తానొకటి తలిస్తే..-1

0
11

[సంచిక 2022 దీపావళి పోటీకి అందిన కథ.]

[dropcap]“ఎ[/dropcap]ల్లమ్మా గుల్లో పూజారిగారు గంట వాయిత్తున్నారు. తొందరగెల్లి పసాదం ఒట్టుకు రా.” చెరువు ఒడ్డున బట్టలుతుకుతున్న, చాకలి భద్రయ్య, నేలమీద, బట్టలు ఆరవేస్తున్న, భార్య దిక్కు, ఓ కేక వేసేడు.

“ఎల్తున్నా మావాఁ.”, అని చెరువులో కాళ్ళూ చేతులు కడుక్కొని, పైట కొంగుతో, ముఖానున్న చెమట తుడుచుకొంటూ, వడి వడిగా, అమ్మవారి గుడి చేరుకొంది, ఎల్లమ్మ. అక్కడ, అంతరాలయంలో నిలబడి ఉన్న, పదిమంది భక్తుల వెనుక, భక్తి శ్రద్ధలతో నిలబడి, పూజారిగారు ఇచ్చిన ప్రసాదం అందుకొని, ఆయనకు, వంగి నమస్కరించి, చెరువు గట్టు చేరుకొంది.

పూజారిగారు, గర్భగుడికి తాళం వేసి, పట్నం వెనుతిరిగేరు.

భద్రయ్య బట్టలు ఉతుకుతున్న చెరువులో, ఆవతలి ఒడ్డున, గేదెలు, నీటిలో సేద తీర్చుకొంటూ ఉంటాయి.

ఆ చెరువులోనే, గ్రామంలోని కొందరు కుర్రాళ్ళు, ఈత కొడుతూ, ఆడుకొంటూ ఉంటారు.

ఆ చెరువు నీరే, గ్రామంలో అనేకమంది దాహార్తిని తీరుస్తోంది.

కొందరు గ్రామవాసులకు, ఉదయాన్నే, కాలకృత్యాలు తీర్చుకోడానికి కూడా, ఆ చెరువు నీరే ఉపయోగపడుతూ ఉంటుంది.

రాంపల్లి, ఆంధ్ర రాష్ట్రంలో, ఒక చిన్న పల్లెటూరు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి, ఏడు దశాబ్దాలు దాటినా, ఎటువంటి అభివృద్ధికి నోచుకోని పల్లెలలో, అదొకటి. ఒకప్పుడు, రాంపల్లిలో సుమారు రెండువందల గడపలుండేవి. వారిలో, తొంభై శాతం వరకు వ్యవసాయం మీదనే ఆధార పడుతూ ఉండేవారు. వారి భూములకు, వేరే నీటిపారుదల సౌకర్యం లేదు. కాలక్రమేణ పెరుగుతున్న ఎరువుల ధరలతో, వ్యవసాయం మీద వస్తున్న ఆదాయం, గిట్టుబడి లేకుండా అయింది. కాని, వేరే ప్రత్యామ్నాయం లేదు. కొందరు, గేదెలు, కోళ్ల పెంపకం వైపు, దృష్టి సారించేరు. ఆ పాలు, గుడ్లు, రాంపల్లిలోనే, అమ్ముడుపోయే అవకాశం లేదు. రోజూ, పట్నంనుండి ఓ వ్యాపారి వచ్చి, పాలను, గుడ్లను సేకరించి, వారానికోసారి, నగదు చెల్లించడం మొదలెట్టేడు. బజారులో, పాలు, గుడ్ల ధరలు పెరుగుతున్నా, కేవలం, మధ్యవర్తే బాగుపడుతున్నాడు. అది; రాంపల్లివాసుల, ఆర్థిక పరిస్థితి.

మెడలో స్టెతస్కోపు వేలేసుకొని, ఓ మెడికలు బ్యాగుతో, స్కూటీ మీద, రోజు విడిచి రోజు, సుబ్బారావు, రాంపల్లి వస్తూంటాడు. ఆయన్ని చూడగానే, ‘డాట్రగారొచ్చేరు, డాట్రగారొచ్చేరు.’ అని, కుర్రాళ్లు రోడ్డు మీద, పరుగులతో కేకలేసుకొంటూ వెళ్తూంటారు. సుబ్బారావు, ప్రభత్వ ఆసుపత్రిలో, రిటైరయిన నర్సు. గ్రామ పంచాయితీ ఆఫీసే, అతని అనధికార ఆసుపత్రి. సుబ్బారావును చూడగానే, పంచాయితీ ఆఫీసులో పనిచేస్తున్న ప్యూను, ఆఫీసు వరండా మీద, అతనికి ఒక కుర్చీ వేస్తాడు. వైద్యసేవలు కావలిసిన వారు, అక్కడికి చేరుకొంటారు. జ్వరం, దగ్గు, అజీర్ణంతో బాధపడుతున్న వారికి ఆయన దగ్గర మందులుంటాయి. గాయాలు తగిలినవారికి, కట్లు కట్టి, తినడానికి మాతర్లు ఇస్తాడు. ఆయన సూదిమందులు (injections) కూడా ఇస్తూ ఉంటాడు. ఆ విధంగా సుబ్బారావు, రాంపల్లి వాసుల, సాధారణ రోగాలకు, వైద్యసేవలు అందిస్తూ ఉంటాడు. ఆయన అందించే సేవలే, రాంపల్లి వాసులకు గల, ఏకైక, వైద్య సౌకర్యం.

స్వాతంత్య్రం వచ్చేక, రాంపల్లిలో జరిగిన అభివృద్ధికి, ఏకైక రుజువుగా, ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. రెండు దశాబ్దాల క్రితం, అప్పటి ఎమ్.ఎల్.ఎ. గారి చొరవతో, రాంపల్లిలో ఆ పాటి విద్యా సౌకర్యం కలిగింది. ఆ పాఠశాలలోని, విద్యార్థుల సంఖ్య, ముఫై నుండి, నలభై మధ్య, ఊగిసలాడుతూ ఉంటుంది. అన్ని తరగతుల విద్యార్థులకు, పాఠాలు చెప్పడానికి, ప్రభుత్వము వారు ఒకే ఒక గురువుగారిని నియమించేరు. ఆయన, రోజూ తొమ్మిది గంటల ప్రాంతంలో, నవరంగపట్నం నుండి వచ్చి, విధులు నిర్వర్తించుకొని, గృహోన్ముఖులవుతారు. ఆయనకు, ఫ్రభుత్వం తరఫున అందే జీతం కన్నా, గ్రామస్తులనుండి గౌరవసూచకముగా అందే, బియ్యము, పప్పుదినుసులు, కూరగాయల విలువ ఎక్కువ.

క్రమ క్రమంగా, రాంపల్లిలోని కొందరు యువత, స్వంత గ్రామం మీద మమకారాన్ని చంపుకొని, బ్రతుకుతెరువు కోసం, బాహ్య ప్రపంచంలో అడుగు పెట్టడం మొదలెట్టేరు. దగ్గరలోని, నవరంగపట్నంలో, కూలి, నాలి బ్రతుకులకు, అలవాటు పడ్డారు. కొందరు, అదే ధ్యేయంతో, విశాఖపట్నం, ముంబాయి, అహమదాబాదులలో, అడుగు పెట్టేరు. ఆ పరిణామం, రాంపల్లిని ప్రభావితం చేసింది. ఒక ప్రక్క, పుట్టి పెరిగిన ఊరు, బయటకు నెట్టడం, మరొక ప్రక్క, పట్టణాలు, పొట్ట పట్టుకు రమ్మనడంతో, రాంపల్లి జనాభా, రాను రాను, తగ్గుముఖం పట్టింది.

పుట్టి పెరిగిన, గ్రామం మీద మమకారాన్ని చంపుకోలేక, వేరొక దారి లేక, కష్ట నష్టాలను ఓర్పుతో సహిస్తూ, రాంపల్లిలోనే జీవనం గడుపుతున్నవారిలో, ఎల్లాజీ, నూకాలమ్మల కుటుంబం ఒకటి. ఎల్లాజీకి, తండ్రిపరంగా వచ్చిన, ఎనిమిదెకరాల సాగుభూమి ఉంది. అందులో, వరుణుడి మీద భారం వేసి, వరి, సాగుచేసుకొంటున్నాడు. ఇంటి వెనుక గొడ్ల శాలలో, నూకాలమ్మ, మూడు పాడి గేదెలు, పాతిక వరకు, కోళ్లు పెంచుతోంది. పట్నం నుండి, వస్తున్న వ్యాపారి, అవి కొనుక్కొని, వారానికోసారి, ఇస్తున్నదే, వాటిమీద వచ్చే ఆదాయం.

ఎల్లాజీ దంపతులకు, ముగ్గురు సంతానం. పెద్దవాళ్ళిద్దరు, ఆడపిల్లలు. పెద్ద కూతురు, లచ్చమ్మకు, పదకొండేళ్లు. గౌరమ్మకు, తొమ్మిది దాటేయి. ఆఖరివాడు, సింహాద్రి. ఆడపిల్లలిద్దరూ, తండ్రికి, పొలంలో, చేయగలిగిన సాయం చేస్తూ ఉంటారు. ఏడు సంవత్సరాల సింహాద్రి, తల్లి వెంటనే తిరుగుతూ, చిన్న చిన్న పనులు సాయం చేయడం అలవరచుకొన్నాడు.

వాడి వయసు వాళ్ళు, అయిదారుగురు స్నేహితులు, ఆ సంవత్సరం, బడిలో చేరేరు. ఒకరోజు, సింహాద్రి, తన స్నేహితుడు కిట్టిగాడు, భుజాన్న సంచీ వేసుకొని, తొందరగా పోతూండడం చూసేడు. తొందరగా పోయి, వాణ్ణి ఆపి,

“ఏరా, కిట్టీ, ఏడ పోతున్నావురా, తొందరగా.” అని, కుతూహలంతో అడిగేడు.

“నాను, బడికి పోతున్నారా, సింయాదరీ. గురువుగారు, ఒచ్చేత్తారు. తొందరగ పోఆల. అంజిగాడు, కోటిగాడు కూడ, బడికొత్తారు. నువ్వు కూడ బడిలో చేరు. మజా ఒత్తాదిరా.” అని, సింహాద్రిని బడిలో చేరమని, కిట్టిగాడు ప్రోత్సహించేడు. అది విని, సింహాద్రికి కూడా, బడిలో చేరాలనిపించింది.

నూకాలమ్మ, పెరట్లోని గేదెలకు కుడితి పెడుతూంటే, సింహాద్రి, పరుగున అక్కడకు వెళ్లి,

“అమ్మా, అంజిగాడు, కిట్టిగాడు, ఆల్లంతా, బడికెల్తున్నారమ్మా. నాను కూడ బడికెల్తానమ్మా. అయ్యతో సెప్పమ్మా.” అని, తల్లి కొంగు పట్టుకొని, విన్నవించుకున్నాడు.

“మీ అయ్య రానీ. సెప్తాను. బడిలో ఏత్తె, నువ్వు బుద్దిగ సదుకోవాల.” అని, నూకాలమ్మ, సింహాద్రి తల నిమురుతూ, ఆప్యాయంగా అంది.

“అట్టాగేనమ్మా.” అని, సింహాద్రి తల్లికి హామీ ఇచ్చేడు.

