తరంగాలు

4
11

[dropcap]”ఏ[/dropcap]రా టూ, త్రీ, ఫోర్ ఎలా ఉన్నారు? ఎంతకాలమైంది ఇలా మిమ్మల్ని చూసి” అన్నాడతను ఆప్యాయంగా.

“ఇరవైమూడేళ్ళయిందిరా, నంబర్ వన్. అందరం ఇలా ఒకచోట కలుసుకుని” అన్నాడు ఆ వచ్చిన ముగ్గురిలో ఒకతను. ఔనంటూ మిగిలిన వాళ్ళు తలలూపారు.

“ఏరా రిటైరయిన రెండేళ్ళకు గాని ఇలా మనం కలుసుకోవటానికి వీలుపడలా! ఎన్నాళ్ళ నుండి అనుకుంటున్నాంరా! మనం పెరిగిన ఊరు, పదో తరగతి వరకు చదువుకున్న ఊరు, మన వ్యక్తిత్వాలను తీర్చిదిద్దిన ఊరును మళ్ళీ తనివి తీరా చూడాలని ప్రతి మట్టిరేణువును తాకి తన్మయత్వం చెందాలని, ఎన్నిసార్లు ప్రణాళికలు వేసుకున్నామో! ఇన్నాళ్ళకు కుదిరింది” అన్నాడు నంబర్ టూ. ఆ నలుగురిలో చక్కని భావుకత ఉన్నవాడు, చిన్నతనం నుండే కథలు, కవితలు రాయటం అలవాటున్నవాడతను.

ఆ నలుగురు మిత్రులు నడుస్తూ, తమను ఇలా తీర్చిదిద్దిన ఊరును చూస్తూ పులకరించి పోతున్నారు.

“ఒరేయ్! ఒక నిమిషం ఆగండి” అన్నాడు నంబర్ వన్. శివాలయం ఎదురుగా నిలబడి నమస్కరించుకుంటున్నాడు. మిగిలిన ముగ్గురు పక్కన ఒదిగి నిలుచున్నారు. ఒక నిముషం తర్వాత ‘పదండి’ అన్నాడు నెంబర్ వన్.

“ముందుగా ఎక్కడికి వెళ్దాం?” అడిగారు టూ, త్రీ, ఫోర్ ఒకేసారి.

“మనల్ని ఇలా మంచి మార్గంలో నడవటానికి తన పదాలతో, పాఠాలతో బాట వేసిన మన తెలుగు మాష్టారు రాఘవరావు గారింటికి” అన్నాడు నంబర్ వన్.

మాష్టారి ఇల్లు శివాలయం వెనుక వీధిలో వుంది. ఆయన పేరు వినగానే వాళ్ళ మనసులు బాల్యం వైపు పరుగెత్తాయి. గబగబా అడుగులు వేస్తు మాష్టారి ఇంటికి చేరుకున్నారు. ఎనభయ్యవ దశకంలో వున్నా మాష్టారు చలాకీగా, చురుగ్గా ఉన్నారు. ఓ చిన్న పెంకుటిల్లే అయినా చక్కగా, అన్ని వసతులతో ఉంది. పెద్ద హాలు, రెండు పెద్ద గదులు, ఒక వంటగది, ముందు కాస్త జాగాలో పూలతోట. ఇంటికి కాపలా కాస్తున్న గార్డుల్లా రెండువైపులా కొబ్బరిచెట్లు, పెరడులో మామిడి, సపోట, జామ, అరటిచెట్లు, ఎటు చూసినా పచ్చదనమే!

మిత్రులందరూ వెళ్ళేసరికి మాష్టారు హాల్లో పచార్లు చేస్తున్నారు. వీళ్ళను చూస్తూనే “రండిరా! ఎంత సేపట్నుంచి ఎదురుచూస్తున్నానో తెలుసా! మీరందరూ కలిసి వస్తున్న విషయం తెలిసిన దగ్గర్నుంచి నిద్రపట్టలేదు. మనసు కుదురు తప్పింది. ఎలా ఉన్నార్రా?” అని ఆయన పలకరిస్తుండగానే “మీ దయవల్ల బాగున్నాం మాష్టారు” అంటూ ఆయన పాదాలకు నమస్కరించారు.

“దీర్ఘాయుష్మాన్‍భవ” అంటూ వాళ్ళను పైకి లేపుతూ వాళ్ళ భుజాల మీద చేతులేసి కూర్చోమని కుర్చీలు చూపించారు.

“మీరు ఎలా వున్నారు మాష్టారు?” అడిగాడు నంబర్ త్రీ.

