న అమ్మ దగ్గరికెళ్లి “అమ్మా నేను కథ రాస్తానే” అంది.

వింతగా చూసింది వాళ్లమ్మ సాహితి వైపు.

“కథ లేదు కాకరకాయ లేదు గాని, కొట్టు కెళ్లి ఉల్లిపాయలు, అల్లం తీసుకురా పో. పెరట్లో ఆరేసిన బట్టలు అన్ని తెచ్చి మడతలు పెట్టి గూట్లో పెట్టు. ఎదుగుతున్న కొద్దీ పని పాటలు నేర్చుకోవాలి. లేదంటే రేప్పొద్దున అత్తగారింటికి వెళ్లింతర్వాత నన్నంటారు” అన్నదామె.

సాహితి అమ్మ వైపు చూస్తూండిపోయింది.

“ఏమిటా చూపు కదులు త్వరగా.”

నిరుత్సాహంగా పనిలో జొరబడింది సాహితి. తర్వాత సెవెన్త్ క్లాసు చదువుతున్న తమ్ముడొచ్చాడు. వాడికి బట్టలు మార్పించి, చిరుతిండి పెట్టింది.

“సాహితీ ఎక్కడున్నావే?” గది లోంచి నాయనమ్మ పిలుపు విని, ఆమె దగ్గరకు వెళ్లింది. నాయనమ్మ మంచం పట్టి సంవత్సరమయింది. ఆమెను బాత్‍రూమ్‌కు తీసుకెళ్లడం కూడా ఆ అమ్మాయే చేయాలి. నాయనమ్మ బాత్‍రూమ్‌కు వెళ్లొచ్చిన తర్వాత సాహితి వెళ్లిపోతుంటే…

“ఉండవే తల్లీ. కాస్త కాళ్ళు పట్టు” అంది ముసలామె.

“లేదు. నేను కథ రాసుకోవాలి” అంది సాహితి.

“కథ కేమీ కొంప మునగదులే. కాస్త పట్టి వెళ్లు” అనే సరికి విధి లేక నాయనమ్మకు సేవ చేసింది.

కాసేపుటికి వాళ్ల నాన్న రావడం, తర్వాత భోజనాలు, ఎంగిలి పళ్లాలన్నీ తీసి శుభ్రం చేయడం! పని మనిషని భరించే స్తోమత లేక, తల్లికి అంట్ల తోమడంలో సహాయం, ఇవన్నీ అయ్యేసరికి రాత్రి పదైంది.

హాల్లో కంబళీ జంపఖానా వేసుకొని అక్కాతమ్ముళ్లిద్దరూ పడుకుంటారు. తమ్ముడు పడుకొన్న తర్వాత, బ్యాగులోంచి రఫ్‌నోట్సు, పెన్ను తీసి కథ రాయటానికి ఉపక్రమిస్తూంటే…

“అబ్బా! లైటు తీసెయ్యక్కా, నాకు నిద్ర పట్టదు” అన్నాడు వాడు. కాదంటే నాన్నకు చెబుతాడు. అమ్మా నాన్నా కొడుకునే సమర్థిస్తారు.

***

తరువాత ఆదివారం మధ్యాహ్నం అందరూ పడుకున్న తర్వాత రాత్రి తాను అనుకున్న విషయాన్ని కథగా వ్రాసి, సంతోషంగా నిట్టూర్చింది సాహితి. సోమవారం ఉదయం స్కూలు ఇంటర్వల్‌లో తెలుగు సారుకు చూపించింది. ఆయన కథంతా చదివి “బాగా రాశావు కదే భడవా” అని అభినందించి, చిన్న చిన్న మార్పులు చేసి యిచ్చారు.

