తాతగారి ఫొటో

    0
    10

    [box type=’note’ fontsize=’16’]మానవ సంబంధాల పై పై మెరుగులు తొలగించి లోపలి ప్రపంచాన్ని నిక్కచ్చిగా మేడిపండు ఒలిచినట్టు చూపించిన కథ “తాతగారి ఫొటో”.[/box]

     

    ఆ హాల్లోకి ప్రవేశించినప్పుడు నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. కారణం అక్కడ గోడకి బిగించివున్న నిలువెత్తు పటం!

    ఆ సింహాసనం లాంటి కుర్చీలో కూర్చున్న వ్యక్తి రాజసం, ఆ గాంభీర్యం లోని అందం, ఆ అందం లోని అహంకారం, ఆ చిరునవ్వు లోని గర్వం వెరసి నన్ను స్తబ్ధురాలిని చేశాయి.

    ఆయనే మా తాతగారని గ్రహించడానికి నాకట్టే సమయం పట్టలేదు. నా వయసిప్పుడు ఇరవై రెండు. పుట్టాక నేను తాతగారిని కాని, ఆ యింటిని కాని – అసలు ఇండియాని కూడా చూడలేదు. కనీసం తాతగారితో మాట్లాడి కూడా ఎరుగను.

    ఆ హలు ఒక కాన్ఫరెన్సు హాలని అర్థమవుతోంది. ఆయన ఫొటోకి ముందు ఫొటోలోని కుర్చీ – దాని ముందు అలానే నగిషీలు చెక్కిన టేబుల్ దాని మీద ఇత్తడి కుండీలో అమర్చిన తాజా పూలు, ఎదురుగా ఒక ఇరవై కుర్చీలు వున్నాయి.

    నేను అలానే నా లగేజ్ పట్తుకుని నిలబడి వుండగా ఆ యింట్లో నౌఖరను కుంటాను – “అమ్మా ఎవరు కావాలి?” అని అడిగాడు. నేను జవాబు చెప్పేంతలోనే ఒక పెద్దావిడ జరీ లేని కంచిపట్టు చీరతో మెరుస్తున్న రవ్వల దుద్దులు, ముక్కుపుడకతో వాటి కన్నా మెరుస్తున్న ఛాయతో ఎడమవైపు గదిలో నుండి వచ్చి నా వైపు ప్రశ్నార్థకంగా చూసింది.

    ఆమె మా అమ్మమ్మని గుర్తించడానికి నాకెంతో సేపు పట్టలేదు.

    నేను ఏదో చెప్పబోయేంతలో “అది షమ్మూ – షర్మిలనుకుంటాను. లోపలికి తీసుకెళ్ళు” అన్న గంభీరమైన కంఠస్వరం ఆ డూప్లెక్స్ మేడ పై నుండి వినిపించింది.

    నేను ఆశ్చర్యంగా పైకి చూశాను.

    సదరు ఫొటోలోని వ్యక్తి మేడపైన రెయిలింగ్ పట్టుకుని నిలబడి వున్నారు.

    ఆయనే మా తాతయ్యని గ్రహించడానికి నాకెంతో సేపు పట్టలేదు.

    నేను వెంటనే చిరునవ్వుతో నమస్కారం పెట్టి “నమస్తే తాతయ్యా” అన్నాను. అమ్మ మరీ మరీ చెప్పింది ఇంగ్లీషు పదాలు దొర్లించవద్దని.

    బదులుగా ఆయనేం నవ్వలేదు గాని అమ్మమ్మ మాత్రం “ఇది…ఇది.. ఇందూ కూతురా? మీకు ముందే తెలుసా… ఇది వస్తున్నదని” అంది ఎంతగానో విస్తుపోతూ.

    తాతయ్య అలా అనడం నాకూ ఆశ్చర్యాన్ని కల్గించింది. కారణం మమ్మీ డాడీ నేను ఇండియా బయల్దేరుతున్నట్లుగా తాతయ్యకి తెలియజేయలేదు.

    “సర్లే. ముందు దాన్ని తీసుకెళ్ళి కావల్సినవి చూడు. సముద్రాలన్నీ ఈదొచ్చింది” అంటూ లోనికి వెళ్ళిపోయారు.

