తథాస్తు!

0
9

[dropcap]మ[/dropcap]ల్లికకు తెరలు తెరలుగా నవ్వొచ్చేస్తోంది. మనసంతా తెలియని తృప్తితో నిండిపోసాగింది. చిన్నప్పుడు సన్నని వాన తుంపర్లు పడటం మొదలవగానే, స్నేహితులతో కలిసి వాకిట్లో ‘వానా వానా వల్లప్పా!’ అంటూ రెండు చేతులూ చాచి గుండ్రంగా తిరిగినట్టు తిరగాలని అనిపిస్తోంది…

‘భగవంతుడా… నువ్వున్నావు… నువ్వున్నావు తండ్రీ…’ అంతులేని ఆనందంతో ఆమె మనసు, కళ్ళు నిండిపోయాయి…

***

 ఎదురుగా కనిపిస్తున్న దృశ్యాన్ని చూస్తున్న అరవింద షాక్ తిన్నట్టుగా అట్టే నిలబడిపోయింది… ‘ఇది నిజమా? లేక కలగంటున్నానా?’ మనసులో అనుకోసాగింది…

‘లేదు… కలగనటం లేదు… న్యాయంగా నువ్వేం కావాలనుకున్నావో అదే జరుగుతోంది…’ ఎవరో సమాధానం చెప్పినట్టుగా అనిపించింది…

తృప్తి నిండిన మనసుతో ఆమె తల పంకించింది.

***

“ఏమండీ… మీరు రేపు ఆఫీసుకు వెళ్ళాలి కదా… బాక్స్ లోకి ఏం పెట్టను?” ఆరాత్రి అడిగింది మల్లిక.

“బాక్స్ అక్కరలేదు…” ముభావంగా చెప్పాడు మూర్తి.

“అదేమిటి?”

“అదంతేలే…”

ఉదయం తొమ్మిదికల్లా తయారై, మంచి బట్టలు వేసుకుని, సెంట్ కొట్టుకుని ఆఫీసుకు వెళ్ళిపోయాడు మూర్తి.

మల్లిక స్నానం చేసి, కాంపౌండ్ లోని కామన్ పంపు దగ్గర బట్టలు ఉతుక్కుందామని వెళ్ళింది.

“ఏమ్మా, ఎలా ఉంది కొత్త కాపురం?” ఆదరంగా అడిగింది పక్కవాటాలోని ఆవిడ. తన తల్లి వయసే ఉన్న ఆమె వైపు గౌరవంగా చూస్తూ, “ఫరవాలేదండీ…” అంది కాస్త ఒద్దికగా సిగ్గు పడుతూ.

ఆమె వెంటనే ఏమీ మాట్లాడలేదు.

“నీకు కొత్త కదమ్మా… ఏమైనా కావాలంటే నన్ను అడుగు. నా పేరు రత్నమ్మ. ఈ వాటాలో ఉంటాను. ఆ వాటాలో పోస్ట్‌మేన్ రంగా, అతని భార్య రాణి ఉంటారు…” అంది పరిచయం చేసుకుంటున్నట్టుగా…

“అలాగే పిన్ని గారూ…” ఆత్మీయంగా వరస కలిపింది మల్లిక.

“సరేనమ్మా, పనుంది, మీ బాబాయ్ గారికి అన్నం వడ్డించాలి…” అంటూ లోపలికి వెళ్ళిపోయింది రత్నమ్మ.

బట్టలు ఉతుక్కుని, అక్కడే కట్టి ఉన్న ప్లాస్టిక్ తాడు మీద క్లిప్పులు పెట్టి ఆరేసి, తన వాటాలోకి వచ్చేసింది మల్లిక.

ఆ రాత్రి బాగా పొద్దుపోయాక వచ్చాడు మూర్తి. మామూలుగా కాదు… బాగా తాగేసి.

అతన్ని అలాంటి పరిస్థితిలో చూసిన మల్లిక భయపడిపోయింది.

“హేయ్… ఎందుకే బయ్యం? తాగానంతే… దోస్తులంతా పార్టీ ఇమ్మని అడిగితే… తప్పలేదు…” అన్నాడు ముద్దముద్దగా…

“సరే… రండి… భోజనం చేద్దాం…” అందామె మెల్లగా…

“నేను తినేషొచ్చా. నువ్వు కానిచ్చి తొరగా వొచ్చేయ్…” వెకిలిగా నవ్వాడు.

మల్లిక గుండెల్లో రాయిపడింది. ఈ తాగినవాడితో వాడి వాసనలన్నీ భరిస్తూ ఇప్పుడు పక్క పంచుకోవాలా?

ఎలాగో నాలుగు మెతుకులు నోట్లో వేసుకుని గదిలోకి వచ్చి చూసేసరికి, మంచం మీద గురకలు పెడుతూ నిద్రపోతున్నాడు మూర్తి.

