తపాలా బంట్రోతు

2
9

[హిందీలో మున్షీ ప్రేమ్‍చంద్ వ్రాసిన ‘కజాకీ’ అనే కథని ‘తపాలా బంట్రోతు’ పేరిట తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు దాసరి శివకుమారి.]

[dropcap]న[/dropcap]లభై ఏళ్ల క్రితం మా కుటుంబం అజంగఢ్ ప్రాంతంలో వుండేది. నేనప్పుడు బాగా చిన్నవాడిని. ఆనాడు నా మనసుకు దగ్గరైన ‘కజాకీ’ అనే వ్యక్తి రూపు ఇప్పటికే నా కళ్ల ముందు సజీవంగానే కదలాడుతున్నది. ‘పాసీ’ కులానికి చెందిన అతను చాలా చలాకీగా, బోలెడు ధైర్యంగా, ఎప్పుడు చూసినా చెదరని మనో నిబ్బరంతో వుండేవాడు. కజాకీ రోజూ సాయింత్రం రైలుకు అందించాల్సిన టపా సంచిని తీసుకొచ్చి పోస్టాఫీసులో, అప్పగించి, ఆ రాత్రంతా అక్కడే వుండి ఉదయాన్నే మరలా పోస్టాఫీసులో నున్న తిరుగుటపాను తీసుకెళ్లిపోతూ వుండేవాడు. ప్రతి రోజూ అతని పని అదే. నేనేమో రోజూ సాయంత్రం పూట వచ్చే కజాకీ రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తు వుండేవాడిని. సాయంత్రం నాలుగు గంటలు అవటం ఆలస్యం, ఇంట్లో నుంచి వీధిలోకి పరుగెత్తుకొచ్చి ఆతృతగా అతని కోసం ఎదురు చూస్తూ నుంచునే వాడిని. తపాలా సంచిని పట్టేలాంటి దానికి బిగించి తగిలించుకుని పెద్దగా చప్పుడు చేసుకుంటూ నడుస్తాడు. అతను పొడవాటి మనిషి. బిరుసు చర్మం, బలమైన కండరాలలో చాలా ఆకర్షణీయంగా కనపడేవాడు. అతని రూపం నాకెంతో ఇష్టం. మంచి యవ్వనంలో వున్న అతను ఒక గొప్ప శిల్పి చెక్కిన అందమైన శిల్పంలాగా, ఆ ఆకృతికి తగ్గట్లుగా అతని సన్నని మీసకట్టు గూడ ఆ ముఖానికి చాలా బాగుండేది. అల్లంత దూరంలో నన్ను చూడగానే మరింత వేగంగా, చప్పుడు చేసుకుంటూ పరుగెత్తుకొచ్చేవాడు. అతడ్ని చూసి నా గుండె ఆనందంతో ఎగిసి పడేది. ఆనాటి సంతోషాన్ని మాటల్లో చెప్పలేను, ఒక్క ఎగురు ఎగిరి నా కోసమే వేసిన సింహాసనం లాంటి అతని బలమైన భుజం మీద, సర్దుకుని కూర్చునేవాడిని. అతని భుజాల ప్రాంతం నాకు స్వర్గంతో సమానం. ఆ స్వర్గ సుఖాన్ని దేవతలు కూడా అనుభవించి వుండరు. కజాకీ భుజాల గుర్రంపై నేను గాలిలో ఎగిరిపోతున్న అనుభూతి తప్పితే మరింకేదీ నాకు కనిపించేది కాదు.

కజాకీ నన్నూ, తపాలా సంచిని మోసుకుని పోస్టాఫీసుకు చేరుకునేటప్పటికి చెమటతో తడిసిపోయేవాడు, నాకదేం పట్టేది గాదు. సంచిని అప్పగించటం ఆలస్యం, అక్కడున్న మైదానానికి అతన్ని లాక్కునిపోయేవాణ్ణి. ఇద్దరం ఆటలాడేవాళ్లం. మధ్య మధ్యలో జానపద పాటలు పాడటం, కథలు వినిపించటం చేసేవాడు. ఆ కథల్లోని దొంగలు ధనవంతుల్ని దోచుకుని బీదలకు పంచేవాళ్ళు. అది నాకు బాగా నచ్చింది. అలాంటి కథలు చెప్చే అతని మీద రోజు రోజుకూ ఇష్టమూ పెరిగిపోసాగింది.

ఎప్పటిలాగా సాయంత్రం నాలుగింటికి రోజు పైన వచ్చి కజాకీ కోసం ఎదురు చూడసాగాను. ఎక్కడా అతని జాడలేదు. సూర్యుడు మాత్రం పడమటికి వాలిపోతున్నాడు, నాకిష్టమైన అతని సవ్వడి మాత్రం చెవులబడటం లేదు. ఆ వైపునుంచి ఎవరో రావటం చూసి కజాకీ వస్తున్నాడా అని అడిగితే వారు తల అడ్డంగా ఊపి వెళ్లిపోయారు.

ఇంతలో ఝన్ ఘన్ మని మోగే అతని ప్రేమ ధ్వని నా చెవుల్లో పడింది. చీకటి పడితే కలిగే దయ్యాల భయం కానీ, సాయింకాలం అమ్మ దట్టిలో నుంచి తీసి పెట్టే మిఠాయిల రుచి గానీ ఏమీ గుర్తు రాలేదు. ఆ ఝన్ ఘన్ మని వచ్చే ఆ ధ్వని వైపుకు పరుగెత్తుకు పోయాను. అంతే. అతన్ని చూడడంతోనే నా ప్రియ కజాకీని ఎడాపెడా కొట్టటం మొదలు పెట్టాను. కోపం తీరక అలకగా దూరంగా పోయి నుంచున్నాను.

కజాకీ ముఖంలో నవ్వు మాత్రం తగ్గలేదు, “భయ్యా! నువ్విలాగే అలిగితే, నన్ను కొడితే నీ కోసం తెచ్చిన వస్తువును చూపించనే చూపించను. నేనే వుంచుకుంటాను. నీ ఇష్టం” అన్నాడు.

