తస్మాత్‌!!

0
6

[box type=’note’ fontsize=’16’] “నెట్‌లో పోర్నోగ్రఫీ గురించి అంత హడావిడి చేస్తున్న సంస్థలు, ప్రభుత్వాలు మరి ఈ విషయం ఎందుకు పట్టించుకోరు!!??” అని అడుగుతున్నాడో వైద్యుడు ఎం.వి.ఎస్.ఎస్. ప్రసాద్ కథ “తస్మాత్‌!!“లో. [/box]

[dropcap]ఆ[/dropcap] రోజు ఉదయం నుంచి నేను ఆసుపత్రిలో చాల హడావిడిగా ఉన్నాను. పేషెంట్లు బాగా ఎక్కువగా ఉండడమే కాక, రెండు, మూడు అత్యవసర కేసులు కూడా వచ్చాయి. నాకు అసిస్టెంట్‌లు ఉన్నా ముఖ్యమైన కేసులు, అత్యవసర కేసులు నేనే స్వయంగా చూస్తాను. అందువల్ల నిజం చెప్పాలంటే ఆ రోజు నాకు ఊపిరి సలపడం లేదు.

అటువంటి సమయంలో నా ఫోన్ మోగింది. ఫోన్ మోగడం వింత కాకపోయినా ఆ నెంబరు కల ఫోన్ మోగడం తక్కువ. ఎందుకంటే ఆ నెంబర్ మా ఇంట్లో వాళ్ళకి, అతి ముఖ్యులకి తప్ప బయటవాళ్ళకి తెలియదు. కనీసం వేరే డాక్టర్లకు కూడా ఆ నెంబర్ తెలియదు. ఇంట్లో వాళ్ళకి, ఆసుపత్రిలో ఉండగా, అర్జెంటు అయితే తప్ప ఫోన్ చెయ్యొద్దనీ చెప్పాను. నా భార్య విజయ ఫోన్ చేసింది. అందుకే ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుందని ఊహిస్తూ కాల్ రిసీవ్ చేసుకున్నాను.

“ఏమండీ మీరు అర్జెంటుగా సుబ్బారావు అన్నయ్యగారి ఇంటికి రావాలి. నేను అక్కడే ఉన్నాను” అని కంగారుగా చెప్పింది నా భార్య విజయ.

“ఏమిటి?? ఏమయ్యింది??” అని అడిగాను నేను.

“అయన పరిస్థితి ఏమీ బాగా లేదు… అసలు ప్రాణం ఉందో లేదో అని అనుమానంగా ఉంది” అంది విజయ ఆయాసపడుతూ..

“అయ్యో!!… ఏమయ్యింది… వెంటనే అంబులెన్స్ పంపిస్తాను… ఇక్కడకి తీసుకురండి” అన్నాను నేను కాలింగ్ బెల్ నొక్కుతూ.

“అబ్బా!! నా మాట అర్థం చేసుకోండి. మీరు వెంటనే రండి. అంబులెన్స్ వచ్చి… వెళ్ళే టైం లేదు… అంబులెన్స్ తీసుకుని మీరే వస్తే వెంటనే ట్రీట్‌మెంట్ మొదలు పెట్టవచ్చు… కానీ ఎందుకో నాకేమో అది అవసరం అనిపించడం లేదు!!” అంది విజయ తన కంఠంలో నిరాశ ధ్వనిస్తుండగా.

విజయ మాటలకి నాకు కంగారు మొదలయ్యింది. నా బెల్ విని లోపలకి వచ్చిన బాయ్‌కి వెంటనే అంబులెన్స్ రెడీ చేయమని చెప్పి, నా అసిస్టెంట్స్‌ని పిలిచి నేను అర్జెంటు పని మీద బయటకు వెళుతున్నాని, వచ్చే వరకు క్రిటికల్ కేసులను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి పరుగులాంటి నడకతో అంబులెన్స్‌ని చేరుకున్నాను.

లోపల కూచున్నాక ఆలోచించసాగాను.