‘బతుకు జీవుడా!’ అనుకుంటూ మంచం పక్కన ఉన్న కొద్ది జాగాలో చాప వేసుకుని పడుకుంది.

ఆమెకు నిద్ర పట్టలేదు. స్థిరాదాయం వచ్చే ప్రభుత్వోద్యోగముందని, మూర్తి అందగాడు కాకపోయినా, తల తాకట్టు పెట్టి మరీ డబ్బు తెచ్చి, అరవైవేల రూపాయలు కట్నంగా ఇచ్చి పెళ్ళిచేసాడు తన తండ్రి. డిగ్రీ చదువుతున్న తనను చదువు మానిపించి మరీ ఈ పెళ్ళి చేసాడు. తనకు చదువుకోవాలని ఉన్నా, తండ్రి బాధను, బాధ్యతను అర్థం చేసుకుని, పెళ్ళికి ఒప్పుకుంది. మొదట్లో మూర్తి అంటే ఏ భావమూ లేకపోయినా, మూడుముళ్ళు పడి, శారీరకంగా ఒకటి అయిన తరువాత అతనితో ఏదో అనుబంధం ఏర్పడినట్టైంది. కానీ మొదటిరోజునుంచీ కూడా అతను తనతో ముభావంగానే ఉన్నాడు.

తాను ఎంత సరదాగా మాట్లాడినా, అతనిలో పెద్ద స్పందన ఉండదు. తన మీద కాంక్ష తప్ప ప్రేమ లేదని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే, తనతో చనువుగా మాట్లాడడు, తనను మాట్లాడనీయడు. అతని ఉద్యోగం గురించి, ఆఫీస్ గురించి ఏదో అడగబోతే మాట తప్పించాడు. ఇప్పుడు తాగి వచ్చాడు. అతని తీరు చూస్తే ఈ అలవాటు బాగానే ఉన్నట్లు అనిపిస్తోంది. పైగా కోపం కూడా ఎక్కువేనని అనిపిస్తోంది. బయటకు వెళ్ళినప్పుడు రావలసిన చిల్లర కోసమని ఆటో డ్రైవర్ తో గొడవ పెట్టుకున్నాడు. అప్పుడితను వాడిన కుసంస్కారమైన భాషకు తల గిరగిరా తిరిగిపోయింది. ఇలాంటి వాడితో తన జీవితం ఎలా ఉండబోతోంది?

దారుణం… అందమైన బొమ్మ పైనున్న రంగులన్నీ వెలిసిపోయి, లోపలి మట్టిబొమ్మ కనిపించినట్టు అతని అసలైన స్వరూపం కనిపిస్తోంది.

మల్లిక తండ్రి వ్యవసాయదారుడు. తల్లి లేదు. తన తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. దూరపు బంధువులెవరో చెప్పగా మూర్తి సంబంధం వచ్చిందని వెంటనే పెళ్ళి చేసేసారు. మూర్తి తల్లిదండ్రులు కూడా తమ పక్క పల్లెలోనే ఉంటారు.

రకరకాల భయాలతో మల్లిక గుండె గుబులుగా అయిపోయింది. తనకు తెలియకుండానే ఏడుపు పొంగి వచ్చింది. అలా బాధపడుతూనే నిద్రలోకి జారుకున్న ఆమెకు, తన మీద ఏదో బరువుగా పడినట్టు అవటంతో మెలకువ వచ్చింది. తనపైకి వంగి, హత్తుకుంటున్న భర్తను చూడగానే అసంకల్పితంగా ఆమె చేతులు అతనిని దూరంగా తోసెయ్యబోయాయి.

“ఏయ్… మల్లికా… నేనే… ఏంటిలా బిగుసుకుపోయావు?”

ఆమె ముఖం పైన అతని ఊపిరి వెచ్చగా తగులుతుంటే, ఆ వాసనకు ఆమెకు కడుపులో దేవినట్టైంది.

“ప్లీజ్… నాకు ఆ వాసన పడదు… చాలా అసహ్యం. ఈరోజు వద్దు… మీరు వెళ్ళి పడుకోండి…” ముఖం తిప్పేసుకుంటూ విడిపించుకోవటానికి వేడికోలుగా, ప్రయత్నిస్తూ అంది.

జవాబుగా ఆమె చెంప ఛెళ్ళుమంది. ఆమె కళ్ళు చీకట్లు కమ్మినట్టు అయింది. శరీరానికి కలిగిన నొప్పి కన్నా, మనసుకు తీవ్రమైన ఘాతం తగిలిన భావన కలిగింది. తన భర్త తనను కొట్టాడు… మగడిని చూస్తుంటే,ఒక మృగాన్ని చూసున్నట్టు అనిపించింది.

“నువ్వు నా పెళ్ళానివే… ఇష్టపడి తీరాలి. నేను రోజూ తాగుతాను. అది నా అలవాటు. నువ్వు కూడా భరించటం అలవాటు చేసుకోవాలి!”

