తప్పెవరిది?

0
9

[dropcap]“సా[/dropcap]ర్! నమస్కారం….”

“రా బాబు రా….” చూస్తూనే రామనాథంకు అతని వినయం నచ్చింది.

“నీ పేరేంటన్నావు?”

“సార్, వినయ్…!”

“ఆహా…. పేరుకి తగ్గట్టుగానే ఉన్నాడు! రామనాథం మనసులో అనుకున్నాడు.

“సరే! ఇల్లు చూస్తావా?”

“ఔను సార్” వినయ్ చుట్టూ చూస్తూ జాగ్రత్తగా లోపలికి అడుగుపెట్టాడు.

“ఇదిగో నువ్వు ఇల్లు చూస్తూ ఉండు, నేను బయట ఫోన్ మాట్లాడుతుంటాను” రామనాథం హడావిడిగా బయటకు వచ్చి జేబులో మోగుతున్న ఫోన్ ఎత్తాడు.

“అబ్బా ఏమిటి?.. అయిదు నిమిషాల్లో రెండుసార్లు ఫోన్ చేస్తే ఎలా?” తన భార్యను విసుక్కున్నాడు.

“అరే అద్దెకు వచ్చినవాళ్ళు ఎలా ఉన్నారో అడుగుదామని….”

“ఇదిగో ఇప్పుడే వచ్చాడు. ఇంకేమి విషయాలు తెలుసుకోలేదు.”

“సరే! నిన్న అనుకున్నవన్నీ మరిచిపోకుండా అడుగు, గుర్తుంది కదా మన చుట్టాలింట్లో ఏం జరిగిందో. పక్కింటి వాళ్ళు రోజూ చెత్త వీళ్ళింట్లో వేస్తున్నారని తిట్టినందుకు కేసు పెట్టారు. ముందు వెనుక అన్నీ తెలుసుకో, మరీ మరీ చెబుతున్నా. ఇక్కడ పనిపిల్ల ఉంది. అన్ని విషయాలు నేను మాట్లాడలేను……”

“అలాగే అలాగే అర్థం అయింది. నేనూ ఎక్కువగా మాట్లాడలేను. పని అయ్యాక ఫోన్ చేస్తా” బయటకు వచ్చిన వినయ్‌ని చూస్తూ రామనాథం పలుకరించాడు “ఇల్లు చూసావా?”

“చాలా బాగుంది సార్, మంచి కళగా ఉంది. నాకు అద్దెకు తీసుకోవడం ఇష్టమే. ఇక మీదే నిర్ణయం. మీరు ఇప్పుడంటే ఇప్పుడే అడ్వాన్స్ చెక్కుగా ఇచ్చేస్తాను….” వినయ్ నవ్వాడు.

“మంచి విషయం చెప్పావు, సరే! రా, కూర్చొని మాట్లాడుకుందాం. మరి నువ్వు ఒక్కడివే వచ్చావు. నీ కుటుంబం? వారికి నచ్చనవసరం లేదా?”

“పర్లేదు సార్, నా భార్య అమ్మా నాకు నచ్చితే చాలన్నారు. అయినా ఇక్కడ ఇల్లు తీసుకునేది పిల్లల స్కూళ్ళు దగ్గరవుతాయని. కాబట్టి ఇంటితో పెద్దగా పని లేదు.”

“అంతేలే! పిల్లలు కదా ముఖ్యం, ఇంతకీ నీకు ఇద్దరు పిల్లలు కదూ?”

“ఔను సార్! ఇద్దరూ అమ్మాయిలే!”

“నీతో పాటు అమ్మా, భార్యా ఉంటారన్నావు, మరి మీ నాన్న?”

“నాన్న ఆర్మీలో పని చేసేవారు. నా చిన్నప్పుడే చనిపోయారు. నాకు కూడా నాన్నలాగే ఆర్మీలో చేరాలని ఉండేది. కానీ అమ్మ ఒప్పుకోలేదు. నాన్నలాగే నేను కూడా చిన్న వయసులో చనిపోతానని భయపడింది. అందుకే ఇలా లెక్చరర్‌ని అయ్యాను.”

“ఔనౌను…..! ఆర్మీలో చేరడమంటే మాటలా! ఎంత త్యాగం. మనందరి కోసమే కదా ఆయన ప్రాణాలు విడిచింది. నిజంగా మీ అమ్మకు చేతులెత్తి నమస్కరించాలి.”

వినయ్ చిన్నగా నవ్వాడు.

అడగాల్సిన ప్రశ్న రామనాథం మనసులో తొలుస్తోంది. ఎలా మొహం పట్టుకొని అడగడం?. సరే, ఇంటి పేరుతో కొంత తెలుసుకోవచ్చు.