సుబ్బారావు నా చిన్ననాటి స్నేహితుడు. ఒకటో క్లాసు నుంచి టెన్త్ వరకు ఇద్దరం కలసి చదువుకున్నాం. తరువాత నేను డాక్టర్ అయితే అతను లాయర్ అయ్యాడు. వృత్తులు వేరైనా మేమిద్దరం తరుచూ ఏదో విధంగా కలుసుకుంటూ ఉంటాం. అతను తన ఆరోగ్యం పట్ల చాల శ్రద్ధ తీసుకుంటాడు. కనుక నిజం చెప్పాలంటే అతనికి కార్డియాలజిస్ట్‌గా నా అవసరం పెద్దగా రాలేదు అనే చెప్పాలి. ఏదో అప్పడప్పుడు వచ్చి చెక్ చేయుంచుకుంటూ ఉంటాడు. పదిరోజుల క్రితం కూడా అతనిని పరీక్షించాను. అంతా బాగానే ఉంది. మరి ఇంతలో ఏమయ్యింది!!?? నేను డాక్టర్ అయినప్పటికీ… విజయ మాటలు… మనసు ఎందుకో కీడు శంకిస్తోంది…

దాదాపు అర్ధగంట తరవాత, అది కూడా అంబులెన్స్ కనుక, సుబ్బారావు ఇంటికి చేరుకున్నాను. ఇంచుమించు అంబులెన్స్ లోంచి ఇంటిలోకి ఉరికినంత పని చేశాను. సుబ్బారావు చెయ్యి అందుకున్నాను.ఒక్క సారి నా గుండె ఆగినంత పని అయ్యింది!! పల్స్ చాలా వీక్ గా ఉంది. బీ.పి. బాగా తక్కువగా ఉంది. నేను విజయ కేసి ప్రశ్నార్ధకంగా చూసాను.

విజయ చెప్పడం ప్రారంభించింది. “అదేదో వెబ్ సైట్ లో బీ.పి. ఎంత తక్కువ ఉంటే అంత మంచిదని చెప్పారుట… అన్నయ్యగారు నాలుగు రోజులనుంచి మాత్రలు డోస్ పెంచి వేసుకుంటున్నారట…” ఇంకా ఏదో చెప్పబోయిన విజయకి నేను అడ్డు వచ్చాను.

“వాడికి బీ.పి. నార్మల్ గానే ఉందే… మరి నన్ను కనీసం అడక్కుండా…” అంటూ సుబ్బారావుకి రెండు ఇంజక్షన్‌లు చేశాను. అలాగే అతన్ని అంబులెన్స్‌లోకి తరలించమని నా స్టాఫ్‌కి సంజ్ఞ చేశాను.

“సోషల్ మీడియాలో ఎవడికి తోచినిది వాడు చెప్పేయడం… అమాయకులైన సుబ్బారావు లాంటి వాళ్ళు నమ్మేసి పిచ్చి పనులు చేయడం… పిచ్చి జోకులు ఓ.కే… కానీ మెడికల్ విషయాలు కూడా కనీసం విద్యార్హతలు, పరిజ్ఞానం కూడా లేకుండా ఎవరు పడితే వాళ్ళు, అర్థం లేని సలహాలు, ప్రమాదకరమైన సూచనలు చేయడం… అటువంటి వాళ్ళని జీవితాంతం జైలులో పడెయ్యాలి” అన్నాను కోపంగా.

కళ్ళమ్మట నీళ్ళతో దీనంగా నా వేపు చూస్తున్న సుబ్బారావు భార్యకి ధైర్యం చెప్పాను. “ఏమీ భయం లేదమ్మా. ఇంజక్షన్‌లు ఇచ్చాను కదా. అంతా సర్దుకుంటుంది. ఎందుకైనా మంచిదని ఆసుపత్రికి తీసుకు వెడుతున్నాం… విజయా… మీరు ఇద్దరూ కూడా రండి… నిజానికి మీరు రావడం అవసరం లేదు. కేవలం ఆ అమ్మాయికి ధైర్యంగా ఉంటుందని” అంటూ సాలోచనగా హడావిడిగా బయటకి నడిచాను.

నెట్‌లో పోర్నోగ్రఫీ గురించి అంత హడావిడి చేస్తున్న సంస్థలు, ప్రభుత్వాలు మరి ఈ విషయం ఎందుకు పట్టించుకోరు!!??ఈ విషయంలో ఐ.ఎం.ఏ. ద్వారా నేనే ఏదో చెయ్యాలి అనుకుంటూ అంబులెన్సు ఎక్కాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here