“నాకిష్టం లేదండీ. ప్లీజ్ వదలండి.” చెంప పట్టుకుని ఏడుస్తూ అన్నది మల్లిక.

“నేను నిన్ను పెళ్ళిచేసుకుంది ఎందుకే? ఈ సుఖానికే కదా! నువ్వు నా బానిసవు… బానిసలకు ఇష్టాలుండవమ్మా. మొగుడు చెప్పినట్టు వినవలసిందే…”

ఆమె ప్రతిఘటనను లెక్కచేయకుండా బలవంతంగా తన కోర్కె తీర్చుకున్నాడు మూర్తి. ఆ తరువాత విజయగర్వంతో లేచి మంచమెక్కి మత్తుగా నిద్రపోయాడు.

తనకిష్టం లేకుండా అలా జరిగినందుకు అవమాన భారంతో మల్లిక మనసు క్రుంగిపోయింది. సగం ప్రాణాలు పోయినట్టు అయింది.

మిగిలిన ప్రాణాలు మర్నాడే హరించబడ్డాయి.

***

ఆ మర్నాడు భర్త తయారై వెళ్ళిపోయిన తరువాత, స్నానం చేసి, తులసికోటలో కొలువైన తులసమ్మకు దణ్ణం పెట్టుకుని లోపలికి రాబోతూ ఉంటే, తన ఇంట్లోకి రమ్మని రత్నమ్మ పిలవటంతో వెళ్ళింది మల్లిక.

ఆమెను కూర్చోబెట్టి, “కాఫీ తాగుతావా తల్లీ?” అని అడుగుతూనే, చిన్న గ్లాసుతో కాఫీ తెచ్చి ఇచ్చింది రత్నమ్మ.

మల్లిక మెల్లగా కాఫీ తాగుతూ ఉండగా, “ఏమ్మా? పెళ్ళికి ముందు మూర్తి గురించి అంతా తెలుసుకున్నారా?” అని మెల్లగా అడిగింది, రత్నమ్మ.

మల్లిక ముఖం పాలిపోయినట్టు అయింది. “ఏం పిన్నీ? ఏమైంది? ఎందుకలా అడుగుతున్నారు?”

“ఏం లేదమ్మా… అతను ఉద్యోగానికే వెళ్ళాడా ఇప్పుడు?”

“అవును పిన్నీ… సెక్రటేరియట్‌లో క్లర్క్‌గా చేస్తున్నారు…”

“కంగారు పడకమ్మా… సెక్రటేరియట్‌లో కాదమ్మా, అతను జె అండ్ బీ చిట్ ఫండ్ కంపెనీలో పని చేసేవాడు…” అక్కడే కుర్చీలో కూర్చుని ఉన్న చలమయ్య చెప్పాడు.

“బాబాయ్… అదీ…” కంగారు పడింది మల్లిక.

“విషయం నీకు తెలియాలని చెబుతున్నానమ్మా… మీరు అమాయకంగా వీడికి దొరికి పోయారు. నిజానికి ఈ ప్రైవేట్ ఉద్యోగం కూడా ఊడిపోయింది. చిట్ ఫండ్ కంపెనీ కదా… క్యాషియర్‌గా చేసేవాడు. పేకాట, తాగుడు కోసమని అప్పులు చేసి, అవి తీర్చటం కోసం ఆఫీసు సొమ్ము దొంగిలిస్తే, వాళ్ళు పోలీస్ కేసు పెట్టారు. అటు ఉద్యోగం ఊడిపోయింది. ఇంకెక్కడో డబ్బు తెచ్చి ఆఫీసులో పెనాల్టీతో సహా కట్టాడు. ఇప్పుడు మరి ఎక్కడైనా చేస్తున్నాడో లేదో కానీ… నిన్ను పెళ్ళి చేసుకుని తీసుకువచ్చాడు. చక్కగా పేరుకు తగినట్టు మల్లె పువ్వులా ఉన్నావమ్మా… ఈ దుర్మార్గుడి చేతిలో పడ్డావు. వీడికి లేని వ్యసనం లేదు. దరిద్రపు స్నేహితులున్నారు. రోజూ మందేస్తాడు… అమ్మాయిల దగ్గరకు కూడా వెళతాడని విన్నాము. మాలో ఎవరితోనూ కలవడు, మాట్లాడడు. ఎందుకంటే, మంచిగా ఉండమని మేము చెబుతామని…” ఆగాడు ఆయన.

మూర్తికి ఉద్యోగం లేదన్న విషయం వినగానే మల్లిక నిర్ఘాంతపోయింది. ఇలాంటి వాడికా తన తండ్రి అప్పుచేసి మరీ కట్నమిచ్చి పెళ్ళి చేసింది? చెమట పడుతున్న అరచేతులను కొంగుకు తుడుచుకుంటూ మౌనంగా కూర్చుంది. ఆమె కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. అర్జెంట్ గా తనకు ఏకాంతం కావాలి. అవును… ఏడవటానికి తనకు ఏకాంతం కావాలి!

