తానొకటి తలిస్తే..-2

0
10

[సంచిక 2022 దీపావళి పోటీకి అందిన కథ. శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం రచించిన ఈ కథ రెండవ భాగం ఇది.]

[dropcap]ఆ[/dropcap] తరువాత, డాక్టరు దంపతులు, మాట్లాడుకొంటూ,

“వివేక్, మనకి, ఇంపార్టెంట్ ప్రోబ్లెం, సాల్వ్ అయింది. ఇప్పుడు, ప్రభాకర్, వెళిపోతానన్నా, ఫరవాలేదు.”

“నిజమే, ఆ టెన్షన్ మరి లేదు, పద్మా. ఇహ, మనం, మన ప్రోజెక్టు గురించి, సీరియసుగా ఆలోచించాలి.”

“వివేక్, మన హాస్పిటలు కట్టేడు; తిరపతిరావు, He did a good job. అతన్నే పిలిచి మాట్లాడదాం.” అని, పద్మజగారు సలహా ఇచ్చేరు.

“అవును, అతను ఊళ్ళో మంచి పేరు సంపాదించుకున్నాడు. అప్పారావు ద్వారా కబురు పెడదాం. ఈ ఆదివారం రమ్మందాం.” అని వివేకానందగారు, ఆ విషయానికి, ఫులుస్టాపు పెట్టేరు.

ఒకటవ తారీఖున, గౌరమ్మ, సప్తగిరి ఆసుపత్రిలో, నర్సుగా, విధులలో చేరింది. ఆమె రాకతో, ఆసుపత్రికి, వైద్యసేవలకు వస్తున్న స్త్రీలకు, సదుపాయమయింది. పద్మజగారు గాని, వివేకానందగారు కాని, చిన్న పిల్లలను పరీక్షిస్తున్నప్పుడు, గౌరమ్మ,వారికి తగు సహకారం అందజేస్తూ, డాక్టరు దంపతుల మెప్పు పొందుతోంది. రోగులు కూడా, ఆమె సేవలకు, సంతృప్తి పొందుతున్నారు. అధిక శాతం రోగులు, ఆసుపత్రికి రాగానే, గౌరమ్మనే కలియడానికి, ప్రయత్నిస్తున్నారు. ఆ పరిణామాలతో, ప్రభాకరరావు, ‘అహం’ దెబ్బతింది. కాని, త్వరలో, తను ఆసుపత్రి విధులనుండి, బయటపడదలచుకొన్నాడని, తలచుకొని, రోజులు లెఖపెట్టడం, మొదలుపెట్టేడు. తరువాత కొద్ది రోజులకే, యజమానుల వద్ద శాశ్వత శలవు తీసుకొని, తన ప్రణాళికననుసరించి, ఒక గ్రామంలో, డాక్టరు అవతారమెత్తేడు.

నాలుగు నెలలలో, ఆసుపత్రి ఆవరణలోనే, రోగులుండుటకు కావలిసిన సదుపాయాలతో, అయిదు పడకగదులు నిర్మింపబడ్డాయి. ఆనతి కాలంలోనే ఆ పడకగదుల డిమాండు పెరిగింది. దానితో బాటు, గౌరమ్మ జీతం పెరిగి, నెలకు ఏడు వేలయింది.

వివేకానందగారు, ఆధునిక సదుపాయాలతో, విశాలమయిన నూతన భవనం నిర్మించుకున్నారు. వారికి, కొద్దిపాటి చదువుకొన్న, మరొక పనివాని అవసరం పడింది. ఆ విషయం, వారివద్ద పని చేస్తున్న, పేరయ్యతో చెప్పేరు. పేరయ్య వయసులో కొద్దిగా పెద్దవాడు. ఆ సాయంత్రం, పేరయ్య, పని ముగించుకొని, ఇంటికి పోతూ, సైకిలులో గాలి కొట్టించుకోడానికి, జగన్నాధం దుకాణానికి వెళ్ళేడు. జగన్నాధం గాలి నింపుతూ ఉంటే,

“జగ్గు బాబూ, నీ ఎరికిన, మా అయ్యగారి బంగళాలో పని సేయడానికి, బాగా నమ్మకమైనోడు ఏరేనా ఉన్నారేటి. నీకు ఎరికే కదా. మంచిగా పనిజేస్తే, మా అయ్యగారు, కట్టం ఉంచుకోరు.” అని, తనకు చిరపరిచితుడయిన జగన్నాధాన్ని, పేరయ్య అడిగేడు.

“నాకు తెలిసినోడు, మా రాంపల్లిలో ఉన్నాడు. సేన మంచోడు. ఆడేదో కొంత సదివినాడు కూడా. పేరయ్యా, సెప్పమన్నావేటి, ఆడికి.” ఉత్సాహంతో స్పందించేడు, జగన్నాధం.

“మంచోడంటున్నావు గదా. సెప్పాడికి. రేపాదోరం అయితే, అయ్యగారు, అమ్మగారు, ఇంటికాడే ఉంటారు. ఆడిని ఒట్టుకొని బంగలాకి వస్సినావంటే, అయ్యగారు మాటాడతారు.” కథ ముందుకు నడిపించేడు, పేరయ్య.

పేరయ్య, సైకిలెక్కి, ఇంటికి దారి తీసేడు.

జగన్నాధం, సెల్ ఫోనులో, కొన్ని నంబర్లు నొక్కేడు. సింహాద్రి, ఫోను ఎత్తుకున్నాడు.

“సింయాదరీ, నేను.. జగ్గుని. ఏటి సేత్తున్నావేటి.”

“ఏటుందన్నా.. సెయ్యడానికి. ఏ..టో, అమ్మోరి దయ, ఏకాడకు ఒత్తుందో.” నిస్పృహతో, స్పందించేడు, సింహాద్రి.

“సింయాదరీ, అమ్మోరు, నీకెప్పుడన్నాయం సేయదు. వినుకో. మా పట్టంలోనే, నీకో మంచి నౌకరీ ఉంది.” అని జగన్నాధం, ఇంకా చెప్పబోతూంటే.

“ఏటన్నా, ఏటది.” అని ఆత్రుతతో అడిగేడు, సింహాద్రి.

“మా పట్టంలో, సేన, పెద్ద డాక్టరుగారు ఉన్నారు. అమ్మగారు కూడా డాక్టరే. ఆళ్ళ బంగలాలో పని సెయ్యడానికి, నమ్మకయినోడు కోసం సూత్తున్నారు. ఇప్పుడే ఆళ్ళ పనోడు, నాకు సెప్పినాడు. రేపాదోరం సాయంత్రం, నిన్నొట్టుకు బంగలాకి రమ్మన్నాడు. నీకాడ ఉన్న బట్టల్లో మంచివి ఏసుకొని, ఆదోరం, పెందలికాడనే నాకాడకొచ్చి. మనిద్దరం, డాక్టరుగారి కడకు ఎల్దాము.” విషయం వివరంగా చెప్పేడు, జగన్నాధం.

ఎగిరి గెంతేసేడు, సింహాద్రి.

ఆదివారం సాయంత్రం, జగన్నాధం, సింహాద్రితో బాటు, డాక్టరుగారి బంగాళా చేరుకొన్నాడు. డాక్టరుగారి ఎదుట, ఇద్దరూ వినయంగా నిలబడ్డారు. డాక్టరుగారు, వాళ్లిద్దరి పరిచయం చేసుకొని, సంభాషణ ప్రారంభిస్తూంటే, పద్మజగారు, చేరుకొన్నారు.

“జగన్నాధం, సింహాద్రిని, నీకెన్నాళ్ళనుండి తెలుసు.” వివేకానందగారు ఇంటర్వూ ప్రారంభించేరు.

“ఆడిది, నాది, రాంపల్లేనండయ్యగారూ. ఆడి సిన్నప్పటినుండి, ఆడు నాకెరికేనండి. మంచోడు అయ్యగారు. సుట్ట, బీడీ, ఏదీ, తాగడండి.” సింహాద్రికి, కాండక్టు సర్టిఫికేటు ఇచ్చేడు, జగన్నాధం.

“సింహాద్రీ, నీకు పెళ్లయిందా.” పద్మజగారి ప్రశ్న.

“కానేదండమ్మగారూ.” వినయంగా జవాబిచ్చేడు, సింహాద్రి.

“నీకు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, ఎవరేనా ఉన్నారా.” వివేకానందగారి ప్రశ్న.

“ఇద్దరు అక్కలున్నారండి, అయ్యగారు.” అని, ఇంకా చెప్పబోతూంటే, జగన్నాధం అందుకొని.

“ఆ ఇద్దరమ్మలకి, పెళ్ళయిపోనాదండయ్యగారు. ఈడి తరాత, ఏరూ లేరండి.”

“నువ్వు ఏమైనా చదువుకొన్నావా, సింహాద్రీ.” వివేకానందగారి ప్రశ్న.

“ఎనిమిది, సదువుకొన్నానండయ్యగారు.”

“సింహాద్రీ, నువ్వు, ఎక్కడైనా పని చేసేవా.” పద్మజగారడిగేరు.

“లేదండమ్మగారు.”

ఇంకా మరికొన్ని వివరాలు తెలుసుకొని,

“He appears okay.” పద్మజగారు, తన అభిప్రాయాన్ని, భర్తతో పంచుకొన్నారు.

“I too feel so. We can try him for some time.” వివేకానందగారు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేరు.

పద్మజగారు, సింహాద్రికి, చేయవలసిన పనులు, క్లుప్తంగా చెప్పి,

“సింహాద్రీ, ఇవన్నీ నువ్వు రోజూ చేయగలవా. కొన్ని, ఎలా వాడడమో, నీకు బోధపరుస్తాం. ఆలోచించుకొని చెప్పు.” అని, సింహాద్రి ముఖంలోకి చూస్తూ, అడిగేరు.