నూకాలమ్మ, భర్తకు సిఫారసు చేసింది. ఎల్లాజీ అంగీకరించేడు. భార్య సలహాతో, ఎల్లాజీ ఆ మరునాడు ఉదయం, అమ్మవారి గుడిలో, పూజారిగారిని కలుసుకున్నాడు. సింహాద్రిని బడిలో చేర్చడానికి, మంచి రోజు చూడమని, ఆయన్ను వేడుకొన్నాడు. ఆ రాబోయే మంగళవారానికి, ఆయన ముహూర్తం పెట్టేరు. ఆ మంగళవారం వచ్చింది. పూజారిగారి సలహా మేరకు, ఉదయాన్నే ఎల్లాజీ నూకాలమ్మలు, సింహాద్రితో బాటు, అమ్మవారి గుడికి వెళ్ళేరు. పూజారిగారు, అమ్మవారికి పూజ చేసి, ఆ ముగ్గురి నుదుట, దేవి కుంకుమతో, బొట్లు పెట్టి, ఆశీర్వదించేరు. ముగ్గురూ ఆయనకు, సాష్టాంగ నమస్కారం చేసేరు. ఎల్లాజీ, పూజారిగారికి, నమ్రతతో కొంత పైకం సమర్పించుకున్నాడు. గుడి నుండి, వడి వడిగా, ఆ ముగ్గురూ. బడి చేరుకొన్నారు. సింహాద్రి, తమ బడిలో, ఆ రోజు చేరుతాడని, ఎల్లాజీ ద్వారా, గురువుగారికి ముందే తెలుసు. వారి రాకకై ఎదురు చూస్తున్న గురువుగారు, వారిని ఆహ్వానించేరు. గురువుగారు, చాలా సంతోషంతో సింహాద్రిని బడిలో చేర్చుకున్నారు. ఆయన సంతోషంలో, ఒక నిగూఢమయిన నిజం, దాగి ఉంది. ఈ మధ్యనే, బడిలోని విద్యార్థుల సంఖ్య నలభై అయిదుకు చేరుకొంది. సింహాద్రి చేరడంతో, ఆ సంఖ్య నలభై ఆరుకు పెరిగింది. బడిలోని విద్యార్థుల సంఖ్య, నలభై అయిదు దాటితే, ప్రభుత్వపరంగా, మరో గురువుగారి నియామకానికి, వీలు కలుగుతుంది. దానితో, గురువుగారి విధులలో, కొంత వెసులుబాటు కలుగుతుంది. అంతేకాదు. అవసరం పడినప్పుడు, కొత్త గురువుగారి సహకారంతో, అనధికారంగా, ఒకటి రెండు రోజులు, విధులకు గైర్హాజరు కావచ్చు. మరి, వచ్చినాయనకు కూడా, ఆ సదుపాయం ఉంటుంది.

సింహాద్రి, రోజూ బడికి వెళ్ళడానికి, అలవాటు పడ్డాడు. క్లాసులో బుద్ధిగా కూర్చొని, శ్రద్ధగా పాఠాలు నేర్చుకొంటూ ఉండేవాడు. అతి తక్కువ సమయంలో, వినయవిధేయతలు, సత్ప్రవర్తన, గల విద్యార్థిగా, గురువుగారి ప్రశంసలకు పాత్రుడయ్యేడు.

సాయంత్రాలు ఇంట్లో వాడు మఠం వేసుకొని, తల ముందుకు వెనుకకు ఊపుతూ, ఎక్కాలు వల్లె వేసుకొంటూ ఉంటే, అది చూసి, ఎల్లాజీ, నూకాలమ్మ, పొంగిపోతూ ఉండేవారు. వాడి ఆ అధ్యాయం ముగియగానే, నూకాలమ్మ, వాడికి ఓ కంచు గ్లాసు నిండా, వేడి పాలు తెచ్చి, అందించేది.

సింహాద్రి రెండవ తరగతిలోనికి ప్రవేశించేడు. ఒక సాయంత్రం, ఇంట్లో, తెలుగు చూచిరాతలు రాస్తూంటే, ఎల్లాజీ దంపతులు ఆశ్చర్యంతో, కళ్లప్పగించి చూడ నారంభించేరు. సింహాద్రి కార్యక్రమం పూర్తయింది. ఎల్లాజీ, కొడుకునుద్దేశించి, “సిట్టిబాబూ, ఏటి రాసినావేటి.” అని, కళ్ళు పెద్దవి చేసి, సంబ్రమాశ్చర్యాలతో అడిగేడు.

“నా ఓంవక్కు సేసినానయ్యా.” అని, తను సాధించినది సగర్వంగా తండ్రికి తెలియజేసేడు, సింహాద్రి.

“సిట్టిబాబు, అక్కు.. అక్కూ.. అంటే, ఏటి నాన్నా.” అని అమాయకంగా, కొడుకును అడిగింది, నూకాలమ్మ.

“అమ్మా, అది అక్కూ.. కాదు. ఓం.. వక్కు. మా గురువుగారు, రోజూ, ఇంటికాడ, సదువుకోడానికి, ఏదో సెప్తారు. దాన్ని, ఓంవక్కు.. అంటారు.”

కుమార షేక్స్పియరు, విడమరచి బోధపరిచిన ఆంగ్లపద ఉచ్చారణ, అర్థము, విని, అటు ఏడు తరాలలోను, ఇటు ఏడు తరాలలోను, ఏ ఒక్కరు, పొరబాటున కూడా, బడి గడప తొక్కని, దంపతులిద్దరూ, సంతోష సముద్రంలో, మునిగి తేలేరు.

ఒక రాత్రి, ఎల్లాజీ, నూకాలమ్మలు, ఇంటి విషయాలు ఆలోచిస్తున్న సమయంలో, నూకాలమ్మ,

“మావాఁ, పెద్దపాపకి, తొందరగా పెల్లి సేసీయాల. ‘మీ పెద్దపాపని, ఆత్తోరింటికి ఎప్పుడు పంపుతారు. పెద్దమనిసి కాకుండ, తొందరగ పెల్లి సేసీయండి.’ అని కనిపించిన ఆడోళ్ళంతా అడుగుతున్నారు మావాఁ.” అని, నూకాలమ్మ భర్తకు, జనవాక్యం తెలియజేసింది.

“నూకాలూ, ఆల్లు అన్నమాటలో తప్పు నేదు. తొందరగ సేసీయాల. నానూ సూత్తున్నా. పెద్దపాపకి, సరైన జోడీ ఎతుకుతున్నా.”

“మావాఁ, కొండయ్యగారి లచ్చిబాబుకు మాట్టాడితే ఎట్టా ఉంటది.” నూకాలమ్మ సలహా.

“అవును నూకాలు. అతగాడు, పట్టంలో ఏదో నోఖిరీ సేత్తున్నాట్ట. కాని, ఏటి సేత్తున్నాడో తెల్దు. ఏటీ తెలవకుండ ఎట్టా మాటాడుతాం.” ఎల్లాజీ సంశయం.

“మావాఁ, పట్టంలో, మన జగ్గుబాబు (జగన్నాధం) ఉన్నాడు గదా. అతగాడికి ఎరికవుతుందేమో.” నూకాలమ్మ, మరో సలహా.

“బాగ సెప్పినావ్. జగ్గుబాబు పట్టంలో సైకిలు దుకానం ఎట్టినాడు. నాను సేనమార్లు జగ్గూబాబుని సయికిలు దుకానం కాడ కలిసినాను. పట్టంలో మన ఊరోల్లు, జగ్గుబాబు సైకిలు దుకానానికి ఒత్తూ ఉంటారు. జగ్గుబాబుతో అన్ని ఇసయాలు సెప్తుంటారు. లచ్చిబాబు నోఖిరీ ఏటో, జగ్గూబాబుకి ఎరికయ్యి ఉంటాది.”

“అయితే, మావాఁ, తొందరగ పట్టం ఎల్లు. జగ్గుబాబుని వాకబు సెయ్య్. లచ్చిబాబు నోఖిరీ ఏటో ఎరికయితే, కొండయ్యగారితో మాటాడొచ్చు. అమ్మోరి దయ ఉంటే, పెద్దపాప పెల్లి, తొందర్లొ అయిపోద్ది.” నూకాలమ్మ మనో వాంఛ.

“ఈ మంగలారం ఉదయాన్నె పట్టం ఎల్తాను, నూకాలు. జగ్గుబాబుని కలుత్తాను. లచ్చిబాబు నోఖిరీ ఏటో అడుగుతాను. నువ్వు సెప్పినట్టు, అమ్మోరి దయ ఉంటె, అంతా సజావుగ అయిపోద్ది.” ఎల్లాజీ కోరిక.

జగన్నాధం తండ్రి నూకయ్య, ఎల్లాజీల కుటుంబాలు, రాంపల్లిలో, ఇరుగు, పొరుగు, ఉండేవారు. వారి మధ్య చాలా సఖ్యత ఉండేది. తల్లి, తండ్రి, పోయేక, జగన్నాధం, రాంపల్లిలో జీవించలేక, తన పదహారవ ఏట, నవరంగపట్నంలో, ఒక సైకిలు దుకాణంలో, పనిలో చేరేడు. మూడు, నాలుగు సంవత్సరాలు, అక్కడ పని చేసేడు. పని బాగా నేర్చుకొన్నాక, స్వంత దుకాణం పెట్టుకొన్నాడు. రోజులు కలిసొచ్చేయి. పాత సైకిళ్ళు కొనుక్కొని, వాటికి కావలిసిన రిపైర్లు చేసి, సరికొత్తవాటిలా చేసి, అమ్మకాలు చెయ్యడం, ప్రారంభించేడు. రాంపల్లి వాసులలో అనేకమంది, నవరంగపట్నం వచ్చినప్పుడు, జగన్నాధాన్ని, ఓ మారు కలుస్తారు. వాళ్ళ ద్వారా, జగన్నాధానికి, తన స్వగ్రామం విషయాలు తెలుస్తూ ఉంటాయి. రాంపల్లిలో, ప్రాథమిక పాఠశాలలో చదువు పూర్తి చేసుకొన్నవారిలో కొందరు, నవరంగపట్నంలో, పెద్ద తరగతులలో, ప్రవేశిస్తూంటారు. వారు కూడా, అప్పుడప్పుడు, జగన్నాధం దుకాణానికి వచ్చి, కబుర్లు చెపుతూంటారు. వారి సైకిళ్లకు, చిన్న చిన్న, రిపైరులు ఏవైనా వస్తే, జగన్నాధం ఫ్రీగా చేస్తూంటాడు. ఆ విధంగా, రాంపల్లిలోని, చిన్నా పెద్దాతో, జగన్నాధం టచ్‌లో ఉంటాడు. వీలయినంతవరకు, ప్రతి సంవత్సరం, అమ్మవారి పండుగులకి, రాంపల్లి వెళ్తూ ఉంటాడు.

రాంపల్లినుండి, అడ్డదారిలో నవరంగపట్నానికి ఓ గంటన్నర నడక. మంగళవారంనాడు, ఎల్లాజీ నవరంగపట్నం వెళ్ళేడు. జగన్నాధం సైకిలు దుకాణం చేరుకొన్నాడు. జగన్నాధం, ఎల్లాజీ రాకను దూరంనుండే గమనించి, చేతిలోని పని ఆపి, ఎల్లాజీని చేరుకొని,

“రా, రా, మావాఁ, సేన్నాళ్ళకు వచ్చినావ్. ఇంటికాడ అందరూ ఎట్టా ఉన్నారు. సింయాద్రి బుద్ధిగ సదువుకొంటున్నాడా.” అని ఆప్యాయంగా స్వాగతం పలికేడు.