మల్లిక గభాల్న లేచి, రెండు చేతులూ జోడించి, ఆ దంపతులకు నమస్కరించి, బయట పడింది. తన వాటా తలుపులు తీసి, లోపలికి వచ్చి, నేల మీద కూలబడి బావురుమని రోదించసాగింది.

***

చాలా సేపటి తరువాత లేచి, వంటింటి సింక్‌లో ముఖం కడుక్కుని, రెండు గ్లాసుల మంచి నీళ్ళు తాగి ఆలోచనలో పడింది మల్లిక. తాము ఘోరంగా మోసపోయామని అర్థమైంది. ఇపుడు అతనికి జాబ్ లేదు. మరి తనను ఎలా పోషిస్తాడు? ఇంటి అద్దె, సరుకులు, ఖర్చులు ఎలా వెళతాయి?

ఇప్పుడు తన పరిస్థితి ఏమిటి? ఇతనితో ఉండాలా, ఇంటికి వెళ్ళిపోవాలా? మంచి మాటలతో అతన్ని దారికి తీసుకువచ్చి, ఏదో ఒక ఉద్యోగం చేయమని చెబితే వింటాడా? తను కూడా ఏదో ఒకటి ఇల్లు గడవటానికి పని చూసుకుంటే సరిపోతుంది. ఆలోచనలో పడింది మల్లిక. కానీ అతను చెప్పిన అబద్ధాలు, అతని జీవన విధానం తలచుకుంటేనే ఆమెకు మనసులో విపరీతమైన ఆగ్రహం కలుగసాగింది… వివేకం ఆమెను హెచ్చరించగా, సహనంగా ఉండాలని నిర్ణయించుకుంది మల్లిక.

ఎందు వల్లనో కానీ ఆరోజు కాస్త త్వరగానే అంటే ఏడున్నరకల్లా ఇంటికి వచ్చాడు మూర్తి. వస్తూ వస్తూ జిలేబీ, మల్లెపూలు తీసుకువచ్చి భార్యకు ఇచ్చాడు. ఆమె మౌనంగా టీ అందించి, ఎదురుగా కూర్చుంది.

టీవీ చూస్తున్న అతనితో, “అది కాస్త ఆపితే, మీతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడతాను…” అంది స్థిరంగా.

అతడి భ్రుకుటి ముడిపడింది. ఆమె వైపు అదోలా చూస్తూ, టీవీ ఆపేసి, “ఆ… చెప్పు…” అన్నాడు.

“మీ జాబ్ పోయిందట కదా…” సూటిగా విషయంలోకి వచ్చేసింది ఆమె.

ఉలిక్కిపడ్డాడు మూర్తి.

“ఏ ఎదవ చెప్పాడు?’

“ఏ ఎదవ అయితేనేం, నిజమేనా?”

“అయితే తెలిసిపోయిందన్నమాట. ఆ చలమయ్య గాడేనా చెప్పింది? అసలు వాళ్ళతో మాట్లాడమని ఎవరు చెప్పారు? బుద్ధిలేని గాడిదా!” అన్నాడు మూర్తి కోపంగా.

“ఇప్పుడు ఏం చేయదలచుకున్నారు?” అతని మాటలకు రియాక్ట్ అవకుండా అన్నది మల్లిక.

“అంటే?”

“ఇల్లు గడవాలి కదా… మరి ఏం చేయదలచుకున్నారు?

అదోలా నవ్వాడు మూర్తి.

“నువ్వున్నావు కదా…”

“అంటే? నన్ను జాబ్ చేయమని అర్థమా?”

“జాబే చెయ్యనక్కర లేదు…”

“ఛీ ఛీ… ఏం మాట్లాడుతున్నావ్? నువ్వసలు మొగుడి వేనా?” ఛీత్కరించింది మల్లిక.

“నన్ను నువ్వంటావా? మొగుడన్న గౌరవం లేదటే…” ఎర్రబడిన కళ్ళతో ఆమె జుట్టు పట్టుకున్నాడు మూర్తి. ఆమె చెంపలను వాయించటం మొదలుపెట్టాడు.

అతన్ని తప్పించుకోవటం కోసం వెనక్కి జరిగింది మల్లిక.

“అంటాను… గౌరవం పొందవలసిన మనిషివి కానే కాదు… భార్య గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నావు? అసలు నీకు పెళ్ళెందుకు? నేనే వదిలేస్తున్నా నిన్ను… ఇక ఒక్కడివీ ఊరేగు…”

“ఎక్కడికి వెళతావ్?” వెటకారంగా అన్నాడు మూర్తి.

“ఎక్కడికో నీకు చెప్పాల్సిన అవసరం లేదు… ఇదిగో… నా ఒంటిపైన నీ చెయ్యి మరోసారి పడిందో… మర్యాదగా ఉండదు… కోపంగా అరిచింది మల్లిక.