“అయన్నీ, సేత్తానండి అమ్మగారూ.” బుర్ర ఊపుతూ, ముఖంలో సంతోషం వెలిబుచ్చుతూ, ధృవీకరించేడు.

“సింయాదరీ, అమ్మగారు, అయ్యగారు, ఏ పని సెప్పినా సెయ్యాల.” జగన్నాధం, సలహా ఇచ్చేడు.

“అట్టాగే అన్నా. ఏ పని సెప్పినా సేత్తాను.”

ఆ మాటలు, ఇద్దరు డాక్టర్లకు, చిరునవ్వులు తెప్పించేయి.

సింహాద్రి ఉద్యోగాన్ని, ధ్రువపరుస్తూ, రెండుపూటలా, టీ, టిఫిను, సర్వెంటు క్వార్టర్సులో బస, ఉచితంగా లభ్యమవుతాయని, వివేకానందగారు, సింహాద్రికి తెలియజేసేరు. ప్రస్తుతానికి, నెలకు, 1000 రూపాయలు జీతం ఇస్తామన్నారు. పని నచ్చితే, రెండువేలవరకు పెంచుతామన్నారు.

ఆ మాటలు విన్న వెనువెంటనే, ఉబ్బి తబ్బిబ్బై, వివేకానందగారికి, పద్మజగారికి, సింహాద్రి, సాష్టాంగ నమస్కారాలు చేసేడు.

ఆ మరునాడు, సింహాద్రి విధులలో చేరేడు. సింహాద్రి, తక్కువ వ్యవధిలో, వేక్యూమ్ చెయ్యడం, వాషింగ్ మెషీను, డ్రైయరు, ఉపయోగించడం, నేర్చుకొన్నాడు. శుభ్రపడిన దుస్తులు, చక్కగా మడతలు పెట్టి, ఎవరి బట్టలు, వారి గదిలో, జాగ్రత్తగా ఉంచడం, ప్రారభించేడు. నమ్మకంగా, కష్టపడి పని చేస్తూ, యజమానుల మెప్పును పొందేడు. తత్ఫలితంగా, వాడి జీతం పెరిగింది.

జగన్నాధానికి అత్తవారివంక బంధువు, నారాయణ, అదే పట్టణంలో, ఒక బహుళ అంతస్తుల భవనంలో, కాపలాదారుగా పని చేస్తున్నాడు. వాడికి, నీలమ్మ అనే, పదహారేళ్ళ కూతురు ఉంది. తొమ్మిదో తరగతిలో చదువుకొంటోంది. కూతురు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న, నారాయణను, జగన్నాధం కలసి, సింహాద్రి వివరాలు చెప్పేడు. నీలమ్మకు తగు వరుడుగా, సిఫారసు చేసేడు. నారాయణకు నచ్చింది. ఇరుపక్షాలవారూ, సంతృప్తి చెందడంతో, ఓ శుభ ముహూర్తాన్న, సింహాద్రి, నీలమ్మలు, దంపతులయ్యేరు. పద్మజగారి సలహా మేరకు, సింహాద్రి ఉంటున్న బసకు ఆనుకొని, ఒక చిన్న వంటగది వెలిసింది.

నీలమ్మ, తొమ్మిది పాసయింది. సంసార జీవిత సాఫల్యంతో, మరో ఏడాదికి, తల్లి అయింది. అంజన్న జన్మించేడు.

దిన దిన ప్రవర్ధమానవుతున్న, ముద్దుల కొడుకు, దంపతులిద్దరకు, అంతులేని సంతోషాన్ని, కలుగజేస్తున్నాడు. సింహాద్రి, ఇంట లేని సమయాల్లో, నీలమ్మకు, లోకమంతా, అంజన్నే. వాడి ఆటపాటలలో, మునిగి తేలుతూ ఉంటుంది. ఎల్లప్పుడూ, వాడిని శుభ్రమయిన దుస్తులలోనే ఉంచుతుంది. వాడికి, కొద్దిగా జ్ఞానం వచ్చినప్పటినుండి, తనకు తెలిసిన, నీతులు బోధించే చిన్న చిన్న కథలు చెప్పడం ప్రారంభించింది. ఏదయినా పని చేస్తూ, భర్తకు ఆర్థికంగా తోడ్పడాలని, అప్పుడప్పుడు, నీలమ్మకు, మనసులో అనిపిస్తూండేది. కాని, అంజన్నకు, నాలుగేళ్లు వచ్చిన వరకు, అది సాధ్యపడలేదు. ఆ తరువాత, ఒకరోజు, భర్తతో, ఆవిషయం మాట్లాడింది.

“మావాఁ, బాబు, కొద్దిగ పెద్దోడయ్యేడు. నాకు ఆడి పని, సేన వరకు తగ్గినాది. ఇంటికాడ ఊరక కూకోడం ఎందుకు, మావాఁ. నేను కూడ, ఏదైన పని సేస్తే, నాలుగు డబ్బులొత్తాయి గద.” అని, కుటుంబ బాధ్యత, తనకూ కలదని, తెలియజేస్తూ అంది.

‘నీలమ్మా, నువ్వు కూడ కట్టబడ్డాలా ఏటి. అయ్యగారు, నాకిత్తున్న జీతం, సేన్దా ఏటి.” అని, భార్యను పనిలో పెట్టడం ఇష్టంలేనట్లు, స్పందించేడు.

“మావాఁ, బాబుకి, పెద్ద సదువులు సెప్పిద్దామనుకొంటున్నాం గదా. మరి ఆటికి సేన డబ్బు అవుత్తది నేను కూడ, కట్టబడి, డబ్బులు తెస్తే గదా, అయన్నీ దాసుకొని, బాబుకి పెద్ద సదువులకవుద్ది.” వారి కోరిక నెరవేరుటకు, తను రచించిన, ప్రణాళికను, తెలియజేసింది.

“నువ్వు సెప్పింది, బాంగానే ఉంది. బాబుకి, పెద్ద సదువులు సెప్పించాలంటె, లావుగ డబ్బు అవుత్తది. అయితే, నువ్వు ఏటి సేద్దావనుకొంటున్నావేటి.”

“మావాఁ, నేను, యారింట్లో, పెనిసెయ్యను.” అని, తన నిశ్చితాభిప్రాయాన్ని, మగనికి, తెలియజేసింది, నీలమ్మ.

“మరి అయితే ఏటి సేత్తావేటి. డబ్బులెట్టా ఒత్తాయి.”

“మన ఈదిలోనే సేనమంది, సిన్న, పాపలున్నారు గదా. నీకు ఎరికే గద మావాఁ. ఆల్లకి మన ఇంటికాడ పాటాలు సెప్తే, డబ్బులొత్తాయి గదా.” అని, తన ఆర్థిక ప్రణాళిక భర్త ముందుంచింది.

“నువ్వు సెప్పింది, బాంగానే ఉంది నీలమ్మా. (కొద్ది క్షణాలు, ఏదో ఆలోచించి) కాని, ఈ ఇసయం, అయ్యగారినడగాలి గదా.” భార్య ప్రణాళికకు, ఆమోదముద్రవేసి, యజమానుల అనుమతి వేడుకోదలిచేడు.

“అయ్యగారు, మంచోరు. సెప్పుకోమంటారు. నువ్వు అడుగు మావాఁ.” అని, వారి యజమాని సహృదయతపై, తనకున్న ప్రఘాడ విశ్వాసాన్ని, తెలియబరిచింది.

“అట్టాగే, అడుగుతాను.” అని సంభాషణకు తెర దించేడు, సింహాద్రి.

డాక్టరు దంపతులు ఇద్దరు ఉన్నప్పుడు, సింహాద్రి, నీలమ్మ చెప్పిన విషయం, వారికి విన్నవించుకొని, వారి అనుమతి, అభ్యర్ధించేడు. వారిద్దరు, వారిలో వారు, ఆ విషయం, ఆంగ్లంలో మాట్లాడుకున్నారు.

ఏదో ఆలోచించుకొని, పద్మజగారు, “సింహాద్రీ; నీలమ్మ, తనూ కష్టపడి, అర్జిద్దామనుకోవడం, మంచిదే. అయితే, తను చెప్పిన విషయం, మేము ఆలోచించుకొని; రేపు మీరిద్దరూ వస్తే, మాట్లాడదాం.” అని, సింహాద్రితో చెప్పేరు.

“అట్టాగేనమ్మగారూ.” అని, వినయంగా చెప్పి, తన పనిలోనికి వెళిపోయేడు, సింహాద్రి.

సింహాద్రి రాకకోసం, ఇంటివద్ద, నీలమ్మ, వేయికళ్లతో ఎదురు చూస్తోంది.

సింహాద్రి, ఇల్లు చేరీ చేరడంలో, “మావాఁ, అయ్యగారినడిగినావా. ఏటన్నారు.” అని, నీలమ్మ ఆత్రుతతో అడిగింది.

జరిగిన విషయం, చెపుతూ, “అయ్యగారు, అమ్మగారు, ఏటో ఇంగిలీసులో మాటాడుకొన్నారు. నాకది తెల్దుకదా. మరి రేపేటిసెప్తారో ఏటో.” అని, సంశయం వెలిబుచ్చుతూ, సింహాద్రి చెప్పేడు.

“అమ్మోరి దయ.” అని, గోడకు వేలాడుతున్న, దేవి పటానికి, తలవంచి నమస్కారం చేసి, నీలమ్మ, వంటగదిలోనికి వెళ్ళింది.