    ఆయనలా వచ్చి పరామర్శించకపోవడం నాకేమీ ఆశ్చర్యాన్ని కల్గించలేదు. కారణం ఆయన గురించి అమ్మ ముందే చెప్పడం.

    అమ్మమ్మ మాత్రం నన్ను గట్టిగా కౌగిలించుకుని కన్నీళ్ళు పెట్టుకుంది.

    “పుట్టి చెట్టంతయ్యేకా మనవరాల్ని చూడడం… అంటే ఎంత ఏడుపొస్తున్నదో! ఏమి అనుబంధాలు ఏమి ప్రేమలివి!” అంటూ వద్దన్నా నాకు సేవలు చేయడం మొదలుపెట్టింది.

    “కాసేపు పడుకుంటావా?” అంటూ నన్నో గది లోకి తీసుకెళ్ళింది. లంకంత కొంప. ఖరీదైన ఫర్నిచర్. ఎటు చూసినా దర్పాన్ని చూపిస్తున్న ఇల్లు.

    “వద్దు అమ్మమ్మా! ఫ్లయిట్‌లో బాగానే నిద్ర పోయాను” అన్నాను.

    “సరే స్నానం చేయి.  నేను టిఫిన్ ఏర్పాట్లు చూస్తాను” అంటూ వెళ్ళింది.

    నేను స్నానం చేసి డ్రెస్సయ్యేక అమ్మమ్మ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరకి రమ్మని తీసుకెళ్ళింది.

    అక్కడ ఆల్రెడీ తాతయ్య కూర్చునే వున్నారు.

    నేను కూడ వెళ్ళి కూర్చున్నాను.

    అమ్మమ్మ నాకు పెసరట్లూ, ఉప్మా పెడుతూ, “ఇవన్నీ నీకు నచ్చుతాయో లేదో!” అంది.

    “ఎందుకు, అమ్మ ఇవన్నీ చేస్తుంది. మా ఇంట్లో ఇండియన్ ఫుడ్డే ప్రిపేర్ చేస్తుంది” అన్నాను టిఫిన్ తింటూ.

    “ఇంతకీ వచ్చిన పనేంటి?” తాతయ్య టిఫిన్ తింటూ ప్రశ్నించేరు.

    “ఏంత్రోపాలజీలో రీసెర్చి చేస్తున్నాను. ఇండియాలో స్టడీ చేసి కొంత ఇన్ఫర్మేషన్ సేకరించాలి”

    తాతయ్య తల పంకించేరు.

    ఆ తర్వాత ఆయన విజిటర్స్ రూమ్ లోకి వెళ్ళిపోయారు.

    అమ్మమ్మ మాత్రం నన్ను వదలకుండా కూర్చుంది.

    “మీ అమ్మ రాక్షసి” అంది ఒక్కసారి కోపంగా.

    నేను ఆమె వైపు ఆశ్చర్యంగా చూసేను.

    “మీ అమ్మ నన్నానని నీకు కోపం రావచ్చు.  ముందుగా అది నా కూతురు. ఏదో మీ తాతయ్య పంతానికి పోయారే అనుకో. దానికింత ప్రేమన్నా వుందా మా మీద. అసలు రాకుండా కూర్చుంటుందా ఇన్నాళ్ళు” అంది అమ్మమ్మ కన్నీళ్ళతో.

    “అసలేం జరిగింది?” అనడిగేను.

    “చిన్నదే. పెద్దది చేసుకున్నారు” అంది అమ్మమ్మ విచారంగా.

    “అమ్మది ప్రేమ వివాహమా?”

    “సింగినాదం. లక్షణంగా మేము చూసి చేసిందే.”

    “మరి?”

    “ఏం మీ అమ్మ చెప్పలేదా? మీ నాన్న అసలిక్కడికి రానిచ్చాడా?” అంటూ తిరిగి ప్రశ్నించింది అమ్మమ్మ.

    “అమ్మ నన్ను ఇక్కడికే వెళ్ళమని చెప్పినప్పుడు, నాన్న కొంత అభ్యంతరం చెప్పిన మాట వాస్తవమే. నాన్న తన ఫ్రెండ్ ఇంటికి పంపుతానన్నారు. అమ్మ పట్టుబట్టే సరికి సరే నన్నారు” అన్నాను.