“మీ ఇంటి పేరు ఏంటి వినయ్?”

“అంటే సార్! నాన్న మీద ఇష్టంతో నేను నాన్న పేరు నా ఇంటి పేరుగా మార్చుకున్నాను.” “మరి మీ అమ్మది?”

“అమ్మ కూడా నాన్న పేరు పెట్టుకుంది.”

“మరి మీ నాన్నది?”

రామనాథం గబగబా అడుగుతున్నాడు.

“నాన్నకు దేశమంటే చాలా ఇష్టం. ఆయన కులమతాలకు అతీతం. అందుకని ఇంటి పేరు తీసేసారు. ఆయన్ని ఆర్మీవాళ్ళు తెలుగు విజయేందర్ అని పిలిచేవారు.”

“అబ్బ ఎంత గొప్ప కుటుంబం! ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారంటే నమ్మలేక పోతున్నాను” “లేదు సార్ మానాన్నతో పోలిస్తే నేనే దేశానికి చేయటం లేదు” వినయ్ గౌరవంగా అన్నాడు. “అద్దెకు సంబంధించిన పత్రాలు అన్నీ ఉన్నాయా?, అంటే నీ ఉద్యోగం, బ్యాంకు డాక్యుమెంట్లు….?”

“అన్నీ ఉన్నాయి సార్, ఇదిగో నావెంటే తెచ్చాను”

“వెరీ గుడ్…!” రామనాథం అన్నీ పరిశీలించాడు. బాగానే ఉంది, కానీ అసలు విషయం అడగడం ఎలా?, ఇంటి పేరుతో తెలుసుకుందామంటే కుదరలేదు.

“చూడు వినయ్! మేము నాన్ వెజ్ వండుకుంటాం, నీకేమి అభ్యంతరం లేదు కదా!”

“అయ్యో! నాకేమి అభ్యంతరం సార్, మీ ఇల్లు మీ ఇష్టం…!”

“మరి నువ్వు తింటావా?”

“ఔను సార్! మేము తింటాం.” రామనాథంకు సహనం చచ్చిపోతుంది. ఎలా అడగడం….?ఎలా తెలుసుకోవడం?

“సరే కానీ, మా ఆవిడ బంధువులకు కొంచెం ఛాదస్తం. ఇల్లు ఎవరికి ఇచ్చారు. కులం గోత్రం, ముందువెనుక ఏంటని చంపేస్తారు” రామనాథం ఒక వెర్రి నవ్వు నవ్వాడు.

“ఔను సార్, చుట్టాలు అలానే ఉంటారు. కానీ మీకు ఏమైనా అలాంటి పట్టింపులు ఉన్నాయా?” వినయ్ సూటి ప్రశ్నకు రామనాథం ఖంగుతిన్నాడు.

“అయ్యయ్యో! ఎంత మాట! మాకలాంటి పట్టింపులు ఏమీ లేవు. ఎందుకైనా మంచిదని ముందే హెచ్చరిస్తున్నాను. ఎవరైనా చుట్టాలు నిన్ను కులం గురించి అడిగితే ‘నీకెందుకు నోరు మూసుకో” అని మొహం మీదే చెప్పెయ్యి. తరువాత నేను చూసుకుంటాను.”

“చాలా థాంక్స్ సార్!” వినయ్ హృదయపూర్వకంగా అన్నాడు.

“నువ్వు మదర్ థెరిసావైనా సరే, మన వాళ్ళకి కులం కావాలయ్య, ఏం చేస్తాం, మన దేశ దౌర్భాగ్యం. మరి మీ చుట్టాల నుంచి ఏమీ ఇబ్బంది లేదు కదా! ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు. నేను హైకోర్టులో చిన్న ఉద్యోగిని. జీవితమంతా కూడబెట్టి ఒక ఇల్లు కట్టాను. ఇంటి అద్దె ఏదో ఈ ముసలితనంలో ఆసరా ఉంటుందని చిన్న ఆశ అంతే. నాకింకేమీ తలనొప్పులు వద్దు!”

“మా నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్, నేను గవర్నమెంటు లెక్చరర్ని. మాకు ఇద్దరు ఆడపిల్లలు. ఇంకా చిన్నపిల్లలే. మా అమ్మా, నా భార్య ఇంట్లోనే ఉంటారు. అమ్మాయిల్ని మంచి చదువుల్ని చదివించడం తప్ప నాకింకేమీ కోరికలు లేవు. మా చుట్టాలు అప్పుడప్పుడూ వస్తూ పోతూ ఉంటారు అంతే… మీరు కావాలంటే మా ప్రిన్సిపాల్‌ని వాకబు చేయొచ్చు.”