మరునాడు, నీలమ్మతో బాటు, సింహాద్రి, యజమానులిద్దరును కలిసేడు. డాక్టరు దంపతులిద్దరూ చెప్పడంతో, వినయంగా నిలబడి ఉన్న ఇద్దరూ కింద కూర్చొన్నారు.

వివేకానందగారు, సంభాషణ ప్రారంభిస్తూ, “నీలమ్మా, నిన్న, సింహాద్రి చెప్పేడు. నీది మంచి ఆలోచనే. కాని, ట్యూషన్లు చెప్పడంలో, ప్రతి నెలా నికరాదాయం ఉండదు. ఉద్యోగం చేస్తే, ప్రతి నెలా జీతం వస్తుంది. ఏమంటావ్.”

“తమరు సెప్పింది, నిజమేనండయ్యగారూ. కాని, నా సదువుకి, నౌకిరీ, ఎవరు ఇత్తారు అయ్యగారూ.” తన చదువుకి, ఉద్యోగం దొరకదని, తన అభిప్రాయం చెప్పింది, నీలమ్మ.

“నీకు, మేము ఉద్యోగం చూపిస్తే, చేస్తావా.” పద్మజగారు, నీలమ్మ అభిప్రాయం అడిగేరు.

“సేత్తాదండి అమ్మగారు.” అని సింహాద్రి, సంతోషంతో చెప్పగానే,

“అదేదో, ఆలోచిస్తున్నట్టుంది; దాన్ని చెప్పనీ; చెయ్యాలని, ఉందో, లేదో.” పద్మజగారు, సింహాద్రికి బ్రేకు వేసేరు.

నిజానికి, నీలమ్మ మనసులో సందిగ్ధం ఏమంటే, అమ్మగారు చెప్తున్న ఉద్యోగం, ఎక్కడైనా ప్యూను పనా… అని.

“అమ్మగారండి, ఏటి ఆ ఉద్దోగం; యేరకాడండి.” సందేహ నివృత్తి, చేసుకోదలచింది, నీలమ్మ.

“నీలమ్మా, ఉద్యోగం మా దగ్గరే.” వివేకానందగారు, చిరునవ్వుతో, సందేహ నివృత్తి, కొంతవరకు చేసేరు.

“పనిమనిషిగా కాదు. సింహాద్రి చెప్పేడు, పనిమనిషిగా ఎక్కడా చెయ్యడం, నీకిష్టం లేదని.” అని, పద్మజగారు, స్పష్టం చెయ్యడంతో, నీలమ్మ ముఖం వికసించింది.

“నీలమ్మా, మా ఆసుపత్రిలో, మరొక నర్సుని వేద్దామనుకొంటున్నాం. నీకు, నర్సుల పని గురించి, ఏమైనా తెలుసా.” వివేకానందగారు, నీలమ్మ అభిప్రాయం తెలుసుకోగలిగేరు.

“అయ్యగారూ, తమరి ఆసుపత్రిలోనే గదా, అంజన్న పుట్టినాడు. అప్పుడు సూసినాను, నరసమ్మగారు, పనిసేత్తూంటే.” బుర్ర ఊపుతూ, సంతోషంతో, జవాబిచ్చింది, నీలమ్మ.

“నీలమ్మా, నీకు, కొన్నాళ్ళు ట్రైనింగు ఇస్తాం. ఇప్పుడున్న నర్సు గౌరమ్మ కూడా నీకు నేర్పుతుంది. నువ్వు ఆలోచించుకు చెప్పు. నీకు నర్సు పని ఇష్టమో కాదో.” పద్మజగారు, సలహా ఇచ్చేరు.

“నీకు మేం చెప్పింది నచ్చకపోతే, మాకు చెప్పీ. ఏం ఫరవాలేదు. నువ్వు అనుకొన్నట్లే, ట్యూషన్లు చెప్పుకోవచ్చు.” వివేకానందగారు, విడమరచి చెప్పేరు.

“తమరు సెప్పింది, నాకిట్టమేనండి. మీ కాడ పని సేత్తాను.” అని, వినమ్రంగా ధృవీకరించింది, నీలమ్మ.

“నీలమ్మా, రేపు నువ్వు, మా ఆసుపత్రికి రా. మా నర్సు గౌరమ్మతో ఉండి, నర్సు ద్యూటీలు ఏమిటో, జాగ్రత్తగా తెలుసుకో. ఆ తరువాత, నువ్వు, సింహాద్రి, బాగా ఆలోచించుకొని, నీ నిర్ణయం చెప్పు. మొహమాటపడకు. మేమేమీ అనుకోము.” అని, నీలమ్మకు, సలహా ఇచ్చేరు, పద్మజగారు.

అక్కడకు, ఆ సంభాషణ ముగిసింది.

ఆ మరునాడు, నీలమ్మ, ఆసుపత్రికి వెళ్ళి, పద్మజ గారిని కలిసింది. ఆవిడ నీలమ్మను, గౌరమ్మకు, పరిచయం చేసి, నీలమ్మ రాకకు కారణం తెలియజేసేరు. తగు సూచనలిచ్చేరు. నీలమ్మ ఆ రోజు, గౌరమ్మతోనుండి, నర్సుల విధులను, కొంతవరకు అవగాహన చేసుకొంది.

సాయంత్రం, భర్తతో, ఆ రోజు, ఆసుపత్రిలో తన అనుభవం, సంతోషంతో తెలియజేసింది. నర్సు విధులను, చేయగలనని, ఉత్సాహంతో చెప్పింది. ఆ మరునాడుదయం, ఇద్దరూ డాక్టరు దంపతులను కలిసేరు. నీలమ్మ, నర్సు విధులను చేయగలనని వారికి ధృడ నిశ్చయంతో చెప్పింది. అది విని, పద్మజగారు, “నీలమ్మా, మాకూ, నమ్మకముంది; నువ్వు చెయ్యగలవని. నువ్వు కొంతవరకు చదువుకొన్నావు. పని నేర్చుకోడంలో నేను, అయ్యగారు, కూడా, నీకు సాయం చేస్తూంటాం. రేపటినుండి, నువ్వు, ఆసుపత్రికి రా.” అని, నీలమ్మకు, తమ ఆసుపత్రిలో, నర్సు ఉద్యోగం ఖాయం చేసేరు.

వివేకానందగారు కూడా ఖాయబరుస్తూ, “నీకు, ఆరు నెలలవరకూ, నెలకు, రెండువేల రూపాయలిస్తాం. ఆ తరువాత, నీ పని చూసుకొని, అయిదువేలదాకా పెంచుతాం.” అని, చెప్పగానే, నీలమ్మ, సింహాద్రి, ఉబ్బి, తబ్బిబ్బై, యజమానులిద్దరకు, సాష్టాంగ నమస్కారం చేసేరు.

గత నాలుగు సంవత్సారాలనుండి, ప్రతి ఏటా, జీతం పెరుగుతూ, సింహాద్రికి, నెలకు, నాలుగు వేలు, ముడుతున్నాయి. నీలమ్మ, జీతం పెరిగితే, వారి ఆదాయం, నెలకు తొమ్మిది వేలకు, చేరుతుంది. అది తలచుకొని, వారిద్దరూ, అంజన్నకు, పెద్ద చదువు చదివించగలమని, ఉవ్విళ్ళూరేరు.

మరునాడు, నీలమ్మ విధులలో చేరింది. భారతదేశంలో, విద్యార్హత లేని నర్సుల సంఖ్యకు, మరొకటి కలిసింది. ఆరు నెలలు గడిచేయి. స్వయంగా, నీలమ్మ విధులను, ఎంతో సహనంతో, సక్రమంగా నిర్వర్తించడం, వివేక్ గారు, పద్మజగారు, పలుమార్లు గమనించేరు. నీలమ్మ జీతం, అన్ననాటికి పెంచేరు.

సింహాద్రి, ఆర్జిస్తున్నా, ఇంటి ఖర్చుల విషయం, నియంత్రణ పాటిస్తూ, నీలమ్మే, చూసుకొంటున్నాది. వీలయినంత వరకు, పొదుపు పాటిస్తూ చేస్తోంది. ఇద్దరి ఉద్యోగంతో ఆదాయం అనూహ్యంగా పెరిగినా, అనవసరపు ఖర్చులు, పెట్టకుండా, పొదుపునే పెంచుతున్నాది. సింహాద్రి, ఆ విషయంలో నీలమ్మకు, పూర్తి స్వేచ్ఛనిచ్చేడు. కారణం; వారిరువరి లక్ష్యం ఒక్కటే. ఎన్ని కష్టాలు పడైనా, అంజన్నకు, వీలయినంతవరకు, పెద్ద చదువులు చెప్పించాలి; వారి కలలు పండాలి; వాడిని, ఒక ఆఫీసరుగా చూడాలి; అదే వారి ధ్యేయం.

నీలమ్మ తనకు సమయం దొరికినప్పుడు, అంజన్నకు, ‘అ, ఆ, ఇ, ఈ.’ లు, దిద్దించడం ప్రారంభించింది. ఎక్కాలు, వల్లె వేయిస్తోంది. వాడు చురుకుగా నేర్చుకొంటూ ఉంటే, నీలమ్మ, సింహాద్రి, మురిసిపోతున్నారు. అప్పుడప్పుడు, అంజన్న మారాం చేస్తే, తనతోబాటు, ఆసుపత్రికి తీసుకెళ్తోంది. బుద్ధిగా ఉండమని చెప్పి, వాడిని, ఒక చోట, కూర్చోబెట్టి, అక్షరాలు దిద్దమని చెప్పి, తన పనిలో నిమగ్నమవుతోంది. వాడున్నూ, తల్లి మాట జవదాటక, బుద్ధిగా చదువుకోడం, డాక్టరు దంపతుల దృష్టిలో పడ్డాది. ఒకమారు, వారావిషయం మాట్లాడుకొంటూ.