***

నెల రోజుల తర్వాత క్లాసులో మ్యాగజైన్ పట్టుకొచ్చారు శర్మగారు. వస్తూనే సాహితి వద్దకు వెళ్లి “నీ కథ పడిందిరా తల్లీ” అన్నారు బుగ్గలు పుణుకుతూ. సాహితి మొదట కంగారుపడింది. తర్వాత ఆనందంతో తబ్బిబ్బుపడింది. సాహితితోనే కథ చదివించారాయన పిల్లలందరూ వినేట్టుగా. కథ పేరు సంస్కారం. క్లుప్తంగా కథ యిది.

బస్సులో ఒక చదువుకున్న యువకుడు వెళుతూంటాడు. అతని ప్రక్కన ఒక పల్లెటూరాయన కూర్చొని ఉంటాడు. మురికి బట్టలు, చుట్టకంపు, చింపిరి జుట్టు, మాసిన గడ్డం. అసహనంగా ఉంటుందతని వాలకం. యువకుడు సీటు మారదామంటే ఖాళీ ఉందడు. కాసేపటి తర్వాత యువకుడికి అనుకోకుండా కళ్ళు మంటలు, జ్వరం, కడుపులో తిప్పుతున్నట్లుగా అనిపిస్తుంది. వాంతి వస్తుంటే కిటికీలోంచి వంగే లోపు కొంత పల్లెటూరయన మీద పడుతుంది. దానికాయనేమీ అనుకోడు. పైగా బస్సాపించి, దగ్గర్లోని కిళ్లీ కొట్టు నుంచి నీళ్ళ పాకెట్టు, నిమ్మకాయ సోడా తీసుకువస్తాడు. తన భుజం మీద కండువాతో యువకుడి నోరు, ముఖం శుభ్రపరిచి, నీళ్లు పుక్కిలింపించి, సోడా తాగిస్తాడు. తేరుకున్న తర్వాత తన భుజం మీద తల పెట్టకొని పడుకోమంటాడు. యువకుడి కళ్లు తెరుచుకుంటాయి సంస్కారం వేరు, నాగరిక రూపం వేరని. బస్సులో ఇతర ప్రయాణీకులు తను వాంతి చేసుకొంటుంటే వికారంగా ముఖాలు పెట్టడం, ఏమిటీ న్యూసెన్స్ అన్నట్లు చూడడం కూడా గమనించాడా యువకుడు. ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి, పశ్చాత్తాపంతో వెళ్లిపోతాడు.

తెలుగు సారు సాహితిని అభినందించి, పిల్లలందరితో చప్పట్లు కొట్టించారు. ఆ అమ్మయికి ఒక కాపీ యిచ్చారు. సంతోషంతో యింటికి వెళ్లిన సాహితికి ఇంట్లో అంత అభినందన లభించలేదు.

“బుద్ధిగా చదువుకోకుండా ఈ కథలు దేనికి? అవేమయినా కూడు పెడతాయా?” నాన్న.

“పనీ పాటా ఎగ్గొట్టి కథలు రాసుకొంటానంటే ఒప్పుకోను” అమ్మ.

“దీన్నిలా వదిలేస్తే ముందు ముందు కష్టం” నాయనమ్మ.

***

జూనియర్ కాలేజీలో ఆర్ట్స్ గ్రూప్ తీసుకోవాల్సి వచ్చింది సాహితికి. తెలుగు లెక్చరర్ శేషగిరిరావు సాహితిని ప్రోత్సహించాడు. లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు చదవమని, వార మాసపత్రికలు చదవమని చెప్పారు. క్రమంగా సాహిత్యం మీద మక్కువ పెంచుకుంది సాహితి. విరివిగా చదివింది. అడపాతడపా కథలు, కవితలు వ్రాసి పంపేది. అవి ప్రచురించబడేవి కావు. శేషగిరిరావు గారు నిరుత్సాహపడ వద్దనేవారు. “నీ ఆనందం కోసం నీవు వ్రాయి” అనేవారు.

