పర్యావరణం కథలు-3: తప్పెవరిది?

0
14

[box type=’note’ fontsize=’16’] పర్యావరణం కథలలో భాగంగా, ‘తప్పెవరిది?‘ అనే కథలో దోమలు పెరిగిపోవడానికి కారణాలు, వాటిని అరికట్టే మార్గాలు చెబుతున్నారు డి. చాముండేశ్వరి. [/box]

[dropcap]”సి[/dropcap]టీలో పెరిగిన దోమల బెడద. పెరుగుతున్న దోమ బాధితులు. డెంగీ, మలేరియా రోగులతో నిండిపోతున్న ఆసుపత్రులు. పట్టించుకొని మున్సిపాలిటీ అధికారులు” ఇలా సాగిపోతుంది టీవీలో న్యూస్.

ఇంతలో ఫీవర్‌తో స్కూలుకి వెళ్లని గగన్ నీరసంతో “అమ్మా!” అని పిలిచాడు.

“పిలిచావా గగన్? ఆకలి వేస్తున్నదా?” అంది అమ్మ.

అవునని తల ఊపాడు.

అమ్మ వేడిగా వెజ్ సూప్ తెచ్చి తాగిస్తుంటే, “అమ్మా.. ఇట్స్ హాట్” అన్నాడు.

“ఇట్స్ ఓకే. డాక్టర్ హాట్ ఫుడ్ ఇమ్మన్నారు” అని చెప్పి, సూప్ తాగిన గగన్‌ని టీవీ చూడవద్దని చెప్పి టీవీ ఆపి, “నౌ యు రిలాక్స్” అంది అమ్మ.

ఓకే అన్నట్లు తల ఊపి రిలాక్స్ అయ్యి నిద్ర పోవాలని ప్రయత్నించాడు.

చెవుల దగ్గర ఒకటే దోమల రోద. అదేనండి దోమల ఈఈ సౌండ్. ఉష్ అని దోమల్ని విదిలించి నీరసంగా అటూ ఇటూ బెడ్ మీద దొర్లాడు. కానీ దోమలు వదల్లేదు.

“అమ్మా, దోమలు. త్వరగా రా” అన్నాడు.

“అబ్బబ్బా! ఎక్కడ పడితే అక్కడ దోమలు. చంపుతున్నాయి” అని విసుక్కుంటు అల్ ఔట్ ఆన్ చేసింది నీతా.

“నౌ రిలాక్స్.”

ఓకే అన్నట్లు తలా ఊపాడు గగన్.

అమ్మ వెళ్ళిపోయాక మళ్ళీ చెవి దగ్గర దోమల సౌండ్. ఈసారి ఎదో పలకరింపులా  ఉంది.

“గగన్! గగన్!”

ఉలిక్కిపడ్డాడు గగన్. “దోమ కాలింగ్ మీ. స్ట్రేంజ్” అనుకున్నాడు. ఇంతలో రాజమౌళి మూవీ ‘ఈగ’ గుర్తుకు వచ్చింది. భయం వేసింది. “అమ్మో నేనెవరిని హర్ట్ చెయ్యలేదు” అనుకున్నాడు.

మళ్ళీ ‘గగన్, గగన్’ అని పిలుపు.

“ఎవరూ ఎక్కడున్నారు?”

“ఇక్కడే నీ పక్కనే.”

“ఎందుకు వచ్చారు?”

“రాకూడదా?” అంది ఓ దోమ.

“అలా అని కాదు. దోమలు వస్తే సిక్ అవుతామంది అమ్మ.”

“అవునా?”

“అవును. రకరకాల ఫీవర్స్ వస్తాయి. స్వైన్ ఫ్లూ వస్తే డెత్ అని నా ఫ్రెండ్ చెప్పాడు.”

“ఇంకా?”

“సిగ్గు లేకుండా ఇంకా ఇంకా అని అడుగుతున్నవా చెడ్డ దోమా?”

“మేము చెడ్డ దోమలమా? ఎలా?”

“కాదా? అసలు మా ఇండ్లలో ఎందుకు ఉంటున్నారు. మీకు ఇల్లు లేదా? ఎవరు రమ్మన్నారు. గో అవే” అన్నాడు కోపంగా.

“అంత కోపం దేనికి గగన్? మా గురించి నీకు ఏమీ తెలీదని అర్థం అయ్యింది. మా గురించి చెబుతా వింటావా?” అంది దోమ.

“చెప్పు. వినక చస్తానా! వదిలేలా లేవు” అన్నాడు గగన్ విసుగ్గా.

దోమలు నవ్వి చెప్పటం మొదలుపెట్టాయి.

“మేము ఎన్ని రకాలో తెలుసా? గ్రూప్స్?”

“దోమలు నాకు తెలిసి రెండు రకాలు. మలేరియా, ఫీలేరియా దోమలు” అన్నాడు గగన్.

“అవే కాకుండా మాలో దాదాపు 3500 గ్రూప్స్ ఉన్నాయి. స్పానిష్ భాషలో మస్కిటో అంటే లిటిల్ ఫ్లై. గగన్ నీకు తెలుసా? దోమలు జురాసిక్ కాలం నుండి అంటే 210 మిలియన్ ఏళ్ల నుండి పర్యావరణంలో ఉన్నాయి. ఆడ దోమ 40-50 రోజులు, మగ దోమ 10 రోజులు బ్రతుకుతాయి. మిమ్మల్ని మా ఆడ దోమ గుడ్లు పెట్టటానికి ముందు ప్రోటీన్ కోసం కుడుతుంది. మాకు వేడి వాతావరణం, తేమ, చీకటి ప్రదేశాలు నచ్చుతాయి ఉండటానికి. ఇంకో సీక్రెట్ చెప్పమా! ఎవరైనా ముదురు రంగు డ్రెస్ వేసుకుంటే రంగులు నచ్చి అట్రాక్ట్ అయి కుడతాము” అని దోమలు కొంటెగా నవ్వాయి పెద్దగా.