“వివేక్, నువ్వు కూడా అబ్జర్వ్ చేసి ఉంటావ్. కొడుకు చదువు విషయంలో, సింహాద్రి కన్నా నీలమ్మ చాలా శ్రద్ధ తీసుకొంటోంది.”

“అవును, నేనూ చూస్తున్నాను, పద్మా. అది, వాళ్లిద్దరూ, పెరిగిన వాతావరణ ప్రభావం. సింహాద్రి, పల్లెటూరులో పుట్టి పెరిగేడు. అక్కడ, చదువుకున్నవాళ్ళు, తక్కువమందుంటారు. నీలమ్మ, పట్నంలో పుట్టి పెరిగింది. ఇక్కడ చదువుకొంటున్నవాళ్ళని చూస్తున్నాది. తన కొడుకుని, వాళ్ళలా చదివిద్దామనుకొంటోంది.” అని, వివేక్ గారు, ఆ విషయాన్ని, ఇఫెక్ట్ అఫ్ ఎన్విరాన్మెంట్ గా గుర్తించేరు.

“వాడు కూడా బుద్ధిగా చదువుకొంటున్నాడు.” పద్మజగారు, అంజన్నకు కితాబు ఇచ్చేరు.

“అది, వాడి పెంపకంలో ఉంది, పద్మా.”

“అవును, వాణ్ణి, అల్లరి చిల్లరిగా, వీధి పిల్లలితో ఆడుకోడం ఎప్పుడూ చూడలేదు. మన గరాజు ముందునే, ముగ్గురు, నలుగురు పిల్లలతో, ఆడుకొంటూ ఉంటాడు.” పద్మజగారు, భర్త అభిప్రాయాన్ని, ధృవీకరిస్తూ, ఉదాహరణ ఇచ్చేరు.

రోజులు గడుస్తున్న కొద్దీ, నీలమ్మ, సింహాద్రీల, ఆలోచనలు, అంజన్న చదువుమీద కేంద్రీకరిస్తున్నాయి.

ఒక రోజు, ఆ దంపతులిద్దరూ, ఆ విషయం సీరియసుగా ఆలోచిస్తూ,

“మావాఁ, మన బాబుకి, పదెక్కాలు వచ్చినాయ్. కలపడం, కొట్టెయ్యడం, సిన్న సిన్నవి, చేత్తాడు.తెనుగులో, సిన్న సిన్న, పదాలు, సదువుతాడు, రాత్తాడు. A,B,C,D లు కూడా అన్నీ, ఒచ్చేసినాయి. సిన్న సిన్న, పదాలు, కూడా సదూతాడు, రాత్తాడు.” అని, అంజన్న ప్రోగ్రెస్ రిపోర్టు, భర్త ముందుంచింది.

“నీలమ్మా, నేను సూత్తున్నాను గదా. అదంతా నీ కట్టమే.”

“ఆడినిక, బడిలో ఎయ్యాలి మావాఁ. నేనిక సెప్పనేనుగదా.”

“అవును, నువ్వు సెప్పింది కరట్టే. బాబునిక బడిలో ఎయ్యాల.”

“బడిలో…అంటే, మంచి, బడిలో ఎయ్యాల మావాఁ.” తన మనోభావాన్ని, వెల్లడి చేస్తూ, ‘బడి’ పదానికి, ఒక విశేషణం చేర్చింది, నీలమ్మ.

“నువ్వు సదివినావు. నీకు బాగ సదువొచ్చినాది. ఆ బడి మంచిదే గదా.”

“అదేం బడి మావాఁ. అది గవమెంటోళ్ళ బడి. అక్కడ పాటాలేటి సెప్తారు. మాకయితే ఎనిమిదిలో, లెక్కలికి గురువుగారే లేరు. మా పాటాలు మేమే సదువుకొనేఆళ్ళమి.”

“మరి, ఈ పట్టంలో, బడులేటో నాకు ఎరిక లేదు.”

“సైకిలు దుకానం, జగ్గుబాబున్నాడుగదా. అతగాడికి తెలుత్తది.”

“ఆఁ. జగ్గన్నకి తెలుత్తది. బడి పిల్లలు, సైకిలు దుకానానికి ఒత్తూంటారు గదా. రేపు జగ్గన్నని అడుగుతా.” అని, యజమానుల కార్లను శుభ్రపరచడానికి, గరాజుకు వెళ్ళేడు.

ఆ మరునాడు, వీలు చూసుకొని, సింహాద్రి, జగన్నాధాన్ని, సైకిలు దుకాణంలో కలుసుకున్నాడు. జగన్నాధం సైకిలు దుకాణం, ఒక అనధికార సమాచారకేంద్రం. తన దుకాణానికి వచ్చిన గ్రాహకుల సేవ చేస్తూనే, వారినుండి, సమాచారాలు సేకరిస్తూంటాడు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల విషయంలో, నీలమ్మ అభిప్రాయాలతో, జగన్నాధం, ఏకీభవించేడు. మంచి బడి, అంటే, తన అభిప్రాయంలో, కాన్వెంటు బడే అన్నాడు. కాని, దానిలో, జీతాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేడు. ఎంత ఎక్కువో, తనకు వివరంగా తెలియదన్నాడు.

సింహాద్రి, జగన్నాధం దగ్గర, తను సేకరించిన సమాచారం, నీలమ్మకు చెప్పి,

“అయ్యగారినడిగితే, ఎంతఉద్దో తెలుత్తది.” అని, చెప్పి, పక్కనే, తల మీదకు ఎత్తి, తనవంకే చూస్తున్న కొడుకును ఎత్తుకొని, ముద్దులాడసాగేడు. నీలమ్మ, వంటగదిలోకి వెళ్ళింది.

వంటచేస్తూ, ఆ విషయమే ఆలోచిస్తున్న నీలమ్మ, కొద్దిసేపట్లో, భర్త చెంతకు వచ్చి,

“మావాఁ, అయ్యగారినడగబోకు.” అని, తన మదిలోని, ఆలోచన, చెప్పబోతూంటే,

“ఏం. ఎందుకేటి.” అని, అడిగేడు, సింహాద్రి.

“ఆ బడిలో ఏత్తె, సేన కర్చవుతుందని, జగ్గుబాబు సెప్పినాడుకదా.”

“ఆఁ. సెప్పినాడు.”

“అయ్యగారినడిగితే, గవమెంటోళ్ళ బడిలోయతే, ప్రీగా అయిపోద్దిగదా, అంతడబ్బెట్టి, ఆ బడిలో ఎందుకెయ్యాలా, అనుకొంటారు, మావాఁ. మనకాడ, డబ్బులు సేరగానే, గొప్పోలమయిపోనామని, ఏసాలేత్తున్నాం, అనుకొంటారు అడగబోకు, మావాఁ.” అని, సింహాద్రికి సలహా ఇచ్చింది.

“మరి, ఏటి సేద్దామంటావ్.”

“ఏటి సెయ్యాలో, సూద్దాం. అయ్యగారిని మాత్రం అడగబోకు.” అని, విషయం, సస్పెన్షనులో ఉంచి, తిరిగి వంటింట్లోకి వెళ్ళింది.

సింహాద్రి, కొడుకును ముద్దులాడడంలో, మునిగిపోయేడు.

అటు, డాక్టరు దంపతులు కూడా, ఒక రోజు, అంజన్న చదువు విషయం ఆలోచిస్తూ.

“వివేక్; నీలమ్మకి, సింహాద్రికి, మనం చెప్పాలేమో; అంజన్నని, ఇహ స్కూలులో జాయిన్ చెయ్యడం, మంచిదని. స్కూలయితే, రెగ్యులరుగా వెళ్ళొస్తూంటాడు. అక్కడ టీచర్సుంటారు. సిలబసు ప్రకారం చెప్తారు.” అని, పద్మజగారు, అభిప్రాయపడ్డారు.

“అవును; నిజమే; వాడికి, నీలమ్మ, ఎక్కాలు, అవీ, బాగా నేర్పింది. ఫౌండేషను, బాగానే వేసింది. ఇంక, హైయ్యర్ లెర్లింగుకి, వాడు, రెగ్యులరుగా, స్కూలికి వెళ్ళాలి.”

“వివేక్, నువ్వు అంటూ ఉండేవాడివి; ఎవరయినా, ఇంటలిజెంట్ పూర్ స్తూడెంటికి, చదువు చెప్పించాలని ఉందని. I think Anjanna is a fit case. సింహాద్రి, నీలమ్మ, మనకి బాగా తెలిసిన వాళ్ళు కూడాను.”

“నీ ఐడియా బాగుంది, పద్మా, మరెవరయినా అయితే, ఇంట్లో, ఏం చేస్తున్నాడో, ఏమిటో; వాడు, సరిగ్గా చదువుకొంటున్నాడో, లేదో; మనకి తెలీదు. అంజన్నయితే, రోజూ, మన కళ్ళ ఎదుటే ఉంటాడు.” వివేకానందగారు, సతీమణి సలహాను, కొనియాడేరు.

“నీలమ్మ, వాడిని, దగ్గరుండి చదివిస్తుంది కూడాను.” పద్మజగారు, మరో ప్లస్ పాయింటు, కలిపేరు.

“అవును, పద్మా; అన్నివిధాల, అంజన్నని, చదివించడమే మంచిది.” వివేకానందగారు, పద్మజగారి సలహాను అంగీకరించేరు.