***

ఇంటరు అవుతూనే పెళ్లిసంబంధాలు చూడటం మొదలు పెట్టారు యింట్లో వాళ్లు. డిగ్రీ పూర్తి చేస్తానంటే వినలేదు. మొత్తానికి ఒక సంబంధం కుదిరింది. అబ్బాయి గ్రామీణ బ్యాంకులో క్లర్కు. దూరపు బంధుత్వమే. మొదటి రాత్రి భర్తతో అన్నది సాహితి.

“మీరు కథలు చదువుతారా, రాస్తారా?” అని.

బిగ్గరగా నవ్వాడతను.

“నా కెప్పుడు కుదురుతుందీ” అన్నాడు.

“కొంపదీసి నీవు గాని రాస్తావేమిటి” అన్నాడు.

“అవునండీ. నాకు చాలా ఇంట్రెస్టు. మీరు కోఆపరేట్ చేయరూ?” అన్నది.

“చూద్దాంలే” అన్నాడా మగజీవి.

***

తర్వాత కొన్ని నెలలకే గర్భం దాల్చడం, బాబు పుట్టటం, అత్తమామలకు సేవలు, గృహిణి ధర్మం నిర్వర్తించడం, సాహిత్య సేవ వెనకబడింది. కానీ పత్రికలు చదివేది. ఎప్పుడో ఒక కథో, కవితో రాసి పంపేది. ఒకసారి ఆంద్రభూమి మాస పత్రిక నుండి ఒక ఉత్తరం వచ్చింది – ‘మీ కథ ప్రచురిస్తాము’ అని. సాహితి సంతోషం చెప్పనలవి కాదు. ఆ పత్రిక కాంప్లిమెంటరీ కాపీ వచ్చింతర్వాత భర్తకు చూపిస్తే – “నేననుకుంటనే వున్నా ఇలాంటిదేదో జరుగుతుందని” అన్నాడా మగానుభావుడు. అత్తా మామలకు సాహిత్య గంధమే అంటలేదు.

సంవత్సరం నిండిన బాబుకా పత్రిక యిచ్చి, “కన్నా నా కథ పడింది చూడరా!” అంటే ఏదో అర్థమయినట్లు పత్రికను పట్టుకొని కిలకిలా నవ్వాడు వాడు.

క్రమంగా వ్రాయసాగింది. విపులలో అనువాద కథలు ఆసక్తిగా చదివేది. ఒకసారి వర్జీనియా వూల్ఫ్ వ్రాసిన ‘ఎ రూం ఆఫ్ వన్స్ ఓన్’ అనువాదం చదివింది. ఎంత చక్కగా వ్రాసిందీమె అనుకొన్నది. స్త్రీలు రచనలు చేస్తే ఇంటా బయటా ఎంత వ్యతిరేకత వస్తుందో వివరించిందా మహారచయిత్రి. స్త్రీ రచయిత కావాలంటే ‘తనకంటూ ఒక గది’, పేపర్లు, పెన్నులూ, కవర్లూ, పోస్టేజి స్టాంపులూ కొనుక్కోడానికి తనకంటూ సొంత ఆదాయం ఉండాలంటుది వూల్ఫ్. నగ్నసత్యం అనుకుంది సాహితి. తన రచానా వ్యాసంగం అనవసర ఖర్చని భర్త విసుక్కోవడం కూడ ఆమెను బాధించేది. ఏ దేశంలోనైనా ఆడది సృజనాత్మకత చూపితే పురుషాధిక్య సమాజం భరించ లేదన్నది సాహితీ కర్థమయింది.