“అమ్మోరి దయ; నూకాలు, సింయాద్రి, పెద్దపాప, సిన్న పాప, అంతా బాగోన్నారు, జగ్గుబాబూ. సింయాద్రి రోజూ బడికి పోతూన్నాడు. ఇంటికాడ కూడ సదూతుంటాడు.” అని ఇంకా ఏవో చెప్పబోతూంటే,

“ఉండు మావాఁ, నీకు చాయ చెప్తాను.” అని సంభాషణకు విరామమిచ్చి, ఎదురుగా ఉన్న చిన్న హోటలు దిక్కు కేక వేస్తూ,

“ఇదిగో, సత్తిబాబూ, తొందరగ, రెండు, గరం, గరం, చాయ పంపు… టిఫినీ ఏటుంది.”

“ఇడ్డీలు ఇప్పుడే దింపినాను. మిరపకాయ బజ్జీ ఏత్తున్నాను.” అటునుండి సమాధానం.

“రెండు పేట్లు ఇడ్డీలు పంపు. మిరప బజ్జీలు కూడ ఆరు పంపు. చాయ, గరంగ ఉండాలి.” ఆర్డరు ఇచ్చేడు, జగన్నాధం.

ఆ లోగా, ఎల్లాజీ, తన సంచీలోనుండి, ఒక ప్లేస్టిక్ డబ్బా తీసి, జగన్నాధానికి అందించేడు. అది అందుకొని,

“ఏటి మావా ఇది.” అని చిరునవ్వుతో అడిగేడు.

“నూకాలు పంపినాది, పల్లీల లడ్డూ.”

“పల్లీల లడ్డూ, మా పాపకి సే..న ఇట్టం. ఆల్ల అమ్మని, ఎప్పుడు అడుగుతుంటాది, పల్లీల లడ్డూ సెయ్యమ్మా, అని.”

“జగ్గుబాబూ, మీ ఆయిడ, బిడ్డలు ఎట్టా ఉన్నారు. ఏటి సేత్తున్నారేటి పిల్లకాయలు ఇద్దరూ.” కుశల ప్రశ్న వేసేడు, ఎల్లాజీ.

“ఇంటికాడ అందరు బాగానే ఉన్నారు మావాఁ. బాబు ఆరు సదువుతున్నాడు. పాప, ఒకటి, సదువుతోంది.”

“పాపని కూడ, బడిలో ఏసినావా..”

“ఏసినాను మావాఁ. ఈయేల, రేపు, ఆడపిల్లలికి కూడ సదువు కావాలి మావాఁ. పట్టంలో సేనమంది ఆడపిల్లలు బడికి పోతూంటారు మావాఁ. మన ఇంటికి కాసింత దూరంలో, ఓ గురువుగారు ఉన్నారు. ఆయన నాకు సేన సెప్పినారు. పాపని బడిలో ఎయ్యమని. పెద్దాయన. ఆయన, మన మంచికే గదా సెప్తారు. అట్టా ఆలోసించి, పాపను బడిలో ఏసినాను.”

“మంచి పని సేసినావు. సదువు నేకే కదా, మాబోటోళ్ల బతుకులు ఇట్టా ఉన్నాయి.”

ఆలోగా, హోటలు కుర్రాడు, ఇడ్లీలు, మిరపకాయ బజ్జీలు, వేడి వేడి, టీ, తీసుకొచ్చేడు.

“మావాఁ, ముందుగ టీ తాగు, నేపోతే చల్లారిపోద్ది.” అని, జగ్గుబాబు, ఎల్లాజీకి టీ గ్లాసు అందించేడు.

టీ తాగుతూ, ఇద్దరూ, చెరో మిరపకాయ బజ్జీ అందుకొన్నారు.

“మావాఁ, పట్టం, పనిమీద వచ్చినావా ఏటి.”

“పనిమీదే ఒచ్చినాను, జగ్గుబాబూ.”

“ఎక్కడేటి.”

“నీ కాడే జగ్గుబాబూ.”

“నా కాడా.. మరి చెప్పినావు కాదు. అదేటో చెప్పు.”

“పెద్దపాపకి తొందరగ పెల్లి సేయాలా.. ఊల్లో ఆడోల్లంతా అడుగుతున్నారు.. అంటోంది, నూకాలు.”

“ఇదే మావాఁ, పల్లెటూల్లో, మన బతుకులు మన్ని బతకనీరు. పట్టంలో అయితే, పొరుగోళ్ళకి ఏటయినా, యెవ్వరూ అడగబోరు.”

“నువ్వు సెప్పింది నిజమే. కాని, మనమేటీ సేయ్యలేం. పెద్దపాపకి తొందరగ సంబందం సూడాలా అని, నీ కాడకు ఒచ్చినాను.”

“మన ఊళ్ళో ఎవరిని చూడనేదా.”

“ఆ ఇసయమే, నీతో మాటాడాల, అని ఒచ్చినాను.”

“ఏటి మావాఁ, అది.”

“మన ఊల్లో, కొండయ్యగారి లచ్చిబాబు, పట్టంలో ఏదో నోఖిరీ సేత్తున్నాడ్టా.. పట్టం ఎల్లి, జగ్గుబాబుని, అతగాడు ఏటి సేత్తున్నాడో వాకబు సెయ్యని, నూకాలు సెప్పినాది. అదేటో ఎరికయితే, కొండయ్యగారిని అడుగుదాము, అన్నాది.”

“మావాఁ, మంచిపని చేసినవ్. నన్నొచ్చి అడిగినావ్. లేపోతే, పెద్దపాపకి అన్నాయం అయిపోయి ఉండేది.”

“ఏం.. ఏటయిందేటి.”

“ఆ లచ్చిబాబుకు మందు అలవాటుంది మావాఁ. సిగెరెట్టు కూడా కాలుత్తాడు. కొన్ని దఫాలు, నా దుకానం కాడకు, డోసు మీదే వచ్చినాడు. ఆడేదో, ఆడి డచ్చాలు చెప్పుకొచ్చినాడు. నేను ఇనుకోలే. వాడు పట్టంలో ఏటి చేత్తున్నాడో, యారికీ, ఎరిక లేదు. పెద్దపాప సేన బాగుంటది గదా. ఆడికి పెద్దపాపని చేసుకోవాలా, అని ఉంది. ఓ రోజు, నా కాడకొచ్చి, చెప్పినాడు, ఆ ఇషయం. ‘జగ్గుబాబూ, ఎల్లాజీ మావఁ తో, నువ్వు మాటాడు’, అన్నాడు. వాడికి, నేనేటీ చెప్పలేదు.”

“జగ్గుబాబూ, అంతా అమ్మోరి దయ. పట్టంలో నువ్వు నేపోతే, మాకేటి ఎరికయ్యేది. ఏదో మంచి నోఖిరీ సేత్తున్నాడని, ఆడి ఇసయం ఏటీ తెలవక, నా ఆడబిడ్డకి అన్నాయం సేసీసి ఉందును గదా.”

“అవును మావాఁ, అంతా అమ్మోరి దయ. అమ్మోరు, నీబోటి మంచోళ్ళకి, అన్నాయం చెయ్యదు మావాఁ. పెద్దపాపకి, మంచి పెనిమిటి వత్తాడు. దిగులు పడబోకు.” అని చెపుతూ, ఏదో ఆలోచన తట్టి,

“మావాఁ, మన ఊళ్ళో, మామిడితోట గోవిందయ్యగారు ఉన్నారు గదా; ఆయన పెద్దోడికి పెళ్లి అయిపోనాది గదా. రెండోఆడు సత్తిబాబుని, పెద్దపాపకి మాటాడితే బాగుంటదేమో. గోవిందయ్యగారు సేన, సీదా, సాదా, మనిసి. సత్తిబాబు, కూడ, సేన మంచోడు.”

“జగ్గుబాబూ, గోవిందయ్యబాబుగారు సేన డబ్బున్నోళ్ళు. నాను, పెద్దమ్మలును సేసుకోమని అడిగితే, ఏటనుకొంటారో ఏటో.”

“అడిగి సూడు మావాఁ. ఆయన, ‘సరే’ అంటే, మనకేటి కావాల. కాదంటే మనకేటి డబ్బయిపోద్దు గదా. పెద్దమ్మలుకు, మరోటి మాటాడొచ్చు.”

“నువ్వు సెప్పింది, బాంగానే ఉంది, జగ్గుబాబు; కాని ఆల్లు ‘సరే’ అంటే, ఆల్లు ఏటేటి అడుగుతారో, మనకు తెల్దు గదా. నాకాడ, అంత డబ్బు నేదు.” ఎల్లాజీ, పెద్దకూతురు పెళ్లి విషయంలో, తన ఆర్ధిక అవరోధాలు, జగన్నాధానికి చెప్పేడు.

“మావాఁ, నేను ఓటి చెప్పనా.”

“చెప్పు బాబూ. నీకు అన్నీ బాగా ఎరిక.”

“మావాఁ, నువ్వు, ఎట్టాగో ఓలాగ, అప్పో, సప్పో చేసి, పెద్దపాపని, సత్తిబాబుకిచ్చి, పెళ్లి చేసినావంటే, పెద్దపాప, బాగ సుఖపడుద్ది. నీకు, పెద్దపాప సింత ఏమి ఉండబోదు. అమ్మోరి దయతో, పొలం మీద పంటలు, రెండో, మూడో ఏళ్ళు, బాగ వచ్చినాయంటే, అప్పులన్నీ ఇట్టే తీర్చిస్తావ్. అత్తతో కూడ, ఆలోచించు మావాఁ.” అని, జగన్నాధం, ఎల్లాజీకి సలహా ఇచ్చేడు.

“నువ్వు సెప్పింది నిజమే, బాబూ. మా బతుకులు, ఎప్పటికి, ఇట్టాగే, ఉంటాయి. నువ్వు సెప్పినట్టు, పెద్దపాపని సత్తిబాబుకి మాటాడి, సేత్తే, దాని బతుకేనా, బాగుపడుద్ది. అట్టాగే సేత్తాను. సరే, ఒత్తాను, బాబూ.” అని లేవబోతూంటే.

“కాసేపు ఆగు మావాఁ. ఇప్పుడే వత్తా.” అని తొందరగా సైకిలు మీద వెళ్లి, పది నిమిషాల్లో వచ్చి, ఎల్లాజీ చేతులో ఒక పేకెట్టు పెట్టేడు.

“ఏటి బాబు ఇది.” పేకెట్టు పరీక్షగా చూస్తూ, ఎల్లాజీ అడిగేడు.

“అవి చాకిలెట్లు మావాఁ. పిల్లలకి బాగ ఇట్టమవుద్ధి.”

“నాకు యాదస్తు రాలేదు. ‘అయ్యా, పట్టం ఎల్తున్నావా, నాకు చాకిలెట్టు తెత్తావా’, అని సింయాద్రి అడిగినాడు.” అని, చిరునవ్వుతో పేకెట్టును సంచీలో అమ్మర్చి, ఎల్లాజీ, జగన్నాధం వద్ద శలవు తీసుకొన్నాడు.

ఎల్లాజీ, ఇంటికి వెళ్ళేక, నూకాలమ్మతో, కొండయ్యగారి లచ్చిబాబు గురించి, వాడు తాగుబోతని, జగన్నాధం చెప్పిన వివరాలు, చెప్పేడు.

“పెద్దపాపకు, అన్నాయం కాకుండా, అమ్మోరే కాపాడినాది.” అని, నూకాలమ్మ, గ్రామదేవతకు కృతజ్ఞతలు చెప్పుకొంది.

పెద్దపాపకు; మామిడితోట గోవిందయ్యగారి రెండోవాడు సత్తిబాబుకి మాట్లాడమని, జగన్నాధం ఇచ్చిన సలహా; ఆ విషయంలో, ఇద్దరి సంభాషణ; ఎల్లాజీ, వివరంగా నూకాలమ్మకు తెలియజేసేడు.