    “అదిగో అతగాడికింకా కోపమే నన్న మాట మా మీద. అంతేలే! బయట నుండి వచ్చిన వాడు. రక్తసంబంధమేముంటుంది” అంది అమ్మమ్మ నిష్ఠూరంగా.

    నేను అమ్మమ్మ భుజాల చుట్టూ చేతులు చుట్టి “అదేం కాదు. తాతయ్య రానిస్తారో లేదో అని భయం. అసలింతకీ ఏం జరిగిందో అది చెప్పు” అన్నాను గోముగా.

    అమ్మమ్మ మెత్తబడింది. “అసలిదంతా ఈయన వలనే. కోపం ఎక్కువ. మీ అమ్మ నిచ్చి చేసినప్పుడు ఇల్లరికం వుండాలి, నా కొక్కగానొక్క కూతురని ఈయన చెప్పలేదు. తీరా పెళ్ళయ్యేక డాక్టరు ఉద్యోగం చేసేవాణ్ణి ఉద్యోగం మానేసి ఇక్కడే వుండి రాజకీయాల్లోకి రమ్మన్నారు. మీ నాన్న ఒప్పుకోలేదు.  ఇంతలో అమెరికా ఛాన్సొచ్చింది మీ నాన్నకి. వెళ్తే మా యింటి గడప తొక్కద్దన్నారు మీ తాతయ్య. అంతే ఎక్కడివాళ్ళక్కడే అయిపోయాం” అంది  బాధగా.

    “అమ్మానాన్నా మిమ్మల్ని గురించి తలచుకోని రోజుండదు. ఎప్పుడూ మీ గురించి ఒక చెడు మాట కూడా వాళ్ళు అనగా వినలేదు” అని చెప్పి అమ్మమ్మని ఊరడించాను.

    ***

    పది రోజులు గడిచేసరికి నాకు ఆ యింట్లో పరిస్థితులన్నీ అర్థమయ్యేయి.

    తాతయ్య ప్రత్యక్ష రాజకీయాల్లో వుండరు. ఒక విధంగా చెప్పాలంటే కింగ్ మేకర్. అన్ని పార్టీల వారూ తాతయ్యని కలుస్తుంటారు. సలహాలు సంప్రదింపులూ జరుపుతుంటారు. తాతయ్య రోజూ పేపర్లో కనిపిస్తుంటరు. ఆ వూరు, ఆ ప్రాంతమూ తాతయ్య చెప్పినవారికే ఓటు వేస్తారు. మంత్రులూ, ఆఖరికి సి.ఎమ్. ఆయనతో మంతనాలు జరుపుతుంటారు. అందుకని ఆ యింట్లో ఎప్పుడూ కోలాహలమే. వచ్చీ పోయే జనమే. పార్టీలు, మర్యాదలూ మామూలు తతంగమే.

    ఇక అమ్మమ్మ తయారులో, పాటించే పద్ధతుల్లో సనాతనమే కనిపిస్తుంది. వయసు మీద పడినా అందమైన రూపం, అందులో పూజ్యభావమే గోచరిస్తాయి. తాతయ్యకి ఏ లోటూ లేకుండా చూడడం, ఆ యింటి మర్యాదని కాపాడుకోవడం ఆమె బాధ్యత. మాట మీరని స్వభావం, పూజలు పుణ్యాలు ఆమెవి.

    నేను వచ్చాక అమ్మమ్మ మొహంలో తళుకులద్దినట్లుగా కనిపిమ్చే మెరపు నా కంటిని దాటిపోలేదు.

    తాతయ్య కారు, ఇద్దరు మనుషుల్ని ఇచ్చి నన్ను కావల్సిన ప్రాంతాలకి రీసెర్చి కోసం పంపిస్తుండేవారు. రాత్రి అమ్మకి ఫోనులో అన్ని చేరవేస్తుండే దాన్ని.

    ***

    ఆ రోజు దురదృష్టకర మైనది.

    తెల్లవారే సరికి తాతయ్య నిద్రలోనే ప్రాణాన్ని వదిలేసేరు. ఊరూ వాడా గగ్గోలయి పోయింది.

    వచ్చే పోయే జనంతో ఇల్లు సముద్రమై పోయ్యింది. ఇల్లే కాదు – రోడ్డంతా పూల తెప్పయి పోయింది.