“అయితే, వివేక్, వాణ్ణి, ఏ స్కూల్లో వేద్దామంటావ్. గవర్నమెంటు స్కూళ్ళు, out of question.” అని పద్మజగారు, చెప్పగానే,

వివేకానందగారు, “విన్నాను. కాని, గవర్నమెంటు స్కూళ్ళని, పూర్తిగా కొట్టి పారీలేం, పద్మా. వాటిలో చదువుకున్న వాళ్ళు, I.A.S. లున్నారు: యూనివర్సిటీ ప్రొఫెసర్లున్నారు; హై కోర్టు, సుప్రీం కోర్టు జడ్జెస్, ఉన్నారు; అన్ని ప్రొఫెషనల్సులోను, చాలా, పెద్ద వాళ్ళున్నారు. అయితే, ఏమిటంటే, ఆ స్కూళ్లలో, పెద్ద క్లాసులు, కొంత నయం. వాటిలో ఉన్న పిల్లలు, చాలావరకు మిడిల్ క్లాస్ కుటుంబాల వాళ్ళు. వాళ్లకి చదువు లో ఇంట్రెస్టు ఉంటుంది. వాళ్లకి, పేరెంట్స్ సపోర్టు కూడా ఉంటుంది. కాని, పద్మా, ఎలిమెంటరీ లెవెల్లో, గవర్నమెంటు స్కూళ్లలో, ఎడ్యుకేషను, ఘోరంగా ఉంటుంది. దానికి తోడు, వాటిలో మెజారిటీ వాళ్ళ ఫేమిలీ, ఎడ్యుకేషన్ బేక్‌గ్రౌండు కూడా, అంతంత మాత్రమే.” అని, గవర్నమెంటు స్కూళ్లపై, తన అభిప్రాయాన్ని, క్లుప్తంగా చెప్పేరు, వివేకానందగారు.

“వివేక్, అంజన్నని, మనం ఎలిమెంటరీ స్కూల్లో కదా వెయ్యాలి. గవర్నమెంటు ఎలిమెంటరీ స్కూల్స్ విషయం చెప్పేవ్. వాణ్ణి, మొక్కుబడిగా చదివించడం కాదు కదా. వాడు, చదువుకొని బాగుపడితే, అక్కడి నుండి, నెక్స్ట్ జెనెరేషన్స్ అంతా, ఒక హైయ్యర్ లెవెల్. లోకి వస్తారు. అదీ, మనకు కావాల్సింది. అంచేత, there is no alternative, వివేక్. వాణ్ణి, మన పిల్లలు చదువుకొన్న స్కూల్లోనే వెయ్యాలి.” అని, నిశ్చితంగా చెప్పేరు, పద్మజ గారు.

“పద్మా, అదే, నా ఒపీనియను కూడా. రేపు, మన పిల్లలు చదివేరే, Saint Xavier – Elementary school, వాళ్ళ ప్రిన్సిపాలుతో మాట్లాడతాను. ఫీజు డీటైల్స్ అవీ కనుక్కొంటాను.” అని, అంజన్న కాన్వెంటు ఎడ్యుకేషనుకు నాంది పలికేరు.

డాక్టరు దంపతులు, తమ మనసులోని మాట చెప్పే ముందు, ఆ విషయంలో, నీలమ్మ, సింహాద్రిల మనసులో ఏముందో, తెలుసుకొందామనుకొన్నారు.

యజమానుల సలహా మేరకు, ఆదివారం సాయంత్రం, సింహాద్రి, నీలమ్మ, అంజన్నతోబాటు, బంగళాలో, వారిని కలిసేరు.

పద్మజగారు, అంజన్నను దగ్గరగా తీసుకొని, “నీకు, ఎన్ని ఎక్కాలు వచ్చునురా..,” అని, గారాబంగా అడిగేరు.

“పది” అని ఠక్కున చెప్పేడు, అంజన్న.

“ఏదీ, తొమ్మిదో ఎక్కం చెప్పూ..” అని, వాడి ముఖంలోకి చూస్తూ, అడిగేరు, పద్మజగారు.

వాడు, తడుముకోకుండా, “తొమ్మిదయిదులు, నలభై అయిదు.” వరకు రాగానే,

“వెరీ గుడ్.” అని, భుజం తట్టి, వాడి చేతిలో ఒక చాకిలేట్ పెట్టి, “వెళ్లి, కూర్చో.” అని చిరునవ్వుతో అన్నారు.

అది గమనిస్తున్న, సింహాద్రి, నీలమ్మల ముఖాలు, సంతోషంతో వికసించేయి.

సంభాషణను, వివేకానందగారు, అందుకొని, “నీలమ్మా, అంజన్నకి, చదువు, బాగా చెప్తున్నావ్.” అని నీలమ్మను ప్రశంసించేరు.

“నేనాడికి సదువు సెప్పడమేటి అయ్యగారు. ఆడిని ఉరికే కూకోబెట్టడమెందుకని, ఏదో, నాకు తెలిసిన, నాలుగు ముక్కలు, ఆడికి సెప్తున్నాను.” వినమ్రతతో చెప్పుకొంది, నీలమ్మ.

“మంచిపని చేస్తున్నావ్ నీలమ్మా. లేకపోతే, వాడు, చదువు, సంధ్యా, లేకుండా, అల్లరి చిల్లరి తిరుగుళ్ళు, తిరుగుతూ ఉండేవాడు.” పద్మజగారు కూడా, నీలమ్మను, ప్రశంసించేరు.

“అంతా, తమరి దయ.” సింహాద్రి, వినమ్రతతో, తల వంచి, ధన్యవాదాలు సమర్పించేడు.

“నీలమ్మా, నీకు తెలిసిన నాలుగు ముక్కలు, చెప్పేనన్నావు. బాగుంది. వాడిని, ఇంకా, చదివిద్దామనుకొంటున్నారా.” వివేకానందగారు, ఆరా తీసేరు.

“సదివించాల, అయ్యగారూ. లేపోతే, రేపాడేటి సెయ్యగలడు అయ్యగారూ. ఏదేనా ఉద్దోగం సేయాలంటే, బాగా సదువుకోవాలు గదా.” నీలమ్మ, కొడుకు భవిష్యత్తు, వాడి చదువుతో ముడిపడి ఉందని, ఒక నిగూఢమయిన సత్యాన్ని, ఇనుమడింపజేస్తూ, సమాధానమిచ్చింది.

“మేం ఇద్దరం, అదే, ఆలోసించినాము, అయ్యగారూ. అంజిబాబుని, సదించాలా.. అని.” సింహాద్రి, భార్య అభిప్రాయమే, తనది కూడా, అని, తెలియజేసేడు.

“It is good. They have a higher ambition.” అని, వివేకానందగారు, తన అభిప్రాయాన్ని, పద్మజగారితో పంచుకొన్నారు.

పద్మజగారు, అవునన్నట్లు తల ఊపి,

“అయితే, సింహాద్రి, అంజన్న చదువు విషయం, ఏమిటి ఆలోచించేరు.” అని, అడిగేరు.

“అమ్మగారండి, బాబుని, బడిలో ఎయ్యాలా, అనుకొన్నామండి.” సింహాద్రి, మనసులోని మాట చెప్పగానే,

“బాబుని, ఏ బడిలో ఎయ్యాలో, తెల్డం లేదండమ్మగారూ.” అని, ప్రభుత్వ పాఠశాలలమీద, తనకు, సింహాద్రికి గల, నిశ్చితాభిప్రాయాన్ని, కూడా, సంకోచించకుండా చెప్పింది, నీలమ్మ.

డాక్టరు దంపతులిద్దరికి చిరునవ్వులొచ్చేయి.

“మీరిద్దరూ, మా దగ్గర, కష్టపడి పని చేస్తున్నారు. అంజన్న కూడా; మేం చూస్తున్నాం; శ్రద్ధగా చదువుకొంటున్నాడు. ఇవన్నీ ఆలోచించి, అంజన్నని, మంచి బడిలో, మేమే చదివిద్దామని, అనుకొంటున్నాం.” అని, వివేకానందగారు, సింహాద్రి, నీలమ్మలనుద్దేశించి, వారియెడ తమకున్న అభిమానాన్ని వ్యక్తబరుస్తూ, తమ సంకల్పం, తెలియబరచేరు.

“మా పిల్లలు చదువుకున్న బడిలో, చేర్పిస్తాం. వాడు బుద్ధిగా చదువుకొంటే, పెద్ద చదువులు కూడా, చెప్పిస్తాం.” అని, పద్మజగారు, తమ సదుద్దేశం చెప్పగానే,

ఎనలేని సంతోషంతో, సింహాద్రి, నీలమ్మ, యజమానులిద్దరికి, పాదాభివందనం చేస్తూ, అంజన్న చేత కూడా, చేయించేరు.

“కోటి కోటి దండాలండయ్యగారు, అమ్మగారూ.” అని, సింహాద్రి, తన ధన్యవాదాలు, సమర్పించుకున్నాడు.

“మాకు, ఏరే దేవున్లు లేరండి. అయ్యగారు, అమ్మగారూ, తమరేనండి, మాకు దేవున్లు.” అని, నీలమ్మ కూడా, ధన్యవాదాలు సమర్పించుకొంది.

పద్మజగారు, అంజన్న చేరబోయే స్కూలు గురించి, అక్కడి నియమాల గురించి, క్లుప్తంగా చెప్పేరు.

“సరే, మీ పన్లు చూసుకోండి.” అని, వివేకానందగారు, సంభాషణని, సమాప్తం చేసేరు.