“మీరు పగలు ఎక్కడ దాక్కుంటారు?” అడిగాడు గగన్.

“మీ చుట్టు ఉన్న పరిసరాలు, ఇంట్లో బీరువాలు, ఫర్నిచర్, పూలకుండీలు, వాడి పడేసిన వస్తువులు, చెత్త కుప్పలు, నిల్వ ఉన్న నీళ్లు, ఎక్కడ దాక్కోగలమో అక్కడ ఉంటాము.”

“అవునా? అందుకే మా ఇంట్లో, పార్క్, సినిమా హాల్, స్కూల్ ఎక్కడ పడితే అక్కడ కుడుతున్నారు మమ్మల్ని.”

దోమలు ఒక్కసారిగా ‘గుయ్!’ అని సౌండ్ చేస్తూ గగన్ చుట్టూ తిరిగాయి.

భయపడిన గగన్ దుప్పట్లో దూరి బైటకి చూసాడు.

“భయపడకు. కుట్టము లే” అన్నాయి దోమలు.

“మేము కుడితే అనేక జ్వరాలు వస్తాయి.”

“మిమ్మల్ని చంపలేమా?” అన్నాడు గగన్.

“మమ్మల్ని చంపగలరు, ఆపగలరు. బట్ కొంతవరకే. టెంపరరీగా మీ అమ్మ స్ప్రే చేసిన దోమల మందు, అల్ అవుట్, కాయిల్స్, ఫాగ్గింగ్ లాంటివి కొంతసేపే పనిచేస్తాయి.”

“చనిపోరా?”

“అన్నిసార్లు కాదు. మీరెంతగా రసాయనాలు వాడితే మేము అంత మొండిగా అవుతాము. మేము పారిపోయి దాక్కుంటాము. మా ప్లేసులు మాకున్నాయిగా. అయినా కెమికల్స్ వాడితే మీ ఆరోగ్యానికే ప్రమాదం. కాన్సర్ లాంటి జబ్బులు వస్తాయని విన్నా.”

“అవునా? మరి మిమ్మల్ని మా దగ్గరకు రాకుండా ఆపలేమా?”

“ఆపొచ్చు. మేము దాక్కోవటానికి వీలు లేకుండా మీ పరిసరాలు శుభ్రంగా ఉంచాలి. మీరు రసాయనాల స్ప్రే బదులు దోమతెరలు వాడితే మిమ్మల్ని కుట్టలేము. గగన్ నీ రూమ్ చూడు ఎలా ఉందో? విప్పిన బట్టలు, షూస్, ఓపెన్ చేసిన స్కూల్ బ్యాగ్, తిని పడేసిన కవర్లు… ఇలా ఉంటే మాకు ఇన్విటేషన్ ఇచ్చినట్లే” అన్నాయి దోమలు.

“మా అమ్మ బిజీ. అందుకే ఇలా” అన్నాడు సిగ్గుగా.

“అన్నీ అమ్మ చెయ్యాలా? నీ చుట్టూ నువ్వే క్లీన్‌గా ఉంచాలి. మీ మనుషులు చాల లేజీ. బద్దకస్తులు. స్వార్ధపరులు, సెల్ఫిష్…”

“ఆఁ, ఏమీ కాదు. యు అల్ రాంగ్” అన్నాడు గగన్.

“నో. మీరు మారి మీ పరిసరాలు శుభ్రంగా ఉంచనంత కాలం, పర్యావరణాన్ని పాడు చేస్తుంటే మా దోమల సంఖ్య పెరిగి మీకు రోగాలు తెస్తూనే ఉంటాము. మమ్మల్ని ప్రభుత్వాలు కూడా ఆపలేవు.”

“కాదు. ఆపగలం. చంపేస్తాం” అన్నాడు గగన్ కోపంగా.

దోమలు పెద్దగా నవ్వి “అవును. కానీ ఒక్కరితో కాదు. మున్సిపాలిటీ సంఘాలవారు పరిసరాలు క్లీన్ చేస్తారని మీరు మీ చుట్టుపక్కల మరింత చెత్త పడేస్తే మేము మీకు దొరకకుండా కుడతాము.   ప్రజలు, ప్రభుత్వం కలిసికట్టుగా పరిసరాలు క్లీన్‌గా ఉంచితేనే మీరు మమ్మల్ని ఆపగలరు. ఇప్పుడు చెప్పు, దోమలు పెరిగి రోగాలు రావటానికి ముఖ్యకారణం ఎవరు? మేమా? మనుషులా? పరిసరాల శుభ్రతే దోమల నివారణకు మంత్రం” అంటూ దోమలన్నీ ఒక్కసారిగా ఈ ఈ ఈ అంటూ పైకి లేచి గిర్రున తిరిగి కిటికీలోంచి వెళ్లిపోయాయి.

“అమ్మా! దోమలు. దోమలు” అని గట్టిగా అరచి హాల్లోకి పరుగెత్తాడు గగన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here