“వెళ్ళు, తీసుకుపో, ఇక్కడెవ్వరూ ఏమీ తీసుకోరు” అన్నాను బింకంగా.

“అలాగా! అదేంటో చూపిస్తే, ఎగిరి గంతేసి వచ్చి లాక్కుంటావు. దాన్ని నీ గుండె కానించుకుని భద్రంగా దాచుకుంటావు. తెలుసా?” అన్నాడు ఊరిస్తూ.

‘సరేలే అయితే, త్వరగా చూపించు మరి” అన్నాను.

“అలాగే చూపిస్తాను. కాని ముందు నా భుజం మీద ఎక్కి కూర్చుంటే నేను పరుగు లంకించుకుంటాను. చాలా ఆలస్యం అయింది. బాబుగారు మండిపడుతూ వుంటారు. త్వరగా రావాలి.”

కాని అతని మాటల్ని నేను ఏ మాత్రం లెక్క చేయకుండా, మొండిగా, “నాకు ముందు చూపిస్తేనే భుజమెక్కుతాను” అంటూ హఠమే చేశాను,

నేనెక్కడ అలిగిపోతానో అని కజాకీ తన ఛాతికి అదిమి దాచుకున్న దానిని చూపించాడు. అది పొడవాటి మూతితో, మెరిసే కళ్ళతో బెదురు బెదురుగా చూస్తున్నది. నేను పరుగెత్తి వెళ్ళి లాక్కున్నాను. అదొక చిన్న జింకపిల్ల, ఓహ్! దాన్ని చూసిన క్షణం నాక్కలిగిన ఆనందాన్ని వర్ణించటం సాధ్యమైతే కాదు. ఎంతో కష్టమైన పరీక్షల్లో పాసయి మంచి డిగ్రీ పొందినంతా? రాయ్ బహదూర్ బిరుదు పొందినంతా?

తెప్పరిల్లి “నీకిదెక్కడ దొరికింది కజాకీ?” అని మాత్రం అడిగాను.

“ఇక్కడకి కొంచెం దూరంలో చిన్న అడవి, దానిలో జింకల మంద వున్నాయి. వాటిల్లో నీకొక జింక పిల్లను పట్టుకుని ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈ రోజు జింకల మంద కనపడితే వాటి వైపుకు పరుగెత్తుకుపోయాను. అవి భయపడి పారిపోయాయి. ఈ పిల్ల మాత్రం పరుగెత్తలేక నాకు దొరికింది. దీనికోసం చాలా తిప్పలు పడ్డాను, కానీ బాగా ఆలస్యం అయింది.”

జింకపిల్లతో సహా కజాకీ భుజమెక్కి కూర్చున్నాను. ఇద్దరం మాట్లాడుకుంటూ పోస్టాఫీసు చేరుకున్నాం. నాన్నగారే పోస్టు మాస్టరు. ఆయన నావైపు కానీ, జింకపిల్ల వైపుకు కానీ చూడలేదు. కజాకీ వైపుకు మాత్రమే తిరిగి నిప్పులు కురిపిస్తూ “ఇప్పుడా టపా తెచ్చేది. రైలెళ్లి ఎంత సేపయింది. ఇప్పుడు వీటినేం చేసేది?” అన్నారు అరుస్తూ. కజాకీ నోరు విప్పలేదు.

“నీకు ఉద్యోగం చేయాలని లేదు గాని, మానేసి పో. ఈ ఉద్యోగంతో నీ ఇల్లు గడిచి, పేగు పులిసేసరికి కన్ను మిన్ను కానటం లేదు, ఆ ఉద్యోగం నుండి తీసేస్తే, ఆకలితో మాడి చస్తావు. అప్పుడు గాని నీ కళ్ళు తెరుచుకోవు.”

అప్పటికీ కజాకీ మాట్లాడలేదు.

అతని మౌనం చూసి నాన్నగారి కోపం మరింత ఎక్కువైంది. “సరే టపా అక్కడుంచు. పందిలా నోరు విప్పవేం? ఇప్పుడింక నేను చేసేది నేను చేస్తాను, నువ్వెళ్ళి నీ ఇష్టమొచ్చిన పని చేసుకో. పని మీద శ్రద్ధ లేనివాళ్ళు నాకక్కర్లేదు, వెళ్ళు” అన్నారు గట్టిగా.

“బాబుగారూ! ఇంకెప్పుడూ ఇలా జరగదు. మరోసారి ఆలస్యం చెయ్యను. ఈసారికి తప్పు కాయండి” అన్నాడు కన్నీళ్లతో కజాకీ.

“అసలు ఎందుకాలస్యమైందో అది చెప్పు.”

కజాకీ ఏం మాట్లాడలేకపోయాడు. విచిత్రంగా నా నోరు గూడా పెగల్లేదు. నాన్నగారి కోపం మరింత ఎక్కువైంది. కజాకీ మౌనంతో నాన్నగారి చిరాకు మరింత పెరిగిపోయింది. నాకయితే ఆయన దగ్గర ఏ మాత్రం చనువు లేదు. ఆయన నాకంత ప్రేమా, చనువుగా వుండే సమయమేమీ ఇవ్వలేదు. అసలాయన రోజులో రెండు సార్లు ఒక్కో గంట భోజనం చేయటానికి మాత్రమే ఇంటికొచ్చేవారు. మిగిలిన రోజంతా, సెలవులూ, పండగల్లో కూడా ఆయన ఆఫీసులోనే వుండేవారు. తనకు సహాయకులుగా ఎవరినైనా పంపమని ప్రభుత్వానికి ఎన్నోమార్లు, అర్జీలు పెట్టుకున్నారు. కాని ఫలితమేం లేదు, ఎప్పుడైనా ఆయనకు కోపం వస్తే అమ్మ మాత్రమే ఆయనకు సర్ది చెప్పగలదు. కాని ఇప్పుడు అమ్మ ఆఫీసుకు రాలేదు గదా? నా కళ్ల ముందే పేద కజాకీ తన తలపాగా, పోస్టాఫీసువారి పట్టీ లాంటి వన్నీ చేసి అక్కడ పెట్టేశాడు. “ఇక వెళ్ళు” అన్న కఠినమైన ఆజ్ఞను పాటించి కజాకీ మౌనంగా బయటికొచ్చేశాడు.