***

బాబు పెరిగి పెద్దవాడవుతున్నాడు. వాడికి విశ్వనాథ్ అని పేరు పెట్టుకుంది భర్తను ఒప్పించి విశ్వనాథ వారి మీద అభిమానంతో. ఆయన వేయిపడగలు, తెరచి రాజు, హహహూహూ, చెలియలికట్ట, మొదలగు నవలలు శ్రద్ధగా చదివింది. వాడికి ఊహ తెలిసిన వాటి నుండి కథలు చెప్పడం ప్రారంభించింది. కళ్లు విప్పార్చుకొని వినేవాడు. సన్నివేశాల్లో లీనమయ్యేవాడు. జంతువుల కథలంటే తెగ యిష్టం వాడికి. పురాణాల కథలు కూడ చెప్పేది. ముఖ్యంగా వినాయకుడి కథ. గణపతి బొజ్జనిండా కుడుములు, ఉండ్రాళ్లు తిని, ఎలుక మీద నుంచి పడిపోయి అవన్నీ మళ్లీ బొజ్జలో దూర్చుకుని, అటుగా వెళుతున్న ఒక పామును బెల్టుగా పెట్టుకొడం, ఇందాంతా చూసి చంద్రుడు నవ్వడం, వినాయకుడు కోపగించుకొని చంద్రుని శపించడం విశ్వనాథ్‌కు ఎంత యిష్టమంటే రోజూ చెప్పించుకోవాలసిందే.

వాడు యిల్లంతా పరుగులు తీస్తుంటే “వద్దు కన్నా, పడిపోతావు రా, దెబ్బతగులుతుంది” అంటే, “అమ్మా పాము కత్తుకుంతా పొత్తకు” అంటాడు. భర్త మేనేజరయ్యాడు. అత్తమామలు గతించారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగు పడింది. సొంత యిల్లు కట్టుకునేటపుడు భర్త నడిగింది.

 “ఏమండీ నాకు ప్రత్యేకంగా ఒక గది, రాసుకోడానికి టేబుల్, కుర్చీ, పుస్తకాలకో ర్యాక్ ఉండేలాగా కట్టించండి” అని.

“మన బడ్జెట్‌కు సాధ్యం కాదు. మనకో రూమ్ ఉంది కదా! రాసుకోవడానికెవరయినా రూం కట్టించుకుంటారా? నీ పిచ్చిగాని” అన్నాడాయన.

బాబు 6వ తరగతికి వచ్చాడు. వాడికి చందమామ కథలు చదవడం అలవాటు చేసింది. రామోజీ ఫౌండేషన్ వారి బాలభారతం, దినపత్రిక అనుబంధాలలో వచ్చే పిల్లల కథలు, పంచతంత్ర కథలు, నవ్వ వీక్లీలో వసుంధర రాసే నూరుకట్ల పిశాచం కథలు ఇష్టంగా చదివేవాడు. కొడుకును పెద్ద రచయితగా చూడాలని ఆమె కోరిక. కానీ వాడు ఎక్కవగా చదువుకోవడమే యిష్టపడేవాడు.

పదవ తరగతిలో 9.3 తెచ్చుకొన్నాడు. 9.9 రాలేదమని భర్త గునిసినా కొడుకును వెనుకేసుకొచ్చింది సాహితి. వాడి తెలివితేటలు, సృజనాత్మకతకు మార్కులు కొలమానం కాదని వాదించింది. ఇంటర్‌లో ఎం.పి.సి లోనే చేరాలి, ఇంజనీరవ్వాలి, ఎం.బి.ఎ చేయాలి లేదా ఆమెరికాలో ఎం.ఎస్ చేయాలి. ఇదీ ఆయన కలలు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తల్లిదండ్రుల ఆలోచనా విధానమే అది. మెడికల్, ఇంజనీరింగ్ తప్ప మూడో కోర్సు మనవాళ్లకు పనికి రాదే.

విశ్వనాథ్ యింజనీరింగ్‌లో చేరాడు. సాహితి చిరకాల కోరిక తీరలేదు. ఇంతలో వారి కుటుంబం మీద పిడుగు పడింది. అకస్మాత్తుగా భర్తకు గుండెపోటు వచ్చింది. మృత్యవు ఆయనను కబళించింది. చివరిక్షణాల్లో భార్యతో అన్న మాటలివి.