“హాయిగా ఉన్నాన్రా! అమ్మాయి పెళ్ళి చేశాను. అల్లుడు మంచివాడు. మనవళ్లు ఇద్దరూ ఇంటర్ చదువుతున్నారు. ఎవరన్నా నేర్చుకుంటామని వస్తే నాలుగు తెలుగు ముక్కలు నేర్పుతున్నా. పుస్తక పఠనం, రచన ఎలాగూ నాకు ఉన్నవే! మీరూ, మీ పిల్లలూ బాగున్నారని, పైకి వస్తున్నారని నెంబర్ వన్ చెప్పాడు. మీ ముగ్గురికన్నా వాడు నాకు కొంచెం దగ్గరగా ఉండటంతో తరచూ కలుస్తాడు. ఔన్రా, ఇంకా మీరు వన్, టూ, త్రీ, ఫోర్ అనే పిలుచుకుంటున్నార్రా!” అన్నారు మాష్టారు.

“ఔన్ సార్” అన్నారందరూ ఏకకంఠంతో.

“వాసుదేవ శాస్త్రి, అహ్మద్, జాన్, మహేంద్ర జైన్ అనేవి మీ పేర్లన్న విషయమైనా గుర్తుందా మీకు?” నవ్వుతూ అడిగారు మాష్టారు.

“ఏవన్నా అప్లికేషన్లు పూర్తి చేసేటప్పుడు, ఎవరన్నా మీలాంటి పెద్దలు గుర్తుచేసినప్పుడు మాత్రం గుర్తుకు వస్తుంది. బాగా సన్నిహితులైన మిత్రులెవరైనా ఇలా నంబర్లతో పిలుస్తారు మాష్టారు. మా గురించి తెలియని వారైతేనే పేర్లతో పిలుస్తారు” అన్నాడు నంబర్ ఫోర్.

“మేమిలా నంబర్లతో పిలుచుకోవడానికి మీరే స్ఫూర్తి మాష్టారు. మానవులంతా ఒకటేనని, కులమతాలు వారిని విడదీస్తాయని, ఒకరి విశ్వాసాలను మరొకరు గౌరవించాలని చెప్పారు. మేము అప్పుడు మా మతం, మా కులం గొప్పవన్న భావన విడిచి, ఒకరినొకరు అభిమానించడం ప్రారంభించాం. మేం పదవ తరగతిలోకి వచ్చిన తరువాత అన్ని విశ్వాసాల కన్నా బాగా మానవత్వం గొప్పదని, మానవతే మన మతం కావాలని మీరు చెప్పిన విషయం మా మనస్సులకెక్కింది. కుల అసమానతలు చేసే మానసిక గాయాలను చూసిన తరువాత వాటికతీతంగా ఎదగాలనుకున్నాం. మీ విశాల దృక్పథమే అలవరచుకున్నాం మాష్టారు” అన్నాడు నంబర్ వన్.

“అందుకే కదరా మీరు నాకు మానస పుత్రులయ్యారు. నా సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో నేను పొందిన సంతృప్తి, ఆస్తి మీరేరా!” అన్నారు మాష్టారు చెమరుస్తున్న కళ్ళతో.

“కబుర్లతోనే కాలక్షేపం చేస్తారా?” అంటూ అన్నపూర్ణమ్మగారు కాఫీ ట్రేతో వచ్చారు.

“అమ్మా! నమస్కారం” అంటూ దిగ్గున లేచారు నలుగురూ. కాఫీ ట్రే అందుకుని అందరికీ ఇచ్చాడు జాన్. కాసేపయ్యాక ఇడ్లీలు పెట్టారు అన్నపూర్ణగారు.

తన భర్త కుర్చీ చుట్టూ కూర్చున్న వాళ్లను చూస్తున్న ఆవిడకు అప్పుడప్పుడూ కలిగే మగపిల్లల్లేరన్న బాధ మటుమాయమైంది. ఇప్పుడే కాదు వాళ్ళు చదువుకున్న రోజులనుంచి ఆమెకు అదే ఆలోచన మనసులో మెదిలేది. ఎన్నిసార్లు వాళ్ళు తమతో కలిసి భోజనం చేశారో! వెన్నెల రాత్రుల్లో కథలు చెప్పమని ఎంత ప్రాణం తీసేవారో!

మాష్టారికి పట్టుబట్టలు, అన్నపూర్ణమ్మగారికి చీర పెట్టి పాదాలకు నమస్కారం చేశారా నలుగురు మిత్రులు.

“ఏరా నాకివన్నీ ఇష్టం ఉండదని తెలిసి ఏమిటిదంతా?” మందలింపుగా అన్నారు మాష్టారు.