“ఏం చేస్తావే?” మళ్ళీ వచ్చి ఆమె జుట్టు పట్టుకోబోయాడు.

మల్లిక కళ్ళు మూసుకుని మనసులో అనుకుంది… ‘వీడిని బాగా కొట్టాలని ఉంది… ఈ దరిద్రుడికి భగవంతుడు ఏదైనా శిక్ష వేస్తే బాగుండును…”

మల్లిక దగ్గరగా వచ్చి ఆమె కురులను ఒడిసి పట్టుకోబోయిన అతని చేతులు గాలిలోనే ఆగిపోయాయి. అతని చెంపల మీద దెబ్బలు… ఫెడీ ఫెడీ అని ఎవరో కొడుతున్నారు. చేతులు పట్టుకుని వాటిని మెలి తిప్పుతున్నారు… వాటిని తప్పించుకోవటానికి తన చేతులు అడ్డం పెట్టుకున్నాడు మూర్తి. అయినా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఉన్నట్టుండి అతని జుట్టును ఎవరో పట్టుకున్నట్టు అయింది. పిడికిట్లో జుట్టును పట్టుకుని గట్టిగా లాగుతూ ఊపుతూ ఉంటే ప్రాణం పోయినంత బాధ కలుగుతోంది అతనికి…

జరుగుతున్నదంతా చూస్తున్న మల్లిక నిశ్చేష్టురాలు అయింది. ఎందుకలా అయిపోతున్నాడు మూర్తి? ఎవరో కొడుతున్నట్టు దెబ్బల శబ్దం వినపడుతోంది. కానీ ఎవ్వరూ కనిపించటం లేదు… ఎవరు? ఎవరు? ఇలా శిక్షిస్తున్నారు?

ఎందువలన ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ మూర్తి అవస్థకు మాత్రం మల్లికకు తెరలు తెరలుగా నవ్వొచ్చేస్తూ, మనసంతా తెలియని తృప్తితో నిండిపోసాగింది.

***

సేల్స్ రిపోర్ట్ తయారు చేస్తున్న అరవింద దగ్గరకు వచ్చింది లక్ష్మి.

“ఏమ్మా, కంప్లీట్ అయిందా?”

“అయిపోయింది మేడమ్… ఒక్క ఐదు నిమిషాలు…” అంటూనే త్వరత్వరగా పేపర్స్ మీద నింపుకున్న డేటాను సిస్టంలో టైప్ చేయటం మొదలు పెట్టింది.

“ఈరోజు మధ్యాహ్నం మనకు కొత్త బాస్ జాయిన్ అవుతారట…” చెప్పింది లక్ష్మి.

“అవునా మేడమ్? మన పాత బాస్ లాగా మంచిగా ఉండి, అందరినీ ఎంకరేజ్ చేస్తే బాగుండును… ఆయన్ని బాగా మిస్ అవుతున్నాము…” పని చేస్తూనే అన్నది అరవింద.

“ఈయన చాలా స్ట్రిక్ట్ అని, ఉమన్ ఎంప్లాయీస్ అంటే సదభిప్రాయం లేదని విన్నాను… పాత ఆఫీసులో అంత మంచి పేరు లేదు… మనం కూడా ప్రిపేర్డ్‌గా ఉండాలి…” తగ్గు స్వరంతో చెప్పింది లక్ష్మి.

అనుకున్నట్టే ఆరోజు మధ్యాహ్నం వేరే సిటీలో ఉన్న బ్రాంచి నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ అయాడు, పాపారావు.

రావటం రావటమే ఇంచుమించుగా అయిదారుగురు ఉన్న స్త్రీ ఉద్యోగుల వైపు తేరిపార చూసాడు.

“పెళ్ళిళ్ళు చేసుకుని ఇంట్లో భర్తా పిల్లలను చూసుకోక ఎందుకొచ్చిన ఉద్యోగాలో ఈ ఆడాళ్ళకు…” జనాంతికంగా అన్నాడు.

“ఈ బ్రాంచ్ లోనే కాదు, మన కంపెనీలోనే కష్టపడి పనిచేసేది ఉమెన్ స్టాఫేనండీ…” వినయంగా అన్నాడు రఘురామ్. అతను ఆఫీసులో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆ మాటలకు పాపారావు ముఖం అప్రసన్నంగా తయారైంది.

అందరివైపూ చూసి తల పంకించాడు… అరవిందను చూసిన అతని కళ్ళు మెరిసాయి. అందరికన్నా చిన్నమ్మాయి అరవింద. గ్రాడ్యుయేట్ కాగానే ఉద్యోగంలో చేరింది. అందంగా, ఆరోగ్యంగా ఉన్న అరవిందను చూడగానే పాపారావులోని కీచకుడు నిద్ర లేచాడు.