సింహాద్రి, నీలమ్మలు, గాలిలో తేలిపోతూ, అంజన్నతో బాటు, తమ నివాసం చేరుకొన్నారు. తలుపు తీసి, ప్రవేశించగానే, అమ్మవారి పటం ముందర, సాష్టాంగపడ్డారు. అంజన్న చేత కూడా చేయించేరు. సింహాద్రి, నిలబడి, అమ్మవారి పటానికి, వంగి, వంగి, దండాలు పెడుతూ, ఆ తల్లి యెడ తనకున్న అపారమయిన, భక్తిని, నమ్మకాన్ని, తెలియజేస్తూ, “అమ్మా.. మారేడమ్మా, కోటి కోటి దండాలమ్మా. నన్నెప్పుడూ, నువ్వే సూసుకొంటున్నావమ్మా. లేపోతే, నేనేటి.. నా బతుకేటి.. నా సదువేటి.. నీలాటి దేవుఁలకాడ, పనిలో ఎట్టినావమ్మా. మంచి నీలమ్మనిచ్చినావమ్మా. అంజన్న కూడ మంచోడేనమ్మా. బుద్దిగ, సదువుకొంటున్నాడమ్మా. ఆడిమీద కూడా దయ సూపినావమ్మా. లేపోతే, ఆ బడేటో, మాకు ఎరికే.. నేదమ్మా. అంత గొప్పోళ్ల బడిలో, మా అంజన్న సదువుతాడంటే, అంతా.. నీ దయేనమ్మా.” అని దండకం వినిపించేడు.

నీలమ్మ కూడా, అమ్మవారి యెడ తన నమ్మకము, భక్తి, నమ్రతతో తెలియబరుస్తూ, రాబోయే అమ్మవారి పండుగలకు, సకుటుంబంగా రాంపల్లి వచ్చి, అమ్మవారి దర్శనం చేసుకొని, ఎర్ర చీర, జాకెట్టు, సమర్పించుకొంటామని మొక్కుకొంది.

ఏమిటి జరుగుతోందో, ఎందుకలా జరుగుతోందో తెలియక, అంజన్న, తల్లిదండ్రులను, బిక్క ముఖంతో, చూడ నారంభించేడు. అది గ్రహించి, నీలమ్మ, అతి గారాబంతో, అంజన్నను దగ్గరగా తీసుకొని, “బాబూ, మన బంగళా అయ్యగారు, నిన్ను మం..చి బడిలో ఏత్తారు. ఆ బడిలో, నీకు ఇంగిలీసు, ఇంకా.. పెద్ద పెద్ద పాటాలు సెప్తారు. నువ్వు కట్టబడి, బుద్దిగ సదూకోవాల.” అని, బుద్ధులు చెప్పింది.

తల్లి మాటలు విన్న అంజన్నకు ఏమి తట్టిందో, “అమ్మా, నాతో ఆడుకోడానికి ఒత్తూంటాడు, గనేసు.. ఆళ్లన్న పోతూంటాడు.. ఆ బడా, అమ్మా.” అని వివరణ కోరేడు.

“గనేసాలన్న పోతున్న బడి కాదు బాబూ; పోయేది, సేన పే..ద్ద బడి. సేన..సేన మాం..చి బడి.” అని నొక్కి నొక్కి చెప్పేడు, సింహాద్రి.

“గనేసాలన్న పోతున్న బడి, కూడ, మంచిదే బాబూ. కాని, నువ్వేల్తావే, అది సేన, సేన, మంచిది.” అని, విలువయిన సవరణ ఇచ్చింది, నీలమ్మ.

అంతలో, గణేసు వేసిన, “అంజీ” అన్న కేక విని, తుర్రున బయటకు పారిపోయేడు, అంజన్న.

బయటకు పోయిన అంజన్న, గుక్క తిప్పుకోకుండా, కళ్ళెగరేసుకొంటూ, సగర్వంగా, గరాజు ముందున్న నలుగురు మిత్రులకు, అమ్మా నాన్నలు చెప్పినవన్నీ, అప్పచెప్పేడు

శలవుల తరువాత, Xavier స్కూలు తెరిచే సమయం, ఆసన్నమవుతోంది. ఒక రోజు, పద్మజగారు, స్కూలు యూనిఫారములు అమ్మే దుకాణం తెలియబరచి, సింహాద్రిని, నీలమ్మను, అంజన్నతో బాటు, ఆమెను అచ్చట కలుసుకోమన్నారు. యజమానురాలి ఆదేశానుసారం, వారక్కడ హాజరయ్యేరు. అంజన్నకు, మూడు జతల స్కూలు యూనిఫారాలు, ఒక స్కూలు బేగు, సమకూర్చబడ్డాయి. ఆ తరువాత, జోళ్ళ దుకాణంలో, ఒక జత జోళ్ళు, మూడు జతల సాక్సు కూడా, అంజన్నవయ్యేయి. అంజన్న ముఖం చేటంత అయింది. వేగరం తన స్నేహితులకు అవి చూపించాలని, కుతూహలపడుతున్నాడు. అవి ఎంత వేగిరం ధరించి, బడికెళ్తానా అని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇంటికి వెళ్ళేక, వాటన్నింటిని, జాగ్రత్తగా వాడుకోవాలని, నీలమ్మ, సింహాద్రి, హితబోధ చేసేరు. అంజన్న, “అట్టాగేనమ్మా.”, “అట్టాగేనయ్యా”, అని వినయంగా తల ఊపుతూ, స్పందించేడు.

సింహాద్రి, స్వయంగా జగన్నాధాన్ని కలుసుకొని, అంజన్న, విషయం చెప్పేడు. జగన్నాధం తన సంతోషాన్ని తెలియజేస్తూ, సింహాద్రి, నీలమ్మలు, అదృష్టవంతులన్నాడు. ఒక శ్రేయోభిలాషిగా, తనకు జీవితంలో, విలువైన ఉద్యోగము, తెలివైన భార్యను చేకూర్చేడని, జగన్నాధాన్ని వేనోళ్ళ పొగిడి, సింహాద్రి నిండు మనసుతో, ధన్యవాదాలు చెప్పుకొన్నాడు. నీలమ్మ తరఫున కూడా, ధన్యవాదాలు తెలియజేసేడు. జగన్నాధం, రాంపల్లిలోని అమ్మవారు, ఎవరికీ అన్యాయం చెయ్యదని, మరోమారు, సింహాద్రికి, అభయమిచ్చేడు.

ఆ రోజు, Saint Xavier Elementary School, శలవుల తరువాత, తెరుచుకునే దినం. సింహాద్రి, నీలమ్మలు, అతి ఉత్సాహంలో ఉన్నారు. సింహాద్రి, అంజన్నకు స్నానం చేయించేడు. వాడికి, స్కూలు యూనిఫారం, జాగ్రత్తగా తొడిగేడు. మేజోళ్ళు తొడిగి, ముందుగా, ధగధగలాడుతూ పోలిష్ చేసిన జోళ్ళు, వాడికి తొడిగేడు. ఆ సమయంలో, నీలమ్మ, వంటగదిలో, టిఫిన్ తయారు చేసి, అంజన్నకు అందించింది. వాడది ఆరగించగానే, ఉడకపెట్టిన, కోడి గుడ్డునొకటి, ముక్కలు చేసి, వాడికి తినిపించింది. ఆ తరువాత, తాగడానికి వీలుగా వేడి చేసిన, ఒక గ్లాసుడు పాలు, ఆప్యాయంగా తాగించింది. చేతి వాచీలో టైము చూసుకొంది. ఏడు కావస్తోంది. మరో అరగంటలో, స్కూలు బస్సు వస్తుంది. సింహాద్రి, స్కూలు బేగులో, పుస్తకాలుంచి, దాన్ని పట్టుకొని, తయారుగా నిలబడి ఉన్నాడు. నీలమ్మకు, ఒక్కమారుగా జ్ఞాపకం వచ్చింది. హడావిడిగా, అంజన్న జోళ్ళు విప్పి, అమ్మవారి పటానికి, సాష్టాంగ నమస్కారం చేయించింది. ఆ కార్యక్రమం కాగానే, సింహాద్రి, చేతినున్న స్కూలు బేగు కిందకు దింపి, అంజన్నకు, జోళ్ళు తొడగబోతూంటే.

“మావాఁ, జోళ్ళు, తొడగబోక, అవి అట్టుకుని బంగలాలోనికి పద. అయ్యగారికి, అమ్మగారికి, దండాలెట్టాల.” అని అంజన్న చెయ్యి పట్టుకు వెళ్ళబోతూంటే,

“నీలమ్మా, నడిసెలితే, ఆడి మేజోళ్లు, కంగాలి ఐపోతాయ్. నువ్వు జోళ్ళు ఒట్టుకో. నేనాడిని బుజానికెక్కించుకొంటాను.” అని సలహా ఇచ్చేడు.

ముగ్గురూ, బంగాళాలోనికి వెళ్ళేరు. అంజన్న, డాక్టరు దంపతులకు, సాష్టాంగ నమస్కారం చేసి, వారి, ఆశీర్వచనాలు అందుకొన్నాడు. అంజన్న మెడలో టై, పక్కకు తిరిగి ఉండడం గమనించి, దానిని వివేకానందగారు, సరి చేసేరు.