మొదట్లో, గోవిందయ్య, తన ఇరవై ఎకరాల సాగు భూమిలో, వరుణుని కరుణమీద ఆధారపడి, వరి సాగుచేస్తూండేవాడు. క్రమక్రమంగా ఎరువుల ఖరీదులు పెరగడంతో, వ్యవసాయం లాభసాటి బేరం కాకపోయింది. ఆలోచించి, తనకున్న భూమిలో, యాభై మామిడిచెట్లు పెంచేడు. కాని, భవిష్యత్తులో, తన ఇద్దరు మగపిల్లలు, వ్యవసాయం, మామిడితోటలమీదే ఆధారపడి జీవించలేరనుకొన్నాడు. పెద్దకొడుకు గణపతిని, తన వెంటా సంతలకు తీసుకు వెళ్లి, దినుసులు కొనడం తరిఫీజు చేసేడు. త్వరలోనే, గణపతి, స్వయంగా, సంతలలో, చింతపండు కొని, శుభ్రపరచి, నవరంగపట్నంలో పెద్దవ్యాపారులకు అమ్మడం ప్రారంభించేడు. చింతపండు వ్యాపారంలో, గణపతి బాగా స్థిరబడ్డాడు. లక్ష్మీదేవి కటాక్షంతో, గోవిందయ్య, పొలాల్లో బోరుబావి తవ్వించేడు. రెండవకొడుకు సత్తిబాబుని, తనతోబాటు వ్యవసాయంలో పెట్టేడు. రాంపల్లిలో, గోవిందయ్య, ధనవంతుల జాబితాలో పడ్డాడు. ఆ పరిణామం, గోవిందయ్యలో ఏ మార్పు తేలేదు. ఎప్పటివలెనే, నిరాడంబర వ్యక్తి. దానధర్మాలకు వెనుదీయడు.

ఒకరోజు, ఎల్లాజీ, కూతురు పెళ్లి విషయం, భార్యతో చర్చిస్తూ,

“నూకాలూ, గోవిందయ్యబాబుగారి కాడకు ఎల్లి, పెద్దపాప పెల్లి ఇసయం, ఎట్టా మాటాడాలో, ఎరికవడం నేదు. ఏటంటావ్.”

“నానుకూడ, అదే ఆలోసించినాను. మావాఁ.”

“అయితె, ఎట్టా మాటాడాలి; నీకేదయిన తోసినాద.”

“మావాఁ. ముందస్తుగా, నువ్వెల్లి మాటాడబోక.”

“ఎందుకేటి.”

“గోవిందయ్యబాబుగారికి ఇట్టమయితే పర్లేదు. ఇట్టం నేపోతే, ఆయన నేరుగ సెప్పనేరు గందా.”

“అయితె, ఏటి సేద్దామంటావ్.”

“మన, దివాకరబాబుగారు ఉన్నారు గందా. ఆయన సేన మంచోరు. ఆయనకాడకెల్లి, గోవిందయ్యబాబుగారితో, పెద్దపాప పెల్లి ఇసయం మాటాడి, సాయం చెయ్యండయ్యా’, అని ఏడుకో. అమ్మోరి దయ; ఆయన సెబితే, ఇంటారు.” అని, నూకాలమ్మ తన ఏక్షన్ ప్లాన్ భర్తకు తెలియజేసింది.

ఎల్లాజీకి, భార్య సలహా నచ్చింది.

దివాకరరెడ్డిగారు, వయసులో పెద్దాయన. ఇండియన్ ఆర్మీలో మేజరుగా పనిచేసి, రిటైరయ్యేక, విశాఖపట్నంలో స్థిరబడ్డారు. ఆయన కుమారులు, ఒకడు ఆర్మీలోను, మరొకడు, నేవీలోను, ఆఫీసర్లుగా ఉన్నారు. రిటైరయిన అయిదు సంవత్సరాలకు, రెడ్డిగారికి భార్యా వియోగం కలిగింది. దానితో, ఆయన శేష జీవితం, ప్రశాంతంగా, ఒక పల్లెటూళ్ళో గడపాలని నిశ్చయించుకొన్నారు. ఆ ఆలోచన, ఆయన్ని రాంపల్లివాసులుగా చేసింది. ఆయన రాక, రాంపల్లివాసులకు సహకరించింది. గ్రామంలో, రెడ్డిగారే, చదువుకొని, పెద్ద ఉద్యోగం చేసి ఉండడం వల్ల, అందరికి, ఆయనంటే, గౌరవం ఏర్పడింది. చాలా విషయాల్లో, ఆయన సలహా తీసుకొంటూ ఉంటారు. గ్రామంలోని అందరితో, ఆయన కలసిమెలిసి ఉంటారు. ఆయన దగ్గర, ఒక జీప్ ఉంది. దానిని, ఆయనే డ్రైవు చేసుకొంటారు. కేవలం, పైఊళ్ళకు వెళ్ళినప్పుడే, ఆ జీపును ఉపయోగిస్తూ ఉంటారు. గ్రామంలో, రోగులను, గర్భిణీ స్త్రీలను, అత్యవసరంగా దగ్గరలోని నవరంగపట్నం లోని ఆసుపత్రులకు చేర్చడానికి, ఆయన, తన జీపు సేవలు, అందిస్తూ ఉంటారు. ఆయన, ఆర్మీలో తన జీవిత అనుభవాలను, అప్పుడప్పుడు, కొందరు పల్లెవాసులతో, పంచుకొంటూ ఉంటారు. పల్లిలోని యువకులకు, 1971 వ సంవత్సరంలో, మనదేశానికి, పాకిస్తానుకు జరిగిన యుద్ధం; అందులో చివరగా, తొంభైవేలమంది పాకిస్తానీ సైనికులు, మన సైన్యానికి లొంగిపోవడం; బంగ్లాదేశ్ పుట్టుక; అన్నీ, కళ్ళకు కట్టినట్టు, ఆయన చెబుతూ ఉంటే, యువకులు, ఎంతో శ్రద్ధతో వింటూ ఉంటారు. రెడ్డిగారు, అప్పుడప్పుడు, గోవిందయ్య ఇంటికి వెళుతూ ఉంటారు. ఒకటి రెండు మార్లు, మన దేశానికి, పాకిస్తానుకు జరిగిన, యుద్ధం వివరాలు, గోవిందయ్యకు పూసగ్రుచ్చినట్లు చెప్పేరు. స్వాతంత్య్రదినోత్సవం, రిపబ్లిక్ డే, దినాలలో, రెడ్డిగారు, రాంపల్లిలోని విద్యార్థులు, యువకులను చేరదీసి, వారికి త్రివర్ణ పతాకాలిచ్చి, వారిని, క్రమపద్ధతిలో వీధుల వెంబడి నడిపిస్తూ, తానూ వారిలో ఒకడై, ‘భారత్ మాతాకి జై ; గాంధీ మహాత్మాకు జై.’ అని ఉత్సాహంతో నినాదాలు చేస్తూ వెళుతూ ఉంటే, ఇళ్లలోని, ఆడా మగా, గుమ్మాలలోకి వచ్చి, తిలకించడం, ఓ పరిపాటి.

ఎల్లాజీ, దివాకరరెడ్డిగారిని కలుసుకున్నాడు. వినయంగా, ఆయనతో తన రాకకు కారణం విన్నవించుకున్నాడు. తన వివరాలుతోబాటు, కూతురు అందమైనదని కూడా తెలియజేసేడు.

“అయ్యగారండి, తమరు ఎట్టాగైనా, గోవిందయ్యబాబుగారితో సెప్పి, సాయం సేసిపెట్టాల. తమరి పేరు సెప్పుకొని, మా పెద్దపాప బాంగా సుఖపడుద్ది.” అని, వంగి నమస్కరిస్తూ బ్రతిమలాడేడు.

“ఎల్లాజీ, నేను తప్పక ప్రయత్నిస్తాను. నీ అమ్మాయికి, ఈ సంబంధం కుదిరితే, నేనూ సంతోషిస్తాను.” అని, రెడ్డిగారు, ఎల్లాజీకి హామీ ఇచ్చేరు.

మరోమారు, వంగి నమస్కరించి, ఎల్లాజీ, రెడ్డిగారి శలవు తీసుకొన్నాడు.

దివాకరరెడ్డిగారు, గోవిందయ్య ఇంటికి వెళ్ళేరు. వేడి టీ తాగుతూ, ఇద్దరూ, కొంతసేపు, లోకాభిరామాయణంతో గడిపేరు. ఆ రాబోయే, ఆదివారంనాడు, రాంపల్లిలో, ‘సీతాకళ్యాణం’ హరికథాకాలక్షేపం జరగబోతోంది. హరిదాసు, ఆ ప్రాంతాల్లో పేరున్నాయన,. గత సంవత్సరం, ఆయన చెప్పిన, ‘పార్వతీ కళ్యాణం’, రాంపల్లివాసులను బాగా ఆకట్టుకొంది. ఆ రోజుల్లో, రెడ్డిగారు, బంధువుల ఇంట పెళ్ళికి, పూనా వెళ్ళేరు. గోవిందయ్య, జరగబోయే హరికథాకాలక్షేపం, ప్రసంగిస్తూ,

“రెడ్డిబాబుగారూ, ఈ ఆదోరం హరికతకి, తమరు తప్పక రావాల. సేన బాగ సెప్తారాయన.” అని గోవిందయ్య నొక్కి చెప్పేడు.

“నాకు హరికథలంటే ఇష్టమే, గోవిందయ్యా. కిందటిమారు ఊళ్ళో లేకపోయేను. ఈ ఆదివారం తప్పక వస్తాను.” అని, తన నిశ్చితాభిప్రాయాన్ని, రెడ్డిగారు, గోవిందయ్యకు చెప్పేరు.

ఆ తరువాత, రెడ్డిగారు, ఎల్లాజీ కూతురు పెళ్లి విషయం, గోవిందయ్యతో లేవనెత్తేరు.

“రెండురోజుల కిందట, ఎల్లాజీ మా ఇంటికి వచ్చేడు. వాళ్ళ పెద్దమ్మాయిని మీ సత్తిబాబుకి ఇద్దామనుకొంటున్నాడు. పిల్ల అందంగా ఉంటుందట. నేను ఆ పిల్లని చూడలేదు.”

“రెడ్డిబాబుగారు, ఎల్లాజీ సంగతి, నాకు బాగ ఎరిక. అబద్దాలు సెప్పడు. ఇంతకూ, అందం, మనమేటి సేసుకొంటామండి. కుటుంబం, మంచిది కావాల. ఏటంటారు.”

“గోవిందయ్యా, నువ్వు చెప్పింది నిజం. ముందు, కుటుంబం మంచీ చెడులు ఆలోచించుకోవాలి. ఆ తరువాతే మిగిలినవన్నీ. వాళ్ళ కుటుంబం విషయం, నీకు బాగా తెలిసే ఉంటుంది. ఎల్లాజీ నీతిమంతుడన్నావ్. నాకు కూడా, మంచివాడులాగే ఉన్నాడు. ఇంట్లో, మీ ఆవిడతో కూడా మాట్లాడు. వీలయినంత వేగిరం, వాళ్ళ సంబంధం, మీకు నచ్చింది, లేనిది, చెప్పండి. ఆడపిల్లవాళ్ళు గదా; ఆతృతగా ఉంటారు.”

“రెడ్డిబాబుగారూ, నాకు తెల్దా. నానుకూడ, ఇద్దరు ఆడపిల్లలకు పెల్లి సేసినాను. ఇసయం మా ఆడంగులతో మాటాడి, తమకు తొందరగ సెప్తా. బాబుగారు, ఈ ఇసయం మాటాడానికి, తమరు కట్టబడి నాకాడకు రావాలా. కబురెడితే, నేనే తమకాడకు ఒచ్చిందును గందా.” అని, రెడ్డిగారి సలహాకు, గోవిందయ్య వినయంగా చెప్పేడు.