“మన యిల్లు అమ్మైనా వాడిని అమెరికా పంపు. నీ పిచ్చి రాతలు వాడికి నేర్పకు.”

***

భర్త పోయిన దుఃఖం లోంచి కోలుకుని, ఒక రోజు కోడుకునడిగింది.

“కన్నా, మరి అమెరికాకు వెళ్లి చదువుకుంటావా?”

“నాన్న చివరి కోరిక తీర్చాలికదమ్మా, వెళతాను.”

ఆ ఏర్పాట్లు చేసుకున్నారు. ఇల్లు అమ్మేశారు. ఇంటి ఋణం పోను మిగిలిన డబ్బు విశ్వనాథ్ కిచ్చింది. అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ చదువుకోవాలి పాపం.

రెండు సంవత్సరాలు సాహితి నిస్సారంగా గడిపింది. భర్త లేడు. కొడుకు సముద్రాల అవతల ఉన్నాడు. ఒక చిన్న యిల్లు అద్దెకు తీసుకుంది. ఒకే గది, చిన్న వంటిల్లు అంతే. ఆ గదిలోనే ఒక మూల బాత్‌రూం. భర్త కొచ్చిన రిటైర్ ‌మెంట్ బెనిఫిట్స్‌లో చాలా భాగం కొడుకుకే పంపవలసి వచ్చింది. ఒక కాన్వెంటులో టీచరుగా చేరి, కొంత సంపాదించుకుంటుంది. సాహితీ పిపాస మరుగున పడిపోయినట్లే.

***

కాలచక్రం దాని మానాన అది తిరుగుతుంది. విశ్వనాథ్ ఎం.ఎస్. పూర్తి చేసి ఒక మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. మంచి జీతం. పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ఒక రెండేళ్లు ఆగమన్నాడు తల్లిని.

అమెరికాలో పరిస్థితులు మారుతున్నాయి. ట్రంప్ విధానాలు భారతీయులకు అనుకూలంగా లేవు… ఒక రోజు విశ్వనాథ్ ఫోన్ చేశాడు.

“అమ్మా నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇక్కడ పరిస్థితులు బాగాలేవు. ఇంకా క్షీణించక ముందే మన దేశానికి వచ్చేయడం మంచిదనిపిస్తూంది. నీవంటూ ఉంటావు కదా – “స్వధర్మేనిధనం శ్రేయః పరధర్మో భయావహః” అని. మన అదృష్టం ఏమంటే మా కంపెనీ వాళ్లే నాకు మన దేశంలోని బెంగుళూరు క్యాంపస్‌లో ఆఫర్ యిచ్చారు. యిక్కడితో పోలిస్తే తక్కువయినా నీ దగ్గరికి వచ్చేయవచ్చు. ఏమంటావు? నాన్న ఆఖరి కోరిక కూడా తీర్చినట్టే. ఇక నీ కోరిక మిగిలిపోయింది” అన్నాడు.

“నాకు కోరిక లేముంటాయి కన్నా. నీవు వచ్చేస్తానంటే నాకంటే సంతోషింటేవారెవరు. తప్పక రా నాన్నా” అంది సాహితి కళ్లు నీటి చెలమలు కాగా.

***

మూడు నెలలు గడిచాయి. విశ్వనాథ్ వచ్చి బెంగుళూరులో జాయినయ్యాడు. అమ్మను తీసుకొని వెళ్లడానికి వచ్చాడు. కొడుకును అపురూపంగా చూసుకుంది సాహితి. అక్కున చేర్చుకొని తన్మయిరాలైంది. వాడి కిష్టమయిన కందాబచ్చలి కూర, పొట్లకాయ బజ్జీలు చేసిపెట్టింది.