వినయ్ మాటల్లో నిజాయితీ స్పష్టంగా కనిపిస్తోంది.

“ఏమీ అనుకోకు ఇలా అడిగానని” రామనాథం తడబడ్డాడు. “ఇల్లు అద్దెకివ్వడం అంత సులువు కాదు కదా! ముందూ వెనుకా చూసుకోవాలి కదా! అసలే పక్క పక్క ఇళ్ళు కదా!”

వినయ్ ఔనని తల ఊపాడు. “సరే ఒక్క నిమిషం, నా భార్య ఫోన్ చేస్తున్నట్టుంది”

“మేడం ఇంట్లో లేరా సార్?”

“లేదు తనో పెళ్ళికి వెళ్ళింది”.

రామనాథం బయటకు వచ్చి జాగ్రత్తగా అటూ ఇటూ చూసి ఫోన్ ఎత్తాడు.

“ఏమైంది? అన్నీ తెలుసుకున్నావా?” ఆమె ఆతృతగా అడిగింది.

“ఇతను అతి అమాయకుడో, మహా మొండివాడో అర్థం కావడం లేదు. ఎన్నిసార్లు అడిగినా ఆ ఒక్కటి తప్ప అన్నీ చెబుతున్నాడు.”

“ఔనా…?”

“పోనీ ఏదయితే అది అవుతుందని సూటిగా అడిగేయనా?”

“ఇంకా నయం!! అతడికి గానీ తిక్క రేగి ఏదయినా కంప్లైంట్ ఇచ్చాడంటే మనం పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాలి.”

“మరి ఏం చేద్దాం??”

“చూడూ ఎంత అడిగినా అతడు తన కులం గురించి చెప్పడం లేదు కదా! మనకెందుకు లేని పోని గొడవ. వద్దని చెప్పు.”

“నేను అదే అనుకుంటున్న”

“ఎవర్ని పడితే వారిని కులం తెలుసుకోకుండా అద్దెకు ఎలా రానిస్తాం? అసలే ఈ మధ్య పరిస్థితులు ఇబ్బందులు కలిగించేలా ఉన్నాయి. కానీ వద్దు అని మొహం మీదే ఎలా చెప్పడం? అతడు చేతిలో చెక్కు పట్టుకొని మరీ వచ్చాడు…”

“వద్దని ఇప్పుడే ఎందుకు చెప్పడం! మంచి రోజు చూసి అడ్వాన్సు కోసం కబురు చేస్తానని చెప్పి పంపిచేయ్. ఆ తర్వాత ఏదో ఒకటి చెప్పవచ్చు.”

“ఓ… నువ్వా!! ఎప్పుడొచ్చావు?”

అబ్బా… వినయ్ వచ్చిన సంగతి నేను ఎలా పట్టించుకోలేదు. రామనాథం బాధ పడిపోయాడు.

“ఇప్పుడే సార్!! ఇదిగో మీరు కులం తెలియక పోతే ఇల్లు అద్దెకివ్వనని చెబుతున్నారు. సరిగ్గా అప్పుడు…!!” వినయ్ సూటిగా రామనాథం కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు.

రామనాథం మొహం ఎర్రగా మారింది.

“ఏంటి సార్, పెద్ద… న్యాయ వ్యవస్థలో పని చేసానన్నారు… మీరు నేర్చుకున్న న్యాయం ఇదేనా? నా తండ్రి దేశం కోసం ప్రాణాలు అర్పించాడు కదా!! యుద్ధంలో చనిపోయేటప్పుడు నా కులం కోసం, నా మతం కోసం అని ఆలోచించలేదు. మీకు ఆ ఇంగితం కూడా లేదా? మరీ ఇంత కులపిచ్చా?? మీరు కాదు, అసలు నేనే మీ దగ్గర అద్దెకు దిగను…” కోపంతో ఊగిపోతున్న వినయ్‌ని చూసి రామనాథం చిన్నగా నవ్వాడు.

“చూడు బాబు! నువ్వేమీ అనుకోనంటే నేనో మాట చెపుతాను. న్యాయ వ్యవస్థలో నలభై ఏళ్ళు పనిచేసాను. కాబట్టి చెబుతున్నాను. మేము మధ్యతరగతి కుటుంబీకులం. నాది కులవివక్ష కాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల పట్ల భయం. అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. కుదిరితే మీ తల్లికి నేను పాదాభివందనం చేసానని చెప్పు” అంటూ రామనాథం చేతులు జోడించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here