“గోవిందయ్యా,మీ ఇంట్లో టీ తాగి, చాలా రోజులయింది. అంచేత, నిన్ను చూసినట్టవుతుంది; మీ ఇంట్లో టీ తాగినట్టవుతుంది; ముఖ్యంగా, పెళ్లిమాటలు మాట్లాడినట్లవుతుంది; అని, నేనే వచ్చేను.” అని, రెడ్డిగారు, చిరునవ్వుతో స్పందించేరు.

మరో అయిదు నిమిషాలు, గడిపి, రెడ్డిగారు, ఇంటికి బయలుదేరేరు.

రెడ్డిగారు వెళ్ళేక, గోవిందయ్య, రెడ్డిగారు తెచ్చిన పెళ్లి ప్రస్తావన, భార్య అప్పలమ్మతో చర్చించేడు.

“ఎల్లాజీ, సేన, సీదా సాదా మనిసి. ఎప్పుడు, యారితో కయ్యాలు పడ్డు. రెడ్డిబాబుగారు కూడ సెప్పినారు. మంచోడని.” అని, ఎల్లాజీ గూర్చి, తన అభిప్రాయం చెప్పేడు.

నూకాలమ్మ, చాలా నెమ్మదస్థురాలని, అప్పలమ్మ, తన అభిప్రాయం చెప్పింది.

దగ్గరలోనే ఉన్న పెద్దకోడలు నాంచారమ్మ, వడిగా చేరుకొని, పెళ్లికూతురును, తను చూసేనని, చక్కగా ఉంటుందని, ధృవపరిచింది.

“ఎల్లాజీ..పెళ్లి ఎట్టా సేత్తాడో..” అని, అప్పలమ్మ గొణుగుతూ ఉంటే,

“గణపతి వత్తే, పొలంకాడికి పంపు.” అని, అప్పలమ్మ మాటలను, దాటవేసి, గోవిందయ్య పొలానికి వెళ్ళేడు.

ఆ మర్నాడు, గోవిందయ్య కుటుంబం, మళ్ళీ, పెళ్లి విషయం ఆలోచించుకొన్నారు.

“మనమేటో ఆలోసించి, ఎల్లాజీకి కబురెట్టాల. ఆడపిల్లోళ్ళు; తొందరగ సెప్పాల గందా.” గోవిందయ్య, భార్య అప్పలమ్మతో చుట్ట కాలుస్తూ, అన్నాడు.

“నువ్వు సెప్పినావు గందా. ఆల్ల డబ్బుతో, మనకేటి పని; ఆళ్లంతా మంచోళ్ళు అని.” అప్పలమ్మ తన అభిప్రాయాన్ని వ్యక్తబరచకుండా, స్పందించింది.

“అయితే రెడ్డిబాబుగారితో ఎల్లి సెప్పనా; మాకిట్టమే అని.” గోవిందయ్య, తుది నిర్ణయం చెప్పేడు.

“సత్తిబాబు ఏటంటాడో..” అని, అప్పలమ్మ ఇంకా ఏదో అనబోతూంటే.

“అత్తయ్యా, సత్తిబాబుకి ఇట్టమే.” అని, కోడలు మంగమ్మ, చిరునవ్వుతో అనగానే.

“నీకెట్టా తెలుసు.” అని, అత్తగారు అప్పలమ్మ, ప్రశ్నించింది.

“ఈయేల, నాను, సత్తిబాబును అడిగినాను; ‘ఏందయ్యా, నువ్వు ఇన్నావు గందా; ఆ అమ్మి, నీకు ఇట్టమేనా.’ అని. “ఆ అమ్మి, నాకిట్టమే. అని సెప్పినాడు.” అత్తగారి అనుమానాన్ని, మంగమ్మ తీర్చింది.

“అందరికి ఇట్టమే గందా. నేనెల్లి, రెడ్డిబాబుగారికి సెప్తా.’ అని, భుజం మీద ఉన్న తువ్వాలును, ఒకమారు దులిపి, మళ్ళీ భుజాన్న వేసుకొని, గోవిందయ్య వీధిలోకి పయనమయ్యేడు.

గోవిందయ్య, రెడ్డిగారింటికి వెళ్ళేడు. ఆయనతో ఎల్లాజీ కూతురుని, తన ఇంటి కోడలుగా చేసుకొంటామని, శుభవార్త తెలియజేసేడు. అది విని,

“గోవిందయ్యా, నాకు సంతోషంగా ఉంది. డబ్బుకి కాకుండా, కుటుంబం మంచిచెడ్డలు ఆలోచించి, నిర్ణయం తీసుకొన్నారు. ఈ పెళ్లి చేసీస్తే నీకు బాధ్యతలు చాలావరకు తీరినట్లే.” అని, రెడ్డిగారు తన సంతోషాన్ని, వ్యక్తబరచేరు.

“అవునండి, అయ్యగారు. అంతా, అమ్మోరి దయ.” అని, వినయంగా స్పందించేడు.

ఆ తరువాత, హరికథా కాలక్షేపం నిర్వహించే విషయాలు, ఉభయులు చర్చించుకున్నారు.

రెడ్డిగారిచ్చిన, టీ, బిస్కెట్లు సేవించి, గోవిందయ్య, రెడ్డిగారి శలవు తీసుకొన్నాడు.

గోవిందయ్య, నిష్క్రమించిన వెంటనే, రెడ్డిగారు, తన జీపు మీద, నవరంగపట్నం వెళ్ళేరు. అక్కడ, మిఠాయి దుకాణంలో, తాజాగా తయారయిన, కోవాబిళ్ళలు, లడ్డూలు, చక్కగా పేక్ చేయించేరు. వాటితో, రాంపల్లిలోని ఎల్లాజీ నివాసానికి, సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో చేరుకొన్నారు. ఆ సమయంలో, ఎల్లాజీదంపతులు పెద్దపాప పెళ్లి సంబంధం విషయమే, ఆలోచిస్తూ ఉండేవారు. గోవిందయ్య కుటుంబం, ఏ నిర్ణయం తీసుకొంటారో అని, ఆతృతగా ఉండేవారు. రెడ్డిగారి జీపు, గుమ్మం ముందు ఆగడం గమనించి, దంపతులిద్దరూ, వడిగా వెళ్లి, ఆయనకు స్వాగతం పలికేరు. ఎల్లాజీ, తొందరగా మూలనున్న కర్ర బెంచీ తెచ్చేడు. నూకాలమ్మ, తన పైట కొంగుతో, బెంచీని శుభ్రపరచి,

“అయ్యగారండి, కూకోండి. చమించాల; కురిసీలు రెండూ ఇరిగిపోనాయ.” అని, ‘కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవు.’ అని, నర్మగర్భంగా చెప్పింది.

“పరవాలేదమ్మా. కూర్చోడానికి, ఇదీ బాగానే ఉంది.” అని, బెంచీని, ఒకమారు అరచేతితో నిమురుతూ, “ఎల్లాజీ, పెళ్లికూతురు ఎక్కడ.” అని, చిరునవ్వుతో అడిగేరు.

రెడ్డిగారు, ఏదో మంచి వార్త తెచ్చి ఉంటారని ఊహించి, నూకాలమ్మ వడిగా లోపలికి పోయి,

“పెద్దపాపా, రెడ్డిబాబుగారొచ్చినారు. నిన్ను పిలుత్తున్నారు.” అని కూతురుకు నలుగురికి వినబడేటట్లు సందేశమిస్తూ, “నీకాడ ఉన్న మంచి బట్టలేసుకుని తొందరగ రా.” అని, కూతురు చెవిలో చెప్పింది.

కొద్దిసేపట్లో, పెద్దపాప, రెడ్డిగారిని సమీపించి, ఆయనకు పాదాభివందనం చేసింది.

రెడ్డిగారు, “శుభమస్తు” అని ఆశీర్వదించి, పెళ్లికూతురు చేతిలో, మిఠాయి పేకెట్టు పెట్టేరు. పెద్దపాప, దాన్ని, తల్లి చేతికి అందించి, తల్లిదండ్రుల వెనుక, వినయంగా నిలబడ్డాది.

“ఎల్లాజీ, నేను, గోవిందయ్య ఇంటికి వెళ్లి, మీ అమ్మాయి సంబంధం విషయం, మాట్లాడేను. గోవిందయ్యకు, నువ్వంటే, మంచి అభిప్రాయం ఉంది. ఇంట్లోవాళ్లతో కూడా, పెళ్ళిసంబంధం విషయం, మాట్లాడేడు. ఇవాళ, మా ఇంటికి వచ్చేడు. మీ అమ్మాయి, చాలా అదృష్టవంతురాలు. గోవిందయ్య కుటుంబం, మీ అమ్మాయి సంబంధానికి ఇష్టపడ్డారు, అని, నాతో చెప్పేడు.” అని, రెడ్డిగారు చెప్పీ చెప్పడంతో, దంపతులిద్దరూ, ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి, పెద్దపాప చేత కూడా చేయించేరు.

“అంతా, తమరి దయ.” అని, ఎల్లాజీ రెడ్డిగారికి ధన్యవాదాలు చెప్పుకొన్నాడు.

“అమ్మోరి దయ. అమ్మోరే, తమరిసేత సేయించినాది.” ‘పలికించెడి వాడు రామభద్రుడట.’ అన్నట్టు, నూకాలమ్మ, అమ్మవారిమీద, తనకున్న భక్తి, నమ్మకాలను, ఆ విధంగా చెప్పుకొంది.

తల్లిదండ్రులు, రెడ్డిగారికి ధన్యవాదాలు సమర్పించుకొంటున్న సమయంలో, పెళ్లికూతురు, తుర్రున ఇంట్లోకి జారుకొంది.

“ఎల్లాజీ, మీరిద్దరూ, గోవిందయ్య ఇంటికి, ముందుగా కబురు పంపి వెళ్ళండి. మనసులో, ఏ అనుమానం లేకుండా, అన్ని విషయాలు, తీరిగ్గా మాట్లాడండి. గోవిందయ్య, డబ్బు మనిషి కాడు. గొంతెమ్మ కోర్కెలు కోరడు. వీలయినంతవరకు, పెళ్ళిలో, వాళ్ళని సంతోషపెట్టడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా, వాళ్ళ ఆడవాళ్లు సంతోషపడితే, నీ కూతురు, వాళ్ళ ఇంట్లో సంతోషంగా ఉంటుంది. ఆడపిల్ల పెళ్లి చేయడం, అంత సుళువు కాదు. నాకు తెలుసు. అమ్మవారి దయతో, నీ కూతురు పెళ్లి, ఏ ఇబ్బందులు లేకుండా జరుగుతుంది.” అని, రెడ్డిగారు, హితబోధ చేసేరు.

“తమరు సెప్పినట్టే, సేస్తానండి, అయ్యగారు. అన్ని ఇసయాలు, ఆల్లతో మాటాడతానండి, ఆయ్యగారూ.” అని, ఎల్లాజీ, వికసించిన ముఖంతో, వినయంగా చెప్పుకొన్నాడు.

“తమరు, చాల సమ తీసుకొన్నారండి, అయ్యగారు. అమ్మోరు, మిమ్మల్ని సల్లగ సూడాలండి, అయ్యగారు.” అని, నూకాలమ్మ, కృతజ్ఞతలు తెలుపుకొంది.

“మీకు, ఏ విషయంలో, సలహా కావలిసినా, నన్ను అడగండి.” అని, రెడ్డిగారు శలవు తీసుకోబోయేరు.