***

బెంగళూరులో విమానం దిగారు తల్లీ కొడుకులు. క్యాబ్ మాట్లాడుకొని జయానగర్ వెళ్లారు. ఒక యింటి ముందు క్యాబ్ ఆగింది. గేటుకు ఒక వైపు పాలరాతి పై ‘సాహితీ నిలయం’ అని మరొక వైపు సరస్వతీ దేవి బొమ్మ చెక్కబడి ఉన్నాయి.

“ఇదేమిటి రా నాన్నా, ఇది ఎవరి యిల్లు?” అంది సాహితి అయోమయంగా.

“మనిల్లేనమ్మా, మన కోసమే కొన్నాను. పద లోపలికి వెళ్లి చూద్దువు” అన్నాడు కొడుకు.

లోపల చాలా బాగుంది. సోఫాలు, కర్టెన్స్, షాందిలియర్, మాడ్యులర్ కిచెన్, మూడు బెడ్ రూములు. ఒక రూం తెరిచి అన్నాడు “అమ్మా ఇదే నీ గది. అచ్చంగా నీదే చూద్దువు గాని రా” అని సాహితిని నడిపించుకొని లోపలికి తీసుకెళ్లాడు.

గది విశాలంగా ఉంది. సింగిల్ కాట్, ఎ.సి అటాచ్‌డ్ బాత్‌రూం. వీటన్నిటిని మించి సాహితిని ఆకర్షించింది. విశాలమైన కిటికీ. దాని నానుకొని ఉన్న రైటింగ్ టేబుల్, అధునాతనమైన కుషన్ ఛెయిర్.

సంభ్రమాశ్చర్యాలతో నోట మాట రాలేదు అమ్మకు. ఒక మూలన పుస్తకాల షెల్ఫ్. లబ్దప్రతిష్ఠులయిన తెలుగు కవులు రచయితలందరూ కొలువు తీరి ఉన్నారందులో.

అమ్మను మంచం మీద కూర్చో బెట్టి పర్సులో నుంచి ఒక ఎ.టి.యం (డెబిట్) కార్డు తీసి యిచ్చాడు.

“ఇదిగో నీ పేర బ్యాంక్ అకౌంట్ తెరిచాను. అందులో ఎప్పుడూ లక్ష రూపాయలుండేలా చూస్తాను. ఈ వీధిలోనే ఎ.టి.యం ఉంది. నీకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు తెచ్చుకోవచ్చు.”

“నాకు డబ్బు ఎందుకురా కన్నా?” అన్నదా పిచ్చి తల్లి.

“అదేమిటి నీవు నీ రచనా వ్యాసంగాన్ని ప్రారంభించాలి మళ్లీ. మంచి పెన్నులు, కాగితాలు, కవర్లు, అన్నీ తెచ్చిస్తాను. నీవు వంట కూడ చేయల్సిన పని లేదు. వంట మనిషిని, పని మనిషిని పెట్టాను. ఎవరూ నిన్ను డిస్టర్బ్ చేయరు. నీ పేరు మార్మోగిపోవాలి. నీకింకా యాభై నిండలేదు తెలుసా” అన్నాడు పుత్రశిఖామణి.

సాహితి మనసు ప్రఫుల్లమయింది. ఆ గదీ, టేబుల్, అన్నీ ఆమెలో మళ్లీ రచయితను తట్టి లేపుతున్నాయి. ఎందుకో ఆమెకు వర్జీనియా వూల్ఫ్ గుర్తొచ్చింది. ‘అమ్మా స్త్రీల కోసం వారి రచనా స్వతంత్రం కోసం నీవు పడిన తపన, చూశావా నా బంగారుకొండ ఎలా తీర్చాడో’ అనుకుంది.

ప్రస్తుతం సాహితి ఒక ప్రముఖ రచయిత్రి. ఆమె అదృష్టం కోడలు కూడా సాహిత్యాభిమానే వచ్చింది. అత్తా కోడళ్లిద్దరు సమకాలీన సాహిత్య చర్చలు చేస్తూ ఉంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here