చిన్న పిల్లవాడిని, నేనేం చేయగలను? ఇప్పుడు నా దగ్గరొక బంగారు నాణెమున్నట్లయితే దాన్ని కజాకీకి ఇచ్చేవాడిని. మీరు ఉద్యోగం నుండి తీసేసినా కజాకీకి వెంట్రుకంత నష్టం లేదని నాన్నగారికి తెలియజేసేవాడిని. ఒక యోధుడు తన కత్తిని, తన పదవిని చూసుకుని ఎంత గర్వపడేవాడో కజాకీ కూడా తన బంట్రోతు గుర్తులను, ఆ ఉద్యోగాన్ని చూసుకుని అంత గర్వపడేవాడు.

కజాకీ వణికే చేతులలో, కారే కన్నీళ్లను కూడా తుడుచుకోలేక పోతున్నాడు. ఈ గందరగోళానికి కారణమైన జింకపిల్ల మాత్రం తల్లి ఒడిలో వున్నంత నిశ్చింతగా నా ఒడిలో ముఖం దాచుకుని ప్రశాంతంగా ఒదిగి కూర్చున్నది. నిశ్శబ్దంగా బయటకు నడిచాము.

మా ఇంటి దగ్గరకు రాగానే “భయ్యా! లోపలకి వెళ్ళు. చీకటి పడింది” అన్నాడు. నేను నా ఏడుపు ఆపుకోలేక పోతున్నాను. వెక్కిళ్ళ మధ్య అతనిలో ఏం మాట్లాడలేకపోతున్నాను.

“భయ్యా! నేనెక్కడికి పోతాను? బాబుగారు బంట్రోతు ఉద్యోగమైతే తీసేశారు కాని నిన్ను నా భుజాల మీద కెక్కించుకుని తిప్పే పనిలో నుండి తీసెయ్యరుగా, నేను రోజూ వస్తాను, మనిద్దరం ఎప్పటి లాగానే వుందాము. అమ్మగారితో చెప్పు. నన్ను క్షమించమన్నానని కూడా చెప్పు” అంటూ వెళ్లిపోయాడు.

ఇంట్లోకి ఏడుస్తూ పరుగెత్తుకెళ్ళాను. అమ్మ వంటిట్లో నుంచి బయటకు వచ్చింది, ఆమెకు ఏం చెప్పలేక నా ఏడుపును మరింత ఎక్కువ చేశాను.

నన్ను చూసి, “ఏమైంది బేటా? నాన్నగారేమైనా అన్నారా? ఇంటికి వచ్చిన తర్వాత, నేను కనుక్కుంటానులే” అన్నది ఊరడిస్తూ.

నేను తల అడ్డంగా మాత్రం ఊపాను.

“ఏ పిల్లలు కొట్టారు? వాళ్ల దగ్గరకు ఇంక వెళ్లకు”

నేను “కజాకీ, కజాకీ” అని మాత్రం గొంతు పెగుల్చుకుని అతి కష్టం మీద అనగలిగాను.

“కజాకీ కొట్టాడా? రేపు వాడి సంగతి తేలుస్తాను. ఉద్యోగంలో నుంచి పీకించివేస్తాను. ఏమనుకుంటున్నాడో?” అన్నది కోపంగా.

“లేదు, లేదు. కజాకీ నన్నేం కొట్టలేదు. నాన్నగారే అతణ్ణి  ఉద్యోగం లోంచి తీసేశారు. పోస్టాఫీసు వారి గుర్తులన్నీ కూడా లాగేసుకున్నారు,”

“మీ నాన్నగారు ఇంత దారుణమైన పని ఎలా చేశారు, అతను చాలా మంచివాడు, పనిలో జాగ్రత్తగా వుండే మనిషిని ఎందుకు తీగేసారు!”

“ఈ రోజు టపా తీసుకుని ఆల్యంగా వచ్చాడు” అని చెప్తూ జింకపిల్లను ఒళ్ళోకి తీసుకున్నాను. దానికి కొత్త పాతా ఏం లేకుండా కిందకు ఒక్క దూకు దూకింది. అది చూసి అమ్మ, అది నన్నెక్కడ గాయపరుస్తుందోనని చాలా భయపడిపోయింది. నా చేతుల్ని గట్టిగా పట్టుకున్నది.

అప్పటి దాకా వెక్కి వెక్కి ఏడ్చిన నేను అమ్మ భయాన్ని చూసి పగలబడి నవ్వాను.

“అరే, ఇదైతే జింకపిల్ల. నీకు ఇదెక్కడ దొరికింది?” అన్నది అమ్మ.

నేను విషయమంతా చెప్పాను. “కజాకీ కాకుండా మరెవ్వరూ జింకపిల్లను పట్టుకోలేక పోయేవారు. అయిదారు గంటల పాటు శ్రమపడి, గాలితో పోటీపడి పరుగెత్తుకెళ్ళి మరీ దీన్ని పట్టుకొచ్చాడు. దాంతో ఆలస్యమైంది. నాన్నగారు కోపం చేశారు. ఉద్యోగం పీకేశారు. ఆ పేదవాడు ఇప్పుడేం చేస్తాడు? ఎక్కడికి పోతాడు? ఆకలితో మాడి చచ్చిపోతాడు” అని మళ్లీ ఏడుపు మొదలుపెట్టాను.

“కజాకీ ఎక్కడున్నాడు? అతడిని పిలువు,”

“బయటే ఉన్నాడమ్మా. అమ్మగారిని క్షమించమన్నానని కూడా చెప్పాడు.”