    అమ్మా నాన్నా వచ్చేరు.

    కొడుకులు లేనందు వలన నాన్నే తల కొరివి పెట్టేరు.

    తతంగమంతా యాంత్రికంగా జరిగిపోయింది.

    అమ్మమ్మ మాత్రం ఒక గదిలో మౌనంగా కూర్చుంది.

    పదిహేను రోజుల కర్మకాండలు జరిగేక అమ్మా నాన్నా అమ్మమ్మని తమతో రమ్మని అడిగారు. అమ్మమ్మ మౌనంగానే తిరస్కరించింది.

    అమ్మమ్మ ఏ వైధవ్యపు చాంధస ధర్మాలు పాటించలేదు. అలా పాటించమని అడిగే ధైర్యం కూడ ఎవరికీ లేదు.

    అందుకని నాకు అమ్మమ్మ చాల నచ్చింది.

    నాకు ఇండియాలో ఇంకా పని వుండటం వలన నాన్నా అమ్మా వెళ్ళిపోయారు.

    ***

    చుట్టాలూ పక్కాలూ అందరి పలకరింపులూ అయిపోయాక నేను ఏదో నోట్సు రాసుకుంటుండగా హాల్లో ఏదో చప్పుడు వినిపించి బయటకి వచ్చాను.

    హాల్లోని నిలువెత్తు తాతయ్య ఫొటోని ఇద్దరు మనుషులు ఊడదీస్తున్నారు. అమ్మమ్మ నిలబడి వుందక్కడ.

    “ఎందుకమ్మమ్మా ఫొటో అక్కణ్ణుండి తీయిస్తున్నావు?” అనడిగేను ఆశ్చర్యంగా.

    అమ్మమ్మ నాకు జవాబు చెప్పలేదు. “తీసుకెళ్ళి వెనక అవుట్ హౌస్ స్టోర్‌రూమ్‌లో పెట్టండి” అని పనివాళ్ళకి చెప్పి గిర్రున వెనుతిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది అమ్మమ్మ.

    నేను మరింత ఆశ్చర్యపోతూ అమ్మమ్మ గదిలోకి తన వెంట నడిచాను.

    ఫొటోలో తాతయ్య ఎంతో సజీవంగా, అందంగా అచ్చు ఆయనే కూర్చున్నట్టుగా వున్నారు. ఆ ప్రాంతంలో వున్న ప్రముఖ చిత్రకారుడు తాతయ్య మీద మక్కువతో వేసి మరీ యిచ్చారట.

    అమ్మమ్మ దించుకున్న కళ్ళు ఎత్తి నా వైపు చూసి, “ఇప్పటిదాకా చూసింది చాలు. నీకు కావాలంటే పట్టుకెళ్ళు. లేదంటే ఆవిడ కిచ్చిరా!” అంది.

    నేను తెల్లబోయేను.

    ఇన్ని సంవత్సరాలుగా ఎంతో అణకువ కలిగిన ఇల్లాలుగా పేరు తెచ్చుకున్న అమ్మమ్మ మాటల్లో ఏదో తేడా కనిపించింది.

    ఇన్ని సంవత్సరాలు చూసింది చాలా?

    “ఆవిడ… ఆవిడెవరు?” అని మెల్లిగా అడిగాను. బదులుగా అమ్మమ్మ కళ్ళ నుంచి జలజలా నీళ్ళు రాలాయి.

    “ఎన్నో సంవత్సరాలుగా నా గుండెలో దాచుకున్న అగ్నిగుండం యిది. ఆయనకో ప్రియురాలు వుంది. సరస సల్లాపాలూ, ప్రేమలూ అన్నీ ఆమెతోనే. నేను పేరుకి మాత్రమే ఇల్లాలిని. లావాని దాచుకుని మంచు ముసుగేసుకున్న రాతి కొండని. అందుకే ఇకతని మొహం ఫొటోల్లో కూడా చూడటం నాకిష్టం లేదు” అంది అమ్మమ్మ మెల్లిగా నయినా కఠినంగా.

    “మరి… మరి ఇన్ని సంవత్సరాలూ ఎందుకు కలిసున్నావు?” అనడిగాను ఆశ్చర్యంగా. ఎంతయినా అమెరికాలో పుట్టి పెరిగినదాన్ని. అక్కడ ఎంత భార్యాభర్తలైనా ఎవరి జీవితాలు వారివి.