ఆరోజు నుంచి అవసరమున్నా లేకపోయినా అరవిందను మెచ్చుకోవటం, ఆమె పనిని మెచ్చుకుంటూ భుజం మీద తట్టటం వంటి పనులు చేస్తూ ఉండేవాడు. ‘అమ్మా, అమ్మా…’ అని పిలిచేవాడు కానీ మనసులో అతనికున్న భావాలు వేరు. అతని ఉద్దేశం అర్థం అవుతున్నా, పెద్దరికం చాటున వాత్సల్యం ముసుగులో అతని చర్యలను ఏమీ అనలేక ఊరుకోసాగింది అరవింద.

ఆ రోజు ఏదో కారణం వలన లక్ష్మి ఆఫీసుకు రాలేదు. రఘురామ్ కూడా ఇన్‌కంటాక్స్ ఆఫీస్ లో పని ఉండి త్వరగా వెళ్ళిపోయాడు. సాయంత్రం ఆరు దాటినా అరవింద పని పూర్తి కాలేదు. కొన్ని ఉత్తరాలు అర్జెంట్ అనీ, టైప్ చేసిస్తే ఫాక్స్ లో పంపించాలని పాపారావే ఆమెను ఉంచేసాడు.

అరవింద మనసు కీడును శంకించినా, ఆఫీసు పని కనుక ఏమీ అనలేక చేస్తూ ఉండిపోయింది.

“అమ్మాయ్ అరవిందా… ఓ సారి లోపలికి రా…” ఇంటర్ కాం లో పిలవటంతో ఫైల్లో ఉత్తరాలు పెట్టుకుని లోపలికి వెళ్ళింది.

“ఎక్కడ ఉంటున్నావు?” అరవింద తీసుకువెళ్ళిన లెటర్స్ మీద సంతకం పెడుతూ, అదోలా నవ్వుతూ అడిగాడు పాపారావు.

అతని ఏక వచన ప్రయోగానికి ఒళ్ళు మండిపోతున్నా, తమాయించుకుని, “వర్కింగ్ ఉమన్స్ హాస్టల్ సర్.” అంది.

“సరే… ఇంకో రెండు ఉత్తరాలున్నాయి. టైప్ చేసి పట్టుకురా…”

“సారీ సర్… నాకు ఆలస్యం అవుతోంది… రేపు ఉదయం వచ్చి చేస్తాను…” చెప్పింది అరవింద.

“ఏం ఫర్లేదమ్మా… ట్రాఫిక్‌లో డ్రైవింగ్ కష్టం అయితే, నేను కార్లో దించుతాను కదా…”

“క్షమించండి… స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు… ఇలా లేట్ అవర్స్ ఉండి నేను పని చేయను…” వెనుతిరిగి క్యాబిన్ లోంచి వచ్చేయబోతున్న ఆమెను, “ఒక్క నిమిషం ఆగు… ఇటురా…” అని పిలిచాడు పాపారావు.

అయిష్టంగా వెనక్కి వచ్చింది.

“కూర్చో…” టేబుల్ కి ఎదురుగా ఉన్న కుర్చీని చూపించాడు.

“చూడు… మొట్టమొదటి సారి నిన్ను చూడగానే నా మతి పోయింది… ఎంత అందంగా ఉంటావో నువ్వు… నీకు ఎవరూ లేరట కదా… పైగా ఇంకా పెళ్ళి కూడా కాలేదు… కాసేపు కోపరేట్ చేసావంటే చాలు… పనైపోతుంది. ఆ చక్కని అనుభవం ఎలా ఉంటుందో, ఎంత బాగుంటుందో నీకు తెలుస్తుంది… ప్లీజ్ అరవిందా… ఒక్క పావుగంట… నీకు కావలసినంత డబ్బు ఇస్తాను… ప్రమోషన్ కూడా ఇప్పిస్తాను…” ఆమె దగ్గరగా నడిచి, ఆమె భుజాన్ని నిమురుతూ హస్కీగా అన్నాడు పాపారావు.

హతాశురాలైంది అరవింద.

“సర్… ఇదేంటి? మీ అమ్మాయిలాంటి దాన్ని… ఇలా బిహేవ్ చేయటం సరైన పని కాదు…” విసురుగా బయటకు వచ్చేయబోతూ ఉంటే చేయి పట్టుకుని దగ్గరకు లాగాడు.

అరవిందలోని ఆగ్రహం అవధులు దాటగా, మర్యాద ముసుగును జారవిడచింది…

“ఒరేయ్ దరిద్రుడా… ఏమనుకుంటున్నావ్? ముసలి తోడేలు వెధవా… నన్ను వదులు… లేకుంటే చంపేస్తాను ఏమనుకున్నావో…” అంటూ, అతన్ని విడిపించుకుని చెయ్యెత్తి దవడ మీద కొట్టబోయింది.