అమ్మ ఇప్పటి వరకు ఇదంతా నా ఏక్షన్ మాత్రమే అనుకున్నది. కానీ తనకు క్షమాపణలు కూడా చెప్పమన్నాడన్న మాటలు విని ఇప్పుడు నిజమని నమ్మింది. వెంటనే బయటికొచ్చి “కజాకీ! కజాకీ!” అని కేకలు పెట్టింది. నేను కూడా అరిచి పిలిచాను. కాని అతనక్కడ లేడు.

***

ఆ రాత్రికి నేను మామూలు గానే అన్నం తిన్నాను, ఎంత దుఃఖమున్నా పిల్లలు తిండి తినడం మాసుకోలేరేమో. అందులో ఆ రాత్రి అమ్మ బాసుంది కూడా చేసింది. తిన్నాను కాని అర్ధరాత్రి వరకూ కజాకీ గురించిన ఆలోచనలే. నా దగ్గరే గనక డబ్బులుంటే అతనికి ఒక లక్ష రూపాయలైనా ఇచ్చేవాడిని. నాన్నగారితో ఏం మాట్లాడలేని నిస్సహాయుడనయ్యాను, పాపం కజాకీ!

ఆకలితో వాళ్ల కుటుంబం చనిపోతుందా! అతను రేపు వస్తాడో లేదో? నన్ను మాత్రం బయటికి రమ్మని చెప్పాడు. రేపు అతనికి తినడానికి ఏమైనా ఇవ్వాలి అని గాలిమేడలు కడుతూ నిద్రలోకి జారుకున్నాను.

మర్నాడు పగలంతా జింకపిల్లలో గడిపాను. దానికి ‘మున్నూ’ అన్న పేరు పెట్టాను. దానిని నా ఇరుగు పొరుగు స్నేహితులందరికీ చూపించాను. మున్నూ ఒకరోజులోనే నాకు బాగా అలవాటయ్యింది. నా చుట్టూ చుట్టూ తిరగసాగింది. ఇప్పుడు నా ఆలోచనలన్నీ దాని మీదే. నేను పెద్దయ్యాక కట్టబోయే భవంతిలో ఒక గదీ, గదిలో మంచం, మున్నూ షికారు తిరగటానికి, నాలుగు చక్రాల బండి అన్నింటినీ తయారు చెయ్యాలన్న కలలు గన్నాను,

ఈలోగాగా సాయంత్రమయింది. జింకపిల్ల నొదిలేసి రోడ్డు మీదకొచ్చి కజాకీ కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాము, అతనికిప్పుడు పనేం లేదు. మరెందుకొస్తాడు? నా కోసమా! కజాకీ ఆకలితో చనిపోడు కదా అన్న భయం వేసింది. సంధ్యా సమయమయింది. అమ్మ సంధ్యా దీపం పెట్టి పెట్టే పనిలో పడింది. నేను పిల్లిలాగా కొంత పిండిని తీసుకుని ఒక బుట్టలో పోసుకుని బయటకు వచ్చాను. బుట్టలో నుంచి రాలే పిండిని గమనించుకోలేదు. చేతుల కంటిన పిండిని ఒంటికున్న లాగుకు తుడుచుకుంటూ వెనక్కి తిరిగి చూసుకుంటూ బయటకు పరుగెత్తాను. అచ్చం తపాలా బంట్రోతు లాగానే కజాకీ వచ్చాడు.

“కజాకీ! ఈ తలపాగా, ఇవన్నీ ఎక్కడ నుండి తెచ్చావు?” అనడిగాను. నన్నెత్తుకుని తన భుజాల మీద కూర్చోబెట్టుకుని “ఇదివరకు, ఈ బంట్రోతు గవర్నమెంటుకు బానిస. ప్రభుత్వ ఉద్యోగి. ఇప్పుడు నీ సేవకుడను మాత్రమే భయ్యా.” అన్నాడు.

అతని కళ్లు పిండి బుట్టపై పడ్డాయి. “ఇదేంటి భయ్యా?” అనడిగాడు.

“నీ కోసమే తెచ్చాను. మీరంతా ఆకలితో వుంటారనిపించింది. ఈరోజు ఏం  తిన్నారు?!”

అతని కళ్లలోకి చూడలేక అతని భుజం మీద కూర్చున్నాను. కజాకీ గొంతు పూడుకుపోయింది. “భయ్యా! ఈ పిండితో నేను కేవలం ఎండు రొట్టెలు మాత్రమే చేసుకుని తినగలనా? ఇందులోకి పప్పు, ఉప్పు, నెయ్యీ నేను ఎలా తెచ్చుకోగలను!!”

నా తప్పు తెలిసి వచ్చి సిగ్గుపడ్డాను. అవును కదా? కేవలం పిండి ఏం చేసుకుంటారు? ఇప్పుడు రొట్టెల లోకి కావలసినవన్నీ ఎలా తీసుకురావాలి? అమ్మ చూడకుండా చాటుగా పిండి మాత్రం తేగలిగాను. అమ్మ నడిగితే ఏం ఇవ్వదు. ఆమె ప్రతి పైసా ఇవ్వటానికి నన్ను గంటల తరబడి ఏడిపిస్తుంది. ఒక్కసారిగా నాకు ఒక్క విషయం గుర్తుకొచ్చింది. నేను నా పుస్తకాల మధ్య కొన్ని అణాల డబ్బులు దాచి వుంచాను, ఎందుకోసం అలా దాచివుంచానో తెలియదు, ఇప్పుడు మాత్రం అలా చెయ్యటం లేదు.