    తమని తాము కష్టపెట్టుకుంటూ ఎదుటివాడు పెడుతున్న కష్టాల్ని భరించి తమ జీవితాన్ని వృథా చేసుకునే అర్థం లేని త్యాగాలు వాళ్ళు చెయ్యరు.

    అమ్మమ్మ శుష్కంగా నవ్వింది.

    “ఈ లోకానికి భయపడో – ఒంటరిగా బ్రతక లేననో యిలా వుండి పోలేదు. ఎక్కడికెళ్ళినా ఒక దుఃఖం నా వెంటే వీడకుండా వస్తుంది. ప్రపంచంలో ఏ దేశంలోనయినా పెళ్ళి స్త్రీ జీవితాన్ని తారుమారు చేస్తుంది. మనసున్న మనిషి దొరకక పోతే విడాకులు తీసుకున్నా దొరికే సుఖం ఏమీ వుండదు. అందుకే ఇలా వుండి పోయాను. వ్యక్తిత్వమొచ్చిన పిల్లవి కదా – అందుకే ఇవన్నీ చెప్పేను” అంది అమ్మమ్మ.

    నాకు అమ్మమ్మ అర్థమైంది.

    “సరే అమ్మమ్మా, ఆవిణ్ణి అడిగి చూస్తాను. ఆవిడ పేరు….”

    “లావణ్య. లావణ్యంగానే వుంటుంది. డ్రైవర్‌కి తెలుసు. తీసుకెళ్తాడు. వెళ్ళు” అంది అమ్మమ్మ.

    ***

    ఆ యిల్లు చిన్న కుటీరంలా అందంగా వుంది.

    చాలా పెద్ద యిల్లు కాకపోయినా పరిసరాలన్నీ మనోహరంగా వున్నాయి. ముఖ్యంగా ఆ తోట, ఆ తోటలో గుభాళించిన పూలు వచ్చేవారి హృదయాలపై ఎక్కుపెట్టిన సమ్మోహన బాణాల్లా వున్నాయి.

    గుమ్మాని కిరువైపులా అమర్చిన టెర్రాకోటా బొమ్మలు, కలంకారీ తెరలూ, గోడల కమర్చిన పెయింటింగ్సు హాల్లో తూగుటుయ్యాల అన్నీ… ఆ యింటి యజమానురాలి అభిరుచికి అద్దం పడుతున్నాయి.

    నన్ను చూడగానే పనమ్మాయి లోనికి వెళ్ళి చెప్పడంతో ఆమె బయటకి వచ్చింది.

    చిరునవ్వుతో నన్ను చూసి “ఎవరమ్మా” అనడిగిందామె.

    “నా పేరు షర్మిల. రాయుడి గారి….”

    “ఓ నువ్వేనా! ఇండియా వచ్చినట్టు ఆయన చెప్పేరు. రా!” అంటూ చెయ్యి పట్టుకుని లోనికి తీసుకెళ్ళింది.

    లోపల రేక్స్‌లో సర్దుకుని కూర్చున్న సాహిత్యం, ఒక నగిషీ బెంచీ మీద పెట్టిన వీణ – అన్నీ ఆమెకి వాటి పట్ల వున్న పాండిత్యానికి ప్రతీకలుగా వున్నాయి.

    ఆమె వెళ్ళి స్వయంగా కాఫీ కలుపుకుని వచ్చి నా కో కప్పు యిచ్చి తనో కప్పు తీసుకుని నా గురించి వివరాలడిగి తెలుసుకుంది పరిచయాలకి నాందిగా.

    “తాతయ్య పోయారు” అన్నాను ప్రస్తావనకి నాందిగా.

    “తెలుసు. వచ్చే పరిస్థితి లేదు.”

    చట్ట పరిమితిలో లేని ఆమె సంబంధం ఎంత అవకాశమిస్తుందో నాకూ తెలుసు కాబట్టి మౌనం వహించాను.

    “అమ్మమ్మ అంతా చెప్పింది. ఆమె మిమ్మల్ని నిందించలేదు. కాని తాతయ్య మీద ఆమె విరక్తి చెందిందని నిన్ననే తెలిసింది.”