“ఉండండి, అయ్యగారు. ఇప్పుడే వత్తా.” అని నూకాలమ్మ లోపలికి వెళ్ళింది.

కొద్దిసేపట్లో, గ్లాసుతో, వేడి పాలు తెచ్చి, రెడ్డిగారికి అందించింది. రెడ్డిగారు, చిక్కని గేదెపాలు, తృప్తిగా తాగి, శలవు తీసుకొన్నారు.

ఎల్లాజీ దంపతులు, తమ పెద్దపాప, గోవిందయ్య ఇంటి కోడలు కాబోతోందని, ఉబ్బి తబ్బిబ్బయ్యేరు. కలలో కూడా, వారది ఊహించలేదు. ఆ, చెప్పలేని సంతోషంలోనే, ఒక నిగూఢమయిన, ఆందోళన. గోవిందయ్య గొంతెమ్మ కోర్కెలు కోరడని, రెడ్డిగారు చెప్పినా, ఇంటి ఆడవారి ఆలోచనలు, ఎలా ఉంటాయో అని, అనుమానం. అందరిని సంతృప్తి బరిచేటట్లు, పెళ్లి చేయాలి. దానికి, ఎంత ఖర్చవుతుందో తెలీదు. కాని, వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. జగ్గుబాబు చెప్పినట్లు, అప్పో, సప్పో, చేసినా, పెళ్లి, మగపెళ్ళివారికి సంతృప్తిగా చెయ్యాలి; అని నిశ్చయించేరు.

‘గోవిందయ్యగారి సత్తిబాబుకు, ఎల్లాజీ కూతురు లచ్చమ్మను సేసుకొంటున్నారట.’ ఆ తాజా వార్త నిమిషాలమీద రాంపల్లిలో, నాలుగు వైపులా ప్రసరించింది. గ్రామంలోని వాతావరణం, ఒక్కమారు, గుసగుసలతో నిండుకొంది.

సాయంసమయం. చెరువు ఒడ్డున, త్రాగడానికి నీరు పట్టుకోడానికి మెరుస్తున్న ఇత్తడి బిందెలతో, ఆడవాళ్లు చేరుకొన్నారు. నిండుబిందెలు అన్నీ చెరువు ఒడ్డున, చతికిలబడ్డాయి. అందరి మనసులను తొందరపెడుతున్నది ఒకటే. లచ్చమ్మ పెళ్లి విషయాలు; ఎవరికి ఏమిటి తెలుసో; అని.

“లచ్చమ్మ, పెట్టి పుట్టినాది.” ఒకామె.

“ఆల్ల రెండో అమ్మిని, సేసుకొంటారేమో అని, అచ్చయ్యగారు, గోవిందయ్యగారికి కబురంపుదామనుకొన్నారట.” అచ్చయ్యగారి పొరుగావిడ, తనకు తెలిసింది చెప్పింది.

“అనుకొంటే, అయిపోద్దా.. ఏదయిన, తొందరగ సెయ్యాల.” మరొకామె సలహా.

“ఆల్లు తొందరగ సేసినా.. లచ్చమ్మ.. లచ్చిందేవిలాగ ఉంటాది.” పచ్చటి చీర కట్టిన లచ్చమ్మ ఫేను.

“ఇచ్చి పుచ్చుకోడాలు, ఏటో.” కాటుక దట్టంగా పెట్టుకొన్న ఒకామె, సభకు వేసిన ప్రశ్న.

“ఆల్లు, ఆల్లు, ఏటి మాటాడుకొన్నారో, మనకేటి ఎరిక” కొద్దిగా నిరాశతో, ఒకామె స్పందన.

“యారినీ అడగనక్కర్లే. అదే తెలుత్తది.” ఒకామె నమ్మకంతో, నీటిబిందెను ఎత్తుకొని, ఇంటికి దారి తీస్తూ సభకు ముగింపు పలికింది.

“నానూ, తొందరగెల్లి పొయ్యి రాజెయ్యాల. నేపోతే, మా చంటోడు, ఆకలిత్తోందని, గోలెట్టిత్తాడు.” అని, గట్టుమీద వేచియున్న, నీటిబిందెను, నడుముకు ఎత్తుకొని పయనమయింది, చంటోడి తల్లి.

“నానూ, ఏగిరం ఎల్లాల.’ అంటే, “నానూ తొందరగ ఎల్లాల.” అని, ఒక్కొక్క భామ, అనడంతో, గట్టుమీదున్న నీటిబిందెలన్నింటికి, కదలిక వచ్చింది.

లచ్చమ్మ పెళ్ళిసంబంధం, గోవిందయ్యగారి, సత్తిబాబుతో కుదిరిందన్న శుభవార్త, జగ్గుబాబుకు తెలియజేయాలని, ఎల్లాజీ, నూకాలమ్మలు, తలచుకొన్నారు. జగ్గుబాబు చెప్పబట్టే గదా,అంతటి సాహసం చేసేమని అనుకొన్నారు. దివాకరరెడ్డిగారు ఇచ్చిన సలహాలు, నెమరు వేసుకొన్నారు. గోవిందయ్యగారి ఇంటికి వెళ్లి, పెళ్ళికి సంబంధించిన అన్ని విషయాలు, మాట్లాడుకోవాలనుకొన్నారు. అయితే, ఉట్టి చేతులతో వెళ్ళలేరు గదా. కుటుంబంలో అందరకు, తగు బట్టలు, తీసుకు వెళ్ళాలి, అనుకొన్నారు. దానికోసం కూడా, నవరంగపట్నం వెళ్ళాలి. నవరంగపట్నం వెళితే, రెండు పనులూ అవుతాయి, అనుకొన్నారు.

ఎల్లాజీ, నవరంగపట్నం వెళ్లి, జగ్గుబాబుని, సైకిలు దుకాణంలో కలిసేడు. తీపి కబురు చెప్పేడు. ఆ శుభవార్త వినగానే,

“మావాఁ, పెద్దపాప సేన అదురుష్టం సేసినాది. బాగ, సుకబడతాది.” అని, జగన్నాధం పొంగిపోయేడు.

“జగ్గుబాబూ, నువ్వే గందా సెప్పినావు; ఆల్లతో మాటాడమని.” అని చెబుతూ, ఆ విషయంలో దివాకరరెడ్డిగారు ఎంతో సాయం చేసేరని, జరిగినదంతా వివరంగా చెప్పేడు.

జగన్నాధం, ఎదురుగా ఉన్న, టీ దుకాణం నుండి, గరం గరం, చాయతోబాటు, వేడి, వేడి పకోడీలు, తెప్పించేడు. ఎల్లాజీ, చేగోడీలతో నిండుకున్న, ఒక స్టీలు డబ్బా, జగన్నాధం చేతిలో పెట్టేడు.

ఉభయులూ, టీ తాగుతూ, పకోడీలు ఆరగిస్తున్న సమయంలో.

“జగ్గుబాబూ, పెల్లోరింటికి, ఎల్లి, అన్ని మాటాడాలి గందా. అప్పుడు, ఆల్లకి, బట్టలు ఎట్టాలి గందా. నీ ఎరికిన, బట్టల దుకానం ఉందా.” అని, ఎల్లాజీ, తన రాకకు గల కారణం, చెప్పేడు.

“నా ఎరికిన ఓటి ఉన్నది మావాఁ. వాళ్ల కాడ, బట్టలు బాగుంటయి. సవగ్గ ఇత్తారు; ఎలదాం.” అని, టీ, పకోడీలు సేవించేక, తన స్కూటీ మీద, ఆ దుకాణానికి ఎల్లాజీని తీసుకెళ్ళేడు. ఎల్లాజీ కోరికపై, జగన్నాధం బట్టలు ఎంపిక చేసేడు.

ఎల్లాజీ తిరుగు ప్రయాణానికి. జగన్నాధం, ఒక సైకిలు రిక్షా మాట్లాడేడు.

ఎల్లాజీ, నూకాలమ్మ; ముందుగా తెలియజేసి, గోవిందయ్య ఇంటికి వెళ్ళేరు. గోవిందయ్య, అప్పలమ్మ, వాళ్ళని, మర్యాదగా ఆహ్వానించేరు. నలుగురూ ఆసీనులయ్యేరు. ఎల్లాజీ, నూకాలమ్మలు; నూతన వస్త్రాలను, గోవిందయ్య, అప్పలమ్మలకు; వినయంగా సమర్పించేరు. సంభాషణలు ప్రారంభమయ్యేయి. ఇరుపక్కలవాళ్ళు, ఇచ్చిపుచ్చుకోడాల వివరాలు, మనసు విప్పి, మాట్లాడుకున్నారు. కోడలు నీలమ్మ, తెచ్చిన వేడి బజ్జీలు, టీ, నలుగురూ సేవించేరు. సమావేశం, సమాప్తమయింది. ఎల్లాజీ, నూకాలమ్మ; గోవిందయ్య, అప్పలమ్మల, శలవు తీసుకొని, సంతోషంగా, ఇల్లు చేరుకొన్నారు.

ఎల్లాజీ, నూకాలమ్మ; రెడ్డిగారింటికి వెళ్లి, గోవిందయ్య ఇంట జరిగిన సంభాషణ వివరాలు వినయంగా తెలియజేసేరు. రెడ్డిగారు సంతోషించేరు. ఎల్లాజీ పట్నం వెళ్లి. జగన్నాధానికి ఆ వివరాలు తెలియజేసి, ధన్యవాదాలు చెప్పుకొన్నాడు. జగన్నాధం సంతోషించి, పట్నంలో ఏ సహాయం అవసరపడినా, తను తప్పక అందజేస్తానన్నాడు.

లచ్చమ్మ పెళ్లి ముహూర్తం నిశ్చయమయింది. ఎల్లాజీ ఇంట, పెళ్లిప్రయత్నాల హడావిడి, జోరందుకొంది. తెలిసీతెలియని వయసులో, పెళ్ళికాబోతూన్న లచ్చమ్మ మనసులో, ఏవేవో ఆలోచనలు. పిన్నవయసులో ఉన్న సింహాద్రిది ఒకటే సందడి. మగపెళ్ళివారికి ఎట్టి అసంతృప్తి కలుగకుండా, పెళ్లి జరిపించడానికి, ఎల్లాజీ, నూకాలమ్మ, సకల ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామవాసులు, తోచిన సహకారం అందజేస్తున్నారు. పట్నంలో చేయవలసిన పనులకు, రెడ్డిగారి జీపు, అందుబాటులో ఉంది. జగన్నాధం, తన స్వంత చెల్లెలి పెళ్లిలాగ, సహకారం అందజేస్తున్నాడు. ఓ సుముహూర్తాన్న లచ్చమ్మ మెడలో సత్తిబాబు తాళి కట్టేడు. రెండు కుటుంబాల వారు, సరదాగా పెళ్లి జరిపించుకొన్నారు.

కాలచక్రం, రెండు సంవత్సరాలు ముందుకు నడిచింది.