నాన్నగారు నన్ను ఎప్పుడూ ప్రేమగా దగ్గరకు తీయలేదు గాని డబ్బులు మాత్రం బాగానే వచ్చేవారు. బహుశా ఆయిన పనిలో పడి ప్రేమకు బదులు డబ్బులు ఇచ్చేవారనుకుంటాను. అమ్మ స్వభావం దీనికి పూర్తిగా విరుద్ధం. నేను దేని కోసమైనా ఏడుస్తానని బాధపడతానని గాని భయం లేదు. నేను రోజంతా ఏడ్చినా సరే ఆమె తన దృష్టిని మాత్రం తన పని నుండి మరల్చుకునేది గాదు. తనకు నేనంటే చాలా ఇష్టం. కాని డబ్బు విషయం వచ్చేసరికి ఆమె వైఖరి మారిపోతుంది. నాకు సరియైన పుస్తకాలు కూడా లేవు. ఒక సంచీలో నాలుగైదు పోస్టాఫీసు ఫారాలను మడిచి పుస్తక రూపం తయారు చేసి ఇచ్చేవారు. ఇప్పుడా పుస్తకాలలో వుంచిన డబ్పు పప్పు, ఉప్పు, నెయ్యి కొనటానికి సరిపోదు కదా అన్న ఆలోచన వచ్చింది. అయినా సరే, కజాకీతో “నేను ఉప్పు, పప్పు, నెయ్యి అన్ని తెస్తాను. ప్రతిరోజూ నాకోసం వస్తావు గదా?” అనడిగాను.

“భయ్యా, నాకు రోజూ ఆహారం ఇస్తుంటే ఎందుకు రాను?”

“తప్పకుండా ఇస్తాను. నువ్వు మాత్రం రావాలి.”

“అలాగే భయ్యా. రోజూ వస్తాను” అని కజాకీ మాట ఇచ్చాడు.

నేను వెంటనే లోపలికి పరుగెత్తుకెళ్ళి పుస్తకాల్లో వున్న డబ్బంతా తీసుకున్నాను. కజాకీ నా దగ్గరకి రోజూ రావటానికి నా దగ్గర కోహినూర్ వజ్రమున్నా అతనికి ఇవ్వటానికి వెనుకాడననుకున్నాను.

డబ్బులతో కజాకీ దగ్గరకెళ్ళి “ఇది నా స్వంతం. నీవే ఈ డబ్బు తీసుకో” అన్నాను.

“భయ్యా! అమ్మ నిన్ను కొడుతుంది. ఆ కజాకీ నిన్ను బాగా మాయ చేశాడు. డబ్బంతా అతనికి ఇచ్చి వచ్చావు అని కోప్పడుతుంది. నాకీ డబ్బులు వద్దు. నువ్వే మిఠాయిలు కొనుక్కుని, డబ్బాలో పెట్టుకుని తిని. నేనేం ఆకలితో మాడి చావను. నా రెండు చేతులూ బాగానే వున్నాయి. వాటిలో సత్తువ వున్నది. నా కుటుంబం ఆకలి తీర్చటానికి ఎంతైనా కష్టపడతాను.”

“ఈ డబ్బు నాదే. నన్ను ఎవరేం అనరు.” అని ఎంత నచ్చజెప్పినా అతను తీసుకోవటానికి ససేమిరా ఇష్టపడలేదు. కాసేపు నన్ను అటూ ఇటూ తిప్పి, నాతో ఆడి పాడి తిరిగి మా ఇంటికి తీసుకొచ్చాడు. నేనిచ్చిన పిండి బుట్ట కూడా అక్కడే వుంచి వెళ్లి పోయాడు.

ఇంట్లోకి అడుగుపెట్టగానే అమ్మ కోప్పడటం మొదలుపెట్టింది. “దొంగతనాలు మొదలు పెట్టావా? నువ్వు ఇంట్లో పిండి కాజేసుకెళ్లిన సంగతి నాకు తెలియదనుకున్నావా? ఎవరి కోసం తీశావు? నిజం చెప్పు, లేకపోతే తోలు వలుస్తాను.” అని గట్టి గట్టిగా అరిచింది.

మా నాయనమ్మ చనిపోగానే ఇంటి పెత్తనమంతా మా అమ్మ చేతిలోకి వచ్చేసింది. ఆమె సివంగిలాగా మారి పోయింది..

నేను గొణిగినట్లుగా అన్నాను “పిండిని ఎవరికీ ఇవ్వలేదమ్మా!”

“ఎవరికీ ఇవ్వలేదా? పిండి నువ్వు తీసుకెళ్తుంటే ఎలా జారిపోయి వాకిలంతా పడిందో చూడు”

అమ్మ ఎంత అరిచినా నా నోటి నుండి ఏ జవాబూ రాలేదు. చెప్తే అమ్మ ఎంత గందరగోళం చేస్తుందో తెలుసు. ఆ భయంతోనే నిశ్శబ్దంగా వుండిపోయాను. లోపలికి తెచ్చిన పిండి బుట్టను చూడగానే నా లోని శక్తి అంతా హరించుకు పోయినట్లుగా అయింది.

నేను బొమ్మలాగా నిలబడి పోయిన సమయంలో బయటి నుంచి అకస్మాత్తుగా “అమ్మగారూ!” అన్న కజాకీ గొంతు వినపడింది. “పిండి బుట్ట ఇక్కడే వుందమ్మా. నాకివ్వటానికే భయ్యా మీకు చెప్పకుండా తెచ్చాడు” అన్నాడు. ఆ మాటలు విన్న అమ్మ తలుపు దగ్గరకు వెళ్లింది. తల మీద ముసుగు గూడా సవరించుకోలేదు. ఆమె బయటికెళ్లి కజాకీతో ఏం మాట్లాడిందో తెలియదు కానీ, ఖాళీ బుట్టతో లోపలికి మాత్రం వచ్చింది. ఆ తర్వాత గదిలోకి వెళ్ళి పెట్టె లోనుంచి ఏదో తీసి మరలా వాకిట్లోకి వెళ్ళింది. ఆమె మూసివున్న గుప్పెటలో ఏముందో నాకర్థం కాలేదు.

నేను కూడా అమ్మతో పాటు బయటికి వెళ్ళాను. “కజాకీ!, కజాకీ!” అని అమ్మ చాలా సార్లు పిలిచింది, కానీ అతను బదులివ్వలేదు.