    “అది సహజం. ఆమె చాలా ఉత్తమురాలు.”

    “కాన్ఫరెన్సు హాలులో వున్న తాతయ్య ఫొటో నిన్న అమ్మమ్మ తీయించేసింది. నిలువెత్తు ఫొటో. తాతయ్యే సజీవంగా వున్నట్లున్నారు. అది స్టోర్‌రూమ్‌లో చేరడం నాకు నచ్చలేదు. మీకిష్టమైతే దాన్ని మీ కిద్దామని వచ్చేను.”

    ఆమె కాసేపు తల దించుకుంది.

    ఆ తర్వాత “వద్దమ్మా. నాకూ వద్దు” అంది నెమ్మదిగా.

    నేను విస్తు పోయాను.

    “కాని… అమ్మమ్మ చెప్పింది మీ రిద్దరూ…”

    ఆమె తలెత్తి నవ్వి “అదొక నాటకం. అంతే” అంది.

    ఈసారి విస్తుపోవడం నా వంతయ్యింది.

    “అంటే… నా కర్థం కాలేదు” అన్నాను వింతగా.

    “నీకే కాదు. ఎవరికీ అర్థం కానిది. ఇంత వయసొచ్చి పరిణతి చెందేవు కాబట్టి చెబుతున్నాను. ఆయన ఒక రాజకీయవేత్త. ఆయన నరనరాల్లోనూ రాజకీయం వుంది. నా భర్త ఆయన దగ్గర పని చేసేవారు. ఆయనొకసారి నా భర్తతో నన్ను చూశారు. కన్నేసారు. చిన్నగా మా యిద్దరి మధ్యా తగవులు సృష్టించి వాటిని తన పెద్దరికంతో రాజీ పేరుతో రాజేసి పూర్తిగా విడదీసేరు. ఆ తర్వాత నన్ను అమితంగా ప్రేమించినట్లు నటించి, నా సాన్నిహిత్యంలో కొంత భాష నేర్చుకుని తన ఉపన్యాసాలు నా చేత రాయించుకుని పూర్తిగా నన్ను తన గుప్పెట్లో పెట్టుకున్నారు. ఆయనకి నాతోనే కాదు – అనేక మంది స్త్రీలతో సంబధాలున్నాయి.”

    “మరెందుకలా ఆయనతో – ఇలా వుండిపోయారు?”

    “ఈ పురుషాధిక్య ప్రపంచంలో వినేవారెవరు? మీ తాతని తప్పించుకుని బ్రతకడం అసాధ్యం. ఇంకో సంగతి. నాలోపల ఇంత అసహ్యం, బాధ వున్నాయని ఆయనకి కూడా తెలియదు.”

    నా కంతా అర్థమయ్యింది.

    ఆమెకి నమస్కరించి యింటికి తిరిగొచ్చేను.

    ఆ వెంటనే అమ్మకి ఫోను చేసేను.

    “ఎప్పుడొస్తున్నావ్, అమ్మమ్మ వస్తానంటుందా?”

    “లేదు. అమ్మమ్మే కాదు – నేను కూడ అమెరికా రావడం లేదు.”

    “అర్థం కాలేదు.”

    “నేను అమ్మమ్మకి తోడుగా ఇండియాలోనే వుండాలనుకుంటున్నాను.”

    “మరి కుమార్ సంగతి?” అమ్మ ప్రశ్న.

    కుమార్ నా ఫియాన్సీ.

    “అతనికి రాత్రే చెప్పాను. అతను కూడా ఇండియా రావడానికి ఒప్పుకున్నాడు.”

    నా మాటలు వింటున్న అమ్మమ్మ కళ్ళు మెరిసేయి. నన్ను గట్టిగా కౌగిలించుకుంది.

    ఆ రాత్రి అమ్మమ్మ పడుకున్నాక మెల్లిగా వెళ్ళి స్టోర్ రూమ్ తలుపు తెరిచి చూసేను.

    ఇప్పుడు తాతయ్య మొహంలో క్రౌర్యం, కౌటిల్యం, స్వార్థం తాండవం చేస్తూ కనిపించాయి.

    ఆ ఫొటో మీద ఎలుకలు పరుగులు పెడుతున్నాయి.

    (సమాప్తం)

    మన్నెం శారద

    9618951250

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here