“ఎన్నాళ్ళకో కలిశాం. మీరు మా భగవంతుడు. మా సర్వస్వం. మా మనసులనే మొగ్గల్ని కుల, మత ప్రచండ గాలుల నుండి రక్షించి, మానవత్వాన్ని మంచితనాన్ని మాలో వికసింపజేసి, అవి పరిమళాలు వెదజల్లే పుష్పాలుగా మలచి, మా జన్మకొక సార్థకతను ఇచ్చారు. మీరు చూపిన దారిలో మేం సమాజాభ్యుదయానికి మావంతు కృషి చేస్తున్నాం” అన్నాడు వాసు.

“మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. సరే! ఇప్పుడెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు?” అన్నారు మాష్టారు.

“మేం చదివిన పాఠశాలకు వెళ్ళాలనుకుంటున్నాం మాష్టారు” అన్నాడు మహేంద్ర.

“మీరు ఎన్నిరోజులుంటారో నాకు తెలియదు. ఒకరోజు రండి, అందరం కలిసి భోజనం చేద్దాం” అన్నారు గురుపత్ని. సరేనంటూ బయటకు వచ్చారు నలుగురు.

వాళ్ళు చిన్ననాడు చదివిన పాఠశాల! అదే చోటులో ఉన్నా దాని ఆకారం మారింది. షెడ్డుల్లోను, బంగాళా పెంకుటింట్లోను ఉండే చోట భవనం వచ్చింది. ఆదివారం కావటంతో విద్యార్థులు లేరు. ప్యూన్‍తో చెప్పి లోపలికి వెళ్ళారు నలుగురూ. తాము అసెంబ్లీ చేసిన చోటు! అక్కడే ఇప్పటికీ అసెంబ్లీ జరుగుతోందనటానికి గుర్తుగా జెండా దిమ్మ, స్తంభం, ఉన్నాయి. నలుగురూ నిలబడి మళ్ళీ తాము చిన్నపిల్లలైనట్లు, ప్రార్థన చేస్తున్న ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయారు. అప్రయత్నంగా వాళ్ళ పెదవుల నుండి జైహింద్ అన్నమాట వచ్చింది.

ఒకమూలగా ఉన్న మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళారు. ఆ చెట్టును ఆత్మీయంగా, ప్రేమగా నిమిరారు.

“ఒరేయ్! ఇది అప్పటి చెట్టే కదూ! ఈ చెట్టుకిందే మనం భోజనం చేసేవాళ్ళం కదరా!” అన్నాడు అహ్మద్.

“అవును మొదట్లో మనం కోడిగుడ్డు, చేపలకూర తెచ్చుకున్నప్పుడు చూస్తూనే దూరంగా వెళ్ళేవాడు శాస్త్రి. అంతవరకూ కలిసిమెలిసి ఉండే మనం భోజనం దగ్గర ఇలా దూరం కావటం ఇష్టంలేని మనం వాటిని తెచ్చుకోవటమే మానేశాం” అన్నాడు జాన్.

“నాకోసం మానుకోవద్దురా అని నేను అన్నా మీరు వినిపించుకోలా” అన్నాడు శాస్త్రి.

“ఎన్నో విషయాలలో సారూప్యత ఉన్న మనకు అది పెద్ద ఇబ్బందిలా అనిపించలేదు” అన్నాడు జాన్.

“సమాజంలో వివక్ష, కులవైషమ్యాలు సమసినట్లుగా అనిపిస్తూనే ఈ నాగరికతా జగతిలో కొత్తరూపాన్ని సంతరించుకుంటున్నాయి” అన్నాడు మహేంద్ర బరువుగా ఊపిరి వదులుతూ.

“మన తరంలో కన్నా విజ్ఞాన, సాంకేతిక రంగాలలో ఎంతో ప్రగతి సాధించారు. ప్రపంచం కుగ్రామమైంది అంటున్నారు. ఐనా ఎందుకిలా జరుగుతోంది?” అంటూ వాపోయాడు జాన్.

“విశ్వాన్ని చిరుగ్రామంగా చేసుకున్నారు. కాని, మనసులో స్వార్థం, సంకుచితత్వం, వర్ణ, కుల వివక్షను విశ్వమంతా పెంచుకున్నారు. మన పిల్లలని ఈ విషవలయం తనలోకి లాక్కోలేదు. ఆ మేరకు మనం అదృష్టవంతులం. మనం మన టీచర్ల నుండి ఏది నేర్చుకున్నామో, అదే మన పిల్లలకిచ్చాం” అన్నాడు శాస్త్రి.