యజమానులిద్దరకు, వంగి నమస్కరించి, సింహాద్రి, నీలమ్మలు, అంజన్నతో బాటు, వడి వడిగా, బంగళాకు దగ్గరలోనున్న, పోస్టాఫీసు చేరుకొన్నారు. అక్కడ, నలుగురు స్కూలు పిల్లలు బస్సుకై, క్యూలో నిరీక్షిస్తున్నారు. నీలమ్మ, అంజన్న చెయ్యి పట్టుకొని, వాణ్ని, ఆ పిల్లల వెనక నిలబెట్టింది. దూరంనుండి, నీలంరంగు స్కూలు బస్సు కనబడగానే, సింహాద్రి, “అదిగో.. ఒత్తున్నాది; అయ్యగారు సెప్పినారు, నీలి రంగు బస్సని, ఇసుకూలు బస్సు. ఒత్తున్నాది.” అని ఎనౌన్సు చేసేడు. అంజన్న ముందున్న నలుగురు పిల్లలూ, ఒకరి ముఖంలోనికి ఒకరు చూసుకొని మెల్లగా చిరునవ్వులు చిందించేరు. బస్సు ఆగగానే, నలుగురు పిల్లల వెనక, అంజన్న, తన జీవితంలో, తొలిసారిగా, స్కూలు బస్సు ఎక్కేడు.

అంజన్న, తక్కువ సమయంలోనే స్కూలు జీవితానికి అలవాటు పడ్డాడు. టీచర్ల ప్రత్యేక శ్రద్ధ, ఇంటివద్ద తల్లి సహకారంతో, క్లాసులో, ఒక తెలివయిన విద్యార్థిగా పేరు తెచ్చుకొన్నాడు. దానికి సత్ప్రవర్తన కూడా తోడయింది. తెలివిగా చదువుకొంటూ, అంజన్న ఒక్కొక్క సంవత్సరం మంచిమార్కులతో పాసవుతూ, పై క్లాసులకు చేరుకొంటున్నాడు. ఇంగ్లీషు మాట్లాడ్డం అలవాటుపడ్డాడు. మాట్లాడే తెలుగు భాషలో కూడా మార్పు వచ్చింది. ఆ అభివృద్ధి, డాక్టర్ దంపతులకు సంతోషాన్నిచ్చింది. అంజన్నను మంచి బడిలో వేసి చదివించడం, సత్ఫలితాన్నిస్తోందని అభిప్రాయపడ్డారు.

అంజన్న పది పరీక్షలు మంచి మార్కులతో పాసయ్యేడు. డాక్టరు దంపతులు వాడిని అభినందించేరు. సింహాద్రి, నీలమ్మ, కొడుకుపై ముద్దుల వర్షం కురిపించేరు. అంజన్న, పదకొండవ తరగతిలో అడుగు పెట్టేడు. శ్రద్ధగా చదువుకొంటున్నాడు. తెలివయినవాడని పేరు తెచ్చుకొన్నాడు. అంజన్న తోటి విద్యార్థులలో, కోటిరెడ్డి, ప్రసాదరావు అని, ఇద్దరు ఉన్నారు. వారిద్దరూ, పదకొండులో ఫెయిలయినవాళ్లు. అంజన్న తెలివితేటలు తెలిసి, వాళ్లిద్దరూ, వాడితో ఫ్రెండ్షిప్ చేసేరు. అంజన్న సహకారంతో, హోమ్ వర్కులు చెయ్యడం మొదలుపెట్టేరు. త్వరలో ఆ ముగ్గురికి దోస్తీ కుదిరింది. కోటిరెడ్డి తండ్రి భరతరెడ్డి; ప్రసాదరావు తండ్రి గోపాలం, కలసి వ్యాపారం చేస్తున్నారు. బాగా ఆర్జిస్తున్నారు. కోటిరెడ్డి, ప్రసాదరావుకు, తరచూ సినిమాలకి వెళ్లడం, కాఫీ హొటళ్ళలో టిఫిన్ చెయ్యడం అలవాటు. క్రమక్రమంగా, అంజన్న వాళ్ళ దారిలో నడవడం ప్రారంభించేడు. అది, శృతి మించడంతో, ఓ రోజు, బడినుండి డాక్టరుగారికి ఫిర్యాదు వచ్చింది. అంజన్న బడికి, తరచూ గైర్హాజరు అవుతున్నాడని, చదువులో శ్రద్ధ చూపడం లేదని, తెలియజేసేరు. డాక్టరు దంపతులు అంజన్నకు తగు విధంగా, హెచ్చరిక చేసేరు. ప్రవర్తనలో, మార్పు రాకపోతే, చదువు మాన్పించవలసి వస్తుందని, నొక్కి చెప్పేరు. అసంతృప్తి చెంది, యజమానులు చదువుకు సహాయం నిలిపివేస్తే, తాము చేయగలిగినదేదీ ఏదీ లేదని, ఎక్కడయినా, కూలీ నాలీ, చేసుకు బ్రతకాలని, సింహాద్రి, నీలమ్మ, చీవాట్లు పెట్టేరు. కొంతవరకు, ఆ హెచ్చరికలు పనిచేసేయి. అంజన్న బడిలో రోజూ హాజరవుతున్నాడు. శ్రద్ధలో మాత్రం, చెప్పుకోదగ్గ మార్పు, రాలేదు. అతి తక్కువ మార్కులతో, పదకొండు పాసయ్యేడు. డాక్టరు దంపతులు, సందిగ్ధంలో పడ్డారు. తాము తలచినట్లు, అంజన్నకు, ఉన్నత విద్య చెప్పిద్దామంటే, వాడిలో, అటువంటి ఆసక్తి ఉన్నట్లు కనిపించలేదు. చదువు మాన్పించిస్తే, అప్పటి దాకా పెట్టిన డబ్బు వృథా అయిపోతుందనుకొన్నారు. అన్ని విధాలా ఆలోచించి, వాడి చదువు కొనసాగించేరు.

మూడు, నాలుగు, నెలలు గడిచేయి. క్రమక్రమంగా, అంజన్న మళ్ళీ పెడదారి పట్టేడు. స్నేహితుడు ప్రసాదరావు తండ్రి, గోపాలం, వాడి సేవలు, గంజాయిని, విజయవాడకు అక్రమరవాణా చేయడంలో, వాడుకోడం ప్రారంభించేడు. అంజన్నకు, తను రవాణా చేస్తున్నవి, మాదకద్రవ్యాలనిగాని, తను చేస్తున్నది ఒక నేరమని గాని తెలియదు. పారితోషికం, భూరిగా అందుకొంటూ, వ్యసనాలకు బానిస అయ్యేడు. బడి ముఖం, చూడడం మానేసేడు. చెడు అలవాట్లకు లోనయిన అంజన్న ప్రవర్తన, బడి అధికారుల దృష్టిలో పడింది. అంజన్న కారణంగా, తమ బడికి, చెడ్డపేరు వస్తుందనే కారణం చూపుతూ, బడినుండి వాడిని శాశ్వతంగా బహిష్కరించేరు. డాక్టర్ దంపతులు, చాలా నిరాశ చెందేరు. సింహాద్రి, నీలమ్మ, కుప్పకూలిపోయేరు. వారి కలలన్నీ, చెల్లాచెదురయ్యేయి.

క్రమంగా, అంజన్న తరచూ ఇంటికి కూడా రాకుండా, చెడు తిరుగుళ్ళు తిరగడం ప్రారంభించేడు. సింహాద్రి, నీలమ్మలు, వాడిని సన్మార్గంలో పెట్టడానికి, సర్వ విధాలా ప్రయత్నించేరు. ఫలితం శూన్యమయింది. అంజన్న భావి జీవితానికి, తాము వేసిన ప్రణాళిక, విఫలమయిందని, డాక్టరు దంపతులు చాలా విచారించేరు. చేయునది లేక, నిరాశులయ్యేరు. సింహాద్రి, నీలమ్మలు, తమ కలలు, చెల్లాచెదురయ్యేయని, కృంగిపోయేరు. ఈ పరిణామాలు, నీలమ్మ ఆరోగ్యం మీద, చెడు ప్రభావం చూపేయి. మానసిక బాధతో, మంచం పట్టింది. వైద్యం ఫలించడం లేదు. సింహాద్రి కూడా, చెప్పలేని బాధకు, గురి అయ్యేడు. కాని, డాక్టరుగారి సలహా పాటించి, బయటకు చెప్పుకొంటే, భార్య ఆరోగ్యం విషమిస్తుందని, లోలోపలే, కృంగిపోతున్నాడు.

ఆ పరిస్థితులలో, పిడుగువంటి వార్త. ఆ ఉదయం, మాదకద్రవ్యాలు, బస్సు ద్వారా, అక్రమరవాణా చేస్తూ, అంజన్న, ప్రభుత్వాధికారులకు పట్టుబడి, పోలీసు కస్టడీలో ఉన్నాడు. నిమిషాలమీద ఆ వార్త ఊరంతా పొక్కింది. వివేకానందగారు పోలీసులకు ఫోను చేసి, ధృవీకరించుకొన్నారు. తనకు బాగా పరిచయమున్న, సీనియరు లాయరు రామకృష్ణగారిని, వెంటనే పోలీసు స్టేషనుకు వెళ్లి, అంజన్నకు అవసరమయిన న్యాయపరమయిన సహాయం అందజేయమని వేడుకొన్నారు. స్నేహితులని, తను నమ్మినవారు, అంజన్నకు అందుబాటులో లేకుండా పోయేరు.

అంజన్నను పోలీసులు పట్టుకొన్నారన్న వార్త విన్న నీలమ్మ, భోరున ఏడవసాగింది. తను ఏ పాపం చేసేనని, అటువంటి కొడుకును తనకు ఇచ్చేవని, అమ్మవారి పటం మీద పడి గుండెలు బాదుకో సాగింది. సింహాద్రి, తన బాధను మ్రింగుకొంటూ, నీలమ్మను ఓదార్చడానికి ప్రయత్నించేడు. పద్మజగారు కూడా, నీలమ్మను ఓదార్చ ప్రయత్నించేరు. ఏవీ ఫలించలేదు. నీలమ్మ రోదనకు అంతులేదు.