ఆ చేతిని గట్టిగా పట్టుకొని, ఏదో మత్తులో ఉన్నట్టుగా బలంగా పట్టుకుని, తనలో తానే ఏదేదో మాట్లాడుకుంటూ దగ్గరకు లాక్కున్నాడామెను. ఆ ఉడుం పట్టు లోంచి బయట పడాలని శతవిధాలా ప్రయత్నిస్తూ, వాడియైన గోళ్ళతో అతని భుజాల పైన గట్టిగా గుచ్చి నొక్కింది అరవింద.

అతని స్పర్శ ఆమెకు గొంగళి పురుగును గుర్తు చేస్తోంది… ముఖంలో అసహ్యాన్ని నింపుకుంటూ… “వదులరా ముసలి వెధవా…” అంది గట్టిగా అరుస్తూ… అతని పశుబలం ముందు ఆమె శక్తి సరిపోవటం లేదు…

‘ఈ చెత్త వెధవకు హార్ట్ ఎటాక్ వస్తే బాగుండును… కామాంధుడై కొట్టుకుంటున్న వీడికి శాస్తి జరగాలి…’ అని మనసులో అనుకుందో లేదో… పాపారావు చేతులు పట్టు సడలాయి. ముఖమంతా చెమటలు పట్టాయి. గుండె దడ హెచ్చింది. ఆమెను వదిలిపెట్టి, అక్కడే సోఫా మీద కూలబడ్డాడు. అక్కడే టీ పాయ్ పైన ఉన్న నీళ్ళ బాటిల్ అందుకుని నీళ్ళు గడగడా తాగేసాడు. ఉన్నట్టుండి నెత్తి పైన ఏదో రాతి బండతో కొట్టినట్టు పెద్ద సమ్మెట పోటు తగిలినట్టు అయింది. తల మీద చేతులు పెట్టుకున్నాడు, “అబ్బా…” అంటూ… అంతలోనే మెడచుట్టూ ఎవరో చేతులు బిగించి పిసుకుతున్నట్టు గొంతు బిగుసుకుపోసాగింది.

“ఉఫ్… ఉఫ్…” అనుకుంటూ, టై లూజ్ చేసుకుని, కోట్ తీసేసి, షర్ట్ బటన్లు లూజ్ చేసుకున్నాడు. అంత ఏసీ ఉన్నా అతనికి ధారాపాతంగా చెమటలు కారుతున్నాయి.

ఎదురుగా కనిపిస్తున్న దృశ్యాన్ని చూస్తున్న అరవింద షాక్ తిన్నట్టుగా అట్టే నిలబడిపోయింది… ‘ఇది నిజమా? లేక కలగంటున్నానా?’ మనసులో అనుకోసాగింది… తృటిలో తప్పిన ప్రమాదాన్ని తలచుకుంటూ, అయిదు నిమిషాలు అలాగే నిలబడిపోయింది.

అప్పటికి తేరుకున్న పాపారావు ఆమె వైపు చూస్తూ, “సెక్యూరిటీని పిలిచి నువ్వెళ్ళు… నేను ఇలా చేసినట్టు ఎవ్వరికీ చెప్పకు… చెప్పావంటే రేపటినుంచి నీ జాబ్ నీకు ఉండదు…” బెదిరింపుగా అంటూ ఉండగానే అతని భుజమ్మీద మరో వేటు పడింది… “ఎవరు? ఎవరు కొడుతున్నారు నన్ను?” గట్టిగా అరిచాడు…

“చూడు పాపారావ్… నా జాబ్ నాకు ఖచ్చితంగా ఉంటుంది… ఎందుకంటే ఈ ఉద్యోగం నువ్వు నన్ను పిలిచి ఇచ్చింది కాదు… నేను కష్టపడి సంపాదించుకున్నది. నీ ఆలోచనా విధానం మార్చుకోకపోతే నీకే నష్టం… ముందు హాస్పిటల్‌కి వెళ్ళు… లేకపోతే చచ్చిపోతావ్…” అంటూ బయటకు వచ్చేసి, బ్యాగ్ తీసుకుని వెళుతూ, గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్ తో “అయ్యగారు పడిపోయారు… అర్జెంట్‌గా వెళ్ళు…” అంటూ స్టాండ్ లోంచి స్కూటీ తీసి స్టార్ట్ చేసింది.

ఆమెకు చాలా ఆశ్చర్యంగా ఉంది… ఎంత మిరాకిల్ ఇది? అసలు ఎలా జరిగిందిది? ఎవరు రక్షించారు తనను?

***

అర్ధ నిమీలిత నేత్రాలతో, తనలో సగభాగమైన గిరిజాదేవి వంక చూసాడు పరమేశ్వరుడు. అతని పెదవులపై చిరునవ్వు లాస్యం చేస్తోంది…

“ఏమిటి స్వామీ, ఎందుకా నవ్వు?” కినుకగా అడిగింది కాత్యాయని.

“మీ అమ్మాయిలు ఆపదలో ఉంటే, వాళ్ళ మనసులోని మాటలను విని అలాగే జరిగేలా అనుగ్రహించావు కానీ ఇది శాశ్వత పరిష్కారమా దేవీ?” ఆదిభిక్షువు అనునయంగా అడిగాడు.