“అయ్యా! నేను భోజనానికి ఇంటికి వెళ్ళాలి.. తమరు…” అంటూ ఆర్థోక్తిలో ఆపిన ప్యూన్ మాటలకి ప్రపంచంలోకి వచ్చారు నలుగురూ. టైం చూస్తే రెండున్నర దాటింది.

“ఏమనుకోకు శీను! మాటల్లో టైం తెలియలేదు” అన్నాడు శాస్త్రి. నలుగురూ స్కూలు బైటకు నడుస్తూ – శీనుకు కొన్ని వందరూపాయల నోట్లు ఇవ్వబోయిన అహ్మద్‍ను వారిస్తూ “అయ్యా మీ మాటలు వినడం వల్ల మా నాన్న చెప్పింది మీ గురించేనని అర్థమయింది. మా నాన్న ఇక్కడ పనిచేసి సర్వీస్‍లో ఉండగా చనిపోయాడు. నా మీద దయతో ఆ ఉద్యోగాన్ని నాకిచ్చారు. మా అయ్య ఎప్పుడూ వన్, టూ, త్రీ, అని పిలుచుకునే మీ గురించి గొప్పగా చెపుతుండేవాడు. మనుషుల మధ్య తేడాలుండకూడదని ఎపుడు చెపుతూ ఉండేవారని చెప్పేవాడు. ఇన్నాళ్ళకు మిమ్మల్ని చూడగలిగినాను” అన్నాడు శీను చేతులు జోడిస్తూ.

“అది మా గొప్ప కాదు శీను! మాకు దొరికిన గురువుల గొప్పదనం. మీ పిల్లలకు ఏమైనా కొనుక్కువెళ్ళు” అంటూ బలవంతంగా అతని చేతిలో ఆ నోట్లుంచాడు శాస్త్రి. అందరూ స్కూలు బైటకొచ్చారు.

నడుస్తుంటే దారిలో చెరువు కనిపించింది. ఒక్క నిమిషం దానిముందు నిలబడ్డ వారికి మనసు తెరమీద ఎన్నో దృశ్యాలు కనిపించాయి. ఈతకొట్టే పిల్లలు, కావిళ్ళతో నీళ్లు మోసుకెళ్ళేవాళ్ళు. బట్టలుతుక్కునేవాళ్ళు, స్నానాలు చేసేవాళ్ళు ఇలా ఎందరో స్కూలుకెళుతుంటే, వస్తుంటే అక్కడే కనిపించేవారు.

నడుస్తూ అలనాటి జ్ఞాపకాలను మూటగట్టుకుంటూ మామిడి తోటకు చేరుకున్నారు నలుగురూ. అది రంగయ్యగారిది. ఇప్పుడాయన లేరు. వాళ్ళబ్బాయి ప్రతాప్ ఆధీనంలో ఉందా తోట. ప్రతాప్ ఒక ఏడు సీనియర్ వీళ్లకు. వీళ్లతో కలవాలనున్నా అంతస్తుల తేడా వల్ల రంగయ్యగారు ప్రతాప్‍ను కలవనిచ్చేవారు కాదు.

మిత్రబృందం ఓ పెద్ద మామిడి చెట్టుకింద కూర్చున్నారు. మాస్టారింట్లో తిన్న ఇడ్లీలే! ఎవరికీ ఆకలిగా లేదు. ఎవరి ఆలోచనా ప్రవాహంలో వారు!

“ఏరా! సమాజం మారిందా?” అన్నాడు అహ్మద్.

“మారలేదనలేం రా! రవ్వంత మార్పు వస్తోంది కాని, మార్పు గురించి, విలువలు గురించి ఆచరణలో కన్నా, మాట్లాడేవారే ఎక్కువ! సమాజమంతా మేడిపండేనా అనిపిస్తుంది. విలువలను వలువల్లా మార్చేస్తున్నారు. మనవంతు కృషిగా మనం ఇంకా ఏమైనా చెయ్యాలి. యువతతో మమేకమై, వారి భావాలను విందాం. మన అనుభవాలను వివరిద్దాం. యువతరాన్ని కూడగట్టుకోగలిగితే అనుకున్నవి చేయగలం. ఏమంటారు?” అన్న జాన్ మాటకు అందరూ తలలూపుతూ లేచారు.

కెంజాయ రంగులోకి మారుతున్న ఆకాశాన్ని, పక్షులు తమ గూటికి చేరే దృశ్యాన్ని గోధూళివేళను పరవశంగా చూస్తూ జ్ఞాపకాల తరంగాలలోకి తొంగి చూసుకుంటూ నడక సాగించారు మిత్రబృందం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here