ఆ మరునాటి ఉదయం, నీలమ్మ పరిస్థితి విషమించింది. ఒక్కమారుగా గుండెపోటుకు గురి అయింది. బాధను భరించలేక చుట్టుకుపోతోంది. సింహాద్రి, పరుగున బంగళాలోనికి వెళ్ళేడు. డాక్టర్ దంపతులు ఫలహారం చేస్తున్నారు. సింహాద్రి, వాళ్ళ కాళ్ళమీద పడి, కళ్ళనీళ్ళతో, నీలమ్మ పరిస్థితి విన్నవించుకొని, వైద్యసహాయం వేడుకొన్నాడు. ఆయన, పరుగున సింహాద్రి నివాసం చేరుకొన్నారు. ఆయన నీలమ్మను పరీక్షించి, సత్వర చర్యలు చేబడుతూండగానే, నీలమ్మ తుది శ్వాస విడిచింది. అది తెలియగానే, సింహాద్రి, “నీలమ్మా, నన్ను ఒదిలేసి వెలిపొనావా” అని రోదిస్తూ, నీలమ్మ భౌతిక శరీరం మీద పడి, భరించలేని దుఃఖముతో భోరున ఏడుస్తూంటే, వివేకానందగారు కంట తడిపెట్టుకొంటూ, వాడిని ఓదార్చసాగేరు. ఆ విషాదవార్త, తెలియగానే, పద్మజగారు, దిగ్భ్రాంతి చెంది, పరుగున వచ్చి, సింహాద్రిని, దగ్గరగా తీసుకొని, ఓదార్చసాగేరు. బంగళాలో, విషాద ఛాయలు అలుముకున్నాయి. జగన్నాధానికి, విషాద వార్త తెలిసింది. ఆ వార్త, ఊళ్ళేనే ఉన్న, సింహాద్రి అక్క గౌరమ్మకు, అందజేసి, హుటాహుటిన, సింహాద్రి నివాసం చేరుకొన్నాడు. భోరున ఏడుస్తూ, గౌరమ్మ భర్త పోలిబాబుతో బాటు, చేరుకొంది. కొన్ని ఘంటల వ్యవధిలో, రాంపల్లినుండి, సింహాద్రి తల్లిదండ్రులు, ఎల్లాజి, నూకాలమ్మ, దివాకరరెడ్డిగారి జీపులో సింహాద్రి నివాసం చేరుకొన్నారు.

వివేకానందగారు, లాయరు రామకృష్ణగారికి ఫోను చేసి, నీలమ్మ మరణవార్త తెలియజేసేరు. పోలీసు కష్టడీలో ఉన్న అంజన్నకు, తల్లి మృతదేహాన్ని కడసారిగా చూసి, అంత్యక్రియలు జరపడానికి తగు అనుమతికి, ఏర్పాట్లు సత్వరము చేయమని వేడుకొన్నారు. లాయరుగారు, పోలీసు స్టేషనులో అధికారులను కలసి, అంజన్న తల్లి మరణవార్త వారికి చెప్పి, ఆ పరిస్థితులలో, అంజన్నకు తగు అనుమతి ప్రసాదించమని, కోరేరు. లాయరు గారు విన్నవించడంతో, అధికారులు మానవతా దృక్పథంతో, అంజన్నను, ఇద్దరు పోలీసుల పర్యవేక్షణతో, తల్లి అంత్యక్రియలు చేయడానికి అంగీకరించేరు. వాడి రాకను, దూరంనుండే గమనించిన, సింహాద్రి, వాడిని తిట్టరాని తిట్లు తిడుతూ, ఇంటిలోనికి రానివ్వలేదు. డాక్టర్ దంపతులు సింహాద్రిని, శాంతింప జేసేరు. అంజన్న, భోరున ఏడుస్తూ, వివేకానందగారి కాళ్ళమీద పడి, “అయ్యగారండీ, నాకేమీ తెలీదండి.” అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే, “రేపు నీ దగ్గరకు వస్తాను. నాతో లాయరు గారు కూడా ఉంటారు. అప్పుడు జరిగినదంతా, ఏదీ దాచకుండా చెపితే, నీకు శిక్ష పడకుండా చూస్తాను. ఇప్పుడు వచ్చిన పని మొదట కానీ.” అని, వాడిని ఓదార్చేరు. అంజన్న, మనసులో, తల్లికి క్షమాపణలు చెప్పుకొన్నాడు. కంట తడి పెట్టుకొంటూనే, తల్లికి అంత్యక్రియలు చేసేడు. పోలీసు స్టేషనుకు మరలిపోయేడు.

సింహాద్రి, నీలమ్మనే తలచుకొంటూ, విషాద సముద్రంలో మునిగి ఉన్నాడు. నీలమ్మ లేని జీవితం, ఎలా గడపడమో తెలియని స్థితిలో ఉన్నాడు. మనసు కుదుటబడేవరకు, కొంత కాలం, సింహాద్రి రాంపల్లిలో తమ వద్ద ఉండడం మంచిదని, సింహాద్రి తల్లిదండ్రులు అభిప్రాయబడ్డారు. దానివల్ల అట్టే ప్రయోజనం ఉండకపోవచ్చని, జగన్నాధం అన్నాడు. అక్కడ చేతినిండా పనిలేక, సింహాద్రి, అదే ఆలోచనలలో ఉంటాడన్నాడు. కొంతకాలం; నూకాలమ్మ, సింహాద్రి దగ్గరే ఉంటే, వాడు బంగళా పనిలో రోజంతా ఉంటాడని, ఆ విధంగా, వాడి మనసు మరో వైపు మళ్లుతుందని, సలహా ఇచ్చేడు. నూకాలమ్మ సహాయం అవసరమన్నాడు. సింహాద్రి; తను రాంపల్లి వెళిపోతే, తన పనులు చేయడానికి ఎవరూ లేకపోతే, అయ్యగారికి, అమ్మగారికి ఇబ్బంది అయిపోతుందన్నాడు. జగన్నాధం సలహాతో ఏకీభవించేడు. అదే అమలయింది.

అంజన్న పోలీసు కస్టడీ నుండి, జ్యూడీషియల్ కస్టడీలోకి మారేడు. లాయరుగారు వాడికి బెయిలు తెప్పించేరు. కోర్టులో తీర్పు రాడానికి కొంత సమయం పడుతుందని లాయరుగారు చెప్పేరు. డాక్టరు దంపతులు; అంజన్నను ఏ పనీ లేకుండా అంతవరకు ఉంచడం ఉచితం కాదనుకొన్నారు. వాడిని మళ్ళీ బడిలో వేయడం వృథా అనుకొన్నారు. పదోక్లాసు పాసయినవాడికి ఏ ఉద్యోగం దొరకదని తెలుసు. వాడి భవిష్యత్తు దృష్టిలో, వాడికి ఏదయినా వృత్తి విద్యలో శిక్షణ ఇప్పించ దలచుకొన్నారు. కొందరు స్నేహితుల సలహా తీసుకొన్నారు. ప్రకటన రాగానే, ఇండస్ట్రియల్ ట్రైనింగు ఇన్స్టిట్యూటులో డీజిల్ మెకానిక్ ఇంజినీరింగులో చేర్పించదలచుకొన్నారు. అది ఒక సంవత్సరం ప్రోగ్రేము. తమ ఉద్దేశం సింహాద్రికి తెలియజేసేరు. వాడికి కొడుకు మీద కోపం చల్లారలేదు. అంజన్న మీద డబ్బు పెట్టడం వృథా అని వినయంగా స్పందించేడు. డాక్టరు దంపతులు వాడికి బోధపరిచేరు. జీవితంలో బ్రతకడానికి, వాడికో దారి చూపించాలన్నారు. వాడా పొరబాటు తెలీక చేసేడన్నారు. మళ్ళీ అటువంటివి చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకొంటామన్నారు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రకటన వెలువడింది. అంజన్నను అందులో చేర్పించే ముందు, వాడికి గట్టిగా వార్నింగు ఇచ్చేరు. అక్కడ, ఒళ్ళు వంచి చదవకపోయినా, ఏ తప్పు పని చేసినా, లాయరుగారు వాడి కేసు వాదించరని, తప్పక జైలు శిక్ష పడుతుందని, హెచ్చరించేరు. వాడు మరే పొరపాట్లు చెయ్యనని, బుద్ధిగా చదువుకొంటానని హామీ ఇచ్చేడు.

అంజన్న డీజిల్ మెకానిక్‌గా శిక్షణ పూర్తి చేసుకొన్నాడు. డాక్టరు దంపతులు సంతోషించేరు. సింహాద్రికి కొడుకు మీద కోపం చాలావరకు తగ్గింది. ఈ పరిణామం తెలిసిన జగన్నాధం సంతోషించేడు. డాక్టర్ వివేకానంద గారి హామీతో, బ్యాంకులో అప్పు పొంది, అంజన్న వర్క్‌షాప్‌కు అవసరమయిన పనిముట్లు కొన్నాడు. జగన్నాధం సలహాతో హైవే మీద, డీజిల్ ఇంజినీరింగ్ వర్కుషాప్, నీలమ్మ పేరున ప్రారంభించేడు. ఏడాదిలోనే, అది బాగా అభివృద్ధి చెందింది. వాడి రోజులు మారేయి. అంజన్న నిర్దోషి అని కోర్టువారు తీర్పు ఇచ్చేరు. అంజన్న, తండ్రికి చేరువయ్యేడు.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here