“కాదు… కానీ తప్పకుండా దానికి సరియైన మార్గం చూస్తాను, చేయిస్తాను…” దృఢంగా అన్నది జగదంబ.

“వాళ్ళే ఆయుధాలుగా మారే వరాన్ని వారికి అనుగ్రహించు. ఆడవారి పైన చేయి వేయాలన్నా, పెళ్ళిళ్ళ పేరుతో వంచించాలన్నా వణికిపోయే స్థాయిలో మగవారిలోని దుర్మార్గాన్ని అంతమొందించు…” చెప్పాడు రుద్రుడు.

“చూస్తారు కదా స్వామీ!” చిరునవ్వుతో సెలవిచ్చింది శాంభవి.

***

జరిగిన విషయాల గురించే ఆలోచిస్తూ, అయోమయంగా బైక్ నడుపుతున్న అరవింద తన బండికి అడ్డంగా ఎవరో రావటంతో సడన్ బ్రేక్ వేసింది.

క్రింద పడిపోయిన అమ్మాయిని చూసి, ‘అరెరె…’ అంటూ బైక్ ని పక్కన నిలిపి గబగబా లేవదీసింది. అప్పటికి సమయం రాత్రి ఎనిమిదవటం వలన ట్రాఫిక్ కొద్దిగా పలుచబడింది.

“మేడం… దెబ్బలు తగిలాయా? అయ్యో… బ్లీడింగ్…” అంటూ… తన బ్యాగ్ లోంచి కర్చీఫ్ తీసి ఆమె కాలి బొటన వేలికి కట్టు కట్టింది.

“జాగ్రత్తగా కూర్చోగలరా? హాస్పిటల్‌కి వెళదాము…” అన్నది ఆదరంగా అరవింద.

“అబ్బే, చిన్న గాయమేనమ్మా… తగ్గిపోతుంది…”

“అయ్యో, చిన్నదంటారేమిటి? అంత రక్తం కారిపోతూ ఉంటే… రండి… వెళదాం…” మళ్ళీ మళ్ళీ అరవింద పిలవటంతో బ్యాక్ సీట్ మీద ఒదిగి కూర్చుందామె.

అక్కడికి అరకిలో మీటర్ దూరంలో ఉన్న క్లినిక్ వైపు బండి తిప్పింది అరవింద.

అక్కడ కాలివేలికి బ్యాండేజ్ వేసి, సెప్టిక్ అవకుండా ఇంజక్షన్ చేసారామెకు.

“థాంక్స్ అమ్మా… ఇక మీరు వెళ్ళండి… చాలా టైం అయింది…”

“ఇలా వదిలేసి ఎలా వెళతాను? మిమ్మల్ని మీ ఇంటి దగ్గర వదిలి వెళతాను. బై ది వే, నా పేరు అరవింద. మీ పేరు?”

“నా పేరు మల్లిక…”

“పదండి… మీ ఇంటి దగ్గర…”

“ఉహు… నాకు ఇల్లు లేదమ్మా… అసలు ఎవ్వరూ లేరు…”

“అయ్యో… అదేమిటి? పెళ్ళి అయిన వారిలా ఉన్నారు కదా…”

“అవును… ఒక రాక్షసుడితో పెళ్లయింది… ఇప్పుడే అక్కడినుంచి తప్పించుకుని వస్తున్నాను…”

“సరే, పదండి…”

“ఎక్కడికి?”

“నాతో రండి… తరువాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం…”

***

మూడేళ్ళ తరువాత –

ఒంటరిగా వెళ్ళవలసి వచ్చినప్పుడు సెల్ఫ్ ప్రొటెక్షన్ ఎలా చేసుకోవాలో వివరంగా అక్కడ చేరిన మహిళలకు చెబుతున్నది మల్లిక. అంతకు ముందే, వారందరికీ అరవింద చెప్పిన కరాటే క్లాస్ అయింది.

క్లాస్ అయి, అందరూ వెళ్ళిన తరువాత, ఇద్దరూ ఇంట్లోకి నడిచారు. అవును… ఇప్పుడు మల్లిక ఒంటరిది కాదు… అరవింద కూడా అనాథ కాదు… ఉద్యోగాలు చేసుకుంటూ, ఒకరికొకరు తోడుగా ఉంటూ, ఎంతోమంది వనితలకు ధైర్యాన్ని అందిస్తూ, నిర్భయంగా జీవించగలిగే శక్తిని తమ వంతుగా అందిస్తున్నారు వారిద్దరూ.

అన్నట్టు వారిద్దరినీ హింసించిన మూర్తి, పాపారావులు జైల్లో మగ్గుతున్నారు.

మల్లిక, అరవిందలను గగనసీమ నుంచి చూస్తున్న ఆదిదంపతులు తృప్తిగా వారిపై ఆశీస్సుల వర్షాన్ని కురిపించసాగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here