“వెళ్లిపోయినట్లున్నాడమ్మా, నేను వెళ్లి రోడ్డు మీద వెదకనా?” అన్నాను,

“ఇంకెక్కడుంటాడు? వెళ్లిపోయుంటాడు. పద లోపలికి వెళదాం” అంటూ అమ్మ లోపలికి దారితీసింది. “అతను చాలా మొహమాటస్థుడు. పిండి తీసుకోవటానికి అస్సలు ఇష్టపడలేదు. ఆ పేదవాడి మీద నాకూ బోలెడు జాలి వుంది. వాళ్లింట్లో తినటానికి ఏమై వున్నాయో లేదో తెలియదు. నేను కాస్త డబ్బిద్దామని లోపలికి వచ్చేసరికి చీకట్లో కనబడకుండా మాయమయ్యాడు.” అన్నది బాధగా.

అప్పుడు నాక్కూడా ధైర్యం వచ్చి నా పిండి దొంగతనం గురించి చెప్పాను. తల్లిదండ్రులే పిల్లల్ని ప్రభావితుల్ని చెయ్యిగలరు. వాళ్లే పిల్లలకు ఎన్నో నేర్చగలరు.

“నన్ను పిండి అడిగితే నేను కాస్త పిండి నీకు ఇవ్వకపోదునా!” అన్నది అమ్మ జాలిగా.

నేను అమ్మ వంక చూస్తూ మనసులో ఇలా అనుకున్నాను ‘నీకిప్పుడు అతని పట్ల జాలి కలిగింది కాబట్టి ఆ మాట అంటున్నావు. అదే నేను అడిగితే నన్ను చావగొట్టటానికి  పరుగెత్తుకొచ్చే దానివి’. ఏది ఏమైతేనేం అమ్మకు కజాకీ అంటే, జాలి అభిమానం కలిగాయి. రోజూ అతనికి తినడానికి పెడుతుంది. అతనేమో నన్ను తన భుజాలపైకి ఎక్కించుకుని ప్రతిరోజూ షికారుకు తిప్పుతాడని ఆలోచించి సంబరపడ్డాను.

మరుసటి రోజు పగలంతా మున్నూతో ఆడుకుంటూ గడిపాను, సాయంత్రం నాలుగు గంటలు కాగానే వెళ్లి రోడ్డుపై నిలబడ్డాను. ఎక్కడా కజాకీ జాడ లేదు, వీధి దీపాలు కూడా వెలిగించారు. కానీ అతను రాలేదు. దారంతా నిశ్శబ్దంగా అయిపోయిన తర్వాత ఏడుస్తూ ఇంట్లోకి వచ్చాను.

“ఏమైంది? నీ దోస్తు రాలేదా?” అమ్మ గ్రహించింది.

అమ్మ మాటతో నా ఏడుపు మరింత ఎక్కువైంది.

“ఏడవకు” అంటూ అమ్మ నన్ను దగ్గరకు తీసుమని ఓదార్చింది, తను కూడా అతడ్ని గురించి చాలా బాధపడింది. ఆమె గ్గూడా మనసు భారమయ్యింది.

“చూడు నాన్నా. ఇంక నువ్వు ఏడవకు, నేను రేపే కజాకీ ఇంటికి ఒక మనిషిని పంపి అతణ్ణి తీసుకురమ్మని చెప్తాను” అని నన్ను ఊరడించింది.

ఆ రాత్రి నేను ఏడుస్తూనే నిద్ర పోయాను.

మర్నాడు పొద్దున్నే లేచి “అమ్మా! మనిషిని త్వరగా పంపు, కజాకీని త్వరగా తీసుకొని రమ్మని కూడా చెప్పు.” అన్నాను.

“మనిషిని ఇందాకే పంపించాను. కజాకీ తప్పకుండా వస్తాడులే” అన్నది.

నాకు బోలెడంత సంతోషం కలిగింది. మున్నూతో ఆటల్లో పడ్డాను. అమ్మ ఏదన్నా మాట అన్నదంటే చేసి తీరుతుంది. ఆ మాట ప్రకారమే ఒక తపాలా బంట్రోతును కజాకీ ఇంటికి పంపింది. నేను మున్నూను తీసుకుని బయట ఆడుకోవటానికి వెళ్లి 10 గంటలకు తిరిగి వచ్చాను. కజాకీ రాత్రి నుండి ఇంటికే రాలేదని అతని భార్య కంగారుపడి కంటికి కడివెడుగా ఏడుస్తున్నదట. చుట్టు పక్కల వాళ్ళేమో కజాకీ ఎక్కడికో పారిపోయాడని చెప్పుకుంటున్నారన్న వార్తతో బంట్రోతు వచ్చాడని అమ్మ బాధగా అన్నది. మా పిల్లల హృదయాలు ఎంత సున్నితంగా వుంటాయో ఎవరి ఊహకు అందని విషయం. మా భావాలను తెలియజెయ్యటానికి సరైన భాష వుంటుందా? మా మనసుల్ని బాధపెట్టేదేమిటో, గుండెలో ముళ్లు గుచ్చుకొన్నట్లుగా ఎంత విలవిలలాడుతామో పదేపదే ఎందుకేడుస్తామో, ఎంత నిరాశలో కూరుకుపోతామో ఎవరికి తెలుస్తుంది? ఆటాపాటా లేకుండా మౌనంగా ఎందుకు వుండిపోతామో ఎవరు అర్థం చేసుకుంటారు? ప్రస్తుతం నేను అదే అయోమయ స్థితిలో పడిపోయాను. ఇంట్లోకీ, బయటకీ, మరోసారి రోడ్డు మీదకూ తిరుగుతున్నాను. కళ్ళు మాత్రం కజాకీ కోసం వెదుకుతునే వున్నాయిు. అతను ఎక్కడున్నాడు? అందరూ అనుకున్నట్లుగా పారిపోలేదు గదా? రకరకాల ఆలోచనలు వస్తున్నాయి.