జగన్నాధం నివసిస్తున్న ఇంటికి దగ్గరలో, వెంకయ్య ఉంటున్నాడు; తోపుడుబండి మీద కూరలమ్ముకొంటూ జీవిస్తున్నాడు. వెంకయ్య కొడుకు పోలిబాబు; ఇరవై ఏళ్ల వాడు; కాలితో నడిపే, ఒక కుట్టు మెషీనును, తోపుడుబండికి అమర్చి, ఒక మొబైల్ టైలరింగ్ షాపును, నడుపుతున్నాడు. నెమ్మదస్థుడు, చెడు అలవాట్లు లేవు. పెళ్లి కాలేదు. జగన్నాధానికి, వాడిని బాగా తెలుసు. ఎల్లాజీ రెండవ కూతురు గౌరమ్మకు, తగిన సంబంధమని అనుకొన్నాడు. ఒక రోజు, రాంపురం వెళ్లి, స్వయంగా ఆ విషయం, వివరంగా ఎల్లాజీతో మాట్లాడేడు. ఎల్లాజీ సంతోషించేడు. జగన్నాధం, ఎల్లాజీని, వీలయినంత తొందరలో పట్నం వచ్చి, సంబంధం నిశ్చయం చేసుకోమన్నాడు. ఆ లోగా, తను వాళ్లతో, ఆ విషయం మాట్లాడతానన్నాడు. జగన్నాధం మధ్యవర్తిత్వం ఫలించింది. ఒక శుభముహూర్తాన్న, పోలిబాబు, గౌరమ్మ మెడలో, మూడు ముళ్ళూ వేసేడు. గౌరమ్మ, పట్నవాసి అయింది.

గౌరమ్మ పెళ్లి జరగడంతో, ఎల్లాజీ, నూకాలమ్మల మనసు, తేలిక పడింది. ఆ తరువాత మూడు నెలలకు, పెద్దకూతురు లచ్చమ్మ పురిటికి వచ్చింది. నెలలు నిండేయి. వియ్యంకుని సలహా పాటించి, ఎల్లాజీ, లచ్చమ్మను, పురిటికి, పట్నంలోని ఒక ఆసుపత్రిలో చేర్పించేడు. లచ్చమ్మ, పండంటి కొడుకును కంది. ఇటువారికి, అటువారికి, ఒకటే సంబరాలు. సింహాద్రికి ఒకటే సందడి. వాడి స్టేటస్సు, పెరిగిపోయింది. మేనల్లుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలని తహతహ. ఒక రోజు మేనల్లుడు ఆ సరదా తీర్చి, కట్నమిచ్చేడు. మూడు నెలలు, మనవడితో ఆడుకొని, ఎల్లాజీ దంపతులు, సాంప్రదాయ పద్ధతిలో, లచ్చమ్మను, మనవడితో బాటు, అత్తవారింటికి దిగబెట్టేరు.

సింహాద్రికి, ఎలిమెంటరీ బడిలో చదువు, ముగిసింది. గురువుగారి ప్రోద్బలంతో, ఎల్లాజీ, వాడిని, నవరంగపట్నంలోని మిడిలుస్కూలులో, చేర్పించేడు. సింహాద్రికి, రోజూ, ఓ పదిమంది పిల్లలతో, సైకిలుమీద పట్నానికి వెళ్లి చదువుకోవడం, ఒక నూతన అనుభవం. వారితో సరదాగా కబుర్లు చెప్పుకొంటూ వెళ్లిరావడం, వాడిలో, ఒక నూతన ఉత్సాహాన్ని కలుగజేసింది. ఎప్పటిలాగే, శ్రద్ధగా చదువుకొంటున్నాడు. తన, సహజ నైజమయిన, వినయవిధేయతలు, సత్ప్రవర్తనలతో, బడిలో గురువుల మెప్పు సంపాదించుకున్నాడు.

మరో అయిదేళ్ళు గడిచేయి. గౌరమ్మ కడుపు పండింది. పురిటికి, పుట్టింటికి, రాంపల్లి వచ్చింది. నవమాసాలూ నిండేయి. రాంపల్లిలో, తగిన వైద్య సదుపాయాలు లేక, ఎల్లాజీ, గౌరమ్మను, పురిటికి, నవరంగపట్నంలోని ఒక ఆసుపత్రిలో చేర్పించేడు. గౌరమ్మ ఒళ్ళో, ఒక చక్కని పాప చేరింది. పుట్టిన పాపతో, మూడు నెలలు, పుట్టింట గడిపి, గౌరమ్మ, అత్తవారింటికి, నవరంగపట్నం మరిలింది. సింహాద్రి, మిడిలిస్కూల్ చదువు ముగించుకొని, హై స్కూలులో ప్రవేశించేడు. ఈ శుభ పరిణామాలన్నీ, ఎల్లాజీ దంపతులకు విశేష ఆనందాన్ని కలుగజేసేయి.

ఇద్దరు కూతుళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పురుళ్ళు, ఎల్లాజీ ఆర్ధిక పరిస్థితిని కృంగదీసేయి. ఉన్న ఎనిమిదెకరాల భూమిలోను, అయిదు ఎకరాలు, ఆవిరి అయిపోయేయి. ఎల్లాజీకి, వ్యవసాయంలో పెట్టుబడికి తగ్గ ఆదాయం రావడం లేదు. ఆ పరిస్థితులలో, సింహాద్రి, తండ్రికి వ్యవసాయంలో సహాయపడడం తప్పనిసరి అయింది. ఆసక్తి ఉన్నా, చదువుకు స్వస్తి పలకవలసి వచ్చింది. ఎల్లాజీ, కొడుకు భవిష్యత్తు గూర్చి ఆలోచించేడు. సింహాద్రి శాశ్వతంగా, మూడెకరాల భూమి మీద ఆధారపడలేడనుకొన్నాడు. ఏదయినా, చిన్న వ్యాపారం మొదలెడదామన్నా, మదుపుకు నగదు లేదు. కొడుకు ఏదయినా ఉద్యోగంలో చేరితే, నికరంగా ఆదాయం వస్తుందనుకొన్నాడు. రెడ్డిగారి సలహా అడిగేడు. ఆయన, ఎల్లాజీ ఆలోచనతో ఏకీభవించేరు. సింహాద్రి, తండ్రికి వ్యవసాయంలో సాయం చేస్తూ, ఉద్యోగం వెతకడం ప్రారంభించేడు.

రాష్ట్రంలో, త్వరితగతిని పురోగమిస్తున్న పట్టణాలలో, నవరంగపట్నం ఒకటి. దాని జనాభా ఆరు లక్షలు దాటుతోంది. ప్రభుత్వం తరఫున, సామాన్య ప్రజల అందుబాటులో, డిగ్రీ వరకు, విద్యా సౌకర్యం ఉంది. ధనికుల అందుబాటులో, ప్రయివేటు యాజమాన్యం, ఒక ఉన్నత పాఠశాల నడుపుతోంది. వైద్య సౌకర్యం కొరకు, ప్రభుత్వం స్థాపించిన రెండు ఆసుపత్రులలో, ఒక దానిలో, రోగులకు, పది పడకలు వరకు, ఏర్పాటు ఉంది. వాటి సేవలు ఎలా ఉన్నా, ఆ పట్నవాసులకే కాక, దగ్గరలోని గ్రామవాసులకు కూడా అందుబాటులో ఉన్నాయి. అవికాక, M.B.B.S. పాసయిన, ఇద్దరు డాక్టర్లు, వేరు వేరుగా ప్రయివేటు ప్రేక్టీసు చేస్తున్నారు.

నవరంగపట్నంలో కొత్తగా ‘సప్తగిరి’ ఆసుపత్రి వెలిసింది. కార్డియాలజీ పాసయిన, డాక్టర్ వివేకానంద చౌదిరిగారు, ఆయన భార్య, గైనకాలజి చేసిన డాక్టర్ పద్మజగారు, దానిని స్థాపించేరు. సాధారణ రోగులకు కూడా, ‘సప్తగిరి’ సేవలందిస్తోంది. అనతికాలంలో సప్తగిరి రోగుల ప్రశంసలు అందుకొని, వృద్ధిలోకి వచ్చింది. కాని, వారి వృత్తికి, ధనార్జనే ఆశయం చేసుకోలేదు. దానధర్మాలకు వంశపారంపర్యంగా వస్తున్న ఖ్యాతిని, మరువకుండా, వారి సేవలు, సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో ఉంచేరు. డాక్టరు దంపతులకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి.

డాక్టరు పద్మజగారి అంకితమయిన సేవల కారణంగా, సప్తగిరి ఆసుపత్రికి, గర్భిణీ స్త్రీల రాక, పెరిగింది. ప్రభుత్వాసుపత్రిలో, పురిటికి, పడక సౌకర్యం ఉన్నా, అక్కడ లభ్యమయ్యే సేవలు, సంతృప్తిగా లేవని, ప్రజాభిప్రాయం. వివేకానందగారి మిత్రులు ఒకరిద్దరు, సప్తగిరి ఆసుపత్రిలో పడక సౌకర్యాలు ఏర్పరిస్తే, గర్భిణీ స్త్రీలకు, చాలా సౌకర్యమవుతుందని, సలహా ఇచ్చేరు. వైద్య సేవలకు, తమ వద్దకు వచ్చిన, పెక్కు గర్భిణీ స్త్రీలు కూడా, అదే అభిప్రాయాన్ని, వ్యక్తబరచేరు. ఆ అభిప్రాయాలు విన్నాక, డాక్టరు దంపతులు, ఆ కోణంలో, ఆలోచించసాగేరు.

ఒక రోజు, ఇంటివద్ద భార్యాభర్తలిద్దరు, తీరికగా ఉన్న సమయంలో, పద్మజగారు,

“వివేక్, మన హాస్పిటలులో, బెడ్స్ ఫెసిలిటీ విషయం, ఏమయినా ఆలోచించేవా.” అని, అడిగేరు.

“పద్మా, ఆ విషయం ఆలోచించేను. ముఖ్యంగా, డెలివరీ కేసుల్లో, they need it. Let us go for it.”

“వివేక్, నేనూ అదే అనుకొంటున్నాను. But we can’t do it in a hurry.”

“I agree. జాగ్రత్తగా plan చేసుకోవాలి.” పద్మజగారితో ఏకీభవించేరు.

“మనకి; చాలా రోజులై ఫీలవుతున్నాను; ఒక ఫీమేలు నర్సు అవసరం ఉంది, వివేక్. ప్రస్తుతం, బెడ్స్ ఫెసిలిటీ; ముఖ్యంగా, డెలివరీ కేసెస్ కోసం అనుకొంటున్నాం గదా. In that case, we definitely need a female nurse.” అని తన నిశ్చితాభిప్రాయాన్ని, తెలియజేసేరు, పద్మజగారు.

“నువ్వన్నది కరక్టే పద్మా. ప్రయారిటీ మీద, ఫీమేలు నర్సు కోసం ప్రయత్నిద్దాం. మన నర్సు ప్రభాకరుతో చెబ్దామ్. ఎవరినైనా చూడమని.” వివేకానందగారు, తన ప్రణాళికను చెప్పేరు.

“వివేక్, నీకు చెప్పడం మరచిపోయేను; ప్రభాకర్ మనకి గుడ్ బై చెప్పే ప్రయత్నంలో ఉన్నాడట.”

“ఏమిటయింది వాడికి. ఈ మధ్యనే, వాడి జీతం కూడా పెంచేం. ఇంతకూ, నీకెలా తెలిసింది, పద్మా. ఎవరు చెప్పేరు నీకు.” అని ఆత్రుతతో, అడిగేరు, వివేకానందగారు.

“మన డ్రైవరు అప్పారావుకి, ఎవరో చెప్పేరట. ప్రభాకర్ మన దగ్గర మానేసి; ఏదో విలేజి.. పేరు మర్చిపోయేను; అక్కడ ప్రేక్టీసు పెడతాడట.” అని అప్పారావు ప్రణాళిక, చెప్పేరు.

“అదా.. సంగతి. ఇప్పుడు తెలుస్తున్నాది, పద్మా. కొన్నాళ్ళయి, వాడి వినయం కొంచం ఎక్కువయింది. దానిలో ఇంత స్కీము ఉందని, నాకు తెలీలేదు. సిన్సియరుగా అడిగేడనుకొని; ఎప్పుడైనా పనికొస్తాడని, ఇంజెక్షన్లు ఇవ్వడం నేర్పేను. అదంతా, ఏదో, ఆ విలేజిలో ప్రేక్టీసుకి, ప్రిపరేషను అన్నమాట.” అని, తన అమాయకత్వాన్ని, చెప్పుకొన్నారు, డాక్టర్ వివేక్.