ఆ రోజు నేను మూడు గంటలకే రోడ్డు మీద కొచ్చి పిచ్చివాడిలా తిరగసాగాను. అకస్మాత్తుగా ఒక వీధిలో కజాకీ కనిపించాడు. “కజాకీ, కజాకీ!” అని అరుస్తూ అటువేపు పరుగెత్తాను. కానీ అతను ఎటు మాయమయ్యాడో తెలియలేదు. ఆ వీధంతా ఈ చివరి నుండి ఆ చివరి వరకూ చూశాను. కానీ ఎక్కడా కజాకీ జాడలేదు.

ఇంటికి వెళ్ళాక అమ్మతో ఈ విషయం చెప్పాను. అది విని అమ్మ కూడా కంగారుపడింది.

ఆ రోజు తర్వాత కజాకీ జాడ లేదు. నెమ్మదిగా నేను మున్నూతో ఆటల్లో పడి కజాకీని కాస్త మర్చిపోయాను. పిల్లలు మొదట్లో ఎంత ఎక్కువగా వ్యక్తుల మీద ఇష్టం పెంచుకుంటారో, ఆ తర్వాత వాళ్ళు దూరమయితే, కొంత నిష్ఠూరంగా మారిపోతారు. పిల్లలు ఆడుకునే బొమ్మ నాలుగు రోజులు ఆడుకున్న తర్వాత అది విరిగిపోతే, అప్పటివరకూ ఉన్న ఇష్టాన్ని వదిలిపెట్టి ఆ బొమ్మను విసిరివేసి వున్నట్లు.

అలా పది పన్నెండు రోజులు గడిచాయి. ఆ రోజు మధ్యాహ్నం నాన్నగారు భోజనం చేస్తున్నారు. నేను మున్ను కాళ్లకు గజ్జెలు కట్టే పనిలో పడ్డాను. ఒక స్త్రీ తల మీద ముసుగు లేకుండా వచ్చి వాకిట్లో నిలబడింది. మురికి బట్టలతో బీదరికం వుట్టిపడుతున్నట్లుగా కనబడుతోంది. మనిషి మాత్రం చాలా అందంగా వున్నది.

వాకిట్లో నేను కనపడగానే “భయ్యా! అమ్మ గారెక్కడ వున్నారు?” అని అడిగింది. నేను ఆమె దగ్గరగా వెళ్లాను. “నువ్వెవరు? నీకేం కావాలి? ఏమైనా అమ్ముకోవటానికి వచ్చావా?” అనడిగాను.

“లేదు భయ్యా. నేనేమీ అమ్ముకోవటానికి రాలేదు. నీ కోసం తామర గింజల్ని మీ తపాలా బంట్రోతు పంపించాడు” అంటూ చేతిలోని పొట్లం చూపించింది.

నేను ఎంతో వేగిరపాటుతో “కజాకీ.. కజాకీ పంపించాడా?” అనడిగాను.

ఆమె అవునని తలాడించి పొట్లం విప్పనారంభించింది.

ఇంతలో అమ్మ వంట ఇంట్లో నుండి వచ్చింది. “నువ్వు కజాకీ భార్యవా?” అనడిగింది.

అవునని తలాడిస్తూ అమ్మ కాళ్ళకు నమస్కరించింది.

“ఏ రోజైతే మీ దగ్గర పిండి తీసుకొచ్చాడో ఆ రోజు నుండీ జబ్బుపడ్డాడు. అతని మనసంతా ‘భయ్యా’నే నిండివున్నాడు. మాటిమాటికీ ‘భయ్యా’ అంటూ గుమ్మం వైపుకు పరుగెత్తుకుపోతాడు. ఆయనకేమైందో నాకర్థం కావటం లేదు. ఒకరోజు ‘ఒక గల్లీలో చాటుగా వుండి భయ్యాను చూసొచ్చాను. కాని భయ్యాకు కనపడకుండా పారిపోయి వచ్చాన’ని నాకు చెప్పాడు. మీ దగ్గరకి రావటానికి బిడియ పడుతున్నాడు.”

“ఆఁ.. అమ్మా! ఆ రోజు నేను చెప్పానే! కజాకీని చూశానని” అన్నాను నేను.

“ఇల్లు ఎలా గడుస్తుంది మీకు?” అమ్మ ఆరాగా అడిగింది.

‘మీ దయ వలన తిండికేమీ లోటు లేదు. ఇవాళ ఉదయమే లేచి చెరువు దగ్గరకెళ్ళాడు. వెళ్లేటప్పుడు ఎంతో చెప్పాను – జబ్బు మనిషివి, చలి గాలిలో, నీళ్లలో దిగవద్దని. కానీ వినకుండా వెళ్ళిపోయాడు. కాళ్ళూ వణుకుతున్నాయి. అయినా ఓపిక చేసుకుని వెళ్లి ఈ తామర గింజలు కోసుకొచ్చాడు. భయ్యా కిచ్చిరమ్మని నేన్ను పంపాడు. భయ్యా ఎలా వున్నాడో అడిగి మరీ రమ్మన్నాడు.”

నేను ఆత్రంగా తామర గింజల్ని ఎంతో ఇష్టంగా తినటం మొదలుపెట్టాను. అమ్మ విప్పారిన కళ్ళతో కజాకీ ప్రేమను గురించి వింటూ విభ్రాంతికి లోనయ్యింది. “భయ్యా బాగున్నాడని చెప్పు” అన్నది.

“భయ్యా గట్టిగా నిన్ను రమ్మన్నాడని కజాకీకి చెప్పు. తను రాకపోతే ఇంకెప్పుడూ మాట్లాడనన్నానని కూడా చెప్పు” అని నేను అంటూ వుండగానే నాన్నగారు భోజనం ముగించి బయటకు వచ్చారు. ఆమె వంక చూస్తూ “నువ్వు ఇంటికి వెళ్లి కజాకీని వెంటనే పోస్టాఫీసుకు రమ్మన్నానని చెప్పు. ఆలస్యం చేస్తే మరెవరైనా ఆ ఉద్యోగంలో చేరతారనీ చెప్పు” అన్నారు,

ఆమె ముసుగు సవరించుకుంటూ నాన్నగారికి నమస్కరించి వెళ్ళిపోయింది. వెనుక నుంచి అమ్మ ఎంత పిలిచినా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది.