“మరేం. జలుబుకి, దగ్గుకి, జ్వరానికి, మందులు తెలుసు. ఇంజెక్షన్లు ఇవ్వడం, నేర్చుకొన్నాడు. మెడలో, ఓ స్టెత్ వేలేసుకొంటే, ఇహ, విలేజిలో మెడికల్ ప్రేక్టీసు పెట్టడానికి అడ్డేమిటుంది, వివేక్.” అని, దేశంలోని, అనేక గ్రామాలలోని వైద్య సౌకర్యం మీద ఓ వ్యంగ్యాస్త్రము సంధించేరు, డాక్టర్ పద్మ.

“ఈ పరిస్థితి, ప్రభుత్వం సృష్టించిందే, పద్మా. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని దశాబ్దాలయినా, మన దేశంలోని, చాలా విలేజెసులో, ఈ రకం డాక్టర్లు ఉన్నారు, అంటే, ‘ఓ.. విలేజిల్ని, మేం, అంత బాగు చేసిస్తున్నాం.. ఇంత బాగు చేసిస్తున్నాం.’ అని, ప్రగల్భాలు పలుకుతున్నారే, ప్రభుత్వాలు.. వాళ్ళ నిజాయితీ ఏమిటో తెలుస్తుంది, పద్మా.”

“సరే, ఈ డ్రాయింగు రూము డిస్కషన్లు, won’t solve such problems. మన problem ఆలోచిద్దాం, వివేక్. ప్రభాకర్, ఎప్పుడు సడన్‌గా, బాంబు పేలుస్తాడో, మనకి తెలీదు. వాడి రీప్లేస్మెంటు కన్నా, ముందు, ఫిమేల్ నర్సు కోసం చూడాలి.”

“అవును పద్మా. ఇమ్మీడియటుగా ఆ ప్రయత్నంలో ఉందాం.”

“మన డ్రైవరు, అప్పారావుకే చెబ్దామ్. వాడికి ఇలాంటి ఇన్ఫర్మేషను తెలుస్తూ ఉంటుంది.” అని, పద్మజగారు, చెప్పడంతో, వివేకానందగారు, “సరే” అన్నారు.

పద్మజగారు, ఫీమేల్ నర్సు ప్రయత్నంలో, ఆ విషయం, అప్పారావు చెవిలో వేసేరు. ఎవరినైనా, నమ్మకమయిన మనిషిని చూడమన్నారు. అప్పారావు, గాలింపు చర్యలు మొదలుపెట్టేడు. తనకు తెలిసిన నలుగురి చెవిలో వేసేడు. వారిలో కొండలరావు ఒకడు. కొండలరావు, ఆ ఊళ్ళేనే, అప్పారావు తరచూ వెళ్లే, పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషనులో, పనిచేస్తున్నాడు. కొండలరావు మరదలు, గౌరమ్మ, విశాఖపట్నంలో ఉంది. ఓ డాక్టరు గారు, కొత్తగా పెట్టిన, ప్రయివేటు ఆసుపత్రిలో, మూడు సంవత్సరాలనుండి, నర్సుగా పని చేస్తోంది. ఆ డాక్టరు గారు, ఏవో పరీక్షలు రాసి, పై చదువులకు అమెరికా వెళుతున్నారట. ఆయన, ఈ మధ్యనే ఆ సంగతి, గౌరమ్మకు చెప్పేరట. గౌరమ్మ, ఆవిషయం, తన అక్కకు (కొండలరావు భార్య), క్రిందటి వారమే ఫోనులో చెప్తూ, ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నానందిట. కొండలరావు, ఆ వివరాలు, అప్పారావుకు చెప్పేడు. డాక్టరు దంపతులు చెపితే, వెంటనే వచ్చి, వాళ్ళని గౌరమ్మ కలుసుకొంటుందని, కొండలరావు చెప్పేడు. అప్పారావు, తన యజమానులకు, ఆ వివరాలు తెలియజేసేడు.

ఆ వివరాలు విన్నాక, “పద్మా, It is a God sent opportunity. We can call her.” అని, తన నిర్ణయం చెప్పేరు, వివేకానందగారు.

“She is a trained one. That is a big plus point.” అని, వివేకానందగారి, నిర్ణయాన్ని, పద్మజగారు, సమర్థించేరు.

పద్మజగారు, గౌరమ్మ గూర్చి, మరికొన్ని వివరాలు, అప్పారావుని అడిగేరు. అప్పారావు, అవేవీ తనకు తెలియవని; కొండలరావుని అడిగి, చెప్తానన్నాడు.

ప్రస్తుతానికి, కొండలరావును, మరే వివరాలు, అడగడం అవసరం లేదని, గౌరమ్మతో మాట్లాడినప్పుడు, కావలసిన వివరాలన్నీ తెలుసుకోవచ్చని, వివేకానందగారు, సలహా ఇచ్చేరు. రాబోయే ఆదివారం సాయంత్రం, తమ బంగళాలో కలుసుకోమని, గౌరమ్మకు తెలియజేయమని, పద్మజగారు, అప్పారావుకు చెప్పేరు. ఆమె పనిచేస్తున్న డాక్టరుగారి అనుమతి తీసుకొని, రమ్మనమని, వివేకానందగారు, సలహా ఇచ్చేరు.

గౌరమ్మ, ఆ ఆదివారం సాయంత్రం, డాక్టరు దంపతులను, కలుసుకొంది. పద్మజగారు, చెప్పడంతో, వారి ఎదుట కుర్చీలో, వినయంగా కూర్చొంది. సంభాషణ ప్రారంభానికి ముందరే, గౌరమ్మ, తన హేండ్ బేగులోనుండి, ఒక మూయబడిన కవరును, పద్మజగారికి, వినయంగా నిలబడి అందజేసి, కూర్చొంది. ఆ కవరులో, గౌరమ్మ పనిచేస్తున్న ఆసుపత్రి డాక్టరుగారు, రాసిన ఉత్తరం ఉంది. పద్మజగారు, కవరు విప్పి ఉత్తరం చదువుకొని, వివేకానందగారికి అందించేరు. ఆయన కూడా, అది చదివి,

“గౌరమ్మా, నీ డాక్టరుగారు, నీ గురించి, బాగా రాసేరు. మాకు సంతోషం.” అని, తన సంతోషాన్ని వ్యక్తబరుస్తూ, అన్నారు.

“గౌరమ్మా, మేము, నీ వంటి, కష్టపడి పని చేసే, నర్సు కోసమే చూస్తున్నాం. అయితే, నీకు ఓ విషయం చెప్పాలి. మా ఆసుపత్రికి గర్భిణీ స్త్రీలు చాలా మంది వస్తూంటారు. వారి కోసం త్వరలో, మా ఆసుపత్రిలో, అయిదు పడకల సదుపాయం చేద్దామనుకొంటున్నాం. నువ్వు, ప్రస్థుతం పనిచేస్తున్న ఆసుపత్రిలో, ఆ సదుపాయం లేదు.” అని, పద్మజగారు ఇంకా, చెప్పబోతూంటే,

“అవునండి, డాక్టరమ్మగారు. అక్కడ లేదండి.” అని గౌరమ్మ వినయంగా, స్పందించింది.

“గౌరమ్మా, ఆసుపత్రిలో ఎడ్మిటయిన, గర్భిణీ స్త్రీలకు, కావలిసిన నర్సింగు, నీకు తెలుసనుకొంటాను.” వివేకానందగారు, అసలు విషయంలోకి వచ్చేరు.

“నాకు, రెండు పురుల్లయేయండి, గర్బినీ అమ్మలికి, కాల్సిన డూటీలు, బాగా, తెలుసండి, డాక్టరు గారు.” గౌరమ్మ, కన్ఫర్మ్ చేసింది.

“గౌరమ్మా, మా దగ్గర, ప్రస్తుతం ఉన్నవాడు, మేల్ నర్సు. అంచేత, ఆ డ్యూటీసు అన్నీ, నువ్వే చెయ్యవలసి ఉంటుంది.” అని, పద్మజగారు, విడమరచి చెప్పేరు.

“తమరు చెప్పిన డూటీసన్నీ.. చేస్తానండి, డాక్టరమ్మగారూ. సేవలకోసమే గదా, మన ఆసుపత్రికి ఒస్తారు. మరాళ్ళకి చెయ్యాలి గదా. తప్పక చేస్తానండి. తమరికి డౌటు అక్కర్లేదు.” అని, హామీ ఇచ్చింది, గౌరమ్మ.

“గౌరమ్మా, మీ ఆయన ఏమిటి చేస్తూంటాడు.” వివేకానందగారు, వ్యక్తిగత వివరాల్లోకి వెళ్ళేరు.

“అతగాడు, ఎలెట్రికల్ పన్లు చేస్తూ ఉంటాడండి. ఎక్కువగా, అపార్టుమెంటుల్లో, పన్లు చేస్తూంటాడండి.”

“మరి, నువ్వు ఇక్కడికి వచ్చేస్తే, మీ ఆయన సంగతేమిటి. ఆ విషయం ఆలోచించుకొన్నారా.” పద్మజగారు, తెలియగోరేరు.

“ఆలోచించినామండి, డాక్టరమ్మగారూ. మా అక్కయ్య పెనిమిటి, కొండలరావు బాబు, చెప్పేరండి, ఈ ఊళ్ళో, చాల అపార్టుమెంట్లు ఒస్తున్నాయి; పని బాగా దొరుకుతుంది, ఒచ్చేయమని, ఆయన చెప్పేరండి.”

“పద్మా, we can confirm her. Remuneration, you decide.” అని, వివేకానందగారు, తన నిర్ణయాన్ని చెప్పేరు.

“గౌరమ్మా, మా ఆసుపత్రిలో, నిన్ను నర్సుగా వేసుకొందామనుకొంటున్నాము.” అని పద్మజగారు, చెప్పగానే,

గౌరమ్మ, సంతోషం తెలియబరుస్తూ, నిలబడి, డాక్టరు దంపతులిద్దరకు వంగి,నమస్కరించి ధన్యవాదాలు సమర్పించుకొంది. సరైన సమయంలో, తమ కుటుంబాన్ని, దేమునివలె, ఆదుకొన్నారంది. పద్మజగారు, చెప్పడంతో, కుర్చీలో కూర్చొంది.

“గౌరమ్మా, మీ డాక్టరుగారు, రాసేరు; నీకు నెలకు అయిదువేలు, ఇస్తున్నారని.” అని, పద్మజగారి నోటివెంట రాగానే.

“అవునండి, డాక్టరమ్మగారు.” అని, గౌరమ్మ కన్ఫర్ము చేసింది.

“మేము కూడా, ప్రస్తుతానికి, నెలకు అయిదువేలు ఇద్దామనుకొంటున్నాం. పేషంట్సుకి, బెడ్స్ ఫెసిలిటీ స్టార్ట్ అయ్యేక, రెండువేలు పెంచుతాం.” అని, పద్మజగారు, చెప్పడంతో, గౌరమ్మ మళ్ళీ నిలబడి, వంగి నమస్కరిస్తూ, ధన్యవాదాలు, చెప్పుకొంది. రెండు వారాల్లో రాబోయే, ఒకటవ తారీకు నాడు, విధులలో చేరుతానని, విన్నవించుకొని, శలవు తీసుకొంది.

(మిగతా భాగం వచ్చే వారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here