“నిజంగా కజాకీని తిరిగి తపాలా బంట్రోతుగా చేర్చుకుంటున్నారా?” అనడిగింది అమ్మ.

“అబద్ధం ఎందుకు చెప్తాను? నేను అతను మానేసిన ఐదవ రోజునే మరలా జాయినింగ్ రిపోర్టు తయారు చేసి వుంచాను” అన్నారు.

“మీరు నిజంగా చాలా మంచి పని చేశారు” అన్నది అమ్మ సంతోషంగా

అతని జబ్బుకు అదే మందన్నారు నాన్నగారు.

మరురోజు పొద్దున్నే లేచి చూసేసరికి కజాకీ కర్ర సాయంతో నడుచుకుంటూ నెమ్మదిగా వస్తున్నాడు. అతను చాలా బలహీనంగా, సన్నగా అయిపోయాడు. వృద్ధాప్యం మీద పడినట్లుగా వంగబడి వున్నాడు. పచ్చని చెట్టు వడబడిపోయినట్లుగా కూడా వున్నాడు. నేను అతన్ని చూట్టంతోనే పరుగెత్తుకెళి అతని నడుమును చుట్టేశాను. కజాకీ నా బుగ్గలపై ముద్దులు పెట్టి పైకి లేపాడు. తన భుజాలపై కూర్చోబెట్టుకొవటానికి ప్రయత్నించాడు కానీ సాధ్యపడలేదు. అప్పుడతను జంతువులాగా తన చేతులు, మోకాళ్ళు నేలకు ఆనించి వంగున్నాడు. నేను అతని వీపుపై ఎక్కి కూర్చున్నాను. ఇద్దరం పోస్టాఫీసు వైపుకు బయల్దేరాం. నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. అంతకంటే సంతోషంలో కజాకీ వున్నాడు.

పోస్టాఫీసుకు వెళ్ళగానే నాన్నగారు కనిపించారు. “కజాకీ! నువ్వు మళ్ళీ నీ పనిలో చేరొచ్చు. ఇంకెప్పుడూ ఆలస్యం చేయకు” అన్నారు.

కజాకీ ఏడ్పు ఆపుకుంటూ నాన్నగారి కాళ్ళపై పడ్డాడు.

***

రెండు ఆనందాలు ఒకేసారి అనుభవించమని నా జీవితంలో రాసిపెట్టి లేదు. మున్నూ లభించగానే, కజాకీని దూరం చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కజాకీ తిరిగి వచ్చాడు. కాని మున్నూ నా నుంచి వెళ్లిపోయింది. ఈరోజు వరకూ ఆ బాధను మర్చిపోలేక పోతున్నాను. మున్నూ నా పళ్ళెంలోనే కలబడి తినేది. నేను తినటానికి వచ్చేవరకూ తనూ ఏం తినేది కాదు. మున్నూకు అన్నమంటే, అందులోనూ బాగా నెయ్యి కలిసిన అన్నమంటే చాలా ఇష్టం, నాతో పాటు నిద్ర లేచేది. తనకి బాగా శుభ్రం ఎక్కువ. మూత్ర విసర్జన కోసం ఇంటి నుంచి దగ్గరలో వున్న పొలం లోకి వెళ్లేది. ఏ కుక్కను కూడా ఇంటి ఛాయలకు కూడా రానిచ్చేది కాదు. కుక్క అరుపు వినపడితే చాలు తినే అన్నం కూడా విడిచిపెట్టి బయటకు పరుగు తీసేది. దాన్ని తరిమి వచ్చేది.

ఆ రోజు నేను పోస్టాఫీసు‍లో కజాకీని విడిచి పెట్టి ఇంటికి తిరిగి వచ్చి అన్నం తినబోయే సమయానికి మున్నూ కూడా వచ్చి పక్కన చేరింది. నాతో పాటే ఒకటి రెండు ముద్దలు తిన్నది. ఇంతటి మా పెరట్లో మంచి పక్కవారి జూలు కుక్క అరుపు వినిపించింది. దాంతో మున్నూ బయటికి పరుగులు పెట్టింది. స్థానబలం లేదు కాబట్టి ఆ జూలు కుక్క పారిపోయింది. కానీ మున్నూ వెంటనే ఇంట్లోకి రాకుండా ఆ కుక్కను వెంబడించి పోయింది. ఒకదాని వెంబడి ఒకటి మైదానం లోకి పరుగులు పెట్టాయి. ఆ కుక్క యమదూత అని మున్నూకు తెలియలేదు. అక్కడ మున్నుకు రక్షణగా నేను లేను. లోగడ కుక్కను తరమివేసిన గర్వంతో ఒంటరిగానే ఆ కుక్కను ఎదుర్కున్నది. మైదానంలో మున్నూకు కాని, జూలు కుక్కకు కాని స్థానబలం లేదు. అదే ఎవరిళ్ళల్లో వారికయితే ఇంటి యజమాని ఆసరా వుంటుంది. మైదానంలోకి వెళ్ళీ వెళ్లగానే ఆ జూలు కుక్క, మున్నూను ఒడిసి పట్టుకుని మెడను నొక్కేసింది. పాపం మున్నూ కిక్కురుమనలేకపోయింది. ఇరుగు పొరుగు వారు చూసి కేకలు పెట్టసాగారు. ఆ కేకలు విని నేను మైదానం వైపుకు పరుగెత్తాను. ఎదురుగా మున్నూ చనిపోయి పడివున్నది. జూలు కుక్క జాడ మాత్రం లేదు.

హిందీ మూలం: మున్షీ ప్రేమ్‌చంద్

తెలుగు సేత: దాసరి శివకుమారి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here